Monday, 6 October 2014

శతకసౌరభాలు -5 సుమతీశతకము -1

                                   
శతక సౌరభాలు - 5

                                  సుమతీ శతకము  1
                            





                                   తెలుగు లో లభించిన నీతిశతకాలలో సుమతీ శతకము మొదటిది. దీని రచయిత బద్దెన . ఇతని కాలం 13 వశతాబ్దం మొదటి భాగమై ఉండవచ్చునని విమర్శకులు భావిస్తున్నారు. నీతిశాస్త్రముక్తావళి  అనే నీతిశాస్త్ర  గ్రంధాన్ని  రచించిన  భద్ర భూపాలుడే ఈ బద్దెన యని ప్రముఖ విమర్శకులు  శ్రీ మానవల్లి రామకృష్ణ కవి ప్రమాణీకరించారు. భద్ర భూపాలుడు కాకతీయుల సామంతుడు గా చెప్పబడుతున్నాడు.

                         పూర్వ కాలంలో ఈ  సుమతీ శతకం లోని పద్యాలు రాని వారు తెలుగునాట ఉండేవారు కారు.కాని ఇప్పుడు ఇంగ్లీషు Rhymes  ను తమ పిల్లల చేత పాడించుకుంటూ తన్మయం లో మునిగిపోయి , మమ్మీడాడీ లమై పొయిన మనం ఈ   నీతిశతకాలను మరచి పోయాము .

                        తల్లిదండ్రులు  తమ బిడ్డలను  సన్మార్గ గాములను చేసే ప్రథమ ప్రయత్నమే నీతిశతక సాథన . ఆ మహాకవులు అట్టి సదాశయం తోనే సరళము ,లలితమునైన శైలి తో వివిధమైన పాత్రలను , వ్యక్తులను  , వృత్తులను, మనస్తత్వాలను పరిచయం చేస్తూ  చిన్నారి హృదయాలను ఆకట్టుకునే రీతిలో రచన సాగించి , పద్యం చదివితే  చెవులకు కూడ ఇంపుగా ఉండేటట్లు రచన చేసే వారు. అటువంటి వానిలో ప్రథమ గణ్యము ఈ సుమతీ శతకం. ఇది కంద పద్య శతకం. కందం వ్రాసిన వాడే కవి. పందిని పొడిచిన వాడే బంటు అనేది నానుడి .  సంస్కృతం లో భర్తృహరి వంటి మహాకవుల , నీతిపారగుల గ్రంథాలలోని  శ్లోకాలను సైతం అతి తేలికైన తియ్యని తెలుగులోకి అనువదించి అందించడం కూడ  ఈ శతకం లో మనం గమనించవచ్చు.


శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకలజనులు నౌరా యనగ
ధారాళమైన నీతులు
నోరూరగఁ జవులు పుట్ట నుడివెద సుమతీ !

          ఓ సుమతీ .!  ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వలన ప్రాప్తించిన కవితాగుణం తో  సమస్త ప్రజానీకము భళీ యని మెచ్చుకొనేటట్లు , ధారాశుధ్ధి కల్గి , ప్రసిద్ధములై ,అపవాదము లేని నీతులను మళ్ళీ  మళ్ళీ వినాలనే కోరిక కలిగేటట్లు గా చెపుతాను.   
           
      .........   ----- అని ప్రతిజ్ఞ చేసి , కవి  ఈ  శతకాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇది కవికి తన కవిత్వం పై  తన కున్న అపారమైన  నమ్మకానికి ఉదాహరణ.   ఆ నమ్మకం వమ్ము కాలేదు .  ఎనిమిదివందల సంవత్సరాలుగా  నోరూరి ,చవులు కలిగించి తెలుగు వారి నాలుకలపై సుమతీ పద్యాలు నాట్యమాడుతూనే ఉన్నాయి.  ఇదే కదా ఒక మహాకవికి  జాతి  అందించే మహా నీరాజనం..

                      తెలుగు నాట పూర్వకాలం లో ఏదైనా వ్రాయడానికి మొదలుపెట్టే ముందు శ్రీరామ జయం అనో ,   శ్రీరామ  అనో  శ్రీరామ రక్ష అనో ,వ్రాసి , కన్నుల కద్దుకొని  తరువాత ,వ్రాయడం ప్రారంభించడం   మన పూర్వీకుల అలవాటు. ఇది తెలుగు జాతి నడచిన బాట. ఆ శ్రీరాముడు తెలుగు వారి  ఆరాథ్యదైవం కదా. అదే ఈ కవి చేత శ్రీరామ అనిపించింది . కావ్యాన్ని "శ్రీ " తో ప్రారంభించడం   శుభకరమని మన పూర్వ కవులు  ఒక సంప్రదాయం ప్రవేశపెట్టారు. " మంగళాదీని  మంగళ మథ్యాని .".....  అనేది  ఆర్యోక్తి...


అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునఁ దా
నెక్కినఁ బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ !

              ఓ సుమతీ.!  అవసర సమయం లో వచ్చి సహాయ పడని బంధువు , నిత్యము పూజలు చేసినా కష్టాలొచ్చినపుడు ఆదుకోని దేవుడు , యుద్ధరంగము లోకి దూకిన తరువాత  పరుగెత్తని గుఱ్ఱము , ఇవి ఉండి కూడ ప్రయోజనం లేనివి కాబట్టి వీటిని వెంటనే వదలివేయాలి.   

            బంధము వలన ఏర్పడేదే బంధుత్వము . వారి పిల్లను మనం చేసుకోవడమో , మన పిల్లవాడిని వారికివ్వడమో ఇటువంటి ఇచ్చిపుచ్చుకునే సంబంధాల మూలంగా ఏర్పడే వాళ్ళే బంధువులు . మంచి చెడ్డలకు కలిసి వస్తారనే కదా వారిని మనం కలుపు కొనేది. మరి అవసర సమయం లో ఉపయోగని ఆ బంధము  ఉన్నా  లేకపోయినా ఒకటే కదా.!

కొలువు


అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటెన్
వడిగల ఎద్దులఁ  గట్టుక
మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ !

                   ఓ సుమతీ.!  సమయానికి జీతమివ్వక పోగా  అవసరమొచ్చిందని అడిగినా  జీతం ఇవ్వని మిడిసిపాటు గల   యజమానిని  సేవించడం కంటే మంచి ఎడ్ల జతను కూర్చుకొని , వ్యవసాయం చేసుకొని బ్రతకడమే ఉత్తమమైన పని.


అడియాస కొలువుఁ గొలువకు
గుడిమణియము సేయబొకు కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు
మడవినిఁ దోడరయకొంటి నరుగకు సుమతీ !

                  ఓ మంచి బుద్ధిగలవాడా!  ఒక మాట అనుకోకుండా ఎంతో కొంత ఇస్తారులే అనో , ఎప్పటికో అప్పటికి శాశ్వతమౌతుందనో  ఆశ పడి ఉద్యోగం లో చేరడం , దేవాలయాధికారిగా పెత్తనం చేయడం , చెడ్డవారి తో  స్నేహం చేయడం , అడవి లో తోడులేకుండా ఒంటరి గా ప్రయాణం చేయడం అనేవి  మంచివి కావు . అనగా బుద్ధిమంతుడు ఆచరించ దగ్గవి కాదు.


అధరము గదలియుఁ గదలక
మధరములగు భాష లుడిగి మౌనవ్రతుడౌ
నధికార రోగపూరిత
బధిరాంధక శవముఁ జూడఁ బాపము సుమతీ !

                         ఓ సుమతీ !  పెదవి కదిలీ కదలనట్లు అంటే మాట వినబడీ వినబడనట్లు మాట్లాడుతూ , మౌనాన్ని పాటిస్తూ , అధికారమనే  రోగము చే నిండిన  అధికారిని చూడటం చెవిటి ,గుడ్డి శవాన్ని  చూసినంత పాపము.

అప్పు

అప్పుగొని సేయు విభవము
ముప్పునఁ  బ్రాయంపు టాలు, మూర్ఖుని తపముం
దప్పరయని   నృపు రాజ్యము
దెప్పరమై మీదఁ  గీడుఁ దెచ్చుర సుమతీ !

                          ఓ సుమతీ ! అప్పు చేసి తెచ్చుకొని అనుభవించే విలాసాలు , ముసలితనం లో యవ్వన వంతురాలైన  భార్య , సంపూర్ణ జ్ఞానము లేని మూర్ఖుని తపస్సు , అంటే తానెందుకు తపస్సు చేస్తున్నానో  కూడ నిర్ణయించుకోకుండా చేసే మూర్ఖుని తపస్సు, ,  తప్పులు  చేసిన వారిని గుర్తించి , దండించలేని  రాజు గల రాజ్యము , అనేవి సహించరానివే కాదు తదనంతర కాలంలో   అనేక ఆపదలకు కూడ కారణాలౌతాయి.


అప్పిచ్చువాడు , వైద్యుడు,
నెప్పుడు నెడతెగక పాఱు నేఱున్ , ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ !

       ఓ సుమతీ.! అత్యవసర మొచ్చినపుడు డబ్బును అప్పు గా ఇచ్చేవాడు , రోగం వచ్చినపుడు మందు ఇచ్చే వైద్యుడు , ఎల్లవేళలా ప్రవాహం కలిగిన నది , మంచి చెడ్డలు చెప్పడానికి , చేయించడానికి బ్రాహ్మణుడు ఉన్న ఊరిని మాత్రమే  బుద్ధిమంతుడు నివసించడానికి ఎన్నుకుంటాడు. ఇవి లేని గ్రామం నివాసయోగ్యం కాదు.

                    ఈ పద్యం  సంస్కృతం లోని ఒక  నీతి శ్లోకానికి ఛాయానువాదం గా  భావిస్తున్నారు .
ఋణ దాతా చ వైద్యశ్చ శ్రోత్రియ స్సుజలా నదీ
యత్ర హ్యేతే  నవిద్యంతే నతత్ర దివసం వసేత్ !!  అనేది  దీని మూల శ్లోకం

ఆకలి

 ఆకొన్న కూడె యమృతము
తాఁ కొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్
సోఁ కొర్చువాడె మనుజుడు
తేఁకువ గలవాడె  వంశతిలకుడు సుమతీ !

            ఓ సుమతీ.!   ఆకలివేసి నప్పుడు తిన్న అన్నము అమృత తుల్యం గా ఉంటుంది. ముందు వెనకాడక , శ్రమ అని భావించక  దానం చేసిన  వాడే దాత . కోపాన్ని  నిగ్రహించుకొని ఓర్పు వహించగలవాడే మనిషి. ధైర్యము ,తెగింపు గలవాడే  కులదీపకుడు  వంశోద్ధారకుడు  అయి ఇంటిపేరు నిలపెడతాడు..


ఆకలి యుడుగని కడుపును
వేకటి యగు లంజపడుపు  విడువని బ్రతుకున్
బ్రాఁకొన్న నూతి యుదకము
మేకల పాడియును రోత మేదిని సుమతీ !

               ఓ సుమతీ.! ఆకలి తీరని తిండి ,  వెలయాలు కడుపుతో ఉన్నా  కూడ దానితో సంబంధాన్ని   వదులుకోలేని బ్రతుకు  , పాచిపట్టిన బావిలోని నీరు , మేకల  యొక్క పాడి ఈ నాలుగు అనుభవించడానికే కాదు  చూట్టాని కి, చెప్పుకోవడానికి కూడ అసహ్యంగా ఉంటాయి .


ఇచ్చునదె విద్య , రణమున
జొచ్చునదె మగతనంబు , సుకవీశ్వరులన్
మెచ్చునదె నేర్పు , వాదుకు
వచ్చునదే  కీడు సుమ్ము వసుధను సుమతీ !

                    ఓ సుమతీ ! ఈ లోకం లో  ఎదుటి వారికి ఇచ్చిన కొద్ది పెరిగేది విద్య ఒక్కటే . విద్య ను ఇవ్వడం వలన మనకు ధనం కూడ లభించవచ్చు .కాన దానం చేస్తే పెరిగేది విద్య . ఎదుటి వారికిస్తే తరిగిపోయేదే ధనం. మగతనమంటే పోరాటానికి ముందుండాలి. కత్తి  దూసి రణ రంగంలోకి దూకగలిగేది పౌరుషం . సత్కవులు కూడ మెచ్చేటట్లు  కవిత్వం చెప్పగలగటమే నేర్పరితనం. అనవసరం గా  నోరుజారి మాట్లాడితేనే  కీడు కలుగుతుంది.


ఇమ్ముగఁ జదువని నోరును
అమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్
దమ్ములఁ బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ ! 

                     ఓ సుమతీ !. చక్కగా,  స్పష్టంగా సద్గ్రంథాలను , ఉపనిషత్పాఠాలను  చదువని నోరు ,  నోరార మాతృమూర్తి ని   “అమ్మా అని ప్రేమగా , పిలిచి అన్నం పెట్టమ్మా అని  ఆర్తి గా అడగని నోరు ,  తోడబుట్టిన వారిని  చెల్లెలా అని, తమ్ముడా యని  ముద్దుగా పిలువని నోరు గనుక  ఉంటే అది నోరు కాదు కుమ్మరి   కుండలు చేసుకోవడానికి కావలసిన మట్టి కోసం  త్రవ్విన గుంట తో సమానము. .
                    అంటే అమ్మ ని , తోడబుట్టిన అన్నదమ్ములను ఆత్మీయంగా  నోరార పిలవడం మన  భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లో లభించే ఒక మధురమైన అనుభూతి . దాన్ని దూరం చేసుకోవద్దని  పరోక్షం గా కవి హెచ్చరిస్తున్నాడు. 


ఉడు ముండదె నూఱేండ్లును
పడియుండదె పేర్మి బాము పది నూఱేండ్లున్
మడువునఁ గొక్కెర యుండదె
కడు నిల బురుషార్థ పరుడు కావలె సుమతీ !

               ఓ సుమతీ !. ఈ భూమి మీద ఎవ్వరికీ ఉపయోగపడకుండా వందల సంవత్సరాలు బ్రతకడం వ్యర్థం. బ్రతికినంత కాలం  పరులకు సహాయం చేస్తూ జీవించాలి . పరోపకార : పుణ్యాయ ….. “  అని కదా  ఆగమోక్తి . ఇతరులకు సేవచేయడం వలన పుణ్యమొస్తుంది .  ఇతరులను బాధించడం వలన పాపం ప్రాప్తిస్తుంది. అందువలన ఈ  భూమి మీద  జీవించే మానవుడు పరోపకారియై , చతుర్విధ పురుషార్ధాలను సాధించే  దిశగా కృషి చేయాలి కాని..
                   ఉడుము  అనే జంతువు వలే వంద సంవత్సరాలో , పాము లాగ పది వందల సంవత్సరాలో ,  చెఱువు లో కొంగ లాగ కలకాలము బ్రతికామనిపించుకోకూడదు  .  మానవ జీవితానికి ఒక సాఫల్యత ఉండాలి. 


ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱఁగున గలుగ నేర్చు నెయ్యడలం దా
నెత్తిచ్చి  కఱగి పోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ !

                ఓ సుమతీ .!  ఈ భూమి మీద చెడ్డవానికి ఎన్నివిధాలుగా ప్రయత్నించినను  మంచిగుణాలు  రావు . ఇత్తడిని ఎన్నిసార్లు కరిగించినా  ఇత్తడి  ఇత్తడి గానే ఉంటుంది కాని బంగారమవ్వదు కదా.!


ఉదకము ద్రావెడి హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవు కడ నున్న వృషభముఁ
జదువని యా నీచు కడకుఁ జనకుర సుమతీ !

              ఓ సుమతీ.! నీరు త్రాగుతున్న గుఱ్ఱం దగ్గరికి , చెక్కిళ్లనుండి మదజలం జాలువారుతూ హుంకరిస్తున్న మదించిన ఏనుగు దగ్గరకు , ఆవు చెంతనున్న ఆబోతు జోలికి ,  చదువుకోని నీచుని వద్ద కు వెళ్లవద్దు .
                           చదువు కోని మూర్ఖుణ్ణి   పై మూడు జంతువులతోటి పోల్చడం తో చదువు కోని నీచుడు ఎంత ప్రమాదకారో చెప్పడానికి  కవి ఇక్కడ ప్రయత్నించాడు.

ధన్యుడు

ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెప మెన్నక  సేయువాడె నేర్పరి సుమతీ !

              ఓ సుమతీ.! మనకు  ఉపకారం చేసిన వారికి కృతజ్ఞత గా ప్రత్యుపకారం చేయడం లో విశేషం ఏమీ లేదు. మనకు హాని కల్గించిన వారికి వారి దోషాలను గుర్తుంచుకొకుండా అపకారం చేసిన వాడికి ఉపకారం చేసిన వాడే  భూమి మీద ధన్యాత్ముడు . నేర్పరి అని కొనియాడబడుతున్నాడు.


ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుకు  తిరుగువాడు ధన్యుడు సుమతీ !

               ఓ సుమతీ !.  ఏ సమయానికి ఏ విధం గా మాట్లాడాలో ఆ సమయానికి ఆ విధం గా మాట్లాడి , ఇతరుల మనస్సులకు బాధ కలక్కుండా , తాను బాధ పడకుండా తప్పించుకు తిరుగువాడే  ఈ ఇలలో ధన్యుడు. నేర్పరి.
                          ఇటువంటి వాడినే ఆధునిక పరిభాష లో  Expert అని సెలవిచ్చారట పై పద్యాన్ని కొద్దిగా మార్చి ఒక అవధానం లో అప్రస్తుతప్రశంస కు సమాధానం గా  అవధాన కవీశ్వరులు  శ్రీ తిరుపతి వేంకటకవులు .

 ఆ పద్యం ఇది .
                                   ఎప్పటి కెయ్యది ప్రస్తుత
                                   మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్
                                   నొప్పింపక తా నొవ్వక
                                    తప్పించుకు  తిరుగువాడు ఎక్పర్టు సుమతీ !
 ఆ శతావధానుల  ఉటంకింపు వలన  సుమతీ శతక ప్రాభవం ఇంకొంచెం పెరిగింది.


ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషునిఁ గొల్వఁగూడ  దది యెట్లన్నన్
 సర్పంబు పడగనీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ !

             ఓ సుమతీ .! ఎప్పుడు  మనం చేసిన పనులలో  తప్పులు పట్టుకుంటూ నిందించే యజమాని ని సేవించకూడదు. అతని వద్ద పని చేయకూడదు. ఎందుకంటే పాముపడగ నీడ లో కప్ప నివసించినట్లు గా అటువంటి యజమాని వద్ద  పనిచేయడం ఎప్పటికైనా  ప్రమాదమే నని తెలుసుకో.

బంధువులు


ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడె బంధువులు వత్తు రది యెట్లన్నన్
దెప్పలుగఁ జెఱువు నిండినఁ
గప్పలు పదివేలు చేరుఁ గదరా సుమతీ !

                 ఓ సుమతీ.!   చెఱువు నిండా  నీరు చేరినప్పుడే   కప్పలు తెప్పలుగా వచ్చి చెఱువు లోకి చేరతాయి. అలగేమానవులకు  సంపదలు కల్గినప్పుడే   బంధువులమని చెప్పుకుంటూ ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చి మన పంచన చేరుతుంటారు. ఇది లోక రీతి.


ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనులు దోసము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ !

                  ఓ సుమతీ.!   పచ్చికాయలు , లేతకాయలను  తినకూడదు. బంధువులను  తిట్టకూడదు. యుద్ధరంగము నుండి పాఱిపోయి రాకూడదు.  పెద్దలు , గురువులు  అయిన వారి మాటలను వినాలి . అతిక్రమించకూడదు.   భూమి పై ఇవన్నీ  దోషా లు గా చెప్పబడుతున్నాయి.

కరణము

ఒక యూరికి ఒక కరణము 
నొక తీర్పరి యైన గాక నొగిఁ దఱ చైనం
గకవికలు గాక యుండునె
సకలంబును గొట్టువడక సహజము సుమతీ !

          ఓ సుమతీ ! ఒక ఊరికి  ఒక్కడే కరణము , ఒక్కడే ధర్మాధికారి మాత్రమే ఉండాలి. అలా కాకుండా  ఎక్కువ మంది కరణాలు , ధర్మాధికారులు  ఉంటే  ఆ గ్రామం లోని పరిస్థితులు కకావికలమై  , సర్వము భ్రష్టు పట్టిపోవడం సహజమైన విషయము.


కరణముఁ గరణము నమ్మిన
మరణాంతకమౌను గాని మనలేడు సుమీ
కరణము తన సరి కరణము
మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ !

                    ఓ సుమతీ !. ఒక కరణము మరొక కరణాన్ని నమ్మితే అది వాడి చావు కొస్తుంది  కాని మామూలు గా బ్రతకలేడు. కరణం తోటి కరణాన్ని నమ్మకుండా  , అతనికి రహస్యాలేమీ చెప్పకుండా   అతన్ని నమ్మినట్లు గా నటించాలి.

కరణముల ననుసరింపక
విరసంబునఁ  నున్నఁ  దిండి వికటించు జుమీ
యిరుసున గందెనఁ బెట్టక
పరమేశ్వరు బండియైన బాఱదు సుమతీ !

                 ఓ సుమతీ !. కరణం తో అవసరమున్నప్డు అతను అడిగిన ధనము వంటిది ఇచ్చి  మంచి చేసుకోవాలి. అతడితో పెట్టుకుంటే  తిన్న  తిండి కూడ వంటబట్టక వాంతి అయిపోయే అంత ప్రమాదముంది. ఎందుకంటే  పరమేశ్వరుని బండియైనా కూడ ఇరుసు కు కందెన  చుట్టకుండా  ముందుకు కదలదు కదా.!
                    గోగునార తడప ను ఆముదం లాంటి నూనె లో ముంచి, బండి ఇరుసుకు చుట్టి బండి కన్ను లో ఉంచడాన్ని  కందెన చుట్టడం అంటారు . దీని వలన బండి నడక లో మెత్తదనము , వేగము పెరుగుతాయి.

కరణము సాధై యున్నను
గరి  మద ముడిగినను  బాము గఱవక యున్నన్
ధర దేలు మీటకున్నను
గర మరుదుగ లెక్కఁ గొనరు గదరా సుమతీ !
       
               ఓ సుమతీ.!  ఈ భూమిమీద కరణము మంచివాడై , సాధువు గా ఉన్నా , ఏనుగుకు  మదము పోయినా , పాము కఱవక పోయినా , తేలు కుట్టక పోయునా , జనం వారిని  లెక్కపెట్టక మిక్కిలి చులకన గా చూస్తారు. సహజలక్షణాలను వదిలివేస్తే జనం వింతగా చూడటం సహజం కదా.!
               కరణీకమనేది వృత్తి. తరువాత కాలం లో అది కొంతమందికే జీవనోపాధి గా మారి కులం తో కలిసిపోయింది. ప్రాచీన శతకాలలో , కావ్యాలలో కన్పించే ఇటువంటి ప్రస్తావన ఆ కాలపు సాంఘీక , రాజకీయ పరిస్థితులకు ప్రమాణాలుగా తీసుకోవాలి తప్పితే  వ్యక్తిగత దూషణ కాదనేది  మనం గమనించాలి.



************************* రెండవ భాగం  త్వరలో ***************************************