Sunday, 14 October 2012

పయనించే.......... రెండుగీతాలు


 L`

      పయనించే -------- రెండు  గీతాలు
పయనించే మన వలపుల బంగరునావ   
శయనించవె హాయిగ జీవనతార  నా జీవనతార
నెలబాలుని   చిరునవ్వుల తెలివెన్నెల సోనలలో                                   
       చెలరేగే అలల మీద  ఊయల లూగి
వికసించే విరజాజులు వెదచల్లగ పరిమళాలు
                    రవళించే వేణుగీతి రమ్మని పిలువ
 { బావ మరదళ్లు  చిత్రం}                          ______________________ ____________________                    ______________________                                                                                                 

                                                        పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు
                                                        పుల్లాపుడక ముక్కున కఱచిగూడునుకట్టతివోయి
                                                      తీరెను రోజులు నీ కీ కొమ్మకు పొమ్మా  ఈ చోటు వదలి
                                                        ఎవరికి వారే ఏదో నాటికి ఎరుగము ఎట కో ఈ బదిలీ
                                                        మూడుదినాల ముచ్చట యే ఈ లోకము లో మన మజిలీ    
                 నిజాయితీ గా ధర్మపథాన చనుమా థైర్యమెతోడు                                                                                                                               
               మరవాలీ నీ కులుకుల నడలేమదిలో నయగారాలే

                తీరని వేదన తీయని ముసుగే శిరసున సింగారాలే
                ఓర్వలేని ఈ జగతికి నీ పై లేవే కనికారాలె
            కరిగీ కరిగీ కన్నీరై కడతేరుటె  నీ తలవ్రాలె
                                           బోరుమని విలపించేరే నీ గుణము తెలిసిన వారు
                                            తోడుగ నీతో ఆడిపాడి కూరుము లాడినవారు
                                               ఏరులయే కన్నీరులతోమనసార దీవించేరే
{కులదైవం చిత్రం }                                    ఎన్నడో తిరిగి ఇటు నీ రాక ఎవడే తెలిసిన వాడు                              
  ___________________________________________!_______________________________________
                            ఇవి రెండు తెలుగు చిత్ర గీతాలు .సుమారు 1950 ప్రాంతం లోనివి. ఎందుకో ఈ రెండు పాటల్నివింటుంటే  ప్రక్కప్రక్కగా పెట్టి  చూస్తే మానవుని జీవితంలోని రెండు దశలకు ప్రతీకలు గా విన్పిస్తుంటాయి.  ఎన్ని సార్లు కాదను కున్నా  ఆ భావాన్ని పోగొట్టుకోలేక  ఈవిధంగా  నాలోని బావాల్ని     మీతో పంచుకుంటున్నాను.  కాని  ఈ విధమైన స్పందనలే మీలో కలగాలని లేదు కదా! .ప్రయత్నిచండి.                                                                                                                                          
                     
     జీవితంలో నాలుగు దశలు ఉంటాయి. బాల్య, యౌవన,కౌమార వార్థక్యాలు. ఇక్కడ  మొదటి గీతం   యవ్వనదశ  లోని అనిర్వచనీయ ఆనందానికి ప్రతీక అయితే రెండవగీతం వార్థక్యానికి   ఒక పరిపక్వ  జీవితానికి, అనుభవం నేర్పిన గుణపాఠాలకు  ప్రతీక. అందరి జీవితాల్లోను ఈ రెండు దశలు తప్పని సరిగా వచ్చేవే. అక్కడున్నది శృంగార రసమైతే  ఇక్కడ ఉన్నది శాంతరసం. ఆథ్యాత్మికత లేక వేదాంతం ఇక్కడ ప్రథాన భూమికను పోషిస్తాయి. అక్కడున్నది ఆవేశంతో కూడిన ఆనందం. అందమె ఆనందం. ఆనందమె జీవితమకరందం అనే కాలమది.ఇక్కడుండేది అనుభవం నేర్పిన ఆలోచన. మనసు మూగదే కాని బాధుంది దానికి  అనే వయసు  రెండవది.  అందుకే యవ్వనంలో పయనించే పడవ వలపుల బంగరు నావ లాగా కన్పిస్తోంది. .యవ్వనం లో  అన్నీ అందంగానే కన్పిస్తాయి.   వయసులో  గాడిద పిల్ల కూడ అందం గా ఉంటుంది అన్నారు మన జంటకవులు. ఇది యౌవన దశ  సహజ లక్షణం.  

                          ప్రియురాలు జీవనతార , అంటే LIFE STAR. ఎంత మథురమైన భావన.ఆరోజులు ఆలోచించు కుంటే ఎంత హాయి....  అనిపించక మానదు ఎవరికైనా. అందుకే నెలబాలుని చిఱునవ్వుల తెలివెన్నెల సోనలలో చెలరేగే  అలలమీద ఊయల లూగుతోంది ప్రేయసి. సహజ సుందరమైన సన్నివేశం. ఈజగతిన ఉన్నది మనమిద్దరమే అనుకొనే వయసుకదా అది. వికసించే విరజాజులు పరిమళాలు వెదజల్లుతుంటే,రమ్యమైన వేణుగీతి  రమ్మని పిలుస్తోందంటున్నాడు నాయకుడు .అది తిరిగి రాని కాలం.
                    
                కాలము ఆగదు. దానితో  పాటే వయసు ఆగదు .యౌవనంలో పయనించడ మంటే పరుగులు పెట్టడమే. కాని వార్థక్యంలో పయనించడ మంటే ప్రయాణం కట్టడం. రెండవగీతం లో పయనించడం ప్రయాణమే. అది చివరి ప్రయాణంకూడ కావచ్చు. ఇక్కడ చిలక  బొంది లోని ప్రాణం.  ఇక్కడ పాడైపోయిన గూడు ఛిద్రమైన శరీరమే. రోగాలతో నాశనమైన శరీరమే. వయసులో పుల్లా పుడకా“  పోగుచేసి అంటే అప్పులు సప్పులు చేసి  నీ వారి కోసం గూడు కట్టావు .కాని – కానికాలం - వచ్చేసింది. ఈ కొమ్మ- అంటే- ఈ  ప్రదేశంతో - నీకు రోజులు తీరి పోయాయి. రోజులు నిండితే ఒక్క క్షణం కూడ  ఉండే పనిలేదు. అందుకేపొమ్మా ఈచోటు వదలి........  ఇది ఆదేశం. దేవుని ఆజ్ఞ. ఇపుడు జరిగేది కేవలం బదిలీ.అంటే మారడమే {Transfer} ఈచోటు వదిలి ఇంకొక చోటుకి వెళ్లడమే.ఆత్మకు మరణం లేదు. అందుకే వాసాంసి జీర్ణాని యథా విహాయ.... అంటుంది భగవద్గీత. మాసిన బట్టలు వదిలి కొత్తబట్టలు వేసుకున్నట్లు ఆత్మ పాడైపోయిన ఈ బొందిని వదిలి ఇంకో దాంట్లోకి ప్రవేశిస్తుంది .అదే బదిలీ
.
                          అయితే ఎవరికి వారు పోయినవాళ్లను వింతగా చూస్తూ ఉంటారు తామేదో శాశ్వతమైనట్లు అన్నాడొక కవి.అలాగే నీవు పోతున్నావని  నీవే పోతున్నానని బాధ పడవద్దు. ఎవరికివారే  ఏదో నాటికి పోయే వాళ్లమే. ఎరుగము ఎటకో ఈ బదిలీ .ఎక్కడకు పోతామో కూడ తెలియదు. మళ్లీఎక్కడ ఏ జీవిగా పుడతామో కూడ తెలియని బదిలీ యిది . జాతస్య హి థృవో మృత్యు ధృవం జన్మ మృతస్య అని కదా మన గీతాచార్యుని సందేశం.పునరపి జననం పునరపి మరణం అన్నారు ఆదిశంకరులు. అందుకే  ఈ లోకంలో మనం  ఉండేకాలం  --- సుదూరప్రయాణం మధ్యలో    వసతి గృహాల్లో, సత్రాల్లో ,చేసే మజిలీ వంటిదే.  అది  శాశ్వతం కాదు . మూడు దినాల ముచ్చటే. అంటే మూణ్ణాళ్ల ముచ్టటే. ఇది చక్కని తెలుగు పలుకుబడి. అందమైన నుడికారం. మూణ్ణాళ్ల ముచ్చటకు మురిసేవు కులికేవు ముందుగతి కానవే చిలకా  అంటాడు ఇంటి ముందు బైరాగి. ఈ జీవితం మూడురోజుల ముచ్చటే కాబట్టి   ఉన్న మూడు రోజులు అన్యాయాలు అక్రమాలు  అరాచకాలు చేయకుండా నిజాయితీగా  ధర్మమార్గలో థైర్యంగా  మంచివాడు గా జీవించాలి. అక్రమాలు అన్యాయాలు చేస్తూ  పిరికివాడిలా  రోజూ చస్తూ బ్రతికేకంటే నిజాయితీగా  జీవిస్తూ థైర్యవంతుడి గా ఒకేసారి  మరణించాలి.
                   మరణించిన వారి మరపు రాని మధురజ్ఞాపకాలు మరచిపోవాల్సిందే. కాని మరచిపోవడం సాథ్యం కాని మరువ లేని, మరపురాని జ్ఞాపకాలవి. కాని మరచి పోవాల్సందే. మరవాలీ ఎంత బరువైన పదమో చూడండి. శబ్దానికి రంగురుచి వాసన ఉంటాయన్నారు  మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి.  అలాగే పదానికే గనుక బరువుంటే మరవాలీ అన్న పదం వందటన్నుల బరువైంది. మోయలేనిది. మోయలేని ఈ హాయిని మోయనీ ఒక్కక్షణం అంటుంది  దేవులపల్లి వారి నాయిక. హాయినే మోయలేని మానవ హృదయం టన్నుల కొద్దీ  బాథను ఎలా మోస్తుంది. అసాథ్యం. కాని మరవక తప్పదు అందుకే మరవాలీ. పోయిన వాళ్లతో మనం పోలేము గనుక మరచిపోవాలి అని తనకు తాను సర్ధి చెప్పకొనే పదమది..

              కాని బాధలో ఉన్న వారిని చూచి జాలి పడి ఓదార్చే గుణాన్ని  ఈ లోకం నెమ్మదిగా మర్చి పోతోంది.  ఎదుట ఏదో సానుభూతికి మెఱ మెచ్చపు మాటలు మాట్లాడినా  వెనక్కి వెళ్లి మెటికలు విరవడం మూతులు తిప్పడం సహజమై పోయింది. వీళ్లు సుఖంగా ఉన్నప్పుడు ఓర్వలేక కళ్లల్లో నిప్పులు పోసు కున్నవాళ్లు  ఇప్పుడు చాటుకు పోయి ఆనంద పడతారే తప్పితే  వచ్చిన కష్టానికి కనికరం ఇసుమంత కూడ చూపించరు .అంతేకాదు.ఎదుటి వాడి కష్టాల్ని చూసి లోలోన ఆనందపడే రాక్షస గుణం లోకంలో పెరిగి పోతోంది.అందుకే మనకొచ్చిన కష్టానికి ఎవరో రావాలని ఏదోచేయాలని ఎదురు చూడటం మూర్ఖుడి లక్షణం .  మనసుఖాలు మనవే అయినప్పుడు మనకష్టాలు కూడ మనవే కదా. అది   మన తలరాత అని సర్ధుకు పోవడమే మనం చేయ కలిగంది. అందుకే     కరిగీ ..........కరగీ...........కన్నీరై  ...ఏరై    ..పోవడమే  ఉపశమనం.    ఏడిస్తే గుండెబరువు తీరి తేలికపడుతుంది . గుండె మంటలారిపే చన్నీళ్లు కన్నీళ్లు.ఉండమన్న ఉండవమ్మ చాన్నాళ్లు అన్నాడు మహాకవి.

             అయితే లోకమంతా  ఒకే రకంగా ఉండదు కదా. నీతో తిరిగినవాళ్లు, నీ మంచితనం తెలిసినవాళ్లు, నీ ప్రేమ అనురాగాలను పంచుకున్నవాళ్లు, నీ స్నేహంలోని మాధుర్యాన్ని మరచి పోలేనివాళ్లు ,  నీతో పాడుకుంటూ, ఆడుకుంటూ తిరిగిన వాళ్లు, నీ బాల్యస్నేహితులు నీకోసం బోరున విలపిస్తారు. గుండెలు  పగిలేలా రోదిస్తారు. వెళ్లిరా మిత్రమా అంటూ దీవెన లిస్తూనే మళ్లీ ఎప్పుడువస్తావంటూ  ఆశగా  అమాయకంగా అరుస్తూ ఏడుస్తూ  అడుగుతారు. కాని విచిత్రమేమిటో తెలుసా !మళ్లీ మన మెప్పుడు ఇక్కడకొస్తామో మనకే కాదు ఎవడికీ తెలియదు. చెప్పగలిగినవాడు ఎవడున్నాడు. ప్రాక్తన జన్మ పుణ్యఫలాన్ని అను భవించిన తరువాత  మళ్లీ జన్మిస్తారని మన పెద్దలు చెపుతుంటారు. అందుకే కన్ను తెఱిస్తే జననం కన్ను మూస్తే మరణం   రెప్పపాటే గదా ఈ ప్రయాణం అన్నారొక ఆథునిక కవి. రాలుతున్న పండుటాకుల్నిచూచి చిగురు టాకులు నవ్వు కోవడం  సహజం కదా!


******  ఎన్నడో తిరిగి నీ విటురాక ఎవడే తెలిసినవాడు..........  ఎవ్వరికి తెలియదు
                                                                  
           ****************************************