శ్రీరామునకు శబరి ఎంగిలి విందు వాల్మీకమేనా?
శబరి మతంగమహర్షి శిష్యురాలు. సిద్ధయోగిని.శ్రీ రామచంద్రుడు లక్ష్మణునితో కలసి నీ ఆశ్రమానికి వస్తాడు అన్న గురువు ఆదేశాన్ని తలదాల్చి మతంగముని ఆశ్రమంలోనే రాముని కోసం ఎదురు చూస్తూ ఉండి పోయిన రామ భక్తురాలు.ఎదురు చూస్తూనే వృద్ధురాలై పోయింది. రామచంద్రుడు వచ్చాడు .కుశల ప్రశ్నల అనంతరం అర్ఘ్య పాద్య ఆచమనీయాలు సమర్పించి, ఆయన కోసం ఎంతో కాలంనుంచి సేకరిస్తున్న పండ్లు ఫలాలను అందించింది. రాముని అనుజ్ఞ తో ,యోగాగ్ని లో ప్రవేశించి, మహా యోగులు పొందే సాయుజ్యాన్ని పొందింది శబరి.
అయోధ్య రాముడు ఆంధ్రావని కి తరలివచ్చి భద్రగిరి పై కొలువు తీరి తెలుగువారి
ఇలవేల్పు యైనట్లే వాల్మీకి సృష్టించిన శబరి తెలుగింటి ఆడపడుచు వలె
తెలుగు వారి గుండెలకు చేరువై తెలుగునాట చిరస్ధాయిగా నిలిచి పోయింది.కిన్నెరసాని
వలె శబరి కూడ కావ్యనాయికయై రసజ్ఞుల హృదయ కేదారాలనే కాదు తెలుగు నాట వాగుగా మారి సస్య కేదారాల సైతం
సారవంతం చేస్తున్నగోదావరిఉపనది. అందుకే శబరి
పాత్ర తెలుగు వారి సొంతమై పోయింది.
ఎందుకంటే – ఇక్కడొకసంగతి చెప్పాలి.
భక్త రామదాసు పుట్టినఊరు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. అక్కడ పోలీసు శాఖ లో పనిచేసి
రిటైరయిన ఒకమహాను భావుడు ప్రతి సంవత్సరం శ్రీరామదాసు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తుండే
వారు. ఒకసారి నన్నుఅతిథిగా పిలిస్తే వెళ్లాను.
బస్టాండు లో దిగి నేను వెళ్ల వలసిన ప్రదేశం వెతుక్కుంటూ ఉంటే ఎదురుగా ఒకబోర్డు కన్పించింది. శబరి టీ స్టాల్
నాకు ఆశ్చర్యమేసింది. దేవుని పేర్లు, సినిమా వాళ్లపేర్లు చూశాము గాని శబరి పేరు
తో టీ స్టాల్. ఇంకొంచెం ముందుకు వెళ్లాను
కోట బురుజు లాంటి దేదో ఉంది. దాని కెదురుగా కుడివైపున శబరి పాన్
షాపుఉంది.నాకు అనుమాన మొచ్చింది. శబరి
పుట్టినఊరు కూడ ఇదేనేమో నని. ఇది జరిగిచాలకాలమైంది ఇప్పుడవి ఉన్నాయో లేవో తెలియదు. శబరి తెలుగువాళ్ళకు ఎంత దగ్గరైందో చెప్పడమే
నాఉద్దేశ్యం.
తెలుగులో శబరి పేరుతో వచ్చిన కావ్యాలు
కూడ ఎక్కువ భాగం గోదావరీ పరీవాహ ప్రాంతంనుంచే రావడం కూడ గమనించదగ్గ విషయం. రామభక్తులిద్దరొకచోట
కలిస్తే సూర్యేదయ,సూర్యస్తమయాలు తెలియ వంటారు. శబరి మనల్ని అలాగే
చేస్తున్నట్లుంది. విషయంలోకి వద్దాం. రండి.
రామలక్ష్మణులు వస్తున్నారని
తెలిసిన శబరి వారికి ఎదురు వెళ్లి
సంప్రదాయ బద్దంగా అర్ఘ్యపాద్యాదు లందించి ,రామ లక్ష్మణులు సేద తీరిన
తరువాత మాగురువులు చెప్పినప్పటినుంచి నీ
గురించి ఎదురు చూస్తున్నాను. ఇంత ఆలస్యం చేశావేమిటని చనువుగా
ప్రశ్నిస్తుంది.రాముని కోసం ఎంతో కాలం గా
సంపాదించి. భద్ర పరచిన ఫల,మూలాదులను ఆయనకు అర్పించింది.
“ మయాతు
వివిధం వన్యం సంచితం పురుషర్షభే
తవార్ధే
పురుషవ్యాఘ్ర పంపాయాస్తీర సంభవమ్. “ వా.3-74.17
అని మాత్రమే వాల్మీకం. దీన్ని వ్యాఖ్యానిస్తూ గోవిందరాజీయం లో -“ వన్య శబ్దేన
ఫలమూలాదికముచ్యతే.” {వన్య శబ్దము
వలన ఫలమూలాదికములు చెప్పబడు తున్నాయి} .”
సంచితమిత్యనేన రామస్య చిత్రకూటాగమనాత్ప్రభృతి సంపాదిత్వం, ఆదరేణ గుప్తత్వం చ,
తత్తత్ఫల జాతీయ మాధుర్యం పరీక్ష్య స్ధాపితమితి సంప్రదాయ:”.{ సంచిత
అనేమాటకు రాముడు చిత్రకూటానికి వచ్చాడని తెలిసి నప్పటినుండి సంపాదించి,దాచిపెట్టి
ఆయా ఫలాల జాతిని పట్టి తీపిని పరీక్షించి
ఉంచి నట్లు గ్రహించాలి}. { చతుర్వ్యాఖ్య. పు. 1276 .}
దశాబ్దాల తరబడి అదే ప్రాంతంలో జీవిస్తోంది కాబట్టి ఏజాతి పండు ఎలా ఉంటుందో, ఏచెట్టు
పండు ఎటువంటిదో తెలుసుకోగల నైపుణ్యం
శబరికుంది. అందుకనే మంచిపండ్లను పరీక్షించి రాముని కందించింది శబరి. ఇది వాల్మీకం.
అంటే” ఎంగిలి విందు” ప్రస్తావన
వాల్మీకం లో లేదు. కాని” శబరి “పేరు తో కావ్యాలు
రచించిన వారందరు కూడ ఎంగిలి విందు
చేయించిన వారే కాని వాల్మీకిని అనుసరించిన వారు ఒక్కరు లేరు.
మరి ఈ ప్రస్తావన
ఎక్కడనుంచి వచ్చింది. పద్మపురాణం లో
మనకు ఈ **** విందు
ప్రస్తావన కన్పిస్తోంది.
”
ప్రత్యుద్గమ్య ప్రణమ్యాథ నివేశ్య కుశవిష్టరే
పాదప్రక్షాళనం కృత్వా తత్తోయం పాపనాశనం
........................................................
ఫలాని చ
సుపక్వాని మూలాని మధురాని చ
స్వయమాసాద్య మాధుర్యం పరీక్ష్య పరిభక్ష్య చ
పశ్చాన్నివేదయామాస
రాఘవాభ్యాం దృఢవ్రతా”
పద్మపురాణ భాగంలో” పరీక్ష్య, పరిభక్ష్య,పశ్చాన్నివేదయామాస” అని ఉన్న
భాగాన్ని పరిశీలిస్తే శబరి కంద మూల ఫలాల
మాధుర్యాన్ని పరీక్షించి భక్షించిన అనంతరమే రాఘవునికి సమర్పించిందనేది
స్పష్టమౌతోంది. కాని వాసుదాసు గారు మందరం లో ఈ విషయాన్ని గూర్చి చర్చిస్తూ,ప్రస్తుత ముద్రిత పద్మ పురాణ ప్రతిలో ఈభాగం లేదని
క్రొత్త పాఠాన్ని చూపించారు.కాని
చతుర్వాఖ్యలో మహేశ్వర తీర్ధులవారు సైతం
పై పాఠాన్నే ఉటంకిచారు.అంటే” పరీక్ష్య పరిభక్ష్య
“
అనేదే ప్రసిద్ధపాఠం.
కాని దీనిలో కూడ శబరి తాను తిన్నపండునే రామున కిచ్చినట్లు ఎక్కడాలేదు.
రాముడు చిత్రకూటానికి వచ్చినప్పటినుండి, రాముడు తన ఆశ్రమానికి వస్తాడనే గురువుల
మాట మీద ప్రత్యయం తో అప్పటి నుండే కందమూలాలను, నిలవఉండే
ఫలాలను, సంచితం-అంటే, ఏరి
కోయించి సంపాదించి భద్ర పరచింది. ఇప్పుడు రాముడు వచ్చిన తరువాత వానిని బయటకు తీసి
పరీక్షించి, జాతికొక దాన్ని తిని, చెడిపోలేదు అని నిర్ధారణ చేసుకొని రామునికి
సమర్పించిందనేది లక్ష్యార్ధం.
“ “భక్షించి ”అనుటకు ఠాకా
వేసి కొంచెం గిల్లి నోటవేసుకొన్నట్లు
ఎంచవలయునేగాని వేరుకాదు.” అంటారు మందరం లో శ్రీ
వాసుదాసు.
శ్రీరాముని శ్రియ:పతి గా
నెరింగి ఆయన రాక కోసం ఎదురు చూస్తూ జీవితకాలాన్ని పొడిగించుకుంటున్న మహాతపస్విని
శబరి. అట్టి మహానుభావునకు తాను అర్పించే విందులో మాధుర్యం కొఱవడితే ఓర్వలేక, అపచార భయం
చేత ,భక్త్యతి శయం చేత శబరి
ప్రవర్తనలో మార్పు వచ్చి ఉండ వచ్చు.వృద్ధ, జ్ఞానవైరాగ్య సంపన్న,గురుశుశ్రూషా పరాయణ
అయిన శబరి లో పరమభక్తి పరాకాష్ఠకు చేరి , గోదాదేవి
తాను ధరించిన మాలలను భగవంతునికి సమర్పించినట్లు, విదురుని విందు లో శ్రీ కృష్ణునకు
అరటిపండు ఒలిచి పండు పారవేసి తొక్కుఅందించినట్లు, పండ్లను రుచి చూచి స్వామికి సమర్పించిందని భావించిన జానపదులు “శబరి విందు’’ను మధురాతి
మధురంగా గానం చేసుకుంటున్నారు. భక్తునికి ఇష్టమైన దాన్ని ఎంతకష్టమైనా
భరించడానికి భగవంతుడు సిద్ధంగా
ఉంటాడన్నవిషయం బాణాసురుని ఇంటికి కాపలా కాయడం దగ్గరనుండి మానవుడిగా జన్మించి బాధలు పడడం వరకు ఎన్నో
విషయాల్లో ఋజువవు తూనే ఉంది..
శబరి శ్రీ
రామచంద్రునకే విందునందించిన పరమ భక్తురాలు. కాని శబరి వాగులోకి పండి ఒరిగిన చెట్ల ఫలాలు శబరి నీటిచే
స్పృశించబడుతున్నాయి . ఆ పండ్లను
రామలక్ష్మణులు స్వీకరించారు కాబట్టి శబరిఎంగిలి చేసిన పండ్లను
రాముడుతిన్నాడని జానపదకథలుగా పాడుకుంటున్నారని కొందరి వాదన..
శబరి పూర్వజన్మ వృత్తాంతం కంబరామాయణం లో కన్పిస్తోంది.
“ శబరి పూర్వ
జన్మ లో” మాలిని” అనే
గంథర్వకన్య.గందర్వరాజైన చిత్రకవకుని ఏకైకపుత్రిక. వీతిహోత్రుని పరిణయమాడింది.భర్త
యజ్ఞయాగాదులలో మునిగియుండగా మె కల్మాషుడనే బోయవానితో సంబధం పెట్టుకోగా కోపించిన
వీతి హోత్రుడు మెను శబరవనిత గా జన్మించమని శపించాడు. రామచంద్రుని దర్శనానంతరం ఆ మహనీయుని
ఆశీస్సులతో తిరిగి మాలిని గా
మారిపోయి భర్తతో గంధర్వ లోకాన్ని చేరింది.
“ అని
కంబరామాయణం శబరి పూర్వ చరిత్ర ను
ప్రస్తావించింది.[puranic
encyclopedia –p.659]. తెలుగు
కవులెవరూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. తులసీ ధాసు వాల్మీకి మార్గంలోనే పయనించాడు.
*******************శబరీ దత్త ఫలాశన రామ ***********************