Friday 5 February 2016

శతకసౌరభాలు -8 జయజయ శ్రీనివాస- శ్రీవల్లి -2


శతకసౌరభాలు -8

  జయ జయ శ్రీనివాస- శ్రీవల్లి -2

                              




                                      శిల్పి వీవు నీ సురుచిర శిల్పమేను

                                    ద్రష్ట వీవు నీ సులలిత దృష్టి నేను
                                   స్రష్ట వీవు నీ సుమధుర సృష్టి నేను
                                    స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!


                  
                   ఆనంద నిలయ వాసా  ! శ్రీ శ్రీనివాసా ! నీవు శిల్పివి.  నీవు చెక్కిన   అందమైన శిల్పాన్ని నేను. నీవు ద్రష్టవు. నేను నీ సులలితమైన దృష్టిని. నీవు స్రష్టవు . నేను నీవు సృష్టించిన మనోహరమైన సృష్టిని. నీకు జయమగు గాక !.

అల్పజీవియు మంచి సంకల్పమున్న
గొప్పవారి గౌరవము గైకొన గలండు
ఉడుత బుడత రాముని ప్రేమ నొంద లేదె
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
            
                        శ్రీ శ్రీనివాసా!  అల్పుడైన వాడు కూడ సంకల్పబలముంటే  గొప్పవారి చేత సైతం గౌరవించబడతాడు. సేతు నిర్మాణ సమయం లో  అల్పజీవియైన ఉడుత  శ్రీరామచంద్రుని చేత  మన్నించబడింది కదా !
                   
                                        భక్తి  పరవశులైన  సద్భక్త వరుల
గుణమె గణనీయమగు వారి కులము కాదు
శబరి బదరీ ఫలాలు దాశరథి తినడె
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
            
                 తిరుమల గిరి వాసా !  శ్రీ వేంకటేశా ! మహా భక్తుల సద్గుణములే వారిని గొప్పవారిగా  చేస్తాయి కాని  వారు పుట్టిన కులము వలన వారు  ఉన్నతులు గా కీర్తించ బడరు. శబరి కాంత అందించిన పండ్లను రామచంద్రుడు ప్రేమతో స్వీకరించడం లోని  నీతి ఇదే కదా! .

కాని పనులకు జని హాని గనుట కంటె
ఉన్నదాననె సంతృప్తి నొంద మేలు
వాలి జోలికి పోయి రావణుడు చెడడె
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
            
                శ్రీ శ్రీనివాసా ! కొఱగాని పనులకు వెళ్లి ప్రాణహాని తెచ్చుకున్న దాని కంటే ఉన్న దాని తో తృప్తిచెంది జీవించడం మేలు . ఎందుకంటే రావణుడంతటి వాడు ఉన్న చోట ఉండకుండా వాలి చెంతకు వెళ్లి పరాభవము ను పొందాడు కదా!.

సిరులు చేకూర తను దాను మరచునేని
స్నేహమా అది మిత్ర విద్రోహ మగును
మాధవుండు కుచేలుని మరచినాడె
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
            
                  శ్రీ శ్రీనివాసా ! చిరుదరహాసా ! సంపదలు కూడగానే కన్నుమిన్ను కానక ప్రవర్తించడం అది స్నేహమనిపించుకోదు. మిత్ర ద్రోహ మనిపించుకుంటుంది.  భారతం లో ద్రుపదుడు తన సహాధ్యాయి , మిత్రుడు నైన ద్రోణుని అవమానించి ముప్పు తెచ్చుకున్నాడు. కాని భాగవతం లో శ్రీకృష్ణుడు తన చిన్ననాటి మిత్రుడు, పరమ దరిద్రుడు నైన కుచేలుని ఆదరించి మన్నించి స్నేహానికి అర్ధాన్ని తెలియచెప్పాడు.                   

 ఎంతవాడైన నితరుల చెంత చేరి
చేయి జాచుట యన చాల చిన్న బోవు
బలి నడుగ వామనులు గారొ ప్రభువు గారు
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!   (29)
                 
             శ్రీ  శ్రీనివాసా ! చిద్విలాస భాసా ! ఎంత గొప్పవాడైన  పరుల వద్దకు యాచనకు వెళ్ళితే ఎంత చిన్నపోతాడో  నీవు బలి వద్దకు వామనుడి గా వెళ్లి లోకానికి తెలిపావు గా స్వామీ. విశ్వవ్యాపి వై, విరాడ్రూపుడవైన నీవు వామనుడవైన వైనం యాచనావృత్తి లోని చిన్నతనాన్ని (వామనత్వాన్ని) లోకానికి ఎఱుక చేసింది ప్రభూ!.

ధర్మపథము వీడని మహోదారమతికి
సాయమగు చుండు జంతు సంచయము కూడ
రామకార్యము దీర్చె మర్కటము లెల్ల
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!  (28 )
         
                  ఆపద మొక్కులవాడా! అనాథ రక్షకా ! ధర్మ మార్గం లో నడిచే మహాను భావులకు లోకం లో జంతుసంతతి  కూడ సహాయం చేస్తాయి. రామకార్యానికి కోతులు చేసిన సాయం  లోకానికి తెలియనిది కాదు గదా ! .

దుష్టకర్ము దురాచారు ధూర్తమతిని
 అనుజులైన త్యజించెద రంత మందు
విడిచి రాడె రావణుని  విభీషణుండు
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!  (29 )
         
              శ్రీ వేంకటేశ్వరా ! దురాచార పరాయణుడు , ధూర్తుడు , దుర్మార్గుడు నైన వాడిని చివరి సమయం లో సోదరులు కూడ వదిలి వేస్తారు. విభీషణుడు రావణుని వదిలివేసిన వృత్తాతం లోక విదితమే కదా ! .
                     ఈ గ్రంథరచనా విధానం భక్త్యావేశం లోను ఒక ప్రణాళికా బద్ధం గా కొనసాగిందని మనం భావింపవచ్చు. ఎందుకంటే 21 వ పద్యం నుండి30 వ పద్యం వరకు రామాయణ కధాఘట్టాలను ప్రస్తావించిన రచయిత్రి 32 వ పద్యం  40 వరకు  శ్రీ ఆది నారాయణ మూర్తి ధరించిన దశావతార వైభవాన్ని వర్ణించి తరించింది. 
సోమకుని వ్రచ్చి బ్రహ్మకు శ్రుతుల నిచ్చి
విశ్వ సాహిత్యలక్ష్మి కి వెలుగు దెచ్చి
పేరు గాంచిన మత్స్యావతార మీవ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!  (31)
                శ్రీ శ్రీనివాసా ! సోమకాసురుని సంహరించి  వేదాలను పరిరక్షించి విశ్వ సాహిత్య లక్ష్మి కి వెలుగు లందించిన  మత్స్యావతార మూర్తివి నీవే కదా ప్రభూ !. నీకు జయమగు గాక ! .

పాలమున్నీట మందర పర్వతమ్ము
మునిగిపోకుండ జొచ్చి వీపున ధరించి
కీర్తి గాంచిన శ్రీ కూర్మమూర్తి వీవ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
          
         శ్రీ  వేంకటేశా !  క్షీరసాగర మథన సమయం లో మందర పర్వతం మునిగిపోకుండా కూర్మమూర్తివై,  మందర పర్వతాన్ని వీపున భరించి  అమృతోద్బవానికి కారణమైన కీర్తిమంతుడవు, దివ్య రూపుడవు నీవే కదా ! .

సకల ధాత్రీ తలంబును చాప చుట్టి
పరువు లెత్తు హిరణ్యాక్షు పట్టి చీల్చి
ధరణి నేలు వరాహవతార మీవ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!(33) 
                     
                     శ్రీ శ్రీనివాసా ! సురుచిర దరహాసా ! మా పాలిటదైవమా ! సమస్త భూ మండలాన్ని చాప చుట్టగా చుట్టి పట్టుకు పోతున్న హిరణ్యాక్షుడిని పట్టి   సంహరించి  ధరణి ని   ఏలిన పరంధాముడవు నీవే కదా! .
                                 విల్లు చేజార కర్తవ్య విముఖుడైన
పార్ధు గీతాప్రబోధఁ గృతార్థు చేయు
విజయసారథి నీవ గోవింద దేవ
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస!   (38)
               
                శ్రీ పద్మావతీ  వల్లభా ! శ్రీ శ్రీనివాసా ! కురుక్షేత్ర సంగ్రామం లో కౌరవసేనను చూసి యుద్ధ పరాఙ్ముఖుడైన అర్జునునికి  గీతోపదేశం చేసి జగద్గురువైన విజయసారథివి నీవే కదా! తిరుమల వాసా !గోవిందా ! నీకు జయమగు గాక !
క్రూర ధూర్త స్వభావుల బారి నుండి
భారతావని స్వాతంత్ర్య భావమంద
ఖడ్గ మూనెడు కళ్యాణ కల్కి వీవ
                   స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!        (40)
           
   శ్రీ శ్రీనివాసా! పాపపంకిలమైన కలియుగాంతమునందు  దుష్టుల బారి నుండి ఖడ్గధారివై భారతావనిని  రక్షించెడి  కళ్యాణకల్కి రూపుడవు నీవే కదా వేంకటేశా !
సత్యరూపుడ నీవు నే సత్యమగుదు
సాధ్యుడవు నీవు నే సాధనమును
శ్రుతివి నీవు నిన్నంటిన స్మృతిని నేను
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస! 

                         శ్రీ ఏడుకొండల వేంకటేశ్వరా !  నీవు సత్యరూపుడవైనచో నేను సత్యము ను. నీవు సాథ్యుడవైనచో నేను సాధనమును. నీవు వేదమువైనచో నేను వేదాంగమునౌతాను.

                 మళ్లీ 43 వ పద్యం  నుండి 51 వ పద్యం వరకు  నారద భక్తి సూత్రాలలో చెప్పబడిన దశ విధ భక్తి మార్గాలను ప్రస్తావిస్తూ వాని ద్వారా ముక్తి పొందిన  భక్తులను  గుర్తుచేసుకొని పులకించి పోతుంది రచయిత్రి.
శ్రవణం కీర్తనం విష్ణో :స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమ్ !!.

భాగవత గాథ దివస సప్తకము విన్న
అల పరీక్షిత్తు కైవల్య మందుకొనియె
స్వామి ఇట్టిది నీ కథా శ్రవణ మహిమ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస! 

                     శ్రీ శ్రీనివాసా !  ఆనాడు మరణ మాసన్నమైన పరీక్షిత్తు కోవలం ఏడు రోజులు భాగవతాన్ని విన్నంత మాత్రానే మోక్షాన్ని పొందాడు . నీ దివ్య కథాశ్రవణ మహిమ ఎంత గొప్పదో కదా ప్రభూ !
మహతి చేబూని నారద మౌని నీదు
నామ సంకీర్తనమున ధన్యతను గాంచె
ఆర్తి హరియించు స్వామి నీకీర్తనంబు
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!    (44)

                      శ్రీ శ్రీనివాసా ! నారద మహర్షి మహతి అనే  పేరు గల వీణ ను నారాయణ నారాయణ అనే నీ నామ సంకీర్తన చేయుచూ ధన్యతను గాంచాడు. స్వామీ . నీ నామ సంకీర్తనము ఆర్తిని హరించెడి పరమౌషధము కదా స్వామీ !.

 కర్కశ కరాళ మకర వక్త్రమున జిక్కి
భక్తి స్మరించు కరిని కాపాడినావు
సరసిజాతాక్ష యిదియె నీ స్మరణ మహిమ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస! 

                    శ్రీ శ్రీనివాసా ! అతి కర్కశమైన మొసలి కోరలలో చిక్కుకొని , వేరు గతిలేక భక్తి తో  నిన్ను స్మరించిన గజరాజు ను కాపాడినావు. సరసిజాక్షా. ఇది నీ  నామ స్మరణ మహిమ యే కదా !
                                గంధ మాల్యాంబరమ్ముల కాన్కలిచ్చి
నిన్ను సమర్చించి మోక్షమందినది కుబ్జ
యుష్మదర్చన సర్వ సౌఖ్యోదయంబు
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస! (47)

                శ్రీ వేంకటేశ్వరా ! నిన్ను అర్చించడం వలన కలుగు ఫలితాన్ని కుబ్జ వృత్తాతం లోకానికి తెలియ    చెప్పింది.  మధురా పుర వీధులలో పరిమళ భరితమైన  శరీరానికి పూసుకొనే గంధాన్ని ,అందంగా అల్లిన పూలమాలలను , పట్టువస్త్రాలను నీకు కానుక గా యిచ్చిన కుబ్జ తన వికార రూపాన్ని పోగొట్టుకొని, సుందర రూపాన్ని పొందింది. నిన్ను అర్చించడం వలన ప్రయోజనం  ఆమెకు వెంటనే లభించింది కదా స్వామీ !  

                                   గోపబాలురు నీ తోడ కూడియాడి
ధన్యులైరి త్రిలోకైక మాన్యు లైరి
సఖ్యభావంబు లోని ప్రాముఖ్య మేమొ
            స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!      (50)

                   శ్రీ శ్రీనివాసా! అనాడు రేపల్లె లో గోప బాలురు నీతోడ  ఆడి పాడి నీ స్నేహము తో  గొప్పవారు గా కొనియాడ బడు తున్నారు. సఖ్యభక్తి లోని గొప్పతనమదియే కదా !
ఆత్మలకు ఆత్మయౌ పరమాత్మ వీవు
అందుకొన్నావు రాధ ఆత్మార్పణంబు
 మహిత మోక్షానురక్తి నీ మధుర భక్తి
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!  (51)

                 శ్రీ శ్రీనివాసా ! ఆత్మలకు ఆత్మయైన పరమాత్మవు నీవే కదా. అందుకే రాధాదేవి యొక్క సర్వ సమర్పణాన్ని అందుకొన్నావు.  మధురభక్తి మార్గము మోక్ష ద్వారానికి  దగ్గర దారి  కదా ! .
                రాధాదేవి గుర్తుకు రాగానే ఇక్కడ నుండి రచయిత్రి మధుర భక్తి భావనా నిమగ్నయై  ఇరవై ఆరు పద్యాల వరకు ప్రయాణం చేస్తుంది. మధ్య మధ్య లో దేవులపల్లి  వారి భావ కవితా  పరిమళాలను విరియింప చేస్తూ  చిరునవ్వుల వానలు , మల్లెల జల్లులు , మలయ మారుతాలు , కల కూజితాలు, కమ్మతేనెల విందులు  సందడి చేస్తాయి. ఆ ఆనందపు టావేశం లోని  చివరి పద్య మిది.

చల్ల చల్లగ నా మనశ్శయ్య మీద
సుంత శయనించి సేద తీర్చు కొనుమయ్య
విశ్వ సంసారమున నెంత విసిగినావొ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!  (76)
       
     ఎంత మధుర భావనో చూడండి.   విశ్వ సంసార సంవీక్షణ లో అలసి పోయిన తన స్వామిని చల్ల చల్ల గా తన మనశ్శయ్య మీద సుంత అంటే కొంచెం సేపు శయనించి సేద తీర్చుకొనమని  తియ్య తియ్యగా  మధురాతి మధురంగా వేడుకొంటోంది  శ్రీ నివాస మహాప్రభు ని రచయిత్రి.

                                                    మూడవ భాగం త్వరలో.......................

*******************************************