నగర సంస్కృతి లో నలిగిపోతున్న ఆత్మీయతా సుమాలు
నగర సంస్కృతి లో నలిగిపోతున్న ఆత్మీయతా సుమాలు
పల్లె తల్లి వంటిది. చల్లని గాలి ,తియ్యని నీరు ఇస్తుంది. పక్షుల కిలకిలారావాలతో, ఆవు దూడల అంబారావాలతో, సూర్యుని పిలుచుకొచ్చి, నీవు పడుకున్నా తట్టి నిద్ర లేపుతుంది. ఆకలివేళ కు దుడ్డుబియ్యపు అన్నమైనా ప్రేమతో వడ్డిస్తుంది. పగటి పూట సూర్యుణ్ణి, రాత్రిపూట చంద్రుణ్ణి తీసుకొచ్చి గుమ్మంలో నిలుపెడు తుంది. వేసవి రేయి లో మంచాన్ని బైటవేసుకుంటే ఏటిగాలిని తోడు పంపిస్తుంది. ఉగాది వచ్చిందంటే చేయి చాపితే అందే వేపపువ్వు” బావున్నావా” అంటూ పల్కరిస్తూ. కమ్మని వేపపూల రెమ్మల్ని కానుకగా అందిస్తుంది.
కాని కాలం మారి, కానికాలం వచ్చింది. కోరికల బంగారులేడి వెంటపడి, పట్టణానికి వలసపోతున్నాడు కన్నబిడ్డ. నగర కాంత రంగుల వలలో బందీ అవుతున్నాడు. లక్షల రూపాయల జీతాలు. ఆలుమగలు ఉద్యోగాలు. ఇంటిని, ఇంటితో పాటు చంటి పిల్లల్ని చూసుకోవడానికి వేల జీతమిచ్చి ఇంట్లో హౌస్కీపర్.
రెండేళ్ళ పిల్లలకే (ఆటల బడులు) ప్లే స్కూల్స్. అమ్మానాన్నల మథ్య గడపాల్సిన పసితనం స్కూల్ అనే నాలుగు గోడల మథ్య నలిగి పోతోంది. ప్రొద్దున్నే 6 గంటలకే అమ్మ దగ్గరనుంచి పిల్లలను తీసుకొచ్చి, కాలకృత్యాలు పూర్తి చేయించేసి, టిఫిన్ని బాక్సుల్లో పెట్టేసి, బ్యాగ్ లను భుజాన వేసేసి, స్కూల్ బస్సు లో పడేసి, ఒక పని అయిపోయింది అనుకొంటుంది హౌస్ కీపర్.
ఉద్యోగాల ఒత్తిడిలో అలసి పోయిన అమ్మానాన్నలు తొమ్మిదింటికి నిద్రలేచి, హడావుడి గా తయారై, ఆఫీసుకి వెళ్లిపోతారు .స్కూల్ కెళ్లిన పిల్లల్ని గుర్తుచేసుకొంటూ. 12గంటల కల్లా ప్లేస్కూల్ బస్సు వచ్చేస్తుంది. తమ కోసం అమ్మవస్తే బాగుండుననిపిస్తుంది పసిహృదయాలకు. కాని హౌస్కీపర్ బస్టాప్ దగ్గర సిద్ధం.సర్దుకుపోయిన మనస్సు తో ఇంటికి చేరతారు పిల్లలు. హౌస్కీపర్ కలిపి పెట్టిన అన్నాన్నితిని ,పారేసి, అయ్యిందని పించి, టి.వీ ముందు సెటిలవుతారు పిల్లలు ఇద్దరు.
ఒక్కడే ఉంటే సోఫాలో పడుకొని, ఏవేవో ఆడుకుంటూ , టి.వీ చూసుకుంటూ గడిపేస్తాడు. రాత్రి తొమ్మిదింటికి అమ్మా నాన్న వచ్చేవరకు వాడు ఏకాకి. ఇంతట్లో నిద్రొస్తుంది. అమ్మా నాన్నల్ని తలచుకుంటూ నిద్రలోకి వెళ్ళి పోతాడు బుడతడు,ఎందుకంటే ఒకర్నే కనడం ఇపుడు రివాజు గా మారింది. బాబు లేచేసరికి అమ్మా నాన్న నిద్రలో ఉంటారు.అమ్మా నాన్న నిద్రలేచే సరికి బాబు బడిలో ఉంటాడు. బాబు బడినుండి ఇంటికొచ్చేసరికి అమ్మానాన్న ఆఫీసులో ఉంటారు. అమ్మానాన్న ఆఫీసునుండి వచ్చేసరికి బాబు నిద్రలో ఉంటారు. ఇదీ నగర సంస్కృతి.
ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చేసరికి అలసట, చిరాకు. ఆ పనిమనిషి చేసిన వంటని తిన్నామనిపించి మంచంమీద పడతారు ఆలుమగలు. మాట్లాడుకోడానికి కూడ ఓపిక ఉండదు. పడుకుంటే అప్పుడేనా అన్నంతలో మళ్ళీ తెల్లవారి తొమ్మిదవుతుంది. యాంత్రిక జీవితం మరల మొదలు .ఇదీ పట్నవాసం.
పెరిగిన జీవన వ్యయం తో భార్యా భర్తలు ఉద్యోగం చేస్తే గాని ఇల్లుగడవని పరిస్థితి కొందరిదైతే, పెరిగిన ఖర్చులు,పిల్లల చదువులు , డొనేషన్లు, కొనుక్కున్న అపార్టుమెంటుకు 60.70 వేలు ఇయంఐ లు, మెడికల్ ఖర్చులు వెరసి ఇద్దరు ఉద్యోగం చేయాల్సిన స్థితి. దీనివలన మానవ సంబంథాలు నలిగి పోయి, వాడి పోయి, దూరం గా జరిగి పోతున్నాయి .ఆదివారం మాత్రమే అమ్మా నాన్నలకు పిల్లలు దొరికేది. పిల్లలకు అమ్మా నాన్నలు దొరికేది. ఆలు మగలుకు పిల్లల ముద్దుపలుకులు వింటూ, ఆనందించే సమయం సరిగా ఉండటం లేదు. అమ్మా నాన్నల తో హాయిగా ఆడుకొనే కాలం పిల్లలకు దొరకడం లేదు. అందుకే తమ పిల్లల్ని,పిల్లల పిల్లల్ని చూచుకోవడానికి ఈనాడు నగరం లో ప్రతి అపార్టు మెంటులోను తాతయ్యలు.బామ్మలు తప్పని సరిగా కన్పిస్తున్నారు. ఇది అనివార్య పరిణామం. భార్య పెద్దకొడుకు పిల్లల్ని చూసుకుంటూ నగరం లో ఉంటే ,సొంత ఊళ్లో ఇల్లు,పొలం తో పాటు చిన్నకొడుకు ను చూసుకుంటూ భర్త ఉంటూ, చివరి రోజుల్లో ముసలి వాళ్లు వేరుగా ఉంటున్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి.
సంపాదించేది పిల్లలకోసమే.కాని ... పిల్లల్ని సరిగా చూసుకోలేక పోతున్నామని, బాథపడే మాతృమూర్తులున్నారు. భార్యలు ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం కోసం ఉద్యోగం మానేస్తామంటే ఆర్థికంగా వచ్చేఇబ్బందులను ఊహించుకొని,అంగీకరించలేని భర్తలు ఉన్నారు. అందుకే సాలెగూడు లో చిక్కుకు పోయిన ఈగ లాగ కొట్టుకుంటున్నాడు నగరజీవి. కాని మనం సంపాదించిన దాన్ని లాక్కోవడానికి పట్నం ఎప్పుడు సిద్ధం గానే ఉంటుంది.
పట్నం లో పండుగ వస్తే ... ఇంటి ముందు గుమ్మానికి కట్టుకునే మామిడాకులు పదిరూపాయలకు రెండు రెమ్మలిస్తాడు. ఉగాది వచ్చిందంటే వేపపువ్వు నాలుగు రెమ్మల చుట్టు ఇరవై వేపాకులు కట్టి, కట్ట పదిరూపాయలంటాడు.
“ కూటికోసం, కూలికోసం పట్టణం లో బ్రతుకుదామని బయలుదేరిన బాటసారి “కష్టాన్ని మహాకవి శ్రీ శ్రీ ఏనాడో ఏకరువు పెట్టాడు”.టౌన్ పక్క కెళ్లోద్దురా డింగరి,డాంబికాలు పోవద్దురా “ అని హెచ్చరించాడు కూడాను.
కాని ఇది తప్పించుకోలేని స్థితి. మనకు తెలియకుండానే సుడిగుండం లోకి మనం లాగబడుతున్నాం. పిల్లలకు పెద్ద చదువులు.పెద్ద ఉద్యోగాలు, ఆస్తులు, విదేశీ యానాలు ఇవన్నీ కావాలనుకున్నప్పుడు మానవతా సంబంధాల్లో దూరం, జరిగి, జరిగి పెరిగి పోతోంది. మన మథ్య ఆత్మీయతా బంథాలు అల్లుకోవడం లేదు. గుండుమల్లె ల్లాగా ఆకారాలు మాత్రం మిగిలి పరిమళాలు లేకుండా పోతున్నాయి. ఇది సమాజం లో వచ్చిన పరిణామమే కాని ఏ ఒక్కరో కల్పించింది కాదు.కొన్ని కావాలంటే కొన్ని వదులు కోవాలనేది పెద్దలమాట. ఒకే ఇంట్లో ఉంటున్న తండ్రి కొడుకు ప్రేమగా మనసు విప్పి మాట్లాడుకోవడానికి వారానికి ఒకసారి కూడ కుదరడం లేదు. మాట్లాడుకున్నా అదీ ఒక బిజినెస్ డీల్ లాగానే ఉంటోంది.
ఈనాటి పిల్లలు చాలా చాలా కోల్పోతున్నారని ప్రతి వారు అంటున్న మాటే. వేసవి సెలవలు,అమ్మమ్మ,తాతయ్యల వాళ్ల ఊళ్ల కెళ్లడం ,బంధువులు, బంధుత్వాలు అనేవి ఈ తరానికి తెలియని స్థితి వస్తోంది. కనీసం వేసవి సెలవల్లోనైనా పిల్లల్ని వీలు చూసుకొని మన ఊరికి తీసుకెళ్దాం. అంతగా వీలు లేకపోతే నాయనమ్మ, అమ్మమ్మ ల వెనకైనా పిల్లల్ని నాలుగు రోజులు ఊరికి పంపిద్దాం. తాతయ్య వాళ్ల ,అత్తయ్య వాళ్ల ఊళ్లు కూడ ఉంటాయని, అక్కడ కూడ “ పెద్ద పెద్ద ఇళ్లు, చెట్లు,చెందమామ. ఆకాసం, ఎండ,డాగీలు, పిగ్గీలు” ఇటువంటి ఉంటాయని పిల్లలకు తెలియనిద్దాం. మన లోని మానవ సంబంథాల బంథాలను బలపడనిద్దాం. పెరగనిద్దాం. పరీమళాలను పరిసరాలకు వ్యాపింపచేద్దాం. సమ్మర్ క్లాసులకు, బ్రిడ్జి కోర్సులకు నాలుగురోజులు బై బై చెబుదాం. బై బై.