Thursday, 19 January 2017

మూడవ ప్రకరణం - గుడిమెట్ట లో వెలుగుచూసిన తెలుగు శిల్పాలు.


మూడవ ప్రకరణం

                   గుడిమెట్ట లో


      వెలుగుచూసిన తెలుగు శిల్పాలు


                                                                         ఈ కాలం లో  మహమ్మదీయుల దండయాత్రలతో హిందూసంస్కృతి మాడి మసై పోయింది. తురుష్కులు శతాథిక పాపకార్యాలతో  హిందూ సంపన్నులను ధనం కోసం పీడించారు. మహమ్మదీయుల దర్శనమే హిందువులకు ప్రాణాంతకంగా పరిణమించింది. బ్రాహ్మణుల పూజాపునస్కారాలు నిషేథించబడ్డాయి. దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. ముసునూరి ప్రోలయ నాయకుని విలస శాసనం వీరి దురంతాలకు అద్దం పడుతోంది.
                                        “ డబ్బు కోసం ధనికుల్ని హింసించారు.  బ్రాహ్మణుల్ని తమ మతకర్మ లు సాగకుండా నిరోధించారు. దేవతా విగ్రహాలను కూలద్రోసి పగులగొట్టారు. అగ్రహారాలను లాక్కున్నారు . వ్యవసాయదారుల పంటలు దోచుకున్నారు. ఆస్తి గాని ,ఆఖరికి పెళ్ళాన్ని కూడ నాదనుకునేందుకు ఆస్కారం లేకుండాపోయింది. -------“ ( ఆంథ్రులచరిత్ర –సంస్కృతి 74వ పే.) హిందూ దేవాలయాలను నేలమట్టం చేయడమే కాకుండా ఆ పునాదులపై మసీదులు నిర్మించారు. అలెగ్జాండర్ రియా అనే చరత్ర కారుడు ఇలా వ్రాస్తున్నాడు.

దేవాలయాలను , పూజారులను, భక్తులను అవమానించి హింసించారు.                                         
దేవాలయ ధనాగారాలను కొల్లగొట్టారు.రాజమహేంద్రవరం లోని హిందూ
              దేవాలయాన్ని పడగొట్టారు. ఈ దేవాలయ పునాదుల మీదే మహమ్మద్
               తుగ్లక్ షా  క్రీ.శ .1324 లో మసీదు నిర్మించాడు. మతాచార్యుల్ని వధించాడు.
               ఆ మసీదు వరండా లోని నల్లరాతి స్ధంభాల మీద ఉన్న హిందూ శిల్ప నిర్మాణం
               ఇందుకు తార్కాణం. మసీదు లోపలి ఆవరణ లోని చెఱువు ఆనాటి పవిత్ర      
               దేవాలయ గర్భగుడి ......................( కాకతీయ నాయకులు –ఆచార్య ఎం.జి రంగా.)
 అని రియా వ్రాశాడు. గర్భగుడి ని చెఱువు గా మార్చిన పైశాచికత్వమే పెనుగొండ , త్రిపురాంతకం దేవాలయాల్లో కూడ కన్పిస్తోంది. పెనుగంచి ప్రోలు లోని మసీదు ఒకనాటి హిందూ దేవాలయమే.
                           ఈ విధం గా మహమ్మదీయుల దండయాత్రల్లో మట్టికరచిన శిథిల శిల్పాల హృదయ విదారక రోదనలు చరిత్ర పుటల్లో ఘడియ ఘడియ కూ విన్పిస్తాయి.  అడుగడుక్కి కాళ్ళకు తగిలి , బంధాలై నిలదీసి ప్రశ్నిస్తాయి. శిలలు ద్రవించి ఏడ్చినవి అని హంపీ శిథిలాలను చూసి విలపించిన కవి గొంతుక తెలుగునాట విన్పిస్తూనే ఉంది. (హంపీ క్షేత్రము –కొడాలి వెంకట సుబ్బారావు ).కేవలం స్వలాభం కోసం ,మత ప్రచార ప్రాపకాల కోసం , దోపిడీలకోసం రాజ్యకాంక్ష తో చేసే  యుద్ధాల్లో సంస్కృతి , మానవత ,   ఆత్మ ప్రబోధాలు  ఏవీ కన్పడలేదు. విన్పడ లేదు.   హిందూరాజులు పరస్పరం యుద్దాల్లో తలబడి పోరాడకున్నా సంస్కతీ నిలయాలు గా ఉన్న కట్టడాల విధ్వంసానికి ఏ వర్గమూ పూనుకునేది కాదు. రాజు మారితే శాసనాలు వెలిసేవి కాని శిథిలాలు మిగిలేవి కాదు. కాన తతురుష్కుల దండయాత్ల ల్లో మొదటి దాడి దేవాలయాలే కావడం నిజంగా దురదృష్టం . ఐశ్వర్య వంతమైన ఆలయం చుట్టూ

                                                             -42-
సామాజిక కార్యక్రమాలు అల్లుకొని ఉన్నందునే ముస్లిం లు ఆలయాల మీద దృష్టిని కేంద్రీకరించారు. ఆలయ విథ్వంసనం తో సామాజిక జీవితం విచ్ఛిన్నమై దేశాక్రమణ సులభం కాగలదని వారి ఉద్ధేశ్యమై ఉంటుంది.” ( ఆం.చ-సం -195 వ పే )
                                                ప్రస్తుతం  నందిగామ పట్టణం విజయవాడ- హైదరాబాదు జాతీయ రహదారి లో 59 వ మైలురాయి వద్ద నున్న మండలకేంద్రము. ఈ నందిగామ నుండి పడమర గా పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అలనాటి చాగి ధరణీశుల రమణీయ వైభవానికి  ఆనవాళ్ళు గా మిగిలిన శిథిలాల చెంతకు చేరతాడు పరిశోధకుడు. అదే గుడిమెట్ట. పన్నెండు , పదమూడవ శతాబ్దాల్లో ఆంధ్రదేశాన్ని అట్టుడికించిన ఎన్నో మత ,రాజకీయ విప్లవాల ఆటుపోట్ల ను తట్టుకొని రెండున్నర శతాబ్దాలకు పైగా తెలుగు వారికి నీడనిచ్చిన ఈ రాజ్యం నేడొక కుగ్రామం. ఎవరైనా జిజ్జ్ఞాసువులైన పరిశోధకులు యీ ప్రాంతానికి వెళితే ఆ పల్లె ప్రజలు మొదట వింతగా చూసి , తరువాత చల్లగా పల్కరించి,   అనంతరం మెల్మెల్లగా చరిత్ర గర్భం లో దాగిన వృద్ధుల మాటలను  గాథలు గా విన్పిస్తారు. వారు మొదట గా చూపించేది మసీదు దిబ్బ.  ఈ పేరు వింటుంటేనే అర్ధమౌతుంది ఆనాటి రాజ్యం ఎందుకు దిబ్బ గా మారిందో –తెలుసుకోవడానికి. కృష్ణానది  కొండల నడుమ  మెల్లగా ప్రవహిస్తూ ,తన గర్భం లో దాగిన ఎన్నో విగ్రహాలను గూర్చి మనకు చెప్పాలని , ఆరాట పడుతున్నట్టు గా ఉంటుంది.

                                          -43-
 ముష్కరుల చేత  పెకలించబడి ,ధ్వంసం చేయబడి నది లోకి విసిరి వేయబడ్డ  ఎన్నో విగ్రహాలు ,   ప్రతి సంవత్సరం వేసవి లో గృహనిర్మాణ నిమిత్తం  ఇసుకను త్రవ్వుకొనే వాళ్ళ  పలుగు దెబ్బలకు ఉలిక్కి పడి, నోరు విప్పి, వెలుగు చూపించమని విలపిస్తున్నాయి. కొండ దిగువన నిలబెట్టిన వినాయకుడు , కుమారస్వామి , చెన్నకేశవుడు అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. కాగా అందమైన ఎన్నో విగ్రహాలు ఐశ్వర్యవంతుల గృహాల్లో అలంకరణ శిల్పాలు గా తరలించబడినట్లు
 ప్రాంతీయులు చెపుతారు.
                           ఈ మసీదు దిబ్బ ఆనాటి గుడిమెట్ట సామ్రాజ్య శిథిల రాజ్యరమా నివాసభూమి. దూరంగా అక్కడక్కడ విసిరవేయబడినట్లు నాలుగైదు కిలోమీటర్ల పరిథి లో విసిరివేయబడినట్లు పడిఉన్న నల్లరాతి స్ధంభాలు,పద్మాలంకృతులతో కూడిన పైకప్పులు ,  రాతి అడ్డ దూలాలు  ఒకటేమిటి  అడుగడుగున అక్కడేదో ఘోర సంగ్రామం జరిగిన దాఖలాలు స్పష్టం గా కన్పిస్తాయి.
              చిత్రం – 1
                       



                      కొండ మధ్య లో తూర్పు దిక్కు గా తిరిగి, రమణీయమై శిల్ప చిత్రితమైన నల్లరాతి గుమ్మాలు గల ప్రదేశం విశ్వేశ్వర దేవాలయ గర్భాలయ ప్రవేశ ద్వార  ఎడమవైపు స్ధంభం .

                                                                     - 44 -

                       దానికి వెనుక కన్పించే నాలుగయిదు అడుగుల గుంట  పీకి వేయబడిన విశ్వేశ్వర మహాదేవుని స్ధానం లో ఏర్పడి , కాలగమనం లో పూడిపోయి మిగిలిన ఖాళీ ప్రదేశం . దూరం గా కన్పడే స్ధంభాలు ,రాతి దూలాలు, పైకప్పు చదరపు ఫలకాలు ,  ఆ దేవాలయ  ముఖమండపాన్ని  నిలబెట్టడానికి తుది వరకు ప్రయత్నించి ,  మధ్య లోకి విరిగిపోయి కన్పిస్తాయి.
                         చిత్రం - 2                   
                             

                         ఆ ప్రక్కగా మరొక ఆలయం విష్ణాలయ చిహ్నాలతో శిథిలమై కన్పిస్తోంది. దీనికి గర్భాలయ ద్వారబంధం  కుడివైపుది  చరిత్ర కు సాక్ష్యం గా నిలిచి ఉంది. దానిపై ఇప్పటికీ కన్పించే అపురూప కౌశలం  చూపరులను ఆకట్టుకొంటుంది. దానికి కొద్ద దూరం లో అడవి పొదల్లో  పడి ఉన్న రాతి ఫలకం రెండవ ద్వారబంధం క్రింది భాగం . దానిపైన  దానిపైన మురళీమోహనుడు మధుర మోహనం గా వేణువు నాలాపిస్తున్నాడు. ఇరువైపుల తన్మయత్వం తో గోపికలు  అరమోడ్పు కనులతో  నల్లనయ్య ను ఆరాధిస్తున్నారు. ఆ మూలగా మరొక శిథిల ఫలకం పడిఉంది.  దానిపై ముకుళిత హస్తాలతో ఆంజనేయుడు రామచంద్రుని పాదసన్నిథిని మోకరిల్లి ఉన్నాడు. ధనుర్బాణధారుడైన  రామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై నిలిచి ఉన్న దృశ్యమిది. ముష్కరుల సమ్మెట వేటు ముగ్గురి ముఖాలకు  సమానం గా తగిలి ,వారి ముఖాలు పగిలిపోయాయి. కాని చిరంజీవి యైన ఆంజనేయుడు మాత్రం  ముకుళిత హస్తాలతో మోకరిల్లే ఉన్నాడు. దూరంగా పద్మాకృతి చిత్రించబడిన పైకప్పు ఫలకాలుఅనేకం ఎర్రమట్టిలో నుండి తొంగి చూస్తున్నాయి. ఇవి చోడనారాయణ స్వామి దేవాలయ శిథిల భాగాలు.
                               
             దీనికి వెనుక భాగం లో కన్పించే  లోతైన అగాధం సోమసూత్రం తో సహా స్వామిని పెకలించిన పెద్దగుంట.  ఎనిమిది శతాబ్దాల అనంతరం కూడ అంత గుంట కన్పిస్తోందంటే ఆనాడు
                                                                 -45-

ముష్కరులు ఎంతగా త్రవ్వి నాశనం చేశారో మనం ఊహించవచ్చు. ఈ మధ్య కాలం లో కొందరు స్వార్ధపరులు నిధుల కోసంచేసిన త్రవ్వకాల వల్ల కూడ గుంటలు మరల పెద్దవై ఉండవచ్చు. ఈ శిథిలాలలో ఆతృత గా వెదికే పరిశోధకునకు ఆనాటి రాచరికపు హొయలు , ధిక్కార ,ఛీత్కారాలు ,  రాణివాసపు చిరుమువ్వల సవ్వడులు , కరకు కత్తుల కఠోర శబ్దాలు విన్పించవచ్చు. చర్మచక్షువులకు మాత్రం శిథిల భాగాల నడుమ నలిగిపోయిన చరిత్రని చెప్పడానికా యన్నట్లు బరువుగా ఒరిగిన శిలాశాసనాలు కన్పిస్తాయి. వానిలో కొన్ని తారీకులు లేనివి. మరికొన్ని పూర్తిగా ఛిద్రమైనవి కాగా మిగిలినవి చదవడానికి వీలయినవి   నాలుగైదు మాత్రమే.
                                    5 అడుగుల ఎత్తు  1 1/2 వెడల్పు  గల్గిన  నల్లరాతి స్ధంభం పై ఒక శాసనం లభిస్తోంది. ఇది రుద్రమదేవి కాలం లోనిది. శా.శ. 1190 లో సాహిణి గన్నమ నాయకుడు విశ్వనాథ దేవరకు బేతవోలు గ్రామాన్ని దానం చేసిన శాసన మిది.  ఇతనే తరువాత చరిత్ర లో రుద్రమదేవి కి నమ్మినబంటు గా కీర్తి గడించిన గోన గన్నారెడ్డి.
                                  


                         మరొకటి తేదీ లేని మొదటి పోతరాజు శాసనం.ఈ శాసనం లో ముప్పభూపాలుని నుండి మొదటి పోతరాజు వరకు  వంశచరిత్ర ప్రస్తావించబడింది.  గుడిమెట్ట లో  విశ్వేశ్వర దేవరకు గుడి కట్టించినట్లు ఈ శాసనం లో ప్రస్తావించబడింది. మరి మూడు శాసనాలు పూర్తి గా భ్రష్టమై ఏ మాత్రం అర్ధం కాని  స్ధితి లో ఉన్నాయి. మల్లపరాజు , త్రిలోచన మల్లుడు  పేర్లు మాత్రమే కనపిస్తున్న శాసనం ఒకటి ఇక్కడ పడి వుంది.
  మరొకటి చిత్రం - 16  అనమ్మకొండ  రుద్రదేవుల కాలం నాటిది గా అతి కష్టం మీద గుర్తించడం జరిగింది. ఇంకొకటి హన్మకొండప్రస్తావన గల శాసనం .
                                                                       - 46 -




             చిత్రం-17  .




విషయం ఏ మాత్రం గ్రాహ్యం గా లేదు. సమ్మెట దెబ్బలకు పూర్తిగా భిన్నమైంది. ఇవి కాక మరి  రెండు కన్నడ శాసన భాగాలు అక్కడక్కడ విసిరి వేయబడ్డాయి. వీనిన ఏకం చేసినా  సమన్వయం సాద్యం కాలేదు.
      
                చిత్రం -20..
                

                                                                              నాగశిల్పం

                        మొదట ప్రస్తావించిన రెండు శాసనాలు  ఒకే స్తంభానికి రెండువైపులా చెక్కబడ్డాయి. మూడవ వైపు నాగశిల్పం చెక్కబడింది. ఈ స్థంభాన్ని రెండ మూడడుగుల మట్టి లోనుంచి పెకలించవలసి వచ్చింది.  మనదేశం లో నాగపూజ క్రీస్తుపూర్వం నుండి కన్పిస్తున్నట్లు సాక్ష్యాలు లభిస్తున్నాయి. సింధు నాగరికత త్రవ్వకాల్లో  లభించిన మృణ్మయ పాత్రలపై నాగప్రతిమలు కన్పిస్తున్నాయి. ( హిందూ దేవాలయములు – శిల్పములు. 99 వ పే. ). బౌద్దమతం లో సర్పజాతి ఆరాధన ప్రస్తావన కన్పిస్తుంది. అధర్వణ వేదం లోను , యజుర్వేదం లోను నాగులను గూర్చిన ప్రస్తావన వస్తుంది. మహాభారతం ఆదిపర్వం లో నాగజాతిని గూర్చిన కథ చెప్పబడింది. క్రీస్తు శకం  7 వ శతాబ్దం లో ని పల్లవుల కాలం లో నిర్మించబడిన మా మల్లపురం లో నాగ ,నాగిని శిల్పాలు కన్పిస్తాయి. ఎల్లోరా గుహల్లో గజలక్ష్మి తో పాటు మానవాకృతిలోని సర్పరాజ ప్రతిమలు ద్వారబంధాలపై చెక్కబడ్డాయి. 11 వ శతాబ్దం లోని హైహయ వంశీయుల శాసనాల్లో నాగశిల్పాలు కన్పిస్తున్నాయి. పల్నాడు  మాచర్ల చెన్నకేశవాలయం లో నాగస్ధంభం శాసనాలు వేయబడ్డాయి.. అదే సంప్రదాయం హైహయ వంశీయులుగా భావించ బడుతున్న చాగివారు  నాగస్ధంభం పై శాసనాలు వ్రాయించారు. ద్వారక గుడి ద్వారబంధాలపై ,వెలుపలి
                                                  
                                                                            - 47-


    గోడలపై సైతం నాగబంధాలు , నాగశిల్పాలు కన్పిస్తాయి. ద్వారకగుడి ని గూర్చి మనం ముందు చర్చించుకుందాము.
            
               వెలుగు చూసిన తెలుగు శిల్పం.                                         
                    
                          ఈ శాసనాలు పడి ఉన్న ప్రదేశానికి వందగజాల దూరం లో  ఒక పెద్ద నల్లరాతి బండ నేలలో కూరుకుపోయి పై భాగం చూస్తే మాత్రం ఏదో ఒక పెద్ద శిల్పం వలే కన్పిస్తోంది. జిజ్ఞాస తో దాని చెంతకు చేరాము. అది సాధారణం గా కదిలే పరిస్థితి లేదు. నాతో ఉన్న విద్యార్థులు ఇద్దరు, ముగ్గురు ఆ ఊరి వాళ్లే.  అందుమూలంగా వాళ్లు వెళ్లి అక్కడ ఇటుక బట్టీల్లో పనిచేసే మరి ఇద్దరు ముగ్గురిని పిలుచు కొచ్చారు . అందరం కలిసి ఒక గంటసేపు చెమట వోడ్చి , శ్రమిస్తే ఆ విగ్రహం తిరగబడి , సూర్యకాంతి చూడలేనట్లు గా తెల్లబోయింది. అది నల్లరాతి శిలైనా కొన్ని వందల సంవత్సరాలు ఎర్రమట్టి లో కూరుకు పోయి  జేగురు రంగు ను పొంది  విచిత్రం గా ఉంది. అదిగో ఆ శిల్పం ఇదే.
చిత్రం – 5 ,6
                     

                                                                మహాదేవుడు


                                    ఆ మహాశిల్పం శంకరుడే. లింగధారి గా ప్రత్యక్షమయ్యాడు. ఒక చేతి లో త్రిశూలం , మరొక చేతి లో ఢమరుకం , వేరొక చేతి  తో అభయముద్ర , మరొక చేతి లో భిక్షాపాత్ర ను ధరించి , దిగంబరధారి గా  ఆది భిక్షువు ప్రత్యక్షమయ్యాడు.  5 ½  అడుగుల ఎత్తు, 3 12 అడుగుల వెడల్పు, 6 అడగుల  పీఠం కలిగి కైవారం ఎనిమిదడుగులు గల భారీ విగ్రహం  ఇది పద్మాకృతి గల పీఠం మీద నిలబడినట్టు గా న్న శిల్పం ఇది. పైభాగం గోపురాకృతిని పొంది, మకర తోరణం గుర్తుకు తెచ్చే శిల్ప నైపుణ్యాన్ని మనం దీనిపై చూడవచ్చు.
                                                               - 47-
     




                                                                    మరొకవైపు నుంచి మహాదేవుడు

     ఆ శిల్పాన్ని చూసిన మా ఆనందానికి అవధులు లేవు. మా ప్రయత్నం సఫలమై  ఏడువందల సంవత్సరాలు గా వెలుగు చూడని ఒక తెలుగు శిల్పాన్ని జాతికి చూపించ గలిగామనే ఒక  సంతోషం అక్కడున్న వారందరి ముఖాల్లోను కన్పించింది. ఇది ఒక అపురూప శిల్పం.
                                       

                                                                        వినాయకుడు

                                 ఇదే స్థాయి లో చూపరులను ఆకట్టుకే మరో పెద్ద విగ్రహం వినాయకుడు. ఇది కూడ మరో భారీ విగ్రహమే. ఇది 4 అడుగుల ఎత్తు, 3 1/2 అడుగుల వెడల్పు గలిగి పీఠం పై చెక్కిన ఉండ్రాళ్ళ గణపతి. ఈ శిథిలాల్లో లభించి స్వయంభూ ఆలయానిక వెళ్ళే మార్గం లో కొండ దిగువన  మెట్ల దగ్గర కొన్ని బండరాళ్ళు ఆధారం గా నిలబెట్టబడింది. ఉత్సాహ వంతులైన కొందరు స్ధానికులు శిథిల స్థంభాలను ఆధారం గా నిలిపి , పైకప్పుగా బండల్ని వేశారు. ఏ పుష్కరాలకో ,పండుగలకో  ఈ బొజ్జగణపయ్య కు పసుపు ,కుంకుమలతో పాటు పాలు, పండ్లు ,పూలు లభిస్తాయి. మిగిలిన రోజుల్లో గాలి భోంచేయడమే.
                                     



                                                         కుమారస్వామి


                                 ఇదే మార్గం లో కొద్దిగా పైకి నడిస్తే గణపయ్య సోదరుడు షణ్ముఖుడు మయూర వాహనారూఢుడై దర్శన మిస్తాడు. ఇది నల్లరాతి పై చెక్కబడిన శిల్పం. కుమారస్వామి ద్వాదశ భుజాలతో వివిధ ఆయుధాలను ధరించి మయూర వాహనం పై వేంచేసి ఉన్నాడు. ఈయన కూడా బండరాళ్ల ఆధారం తో నిలబెట్టబడి , నాపరాళ్ల కప్పు క్రింద తలదాచుకుంటున్నాడు. తండ్రీ , కుమారుల విగ్రహాలు మూడు ఇలా లభించడం యాదృచ్చికమైనా   బాధను కల్గించే విషయమే కదా.
                                   
                                                        -48-
                              గుడిపైకి వెడితే స్థానికులు రామలింగేశ్వరాలయం గా పిలుచుకొనే శివాలయం ఒకటి వస్తుంది. రెండవ పోతరాజు గుడిమెట్ట లో నిర్మించి నట్లు గా శాసనాల్లో కన్పిస్తున్న స్వయంభూ దేవాలయం ఇదేనమో. ఈ స్వామి గర్బాలయం లో లేడు. పానమట్టం నుండి పీకివేయబడి గర్భగుడి లో ఒక మూల గా విసిరి వేయబడ్డాడు.
                                  

                                                                 ఆలయ ప్రవేశ ద్వారం
                                     ముఖమండపం లో ఉండాల్సిన నందీశ్వరుడు ఒకమూల కు నెట్టి వేయబడ్డాడు. ఆనాటి శిథిలమైన స్వయంభూ దేవాలయం అనంతర కాలం లో రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుని చేత పున: ప్రతిష్టించబడి కూడ మరల ఈమథ్య కాలం లో కొంతమంది స్వార్ధపరుల చేత గుప్తనిధుల తవ్వకాలలో భాగం గా   దేవాలయం మరల ధ్వంసం చేయబడినట్లు స్ధానికులు చెపుతున్నారు. కారణమేదైనా ప్రస్తుతం పరమేశ్వరుని స్థితి ఈ విధంగానే ఉంది. ఆలయం లోపల నేలపై వేసిన బండలు కాక గోడల్లో పెట్టిన బండలను పీకి నానా భీభత్సము చేయబడిన ఈ ఆలయం ఒకనాడు రాజుల ఆదరణ తో రమ్యమైన దైవ సన్నిధి గా భాసిల్లి ఉంటుందనే భావనే పరిశోధకుని అక్కడకు చేర్చింది.
                                       

                                                            ఆలయ ముఖమండపం
                                   ఈ స్వయం భూ దేవాలయం లో  నైరుతి మూల గా  ఒక ఏడు నాగ శిలలు  గోడకు నిలబెట్టబడి ఉన్నాయి. నాగమిధునము , నాగబంధాలే కాక మరికొన్ని ప్రత్యేక శిల్పాలను మనం ఇక్కడ చూడవచ్చు. నాగపూజ ఆంధ్రదేశం లో క్రీస్తు పూర్వం 3 వశతాబ్దం నుండి ప్బలం గానే ఉన్నట్లు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ( హిందూ దేవాలయములు – శిల్పములు. 99 వ పేజి.) ఈ చిన్నచిన్న శిలలు తవ్వకాల్లో లభించినవే . అలగే  ఆలయానికి వెనుకవైపు గోడకు ఆనించి , సప్తమాతృకల ఫలకం ఒకటి ఉంది. ఈ సప్త మాతృకలకు కుడి ఎడమలు గా వీరభద్రుడు , వినాయకుడు కొలువు దీరి ఉన్నారు. (చిత్రము 14,15)
                                                                       - 50-
                సప్త మాతృకలు :ఈ సప్త మాతృకల ప్రతిమా లక్ష ణాలు అగ్ని , అంశుమద్వేదాగమము , మత్స్య , రూపవర్తిని, రూపమండన , విశ్వకర్మ శాస్త్రాలు , శిల్పరత్నాకరము లందు విపులం గా విశదీకరించబడింది. సప్తమాతృకలు వీరు.
                                             బ్రాహ్మీ మహేశ్వరీ చైవ కైమారీ వైష్ణవీ తధా
                                           వారాహీ చైవ ఇంద్రాణీ చాముండా సప్తమాతర: !! “
              

                                          


                  బ్రాహ్మీ :--ఎర్రని కలువపై  సమాసీనురాలై , హంస ను వాహనం గా గల్గి, చతుర్ముఖములు , చతుర్భుజములు  కల్గి , , పసుపు వర్ణపు శరీరాకృతి తో, దక్షిణ హస్తము నందు త్రిశూలమును వామహస్తమున అక్షమాలను కలిగి , అభయ వర ముద్రలను దాల్చి యుండును.
            మహేశ్వరి :చతుర్భుజ. శూలము, అక్షమాల ,అభయ ,వరద ముద్రలను దాల్చి యుండును. నందివాహన . శ్వేతవర్ణ. త్రినేత్ర. తలపై చంద్రవంక ను దాల్చి యుండు మూర్తియే మహేశ్వరి.
            కౌమారి.:కుమారస్వామి కి ప్రతిరూపము గా నిల్చిన సప్తమాతృక కౌమారి. ఈమె చతుర్భుజ . శక్తి కుక్కుటము లను ధరించి , అభయ వరద ముద్రలతో కన్పించే ఈమె మయూర వాహన . ఈమె ధైర్య సాహసాలకు ప్రతిరూపం గా ఆగమము లందు కొనియాడబడుతోంది.
            వైష్ణవి :.- చతుర్భుజ . శంఖచక్రధారిణి యై , అభయ ముద్రలతో కృష్ణ ఛ్ఛాయ తో కుచోన్నతి గల్గిన సుందర రూపము ఈమెది. ఈమె గరుడవాహనా రూఢయై భాసిల్లు చున్నది.
              వారాహి :.-  ఈమె కారుమబ్బుల చాయ కలది వరాహ ముఖియై పగడాల మాలను ధరించియుండును. విష్ణు ధర్మోత్తర పురాణము నందు  ఈమె పెద్ద పొట్ట గల్గి , అష్ట భుజము లతో దండ
                                                                          -51-
, ఖడ్గ ,భేరుక పాశములు గల్గి మిగిలిన హస్తముల యందు అభయ వరదముద్రలను సూచించు చుండవలెనని శాస్త్రం లో చెప్పబడింది. కాలికి నూపుర ,కంకమము లుండుట ఈమె ప్రత్యేకత. ఈ చిత్రము నందు మాత్రము పూర్వకారణాగమము ననుసరించి, సారంగము ,ధనుస్సు ,అభయ వరద ముద్రలతో మాత్రమే కన్పించుచున్నది.  వాహనము ఐరావతము గా చెప్పబడినది కాని ఈ చిత్రం లో మాత్రం వారాహి మహిష వాహనయై మనం దర్శనమిస్తోంది.
              ఇంద్రాణి: –  ఈమె చతుర్భుజ. త్రినేత్ర. వజ్రాయుధము ,శక్తి ఆయుధము లు గా ధరించి ,అభయ వరదముద్రలతో సర్వాలంకార శోభితయై ఉండును .అరుణ వర్ణ శరీర . ఐరావతము వాహము. అభయ వరద హస్తాలతో , ముగిలిన రెండు చేతుల యందు తామరపూలను ధరించి నట్లు గా చెక్కబడిన ఈ శిల్పం పూర్వకారణాగమాన్ని అనుసరించి నిర్మించింది గా చెప్పవచ్చు.
              చాముండి.:ఈమె త్రినేత్రి . అరుణవర్ణ .చతుర్భుజ. కపాలమాల ను యజ్ఞోపవీతం గా ధరించి ,త్రిశూల, ఢమరుకాల్ని, అగ్ని, పరశువు లను నాలుగు చేతుల్లో ధరించి ఉంది.ఈమె కు గుడ్లగూబ వాహనం గా చెప్పబడింది. కాని మనకు లభించిన రెండు సప్తమాతృకల ఫలకాల్లోను చాముండి వాహనం గుడ్లగూబ కాదు. అది శునకం గా కన్పిస్తోంది. చిత్రం  - 14.
         ఈ ఫలకం మీద సప్తమాతృకలకు ఇరువైపు లా వీరభద్రుడు , గణపతి కన్పిస్తారు. వీరభద్రుడు వీణాపాణి యై దర్శన మిస్తున్నాడు. గణపతి కుబ్జరూపుడై , ఉండ్రాళ్ళ ను భక్షిస్తున్నట్లు చెక్కారు. ముక్య్తాల ప్రాంతం లో లభించిన వేరొక ఫలకం లో   సప్త మాతృకల రూపాలు వాహనాలన్నీ సమానంగానే ఉన్నా వీరభద్ర గణపతులు కుడి యెడమలు తారుమారు గా  చెక్కబడ్డారు.రెండుచోట్ల వీరభద్రునకు నందీశ్వరుడు , వినాయకునకు మూషికము  వాహనాలు గా చెక్కబడ్డాయి. ఈ విధం గా సప్తమాతృకలను  పూజించే సంప్రదాయం అతి ప్రాచీనమైనది గా కన్పిస్తోంది                                                                               . క్రీ. పూ  మూడువేల
                                                                             


                                      ముక్త్యాల లో లభించిన ఫలకం

                                                                                -52-
సంవత్సరాలనాటికే సింధు నాగరికత ప్రజలు  సప్తమాతృకలను పూజించి వుండవచ్చు నని, కొందరభిప్రాయ పడుతున్నారు. ( హిందూ దేవాలయములు – శిల్పములు . -80 వ పే).బృహత్సంహిత లో వరాహ మిహిరుడు శక్తి పూజ , మాతృగణారాధన గూర్చి ప్రస్తావించాడు. మృచ్ఛకటికం ప్రజలు సప్తమాతృకల్ని పూజిస్తున్నారని చెపుతుంది. కుమారగుప్తుని గాంధార శాసనం లో సప్తమాతృకల ప్రస్తావన ఉంది. మార్కండేయ ,మత్స్య , వరాహ పురాణాల్లో సప్తమాతృకల గాధలు కన్పిస్తాయి. స్కందగుప్తుని బీహారు శాసనం లో కార్తికేయుడు సప్తమాతృకల సరసన ప్రస్తావించబడ్డాడు.  బ్రహ్మ వైవర్త, దేవీ ,స్కాంద పురాణాల్లో, కధాసరిత్సాగరం లోను సప్తమాతృకల ప్రస్తావన కన్పిస్తుంది.
                                            చాళుక్యరాజుల శాసనాల్లో సప్తమాతృకలు కన్పిస్తారు.కుషాణుల కాలం లో కన్పించే సప్తమాతృకల్లో వాహనాలు కాని , ప్రత్యేల క్షణాలు కాని  కన్పించవు. అనంతర కాలం లో అనేకమార్పులు చోటు చేసుకున్నాయి. క్రీ.శ .7 వ శతాబ్దానికి చెందిన ఒరిస్సా లోని పరమేశ్వరాలయం లో సప్తమాతృకల ఫలకం కన్పిస్తోంది. అనంతరం 8 ,9, శతాబ్దాల్లో  అలహాబాద్ ,ప్ట్నా ,పూనే ,  ఎల్లోరా, బేలూరు, కుంభకోణం లలో కన్పించే సప్తమాతృకలు   సంపూర్ణ లక్షణాలను సంతరించుకున్నాయి. పశ్చిమ చాళుక్యుల దేవాలయాల్లో సప్తమాతృకల శిలాఫలకాలు అనేకం దర్శనమిస్తాయి.
                       గుడిమెట్ట శిధిలాల్లో కన్పించిన ఈ ఫలకం  చోడనారాయణస్వామి ఆలయ శిథిలాల్లోది కావచ్చు. చాగి వంశానికి మాండలిక రాజ్య గౌరవాన్నిచ్చిన కులోత్తుంగ రాజేంద్రచోడుని పేరు మీదు గా చాగి పోతరాజు నిర్మించిన అలయం చోడనారాయణ స్వామి. (?). శిథిల భాగాల్లో వెలుగు చూసిన  ఈ ఫలకం ఇంత చరిత్రను తనలో దాచుకుంది.


                                                   -53-

                                  కృష్ణానది ఒడ్డున మరొకశిథిల దేవాలయం తూర్పు దిక్కుగా ఉన్నది కన్పిస్తోంది. ఈ ఆలయం నుండి మసీదు దిబ్బ వరకు  నేల పోతమన్ను తో శిథిల శిల్పాల రాసులతో , నల్లరాతి గుట్టలతో ఎత్తుపల్లాలుగా ఉంటుంది. ఈ గుడి ని ఆనుకొని కృష్ణ లోకి బాట ఏర్పడి ,రేవు గా ఉపయోగపడుతోంది. ఈ ఆలయం లో దేవుడు కూడ ఇక్కడ ఉన్న అన్ని ఆలయాల్లోని దేవుళ్ళ లాగానే గర్భగుడి నుండి పీకి వేయబడి అంత్రాలయం లోకి చేర్చబడ్డాడు. ఈ మూల విరాట్టు వామహస్తం తో చక్రాన్ని , దక్షిణ హస్తం తో శంఖాన్ని ధరించి , మిగిలినరెండు చేతులలో  కుడి చేతి లో అభయ ముద్ర ను , ఏడమ చేతి లో గద ను ధరించి , భక్తులను బ్రోచే ఛన్నకేశవుని అతి పురాతన శిల్పం. ఛన్నకేశవుడు హైహయ వంశీయుల ఇలవేల్పు. మాచర్ల ఛన్నకేశవుడు పల్నాటి యుద్దానికి ప్రత్యక్ష సాక్షి గా మిగిలిపోయాడు. కాకతీయుల సంప్రదాయం తో పాటు హైహయ వంశీయులతో ఉన్న సంబంధ బాంధవ్యాలతో  చాగివారి  చే నిర్మించబడిన ఆలయం ఇది. 
                                

                                                                                ఛన్నకేశవస్వామి

                         ఈ గుడి పైకప్పు పై కన్పించే పద్మాకృతి గల బండలు కాకతీయ శిల్పాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈయనతో పాటే పెకలించి బయట వేయబడిన కొన్ని ఆళ్వారుల విగ్రహాలు కూడ స్వామి తో పాటే పుష్కరాల వంటి పర్వదినాల్లో భక్తులు పెట్టే పసుపు కుంకాలతో మురిసి పోతుంటాయి.

                                                                    శిథిల ఆలయం
                        తల విరిగిన ఆల్వారు లను , తవ్వివేయబడిన గర్భాలయాన్ని , మూలకు నెట్టివేయబడిన సోమసూత్రాన్ని చిత్రం లో చూడవచ్చు. చిత్రం -9 .ఈ ఆలయ పరిసరాల్లో విరిగి పడిపోయిన ధ్వజస్ధంభ శిధిలాలు , దూరం గా మట్టిదిబ్బల్లో  మిగిలిపోయి కొంచెం కొంచెం కన్పించే రోళ్లు ఇంకా దూరం గా కన్పించే  పునాది గోడలు , పాటిమన్ను దిబ్బలు గతించిన చరిత్ర ప టం లో మచ్చలు గా మిగిలి పోయాయి.
                                                                    .........                వచ్చే భాగం లో   ద్వారక గుడి.
***********************************************