తెలుగు కావ్యాలలో శ్రీ లక్ష్మీ స్తుతి
శ్రీ మహాలక్ష్మి నిత్యానపాయిని. నారాయణుని శ్రీ మన్నారాయణు ని చేసిన లోకమాత.మంగళ స్వరూపిణి. . ఈ చరాచర సృష్టి అంతయు శ్రీ లక్ష్మీనారాయణుల సంకల్పాధీనమని పెద్దలంటారు..
శుభములకే శుభములనిచ్చెడి కల్పవల్లి శ్రీలక్ష్మి నిగూర్చి తెలుగు కవులు తమ కావ్యాలలో చేసిన స్తుతులను ఈ వ్యాసం లో చూద్దాము.
తెలుగు కావ్యాలను పరిశీలిస్తే ---- కేయూరబాహుచరిత్ర రచించిన మంచెన యే కావ్యాది లో శ్రీ లక్ష్మీదేవి ని స్తుతించే సంప్రదాయాన్ని ప్రారంభించాడు.
శ్రీ వసియించు, గాత, ,సుఖసిద్ధివహించి........ .సర్వపుణ్యా వహమైన గుండ సచివాగ్రణి గేహసరోవరంబునన్ “ అని కృతిభర్త కు ఆశీస్సు లందించాడు.
అనంతరం కవిసార్వభౌముడు శ్రీనాథుడు శివరాత్రి మాహాత్మ్యం లో--
“ మదనుగన్నతల్లి మాధవుని ఇల్లాలు
బ్రతుకులెల్లఁ దాచె పట్టి చూడ
ముఖ్యమైన లక్ష్మి ముమ్మడి శాంతాత్ము
మందిరంబు నందు
మసలు చుండు”
తన తొలికావ్యాల్లో లేని నూత్న సంప్రదాయాన్ని ఈ కావ్యం లో ప్రదర్శించాడు ఈశ్వరార్ఛన కళాశీలుడు. కనకాభిషేకాలు పొందిననాడు తెలియని ధనలక్ష్మి విలువను జీవన సంధ్యాసమయం లో గుర్తించిన మహాకవి శ్రీనాథుడు.
బమ్మెర పోతన భాగవత శేఖరుడు. శ్రీకైవల్యాన్ని కోరి కావ్య నిర్మాణం చేసిన కర్మయోగి. ఆయన తన భాగవతం లో కలుముల జవరాలి కి పెద్దపీటే వేశాడు.
“ హరికిన్ బట్టపుదేవి,పున్నెముల ప్రోవర్ధంపు పెన్నిక్క, చం
దురు తోబుట్టువు భారతీగిరి
సుతల్ తో నాడు పూబోణి తా
మర లందుండెడి ముద్దరాలు,ఝగముల్
మన్నించు నిల్లాలు,భా
సురతన్ లేములవాపు తల్లి సిరి
యిచ్చున్ నిత్య కళ్యాణమున్.”
హరికి పట్టపురాణియై,చంద్రునికి తోబుట్టువై, భారతీ గిరిసుతలతో ఆటలాడెడు ముద్దరాలై, జగములనేలెడి ఇల్లాలిని లేములబాపు తల్లి గా పోతన సంప్రార్ధన.
“ రాజు సహోదరుండు, రతిరాజు తనూజుడు, తండ్రి వాహినీ
రాజవరుండు, లోకముల రాజుగ
రాజితలీల నొప్పనా
రాజమరాళ యాన
సిరి................................
......................... రాజ్యరమారమణీయు జేయుతన్.”
ఆంటూ ప్రార్ధించాడు జక్కన.
వరాహ పురాణం లో నందిమల్లయ ,ఘంటసింగన లు శృంగారపరవశయైన రమాదేవి ని స్తుతించారు.
“ స్మరసమరంబునం పరవశత్వమునొంది మహేంద్రనీల భా
స్వరమగు దానవాంతకుని వక్షముపై నొరగంటఁ జక్కగా
నొరసిన హేమరేఖ వలెనున్న
రమారమణిని ..........”
దర్శించి ధన్యులైనారు యీ జంట కవులు. మదన సమరం లో అలసిపోయి మగని వక్షము మీద ఒరిగి న లక్ష్మీకాంత ను స్మరించిన జాణ తనము వీరిది.
రామాయణ కవయిత్రి మొల్ల కామునితల్లి గా కామితవల్లి శ్రీ మహాలక్ష్మి ని స్తుతించింది మొల్ల రామాయణం లో.......
“ సామజ యుగ్మ మింపలరఁ జల్లనినీరు పసిండికుండలన్
వే మఱు వంచి వంచి కడు వేడుక తో
నభిషిక్త జేయగా
దామరపూవు గద్దియ ముదంబున నుండెడి లోకమాత మా
కాముని తల్లి సంపద నఖండము గా నిడు మాకు నెప్పుడున్.”
మదపుటేనుగులు చల్లని నీటిని బంగారు పాత్రలతో అనేకమార్లు” వంచి వంచి” మిక్కిలివేడుక తో అభిషిక్తురాలిని చేయగా తామరపూల నివసించు లోకమాత గా లక్ష్మీదేవిని దర్శించింది కవయిత్రి మొల్ల.
నందితిమ్మన తన
పారిజాతాపహరణం లో, తాను వ్రాయ బూనిన పారిజాతాపహరణ కావ్యేతివృత్తం లోని సత్యభామ అలక –
శ్రీకృష్ణుఢు అలక తీర్చడం అనే అంశాలు ధ్వనించేటట్లుగా ---- అలక తీరి పులకాంకిత యౌతున్న
ఇందిరను దర్శింపజేశాడు.
“ సరసపుటల్క దీర్చు తఱి శార్జ్ఞ సుదర్శన నందకాబ్జ సం
భరణ గుణాప్తి నెన్నడుము పై, గటి పై,
జడ పై గళంబు పై
హరి నలుగేలు బైకొన సుఖాంబుధి
నిచ్చలు నోలలాడు నిం
దిర కృపజూచు గాత నరదేవ శిఖామణి
కృష్ణరాయనిన్.”
తెనాలి రామలింగడు గా ఉద్భటారాధ్య చరిత్ర ను రచించినా, అందులో “కలశాంభోనిధి యాడుబిడ్డ, శశికిన్ గారము తోబుట్టు ......” ఇత్యాది గా లక్ష్మీదేవిని స్తుతించి, తెనాలి రామకృష్ణునిగా పాండురంగమాహాత్మ్యాన్ని అందించిన మహానుభావుడు – రామకృష్ణకవి.
“అవతారమందె నే యఖిలైక జనయిత్రి
కలశ రత్నాకర గర్భసీమ
దోబుట్టువయ్యె నే యతులిత కాంచనవర్ణ వెలది
వెన్నెల గాయు వేల్పునకును
బాయకయుండు నే పరమ పావనమూర్తి
చక్రి
బాహా మధ్య సౌధసీమ
నభిషేకమాడు నే నభివర్ణితా చార
దిగ్గజానీతమౌ తేటనీట
నవనిధానంబు లే దేవి జవణి
సరకు
లమ్మహాదేవి శ్రీదేవి
యాదిలక్ష్మి”
అంటాడు పాండురంగవిభుడు." అతులిత కాంచన వర్ణ వెలది శ్రీమహాలక్ష్మి.--- "అనంతమైన బంగారు వన్నె గల స్త్రీమూర్తి ఆమె. ఆమె వెన్నెల కాయు వేల్పునకు తోబుట్టువట. ఎంతచక్కని భావనో చూడండి . అందుకే "పాండరంగవిభుని పదగుంఫనలు" అని తెలుగు జాతి ఆయన కవితాకన్య కు నివాళులర్పిస్తోంది.”చక్రి బాహామధ్య సౌథ వీథి బాయకయుండు పరమ పావనమూర్తి “యని న ఆ మహానుభావుని అభిభాషణ మిక్కిలి రమణీయముగా నున్నది.” విష్ణో :పరాం ప్రేయసీం,తద్వక్ష స్ధల నిత్యవాస రసికాం “ అని కదా ఆ తల్లిని భక్తులు ప్రార్ధించేది.కావుననే రామకృష్ణుని లక్ష్మీస్తుతి ఆవిధంగా సాగింది.
కలుముల జవరాలికి గడుసుదనాన్ని సంతరించి రమ్యరూప గా దర్శిస్తాడు నిరంకుశోపాఖ్యానం లో కందుకూరి రుద్రకవి..
“ కొమ్ముపై సవతి గైకొని నిల్చెనని నాథు
ఱొమ్ము పై నిల్చె నారూఢి మహిమ
నఖిల లోకాథీశుడగు
నాయకునిఁదెచ్చి
యిల్లటం బిచ్చి పుట్టింట నిలిపె
దనపేరు మున్నుగా ననిమిషాదుల చేత
బ్రణుతింపగా జేసె బ్రాణవిభుని
.......................................................
.........................................
చక్కదనమునఁ
నేరేడు జగములందు
సవతు గాంచని
సుతుగాంచె ధవుని కరుణ
దలపజెల్లదె
గుణధన్యఁ గలుషశూన్య
సాధుమాన్యఁ గృపానన్య జలథికన్య.”
ఆదివరాహ రూపం లో తన సవతియైన భూదేవిని కొమ్ము పై ధరించాడని, తాను పతి ఱొమ్ము పై కొలువు తీరిన ఆది గర్భేశ్వరి యట ఈమె. సమస్త లోకాథి నాథుని తన నాథుని చేసుకొని ఇల్లరికం తెచ్చుకొన్న జాణ ఈమె. బ్రహ్మాది దేవతల చేత తన నాథుని స్తుతింప జేయు సమయంలో తన పేరునే ముందుగా చేర్చి నాథుని పిలుచునట్లు గా చేసిన నైపుణ్యం ఈమెది. అందుకే ఆయన శ్రీ -మన్నారాయణుడు – శ్రీ –నివాసుడు యైనాడు. అంతే కాదు అట్టి శ్రీమన్నారాయణుని కరుణ తో పదునాలుగు లోకాలలోను తన కుమారుని తో పోల్చగల అందగాడు లేనంత సుందరూపుని పుత్రునిగా పొందిన మాతృమూర్తి. “గుణధన్య, కలుషశూన్య,సాధుమాన్య, “ గా జలథికన్య ను స్తుతించాడు రుద్రకవి.
వసుచరిత్ర కారుడు రామరాజభూషణుడు లక్ష్మీస్వరూపమే ఆమె తండ్రి, ,తనయుడు, సోదరుడు ,నాథుడు ఎవరో తెలియజేస్తోందని చమత్కరిస్తాడు. “జగదంబ,బద్మఁ గీర్తించెదన్ “అంటూ బైచరాజు పంచతంత్రం లో చేతులు జోడించాడు.
కకుత్థవిజయాన్ని వ్రాసిన మట్ల అనంతభూపతి ----- తన కావ్యం లో
“ మగని ఱొమ్మెక్కి నేకొమ్మ మనుచు వేడ్క
నమ్మహాదేవి
వాగ్దేవి యత్తగారు
మధుర శీతల సురభి
వాజ్ఞ్మయ తరంగ
తతుల మజ్ఝిహ్వఁ
బ్రవహింప దలచుగాత !”.
లక్ష్మీదేవి ని వాగ్దేవి కి అత్తగారు గా ప్రార్ధించి, ఆమెనుండి వాగ్వరాన్ని ఆశించాడు.
ఈ విధంగా ఆంధ్ర కవుల లక్ష్మీస్తుతి ని పరిశీలిస్తే, శ్రీ శబ్దాన్నే లక్ష్మీరూపానికి పర్యాయపదం గా చాలామంది ఉపయోగించారు. 15 వ శతాబ్దంలో నే లక్ష్మీస్తుతి ప్రత్యేకంగా కావ్యాది స్తోత్రాల్లో చోటు చేసుకున్నట్టు కన్పిస్తోంది.16,17 శతాబ్దాల్లో ఈ సంప్రదాయం అలానే కొనసాగినట్టు కన్పిస్తోంది
సకల సంపత్స్వరూపిణి యైన అ శ్రీ లక్ష్మిని సుత్తించి,తమ కృతిభర్త ఇంట్లో సదా నివసించాలని,ఆహవ జయశ్రీ లనందించాలని, ఇష్టార్ధసిద్ది కలిగించాలనీ, నిత్యకళ్యాణాల్ని, రాజ్యరమారమణత్వాన్ని సమకూర్చాలని వీరందరు సిరులిచ్చే తల్లిని చేతులెత్తి ప్రార్ధించారు.
............. దేవీం బాలార్కవర్ణాం సురముని వరదాం విష్ణుపత్నీం నమామి
.........