Monday, 26 May 2014

శతక సౌరభాలు - 2 ధూర్జటి కాళహస్తీశ్వర శతకము - 3


శతక సౌరభాలు  - 2
           
                             ధూర్జటి  శ్రీ కాళహస్తీశ్వర శతకము  - 3

         


           రాజై దుష్కృతి చెందె చందురుడు , రారాజై కుబేరుండు దృ
           గ్రాజీవంబున గాంచె దు:ఖము , కురుక్ష్మాపాలుడా మాటనే
           యాజిం గూలె సమస్త రాజబంధువులతో ,నా రాజ శబ్దంబు ఛీ
           ఛీ జన్మాంతరమందు నొల్లను జుమీ ! శ్రీ కాళహస్తీశ్వరా !
           
                ఈశ్వరా !రాజైన చంద్రుడు కళంకితుడైనాడు .రారాజైన కుబేరుడు ధనాధిపతి అయ్యు , కుడి నేత్రమును కోల్పోయి , పింగాక్షుడు గా మిగిలిపోయాడు. ( పార్వతీదేవి హరుని   అర్ధాంగి యై ఆయన తొడపై అందంగా కూర్చొని ఉండటాన్ని చూచిన కుబేరుడు ఆమె అదృష్టానికి  ఈర్ష్యాళువై , అసూయ తో  ఆమెను కుడి కంటి తో చూశాడట. అందువలన  కుబేరుని కుడికన్ను నీరుకారి పోయి , అనంతర కాలం లో పింగాక్షుడైనాడని పురాణ గాథ ) .  రాజరాజు గా పేరొందిన దుర్యోధనుడు  ,చివరకు యుద్ధము లో  సమస్త బంధు మిత్రులతో కలసి  నేలకూలాడు . అందువలన ఓ శంకరా .ఈ రాజ శబ్దమును  నేను జన్మాంతరమందు నైనను అంగీకరించను  సుమా !

        రాజర్ధాతురుడైనచో నెచట  ధర్మంబుండు  ? నే రీతి నా
        నాజాతి క్రియలేర్పడున్ ? సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు  ? రూ
        పాజీవాళి కి నేది దిక్కు ? ధృతి నీభక్తుల్ భవత్పాద నీ
        రేజంబుల్ భజియింతురే తెరగునన్ ? శ్రీ కాళహస్తీశ్వరా !
    
                శ్రీ కాళహస్తీశ్వరా  ! రాజు ధనదాహం గలవాడైనచో ఇంకా రాజ్యం లో ధర్మం ఎలా  నిలబడుతుంది . ఏ విధంగా వర్ణాశ్రమ ధర్మాలు  కొనసాగుతాయి . గౌరవ మర్యాదలతో జీవించే వారు ఏ విధంగా  సుఖంగా ఉండగలరు .  వార కాంతలకు   ఎవరు ఆధారమౌతారు . ధైర్యం తో నీ భక్తులు  ఏ విధంగా నిన్న్ను సేవించగలుగుతారు ప్రభూ !
         
                 తరగల్ పిప్పలపత్రముల్ మెఱుగుటద్దంబుల్ మరుద్దీపముల్
                 కరికర్ణాంతము లెండమావులతతుల్ ఖద్యోత కీటప్రభల్
                 సురవీధీ లిఖితాక్షరంబు లసువుల్  జ్యోత్స్నా పయ:పిండముల్
                 సిరులందేల మదాంధు లౌదురొ జనుల్ ; శ్రీ కాళహస్తీశ్వరా !

                             ఈశ్వరా  !  ఈ ప్రాణాలు  నీటి కెరటాలు , రావి ఆకులు ,  మెరిసే అద్దాలు , గాలిలో పెట్టిన దీపాలు , ఏనుగు చెవుల చివరి వలే  చంచలాలు  , ఎండమావుల సమూహాలు , మిణుగురు పురుగు కాంతులు , ఆకాశం లో వ్రాసిన వ్రాతలు , వెన్నెల లోని  పాల కాంతిను ప్రోగు చేసినట్లు అశాశ్వతాలు.  కాని ఈ జనులు ఈ విషయాన్ని లెక్కచేయక సిరి సంపదలచే మదాంధులై ప్రవర్తించుచున్నారు .   ఎంత ఆశ్చర్యము !

           నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ , నీకన్న నాకెన్న లే
           రన్నల్దమ్ములు , తల్లిదండ్రులు  గురుండాపత్సహాయుండు , నా
           యన్నా  యెన్నడు నన్ను సంసృతి విషాదాంబోధి  దాటించి య
           చ్ఛిన్నానంద సుఖాబ్ది దేల్చెదొ కదే ! శ్రీ కాళహస్తీశ్వరా ! 
              
                             శంకరా ! నేను నిన్ను నమ్మినట్లు గా ఇతరులను ఎవ్వరినీ నమ్మను . నీకన్న నాకు తల్లిదండ్రులు , అన్నదమ్ములు , గురుడు , స్నేహితుడు  అనే వారు ఎవ్వరూ లేరు .  ఓ స్వామీ  ! నన్ను ఈ సంసార మనే దుఖ సముద్రాన్ని  దాటించి  శాశ్వతానందమయమైన సుఖ సముద్రము లో నన్ను  ఎన్నడు ఓలలాడిస్తావో కదా స్వామీ !

          నీ పంచబడి యుండగా గలిగిన న్భిక్షాన్నమే చాలు ని
          క్షేపం బబ్బిన రాజకీటకముల నే సేవింపగా నోప ,నా
          శాపాశంబుల జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై ,బంటు గా
          చేపట్టం దయగల్గెనేని మదిలో  శ్రీ కాళహస్తీశ్వరా !
         
               ఈశ్వరా  !  నామీద దయచూపి  నన్ను నీ సేవకుడి గా  స్వీకరించు . నీ పంచ లో చోటు దొరికితే నాకు భిక్షాన్నమైనా చాలు . నిధి నిక్షేపాలిచ్చినా  హీనులైన రాజులను సేవించలేను .  సంసారం కొఱకు ఆశాపాశాలతో నన్ను త్రిప్పక  నీ బంటు గా  నన్ను స్వీకరింపుము .

         నీ పేరున్ భవదంఘ్రి తీర్ధము భవ న్నిష్ట్యూత తాంబూలమున్
         నీ పళ్లెంబు ప్రసాదమున్ గొని కదా  నే బిడ్డడైన వాడ న
         న్నీ పాటిం కరుణింపు మోప నిక నే నెవ్వారికిం బిడ్డగాన్
         చేపట్టందగు పట్టి మానదగదో ? శ్రీ కాళహస్తీశ్వరా !
         
                 పరమేశ్వరా  ! నీ పేరును స్మరిస్తూ , నీ పాదోదకమును స్వీకరిస్తూ , నీచే ఎంగిలి చేయబడిన  నీ పళ్ళెం లోని ప్రసాదాన్ని , తాంబూలాన్ని స్వీకరిస్తూ నేను నీ బిడ్డగానే పెరిగాను నేను ఇంకా ఎవ్వరికీ బిడ్డగా ఉండలేను .  చేపట్టి  తిరిగి వదిలివేయడం ధర్మం కాదు .  నన్ను నీ బిడ్డగా దగ్గరకు తీసుకోవలసింది స్వామీ !
        
         అమ్మా ! యయ్య యటంచు నెవ్వరిని నేనన్న న్శివా నిన్ను
         సుమ్మీ!   నీ మది తల్లి దండ్రులటంచు న్జూడగా బోకు నా
         కిమ్మైఁ  దల్లియుఁ దండ్రియున్ గురుడు నీవే కాగ సంసారపుం
         జిమ్మంజీకటి గప్పకుండ గనుమా ! శ్రీ కాళహస్తీశ్వరా !

                   ఓ శివా  ! నేను అమ్మా , అయ్య అని ఎవరినైనా పిలిచినను అది నిన్నే సుమీ . నీవు కాక నాకు తల్లి దండ్రులెవరున్నారు . నాకు తల్లి  ,తండ్రి , గురువు నీవే కాబట్టి  నన్ను ఈ సంసారమనే  కారు చీకటి కమ్మకుండా నీవే కాపాడవలసింది  స్వామీ !
       
         కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై
         కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ , వారిచే నే గతుల్
         వడసెన్ ? పుత్రులు లేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్
         చెడునే మోక్షపదం బపుత్రకునకున్ ? శ్రీ కాళహస్తీశ్వరా !

                 ఓ శంకరా !.ఈ లోకంలో కొందరు అవివేకులు బ్రతుకు మీద ఆశతో కొడుకులు పుట్టలేదని  విచారిస్తుంటారు . దృతరాష్ట్రునకు వందమంది కొడుకులు పుట్టలేదా  ?  వారి వలన అతనికి ఎటువంటి సద్గతులు కల్గినవి ?  పుత్రులు లేని శుకమహర్షి కి ఏ దుర్గతులు కల్గినవి ? కావున పుత్రులు లేని వారికి మోక్షము లభంచదనుట అవివేకము కదా !
                
          గ్రహదోషంబులు  దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్ర
          త్యహమున్ బేర్కొను  నుత్తమోత్తముల బాధంబెట్టగ నోపునే
          దహనుం గప్పగజాలునే శలభ సంతానంబు ;  నీ సేవ చే
          సి హతక్లేశులు గారు గాక మనుజుల్ ; శ్రీ కాళహస్తీశ్వరా !
  
                           శ్రీ కాళహస్తీశ్వరా గ్రహదోషము వలన కలిగెడి దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామమును ఎల్లప్పుడు జపించెడి  ఉత్తములైన నీ  భక్తబృందమును  బాధపెట్టలేవు కదా . ఎట్లనగా ముడతల గుంపు  అగ్ని హోత్రుని ఆర్పలేవుకదా . అదే విధంగా నిను సేవించెడి మానవులను కష్టములు దరి చేరవు కదా  ప్రభూ !
                                   శ్రీ కాళహస్తి లో నిర్వహించే రాహు కేతు పూజలకు ఈ విశ్వాసమే ప్రేరణ యై ఉండవచ్చు.

      అడుగం బోనిక నన్యమార్గ రతులం  బ్రాణావనోత్సాహినై ,
      యడుగంబోయిన బోదు నీదు పద పద్మారాధక శ్రేణియు
      న్నెడకు నిన్ను భజింపగా గనియు  నాకేలా పరాపేక్ష కో
      రెడి దింకేమి భవత్ర్పసాదమె తగున్ ! శ్రీ కాళహస్తీశ్వరా !   ( 30 )

                                శ్రీకాళహస్తీశ్వరా !  .ప్రభూ  !  నేను  ప్రాణ రక్షణ కోసం నిన్ను కాకుండా ఇతరులను సేవించువారిని  యాచించను .  అంతగా యాచించవలసివచ్చిన నీ భక్తులను మాత్రమే అర్థించెదను .  అయినా నిన్ను సేవించెడి నాకు ఇతర వాంఛలు ఏముంటాయి ?. నీ అనుగ్రహ ప్రసాదం తప్పితే నాకు ఇంకేమి  అక్కరలేదు స్వామీ !

                                     .చదువు తూ .. ఉండండి .  మరికొన్ని అందిస్తాను.



*********************************************************************************