శతక
సౌరభాలు - 2
ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర
శతకము - 3
రాజై దుష్కృతి చెందె చందురుడు , రారాజై
కుబేరుండు దృ
గ్రాజీవంబున గాంచె దు:ఖము , కురుక్ష్మాపాలుడా మాటనే
యాజిం గూలె సమస్త రాజబంధువులతో ,నా
రాజ శబ్దంబు ఛీ
ఛీ జన్మాంతరమందు నొల్లను జుమీ ! శ్రీ కాళహస్తీశ్వరా !
ఈశ్వరా !రాజైన చంద్రుడు కళంకితుడైనాడు .రారాజైన
కుబేరుడు ధనాధిపతి అయ్యు , కుడి నేత్రమును కోల్పోయి , పింగాక్షుడు గా
మిగిలిపోయాడు. ( పార్వతీదేవి హరుని
అర్ధాంగి యై ఆయన తొడపై అందంగా కూర్చొని ఉండటాన్ని చూచిన కుబేరుడు ఆమె
అదృష్టానికి ఈర్ష్యాళువై , అసూయ తో ఆమెను కుడి కంటి తో చూశాడట. అందువలన కుబేరుని కుడికన్ను నీరుకారి పోయి , అనంతర కాలం
లో పింగాక్షుడైనాడని పురాణ గాథ ) .
రాజరాజు గా పేరొందిన దుర్యోధనుడు
,చివరకు యుద్ధము లో సమస్త బంధు
మిత్రులతో కలసి నేలకూలాడు . అందువలన ఓ
శంకరా .ఈ రాజ శబ్దమును నేను జన్మాంతరమందు
నైనను అంగీకరించను సుమా !
రాజర్ధాతురుడైనచో నెచట ధర్మంబుండు ? నే రీతి నా
నాజాతి క్రియలేర్పడున్ ? సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు ? రూ
పాజీవాళి కి నేది దిక్కు ? ధృతి నీభక్తుల్ భవత్పాద నీ
రేజంబుల్ భజియింతురే తెరగునన్ ? శ్రీ కాళహస్తీశ్వరా !
శ్రీ కాళహస్తీశ్వరా ! రాజు ధనదాహం గలవాడైనచో ఇంకా రాజ్యం లో ధర్మం ఎలా నిలబడుతుంది . ఏ విధంగా వర్ణాశ్రమ ధర్మాలు కొనసాగుతాయి . గౌరవ మర్యాదలతో జీవించే వారు ఏ
విధంగా సుఖంగా ఉండగలరు . వార కాంతలకు
ఎవరు ఆధారమౌతారు . ధైర్యం తో నీ భక్తులు
ఏ విధంగా నిన్న్ను సేవించగలుగుతారు ప్రభూ !
తరగల్ పిప్పలపత్రముల్
మెఱుగుటద్దంబుల్ మరుద్దీపముల్
కరికర్ణాంతము లెండమావులతతుల్
ఖద్యోత కీటప్రభల్
సురవీధీ లిఖితాక్షరంబు
లసువుల్ జ్యోత్స్నా పయ:పిండముల్
సిరులందేల మదాంధు లౌదురొ జనుల్
; శ్రీ కాళహస్తీశ్వరా !
ఈశ్వరా ! ఈ ప్రాణాలు నీటి కెరటాలు , రావి ఆకులు , మెరిసే అద్దాలు , గాలిలో పెట్టిన దీపాలు ,
ఏనుగు చెవుల చివరి వలే చంచలాలు , ఎండమావుల సమూహాలు , మిణుగురు పురుగు కాంతులు
, ఆకాశం లో వ్రాసిన వ్రాతలు , వెన్నెల లోని
పాల కాంతిను ప్రోగు చేసినట్లు అశాశ్వతాలు.
కాని ఈ జనులు ఈ విషయాన్ని లెక్కచేయక సిరి సంపదలచే మదాంధులై ప్రవర్తించుచున్నారు
. ఎంత ఆశ్చర్యము !
నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ ,
నీకన్న నాకెన్న లే
రన్నల్దమ్ములు , తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు , నా
యన్నా యెన్నడు నన్ను సంసృతి విషాదాంబోధి దాటించి య
చ్ఛిన్నానంద సుఖాబ్ది దేల్చెదొ కదే ! శ్రీ కాళహస్తీశ్వరా !
శంకరా ! నేను నిన్ను నమ్మినట్లు గా
ఇతరులను ఎవ్వరినీ నమ్మను . నీకన్న నాకు తల్లిదండ్రులు , అన్నదమ్ములు , గురుడు ,
స్నేహితుడు అనే వారు ఎవ్వరూ లేరు . ఓ స్వామీ ! నన్ను ఈ సంసార మనే దుఖ
సముద్రాన్ని దాటించి శాశ్వతానందమయమైన సుఖ సముద్రము లో నన్ను ఎన్నడు ఓలలాడిస్తావో కదా స్వామీ !
నీ పంచబడి యుండగా గలిగిన న్భిక్షాన్నమే
చాలు ని
క్షేపం బబ్బిన రాజకీటకముల నే సేవింపగా
నోప ,నా
శాపాశంబుల జుట్టి త్రిప్పకుము
సంసారార్ధమై ,బంటు గా
చేపట్టం దయగల్గెనేని మదిలో శ్రీ కాళహస్తీశ్వరా !
ఈశ్వరా ! నామీద దయచూపి
నన్ను నీ సేవకుడి గా స్వీకరించు .
నీ పంచ లో చోటు దొరికితే నాకు భిక్షాన్నమైనా చాలు . నిధి నిక్షేపాలిచ్చినా హీనులైన రాజులను సేవించలేను . సంసారం కొఱకు ఆశాపాశాలతో నన్ను త్రిప్పక నీ బంటు గా
నన్ను స్వీకరింపుము .
నీ పేరున్ భవదంఘ్రి తీర్ధము భవ
న్నిష్ట్యూత తాంబూలమున్
నీ పళ్లెంబు ప్రసాదమున్ గొని కదా నే బిడ్డడైన వాడ న
న్నీ పాటిం కరుణింపు మోప నిక నే
నెవ్వారికిం బిడ్డగాన్
చేపట్టందగు పట్టి మానదగదో ? శ్రీ కాళహస్తీశ్వరా !
పరమేశ్వరా ! నీ
పేరును స్మరిస్తూ , నీ పాదోదకమును స్వీకరిస్తూ , నీచే ఎంగిలి చేయబడిన నీ పళ్ళెం లోని ప్రసాదాన్ని , తాంబూలాన్ని
స్వీకరిస్తూ నేను నీ బిడ్డగానే పెరిగాను నేను ఇంకా ఎవ్వరికీ బిడ్డగా ఉండలేను
. చేపట్టి తిరిగి వదిలివేయడం ధర్మం కాదు . నన్ను నీ బిడ్డగా దగ్గరకు తీసుకోవలసింది స్వామీ
!
అమ్మా ! యయ్య యటంచు నెవ్వరిని నేనన్న న్శివా నిన్ను
సుమ్మీ! నీ మది తల్లి దండ్రులటంచు
న్జూడగా బోకు నా
కిమ్మైఁ దల్లియుఁ దండ్రియున్ గురుడు నీవే కాగ సంసారపుం
జిమ్మంజీకటి గప్పకుండ గనుమా ! శ్రీ కాళహస్తీశ్వరా !
ఓ శివా ! నేను అమ్మా , అయ్య అని ఎవరినైనా పిలిచినను అది నిన్నే సుమీ . నీవు కాక
నాకు తల్లి దండ్రులెవరున్నారు . నాకు తల్లి ,తండ్రి , గురువు నీవే కాబట్టి నన్ను ఈ సంసారమనే కారు చీకటి కమ్మకుండా నీవే కాపాడవలసింది స్వామీ !
కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ ,
వారిచే నే గతుల్
వడసెన్ ? పుత్రులు లేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ ? శ్రీ కాళహస్తీశ్వరా !
ఓ శంకరా !.ఈ లోకంలో కొందరు అవివేకులు బ్రతుకు మీద
ఆశతో కొడుకులు పుట్టలేదని విచారిస్తుంటారు
. దృతరాష్ట్రునకు వందమంది కొడుకులు పుట్టలేదా
? వారి వలన
అతనికి ఎటువంటి సద్గతులు కల్గినవి ? పుత్రులు లేని శుకమహర్షి కి ఏ దుర్గతులు
కల్గినవి ? కావున పుత్రులు లేని వారికి మోక్షము లభంచదనుట
అవివేకము కదా !
గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ
కళ్యాణ నామంబు ప్ర
త్యహమున్ బేర్కొను నుత్తమోత్తముల బాధంబెట్టగ నోపునే
దహనుం గప్పగజాలునే శలభ సంతానంబు
; నీ సేవ చే
సి హతక్లేశులు గారు గాక మనుజుల్
; శ్రీ కాళహస్తీశ్వరా !
శ్రీ
కాళహస్తీశ్వరా ! గ్రహదోషము
వలన కలిగెడి దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామమును ఎల్లప్పుడు జపించెడి ఉత్తములైన నీ
భక్తబృందమును బాధపెట్టలేవు కదా .
ఎట్లనగా ముడతల గుంపు అగ్ని హోత్రుని
ఆర్పలేవుకదా . అదే విధంగా నిను సేవించెడి మానవులను కష్టములు దరి చేరవు కదా ప్రభూ !
శ్రీ
కాళహస్తి లో నిర్వహించే రాహు కేతు పూజలకు ఈ విశ్వాసమే ప్రేరణ యై ఉండవచ్చు.
అడుగం బోనిక నన్యమార్గ రతులం
బ్రాణావనోత్సాహినై ,
యడుగంబోయిన బోదు నీదు పద పద్మారాధక శ్రేణియు
న్నెడకు నిన్ను భజింపగా గనియు
నాకేలా పరాపేక్ష కో
రెడి దింకేమి భవత్ర్పసాదమె తగున్ !
శ్రీ కాళహస్తీశ్వరా !
( 30 )
శ్రీకాళహస్తీశ్వరా ! .ప్రభూ ! నేను
ప్రాణ రక్షణ కోసం నిన్ను కాకుండా ఇతరులను సేవించువారిని యాచించను .
అంతగా యాచించవలసివచ్చిన నీ భక్తులను మాత్రమే అర్థించెదను . అయినా నిన్ను సేవించెడి నాకు ఇతర
వాంఛలు ఏముంటాయి ?. నీ అనుగ్రహ ప్రసాదం తప్పితే నాకు
ఇంకేమి అక్కరలేదు స్వామీ !
.చదువు తూ .. ఉండండి . మరికొన్ని అందిస్తాను.
*********************************************************************************
No comments:
Post a Comment