Saturday, 8 December 2012

శ్రీ చెన్నకేశవస్వామి అంటే ...........


            శ్రీ   చెన్నకేశవస్వామి   అంటే..........
                               
          
                 శ్రీ చెన్నకేశవుడు తెలుగునాట 10శతాబ్దం లో అవతరించిన దేవతా సార్వభౌముడు. పల్నాటి వీరుల కొలుపు లందు కొంటున్నవీర దైవత మూర్తి ఈయన. 
              శంఖ చక్ర గదా పద్మ ధారిణే దోషహారిణే
               పరతత్త్వ స్వరూపాయ  పంచవ్యూహాయ  మంగళమ్.!”
                    అంటూ భక్తకోటి చే మంగళాశాసనాలందుకొంటున్న ఆర్తులపాలిట ఈ కొంగుబంగారం పురాణ వాజ్ఞ్మయం లో కన్పించడంలేదనే చిన్నసందేహాన్ని విచ్ఛిత్తి  చేస్తే ఈ వ్యాసానికి రూపం వచ్చింది.
         
                  సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి అని  చతుర్వింశతి కేశవనామాలతో నిత్యము శ్రీ మహావిష్ణువు ని  ఆరాధించే ముముక్షువులు చెన్నకేశవుని మోహనరూపాన్ని చూచి మురిసిపోతున్నారు.


                                  శ్రీకాకుళ ఆంద్రమహావిష్ణువు
                                         
                   స్వామి చేతుల్లో      శంఖ చక్రాలు తారుమారు గా ఉండటం గమనించవచ్చు             
                 
              “ 
             జితకోటి స్మరోత్తజ్ఞ సౌందర్యాజ్ఞ విలాసినే
             బ్రహ్మాండ సార్వభౌమాయ భవ్యవృత్తాయ మంగళమ్.!”
                              అంటూ కైమోడ్పు లర్పిస్తున్నారు. శంఖ చక్ర గదాధారుడై పద్మాంకిత అభయహస్తం తో ఆర్తజనులను ఆదుకొనే స్వామి చెన్నకేశవుడు. పుంసాం మోహనరూపుడైన ఆ ఆది నారాయణమూర్తి రూపమే జగన్మోహనము కాగా ఆయనయే జగన్మోహిని యైతే ఆది శంకరుడే మెత్తని చిత్తము కలవాడైనాడని భాగవతం చెపుతోంది. మగువ మరగి సగమయినమగవాడు (శంకరుడు) ఆమోహిని వయోరూపగుణవిలాసములు ఊరింప,  ఈ లీలావతిం జేరగా ఏ కాంతుండు గలండో! క్రీడలకు నాకీ యింతి సిద్ధించునే? యని వెంటబడి తుదకు ధరణి వీర్యంబు వడఁ దన్నుదానెఱింగ దేవమాయాజడత్వంబు తెలిసి కొన్నాడు హరుడు అని ఈ ఘట్టంలో పోతనామాత్యుని తెలుగుసేత.
                         
                              సుందరరూపుడైన కేశవుని సృజించడానికి మహాకవులు చేసిన ప్రయత్నమే 10 వ శతాబ్దం చివర లోనే మహాశిల్పులు చేసి నిరూపించారు.అమరశిల్పి జక్కన అద్భుతసృష్టి బేలూరు చెన్నకేశవాలయం. హోయసల రాజుల నిర్మాణంగా బేలూరు చెన్నకేశవాలయం   చరిత్ర లో ప్రసిద్ధపొందింది. వీరి పరిపాలనా కాలం 10, 11 శతాబ్దుల మధ్య భాగంగా పరిశోధకులు నిరూపించారు.
                    చెన్ను శబ్దము నిఘంటువులలో అందము,కాంతి ,విధము, సౌందర్యము అనే అర్ధాలలో చెప్పబడింది.చెన్నుడు అంటే అందగాడు అని కూడ స్పష్టంగా ఆంద్రదీపిక చెపుతోంది. కేశవుని అత్యంత సుందరరూపుని గా తీర్చిదిద్ది చెన్నకేశవుని  చేసిన ఖ్యాతి  అపూర్వమై, ,  హోయసల రాజుల    కీర్తి ని అజరామరం చేసింది.
                     
                                       శంఖ చక్రాలను కుడి ఎడమ చేతుల్లో తారుమారు గాధరించి, గదాధారుడై, అభయహస్తంలో పద్మాన్ని దాల్చిన సుందరరూపుడైన చెన్నకేశవుడు దక్షణ భారతం లో దర్శన మిస్తున్నాడు. కార్యమపూడి యుద్దరంగంలో జై చెన్నకేశవా”! నినాదం దిక్కుల పిక్కటిల్లిన కాలం శా.శ 1098-1104 మధ్యకాలంగా చరిత్ర చెపుతోంది. అంటే పల్నాటి యుద్ధం 11 వ శతాబ్దం లోనిది. కాగా చెన్నకేశవుడు పల్నాటి వీరుల ఇలవేల్పు గా కన్పిస్తాడు. అంతేకాదు చెన్నుడు అంటే మాచర్ల చెన్నుడు అని నిఘంటువులు ఘంటాపథం గా
చెపుతున్నాయి. అంటే పల్నాటి వీర చరిత్ర కు – తెలుగునాట చెన్నకేశవ ప్రాదుర్భావానికి సంబంధం ఉన్నదనేది యధార్ధం.
                                ఈ గాథ పల్నాటి వీర చరిత్ర లో అనుగు రాజు  పల్నాటి సంపాదనము అనే ఉపశీర్షిక దగ్గర ప్రస్తావించ బడింది.కనకాద్రి చెన్నకేశవుడు అనుగు రాజు ఇలవేల్పు. ఆ కథ ఇలా సాగుతుంది.
                
                            ఉత్తరహిందూదేశం లోని పాలమాచాపురి అనే పట్టణానికి పరిపాలకుడు అనుగురాజు.అతడు కార్తవీర్యార్జునుని వంశమువాడు.అతడొక రోజున తన పురాకృత పాపాలను కడిగి వేసుకోవడానికి విప్రులను పిలిచి వారికి భూరి దానాలను ఇచ్చుచుండగా, వారి ఇలవేల్పు కనకాద్రి చెన్నకేశవుడువృద్ధ బ్రాహ్మణుని రూపం లో ఆ సభ లోనికి వచ్చి ఓ రాజా !ఇంతకు  పూర్వము కార్తవీర్యార్జునుడు జమదగ్ని ని చంపిన పాపము, బ్రహ్మహత్యాదోష మై నిన్ను వెంటాడు చున్నది.నీవు ఆ వంశము వాడివి . కావున ఆదోషము పోవడానికి నల్లని   వస్రాలు ధరించి, తీర్ధయాత్రలు చేస్తూ, సకల తీర్ధాల్లోను స్నానమాడి, దివ్యక్షేత్రాలను దర్శించి సేవించ వలెననియు, ఏ తీర్ధస్నానము వలన నీ నల్లని బట్టలు తెల్లబడతాయో అప్పుడు  నీ పాపము తొలగి పోవుననియు బోధించెను.
                    
                          చెన్నకేశవుని ఆజ్ఞను శిరసావహించి తీర్ధయాత్రలకు బయలు దేరాడు అనుగు రాజు. అనేక తీర్ధక్షేత్రాలను సేవిస్తూ, బెజవాడ కృష్ణా నది లో స్నానమాడి దుర్గమ్మను కొలిచి, తరువాత  “మోటుపల్లె వద్ద సముద్ర స్నానం చేయగా అతని నల్లని వస్త్రాలు  తెల్లగా మారాయి.  అందుకు ఆనందించిన అనుగు రాజు ఆంద్రదేశాన్ని వదిలి వెళ్లలేకపోయాడు. అదే సమయంలో చందవోలు ను పాలిస్తున్న పృధ్వీశుడు తన కుమార్తె మైలమాదేవి ని అనుగు రాజు కిచ్చి బాంధవ్యం కలుపుకున్నాడు. అంతే కాకుండా తనకుమార్తె పసుపు క్రింద అరణంగా పల్నాడును అనుగు రాజు కిచ్చాడు. కొద్దికాలం గురజాల లో ఉండి తిరిగి తన నగరానికి అంటే పాలమాచాపురి కి బయలుదేరాడు అనుగు రాజు. కాని చెన్నకేశవుడు అతనికి కల లో కన్పించి, కార్తవీర్యార్జునుని పాపం తో పంకిలమైన పాలమాచాపురి కి వెళ్లవద్దని ఇక్కడే ఉండవలసిందని ఆజ్ఞాపించాడు.
                       ఇచ్చోట నిలిచెద మిద్దర మిపుడు
                         తీరుగా కట్టించు దేవళ మొకటి           
              అని కూడ ఆజ్ఞాపించాడు. అనుగురాజు వెంటనే చెన్నునికి ఆలయం కట్టించాడు.
                             చెన్నకేశవునకు చెలువ గ్గలింప
                             కోవెల గట్టించె గురజాల లోన
                  ఇది చెన్నకేశవుడు ఆంద్రదేశం లో అడుగుపెట్టిన ఇతిహాసం. ఈ చరిత్ర లో కొన్నియెడల చారిత్రకాధారాలు కథ కు అడ్డుగా నిలుస్తున్నాయన్నారు ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు.
       
                        పై కథ నుబట్టి చెన్నకేశవుడు పాలమాచాపురి నుండి అనుగురాజు ను ఆదుకోవడానికి గురజాల లో ఆవిర్భవించాడు. ఈ పాలమాచాపురి  నే జంభలాపురి ని కూడ పిలువబడుతోంది.ఇదే నేటి మధ్యప్రదే శ్ లోని  జబల్పూర్ అయి ఉండవచ్చని విమర్శకులు భావించారు. హోయసల రాజుల సృష్ఠి బేలూరు. హైహయవంశములోని వాడు అనుగురాజు. పలనాటి హైహయులు పశ్చిమ చాళుక్యుల కు సామంతులు గా ఉన్నారు.బేలూరు చెన్నకేశవుడు ప్రాచీన దైవము కాగా గురజాల చెన్నకేశవుడు పల్నాటి వీరుల ఇలవేల్పు గా రూపుదాల్చాడు.
              
                            చెన్నబసవడు వీరశైవ మత బోధకుడుగా చారిత్రక వ్యక్తి. ఈయనను కుమారస్వామి అవతారం గా వీరశైవులు భావిస్తారు.11 వశతాబ్దం ఉత్తర భాగం 12 వ శతాబ్దం  చివరి భాగం వరకు ఆంధ్రదేశచరిత్ర లో రాజకీయంగా, మతపరంగా కూడ మిక్కిలి చెడ్డకాలంగా చరిత్ర చెపుతోంది.శైవ వైష్ణవ భేదాలు తారాస్ధాయిని అందుకున్నాయి. పల్నాటి యుద్ధమే శైవ వైష్ణవ తగాదాల వలన సంభవించిందన్నంత గా ఈ పరిణామం వ్యాపించింది. నాగమ్మ శైవాన్ని సమర్ధించగా, బ్రహ్మన్న వైష్ణవాన్ని పోషించాడు. చెన్నమల్లిఖార్జునుడు చెన్నబసవడు వీరశైవులకు ఆరాధ్యదైవాలు కాగా,----వైష్ణవులు చెన్నకేశవుని దర్శించి,పూజించి ,తరించారు.
                       
                      అయితే చెన్న శబ్దం ఛన్న శబ్దానికి వికృతి యని కొందరివాదన.కేశవుడు వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరు పేర్ల తో పిలువబడు తున్నాడు. శ్రీకాకుళం లోఆంధ్ర మహా విష్ణువని ,ఆంద్రనాయకు డని, కాకు ళే శ్వరుడని, తెలుగురాయడని పిలువబడుతుండగా,పెదపులివర్రు లో వరదరాజస్వామి యనికర్లపాలెం లో జనార్దనస్వామి యని, మరికొన్నిచోట్ల  చెంగల్వరాయుడని,సుందరరాజస్వామి యని పలురీతులు గా పిలువ బడుతున్నాడు.ఈ విధంగా ప్రచ్ఛన్నరూపుడై యుండుటచే  కేశవుణ్ణి ఛన్నకేశవుడని కూడ  కొందరు పిలుస్తున్నారు.
                      


                               శ్రీ కాకుళం ఉపాలయం లో శ్రీ చెన్నకేశవస్వామి
                

                   చెన్నకేశవుని చేతిలో శంఖ చక్రాలు తారుమారు గా ఉండటానికి కారణాన్ని వెతికి, గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ప్రస్తావిస్తున్నారు చెన్నుని భక్తులు. గజేంద్రుణ్ణి రక్షించడానికి హడావుడి గా బయలుదేరిన శ్రీ మహావిష్ణువు శంఖ చక్రాలను తారుమారు గా పట్టుకున్నాడని వీరివాదన. కాని భాగవతం లో గజేంద్ర మోక్ష ఘట్టం లో శ్రీ మహా విష్ణువు  ఆయుధాలే లేకుండా బయలుదేరాడని గదా మన పోతన్న చెప్పింది.కాబట్టి చెన్నకేశవుడు భాగవతం లో కన్పించడు.
                    
                          యుద్ధభూమి లో ముందుగా శంఖాన్ని పూరించి , అనంతరం యుద్ధానికి పూనుకుంటారు కాబట్టి శంఖాన్ని కుడి చేతి లో ఉంచి చక్రాన్ని ఎడమ  చేతిలోనికి  విగ్రహ స్రష్ట లు  అంటే శిల్పులు మార్చి ఉంటారని ఒక వాదన.  వాదన బాగానే ఉంది ,కాని సాక్ష్యాలు కావాలి కదా.!
                పల్నాటి వీరచరిత్ర  లో--- ఓ కలినాశా అని అనుగురాజు చెన్నకేశవుని ప్రార్ధించాడంటే నే ఈయన కలియుగ దైవంగా చెప్పకయే చెప్పినట్లైంది కదా.!
                      
                         “ నాగమ్మ కుటిలనీతి ముందు బ్రహ్మన్న రాజనీతి రక్తపుమడుగుల్లో తడిసి పోయింది. కార్యమపూడి చెన్నకేశవాలయం,”” వీరుల గుడులు”” మాచర్ల చెన్నుడు చరిత్ర లో మిగిలి పోయారు.
                           అదృష్ఠ పూర్వ వస్త్రైశ్చ చిత్రమాణిక్య భూషణై
                            దేదీప్య మాన దేహాయ దేవ దేవాయ మంగళమ్.
                              

                       *******************ఇతి శమ్**********************

No comments: