అరణ్య వాసంలో ఉన్న శ్రీ రామునకు అంగళీయకం ఎక్కడిది.?
అరణ్య వాసానికి బయలుదేరిన రామలక్ష్మణులు ఆభరణాలు పట్టువస్త్రాలు వదిలేసి, నారచీరలు ధరించారు. కాని వశిష్ఠుని ఆదేశం, దశరథుని అనుజ్ఞ తో సీతమ్మ మాత్రం పట్టువస్త్రాలు,ఆభరణాలను ధరించింది. ఇంటికి పెద్దకోడలు నారచీరలు ధరించడం కుటుంబానికి అనర్ధమని , దానిని నివారించమని దశరథునకు వసిష్ఠుని నిర్ధేశం.
అంటే - రామ
లక్ష్మణులు నిరాభరణులై నారవస్త్రాలు
ధరించారు. కాని కిష్కింథ కాండ లో వానరసైన్యాన్ని సీతాన్వేషణకు పంపుతూ రామచంద్రుడు
ఆంజనేయునికి అంగుళీయకాన్ని అందించాడు. సీతాదేవి కన్పిస్తే ఆమెకి ఆ ముద్దుటుంగరాన్ని తనగుర్తుగా
చూపించమని కూడ ఆదేశించాడు.
సుందరకాండ
లో అశోకవనం లో ఉన్న సీతాదేవి ఆ ఉంగరాన్ని
చూసే ఆంజనేయుణ్ణి రామదూత గా అంగీకరించింది. తన చూడామణి ని తిరిగి అభిజ్ఞానంగా
రామచంద్రుని చెంతకు పంపించింది.
కాని ఇక్కడ రామాయణ
పాఠకులలోను, రామాయణ కవుల లోను ఒకసందేహం వెంటాడుతూనే ఉంది. సమాధానం ఎక్కడుందా? అని వెతుకుతూనే ఉన్నారు. సమాధానం ఉంటుంది. ఎందుకంటే వాల్మీకి మహాకవి మీద వారికి అంత
నమ్మకం.కాని ఆ సమాధానం ఎక్కడుందో కన్పడ్డంలేదు. కొంతమంది వెతుకు తుంటే మరికొంతమంది బయటపడిపోయారు.
“ అంగుళీయకమ్ము
అనిలాత్మజునకిచ్చె
రాముడంటి వేమి
వ్రాతలయ్య
నగలు విడిచినాడు నార
వస్త్రాలతో
నున్నవానికున్నెయుంగరమ్ము”
అని ప్రశ్నిస్తారు వాల్మీకి ని ఆచార్య గుదిమెళ్ల
రామానుజాచార్య తన” రామాయణ రహస్యాలు” అనే కావ్యంలో. కాని ఇక్కడ విచిత్రమేమిటంటే మనలాంటి సామాన్యులకే ఇటువంటి అనుమానాలొస్తుంటే – రామాయణాన్ని ఆద్యంతం అ వలోఢనం చేసి వ్యాఖ్యానాలు రాసిన మహానుభావులు వీటిని వదిలిపెడతారా.?
గోవింద రాజీయ
వ్యాఖ్యలో కిష్కింథ ,సుందర కాండల్లో ఈ అంగుళీయక ప్రస్తావన వచ్చినప్పుడు వేరు వేరు
మాటల్లో ఒకే భావాన్ని అందించారు.
“ రామనామాంకిత మంగుళీయకం
సీతాయా:
కదాచిద్రావణాగమనాత్పూర్వం
ప్రణయప రత్వేన రామేణ స్వీకృతమితి
బోధ్యం “ 1
“ యద్వా-భార్యా స్నేహేన
కనిష్టికాయాం సదా ముద్రికా ధార్యత ఇతి దేశాచార:” 2
“ యద్వా- వివాహ కాలే జనకేన దత్త మిదం వరాలంకారత్వేన “ 3
కిష్కింథ-
-చతుర్వాఖ్య –పు .211
అంటూ మూడు కారణాలను
ఊహించారు. ఇది కిష్కింథకాండ లోని
ప్రస్తావన.
రామనామాంకితమైన ఆ అంగుళీయకం సీతాదేవి
దని, మారీచమృగం రావడానికి ముందు ప్రణయపరత్వం లో రాఘవుడు సీతాదేవి చేతి నుండి
తీసుకొని ఉంటాడని భావించారు. 1
అలా కాకపోతే -- భార్య మీద ఉన్న
అనురాగానికి నిదర్శనం గా చిటికెన వ్రేలు కి
ఎల్లప్పుడు ఉంగరాన్ని ధరించడం
దేశాచారమై ఉండవచ్చు. 2
కాదంటే -- వివాహసమయం లో మామగారైన జనకుని చేత వరాలంకారంగా ఇవ్వబడిందనే
అభిమానం తో దానిని అలా
ఉంచుకొని ఉండవచ్చు.3
--- అంటూ మూడు ఉపపత్తులతో సమర్థింప యత్నించారు వ్యాఖ్యానకారులు. అనంతర
కాల కవులు, విమర్శకులు మొదటి ఉపపత్తి నే ఎక్కువగా సమర్థించినట్లు కన్పిస్తోంది.
అంతేకాకుండా –“ ననుత్యక్తం సకలధనస్య వన్యవృత్యా వర్తమానస్య
కుతోఅంగుళీయకమితి చేత్ ఇదమేకం ఏతత్కార్యార్థం రక్షితవాన్
“ వాల్మీ. 4.చతుర్వాఖ్య.211
అంటూ నిర్మొహమాటం గా చెప్పేశారు.
అన్ని నగలు వదిలేసి వనవాస దీక్షతీసుకున్న రామునికి ఉంగర మెందుకు అని
ప్రశ్నిస్తే -- ఈ ప్రయోజనం కోసమే నని
చెప్పవచ్చు. ఇక్కడ ఆంజనేయుడి కివ్వడానికే దాన్ని రాముడు ధరించి ఉన్నాడట.
రామాయణ మహాకావ్యంలో యాగసంరక్షణ సమయంలో సుబాహుని చంపి మారీచుని చంపకుండా
వదిలివేయడానికి, శూర్పణఖ లాంటి రాక్షసి కి
నాసికాఖండనం మాత్రమే చేసి వదిలివేయడానికి ఉన్న
ప్రయోజనాలే --- ఇక్కడ రాఘవుడు
అంగుళీయకం థరించడానికి కూడ ఉన్నాయి.