Wednesday, 23 October 2013

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు -2 కుచేలోపాఖ్యానం



  శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు 2
                        

                           కుచేలోపాఖ్యానం
                   
                  






                                  కుచేలోపాఖ్యానానికి భాగవత ఉపాఖ్యానాలలోనే ఒక ప్రత్యేకత  ఉంది.   దీని లోని ఇతివృత్తం తెలుగు వారి కుటుంబ జీవనానికి దగ్గరగా ఉండటమే  అందుకు ప్రథాన కారణం.  స్నేహబంథం ఎంత  పవిత్రము,ధృఢమైనదో  ఈ ఉపాఖ్యానం  చెపుతుంది. నారద భక్తి సూత్రాలు చెప్పిన నవవిధ భక్తి మార్గాలలో సఖ్యభక్తి కి నిలువెత్తు నిదర్శనం ఈ ఉపాఖ్యానం.అంతే కాకుండా భగవంతుడు తనను నమ్మిన భక్తుణ్ణి   ఏ విధంగా బ్రోచి,  ఆదరించి, అంకాన చేర్చుకుంటాడో తెలియ జెప్పే ఉపాఖ్యానం  ఇది. గురుదేవుల  ఆశీస్సులు  శిష్యకోటి కి ఎటువంటి అమృత ఫలాలను   అందిస్తాయో కూడ కుచేలోపాఖ్యానం లో మనం చూడవచ్చు.  
       
               కన్నబిడ్డల కోసం, వారి ఆకలిని తీర్చడం కోసం తల్లిదండ్రులు అభిమానాన్ని కూడ వదులుకొని అయినవారి చెంతకు  వెళ్లడానికి ఎంతగా సిద్ధమౌతారో ఈ ఉపాఖ్యానం  నిరూపిస్తుంది.
           
                   అన్నింటి కంటే దుస్సహ దరిద్రాన్ని అనుభవిస్తూ కూడ,  కడుపు కక్కూర్తికి, కాసుకి ఆశ పడి తన కావ్యాన్ని అమ్ముకోనని  రాచరికపు వ్యవస్థను తిరస్కరించి, కైటభ దైత్యమర్థనుని గాదిలి కోడలైన  భారతి యొక్క కాటుక కంటి వేడి కన్నీటిని కొనగోట మీటి ఓదార్చిన భాగ్యశాలి యైన  కవి పోతన జీవితం - కుచేలుని జీవితానికి దగ్గరగా ఉండేదనే భావన కూడ   ఈ ఉపాఖ్యానాన్ని తెలుగు వారికి దగ్గర చేసింది.
            
                       నా విషయానికి వస్తే ఈ ఉపాఖ్యానానికి ఒక ప్రత్యేకత ఉంది. హైస్కూలు చదువు పూర్తయి, వేసవి సెలవల్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా జేజమ్మ గారు  (నాయనమ్మ అమ్మ గారు )  నాకు కాలేజీ పుస్తకాలకు  డబ్బులిచ్చే ఒప్పందం మీద  నాచేత చదివించుకున్న  పుస్తకాలలో మొల్ల రామాయణం తరువాత   మరువలేనిది  ఈ కుచేలోపాఖ్యానం .
         
      మా తాతగారు  ( అంటే జేజమ్మ గారి భర్త )  చతుర్వేదాథ్యాయి. మహాపండితుడు. ఆయన ఇల్లే  ఒక వేదపాఠశాల గా ,ఎప్పుడూ ఇంటినిండా శిష్యులతో కళకళ లాడుతుండేదట. అందుకని ఈవిడకు కూడ  శాస్త్ర , కావ్య అథ్యయన అవగాహన ఉండేది. శిష్యులు  వేదపనస చెప్పుకుంటుంటే వంటచేసుకుంటూనే  ఈవిడ  స్వరాలను  సరిచేసేదని చెప్పుకునేవారు. అయితే వయసు  పది ఎనిమిదులు దాటి, చూపు, ఓపిక తగ్గడం తో అటువంటి   ఆవిడకు చదివి వినిపించే అదృష్టం నాకు కలిగింది ఆనాడు.
                
            ఆనాడు నేను చెరకు రసం తీసే యంత్రాన్ననుకుంటే ఆవిడ ఇక్షురసాన్ని  ఆస్వాదించే అదృష్టశాలి గా నాకు ఇప్పుడు అనిపిస్తోంది. నాకు అక్షరాలు, వాక్యాలు చదవడం మాత్రమే  తెలుసు. అందులోని స్వారస్యాన్ని గ్రహించే  వయసు గాని,  అర్థంచేసుకోవాలనే తపన కాని నాలో ఉండేవి కావు. కాని నేను చదువుతున్నప్పుడు  ఆ భగవంతుని లీలలను వింటూ ఆవిడ పొందే తాదాత్మ్యత  ఆవిడ కళ్లల్లో స్పష్టంగా కనిపించేది. ఒక్కొక్కసారి ఆ  ఆనందాన్ని ఆపుకోలేక  నాకు అర్థం కాదని తెలిసి కూడ  ఆ విషయాన్ని నాకు వివరిస్తూ, ఆనందించేవారు. కాని ఆ రోజుల్లో ఆవిడ పొందిన ఆ ఆనందం ఇప్పుడర్థమౌతోంది. అంతేకాదు. తన భావాలను తెలుసుకోలేని ఒక బాలునితో  చెపు తున్నానని కూడ ఆవిడకు  తెలుసు.కాని ఆ భావాలు ఆపుకోలేనివి . అవి పంచుకుంటేనే ఆనందం.

                        ఎందుకంటే ఒకానొక సమయం లో మన మనసులో పెల్లుబికిన భావజాలాన్ని  పంచు కోగలిగిన  మనిషి లేనపుడు ఆ సమయం ఎంత ఘోరంగా ఉంటుందో ఆ స్థితిని  అనుభవించిన వారికి తెలుసు. ఆ అనుభవంతోనే మహాకవి భవభూతి అ రసికాయ   కవిత్వ నివేదనం శిరసి మా లిఖ మా లిఖ మా లిఖ  అన్నాడు.
         
                         కుచేలుడు శ్రీకృష్ణుని బాల్యసఖుడు. సహాథ్యాయి. అభిమాన ధనుడు. విజ్ఞాని. రాగద్వేష రహితుడు. శాంతుడు. ధర్మవత్సలుడు. జితేంద్రియుడు.బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. తన గృహం లో దారిద్ర్యం తాండవిస్తున్నా ఎవరినీ యాచించకుండా ప్రాప్తమైన కాసునే పదివేల దీనారాలు గా భావించి  భార్యాబిడ్డలను పోషిస్తున్నమానధనుడు.
         
                        ఆతని ఇల్లాలు పరమ పతివ్రత.సద్వంశ సంజాత. తల్లిదండ్రులు జీవించేది, సంపాదించేది తమ బిడ్డల కోసమే గదా. అటువంటి బిడ్డలే  బక్కచిక్కి, ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ, ఆకుగిన్నెలను పట్టుకొని, అమ్మా!  పట్టెడు అన్నం పెట్టమని  తన చెంతకు వచ్చి ప్రాథేయపడుతుంటే ఆమాటలకు చెవుల్లో శూలాలు  దించినట్లు బాధ పడేది ఆ ఇల్లాలు.
        
                          భర్త అభిమానవంతుడు,ఒకరిని యాచించడని తెలిసి కూడ  బిడ్డల ఆకలి బాధను చూడలేక  ప్రాణనాథుని చేరి, దారిద్య్రమనే ఈ పెనుచీకటి నుండి బయటపడే మార్గం చూడవలసిందని ప్రార్థించింది. శ్రీకృష్ణుడు మీ చిన్ననాటి స్నేహితుడు.  ఆయనను దర్శించిన యెడల హరికృపాకటాక్షమనే రవికాంతి తో ఈ దరిద్రమనే అంధకారాన్ని దాట గల మని కూడ సూచించింది.
      
                 వరదుడు,సాధు భక్తజన వత్సలుడు,  ఆర్తశరణ్యుడు, దయాసముద్రుడు లక్ష్మీనాథుడు అయిన మాథవుడు యాదవుల చేత సేవించబడుతూ ద్వారకలో ఉన్నాడు కదా!  మీరు వెళితే చాలు. మిమ్మల్ని చూడగానే ఆ మహానుభావుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే – కలలో కూడ తనను స్మరించని కష్టాత్ముడు కూడ విపత్కర పరిస్థితుల్లో ఒక్కసారి ఆ భక్తజనమందారుని పాదపద్మాలను మనసారా స్మరిస్తే చాలు .కరుణించి కటాక్షిస్తాడు. అవసరమైతే తనను తానే సమర్పించుకుంటాడు. అటువంటి మహనీయుడు నిరంతరం  భక్తి తో తనను సేవించే వారికి సమస్త సంపదలను ఇవ్వకుండా ఉంటాడా ?. సునిశ్చల భక్తిన్ భజియించువారి కిడడే సంపద్విశేషోన్నతుల్ ?  అంటుంది కుచేలుని ఇల్లాలు. ( 10-ఉ-971)
           
                             ఈ  నమ్మకము ,విశ్వాసమే పోతన్నను నడిపించింది. సత్కవుల్ హాలికులైన నేమి ?   గహనాంతర సీమల కందమూలగౌద్దాలికులైన నేమి? నిజదారసుతోదర పోషణార్థమై అనిప్రశ్నించింది.  ఇమ్మను జేశ్వ రాథముల అని కూళలు వంటి పాలకులను త్రోసి పుచ్చింది.
           
                    అందుకే  ఇల్లాలి సూచనతో తో కుచేలుడు శ్రీకృష్ణుని చెంతకు బయలుదేరాడు.  చెలికానికి కానుకగా  ఇల్లాలు తన శిథిలవస్త్రపు కొంగున  కట్టి ఇచ్చిన కొన్ని పృథుక తండులాలను తీసుకొని  గోవింద దర్శనోత్సాహియై ద్వారక మార్గం పట్టాడు. 
                            
              కాని కుచేలుని ఎదలో సందేహాల తుమ్మెదలు రొద చేస్తూనే ఉన్నాయి. ద్వారక లోకి ఎలా వెళ్లగలను. అంతపురం లోని శ్రీకృష్ణుని ఎలా దర్శించుకోగలను. ద్వార పాలకులు అడ్డగిస్తే , కటికిదరిద్రుడనైన నేను వారికి  ఏమి  బహుమతి ఇవ్వగలను . అయినా ఆ స్వామి అనుగ్రహమే కదా నాకు రక్ష! ఇలా అనుకుంటూనే ద్వారకకు చేరి, వీథులు దాటి స్వర్ణ మయ సౌథం లో సతీమణి తో సరసాలాడుతున్న మన్మథ మన్మథుడైన శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోగలిగాడు కుచేలుడు.  మనకు కూడ ఆ  పరమాత్మ దివ్యరూప సందర్శనా భాగ్యాన్ని కల్గించి ధన్యుడయ్యాడు భక్తకవి పోతన.
              
                       గజేంద్రమోక్షం లో అల వైకుంఠ పురంబు లో నగరిలో ఆమూల సౌథంబు దాపల నున్న హరిని దర్శించి,మనకు దర్శింపచేసిన పోతన మహాకవి ద్వారకలో శ్రీకృష్ణుని ఇలా దర్శించాడు.
       
        ఇందీవరశ్యాము, వందిత సుత్రాముఁ, గరుణాలవాలు,భాసురకపోలుఁ
       గౌస్తుభాలంకారుఁ,గామితమందారు ,సురుచిరలావణ్యు ,సురశరణ్యు,
       హర్యక్షనిభమధ్యు, నఖిలలోకారాథ్యు,ఘనచక్రహస్తు ,జగత్ప్రశస్తు,
      ఖగకులాధిపయాను ,గౌశేయపరిధానుఁ బన్నగశయను ,నబ్జాతనయను,               
              మకరకుండల సద్బూషు ,మంజుభాషు ,నిరుపమాకారు , దుగ్దసాగరవిహారు ,
             భూరిగుణసాంద్రు ,యదుకులాంభోధి చంద్రు,విష్ణు, రోచిష్ణు జిష్ణు ,సహిష్ణు, గృష్ణు.

        


   
            రుక్మిణీనాథుని దివ్యమంగళ విగ్రహాన్నిమనసార దర్శించి, తనివి తీర వర్ణించాడు.(10-ఉ-979)
          
               అంత:పురం చెంతకు చేరిన ఆ కుచేలుని  చూచిన శ్రీకృష్ణుడు  తనపాన్పు పై నుండి లేచి    కుచేలునకు ఎదురెళ్లి సాదరంగా కౌగిలించుకొని, బంధుప్రేమ తో తోడ్కొని వచ్చి తన హంసతూలికా తల్పం మీద కూర్చోపెట్టుకున్నాడు.  బంగారుపాత్రలో నిండిన కస్తూరీ పరిమళ మిళితమైన సుగంధ జలాలతో  కుచేలుని పాదాలను,  కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు ఆ యోగీశ్వరేశ్వరుడు.
      
                    పచ్చకర్పూరం కస్తూరీ కలిపిన మంచిగంధాన్ని కుచేలుని శరీరానికి అలమి. అగరు థూపం వేసి,మార్గాయాసం పోయేటట్లు రుక్మిణీదేవి వీవన తో విసురుతుండగా, మణిమయ దీపాలతో మంగళ హారతులు సమర్పించి, పూలమాలను శిఖ లో తురిమి. కర్పూరతాంబూలాన్నిచ్చి, ధేనువు ను సమర్పించి, కుశలప్రశ్నలతో  స్వాగతించాడు కుచేలుణ్ణి  శ్రీకృష్ణుడు. అతని అదృష్టాన్ని చూచి రుక్మిణీదేవి యొక్క అంత:పుర కాంతలు ఆశ్చర్య పోయారట.
                  
          రమానాథుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకొని,చిన్ననాటి గురుకుల వాసపు రోజులను గుర్తుచేసుకున్నాడు.  ఈ సందర్భం లో జగద్గురువైన శ్రీకృష్ణపరమాత్మ  గురువుల గొప్పదనాన్ని ఈ విధం గా  ప్రస్తావిస్తాడు.
   
 “ *(మన) గురువు అజ్ఞానమనే చీకటికి దీపం వంటివాడు. అనంతమైన బ్రహ్మానందానుభవం లో నిమగ్నమైన మనసు కలవాడు గురువు. సత్కర్మ పరాయణుడు. విప్ర శ్రేష్టుడు. పుణ్యాత్ముడు. పండిత వందనీయుడు.

* సకలవర్ణాశ్రమాల వారికి నేను విజ్ఞానప్రదుండనైన గురువునై ఉండికూడ గురుసేవ పరమధర్మమని లోకానికి తెలియ చెప్పడానికే నేను గురుసేవ చేశాను.
·                   
                           *  నేనే  బ్రాహ్మణులలో కెల్ల ముఖ్యుడనై సకలవర్ణాలకు,ఆశ్రమాలకు జ్ఞానప్రదాత నై ప్రకాశిస్తూ ఉంటాను.
·         ఆయా వర్ణాలకు చెందిన జ్ఞానులు సమస్తలోకాలకు గురువు నైన నా మాటలనే ఆలకించి, నా పాదపద్మాలను స్మరిస్తూ సంసార సాగరాన్ని తరిస్తారు.
·               
          * సకల భూతాత్మకుడనైన నేను తపో దాన యజ్ఞ దాన వ్రతాదుల వలన సంతోషించను. పరమభక్తి తో గురువులను పూజించేవారినే  నేను గౌరవిస్తానని ప్రకటిస్తాడు శ్రీకృష్ణుడు.            
       
          గురుకులం లో ఉండగా జరిగిన ఒకనాటి సంఘటనను గుర్తు చేసి, దాని వలన తాము పొందిన గురువుల ఆశీర్వచనాన్ని కూడ  కుచేలునితో కలసి పంచుకున్నాడు  మాథవుడు.   ఆ వృత్తాంత మిది.        
  
              గురుకులం లో ఉండగా ఒకరోజు గురుపత్ని ఆజ్ఞానుసారం శ్రీకృష్ణ కుచేలురిధ్దరూ కట్టెలు కోసం అడవికి వెళ్లారు.ఆ రోజు భయంకరమైన సుడిగాలితో జడివాన కురిసింది. వాననీటి తో ఎత్తుపల్లాలు సమానమై పోగా, దిక్కు తెలియక, దారి తప్పి, చలిగాలి కి వణికిపోతూ, ఒకరి చేతిని ఒకరు ఊతగా చేసుకొని ఆ స్నేహితులిద్దరూ రాత్రంతా అడవిలో తిరుగుతూనే గడిపారు.  క్రమంగా సూర్యోదయమైంది.

          తెలతెలవాఱెడి వేళం, గల గల మని పలికెఁ బక్షిగణ మెల్లెడలన్
       మిలమిలని ప్రొద్దుపొడుపున , ధళధళ మను మెఱుఁగు దిగ్వితానము నిండెన్.(1002)
       
           ఉదయ కాంతులు పరుచుకుంటున్న వేళ గురువు గారైన సాందీపని  కృష్ణ కుచేలులను వెతుకుతూ అరణ్యానికి వచ్చారు. చలిలో వణుకుతున్న వీరిని చూచి --
   
         “శిష్యులుగా మీ ఋణం మీరు తీర్చుకున్నారు .ఇక మీద మీకు అపారమైన ధన దార బహుపుత్ర సంపదలు, దీర్ఘాయురున్నతులూ, జయాభ్యుదయాలు  కలుగుతాయని ఆశీర్వదించారు గురుదేవులు. ( 10-ఉ-1004 )
         
       గురుదేవుల ఆశీస్సు ఫలించి,ధన దార సంపదలు శ్రీకృష్ణుని చేరగా, బహుపుత్ర లాభం మాత్రం కుచేలునికి ప్రాప్తించాయి. ఇప్పుడు లక్ష్మీనాథుని దర్శనం తో  దారిద్య్ర మోచనం జరిగి, గురువుల ఆశీర్వచనం కుచేలుని యెడల కూడ  నిజం కాబోతోంది.
               
           ఇంతసేపు శ్రీకృష్ణుని సేవలతో చేష్టలుడిగి ఉండిపోయిన కుచేలుడు నెమ్మదిగా తేరుకొని దామోదరా!  నీవు త్రిజగద్గురుడవు. నీకు గురువు అనే వారెవ రుంటారు . ఇదంతా నీలీలలే కాని వేరుకాదు గదయ్యా! అన్నాడు.
     
               శ్రీకృష్ణుడు కుచేలుని మాటల్లోని ఆంతర్యాన్ని   గ్రహించిన వాడై చిరునవ్వు తో నీవు ఇక్కడకు  వస్తూ నాకేమి బహుమానం తెచ్చావు. నా భక్తుడు భక్తి తో నాకు ఏమిచ్చినా నేను ఆనందం గా  స్వీకరిస్తాను. అన్నాడు.
  
   “ దళమైనఁ బుష్పమైనను, ఫలమైన సలిలమైనఁ బాయని భక్తిన్
   గొలిచిన జను లర్పించిన , నెలమిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్. (1010)

                  ఆ మాటలకు ఆనందిస్తూనే  కుచేలుడు సకలైశ్వర్యప్రదాత యైన లక్ష్మీనాథునకు తాను తెచ్చిన అటుకులను ఇవ్వడానికి ముఖం చెల్లక తలవంచుకొని మౌనంగా ఉండిపోయాడు.    కాని సర్వాంతర్యామి యైన   రమాథవుడు కుచేలుడు వచ్చిన కారణాన్ని  తెలుసుకొని, ఇతను పూర్వజన్మలో ఐశ్వర్యకాముడై  నన్ను సేవించలేదు. కాని ఇప్పడు భార్య మాట విని ఆమె సంతోషం కోసం నా వద్ద కు వచ్చాడు.ఇతనికి ఇంద్రాదులకు 
మించిన సంపద నిన్వాలని నిర్ణయించు కున్నాడు. దైవం తలచుకుంటే సంపదలకు కొదవా! అని కదా  సామెత.

                  కుచేలుని శిథిల వస్త్రపు కొంగున ముడివేసిన అటుకులను ఒక పిడికెడు తీసుకొని ఆరగించాడు శ్రీకృష్ణుడు.మరొక పిడికెడు తీసుకోబోతుంటే స్వామీ ! అతనికి సకల సంపదలను ఇవ్వడానికి మీరు తిన్న అటుకులే చాలు.” నని రుక్మిణీ దేవి స్వామిని  సున్నితంగా వారించింది.

                  కుచేలుడు  ఆ రాత్రి కి  ఇందిరారమణుని మందిరం లోనే  స్వర్గభోగానుభవంగా  భుజించి, నిద్రించి, వేకువ లోనే లేచి, కాలోచిత కార్యాలు ముగించుకొని,  శ్రీకృష్ణుడు కొంత దూరం సాగ నంపగా, నందనందనుని సందర్శనమనే మహదానందాన్ని మననం చేసుకుంటూ  తన నగరానికి బయలుదేరాడు.

                అచ్యుతుడు, అవ్యయుడు నైన  శ్రీకృష్ణుడు తనను ఇంతగా సత్కరించాడు గాని  ధనమేమీ ఇవ్వలేదు. దరిద్రుడు సంపన్నుడైతే తన్ను సేవించడని అనుకొని ఉంటాడు. లేకపోతే ఆశ్రిత జనరక్షకుడు నన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేయకుండా ఉంటాడా?” అని వితర్కించుకుంటూనే తన నగరంలోని  తన ఇంటిముందుకు చేరుకున్నాడు కుచేలుడు.

                   అక్కడున్నలక్ష్మీనివాస సన్నిభమైన మహాసౌథాన్ని చూచి, ఆశ్చర్య పోతుండగానే, దేవకాంతల వంటి యువతుల ఎదురొచ్చి స్వాగతం పలికి, అంత:పురం లోకి తీసుకెళ్లారు.అచ్చట మానవరూపం ధరించిన మహాలక్ష్మి వలే  ఉన్న కుచేలుని ఇల్లాలు   వచ్చి, భర్త పాదాలకు నమస్కరించి, మనస్సులోనే కౌగిలించుకున్నదట.ఎంత గంభీరమైన సన్నివేశాన్నిఎంత సుందర సుకుమారం గా ఆవిష్కరించాడో మహాకవి చూడండి.

                      ఆనాటి నుండి ఆ సతీపతులిద్దరు మాథవుని అనుగ్రహం తో ప్రాప్తించిన ఆ అనంత ఐశ్వర్యానికి ఎంతో ఆనందించి,  ఆనాటి నుండి హరి నామస్మరణ మరువకుండా జీవించసాగారు.

                         భక్తి కలిగిన ఉత్తములు సమర్పించినది కొంచెమైనా భగవంతుడు దానిని కోటానుకోట్లుగా భావించి స్వీకరించి, భక్తులను అనుగ్రహిస్తాడనటానికి నా వృత్తాంతమే ఉదాహరణ అనుకున్నాడు కుచేలుడు.  ఆనాటి నుండి  రాగద్వేషాదుల కతీతుడై, నిర్వికారుడై,  సమస్త క్రియలను అనంతుని యందు సమర్పణ చేస్తూ, జీవయాత్ర సాగించి తుదకు పుణ్య లోకాలను చేరుకున్నాడు కుచేలుడు.

    ఈ వృత్తాంతం విన్నవారికి ఇహ పరసుఖాలు, హరిభక్తి,  అజరామరమైన కీర్తి  ప్రాప్తించుగాక !                 
       యని  శుకమహర్షి  దివ్యవచనం.

    “కారుణ్యసాగరుండైన గోవిందుని చరణారవిందంబులయందుల భక్తి  ప్రతి భవంబునఁ గలుగుంగాక ! యని  కుచేలుని సంప్రార్థన.