శతక
సౌరభాలు - 5
సుమతీ శతకము - 2
ఒల్లని
సతి , నొల్లని పతి
నొల్లని చెలికాని విడువనొల్లని వాడే ,
గొల్లండు గాక ధరలో
గొల్లండును గొల్లడౌనె గుణమున సుమతీ !
ఓ సుమతీ ! తనను భర్త గా అంగీకరించని ఆడదానిని , తను చేసే పనులు నచ్చని , లేక మెచ్చుకోని యజమానిని , తన స్నేహాన్ని అంగీకరించని స్నేహితుని
విడిచిపెట్టడానికి అంగీకరించని వాడే
తెలివితక్కువ వాడు లేక మూర్ఖుడు ,వాడే
వెర్రివాడు అనిపించుకుంటాడు కాని యాదవకులం లో పుట్టినంత మాత్రాన వెర్రిగొల్ల కాడు కదా.!
ఈ పద్యం పాల్కురికి సోమనాథుని పండితారాథ్య చరిత్ర లోని ద్విపద కు కందపద్యానువాదం గా శ్రీ నిడదవోలు వెంకటరావు గారు ఉదాహరించారు.
''ఒల్లని వెలయాలి నొల్లిని నృపతి
నొల్లని చెలి బాయ నొల్లడేనియు ను
గొల్లడు వాడెగా కెల్లెడజాతి
గొల్లఁడు గొల్లండె గొల్లఁడేనియు ను ''
ఓడల
బండ్లును వచ్చును
ఓడలు
నా బండ్ల మీద నొప్పుగ వచ్చున్
ఓడలు
బండ్లును వలెనే
వాడంబడుఁ
గలిమి లేమి వసుధను సుమతీ !
ఓ సుమతీ !
నీటిలో ఓడల మీద బండ్లును ,
నేలపై బండ్ల మీద పడవలును అవసరాన్ని అనుసరించి ప్రయాణించినట్లుగానే ఈ భూమి మీద కలిమి లేములనేవి కూడ బండి చక్రము నందలి ఆకుల వలే క్రిందకు , పైకి పరివర్తన
చెందుతుంటాయి . ఒక ఘడియ లో భాగ్యవంతుడు దరిద్రుడు
కావచ్చు .ఒక దరిద్రుడు తెల్లవారేసరికి ఐశ్వర్య వంతుడు కావచ్చు. లోకం లో ఏవీ స్థిరములు , శాశ్వతములుకావనే విషయాన్ని జీవుడు గుర్తుంచు కోవాలి .
కడు
బలవంతుడైనను
బుడమినిఁ బ్రాయంపుటాలిఁ
బుట్టిన యింటన్
దడవుండ
నిచ్చెనేనియుఁ
బడుపుగ
నంగడికిఁ దానె పంపుట సుమతీ !
ఓ సుమతీ ! ఎంత బలవంతుడైనను
వయసులో ఉన్న భార్యను ఎక్కువకాలం పుట్టింటిలో
ఉండనిచ్చినట్లయితే తానే స్వయంగా
ఆమెను పడుపువృత్తికి పంపినట్లవుతుంది.
అందువలన వివాహమైన స్త్రీలు ఎక్కువ కాలం పుట్టింటిలో ఉండకూడదని పెద్దలు
చెపుతారు. “సుదతులు పుట్టినింటను పెద్దకాలమునికి తద్ద తగదు ” అంటాడు మహర్షి కణ్వుడు కుమార్తెయైన శకుంతలతో ఆంధ్ర మహా బారతం లో.
కప్పకు
నొరగాలైనను
సప్పమునకు
రోగమైన , సతి తులువైనన్ ,
ముప్పున
దరిద్రుడైనను
దప్పదు
మఱి దు:ఖ మగుట తథ్యము సుమతీ !
ఓ సుమతీ ! కప్పకు కాలు విరగడం , పాము కు రోగం రావడం ,
దుష్టురాలైన భార్య , ముసలితనం లో దారిద్ర్యమనేవి మిక్కిలి దు:ఖాన్ని కల్గిస్తాయి.
కనకపు
సింహాసనమున
శునకముఁ
గూర్చుండఁబెట్టి శుభలగ్నమునం
దొనరగ
బట్టము గట్టిన
వెనుకటి
గుణమేల మాను వినరా సుమతీ !
ఓ సుమతీ ! కుక్కను తీసుకొనివచ్చి ఒక మంచి ముహూర్తం లో
బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభి షేకం చేసినా దాని సహజగుణాలను ఏ విధంగా
మానలేదో అదే విధం గా నీచులకు అదృష్టవశాన
ఉన్నతపదవి లభించినా , వాడు నీచ బుద్ధులను మానలేడు గదా !
కమలములు
నీటఁ బాసిన
గమలాప్తుని
రశ్మి సోకి కమలిన భంగిన్
దమ
దమ నెలవులు దప్పినఁ
దమ
మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ !
ఓ సుమతీ ! కమలాప్తుడు అంటే
సూర్యుడు. కమలములకు బాగా కావలసిన వాడు . ఆ
సూర్యుని కిరణాలు సోకితేనే పద్మాలు
వికసిస్తాయి. వాటిల్లో చైతన్యం కలిగి
పరిమళ భరితమౌతాయి.
అటువంటి పద్మాలను పూజకోసమో , ఏదైనా
వేరు ప్రయోజనం కోసమో కోసి ,నీటి నుండి వేరు చేసి ఒడ్డున పెట్టామనుకోండి . ఏ సూర్య
కిరణాలు నీటిలో ఉండగా ఆహ్లాదాన్ని
కల్గించాయో అవే సూర్యకిరణాల వేడికి
పద్మాలు వాడి , వడిలి కమిలి పోతాయి.
అదే విధంగా ఈ భూమి మీద జీవులు తమ తమ స్థానాలను మారినప్పుడు మితృలు శతృవులు గా మారిపోతారు .
ఇది యధార్థము.
వలపు :----
కవి గాని వాని వ్రాతయు
నవరస భావములు లేని నాతుల
వలపుం
దవిలి చను పందినేయని
వివిధాయుధ కౌశలంబు వృథరా
సుమతీ !
ఓ సుమతీ. నవరస భావముల తో రమ్యంగా వర్ణించలేని కవి కాని వాని వ్రాతలు , స్త్రీలు పురుషుల యెడ ప్రదర్శించే ప్రేమ , ( నిజం కాదని , కవి అభిప్రాయం ).పరుగెత్తుతున్న
పందిని వేయలేని వివిధాయుధ నైపుణ్యము ప్రయోజనం
లేనివి. అనగా వ్యర్థములని యర్థము.
రెండవ పాదం లో “ నాతుల వలపు’’ అనే చోట సమన్వయ లోపం
ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే తరువాత పద్యం లో కూడ “ లేదు సుమీ సతుల వలపు ’’ అని స్త్రీల ప్రేమ
నిజం కాదని చెప్పడానికి ప్రయత్నించాడు. ఇక్కడ స్త్రీల ను గురించి కవి చెప్పిన అభిప్రాయాలు ఆనాటి సమాజం లో గాఢం
గా నాటుకుపోయిన అభిప్రాయాలే కాని సార్వజనీనాలు కావని గ్రహించాలి.
భాస్కర శతక కారుడు
వ్రాసిన అంగన నమ్మరాదు .... అనే పద్యాన్ని ఇంతకు ముందే చదువు కున్నాం.
కాదు
సుమీ దుస్సంగతు
పోదు
సుమీ కీర్తికాంత పొందిన పిదపన్
వాదు
సుమీ యప్పిచ్చుట
లేదు
సుమీ సతుల వలపు లేశము సుమతీ !
ఓ సుమతీ ! చెడ్డవానితో స్నేహము మంచిది కాదు. కీర్తి అనేది ఒకసారి వచ్చిన తరువాత పోదు. అంటే మంచిపేరైనా ,చెడ్డపేరైనా వస్తే తరువాత
పోదు. ఒకరికి అప్పు ఇవ్వడమంటే వారితో తగవును కోరి తెచ్చుకోవడమే. ఆడవారి
వలపు లో నిజము కొంచెము కూడ ఉండదు.
కారణము లేని నగవును,
బేరణము
లేని లేమ ,పృథివీస్థలిలోఁ
బూరణము
లేని బూరెయు
వీరణము
లేని పెండ్లి వృథరా సుమతీ !
ఓ సుమతీ ! ఈ భూమి మీద కారణము లేకుండా నవ్వడం , అనగా వెకిలి
నవ్వు , రవిక లేని ఆడది , పూర్ణము లేని
బూరె , వీరణమనెడి మంగళవాద్యము లేని
వివాహపు తంతు పరిపూర్ణం కావు. అవి పనికి
రానివి , వ్యర్థమైన వని కవి భావన.
తెలుగునేల మీద
కొన్నికుటుంబాలలో వివాహకార్యక్రమం లో భాగం
గా వీరణం
పెట్టడమనే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.
ఇల్లాలు
కులకాంత
తోడ నెప్పుడుఁ
కలహింపకు, వట్టి తప్పు ఘటియింప కుమీ
కలకంఠి
కంట కన్నీ
రొలికిన
సిరి యింట నుండ నొల్లదు సుమతీ !
ఓ సుమతీ.! ఇంటికి దీపం
ఇల్లాలని మన పెద్దల మాట. అటువంటి ఇల్లాలి తో ఎన్నడు తగవు లాడ కూడదు. లేని పోని
నేరాలను ఆమెపై వేసి మాటి మాటికి ఆమెను తిడుతూ బాధ పెట్టవద్దు. ఇల్లాలు ఏడుస్తూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి
ఉండకుండా వెళ్లిపోతుంది. అందుకని
ఇల్లాలిని ఏడ్పించి , లక్ష్మీదేవిని నీ
ఇంటి నుంచే నీవే ఎందుకు పారద్రోలుకుంటావు .
స్నేహం
కూరిమి
గల దినములలో
నేరము
లెన్నడును గలుగ నేరవు, మఱి యా
కూరిమి
విరసంబైనను
నేరములే
తోచుచుండు నిక్కము సుమతీ !
ఓ సుమతీ
! పరస్పరం ఒకరితో
ఒకరు స్నేహం గా , అనురాగం తో ఉన్నంతకాలం
వారి మథ్య తప్పులు ఏనాడు కన్పించవు. కాని ఆ స్నేహం
చెడిపోయి , వారు విడిపోతే ఒప్పులు
కూడ తప్పులుగా కన్పడి , తగాదాలకు కారణమౌతాయి. ఇది సహజము.
కొంచెపు
నరు సంగతిచే
నంచితముగఁ
గీడు వచ్చు నది యెట్లన్నన్
గించిత్తు
నల్లి కుట్టిన
మంచము
నకుఁ జేటు వచ్చు మహిలో సుమతీ !
ఓ సుమతీ ! అల్పబుద్ధి గల
వానితో స్నేహం చేయడం వలన ఎంతటి వారి కైనా హాని కలుగుతుంది. ఎలాగంటే మంచం లో ఉన్న ఒక చిన్న నల్లి కుడితే వెంటనే యజమాని ఆ మంచాన్ని
తీసుకెళ్లి ఎండలో వేసి ,కోళ్లు పగిలి పోయేటట్లు
నేలకేసి కొట్టి , కర్రలతో బాది , చివరకు మంచానికే నాశనం తెస్తాడు కదా !
వెలయాలు
కొక్కోక
మెల్లఁ జదివినఁ
జక్కనివాడైన రాజ చంద్రుండైనన్
మిక్కిలి
రొక్కం బీయక
చిక్కదురా
వారకాంత సిద్ధము సుమతీ !
ఓ సుమతీ
! ఒప్పుకున్న డబ్బును పూర్తిగా చేతిలో పొయ్యకపోతే కామశాస్త్రాన్ని అవపోశన పట్టిన వాడినైనా
, మన్మథని వంటి అందగాడినైనా , చివరకు రాజశ్రేష్టుడి నైనా వెలయాలు దరిచేరనివ్వదు. అది వెలయాలు కదా. దానికి డబ్బే
ప్రథానము.
కొడుకు
కొఱగాని
కొడుకు పుట్టిన
కొఱ
గామియె కాదు తండ్రి గుణములఁ జెఱచుం
జెఱకు
తుద వెన్ను పుట్టిన
జెఱకునఁ దీపెల్లఁ జెఱచు సిద్ధము సుమతీ !
ఓ సుమతీ !
చెఱకు గడ చివర వెన్నుపుట్టి ఏ
విధంగా ఆ చెఱకు నందలి తీపి నంతటిని హరించి వేస్తుందో అదే విధంగా కుటుంబం లో ఒక పనికి మాలిన కొడుకు పుడితే వాని వలన
వంశానికి పేరు , ప్రతిష్ఠలు రాకపోగా
తండ్రి కున్న కాస్త మంచి పేరును కూడ సర్వనాశనం చేస్తాడు.
కోమలి
విశ్వాసంబును
బాములతోఁ
జెలిమి ,యన్య భామల వలపున్
వేముల
తియ్యదనంబును
భూమీశుల
నమ్మికలు బొంకుర సుమతీ !
ఓ సుమతీ ! ఆడదాని విశ్వాసం ,
పాములతో స్నేహము , పరస్త్రీల మోహము , వేము ( వేపచెట్టు )లోని తియ్యదనము
, రాజుల యొక్క విశ్వాసము అనేవి
తాత్కాలికాలు. అవి అయధార్థాలు .
నమ్మదగినవి కావు.
గడనగల
మగనిఁ జూచిన
నడుగడుగున
మడుగులిడుదు రతివలు తమలో
గడ నుడుగు మగనిఁ జూచిన
నడుపీనుగు
వచ్చె ననుచు నగుదురు సుమతీ !
ఓ సుమతీ ! ఆడువారు సంపాదించే మొగుడ్ని చూస్తే అతని ఆజ్ఞ కు లోబడి పనిచేస్తూ ,
అడుగులకు మడుగులొత్తుతూ గొప్పగా గౌరవిస్తారు. సంపాదన లేని ,లేక సంపాదించడం పోయి
ఇంటిలో ఉన్న భర్తను చూస్తే నడుస్తున్న శవం
వస్తోందని పరిహాసం చేస్తూ నవ్వుకుంటారు.
“అడుగులకు మడుగు లొత్తటం “ అనేది ఒక తెలుగు
జాతీయం . ఇక్కడ మడుగులు అంటే వస్త్రాలు. గొప్ప గొప్ప వాళ్ళు నడిచి వస్తుంటే వాళ్ళు భూమి
మీద నడిస్తే వారి పాదాలు కందిపోతాయని వాళ్లు వస్తున్న దారిలో వారి పాదాల క్రింద పట్టువస్త్రాలను పఱచి , వారిని గొప్పగా
స్వాగతించడం ఒక సంప్రదాయం . దీన్నే అడుగులకు మడుగు లొత్తడం అంటారు.
చింతింపకు కడచిన
పని
కింతులు
వలతురని నమ్మకంతయు మదిలో
నంత:పుర కాంతలతో
మంతనములు
మాను మిదియె మతముర సుమతీ !
ఓ సుమతీ ! అయిపోయిన దానిని గురించి ఆలోచించడ వలన ప్రయోజనం లేదు. ఆడవాళ్ల ప్రేమ నిజమని నమ్మడం కంటే మూర్ఖత్వం లేదు. అంత: పుర కాంత లతో రహస్య సమాలోచనలు
చేయడం చావు మీద కొస్తుంది . కాబట్టి
బుద్ధిమంతుడు వీటికి దూరం గా ఉండాలి.
డబ్బు
చీమలు
పెట్టిన పుట్టలు
పాముల
కిరవైన యట్లు పామరుడు దగన్
హేమంబుఁ
గూడ బెట్టిన
భూమీశుల
పాలఁ జేరు భువి లో సుమతీ !
ఓ
సుమతీ ! డబ్బును సరైన రీతిలో దాచుకోవడం చేతగాని వాడు సంపాదించిన బంగారము , డబ్బు కూడ రాజుల పాలై పోతుంది. ఏ విధంగా నంటే చీమలు కష్టపడి ఏర్పాటు
చేసుకున్న పుట్టలు చివరకు పాములకు నివాసాలుగా మారిపోతున్నాయి కదా.
చుట్టములు
గాని వారలు
చుట్టములము
నీ కటంచు సొంపు దలిర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగఁ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ !
ఓ
సుమతీ ! మన దగ్గర డబ్బు ఉంటే చుట్టాలు కాని
వారు కూడ మేము నీకు దగ్గరి చుట్టాలమని చెప్పి , వచ్చి , ఆశ్రయించి , అంటి
పెట్టుకొని తిరుగుతుంటారు .. మన దగ్గర డబ్బు ఉన్నంత కాలం వారు మనల్ని వదలరు కాక వదలరు.
దానము
చేతులకుఁ దొడవు
దానము
భూతల
నాథులకుఁ దొడవు బొంకమి ధరలో
నీతియె
తొడ వెవ్వారికి
నాతికి
మానంబు తొడవు నయముగ సుమతీ !
ఓ సుమతీ ! ఈ భూమిమీద
మానవునకు తాను చేసిన దానమె తన చేతులకు
ఆభరణము. రాజులకు సత్యము పలుకుట ,
అబద్ధమాడకుండుటయే గొప్ప అలంకారము. ఎవ్వరికైనా
నీతిగా జీవించడమనేది అలంకారము. స్త్రీలకు అభిమానమే అలంకారము.
తడవోర్వక యొడలోర్వక
కడువేగం
బడచి పడినఁ గార్యం బగునే
తడవోర్చిన
నొడలోర్చినఁ
జెడిపోయిన
కార్యమెల్ల జేకురు సుమతీ !
ఓ సుమతీ ! ఆలస్యాన్ని
సహించలేక ,శారీరక శ్రమను ఓర్చుకోలేక ఊరికే హడావుడి పడితే పనులు సాఫల్యం చెందవు.
సమయంకోసం ఎదురు చూస్తూ , ఆలస్యాన్ని , శారీరక శ్రమను సహించి , ఓపికతో కార్యాన్ని
సిద్ధింపచేసుకోవడం బుద్ధిమంతుడి లక్షణం.
తన
కోపమె తన శత్రువు
తన శాంతమె
తనకు రక్ష దయ చుట్టంబౌ
తన
సంతోషమె స్వర్గము
తన
దు:ఖమె నరక మండ్రు తథ్యము సుమతీ !
ఓ సుమతీ ! మానవుడు ఎప్పుడు కోపిష్టి కాకూడదు. కోపము మనిషి లోని
మంచితనాన్ని మింగేస్తుంది . ఆరోగ్యాన్ని హరించివేస్తుంది. అనేకమైన అనర్థాలకు కారణ
మౌతుంది. తన కోపమే తనకు శత్రువు . తను ప్రశాంతం గా ఉండటమే తనకు ఆరోగ్యం , ఆయుష్షు . రక్ష.
ఎల్ల జీవుల యందు కారుణ్య భావన కలిగి , వారికి వీలైనంత సహాయం చేయడమే తనకు చుట్టమై తోడు నిలుస్తుంది.
ఎల్లవేళలా ఆనందం తో జీవించడాని కంటే
మించిన స్వర్గం మరొకటి లేదు. ఎల్లప్పుడు విచారం తో తనకు అది లేదు , ఇది లేదు
అని బాధపడటం , ఎదుటి వారికి అవి ఉన్నాయి , ఇవి ఉన్నాయి అని చింతించడం దు:ఖహేతువులు. అంతకు మించిన నరకం మరొక్కటి ఎక్కడో లేదు.
భగవంతుడు ఇచ్చిన
దానితో తృప్తి పడి , మనకు ఇదే ప్రాప్తమని
అంగీకరించి , మనకు ఉన్న దానిలోనే అసలు లేని వారికి సహాయం చేస్తూ , దైవం
మీద నమ్మకం ఉంచి , ప్రశాంత మైన మనస్సు తో
, భాగవతం లో ప్రహ్లాదుడు చెప్పినట్లు “ సర్వమున్నతని దివ్యకళా మయమంచు విష్ణు నందుల్లము చేర్చి” జీవించడానికి మించిన ఆనందము , స్వర్గము మరొకటి లేదు.
తన
యూరి తపసి తనమును
దన
పుత్రుని విద్య పెంపు, దన సతి రూపున్
దన
పెరటి చెట్టు మందును
మనసున
వర్ణింప రెట్టి మనుజులు సుమతీ !
ఓ సుమతీ ! మానవుడు
తన ఊరి యొక్క గొప్పతనాన్ని , తన
కుమారుని యొక్క తెలివితేటలను ,
విద్యాభివృద్ధి ని , తన ఇల్లాలి అందాన్ని
, ఇంటి వైద్యాన్ని గురించి ఎప్పుడు బయటవారితో మాటల మథ్యలో ప్రస్తావన గా కూడ చెప్పడం
మంచిది కాదు. ఇవి ఇంటి లోపలే ఉండి పోవలసిన విషయాలు.
గొప్పలు చెప్పుకోవడం
ఎప్పుడైనా తప్పే . అది ముప్పు ను తెచ్చిపెడుతుంది . అందులోను తన కొడుకు యొక్క చదువు సంథ్యలు ,ఔన్నత్యాన్ని గూర్చి
, తన భార్య అందచందాలను గురించి ఇతరుల వద్ద వర్ణించడం వలన ప్రయోజనం లేక పోగా
విన్నవారికి ఈర్ష్య కలిగి మన వారికి హాని కలిగించే అవకాశం ఉంది . ఇక పెరటి వైద్యం . అంటే మీ దొడ్లో ఉన్న ఏవో మూలికల వైద్యం అని కాదు అర్థం. మనకు ఏదో ఒక శారీరక బాధ , రుగ్మత కలిగినప్పుడు ఏం చేయాలో తెలియక ఉన్నంతలో ఏదో ఓ చిట్కా వైద్యం చేశాం. అది
తగ్గింది. అది నీకు ఆనందమే . అంత మాత్రం
చేత ఆ విషయాన్ని ఊరం తా చెప్పడం వలన ప్రయోజనం ఉండక పోగా నీ మీద ఉన్న గౌరవం తగ్గే
ప్రమాదం ఉంది. ఆ చిట్కా వైద్యం వారికి పనిచేయక పోతే నిన్ను
నిలేసి ,ప్రశ్నించే ప్రమాదం కూడ ఉంది. అందుకే నీతి శతకం సున్నితం గా హెచ్చరిస్తోంది
.
.
సమష్టి గా చెప్పుకోవాలంటే ఇంటిగుట్టు ను రచ్చ చేయడం తప్పు
అనేది ఇక్కడ చెపుతున్న ప్రధాన నీతి
సూత్రం. ప్రతి ఇంటి లోను , ప్రతి ఊరి లోను చెప్పకూడని రహస్యాలు ఉంటాయి. వాటిని అలాగే
కాపాడు కోవడం బుద్ధి మంతుడు చేయాల్సిన పని . అంటే ఆ రహస్యాలను వెల్లడి చేయడం
మూర్ఖుని లక్షణ మనేది కవి చెప్పదలచిన
విషయం.
కారణం ఏదైనా విభీషణుని వల్లనే
లంకకు చేటు వాటిల్లిన విషయం జగద్విదితమే.
తన కలిమి యింద్ర
భోగము
తన
లేమియె సర్వలోక దారిద్ర్యంబున్
తన
చావు జగత్ర్పళయము
తను
వలచినదియె రంభ తథ్యము సుమతీ ! (51 వ ప )
ఓ సుమతీ ! మనిషి స్వార్థపరుడు
. మనసు సంకుచితమైనది . అందుకే ఎంతసేపు “ నా చిన్న బొజ్జ కు శ్రీరామరక్ష’’ అనుకొంటూ ఉంటుంది. తను ప్రేమించిన
ఆడదాన్ని రంభ గాను , తన కున్న సంపద ను
ఇంద్ర భోగం గాను భావిస్తాడు. తన కొచ్చిన
దరిద్రమే సకల లోకానికి సంభవించిన దరిద్రం గా కుమిలి పోతాడు. అటువంటి వాడికి తన చావే
జగత్ప్రళయం గా , యుగాంతంగా కన్పించడం లో ఆశ్చర్యం లేదు.
అందుకే “ తా వలచింది రంభ , తాను మునిగింది
గంగ ”అనే సామెత వచ్చింది.
******************** మూడవ భాగం త్వరలో *************