శ్రీ నృసింహ పంచవింశతి -4
ఇది తొలి
దేశభక్తి కావ్యం ?
అహోబిల నారసింహుడు
అఖిల విద్యల కెల్ల నాధారమైన నీ
నామ
మంత్రం బెప్డు నయము మీఱఁ
పఠనఁ జేయుచు మహా పాప సంఘంబులఁ
బరిమార్చి యున్న నీ భక్తవరుల
దూషించుచుండెడు ధూర్త జనంబుల
గర్భముల్ చించియు ,
దుర్భరముగ
వింతగా మాంసంబు లింతింతలుగ ద్రుంచి,
చించి చెండాడియు, శిరములెల్ల
ధరను భూతంబులకు నెల్ల దనివి దీఱ
బలులు వెట్టుము వేవేగ భానుతేజ !
క్రీస్తుమతజులఁ జెండుమా
కినుక తోడ
వైరి గజసింహ ! యో బల నారసింహ! (21)
ఓ
అహోబిల నారసింహా ! సమస్త విద్యలకు మూలమంత్రమైన నీ నామ
మంత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ ఘోరపాపాలను సైతం పారద్రోలు తున్న నీ భక్తశ్ర్రేష్టులను నిందిస్తున్న ఈ
దుర్మార్గుల కడుపులు త్వర త్వర గా చించి
భయంకరంగా ఇంతింతలు గా వింతగొల్పునట్లు వారి మాంసాన్ని ముక్కలు ముక్కలు గా తుంచి,
చీల్చి చెండాడి, వారి తలలను భూమిపై నున్న భూతాలకు తనివి తీరేటట్లు గా ,తృప్తిగల్గునట్లుగా
బలి ఇవ్వు స్వామీ !
కవి ఈ పద్యం లో వాడిన పదాల్లో
కుమతుజులపై కవి కెంత కోపం ఉందో స్పష్టం గా కన్పిస్తోంది. కావ్యం చివరికి వచ్చే
సరికి కవిత్వం లో వ్యంగ్యం తగ్గి తన ప్రార్ధన లో ఆర్తిని, అభ్యర్ధనను పెంచాడు కవి.
తను కోరుకునేదేమిటో తనకు ఏమి కావాలో స్పష్టం గా అడుగుతున్నాడు స్వామిని కవి.
అహోబిల స్ధంభ శిల్పం
క్షీరాబ్ది శయన ! నా చేతులారగ నిన్నుఁ
బూజింపగల్గెడు పుణ్యమెపుడొ ?
వెన్నుడ !
నారెండు కన్నులారగ నిన్నుఁ
గనుగొను భాగ్యంబు
గలుగు టెపుడొ ?
భువనరక్షక ! నాదు
చెవులపండువుగ నీ
పలు కాలకించి
నిన్ గొలచుటెపుడొ ?
కంజాక్ష ! నా పాప
పుంజంబు దెగ నీకు
సాష్టాంగ మర్పణ సల్పు టెపుడొ
?
నీవు క్రీస్తుల బరిమార్ప , నిలిచి నిన్నుఁ
బ్రస్తుతించెడి దెన్నడో పంకజాక్ష !
క్రీస్తుమతజులఁ జెండుమా
కినుక తోడ
వైరి గజసింహ ! యో బల నారసింహ! (22)
ఓ క్షీరాబ్ది శయన! శ్రీ నారసింహ ప్రభూ ! నా చేతులారా నిన్ను పూజించుకొనెడి అదృష్టం నాకెప్పుడు లభిస్తుందో గదా ? శ్రీమన్నారాయణా ! నా కన్నుల నిండుగా నీ
దివ్యరూపాన్ని చూసే భాగ్యం నా కెన్నడు ప్రాప్తిస్తుందో కదా ?
భువనరక్షకా ! నా చెవులకు పండువగునట్లు నీ నామజపం చేస్తూ
నిన్ను సేవించు భాగ్యం నాకు ఎప్పుడు కల్గుతుంది స్వామీ ? పద్మాక్షా ! నా పాపం
పటాపంచలయ్యేటట్లు నీకు సాష్టాంగ నమస్కారాలను ఎప్పుడు చేయగలుగుతానో కదా స్వామీ
! స్వామీ ! నీవు ఈ ఆంగ్లేయులను పరిమార్చి, నేను ప్రశాంతంగా నీ చెంత నిలిచి
ప్రస్తుతించే మహద్భాగ్యం నాకెన్నడు
కలుగుతుందో కదా పద్మపత్రాక్షా ! శతృవులనే ఏనుగుల పాలిట
సింహము వంటివాడా ! ఈ ఆంగ్లేయులను పారద్రోలి మమ్మల్ని రక్షించు స్వామీ !
అంటే ఏనాడైతే
నారసింహుడు ఆంగ్లేయులను సంహరిస్తాడో ఆ రోజున ఆయన ముందు నిలిచి ప్రశాంతం గా ఈ సేవలన్నీ
చేసుకోగలుగు తానని, అప్పటివరకు నీ సేవలు
చేయలేనని, చేసినా మనస్ఫూర్తి గా నిర్వహించలేనని
కవి విన్నవించుకుంటున్నాడు.
ఒకవిధంగా
చెప్పాలంటే నీవు ఈ ఆంగ్లేయులను సంహరిస్తేనే నేను నీకు మనసారా , చేజేతులా పూజ
చేయగలుగుతానే కాని లేకపోతే నీకు సరైన పూజా పునస్కారాలు చేయలేనని స్వామిని
గికురిస్తున్నట్టు గా ఉన్నాడు కవి.
అండజవాహ ! నీ యండ జేరిన భక్త
జనముల రక్షించు జలజ నాభ !
ఆచార
వంతులైనట్టి మహాత్ములఁ
గరుణ నేలుము నెమ్మిఁ గమలనేత్ర !
నీ ధ్యానమెప్పుడు
నియతిఁ జేసెడు వారి
జేపట్టి
రక్షించు చక్రహస్త !
నీకు దాసుడ నేను
నాకు జన్మము లింక
నిల
లేమిఁ జేయుమీ నీలవర్ణ !
కుమతులను ద్రుంచి ధరలోన గూర్మి తోడ
నాకు మోక్షంబు దయసేయు నాగశయన !
క్రీస్తుమతజులఁ జెండుమా
కినుక తోడ
వైరి గజసింహ ! యో బల నారసింహ! (23)
ఓ
అహోబిల నారసింహా ! గరుడవాహనారూఢా !
నిన్ను నమ్మి నీ అండ చేరెడి భక్తులను రక్షించెడి పద్మనాభా!
ఆచారవంతులైన మహనీయులను దయతో రక్షించు
పరంధామా ! నీ నామ ధ్యానాన్ని నియతి తప్పక ఆచరించెడి వారిని
కాపాడే జగద్రక్షకా ! నేను నీ దాసుడను. నాకు జన్మ రాహిత్యాన్ని ప్రసాదించు స్వామీ ! ఈ
దుర్మార్గులను సంహరించి , భూమి పైన శాంతిని నెలకొల్పి నాకు మోక్షాన్ని దయచేయవలసింది ప్రభూ!
దిగువ అహోబిలం మండపం లోని స్ధంభశిల్పం
మతములు చెఱచు దుర్మతజుల వేపట్టి
మోదకుంటివ
ప్రహలాదు నాన !
వేదంబు లమ్మిన విప్రుల ప్రేవులు
ద్రెంచకుంటివ లక్ష్మి దేవి యాన !
నీ భక్తులను జూచి నిందించు దుష్టుల
చంప కుంటివ
నీదు చక్ర మాన !
కుమతుల కోవెలల్ గూల్చి , క్రీస్తుల బట్టి
వధియింపకున్న నా మీద నాన !
సర్వమును విష్ణుమయ మని చాటు వేద
చయములను నిల్పకున్న నీ శంఖమాన !
క్రీస్తుమతజులఁ జెండుమా
కినుక తోడ
వైరి
గజసింహ ! యో బల నారసింహ! (24)
మన అభ్యర్ధనను , లేక మన మాటను ఎదుటివారు వినేటట్లు లేకపోతే ఒట్టు పెట్టకోవడం
తెలుగు పల్లె ల్లో ఈ నాటికీ కన్పిస్తూ ఉంటుంది. కవి పైన ఇరవై మూడు పద్యాల్లో ఆ అహోబిల నరసింహునికి ఆ స్వామి భక్తులు , తాను పరి పరి విధాల శతృవుల వలన
పడుతున్న బాధలన్నింటినీ మొఱ
పెట్టుకొని చివరకు ఒట్టు వేసుకొనైనా
స్వామి వలన తను కోరుకున్న పనిని సాధింప చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
ఓ అహోబిల నారసింహా ! మత మార్పిడులు చేసే ఈ దుర్మార్గుల పట్టి సంహరించని యెడల నీ ప్రియ భక్తుడైన ప్రహ్లాదుని పైన ఒట్టు.
వేదాలను అమ్ముతున్న బ్రాహ్మణుల పేగులను
తెంచి చెర్లాడ కుండిన నీ ఇల్లాలైన లక్ష్మీదేవి పైన ఒట్టు. నీ భక్తులను హేళన చేసి నిందించెడి దుర్మతజుల పట్టి
చంపకున్న నీ చక్రాయుధం మీద ఒట్టు. ఆ దుర్మార్గుల గుళ్లు పడగొట్టి ,వారి నందరినీ
చంపకపోతే నీ భక్తుడనైన నా మీద ఒట్టు. సర్వం విష్ణుమయమని ప్రకటించే వేదాలను
కాపాడక పోతే నీ శంఖం మీద ఒట్టు. ఏమైనా నీవు ఈ అన్యమతస్థులై , మన దేశానికి వచ్చి
,మన మతాన్ని కించపరుస్తూ, మత మార్పిడులకు పాల్పడుతున్న ఈ ఆంగ్లేయులను హతమార్చి నా రాజ్యాన్ని, మా సమాజాన్ని
కాపాడవలసింది అహోబిల నారసింహ ప్రభూ !
వసుధ లో క్షత్రియ వంశాబ్ది చంద్రుడౌ
మకరనసింగను మానధనుడు
అతని పుత్రుఁడు రమాపతి పూజితుండగు
ధనసింగు పేరిట ధన్య
చరితుఁ
డతనికి సూనుండు అబ్ది గంభీరుఁడు
సకల శాస్త్ర
పురాణ సంగ్రహుండు,
నిత్య దాన వినోది సత్య వచస్కుఁడు
దేవబ్రాహ్మణ భక్తి భావరతుడు
ఆచారవంతుండు నతి దయాపర మూర్తి
లక్ష్మణ సింగను లక్షణాఢ్యుఁ
డతనికి నే హైమవతి దేవి వరమున
జననమొందితినయ్య జగతి యందు
పేరు గర్గలాలు ; ప్రేమతో నెప్పుడు
నీ పాద భక్తియే నిత్య మనుచు
నిరతంబు నే బూని , యిలలోనఁ గ్రీస్తుల
చేత కోర్వక వారి
సమయ జేయఁ
బంచవింశతి ఘన సీస పద్యములను
విన్నవించితి నీకు
నే విశదముగను
తప్పులేమైన గల్గితే
యొప్పుకొమ్ము
తనయు తప్పులు తప్పులే తండ్రులకును
నా మొఱాలించి భువిని దుర్ణయులనెల్ల
సాహసంబున గడతేర్చు చక్రహస్త
క్రీస్తుమతజులఁ
జెండుమా కినుక తోడ
వైరి గజసింహ ! యో బల నారసింహ! (25)
క్రోధివత్సర పుష్య శుద్ద అష్టమీ సౌమ్యవారం రోజున్నూ నృసింహ
పంచవింశతం
భవానీ శింగు కు గర్గలాల్ వ్రాశి యిచ్చెను. శ్రీరాములు.
కవి,కృతి నామాంకితమైన ఈ పద్యం
ఈ కావ్యం లో చివరిది. ఈ పద్యం లో కవి ఎనిమిది సీస పద్యపాదాలను, ఎనిమిది తేటగీతి
పాదాలను వాడటం ఒక ప్రత్యేకత. తనను గూర్చి కవి ఇలా చెప్పు కుంటున్నాడు.
ఓ అహోబిల నారసింహా! ఈ భూమి మీద క్షత్రియ వంశం
లో మకరన సింగు అను మహానుభావుడు
జన్మించాడు. ఆయన యొక్క కుమారుడు ధనసింగు. ఈతడు పరమ విష్ణుభక్తుడు . ఈతని కుమారుడు
సకలశాస్త్ర పురాణములను చదివిన వాడు నిత్యదాన వినోది, సత్యవాక్య పరిపాలకుడు, దేవ
బ్రాహ్మణ భక్తి గలవాడు , ఆచారవంతుడు , దయాగుణము కలవాడు లక్ష్మణ సింగు. ఆ లక్ష్మణసింగు
దంపతులకు హైమవతీ దేవి అనుగ్రహమున గర్గలాలు అను నేను జన్మించాను. ఎల్లప్పుడు నీ
పదపద్మధ్యాన నిరతుడనైన నేను ఈ భూమి పై ఈ
క్రైస్తవులైన ఆంగ్లేయులు చేసే అకృత్యాలను చూసి
సహించలేక వారిని సంహరించుటకు ఈ ఇరవై ఐదు సీసపద్యాలతో కూడిన పంచవింశతి ద్వారా నీకు సవివరంగా విన్నవించుకుంటున్నాను.
దీనిలో తప్పులున్నా ఒప్పుకోవయ్యా ప్రభూ! కొడుకుల చేసే
తప్పులు తండ్రులకు తప్పులుగా కన్పిస్తాయా ఏమిటి ? నా మొఱాలకించి
ఈ నేలమీదున్న ఈ దుర్మార్గులనందరినీ సాహసం తో మట్టుపెట్టి నీ భక్తులమైన మాకు
ఆనందాన్ని కల్గించు యో అహోబిల నరసింహా !
ఈ
కావ్యం వ్రాసిన కాలం క్రోధి నామ సంవత్సరం
పుష్యమాసం శుద్ద అష్టమీ బుధవారం అనగా క్రీ.శ. 1845 జనవరి 15 తేదీగా
చెప్పబడింది. దీనిని రచయిత స్వహస్తాలతో వ్రాసి భవానీ సింగు కు ఇచ్చినట్లు
గా కావ్యాంత గద్య వలన తెలుస్తోంది. అందువలననే కవి కాలం క్రీ.శ
1845 ప్రాంతం గా విమర్శకులు
భావించడం జరిగింది. ఏమైనా ఒక అపురూప కావ్యాన్ని పరిరక్షించిన తృప్తి నాకు
కలిగించిన ఆ అహోబిల నవనారసింహులకు శతసహస్రాధిక
వందనాలు.
ఇది గర్గలాలు వ్రాసిన శ్రీ నృసింహ పంచవింశతి కి అందించిన తేజస్వినీ వ్యాఖ్య
సంపూర్ణము.
********************************************