Tuesday, 25 September 2012

రామాయణము-రమణీయ కధనాలు--5 అహల్య--2

               


                అ హ ల్య       
                                             రెండవ భాగము
                      
                     











                     అహల్యా శాప విమోచనానంతరం మిధిల లో ప్రవేశించిన విశ్వామిత్రుడు శతానందుని తో రేణుక జమదగ్నిని కలిసినట్లు నీ మాతృమూర్తి అహల్య నీ తండ్రిని కలిసింది అంటాడు. ఇచ్చట రేణుకా జమదగ్నుల ప్రస్తావన రాబోయే పరశురాముని ఆగమనాన్ని సూచిస్తోంది .
             
   
                                          సీతా – అహల్య ల వృత్తాంత్తాల్ని  ఏకముఖంగా పరిశీలిస్తే రెండు విషయాల్ని మనం గుర్తించవచ్చు.అహల్యా గౌతముల పున స్సమాగమం తర్వాతే  సీతారామ కళ్యాణం జరగాలన్నది ఆది కవి నిర్ధేశం. శ్రీ సీతారామ కళ్యాణానంతరం  భార్గవ రాముని ఆగమనం అనివార్యం .ఆ విషయం తెలియజేయడానికే రేణుక జమదగ్ని ని  కలిసినట్లు అహల్య గౌతముని కలిసింది అని చెప్పడం జరిగింది. ఆ మాట చెప్పింది అహల్యా గౌతముల కుమారుని తో విశ్వామిత్రుడు. రేణుకా జమదగ్నుల కుమారుడు ముందు రాబోతున్నాడు. రామచంద్రుణ్ణి  శ్రీ – రామునిగా, కళ్యాణ రామునిగా , శతానందుడు చేస్తే - రానున్న భార్గవుడు రాముణ్ణి కోదండరాముణ్ణి చేస్తాడు. ఇది ఒకతరం[ అవతారం} వేరొకతరానికి అథికారాన్ని బదలాయించే  సంధియుగం .  ఇది మహర్షి భావన.
                
              యాగ సంరక్షణ లో విజయులై  విశ్వామిత్ర ద్వితీయులుగా  మిథిలానగరానికి బయలుదేరారు రామలక్ష్మణులు.

                                విశ్వామిత్రుని గాథలతోను, రామలక్ష్మణుల ప్రశ్నలతోను దారి తరిగి పోతూ కాలం కరిగి పోతూ ఉంటే మిథిలోపవన ప్రాంతానికి చేరారు ముగ్గురు. వన్నెతరిగిన బంగారంలా, మేఘావృతమైన చంద్రబింబంలా  మాసిన అద్దంలోని ప్రతిబింబం లా అణగారిన కాంతితో ప్రకాశిస్తున్న గౌతమాశ్రమాన్ని చూచి, ప్రశ్నించాడు   శ్రీరామచంద్రుడు. వెంటనే హంత! తే కథయిష్యామి’” అంటూ నిట్టూర్పు విడిచాడు విశ్వామిత్రుడు. భక్తులకొఱకు కదలివచ్చిన కరుణాథాముడు  శ్రీరాముడు. భర్తృసాన్నిథ్యానికి దూరమై తపిస్తున్న సాథ్వీమతల్లి అహల్య.ఆమెకు శాపమోక్షాన్ని కల్గించఢాని కై రాముడు ప్రశ్నించాడు. రాముని ప్రశ్న వినగానే  
హంత అన్నాడు విశ్వామిత్రుడు.

                 ఆ నిట్టూర్పు లో ఎంతో ఆనందం. ---    ఒక మహర్షి దంపతులను ఏకం చేసే శుభసమయం  ఆసన్నమైందనే ఆనందం. ఆ ఆనందానికి తాను ఆథారమౌతున్నాననే ఉద్వేగం.  ఎంతోకాలంగా కొనసాగుతున్న అహల్యాదేవి తపస్సు  సఫలీకృతం కాబోతోందన్న  ఉత్సాహం విశ్వామిత్రుని చేత హంతఅనిపించింది.  ఎంతో బరువు  దిగిపోయినప్పుడు మనలో నుండి వచ్చే దీర్ఘ నిశ్వాసకు ప్రతిపదమే  ఈహంత అనేది.

             శ్రీ రాముని పాదథూళి సోకి, అదృశ్య , నిరాహారయై తపిస్తున్న అహల్యకు అసలు రూపం వచ్చింది . గౌతమాశ్రమం లో కలకూజితాలు థ్వనించాయి.   ఫలవృక్షాలు చిగిర్చి పుష్పించి , ఫలవంతాలు కాగా            పూ బాలలు  శిరసు లూపి అతిథులను ఆహ్వానిస్తున్నాయి.     ఉగ్ర తేజ స్సంపన్నుడైన గౌతమ మహర్షి ఆశ్రమం లోకి ప్రవేశించాడు.        ఆపుణ్యదంపతులకు పాదాభివందనం చేసి , వారి ఆశీస్సులను పొంది, మిథిలకు ప్రయాణమయ్యారు కుశికసుత దాశరథులు.

                               మిథిలలో ప్రవేశించిన రాముడు    శ్రీ రాముడై     కళ్యాణ రాముడైనాడు. గౌతమాశ్రమంలో  దంపతీ పూజ చేయించి పెళ్లికొడుకుగా రాముని మిథిలానగరంలోకి  ప్రవేశింపజేశారు వాల్మీకి.    ఇది ధర్మయుత ఆర్షసంస్కృతికి చిహ్నంగా భాసించింది. ....... తన తల్లిని తండ్రితో కలిపిన  పరంథాముడగు    శ్రీ రాముని పూజించాడు శతానందుడు . సీతను రామున కిచ్చునట్లుగా ఏర్పరచి దైవఋణం తీర్చుకున్నాడు. రఘురాముడు సీతారాముడు    కాగా లక్ష్మణు   డు ఊర్మిళో పేతుడైనాడు . ఆ యదృష్టం అహల్యా గౌతముల  ఆశీ: ప్రభావమే నని భావించవచ్చు. ఇది వాల్మీకి మహర్షి కల్పన.

                ఈ ఘట్టంలో  విశ్వామిత్రుడు  చెప్పిన వృత్తాంతంలో అహల్య దోషిగా  “దేవరాజ కుతూహలాత్ అనే పదం వలన ముద్ర  వేయబడింది. బ్రహ్మ మానస పుత్రి,  మహర్షి పత్ని  దేవరాజ కుతూహలయై జార యైంది.   సురకార్యార్థమిద మని ఇంద్రుడు    తప్పించుకున్నా మగవారి రాచకార్యాలకు ఆడది గా అహల్య బలైంది. జారగా మిగిలింది. అందుకే  ఉత్తరకాండ లో   ఇంద్రుని   గౌతముని గా భావించి {–త్వద్రూపేణ దివౌకసా- } అహల్య ఏకశయ్య అయినట్లు చెప్పి, బాలకాండలోని మాలిన్యాన్ని కొంత  ప్ర క్షాళన  చేయఢానికి ప్రయత్నించినట్లు  కన్పిస్తుంది. కాని ఆడదాని మీద పడిన అపవాదు గాయం మానినా మానిపోని మచ్చలాగా శాశ్వతంగా మిగిలిపోతుంది. అహల్య విషయంలో అదే జరిగింది .         వేదాలలో    ప్రతీకాత్మకంగా    వాడిన  అహల్యాయైజార శబ్ధం అనంతర కాలికుల కావ్యాల్లో, కల్పనల్లో రెక్కలు విదిల్చి విహరించి తుదకు  అశ్లీలార్థ కథలకు  అలవాలమైంది.


             వాల్మీకి మహర్షి నైతికవర్తనను , ధానిపై సమాజానికున్న బాథ్యతను తెలియజెప్పడానికి థర్మ ప్రబోధాత్మకంగా అహల్యా వృత్తాంతాన్ని వ్రాశారు.  బ్రహ్మమానసపుత్రికయైనా ,మహర్షిపత్ని యైనా  తప్పుచేస్తే  శిక్ష తప్పదన్న హెచ్చరిక , థర్మ ప్రకటనం మహర్షి ఉద్దేశ్యం. అయితే పసివారికి నిప్పు కాలుతుందని తెలియజేయడానికి సెగ చూపిస్తే సరిపోతుంది కాని అంగవైకల్యం సంభవించేటంతగా కాల్చలేము గదా. అహల్య విషయంలో రెండవదే జరిగింది .అస్తిత్వానికే లోపం ఏర్పడింది. బాలకాండ – ఉత్తరకాండ కథల నడుమనున్న అంతరాన్ని పరిశీలిస్తే అహల్యా శీల  సంరక్షణకు మహర్షి చేసిన ప్రయత్నం మనకు అర్థమౌతుంది  .
      
       అహల్యాజారుడైన ఇంద్రుని శపించి, అహల్యను సైతం వాయుభక్షా నిరాహారా తప్యంతీ భస్మశాయినీ   అంటూ అదృశ్యగా పెక్కేండ్లు తపించి రామచంద్రుని పాద స్పర్సచే ఫవిత్రీకృత గాత్ర కావలసిందని వాల్మీకంలో గౌతముని ఆజ్ఞ. కాని – అథ్యాత్మరామాయణం లో అహల్య రాయిగా మారినట్లు చెప్ప బడింది.

                  దుష్టే త్వం తిష్ట దుర్వృతే శిలయా2శ్రమే మమ
                 నిరాహారా దివారాత్రం తప: పరమమాస్థితా!!                  { అ.రా. బాల.5   ]

     అదేవిథంగా ఆనంద రామాయణ ,సత్యోపాఖ్యానాలయందు సైతం అహల్య కు శిలా రూపమైన శాపమే కన్పిస్తుంది. తులసీదాసు కూడ అహల్య ను శిలారూపంగానే ధర్శించారు. బ్రహ్మపురాణంలో—

                          తామప్యాహముని: కోపాత్ త్వం చ శుష్కనదీ భవ
                          నదీభూత్వా పునారూపం ప్రాప్య్ససే ప్రియ కృన్మమ!!

    అంటాడు గౌతముడు.ఎండిపోయిన నదిగా శాపం.గౌతమీనదితో కలిసి నప్పుడు విమోచనం చెప్పబడింది. పధ్మపురాణం లో ---

                 అస్థి చర్మ సమావిష్టా నిర్మాంసా నఖవర్జితా....... చిరంస్థాస్యసి--  {  ప.పురా.సృ. 158-43]

ఎముకలు చర్మము తోను మిగిలి మాంసము గోళ్లు లేని దానివై నలుగురు చూచుచుండగా చిరకాల ముండవలసినది గా శాపం అహల్య కు కన్పిస్తుంది .            

                       . అస్యా దోషో న చైవాస్తి  దోషో2యం పాకశాసనే “ {సృ.158.38] అని పద్మపురాణం లో రామచంద్రుడు అహల్యను సమర్థించడం సైతం మనకు కన్పిస్తుంది.    ఇక    విచిత్ర రామాయణాదుల్లో కన్పించే కథలు మరీ అశ్లీల ద్యోతకాలు.  

                   ఈవిథంగా  వేదవాజ్ఞ్మయం నుండి లౌకిక వాజ్ఞ్మయం మీదుగా ఆథునిక వాజ్ఞ్మయం వరకు 
అహల్యా వృత్తాంతం  పలువిథాలుగా మనకు కన్పిస్తుంది .   




*****************************************************************************