శ్రీ నృసింహ పంచవింశతి -3
ఇది తొలి
దేశభక్తి కావ్యం ?
అలంపురం శ్రీ బాల బ్రహ్మేశ్వరస్వామి వారి ఆలయం లో ఈశాన్యం మూల దర్శనమిచ్చే షోడశబాహు నరసింహస్వామి
గుణగణాకర ! నీ గుణము లెంచెద నింక
పరికించి వినవయ్య పరమ పురుష !
శబరి యెంగిలి పండ్లు సంతసంబున దేగఁ
దిని
మెచ్చినట్టి నీ హీన గుణము,
అల కుచేలుడు నిన్ను దలచి వచ్చితె, వాని
యటుకులు దిన్నట్టి యల్ప గుణము,
బాలుడవై గోప బాలురతోఁ గూడి
పరభామినుల గూడు పలుచదనము ,
ఇట్టి గుణములు నీ యందు దిట్టము గను
గలిగ
యుండఁగఁ గ్రీస్తులఁ గలియు టరుదె ?
క్రీస్తుమతజులఁ జెండుమా
కినుక తోడ
వైరి
గజసింహ ! యో బల నారసింహ! (14)
ఓ అహోబిల నారసింహా ! సుగుణాల ప్రోవైన నీ గుణగణాలను లెక్కిస్తాను .చెవులు రిక్కించుకొని వివవయ్యా
మహానుభావా ! ఆనాడు శబరి ఇచ్చిన ఎంగిలిపండ్ల ను తిన్నప్పుడే
నీ హీన గుణము లోకానికి వెల్లడైంది. పాపం నీ స్నేహితుడు కుచేలుడు నిన్ను చూడానికి
వస్తే అతని కొంగున ఉన్న అటుకులన్నీ స్వాహా
చేసినప్పుడే నీ అల్పబుద్ధి అందరికీ
అర్ధమైంది. గోప బాలుర తో కలిసి రేపల్లె లో పరస్త్రీలను కూడిన నాడే నీ పలుచ
గుణం లోకానికి వెల్లడైంది. ఇటువంటి గుణాలు మొదట్నుంచీ దిట్టంగా ఉన్న నీవు ఇప్పుడు
క్రీస్తులను కలవడం లో విచిత్రమేముంది ప్రభూ ! స్వామీ
! ఈ ఆంగ్లేయుల పీచమడచి మమ్మల్ని రక్షించు నారసింహా.
నా బ్రతుకు కై
గాదు నరసింహ ! నేనిట్లు
ప్రస్తుతించుట నిన్ను భక్తి తోడ
నీ కీర్తి భువియందు నిల్చుటకే నేను
విన్నవించెదయ్య ! వేదవేద్య
!
నీ పేరు ధర లోన నీళ్ళపై వ్రాలౌట
కద్భుతాశ్చర్యమై కాన బడెను
నా తండ్రి నినుఁ గ్రీస్తు మతజులు నిందింపఁ
గొమరుండ నాకది కొఱతఁ గాదె ?
కాన నాయందుఁ గరుణించి, ఘనత మెఱసి
నిల్పు కొనవయ్య నీ
పేరు నీరజాక్ష
క్రీస్తుమతజులఁ
జెండుమా కినుక తోడ
వైరి గజసింహ ! యో బల నారసింహ! (15)
స్వామీ ! అహోబిల నారసింహా ! నేనింత గా నిన్ను
ప్రాధేయపడుతోందీ , ప్రార్ధిస్తున్నదీ నా బతుకు తెఱువు కోసం కాదు ప్రభూ ! ఓ వేదవేద్య ! నీ కీర్తి ఈ భూమి మీద శాశ్వతంగా నిలిచి పోవడానికే నేను ఇంతగా ఆరాట
పడుతున్నానయ్యా. నారసింహుడనే నీ పేరు నీటి మీద వ్రాత లాగా అదృశ్యమవడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని
కల్గిస్తోంది ప్రభూ ! నా తండ్రీ!
అహోబిల నరసింహా ! ఈ క్రీస్తు మతజులు నిన్ను నిందిస్తూ ఉంటే నీ కొడుకునైన నాకు అది
అవమానం , చిన్నతనం కాదా ? అందుకే నన్ను కరుణించి ఈ ఆంగ్లేయుల
పీచమడచి, నీ గొప్పతనాన్ని, నీ పేరు ను నిలబెట్టకో స్వామీ !
అహోబిల నరసింహస్వామి
శత్రువుల ద్రుంచు నీ చక్రాయుధము నేడు
మొక్కపోయున్నదా మోహనాంగ !
ప్రళయభైరవ రావభరితమౌ శంఖంబు
పగిలెనో పఱియలై
పంకజాక్ష !
శక్రారులను ద్రుంచు శరచాపములు నేడు
నడిమికిఁ దునిగెనో నాగశయన !
పరవైరి నికరభీకరమైన ఖడ్గంబు
మడువు జెందెనొ నేడు మదనజనక !
ధర యెఱుంగక నీ గదాదండ మిపుడు
కాలె
నని యూరకున్నావొ కమలనాభ !
క్రీస్తుమతజులఁ జెండుమా
కినుక తోడ
వైరి గజసింహ ! యో బల నారసింహ! (16)
ఉగ్రనరసింహుడు ఎంత
ఉగ్రరూపుడైతే ఆయన భక్తులకు అంత అందంగా కన్పిస్తాడు. తన స్వామి అంత మహోగ్రరూపుడని
చెప్పుకోవడం భక్తునకు మహదానందం. అందుకే ఈ పద్యం లో కవి గర్గలాలు శ్రీ నరసింహుని
ఆయుధ విశేషాలను ప్రస్తావిస్తూ , మోహనాంగ అంటూ సంబోధిస్తున్నాడు.
ఓ అహోబిల నారసింహా ! ఓ మోహనరూపుడా ! చండప్రచండమై శత్రుమూకలను చెండాడెడి నా చక్రాయుధము మొక్కవోయి నదా ఏమి ! శతృ సమూహము పై విజృంభించునప్పుడు ప్రళయ భీకరముగా గర్జించెడి పాంచజన్యమనెడి
నీ శంఖము పగిలిపోయినాదా ఏమి
పంకజాక్ష !
రాక్షసులను మట్టుపెట్టెడి నీ శార్జ్ఞమనెడి
ధనుస్సు మధ్యకు విరిగి పోయి మూలపడినదా ఏమి నాగేంద్ర శయన ! శతృసేనలను చీల్చి చెండాడెడి నీ
ఖడ్గము వంగిపోయినదా ఏమి మన్మధ జనకా ! లోకానికంతటికీ తెలిసిన నీ గదా దండము కాలిపోయిన
దని ఊరుకున్నావా కమలనాభా ! ఈ ఆంగ్లేయులను తరిమి కొట్టి
మమ్మల్ని ఉద్ధరించవా మహానుభావా ?
అందమైన సంబోధనలు
చేస్తూనే, శ్రీ నరసింహుని పరాక్రమాన్ని నిందిస్తున్నట్టు గా మాట్లాడటం వ్యాజనింద
గా చెప్పబడుతోంది.ఇక్కడ భక్తుడికి భగవంతుని మీద అపారమైన భక్తి విశ్వాసాలున్నాయి.
కాని ఎందుకో తన ప్రభువు అవసరమైన సమయం లో స్పందించడం లేదనే కోపం , ఆ
స్వామి పై అపారమైన భక్తి వలన ఏర్పడిన
చనువు ఇలా మాట్లాడనిస్తాయి.
జాతి వారలు గాల్చు జాజాయి దెబ్బకు
భయమొందితివేమొ భక్త వరద !
రంగైన యట్టి ఫిరంగీల బారుకు
వణుకు
పుట్టెనొ నీకు వారిజాక్ష !
వీకమై బర్వు తుపాకీల గుండ్లకు
వెఱచి యుండితివేమొ వేదవేద్య !
లీలమై జెలగు పటాలాల గని పాఱి
కొండెక్కి
డాగితో కోమలాంగ !
ఇంత వడి వాడవౌట మున్నెఱుఁగమయ్య !
సమరభీరుడ వౌట నీ జాడ
దెలిసె
క్రీస్తుమతజులఁ జెండుమా
కినుక తోడ
వైరి గజసింహ ! యో బల నారసింహ! (17)
ఓ అహోబిల నరసింహా ! ఓ భక్త సంరక్షకా ! నువ్వు ఇంత సమర భీరుడ వని ఇంతకు ముందు మాకు తెలియదయ్యా ! ఈ తెల్లజాతి వారు పేలుస్తున్న జాజాయీల దెబ్బ కు భయపడిపోయావా ఏమి ప్రభూ
! (జజాయి అనగా ఒక విధమైన ఫిరంగి అని బ్రౌను నిఘంటువు ). పద్మాక్షా !
ఠీవైన ఇంగ్లీషు వారి ఆ ఫిరంగుల వరుసలను
చూసి వణుకు పుట్టిందా ఏమిటి స్వామీ ! వేగంగా దూసుకొచ్చే ఆ
తుపాకీ గుళ్ల కు భయపడి నిశ్చేష్టుడవై ఉండిపోయావా వేదవేద్య ! బారులు , బారులు గా వచ్చే ఆంగ్లేయుల సైనిక సమూహాలను చూసి పారిపోయి కొండెక్కి దాక్కున్నావా కోమల శరీరా. (ఇచ్చట ‘కోమలాంగ!’ప్రయోగం ఎంతో
అర్ధవంతం గా కుదురుకుంది. ఎందుకంటే స్వామి కోమల శరీరుడు కాబట్టే సైనిక పటాలాలను
చూసి పారిపోయి కొండెక్కి కూర్చున్నాడు.) నువ్వు ఇంత వీరుడవన్న విషయం మాకు
ఇంతకు ముందు తెలియదయ్యా ప్రభూ ! ఇప్పుడే నువ్వింత వీరుడవనే
విషయం తేటతెల్లమైంది.
దిగువ అహోబిల మండపం లో చెంచులక్ష్మీనరసింహస్వామి స్ధంభశిల్పం
తుంబుర నారదాదుల గీతములు నీకు
నింపౌనె తంబుర విన్న వెనుక,
సాధుసజ్జనముల సరస జేరుందువే
గో హింసకుల తోను గోష్ఠి మాని ,
అగ్ర జన్ముల చేత నర్చనల్ గొందువె
మత భేదకుల పూజ మరగి నీవు ,శ్ర
భక్తుల పైని ఆసక్తి గల్గునె నీకు
పాద్రీలపై హర్ష భావ
ముడిగి ,
ధర్మ పదవులు ఇకనేల దలతువయ్య
ధరను ధూర్తుల కెల్లను గురుడవైతి
క్రీస్తుమతజులఁ జెండుమా
కినుక తోడ
వైరి గజసింహ ! యో బల
నారసింహ! (18)
శ్రీ అహోబిల నారసింహా.
నీకు వారి ప్రార్ధనా మందిరాలలో వినబడే తంబురాసంగీతం లో తుంబుర నారదాదులు ఆలపించే భక్తిగీతాలు
ఆనందాన్ని కల్గించడం లేదా ? గో హింస చేసే దుర్మార్గుల గోష్టులను వదిలి
సాధు సజ్జనులు చేసే సత్సంగాలకు నీ వెందుకొస్తావయ్యా ? మత
వినాశకుల పూజ లందుకొనే నువ్వు వైష్ణవ
స్వాములు చేసే అర్చనల్ని ఎందుకు స్వీకరిస్తావయ్యా ? ఫాదరీల
మీద ప్రేమభావం పెరిగిన నీకు నారసింహ
భక్తులమైన మాపైన ఇంకా ఆసక్తి ఎందుకుంటుంది ? ఇటువంటి సమయం లో
ధర్మకర్తలమండలి పదవుల గురించి
ఏమాలోచిస్తావు ? (ఈ కవి అహోబల క్షేత్రము
యొక్క రక్షణ , యాజమాన్యము ల తోడి సంబంధము గల ప్రముఖుడై ఉండవచ్చునని ఈ
గ్రంథాన్ని పరిష్కరించిన డా. కే.జే
కృష్ణమూర్తి భావించారు. తన అనుమానాననికి
ఊతమిస్తూ నిన్న మొన్నటి దాకా (క్రీ.శ 1920 ప్రాంతం ) శ్రీశైల క్షేత్రానికి ‘ఆత్మకూరు కిషన్ సింగు ’ వంటి బొందిలీ క్షత్రియులే యాజమాన్యం వహించిన విషయాన్ని ప్రస్తావించారు.) ఈ భూమండలం
మీదున్న దుర్మార్గలందరకీ గురువువై కూర్చున్నావు. శ్రీ యో బల నరసింహా ! ఈ ఆంగ్లేయులను పారద్రోలి
మమ్మల్ని రక్షించవయ్యా !
శ్రీ రమావర
! నారసింహ ! జనార్దన !
వైకుంఠ ! వామన ! వాసుదేవ !
నారాయణాచ్యుత ! నగధర ! గోవింద !
పద్మనాభ !
ముకుంద ! పరమ
పురుష !
పద్మాక్ష !మాధవ
! ఫణిరాజ తల్పగ !
భవహర !శుభ్రాంశు
భానునేత్ర !
సర్వజ్ఞ !
సర్వేశ ! సర్వప్రదా ! హరి !
హరి హర పూజిత ! యాదిదేవ
!
నీలనీరద నిభగాత్ర ! నిగమ వినుత !
భక్తపోషక !శతకోటి భానుతేజ !
క్రీస్తుమతజులఁ జెండుమా
కినుక తోడ
వైరి
గజసింహ ! యో బల నారసింహ! (19)
శ్రీ అహోబిల నారసింహా ! శ్రీ రమానాథా ! జనార్దనా ! వైకుంఠ వాసా !
వాసుదేవా ! వామనా ! నారాయణా ! అచ్యుతా
! కేశవా !
గోవిందా ! పద్మనాభా ! ముకుందా
! పరమపురుషా ! గిరిధరా !
పద్మాక్షా ! మాధవా
! ఫణిరాజ తల్పగా ! మోక్షప్రదాతా ! వాడియైన కిరణములు గల సూర్యునితో సమానమైన
నేత్రములు గలవాడా ! సర్వజ్ఞ !
సర్వేశ ! సమస్తమును ఇచ్చువాడా ! హరీ
! హరిహర పూజితా ! దేవతాదుల చేత , శంకరుని చేత పూజింపబడెడి వాడా
! ఆదిదేవా ! నీలవర్ణపు మేఘము తో సమానమైన దేహకాంతి గలవాడా ! వేదముల
యందు కొనియాడబడినవాడా ! భక్తజన సంరక్షకా ! శతకోటి సూర్య సమాన తేజోవంతుడా ! ఈ ఆంగ్లేయుల దునుమాడి
మమ్మల్ని కాపాడవలసినది స్వామీ !
నరసింహ ! శ్రీ లక్ష్మీనాయక ! నాయందు
గరుణించి, వేగమే కదలి వచ్చి
మతభేదకుల నెల్ల మర్ధించి,జగములో
నిశ్శంక జేయుమా
నిగమములను ;
ధర్మకర్తవు నీవు ధర్బు భువియందు
దొఱగుట నీకది
కొఱత గాదె ?
భూ భార ముడిపిన పుణ్యమూర్తివి; నీకు
ధూర్తుల జంపుట దొడ్డపనియె ?
క్రీస్తుమతజులఁ జెండుమా
కినుక తోడ
వైరి గజసింహ ! యో బల నారసింహ! (20)
శ్రీ లక్ష్మీరమణా ! అహోబిల నారసింహా ! నా మీద దయతో వేగంగా కదలి వచ్చి ఈ
మత విధ్వంసకులను మట్టుపెట్టి ,ఈ లోకం లో వేదాలకు ఇక ప్రమాదం లేదనే విషయాన్ని లోకానికి చాటవయ్యా
! ధర్మకర్తవైన నీకు ఈ భూమి
పై ధర్మానికి భంగం కలగడం అవమానం కాదా
! భూమాత భారాన్నే పోగొట్టిన
నీకు ఈ దుర్మార్గులను చంపడం పెద్దపని కాదు
గదా !
శతృసంహారకుడవైన నీకు అసాధ్యమనేది లేదు కదా ! కాబట్టి ఆంగ్లేయులను తుదముట్టించే ఘన కార్యాన్ని పూర్తిచేసి
, ఘన కీర్తి పొందవయ్యా ప్రభూ !
******************************************************************