శతక సౌరభాలు -1
కంచర్ల గోపన్న దాశరథీ శతకము -1
భక్త రామదాసు అని , భద్రాచల రామదాసు అని , బందిఖానా రామదాసు అని తెలుగు ప్రజలు అంతా అభిమానం గా పిలుచుకునే కంచర్ల గోపన్న - వ్రాసిన భక్తి శతకం దాశరథీ శతకం. భక్త రామదాసు ఈ శతకమే కాక కీర్తనలు కూడ చాలా వ్రాసియున్నాడు. రామదాస ముద్ర కల్గిన రామదాసు కీర్తనలు దాశరథీ శతకాన్ని మించి భక్తలోకం లో ప్రాచుర్యాన్ని పొందాయి. పలుకే బంగారమైన రామచంద్రుని కదిలించి , తానీషా కు పైకం కట్టించి , చెరశాల నుండి విడిపించి , సాయుజ్యాన్ని చేర్చినవి ఈ కీర్తనలే.
కంచర్ల గోపన్న ఆదిశాఖా బ్రాహ్మణుడు. ఆత్రేయస గోత్రుడు. కామాంబ
,లింగనమంత్రి దంపతుల కుమారుడు. గోల్కొండ యందు మంత్రి
పదవుల పొందిన అక్కన్న మాదన్న లకు రామదాసు
మేనల్లుడని రామదాసు చరిత్ర
చెపుతోంది. క్రీ.శ 1664 -1687 వరకు గోల్కొండను పాలించిన తానీషా కాలము లో రామదాసు భద్రాచలానికి తహశీలుదారు గా
నియమించబడినట్లు గా తెలుస్తోంది .
భక్తరామదాసు
దాశరథీ శతకము , రామదాసు కీర్తనలు మాత్రమే కాకుండా మరికొన్ని గ్రంథములు వ్రాసి నరాంకితము చేసినట్లు , దాని వలన తాను
మోసపోయినట్లు దాశరథీ శతకం లోని
ఈ పద్యం లో చెప్పుకున్నాడు .
మసగొని
రేగుబండ్లకును మౌక్తికముల్ వెలపోసినట్లు దు
ర్వ్యసనముఁ
జెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యె
ముత్యాలను రేగుపండ్ల కోసం అమ్ముకున్నట్లు తన కావ్యాలను దురాత్ములకిచ్చి
మోసపొయానని చెప్పుకున్నాడు కాని ఆ
కావ్యాలు ఏవో తెలియడం లేదు. శతక
వాజ్ఞ్మయం లో మాత్రం గోపన్న పేరు ఈ దాశరథీ
శతకం తోనే చిరస్థాయి గా నిల్చిపోయింది. ఈ
దాశరథీ శతకాన్ని నిత్యం పారాయణ
చేసేవారు నాకు తెలుసు. మా జేజమ్మ గారు
తొంభై ఏళ్ల వయసు లో రాత్రి వేళ నిద్ర లో మసలుతూ, దాశరథీ శతకం లోని పద్యాలను వల్లెవేస్తుంటే, పసితనం తో మేము నవ్వుకున్నరోజులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అమృతపు
తునకలు , పాల తారికలు , పూతరేకులు పనసతొనలు వంటి ఈ పద్యాల మాధుర్యం తెలిసిన ఈ వయసు లో ఆ నాటి
చేష్టలు పసితనపు తప్పిదాలు కాక మరేమిటి
అనిపిస్తుందిప్పుడు.
శ్రీ రఘురామ !
చారు తులసీదళదామ ! శమక్షమాదిశృం
గారగుణాభిరామ ! త్రిజగన్నుత శౌర్యరమాలలామ ! దు
ర్వార కబంధరాక్షసవిరామ ! జగజ్జన కల్మషార్ణవో
త్తారక నామ ! భద్రగిరి
దాశరథీ ! కరుణాపయోనిధీ!
ఓ
రామచంద్రా ! దయాసముద్రుడా ! అందమైన తులసీదళమాలలను ధరించినవాడా ! శాంతి , ఓర్పు మొదలైన
సద్గుణముతో శోభించువాడా !. ముల్లోకములచేత కొనియాడబడెడి శౌర్యలక్ష్మీ
సమేతుడా ! దుర్వారపరాక్రముడైన కబంధాసురుని పరిమార్చినవాడా ! లోకములందలి సమస్త
జనులను పాపసముద్రమునుండి తరింపచేయు తారకనాముడా !
భద్రగిరి యందు కొలువుతీరిన దశరధకుమారా ! జయము.
రామ! విశాలవిక్రమ పరాజిత భార్గవరామ! సద్గుణ
స్తోమ ! పరాంగనా విముఖ సువ్రత కామ! వినీలనీరద
శ్యామ ! కకుత్థ్స వంశ
కలశాంబుధిసోమ ! సురారిదోర్బలో
ద్దామ విరామ ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ !
ఓ రామచంద్రా ! గొప్పపరాక్రమ శాలియైన పరశురాముని ఓడించిన వాడవు. సుగుణ రాశివి. పరస్ర్తీలను కామించని వ్రతము గలవాడవు. నీల నీరదశ్యాముడవు. కకుత్థ్స వంశమనెడి పాలసముద్రమునందు పుట్టిన చంద్రుడవు. రాక్షస పరాక్రమమును అణచినవాడవు నైన ఓ భద్రగిరి రామా !
అగణిత
సత్యభాష ! శరణాగతపోష ! దయాలసజ్ఝరీ
విగతసమస్తదోష ! పృధివీసురతోష !
త్రిలోకపూతకృ
ద్గనధురీ మరంద పదకంజ విశేష మణిప్రభాధగ
ద్దగితవిభూష ! భద్రగిరి దాశరథీ !
కరుణాపయోనిధీ !
శ్రీ రామచంద్రా ! అగణిత
సత్యవాక్యపరిపాలకుడా !శరణాగత
రక్షకుడా ! దయచే సమస్త పాపములను పోగొట్టెడి వాడవు.
పృధివీసురలకు ఆనందము కల్గించువాడా ! ముల్లోకములను పవిత్రము చేయు ఆకాశగంగ నీ పదాబ్జములందు ఆవిర్భవించినది. విశేషమైన
మణిమయకాంతులతో ప్రకాశించెడి ఆభరణములను ధరించినవాడా. నీవే మాకు రక్ష.
రంగదరాతిభంగ ! ఖగరాజతురంగ ! విపత్పరంపరో
త్తుంగ తమ:పతంగ ! పరితోషితరంగ ! దయాంతరంగ
! స
త్సంగ ! ధరాత్మజాహృదయ సారసభృంగ ! నిశాచరాబ్జమా
తంగ ! శుభాంగ ! భద్రగిరి దాశరథీ !
కరుణాపయోనిధీ !
శ్రీరామచంద్రా ! చెలరేగెడి
శత్రువులను సంహరించువాడా ! గరుడవాహనా.! ఆపద లనెడి భయంకరమైన కారుచీకట్లను పారద్రోలెడి సూర్యుని వంటివాడా ! సంతోషపెట్టబడిన భూమండలము కలవాడా ! మంచివారిని అభిమానించెడి వాడా ! దయాంతరంగుడవు. జానకీదేవి యొక్క హృదయకమలమునకు తుమ్మెద వంటివాడా ! రాక్షసులనెడి పద్మములకు మత్త మాతంగము వంటివాడా !
భువనమోహనమైన రూపముకలవాడా !
శ్రీద ! సనందనాది మునిసేవితపాద ! దిగంతకీర్తి సం
పాద ! సమస్త భూతపరిపాలవినోద ! విషాదవల్లికా
చ్ఛేద ! ధరాధినాథ కులసింధు సుధామయపాద ! నృత్తగీ
తాది వినోద ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిథీ !
శ్రీదాశరథీ ! సమస్త సంపదలను ఇచ్చువాడా ! సనకసనందనాది మునులచేత
సేవించబడు పాదములు కలవాడా ! దిగంతవ్యాప్తమైన కీర్తి కలవాడా
! సమస్త భూతరాశిని కాపాడుట యందు ఆనందమును పొందెడివాడా ! దు:ఖములను తొలగించువాడా !
రాజవంశమనెడి సముద్రము నందు ఆవిర్భవించిన చందమామా ! నృత్తగీతాది వినోదా !
శ్రీ రామచంద్రా ! శరణు !
చదువుతూ ఉండండి...... మరికొన్ని అందిస్తాను.