పైడిలేడి – అపవాదము
(మొదటి భాగము)
రామాయణ మహాకావ్యంలో సీతారాముల వియోగానికి కారణమైన రెండు సన్నివేశాలను తీసుకొని కావ్యంగా మలచిన మథురకవి శ్రీ నాళం కృష్ణారావు గారు. ఇది రెండు భాగాలు గా విభజించబడిన చిరుకావ్యం.
దీనిలోని మొదటి భాగం జానకీ రామచంద్రుల తొలి
వియోగానికి కారణమైన మాయలేడి వృత్తాంతం కాగా రెండవభాగం
నిండుగర్భిణియైన సీతామహాసాధ్విని అడవిలో వదిలి వేయడానిక కారణమైన
జనాపవాదానికి సంబంధించినది. అయితే ఈ రెండింటిలోను గల సమాన లక్షణం – ఇచ్చట కన్పించేవి రెండే పాత్రలు కావడం- ఆ రెండు పాత్రలు సీతాలక్ష్మణులు కావడం,- అందునా
రెండు ఘట్టాల్లోను నష్టపోయినది సీతమ్మే కావడం గమనించదగ్గ విషయం. ఈ సమాన లక్షణాలే కవిని ఈ కావ్య నిర్మాణానికి
ప్రోత్సహించి ఉండవచ్చు. ఆకారం లో చిరుకావ్యం గా కన్పించినా విశ్లేషణ లో మిన్నగా గోచరిస్తుందీ కావ్యం.
బంగారులేడి వేషం లో రాముని గికురించి దూరం గా తీసుకుపోయాడు మారీచుడు. కోపించిన రాముడు రామబాణాన్ని సంధించాడు. మరణిస్తూ కూడ ప్రభుభక్తి ని ప్రదర్శించుకున్నాడు మారీచుడు. పర్ణశాలలో ఉన్న సీతాలక్ష్మణులు రాముని గొంతుకతో విన్పించిన ఆర్తనాదాన్ని విన్నారు. భర్త కంఠస్వరం విన్న సీతాదేవి రామునకు ఏమైనా ప్రమాదం జరిగిందేమో నని శంకించి, లక్ష్మణుని రామునకు సహాయం గా వెళ్లమని కోరడంతో కావ్యం ప్రారంభమౌతుంది.
“ ఆర్తస్వరం తు తం భర్తు ర్విజ్ఞాయ సదృశం వనే” ( వాల్మీ. రా. అ. 42-1)
అనే వాల్మీకాన్ని ఆధారం చేసుకొని --
“ అదిగో సౌమిత్రి వింటివే యార్తరవము’’
అంటూ ప్రారంభిస్తారు నాళం వారు తన కావ్యాన్ని .
“ పెనగి మృత్యువుపైకొన్న వేళగాని కలుగదెన్నడునట్టి యాక్రందరవము” అని భీతిల్లిన సీత రామునికి సహాయంగా లక్ష్మణుని వెళ్లమంటుంది.అయితే రాక్షసుల మాయలు ,రామచంద్రుని పరాక్రమము తెలిసిన లక్ష్మణుడు కదలకుండా అలాగే ఉండిపోయాడు.భయపడింది. అనుమానించింది సీత. “ మీ అన్న మీద కన్న నామీద ఎక్కువ గౌరవం చూపించే వాడివి. ఇప్పడేమయింది. పిలిచినా పలుకని స్థితిలో ఉన్నావు.
“ మున్ను నా పాదముల భక్తి మ్రొక్కి గాని అన్న మొగమైన చూడవు కన్నులెత్తి” అంటూ ఇంతకు పూర్వము లక్ష్మణునిలో ఉన్న భక్తి ప్రపత్తుల్ని గుర్తుచేసి, తుదకు లక్ష్మణుడు వెళ్లకపోతే తన భర్తను కాపాడుకోవడానికి తానే వెడతానని బయలుదేరుతుంది సీతాదేవి.
“ భ్రాత కాపాడ నీకంత భీతియున్న
నిలిచియుండుము నీవిట నేనెపోయి
శత్రువుల
నెల్ల నొకపెట్టి జక్కడించి
స్వామి గొను వత్తు తలపువ్వు వాడకుండ”
- అనడంలో శతకంఠ. సహస్రకంఠ రామాయణాల్లో దర్శనమిచ్చే శక్తి స్వరూపిణి యైన సీతామాత ను దర్శింప చేస్తారు కవి. “తల పువ్వు వాడకుండ స్వామి గొనువత్తు” నన్న సీత నాళం వారి వీరవనిత. ఇక్కడ చక్కని తెలుగు నుడికారం పరిమళించింది.
‘’
మేక వన్నె పులిలాగ ఇంతకాలం రాముని
వెంటతిరిగావు. నీతత్త్వం ఇప్పుడు నా కవగతమైంది. ఎంత కుటిలాత్ముడ ‘’వంటూ నిందించడమే కాకుండా కర్ణకఠోరంగా -
“
వాడు చచ్చిన తోడ నా పీడ వదులు
వాని భార్యను
చేపట్టి వైభవంబు
మించ నేలెద
గాకంచు నెంచితేమొ
నిలువు నీఱయి
కూలవె తులువ యిపుడ “
--- అన్న మాటలు వాల్మీకి సీతమ్మవే.
“ ఇచ్ఛసి త్వం వినశ్యంతం రామం లక్ష్మణ మత్కృతే
లోభన్మమ కృతే నూనం
నానుగచ్ఛసి రాఘవం “ (వాల్మీ.రా. అ 45-64).
భావాలు మూలానుసరణమే అయినా తేటతెనుగు మాటల్లో రూపుదిద్దుకున్న పై పద్యం కాఠిన్యతను సంతరించుకొని ,చటుక్కున గుండెకు గుచ్చుకుంటుంది. “ వినశ్యంతం రామం” అన్న పదాలకు” వాడు చచ్చినతోడ “ అని ప్రారభించి,” ఆ పీడ వదలు” అంటూ పలికి” లోభాన్మమ” అన్నపదాన్ని ఆథారం చేసుకొని” వానిభార్యను చేపట్టి వైభవము మించ నేలెద గాక” అంటూ పలకడం,” నిలువు నీఱయి కూలవె తులువ “ అన్న చోట నిలువునా బూడిదై పోతావు అన్న తెలుగువారి తిట్టును గుర్తుచేస్తూ గాంభీర్యాన్ని సంతరించుకొంది.
“తమ్ముడొక్కండు రాజ్యంబు తస్కరించె
బలిమి నొక్కడు భార్యఁ
జేపట్టనెంచె”
రాముని తమ్ముళ్ల లో ఒకడు రాజ్యాన్ని కాజేస్తే,వేరొకడు భార్యనే కాజేద్దామని కూర్చున్నాడు.” ఏమి కావింప నుండెనో యింకనొకడు.”? ఇక మూడో వాడు ఏమి చేయబోతాడో అంటూ –“ మంచితమ్ముల కూర్చెరా …. బ్రహ్మ” అనేస్తుంది నాళం వారి సీత.
పిడుగులు కురిపిస్తున్న జానకి పలుకులు వినలేక పోయాడు లక్ష్ణణుడు “హరిహరీ! తల్లీ ! ఎంతమాటాడినావు” అంటూ గిజగిజ లాడిపోయాడు.శాంత హృదయయైన సీత ఇంత నిష్టూరంగా మాట్లాడటం మంచు ముద్దనుండి ప్రచండాగ్ని పుట్టినంత ఆశ్చర్యాన్ని కల్గించింది లక్ష్మణునికి. కలత చెందాడు .
రాక్షస మాయలను భేదించడం రాముని కసాథ్యంకాదని, ముల్లోకాలెత్తి వచ్చినా రాముని కపజయం తటస్థించదని అంటాడు లక్ష్మణుడు మూలంలో . “త్రిభుర్లోకై స్సముద్యుక్తై సైశ్వరైరపి సామరై:’’ (వాల్మీ.అ.45-161). దీన్ని ఆథారం చేసుకొని --
“ రాముడెన్నగ నాది నారాయణుండు
కాని కేవల సామాన్య మానవుండె
అవని
భారంబు హరియింప నవతరించె
ననుచు మౌనులు వచియింప వినవె తల్లి ‘’
- అని రాముని పరమాత్మగా స్తుతించిన మునుల వాక్యాలను గుర్తుచేస్తాడు.ఎల్లలోకాలు ఎవని సహాయం లేకపోతే నిముషం కూడ నిలబడలేవో ఆమహనీయునకు నేను సహాయం గా వెళ్లడమా అంటూ ఆశ్చర్యపోయిన లక్ష్మణుడు వాల్మీకి సృష్టి కాదు. ఒంటరిగా నిన్ను వదలి వచ్చినందుకు అన్నగారు కోపించి నావంక చూస్తే ఏమి చెప్పుకోవాలి అన్న ప్రశ్న నాళం వారి లక్ష్మణునిది.
“ నిన్ను కాపాడమని యన్న నిలిపె నన్ను
అన్న కాపాడ బొమ్మని యనిపెదీవు
ఏది కర్తవ్యమో నిర్ణయింప జాల
ముందు జన నూయి వెనుక
గోయి’’
- ఎవరి ఆజ్ఞను పాటించాలో తెలియని డోలాయమాన స్థితి లో లక్ష్మణుడు – కర్ణ కఠోరమైన సీతమ్మ మాటలు వినుటకంటె అన్న కోపాగ్ని కి ఆహుతి అగుటయే మేలు అని నిర్ణయించుకొని వెళ్లపోతానంటాడు. ఈ సందర్భం లో లక్ష్మణుడు ఆడవారి ప్రవర్తనను వివరిస్తూ,--
‘’వాక్యమప్రతిరూపంతు నచిత్ర స్త్రీషు మైథిలీ
స్వభావస్త్వేషు నారీణా మేవం లోకేషు దృశ్యతే
విముక్త ధర్మా శ్చపలా స్తీక్ష్ణా భేదకరా
స్త్రియ: ‘’ ( వా.రా.అ 45- 284-294)
అంటాడు .ఈ మూలాన్ని ఆధారం చేసుకొని,
“ తమ హితము తామెఱుగరు తమ హితంబు
గోరి యొరులాడు పల్కుల చేరి గొనరు
తాము చెప్పన మాటలె
తథ్యమనుచు
పెనగెదరు చాన లెంత వెడగులౌర !”
- అన్న మాటలు ఆథునిక లక్ష్మణునివి. ఆడవారి కోపం వలన వచ్చే అనర్థాలు, వానిని అవగాహన చేసుకోగలిగిన పరిపక్వత ఈ లక్ష్మణుని లో కన్పిస్తాయి. సీత ఆజ్ఞను శిరసావహించి, అన్న కోసం వెడుతున్న లక్ష్మణుడు వాల్మీకం లో-
‘' స్వస్తి తే2స్తు వరాననే ,రక్షంతు త్వాం విశాలక్షి సమగ్రా వనదేవతా: ‘’(వా.రా.అ.45-331)
“తల్లీ! నీకు శుభమగు గాక,! వనదేవతలు నిన్ను రక్షింతురుగాక!” అంటూ ప్రార్థిస్తాడు లక్ష్మణుడు.
“ ప్రభుని తోడ్కొని మగుడ నేవచ్చుదాక
ఎవ్వడైనను నిను ముట్టెనేని , తోన
పుడమి పై గూలు గావుత బూది యగుచు”
-అని శాపం పెట్టి వెళ్లాడు నాళం వారి లక్ష్మణుడు. లక్ష్మణుడు అటు వెళ్లగానే సీతమ్మకు దు:ఖం పెల్లుబికింది. అనేక దుశ్శకునాలు గోచరించాయి. ఏ ప్రమాదం ముంచుకొస్తుందో నని భయ పడుతూనే, ఎన్ని ఇబ్బందులొచ్చినా భయపడను కాని -
‘’ చారుగుణ శీలు, సన్నుతాచారలోలు,
మఱది తిట్టితి, దానికి మ్రగ్గుదాన’’
- అని మఱది ని తిట్టినందుకు పశ్చాత్తాపపడిన జానకి తెలుగుకవి సృష్టి. వాల్మీకి సీతలో ఈ విధమైన పశ్చాత్తాపం రావణాపహరణం తరువాత కన్పిస్తుంది. కానీ ఈ కావ్యంలో ఈ ప్రదేశం లోనే తన మాటల్లోని తొందరపాటు ను వెంటనే సీత గుర్తించినట్లు వ్రాయడం మైథిలీ పాత్రకు మరింత ఉన్నతిని కల్గిస్తుందని కవి భావించి ఉండవచ్చు.
‘’ ఆత్మ సుఖము ను వర్జించి యన్న కొఱకు
అడవులం బడి ఇడుముల
గడుచుచున్న
దురిత దూఱుని లక్ష్మణు దూఱి యుంటి
కట్టి కుడుపక యున్నే యీ
కర్మఫలము.’’
- అని విచారిస్తున్న సీతమ్మ పల్కులు భవిష్య సూచకాలు గా థ్వనిస్తాయి. రామాయణ కథ అందరికీ తెలిసిందే అయినా తెలుగు సామెతలు, జాతీయాలు అందంగా రచనలో చోటుచేసుకొని కావ్యానికి స్వతంత్రపత్తిని కల్గించాయి.
ఇక ఈ కావ్యం లో
రెండవభాగం అపవాదము.
******************************************************************************************