Sunday, 18 May 2014

దాశరథీ శతకము -- దశావతార వర్ణన



                           దాశరథీ శతకము --     దశావతార వర్ణన 
                          
                        


                               ఖమ్మంజిల్లా   నేలకొండపల్లి   భక్త రామదాసు గా  లబ్ద ప్రతిష్టుడైన కంచెర్ల గోపన్న జన్మస్ధలం.  అక్కడ  రామభక్తులు  కొందరు భక్త రామదాసు కళాపీఠాన్ని స్ధాపించి ప్రతి సంవత్సరం అక్కడ శ్రీ భక్తరామదాసు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తుంటారు. తమ్మరగోపన్న గా ప్రసిద్ధులైన  నరహరి గోపాలచార్యులవారి ద్వారా నాకు ఈ నిర్వాహకులు దగ్గరయ్యారు. ఇరవై సంవత్సరాల క్రితం   ఈ భక్త రామదాసు కళాపీఠం కన్వీనర్ గా శ్రీ భీకమ్ సింగ్ అనే మాజీ పోలీసు అధికారి ఉండేవారు .వారు రామభక్తులు. పరమసాత్వికులు . అతిథిసేవాతత్పరులు .  ఆరాధనోత్సవాల్లో భాగం గా సంగీత కచేరీలు ,ఉపన్యాసాలు  , అష్టావధానాలు వంటివి నిర్వహించేవారు. ఆ మహోదయుల ఆహ్వానం మేరకు  వరుసగా మూడు సంవత్సరాలు ఆ ఆరాధనోత్సవాల్లో   భాగస్వామినయ్యే భాగ్యం నాకు లభించింది.
                   
                       ఆ తరువాత కూడ   వారు ఆహ్వానం పంపించడం, నేను ప్రయాణ అసౌకర్యం , అర్థరాత్రి ప్రయాణాలతో అలసిపోయి , అనంతర కాలం లో సున్నితంగా  మానివేయడం జరిగింది . శ్రీ భీకమ్ సింగ్ గారు  నేను రానందుకు బాధ పడుతూ ఒకటి రెండు ఉత్తరాలు  కూడ వ్రాశారు . తరువాత  ఆ సంబంధం మరుగున పడిపోయింది .కాని  నేలకొండపల్లి శ్రీభక్త రామదాసు కళాపీఠం  ఇప్పటికీ నా మనస్సులో ఆ జ్ఞాపకాలను అలానే ఉంచుకుంది . భక్తరామదాసు కళాపీఠం నిర్వాహకులకు  నేను ఇప్పటికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 
                      
                              మత్స్యావతారము
           

           వారిచరావతారమున వారధి లో జొఱఁ బారి క్రోధ వి
           స్తారగుడైన  యా నిగమ తస్కర వీర నిశాచరేంద్రునిన్
             జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికిన్  మహో
                              దారత నిచ్చి తీవె కద ?  దాశరథీ ! కరుణాపయోనిధీ. !    ( 69 ప )
             
                   శ్రీరామా ! చేప రూపమును ధరించి సముద్రములో ప్రవేశించి , వేదముల దొంగిలించిన సోమకాసురుడు సముద్రము లో  దాక్కొని ఉండగా , వానిని సంహరించి , ఆ వేదములను తీసుకొచ్చి ,  వాని చిక్కు విడలించి , బ్రహ్మదేవుని కిచ్చి ,నీ గొప్పతనము ను ప్రదర్శించినావు.                
           
                                       కూర్మావతారము

                   కర మనురక్తి మందరము కవ్వముగా  నహిరాజు త్రాడుగా
           దొరకొని దేవదానవులు దుగ్ధపయోధి మధించుచున్నచో
           ధరణి చలింప , లోకములు తల్లడమందగఁ గూర్మమై ధరా
           ధరంబు ధరించి తీవె కద ? దాశరథీ ! కరుణాపయోనిధీ. !

                              శ్రీరామచంద్రా !  పూర్వము దేవదానవులు అమృతము కోసం మందర పర్వతమును కవ్వము గాను,వాసుకిని త్రాడు గాను చేసికొని పాలసంద్రమును మధించుచుండగా  లోకములు తల్లడిల్లగా,  భూమి చలించి పోగా, తాబేటి రూపము తో  మందరమును ధరించినది నీవే కదా !

                                 వరాహావతారము

             ధారుణిఁజాపఁ జుట్టిన విధంబున గైకొని హేమనేత్రుఁ డ
          డవ్వారిధి లోన డాగినను వాని వధించి వరాహమూర్తి వై
          ధారుణిఁతొంటి  కైవడిని దక్షిణ శృంగమునన్ ధరించి వి
          స్తార మొనర్చి తీవె కద ? దాశరథీ ! కరుణాపయోనిధీ. !

                                       శ్రీరామా ! పూర్వము హిరణ్యాక్షుడు భూమిని చాపచుట్ట గా చుట్టుకొని  , సముద్రము లో దాగుకొన్నప్పుడు  నీవు వరాహరూపమును ధరించి వానిని  సంహరించి ,  భూమిని కుడి కోరను పైకెత్తి , వెడల్పు చేసి రక్షించినది నీవే కదా  !

                     నృసింహావతారము

       పెటపెట నుక్కఁగంబమున భీకర దంత నఖాంకుర ప్రభా
         పటలము  గప్ప నుప్పతిలి భండనవీధి నృసింహ భీకర
         స్పుట పటుశక్తి హేమకశిపున్ విదళించి , సురారి పట్టి నం
         తటఁ గృపఁ జూచి తీవె కద ? దాశరథీ ! కరుణాపయోనిధీ. !

                            శ్రీ దాశరథీ ! దయానిథీ  ! ఉక్కు కంబమును  పటపట  చీల్చుకొని  అందు భయంకరమైన  దంత నఖాంకుర ప్రభలు వ్యాపింపగా ఆవిర్భవించి , యుద్ధమున  హిరణ్య కశిపుని సంహరించి , అతని కుమారుడైన ప్రహ్లాదుని  దయతో రక్షించినది నీవే కదా రామచంద్రా !
                          
                                 వామనావతారము
         
       పదయుగళంబు భూగగనభాగములన్ వెసనూని , విక్రమా
       స్పదుడగు నబ్బలీంద్రు నొకపాదమునం దలక్రిందు నొత్తి మే
       లొదవ జగత్రయంబు పురుహూతున కీయ వటుండవైన చి
       త్సదమలమూర్తి నీవెకద ? దాశరథీ ! కరుణాపయోనిధీ. !
       
             శ్రీరామా !  భూమ్యాకాశములను  రెండు పాదముల నాక్రమించి, పరాక్రమవంతుడైన బలిచక్రవర్తిని  వేరొక పాదమున పాతాళమునకు త్రొక్కి , ముల్లోకములను దేవేంద్రునకు ఇచ్చుటకు బ్రహ్మచారి రూపమును దాల్చిన  సచ్చిదానంద మూర్తివి నీవే కదా  !

                          పరశురామావతారము

            ఇరువది యొక్కమార్లు ధరణీశులనెల్ల వధించి , తత్కళే
       బర రుధిర ప్రవాహమునఁ బైతృక తర్పణ మాచరించి ,భూ
       సుర వరకోటికిన్ ముదము చొప్పడ భార్గవ రామమూర్తి వై
                            ధరణి నొసంగి తీవె కద ? దాశరథీ ! కరుణాపయోనిధీ. !                        

                             శ్రీ దాశరథీ ! ఇరవై యొక్కసార్లు  రాజులను సంహరించి , వారి యొక్క నెత్తుటి ప్రవాహము చేత పితృ తర్పణ మొసంగి , విప్రులకు సంతోషము కల్గునట్లు గా  భూమిని దానము చేసి నట్టి భార్గవరాముడవు నీవే కదా !
                          
                                             శ్రీ రామావతారము
       
      దురమునఁ దాటకం దునిమి ధూర్జటి విల్దునుమాడి ,సీత నుం
      బరిణయ మంది , తండ్రి పనుపన్ ఘన కాననభూమి కేగి , దు
      స్తర పటు చండ కాండ కులిశాహతిఁ రావణ కుంభకర్ణ భూ
       ధరములుఁ గూల్చి తీవె ; దాశరథీ ! కరుణాపయోనిధీ. !
      
                            శ్రీ రఘురామా  ! యుద్ధమున తాటకిని సంహరించి , శివధనుస్సును విఱిచి సీతమ్మ ను పెండ్లాడి , తండ్రి ఆజ్ఞ తో  ఘోరారణ్యములకు వెళ్ళి . భయంకరమైన వజ్రాయుధము వంటి నీ దివ్యబాణముల చేత  పర్వతముల వంటి రావణ కుంభకర్ణులను  నేలగూల్చిన మహా వీరుడవు నీవే  కదా రామా !                
                                        
                          బలరామావతారము      
        
         అనుపమ యాదవాన్వయ సుధాబ్ది సుధానిధి  కృష్ణ మూర్తి నీ
        కనుజుడు గా జనింపఁ గుజనావలి నెల్ల నడంచి  , రోహిణీ
        తనయుఁ డనంగ బాహుబలదర్పమునన్ బలరామమూర్తి వై
        తనరిన వేల్పు నీవె కద దాశరథీ ! కరుణాపయోనిధీ. !      
         
                   శ్రీ రామచంద్రా !  సాటిలేని యాదవవంశమనెడి పాలసముద్రము నందు పుట్టిన చంద్రుని వంటి వాడైన శ్రీకృష్ణునకు అగ్రజుడవై ,  దుర్మార్గులను మట్టుపెట్టి , రోహిణీ కుమారుడు గా గొప్ప బలపరాక్రమములతో ప్రకాశించిన   శ్రీబలరామమూర్తి వి నీవే కదా స్వామీ !      

                                 బుద్ధావతారము

                    సురలు నుతింప త్రిపుర సుందరులన్ భ్రమియింప బుద్ధ రూ
              పరయగ దాల్చితీవు , త్రిపురాసురకోటి దహించునప్పుడా
        హరునకుఁ దోడుగా వరశరాసన బాణముఖోగ్ర సాధనో
                  త్కర మొనరించి తీవె కద ? దాశరథీ ! కరుణాపయోనిధీ. !   

                                శ్రీరామా !  దేవతలు స్తుతించునట్లు గా త్రిపురాసురుల భార్యలు భ్రమించునట్లు బుద్ధుని గా అవతరించినావు . ( ? ) త్రిపురాసుర సంహార సమయమున  శంకరునకు సహాయము గా  ఆతనికి కావలసిన ధనుస్సు , బాణము మొదలైన సాధనములను సమకూర్చినది నీవే కదా !

                      కల్క్యావతారము


          సంకర దుర్గమై  దురిత సంకులమైన జగంబుఁ జూచి  స
          ర్వంకష లీల నుత్తమ తురంగము నెక్కి కరాసిఁ బూని వీ
          రాంక విలాసమొప్పఁ గలికాకృతి సజ్జనకోటికిన్ నిరా
                       తంక మొనర్చి తీవె కద ? దాశరథీ ! కరుణాపయోనిధీ. !  (78 ) 
      
                              శ్రీరామచంద్రా ! లోకమంతయు సంకరమై, పాపపంకిలమైన లోకమును ఉద్ధరింపగా   ఉత్తమాశ్వము నధిరోహించి , ఖడ్గము ను చేబూని మహావీరవిలాసము తో కల్కి రూపుడవై మంచి వారిని బ్రోచు  మహనీయుడవు నీవే కదా. !



*********************************************************************************


No comments: