Tuesday, 23 April 2013

శ్రీరామ కావ్యామృతం-4 శ్రీ కేశిరాజు నృసింహుని పంచవటి


 శ్రీరామ కావ్యామృతం – 4
                            

                            శ్రీ  కేశిరాజు  నృసింహుని     పంచవటి
                   
                        
                     పంచవటి దాపున పర్ణశాల వెలసింది.పరవానస్మి కాకుత్థ్స!” అంటూ అన్నగారి కనుసన్నల తోనే కార్యాలను చక్కపెట్టేస్తున్నాడు సుమిత్రానందనుడు. వలసిన సంభారాలను లక్ష్మణుడు సమకూరుస్తుంటే, ఇల్లాలు సీతమ్మ  సౌకర్యాలు చూస్తుంటే రాజ్యహీనతాకలితుడైన రాముని కాపురం సుఖంగా సాగిపోతోందని   కవి అభిభాషణ.   


           
                       
                  

                సీతారాములు ప్రతి సాయం కాలం చెట్టాపట్టాలేసుకొని,  నడిచి నడిచి దగ్గరలోని ఒక కొండ శిఖరానికి చేరి, అక్కడున్న  చల్లని సెలయేటి నీటిలో కాళ్లు కడుక్కొని, పక్కనే ఉన్న పలక రాయిపై కూర్చున్న  మునుపటి ముచ్చటలను చెప్పుకుంటూ, ప్రొద్దుపొవడాన్ని కూడ గమనించే వారు కారట. మునుపటి ముచ్చటలను కలియబోసుకుంటూ ఏటిదరి బండరాళ్లపై  కూర్చొన్న సీతా రాములను దర్శించిన భాగ్యశాలి పంచవటి కావ్య రచయిత శ్రీ కేశిరాజు వెంకట నృసింహ అప్పారావు.
                           


    వర్షాకాలం లో వరద గోదావరి  సౌందర్యాన్ని చూచి. జానకీ మాత హృదయం పులకించి పోయేది.
                   

                       వనగజ  హస్తథూత తరుపాలిత పుష్పవిశోభి వేణియై
                       ఘనరస మిశ్రతోపచితగైరిక ధాతుకృతాంగ చర్చయై
                       మునుకొని మేరమీటు రసపూర్ణత నిర్మలినాంతరంగయై
                        తన విభుజేరు థూతదురితన్ నదిగాంచెను సీత ప్రీతయై
           

    సాగరుని చేరుతున్న గౌతమి లో నిండు ముత్తైదవుగ విభుని  చేరుతున్న తెలుగింటి ఆడపడుచు ను దర్శించింది సీతమ్మ. శరత్కాల  శారద యై, వసంత లక్ష్మి యై,గ్రీష్మాతపం లో తప:కృశీగాత్ర గిరిజయై, ముగురమ్మలుగ  భూజాత కు గౌతమి దర్శనమిచ్చేది.
                   
      గోదావరీతీర కొవ్వూరు నివాసియైన ఈ కవి కి గోదావరీ మాత అంటే ఉన్న అభిమానం , ప్రేమ, గౌరవం, మాతృమూర్తి పై నున్న మమకారం వలె అతి తియ్యనిది. అత్యంత లోతైనది. అతి పవిత్రమైంది. వర్ణించడానికి అక్షరాలు చాలనిది .  అందుకే ఈ కావ్యమంతా గౌతమీ మాత పరమ పవిత్ర వర్ణనా గానంలో సీతారామ కథా గానాన్ని సమ్మిళితం చేసి సుమధుర మంజుల మనోజ్ఞం గా గానం చేస్తారు కవి.
                    
        వసంతం లో తలనిండ పూలు ధరించిన నవవధువుగా, వర్షాకాలం లో నిండు చూలాలిగా, నీరింకిన గ్రీష్మం లో ద్వీపాలనే బిడ్డలను లాలిస్తున్న  బాలింత గా, మహీజ కు కన్పించేది గోదావరి. కార్తీకం లో జానకి అర్పించిన దీపహారతులతో రాత్రివేళ  చుక్కల హారాన్ని ధరించిన  ఆకాశగంగయై భాసించేది గౌతమి.



                
                      ఆ అడవి లో ఆడతోడు లేని సీతమ్మ కు తానే తోడునీడగా నిలిచింది గౌతమి. వారిరివురు ఎన్నోఊసులను మూగగా  పంచుకొనేవారు. భూజాత స్నానమాడేవేళ తన లలితమైన తరంగ హస్తాలతో ఒళ్ళు రుద్ది నీళ్ళు పోసేది తల్లి గా గౌతమి. బరువైనకలశాన్ని లేపలేక సుకుమారి సీత ఇబ్బంది పడుతుంటే, - మృదుతరంగ హస్తాలతో తేలిక చేసి మంచినీటి కలశాన్ని భుజానికెత్తేది.పగలంతా అలసిపోయి  ప్రియ నాథుని భుజోపధానమున నిదురించెడి పృధ్విజ కు మృదు శీతల వాయువులను సేవకై పంపేది.
                      

                 ప్రభాతవేళ లో పద్మ సుగంధాలను పర్ణశాల లోనికి  పంపి ప్రభాత గీతికలతో శ్రీరామపత్ని ని మేల్కొల్పేది . అందుకే గౌతమి తో  సీతకు విడదీయలేని  అనుబంథం ఏర్పడింది. ఆ స్నేహబంథాన్ని మక్కువ మీఱ నాథుని తో ముచ్చటించేది జానకి. తన స్నేహితురాలి  మంచితనాన్ని గూర్చి ఇల్లాలు చెపుతుంటే శ్రీరాముడు సుందర దరహాస కౌముది వెదజల్లి, గడువు లేని వనవాసాన్ని  తల్లి విధించి వుంటే , ఎంత బాగుండేది. సీత  తో కలసి  ఈ గౌతమీ తీరం లో ఉండటమే ఎంతో ఆనందం గా ఉందనుకున్నాడట  సీతామనోభిరాముడు.  తన ప్రాణసఖి యైన సీతకు  ప్రాణ స్నేహితురాలైన గౌతమి యొక్క  గొప్పతనాన్నిఇలా  కొనియాడాడు శ్రీరాముడు.
         

         “ కోరిన భుక్తి ముక్తి నిడుకొంగున బంగరు మానవాళికిన్
           భారతమాత నెన్నడుమునన్ ధరియించిన హేమకాంచి, భా
           గీరథియక్క,యీశ్వరునకిన్ బ్రియురాలు,ఋషీంద్ర సప్తకం
            భారతి పట్టినట్టి విమలాశయ, గౌతమి, మ్రొక్కుమో ప్రియా
      
            ఈ స్తుతి   గోదావరి తో తెంచుకోలేని  అనుబంధాన్ని పెంచుకున్న కేశిరాజు గారిదే. కవి కి గోదావరి పై నున్న ప్రపత్తి అటువంటిది.
                   
             ప్రాణనాథుని  మాటలలో గౌతమీ ప్రాభవాన్ని విన్న వైదేహి భక్తితో చేతులు జోడించి, తన వల్లభునితో ఏనాడు  తనకు ఎడబాటు రానివ్వవద్దని గౌతమిని వేడుకొంటుంది.
            
               రాముని వీడి నేక్షణము బ్రాణము నిల్పగ జాల భూమిపై
                రాముడు నట్లె నన్ను దన బ్రాణ సమానను వీడనెంచ డీ
                నేమము దప్పు  మైమఱపు నొక్కొని యొండొరు వీడకుండ
                 మాకో మహనీయమూర్తి సదయోద్యత చిత్తత నీవె దీవెనల్.
           

               యొండొరు వీడకుండ దీవెనలిమ్మని బేలగా అర్ధిస్తున్న అవనిజ ను ప్రేమగా  తదీయ కంబు శోభాయుత కంఠసీమ  దన బాహువు నుంచి దగ్గరగా తీసుకున్నాడు రఘురాముడు. రాక్షస మాయలో చిక్కుకొని నీవు నన్నుదూరం గా పంపించక పోతే మనల్ని విడతీసేవాడే లేడంటాడు.      ఎందుకంటే వనితల చిత్తముల్ కనకవస్తువులన్న భ్రమించుగా వెసన్ అంటూ    ఆడవారు బంగారమంటే మోజు పడతారుకదా! అనేశాడు.  అంతేకాదు.
           

            నీ మహనీయ సంగతి ని నిల్చుట చేతనె నాకుగూడ శ్రీ
             రాముడు దేవుడన్ యశము రాజిలు నీ భువి నెల్లచోటులన్
            
      నీవు ఉండటం వలననే నేను శ్రీ  రాముడ నయ్యానని, దేవుడనే కీర్తి దక్కుతుందని అంటాడు . అంతే కాకుండా  ఇల్లాలికి ధైర్యం చెపుతూ,--
            

                    ..........................మామక కాంతకు నీకు నెవ్వడే
              నహిత మొనర్ప నెంచినను నయ్యది చెల్లదు, వాడు వార్థి లో
              గృహమును గట్టుకొన్నను నొకే యొక యంగను దాటజాలు ధూ
              ర్వహు డొక డెవ్వడో వినయభావుడు పావనమూర్తి వచ్చు జూ
             
              లంకలో కొంప కట్టుకున్నా నా ఇల్లాలికి హాని చేయ  తలపెట్టిన వాడ్ని వదలను. సముద్రాన్ని  ఒకే అంగలో దాటకల్గిన వినయభావుడు,-  విశ్వాసపాత్రుడు నైన రామబంటు లభిస్తా డంటాడు శ్రీరాముడు. ప్రాణనాథుని పల్కులతో ఊరట చెంది, నాథుని కౌగిలి లో ఒదిగి  గౌతమి కి పుష్పాంజలి సమర్పించింది జానకి. తుమ్మెదలు కదల్చిన పూ రాశులతో తీయమామిడి  సీతారాముల పై ఆశీర్వర్షాన్ని  కురిపించింది. 
              
         శ్రీ సీతారాముల ఏకాంత విహారాల్ని, ప్రణయ జీవనాన్ని  గౌతమీ తీరాన రస రమ్యంగా  వర్ణించి, గోదావరి పై తనకున్న ప్రేమాభిమానాలను, గౌరవ ప్రపత్తులను  శ్రీ రామకథ  తో   కలిపి చెప్పిన  కవన చాతుర్యం శ్రీ కేశిరాజు  వారిది .




*****************************************************************




No comments: