శతకసౌరభాలు-7
శేషప్ప కవి
-నరసింహశతకము .6
అర్థి
వాండ్రకు నీక హాని చేయుట కంటే-దెంపు తో వసనాభి దినుట మేలు
ఆడుబిడ్డల
సొమ్ము నపహరించుట కంటె-బండకట్టుక నూత బడుట మేలు
పరుల
కాంతల బట్టి బల్మి గూడుట కంటె- బడబాగ్ని కీలల బడుట మేలు
బ్రతుకజాలక
దొంగ పనులు చేయుట కంటె- కొంగుతో ముష్టెత్తు కొనుట మేలు
జలజదళనేత్ర
నీభక్తజనులతోడ- జగడమాడుట కంటెను చావుమేలు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ!.యాచకులకు దానం చేయకుండా
ఉండటమే కాక దానం చేయనివ్వకుండా అడ్డంపడటం కూడ పాపమే. ఇటువంటి పాపాలు చేసినదాని
కంటే ఇంత విషం తిని చావడం మేలు. నాభి అనేది విషతుల్యమైన ఒక మూలిక. దీనిని
ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తూ ఉంటారు.ఆడపడుచుల
ఆస్తులను అపహరించిన దానికన్నా మెడ కు ఒక
బండరాయి కట్టుకొని నూతిలో దూకి చావడం మంచిది.
నూతి లోకి చావాలని దూకినప్పుడు
దూకగానే పైకి తేలితే చూసినవాళ్లెవరైనా
దూకి కాపాడే ప్రమాదం ఉంది. అదే మెడకు బండ కట్టుకొని దూకితే పైకి తేలే
అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితం గా
మరణించవచ్చని ప్రజల్లో ఒక ఆలోచన ఉంది. పర స్త్రీలను బలవంతంగా పట్టుకొచ్చి అనుభవించిన దాని కంటే నిప్పుల గుండం లో దూకి చావడం
మంచిది. బ్రతడానికి దొంగపనులు చేసిన దాని కంటే ఏ గుడి మెట్లమీదో కొంగు పఱుచుకొని
అడుక్కోవడం, ముష్టెత్తు కోవడం మంచిది. నీ భక్తులైన హరిదాసులతో తగవులాడుట కంటే చావడం నయం.
పసరంబు
పంజైన బసులఁగాపరి తప్పు-ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు
భార్య
గయ్యాళైనఁ బ్రాణనాధుని తప్పు-తనయుండు దుష్టైన తండ్రి తప్పు
సైన్యంబు
చెదరిన సైన్యనాథుని తప్పు-కూతురు చెడుగైన మాత తప్పు
అశ్వంబు
చెడుగైన నారోహకుని తప్పు –హస్తి దుష్టైన హస్తీపకుని తప్పు
ఇట్టి
తప్పు లెఱుంగక యిచ్చవచ్చి-నటుల మెలగుదు రిప్పుడీ యవని జనులు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
శ్రీ ధర్మపురి
లక్ష్మీనరసింహా ! ఒక
పశువు పనికిరానిదై క్రూరం గా
ప్రవర్తిస్తోందంటే అది పశువుల కాపరి తప్పు.భార్య గయ్యాళిగా మారిందంటే అది భర్త
చేతకానితనం.కొడుకు చెడునడత గలవాడైతే అది తండ్రి తప్పు. యుద్ద రంగం నుండి
సైన్యం పారిపోతోందంటే అది సైన్యాధికారి అసమర్ధత. కూతురు చెడిపోతోందంటే
అది తల్లి తప్పు.గుఱ్ఱము చెడ్డదయితే రౌతు తప్పు. ఏనుగు మొండికేస్తోందంటే తప్పు మావటి వానిదే కదా.
ఇటువంటి తప్పులు తెలుసుకోలేక లోకం లో
ప్రజలు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు.
కోతికి జలతారు కుళ్ళాయి
యేటికి-విరజాజి పూదండ విధవ కేల
ముక్కిడితొత్తుకు
ముత్తెంపునత్తేల-అద్దమేటికి జాత్యంధునకును
మాచకమ్మకు నేల మౌక్తికహారముల్-క్రూర
చిత్తునకు సద్గోష్ఠులేల
ఱంకుబోతుకు నేల బింకంపు నిష్టలు-
వావియేటికి దుష్టవర్తనునకు
మాట నిలకడ సుంకరి మోటుకేల- చెవిటి
వానికి సత్కధా శ్రవణమేల
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
శ్రీ నరసింహా! కోతికి జరీ అంచు తలపాగా
ఎందుకు. భర్తపోయిన స్త్రీకి విరజాజి పూల మాలలు నిష్ప్రయోజనం కదా ! చప్పిడి ముక్కు నకు ముత్యాల ముక్కెర
ప్రయోజనం లేదు కదా ! పుట్టుగ్రుడ్డి కి అద్దము,
మాచకమ్మ కు ముత్యాలహారాలు, దుర్మార్గునకు
సద్గోష్టులు , వ్యభిచారి కి నియమాలు , చెడ్డవానికి వావివరసలు ,సుంకము వసూలు
చేసేవాడికి మాట నిలకడ , చెవిటివానికి సత్కధా కాలక్షేపాలు ప్రయోజనారహితాలు కదా
స్వామీ!
తనువులోఁ బ్రాణముల్ తరలిపోయెడి వేళ-
నీ స్వరూపమును ధ్యానించునతడు
నిముషమాత్రము లోన నిను జేరును
గాని-యముని చేతికి జిక్కి శ్రమల బడడు
పరమ సంతోషాన భజనఁ జేసెడి వారి -
పుణ్యమేమన వచ్చు భోగి శయన
మోక్షము నీ దాసముఖ్యుల కగుఁ గాని- నరకమెక్కడిదయ్య
నళిన నేత్ర
కమల నాభుని మహిమలు గానలేని- తుచ్ఛులకు
ముక్తి దొరకుట దుర్లభంబు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
ధర్మపురి
లక్ష్మీనరసింహా! ఈ బొంది లో నుండి
ప్రాణాలు పోయే సమయం లో ఎవడైతే నీ రూపాన్ని ధ్యానిస్తాడో వాడు క్షణకాలంలో నీ
పాదసన్నిధి ని చేరుతాడు గాని యముని చేతికి చిక్కి బాధలను పడడు . ఆనందం తో నిన్ను
భజన చేసే వారి అదృష్టమే అదృష్టము. నీ భక్త వరులకు మోక్షమే గాని నరకముండదు కదా. నీ
మహిమలు తెలుసుకోలేని మూర్ఖులకు ముక్తి లభించుట అసాధ్యము కదా!
ఉర్వి లో నాయుష్యమున్న పర్యంతంబు-మాయ సంసారంబు మఱగి నరుడు
సకల పాపములైతె సంగ్రహించును గాని –
నిన్ను జేరెడి యుక్తి నేర్వలేడు
తుదకు కాలుని వద్ద దూత లిద్దరు వచ్చి -గుంజుక చని వారు
కొట్టుచుండ
హింస కోర్వగ లేక యేడ్చి గంతులు వైచి- దిక్కు లేదని నాల్గు
దిశలుఁ జూడ
తన్ను విడిపింప వచ్చెడి ధన్యుడేడి- ముందె నీ దాసుడై యున్న
ముక్తి గలుగు
భూషణవికాస!
శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
శ్రీ నారసింహా! ఈ జీవుడు భూమిపై ఆయుర్దాయం ఉన్నంతకాలం
సంసారమనే మాయ లో పడి సమస్త మైన పాపాల్ని మూటకట్టుకుంటూ నిన్ను చేరే మార్గాన్ని
మాత్రంనేర్చుకోడు. ప్రాణావసాన సమయంలో యమ భటులిద్దరు వచ్చి ప్రాణాలను
గుంజుకుపోయి, రకరకాలుగా శిక్షిస్తుంటే ఆ హింస భరించలేక, కాపాడే దిక్కు లేక నాలుగు దిక్కులు చూస్తూ
గంతులు వేసి ఏడుస్తూ ఉంటే కాపాడే
పుణ్యాత్ముడెవడూ ఉండడు. అలా కాకుండా ముందుగానే నీ భక్తుడై ప్రార్ధిస్తే మోక్షం లభిస్తుంది కదా !
అవనిలో గల యాత్ర లన్ని చేయగవచ్చు-
ముఖ్యమౌ నదులందు మునుగవచ్చు
ముక్కుపట్టుక సంధ్యమొనసి వార్చగ
వచ్చు-దిన్నగా జపమాలఁ ద్రిప్ప వచ్చు
వేదాల కర్ధంబు విఱిచి చెప్పగవచ్చు-శ్రేష్టక్రతువు
లెల్ల జేయవచ్చు
ధనము లక్షలు కోట్లు దానమీయగ
వచ్చు-నైష్టికాచారముల్ నడపవచ్చు
జిత్త మన్యస్ధలంబునఁ జేరకుండ – నీ పదాంభోజముల యందు నిలుపగలమె
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
ధర్మపురి వాసా ! భూలోకం లోని యాత్రలన్నీ
చేయవచ్చు.పుణ్యనదులన్నిటా స్నానం చేయవచ్చు.ముక్కుపట్టుకొని మూలకూర్చొని
సంధ్యావందనం చేసుకోవచ్చు.జపమాలను తిప్పుతూ జపము నూ చేసుకోవచ్చు.వేదాలకర్ధాన్ని
వివరించవచ్చు గొప్పగా యజ్ఞయాగాదులను నిర్వహించనూ వచ్చు.లక్షలు , కోట్లు గా డబ్బును
దానం చేయవచ్చు. నిష్ట తో ఆచారాలను సాగింపనూ
వచ్చు. కాని మనస్సు ను ఇతర స్ధలాలకు పోకుండా నీ పాద పద్మముల యందు లగ్నం చేయడం
మాత్రం అసాధ్యం గా కన్పిస్తోంది స్వామీ!
దేహమున్నవరకు మోహసాగరమందు –మునుగు చుందురు శుద్ధ మూఢజనులు
సలలితైశ్వర్యముల్
శాశ్వతంబనుకొని-షడ్బ్రమలను మాన జాలరెవరు
సర్వకాలము మాయ సంసారబద్ధులై-గురుని
కారుణ్యంబుఁ గోరుకొనరు
జ్ఞాన భక్తి విరక్తులైన పెద్దలఁ జూచి- నిందఁజేయక తాము నిలవలేరు
మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్ల – నిన్ను గనలేరు మొదటికే నీరజాక్ష
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహా ! ఈ శరీరమున్నంతవరకు మోహ మనే
సముద్రం లో పడి ఈ మూర్ఖులైన జనులు మునకలేస్తూ, సిరిసంపదలే స్ధిరమనుకొని ,
కామక్రోధలోభ మోహ మద మాత్సర్యాల మాయలో పడి సంసారబద్ధులై , జ్ఞానము నకై గురువులను
ఆశ్రయించరు. అంతేకాకుండా జ్ఞానభక్తి వైరాగ్య కోవిదులైన మహాత్ములను నిందించుచూ ఆ
పాపాన్ని కూడ తలకెత్తుకుంటున్నారు.
ఇటువంటి మదోన్మత్తులైన దుర్మార్గులు ఎప్పటికీ కూడ నిన్ను దర్శంచలేరు గా
ప్రభూ !
ధరణి లోపల నేను తల్లి గర్భము నందు- బుట్టి నప్పటి నుండి
పుణ్యమెఱుగ
ఏకాదశీ వ్రతం బెన్నడుండగ
లేదు-తీర్థయాత్రలకైనఁ దిరుగలేదు
పారమార్ధికమైన పనులు సేయగలేదు –భిక్షమొక్కనికైనఁ బెట్టలేదు
జ్ఞానవంతులకైనఁ బూని మ్రొక్కగ లేదు-
ఇతర దానములైన నీయలేదు
నళినదళనేత్ర నిన్ను నే నమ్మినాను-జేరి
రక్షింపవే నన్ను శీఘ్రముగను
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
స్వామీ నరసింహప్రభూ ! తల్లి గర్భము నుండి బయటకు వచ్చిన నాటి
నుండి పుణ్యమంటే ఏమిటో తెలియకుండా పెరిగాను. ఏనాడు ఏకాదశీ ఉపవాసం ఉండలేదు. తీర్ధయాత్రలు
చేయలేదు.పారమార్ధికమైన ఎటువంటి పుణ్యకార్యాలు చేయలేదు. ఒక్కడికైనా పిడికెడు
ముష్టి వేయలేదు. జ్ఞానవంతులకైనా
చేతులెత్తి నమస్కరించలేదు. ఎటువంటి దానములూ
ఇవ్వలేదు. అయినా పద్మపత్రాక్షా. నిన్నే నేను
నమ్ముకొన్నాను. త్వరగా వచ్చి నన్ను రక్షించు తండ్రీ !
---------- చివరిభాగం
త్వరలో.
*********************************************************************************
No comments:
Post a Comment