శతకసౌరభాలు-7 శేషప్పకవి – నరసింహశతకము-4
శేషప్ప
కవి- నరసింహ శతకము -4
శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి
సర్వేశ ! నీ పాద
సరసిద్వయమందు- జిత్తముంచగలేను జెదరకుండ
నీవైన దయయుంచి నిలచి యుండెడు నట్లు చేసి- నన్నిపుడేలు
,సేవకుడను
వనజలోచన! నేను
వట్టి మూర్ఖుడ జుమ్మి- నీ స్వరూపము జూడ నేర్పు వేగ
తన కుమారుల కుగ్గు తల్లి పోసినయట్లు- భక్తి మార్గంబను పాలు పోసి
ప్రేమతో నన్ను బోషించి పెంచుకొనుము- ఘనత కెక్కించు నీ దాస
గణము లోన
భూషణవికాస !శ్రీధర్మపుర నివాస!- దుష్టసంహార! నరసింహ! దురితదూర!. (70)
శ్రీ
ధర్మపురినివాసా!నీపాదపద్మముల
యందు నా మనసు నిలవకున్నది.నాపై దయయుంచి మనసు
నీపై నుండి చెదరకుండ చేసి నీ సేవకునిగా నన్ను
ఏలుకో స్వామీ!
పద్మములవంటి నేత్రములు కలవాడా!నేను వట్టి మూర్ఖుడను.
నీ దివ్య సుందరరూపమును దర్శించెడి జ్ఞానమును
నాకు ప్రసాదించు స్వామీ! తన బిడ్డలకు తల్లి ఉగ్గుపోసినట్లు నీవు నాకు భక్తి మార్గమనే ఉగ్గుపాలు పోసి ప్రేమతో నన్ను పోషించి , నీ భక్తులలో శ్రేష్ఠునిగా చేయవయ్యా స్వామీ!.
హరిదాసులను
నింద లాడ కుండిన జాలు- సకల గ్రంథమ్ములు చదివినట్లు
భిక్షమియ్యంగఁ దప్పింప కుండిన జాలు- జేముట్టి దానంబు
చేసినట్లు
మించి సజ్జనుల వంచించకుండిన జాలు-నింపుగా బహుమాన
మిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండిన జాలు-గనక కంబపు గుళ్లు గట్టినట్లు
ఒకరి వర్షాశనము ముంచకున్నఁజాలు-బేరు కీర్తిగ సత్రముల్
పెట్టినట్లు
భూషణవికాస!
శ్రీధర్మపుర నివాస!- దుష్టసంహార!
నరసింహ! దురితదూర!. (72)
శ్రీ
నారసింహా!
గొప్పవారమనిపించుకోవడానికి ఏవేవో
గొప్పగొప్ప పనులు చేయాల్సిన పనిలేదు. విష్ణుభక్తులను, హరిదాసులను నిందించకుండా వుంటే సకల గ్రంథములు చదివనట్లే .బిచ్చము వేసేవారిని ఆటంకపరచి భిక్ష వేసేటప్పుడు అడ్డుపడకుండా ఉంటే చాలు
దానం చేసినట్లే. మంచి వారిని మోసగించకుండా ఉంటే చాలు పదిమందికి బహుమానాలు
పంచినట్లే. దేవుడి కిచ్చిన మాన్యాలను,అగ్రహారాలను
స్వాహా చేయకుంటే చాలు బంగారు స్థంభాలతో పెద్దపెద్ద దేవాలయాలు కట్టించినంత
పుణ్యం లభిస్తుంది. ఒకరి నోటి కందే సంవత్సరం పంటను కాజేయకుంటే చాలు ధర్మసత్రాలు
కట్టించి , అన్నదానాలు చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది.
కవి ఆనాటి
సమాజాన్ని మన ముందు ఉంచుతున్నాడు. ఈ రోజుల్లో లాగానే ఆ రోజుల్లో కూడ పాపభీతి లేకుండా దేవుడి మాన్యాలను దోచుకొనేవారు ,
సాగుచేసుకొనే వారు, ఆక్రమించుకొని అమ్ముకొనేవారు , దేవుని పేరు చెప్పి చందాలు పోగుచేసి
స్వాహా చేసేవారు , దేవుడికి నోరులేదు కదా. మనలనేమి చేస్తాడులే అని
అగ్రహారాలను అమ్ముకునేవారు ఆనాడే ఉన్నారని కవి మనకు చెపుతున్నాడు. ఎవరో
మహానుభావులు దేవుని కిచ్చిన
ఆస్తులపై, ఆభరణాలపై అధికారం చెలాయిస్తూ,కనీసం ఆ దేవుడంటే ఆసక్తి ,భక్తి కూడ లేని అజమాయిషీదారులు
పెద్దపెద్ద ఆలయాల్లోనే ఇప్పడు కన్పిస్తున్నారు కదా. ఈ పాపాలు చేయవద్దని ,
చేస్తే ఆ పాపఫలం పరలోకం లోనైనా అనుభవించవలసి వస్తుందని కవి నివేదన.
భావంబు నీనామ భజన గోరుచు నుండు –
జిహ్వ నీకీర్తనల్ చేయగోరు
హస్తయుగ్మంబు నిన్నర్చించ గోరును –గర్ణముల్
నీ మీద కథను గోరు
దనువు నీ
సేవయే ఘనముగా గోరును- నయనముల్ నీ
దర్శనంబుఁ గోరు
మూర్థమ్ము నీ పదంబుల మ్రొక్కగాఁ గోరు –
నాత్మ నీదై యుండు నరసి చూడ
స్వప్నములనైన నేవేళ
సంతతమును- బుద్ధి నీ పాదములయందుఁ బూనియుండు
భూషణవికాస!
శ్రీధర్మపుర నివాస!- దుష్టసంహార!
నరసింహ! దురితదూర!. (73)
శ్రీ ధర్మపురి
లక్ష్మీనరసింహ ప్రభూ! నీ
మనస్సెప్పుడూ నీ భజన చేయాలనే కోరుకుంటూ టుంది. నా నాలుక నీకీర్తనలను గానంచేయాలని ,
చేతులు నిన్ను అర్చించాలనీ , చెవులు
ఎల్లప్పుడూ నీ కథలను వినాలనీ , ఈ శరీరం
నీకు ఘనంగా సేవచేయాలనీ సదా కోరుకుంటూ ఉంటాయి. ఎల్లప్పుడూ నీ
దివ్యమంగళరూపాన్ని దర్శించాలని ఈ కన్నులు ఆరాటపడుతుంటాయి. నా తల నీ పాదాలకు తాకించి పదే పదే
నమస్కరించాలని తహతహ లాడుతోంది. లోతుగా ఆలోచిస్తే నా ఆత్మ ఏనాడో నీదై ఉంది. కలలో
కూడ నిన్నే సేవించాలని నా బుద్ధి
కోరుకుంటూ ఉంది. కావున నరసింహా నన్ను కావుము తండ్రీ.!
పద్మాక్ష! మమత చేఁ బరము నందెదమంచు –
విఱ్ఱవీగెదమయ్య వెఱ్ఱి పట్టి
మా స్వతంత్రంబైన మదము కళ్ళకు గప్పి –
మొగము పట్టదు కామమోహమునను
బ్రహ్మదేవుండైనఁ బైడి దేహము గల్గఁ- జేసి వేయక మమ్ము జెఱిచె
నతడు
తుచ్ఛమైనటువంటి తో లెమ్ముకల తోడ- మురికి చెత్తలు చేర్చి
మూటగట్టె
నీశరీరాలు పడిపోవు టెఱుగ కేము-కాముకులమైతి మిక మిమ్ము
గానలేము
భూషణవికాస !శ్రీధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర! (74)
పద్మముల
వంటి నేత్రములు గల్గిన ఓ నారసింహా.మేము వెఱ్ఱి వాళ్ళమై,నీ మీద భక్తితోనో ,ప్రేమతోనో
మోక్షాన్ని పొంద గలమని విర్రవీగుతున్నాము. మా లోని మదము మా కళ్లకు గప్పి
కామమోహములచేత నిన్ను చూడలేకపోతున్నాము. ఆ బ్రహ్మదేవుడైన మాకు బంగారం లాంటి
శరీరాన్నివ్వకుండా మమ్మల్ని చెడగొట్టాడు. తుచ్ఛమైన
ఎముకలు ,మాంసము చర్మము తో కూడిన మురికిని చేర్చి మూట కట్టాడు. ఈ శరీరాలు అశాశ్వతాలు ,పడిపోతాయని తెలియక కాముకులమై మిమ్ము చూడలేకపోతున్నాము. స్వామీ. నీ
దర్శన భాగ్యాన్ని మాకు కల్గించు ప్రభూ!
గరుడవాహన ! దివ్యకౌస్తుభాలంకార! –రవికోటితేజ! సారంగవదన!
మణిగణాన్విత హేమ మకుటాభరణ! చారు- మకరకుండల! లసన్మందహాస!
కాంచనాంబర!
రత్నకాంచీ విభూషిత!- సురవరార్చిత!
చంద్ర సూర్యనయన!
కమలనాభ! ముకుంద! గంగాధరస్తుత!- రాక్షసాంతక!
నాగరాజశయన!
పతిత పావన!
లక్ష్మీశ !బ్రహ్మజనక! –భక్తవత్సల! సర్వేశ! పరమపురుష!
భూషణవికాస !శ్రీధర్మపుర నివాస!- దుష్టసంహార! నరసింహ! దురితదూర! (75)
శ్రీ
ధర్మపురి లక్ష్మీనరసింహా! గరుడవాహనా!
దివ్యమైన కౌస్తుభమణిని ధరించినవాడా!కోటిసూర్య సమాన
తేజోవంతుడా! చంద్రబింబము వంటి మోము గల సుందరుడా! వివిధమణులు పొదిగిన బంగారపు కిరీటమును ధరించిన వాడా! అందమైన మకర కుండలములను ధరించినవాడా ! మనోహరమైన
మందహాసము గలవాడా! అందమైన చిరునవ్వు గలవాడా! బంగారుమయమైన వస్త్రమును ధరించినవాడా.! రత్నములతో
పొదిగిన మొలనూలుచే ప్రకాశించుచున్న వాడా! సకల దేవతాపూజితుడా!
చంద్ర సూర్యులు నేత్రములు గా గలవాడా! కమలనాభా.! ముకుందా!మోక్షమును ప్రసాదించేవాడా ఈశ్వరుని చే
స్తుతించబడెడి వాడా!రాక్షస సంహారా!
నాగేంద్రుని పై శయనించెడివాడా! పాపములను నశింపచేయువాడా!శ్రీలక్ష్మీనాథా! బ్రహ్మకు తండ్రియైన వాడా! భక్తులయందు వాత్సల్యము గలవాడా!.సర్వేశ! పరమపురుషా! నారసింహా!పాహి!పాహి.
తాను పూజిస్తున్న
,ప్రార్థిస్తున్న లేక ఉపాశిస్తున్న దైవం యొక్క ఔన్నత్యాన్ని వివరించడానికి భక్తుడు
ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తాడు. ఎందుకంటే అటువంటి ఇలవేల్పు తనకు అండగా
ఉన్నాడని భావించడమే ఆ భక్తునికి కొండంత దైర్యం. తన దైవం ఇంత గొప్ప యని
చెప్పుకోవడం ఆ భక్తునికి ఎంతో ఆనందాన్ని
కల్గించే విషయం. ఈ ప్రపత్తే భగవంతుని చెంతకు భక్తుని చేరువ చేస్తుంది.
గజేంద్రుడు “ కలడు కలండనెడు వాడు కలడో
లేడో “ అనే సందేహం నుంచి “ నీవే తప్ప
నిత: పరం బెరుగను” అనే దశకు వచ్చి
భగవంతుని వేడుకొనే సందర్భం లో
ఆంద్రమహాభాగవతం లో పోతన మహాకవి
గజేంద్రుని నోట ఇలా ప్రార్థించారు.
ఓ కమలాప్త! యో వరద! యో ప్రతిపక్ష
విపక్షదూర! కు
య్యో! కవియోగివంద్య! సుగుణోత్తమ!యో శరణాగతామరా
నోకహ! యో మునీశ్వర మనోహర! యో విమల ప్రభావ! రా
వే! కరుణింపవే! తలపవే! శరణార్థిని నన్నుఁ గావవే!. (ఆం.మ భా 8-92)
వేంకటేశ్వర సుప్రభాతం మనం నిత్యం స్మరించేదే
కదా.
కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణితాతుల నీలతనో
కమలాయతలోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే .
ఈ మధురమైన శ్లోకం లో భక్తుడికి
శృంగారం కనపడదు .తన ప్రభువు యొక్క లక్ష్మీపతిత్వాన్ని గొప్పగా ప్రకటించి,
ప్రశంసించి తన్మయత్వంతో ప్రార్థించడమే
భక్తునికి తెలుసు.
శతకసాహిత్యం లో ఇటువంటి పద్యాలే
ఎక్కువగా ఉంటాయి ఈ శతకం లో 79 వ పద్యం కూడ
ఇటువంటిదే.
భువనేశ! గోవింద! రవికోటి సంకాశ!
పక్షివాహన! భక్తపారిజాత!
అంభోజ భవరుద్ర జంభారి సన్నుత!
సామగానవిలోల !సారసాక్ష!
వనధిగంభీర!
శ్రీవత్సకౌస్తుభవక్ష!
శంఖచక్రగదాసి శార్ఞహస్త!
దీనరక్షక ! వాసుదేవ! దైత్యవినాశ!
నారదార్చిత! దివ్యనాగశయన!
చారునవరత్నకుండల శ్రవణయుగళ!
విబుధ వందిత పాదాబ్జ! విశ్వరూప!
భూషణవికాస !శ్రీధర్మపుర నివాస!-
దుష్టసంహార! నరసింహ!
దురితదూర (79)
ఈ పద్యం లో కూడ కవి తన స్వామి
దివ్యరూపాన్ని తనవితీర
దర్శిస్తున్నాడు.
పలుమాఱు
దశరూపములు ధరించితివేల – నేకరూపము బొంద వేల నీవు
నయమున క్షీరాబ్ధి
నడుమఁ జేరితివేల – రత్నకాంచన మందిరములు లేవె
పన్నగేంద్రుని మీద బవ్వళించితి
వేల-జలతారు పట్టె మంచములు లేవె
ఱెక్కలు గల పక్షి నెక్క సాగితి వేల –
గజతురంగాందోళికములు లేవె
వనజలోచన యిటువంటి వైభవములు- సొగసుగా నీకు దోచెనో సుందరాంగ
భూషణవికాస శ్రీధర్మపుర నివాస- దుష్టసంహార నరసింహ
దురితదూర (76)
ప్రభూ! నారసింహా! నీవు అనేకసార్లు దశావతారాలను ఎందుకు ధరిస్తున్నావు. ఒకే రూపంతో మా
కన్నులకు ఆనందాన్నియ్యలేవా? బంగారుమయమైన సౌధాగ్రముల యందు
నివసించక పాలసముద్రంమధ్య లో పాము మీద పడక వేసితివేమి
ప్రభూ?జలతారు పట్టె మంచములు ,గుఱ్ఱములు, ఏనుగులు, పల్లకీల
వంటి భోగములను వదిలి వేసి ఱెక్కల పక్షి నెక్కి విహరింతువేమయ్యా? ఇటువంటి వైభవములే నీకు సొగసుగా తోచినవా స్వామీ?
తార్ఘ్యవాహన! నీవు దండి దాత వటంచుఁ- గోరి వేడుక
నిన్నుఁగొల్వ వచ్చి
యర్థి మార్గమును నే ననుసరించితి నయ్య-లా వెనుబదినాల్గు లక్షలైన
వేషముల్ వేసి నా విద్యా ప్రగల్ఫతఁ-జూపసాగితి నీకు సుందరాంగ
యానందమైన నే నడుగ వచ్చిన దిచ్చి వాంఛ దీర్చుము నీలవర్ణ వేగ
నీకు నా విద్య హర్షంబు గాక యున్న-తేపతేపకు వేషముల్ దేను
సుమ్మీ
భూషణవికాస !శ్రీధర్మపుర నివాస!- దుష్టసంహార! నరసింహ! దురితదూర!. (77)
ఓ గరుడ గమనా! నీవు గొప్పదాతవని తెలిసి కోరికతో నిన్ను సేవించు కుందామని వచ్చాను. యాచకుడి గా ఎనభైనాల్గు లక్షల వేషాలు వేసి నా
విద్యా ప్రాగల్బ్యాన్ని నీకు చూపించడానికి ప్రయత్నించాను. ఓ నీలవర్ణ శరీరా! నేనడిగేటటువంటి నాకు ఆనందాన్ని కల్గించే నా కోరికలను తీర్చు స్వామీ! ఎందుకంటే నేను వేసే వేషాలు నీకు
ఆనందాన్ని కల్గించక పోతే నేను మాటి మాటికీ వేషాలు మార్చను లేను స్వామీ!
కవి హరిదాసు గా అక్షయపాత్ర ధరించి
యాయవారంతో జీవిస్తూ,ఆలయమే విడిదిగా భగవత్సన్నిధిలోనేకాలం గడిపినట్టు
భావించబడుతోంది. ఈ పద్యాన్ని బట్టి చూస్తే పగటివేషాలు వేయడం కూడ భగవత్సేవ లో భాగం గా భావించేవారు ఇప్పటికీ
ఉన్నారు. ఆంజనేయుడు, గయుడు లాంటి వేషాలు ధరించి
వీధుల్లో తిరిగే వారు ఇప్పటికీ
కన్పిస్తూనే ఉంటారు. అలాగే కవి ఎనభై నాలుగు
వేషాలు వేశాననడం అందులో భాగమై ఉండవచ్చు. శేషప్ప జీవితం గురించి పూర్తి వివరాలు
తెలిస్తే మన ఆలోచనలకు ఒక ఆకారం రావచ్చు.
తిరుపతి
స్థలమందుఁ దిన్నగా నేనున్న-వేంకటేశుడు మేత వేయలేడే?
పురుషోత్తమునకుఁ బోయినఁజాలుజ-గన్నాథు డన్నంబు గడపలేడె?
శ్రీరంగమునకు నేఁజేరబోయిన జాలు-స్వామి గ్రాసము పెట్టి
సాకలేడె ?
కాంచీపురము లోన గదిసి నే
కొలువున్నఁ-గరివరదుడు పొట్ట గడపలేడె ?
యెందుఁ బోవక నేను నీ మందిరమున –
నిలిచితిని నీకు నా మీద నెనరు లేదు.
భూషణవికాస!
శ్రీధర్మపుర నివాస!- దుష్టసంహార!
నరసింహ! దురితదూర!. (78)
శ్రీ నరసింహా! నేను తినే ఈ నాలుగుమెతుకులు ఎక్కడ ఏ స్వామిని సేవించినా
వాళ్లు నా పాత్రలో వేస్తారు. అయినా నేను నిన్ను నమ్ముకునే నీ ముంగిట పడి ఉన్నాను గాని నీకు నా మీద దయలేదు. నేను తిరుమల వెళ్లి
వేంకటేశ్వరుని సన్నిధిలో దేవిరస్తే ఆ ప్రభువు నాకు మేత వేసి నన్ను పోషించలేడా?పూరీ జగన్నాధుడు నాకింత అన్నము పెట్టలేడా? శ్రీరంగానికి
నేను వెడితే చాలు. ఆ స్వామియే ఆదరించి అన్నము పెడతాడు.
కంచికి వెడితే ఆ వరదరాజులు నన్నునా పొట్ట నింపలేడా ! ఇన్ని
అవకాశాలు ఉండి కూడ నేను నిన్నే నమ్ముకొని నీ చెంగట పడి ఉన్నానే .అయినా కాని నీవు
నాపై దయ చూపడం లేదు ప్రభూ !
వైష్ణవ క్షేత్రాలలో
భగవద్భక్తులకు ప్రసాదం కొరత ఉండదు కదా. కవి కాలం నాటికే తిరుమల లో హాథీరాం జీ మఠం
ఆధ్వర్యంలో భక్తులకు వివిధ ప్రసాదాలను దండిగా అందిస్తున్నట్లు తిరుమల చరిత్ర
చెపుతోంది. అందుకే కవి అంత ధైర్యంగా తిరుమల ను గూర్చి ప్రస్తావించాడేమో.
------ ఐదవ భాగం
త్వరలో
***************************************************************
1 comment:
పద్యాలు బాగున్నాయి. కానీ 71వ పద్యం వ్రాయలేదు. మప్పిదాలు.
Post a Comment