శతక సౌరభాలు -7
శేషప్పకవి-
నరసింహశతకము -3
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి
నీ మీద కీర్తనల్ నిత్య
గానముఁ జేసి-రమ్యమొందింప నారదుడను గాను
సావధానముగ నీ చరణ పంకజసేవ-
సలిపి మెప్పింపంగ శబరి కాను
బాల్యమప్పటి నుండి భక్తి
నీయందునఁ-గలుగను బ్రహ్లాద ఘనుడ గాను
ఘనముగ
నీ మీద గ్రంథముల్ కల్పించి- వినుతి సేయ వ్యాసమునిని గాను
సాధువును,మూర్ఖమతిని మనుష్యాధముడను- హీనుడను, జుమ్మి నీవు నన్నేలు కొనుము
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస - దుష్టసంహార నరసింహ దురితదూర !! (50)
ఓ ధర్మపురి శ్రీ
లక్ష్మీనరసింహా! నీమీద కీర్తనలు అల్లి నిత్యము నిత్యము గానము చేసి నిన్ను రంజింప చేయుటకు
నేను నారదుడను కాను.నీ పాదపద్మములను సేవించి నిను మెప్పించుటకు నేను సబరిని
కాను.చిన్నతమునుండి నీయందే అధిక భక్తి గలిగి నిను ప్రార్థించుటకు నేను
ప్రహ్లాదుడంతటి గొప్ప వాడను కాను. గొప్పగా నీ మీద గ్రంతములు వ్రాసి నిన్ను పొగడుటకు వ్యాసుడను కాను. తండ్రీ. నేను బహు
మెతకవాడిని. మూర్ఖుడను. అధముడను. అతినీచుడను. స్వామీ. ఉన్నమాట చెప్పాను. నీవు
నన్నేలుకొందువనే ఎదురు చూస్తున్నాను.
అతిశయంబుగఁ గల్లలాడ
నేర్చితిగాన
పాటిగా సత్యములే పలుకనేర
సత్కార్య విఘ్నముల్ సలుపనేర్చితిఁ గాని
ఇష్టమొందగ నిర్వహింపనేర
నొకరిసొమ్ముకు దోసి లొగ్గనేర్చితిఁ గాని
చెలువుగా ధర్మంబు సేయనేర
ధనము లీయంగ వద్దనంగ నేర్చితి గాని
శీఘ్రమిచ్చెడు
నట్లు చెప్పనేర
బంకజాతాక్ష నేనతి పాతకుడనుదప్పులన్నియు క్షమియింప దండ్రి
నీవె
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర ! (51)
శ్రీ
ధర్మపురి లక్ష్మీ నరసింహా! అబద్దాలు చెప్పడం
నేర్చుకున్నాను గాని సూటిగా నిజాన్ని చెప్ప లేను.మంచి పనులను చెడగొట్టడం
తెలుసుగాని ఇష్టం తో మంచి పని చేయడం చేతకావడం లేదు. ఇతరులిచ్చే సొమ్ముకు దోసిలి
పట్టడం చేత నవును గాని దానం చేయడం చేత
కావడం లేదు. దానం చేసేవాళ్ళని దానమివ్వకుండా నిరోధించడం నేర్చుకున్నాను గాని డబ్బున్నవాడిని
ఇతరులకు సహాయ పడేట్లు ప్రోత్సహించడం లో మాత్రం చేతకానివాడినయ్యాను. ఓ ప్రభూ. నేను
అత్యంత పాపాత్ముడను. నా తప్పులన్నీ క్షమించే తండ్రివి నీవే నయ్యా!
అధిక విద్యావంతు
లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు
సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి
భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె
చాటు మాకు
భూషణవికాస
శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ
దురితదూర !! (52)
ఓ నారసింహా ! ఈ లోకమదేమిటో కాని అతి
విచిత్రంగా మారుతోంది. బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు.
ఏమాత్రం చదువు రాని శుంఠలు సభాపూజ్యులై
సన్మానాలు పొందుతున్నారు. నిజం చెప్పేవారి మాట లోకవిరోధమౌతోంది.
అబద్దాలాడేవారికి సమాజం లో అధిక
ప్రాధాన్యత లభిస్తోంది. ధర్మబుద్ధిగలవారు దారిద్య్రాన్ని అనుభవిస్తుంటే పిసినారులు ధనవంతులై కులుకు తున్నారు.పుణ్యాత్ములు
రోగగ్రస్థులై పీడించబడుతుంటే పాపాత్ములు
పల్లకీలలో ఊరేగుతున్నారు. ఓ గరుడవాహనా ! మావంటి యాచకులకు
ఎటువంటి పోషణలేదు నీవే మాకు దిక్కు.
కర్ణయుగ్మమున నీ కధలు సోకిన జాలు- పెద్దపోగుల
జోళ్ళు పెట్టినట్లు
చేతులెత్తుచు బూజసేయగల్గిన జాలు –తోరంపు
గడియాలు తొడిగినట్లు
మొనసి మస్తకముతో మ్రొక్కఁగల్గిన చాలు-చెలువమైన తురాయి
చెక్కినట్లు
గళము నొవ్వఁగ గథల్ పలుకఁ గల్గినఁ జాలు- వింతగ కంఠీలు
వేసినట్లు
పూని నినుఁ గొల్చుటే సర్వ భూషణంబు-ఇతర భూషణముల నిచ్చగింపనేల
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస - దుష్టసంహార నరసింహ దురితదూర!! (53)
శ్రీ ధర్మపురి
లక్ష్మీనరసింహా ! మహామహిమాన్వితమైన
నీ భక్తుల కథలు వింటే చాలు మా చెవులకు పెద్దకుండలాలు ధరించినట్లే.చేతులెత్తి
నిన్ను మనసారా పూజ చేయగలిగితే చాలు మాచేతులకు కడియాలు ధరించినట్లే.భక్తితో శిరస్సు
వంచి నమస్కరించితే చాలు తలపై అందమైన తురాయి
ధరించినట్లే. మా గొంతు నొప్పి పుట్టునట్లు నిన్ను స్తుతించిన చాలు నీకు
ఘనమైన పూమాలలు వేసినట్లే. నిన్ను భక్తి తో పూజించుటే
మాకు సర్వాలంకారములు. ఇంకా ఇతరమైన ఆభరణాలు మాకెందుకు స్వామీ!
ఈ పద్యం
చదువుతుంటే భర్తృహరి సుభాషితాల్లోని “ కేయూరాణి నభూషయన్తి పురుషం
హారాన చంద్రోజ్వలా ..................వాగ్భూషణం భూషణం” అనే
శ్లోకపు ఛాయలు ఈ పద్యం లోకి తొంగి
చూస్తున్నాయి. ఎటువంటి ఆభరణాలు , పూలమాలలు, పరిమళ ద్రవ్యాలు , లత్తుకలు మానవునికి అందాన్ని ఇవ్వవు. కేవలం వాగ్భూషణం మాత్రమే భూషణ మంటాడు మహాకవి
భర్తృహరి.
ధర్మపురి నారసింహుని
మనసారా పూజించడమే సర్వాలంకారాలను ధరించినట్లే. ఇంకా వేరే అలంకారాలెందుకు స్వామీ
అంటున్నాడు శేషప్ప.
అతి విద్య నేర్చుట యన్నవస్త్రములకే-పసుల నార్జించుట పాడి
కొఱకె
సతినిఁ బండ్లాడుట సంసారసుఖము కే-సుతులఁ బోషించుట గతుల కొఱకె
సైన్యమున్ గూర్చుట శత్రుభయంబుకే –సాము
నేర్చుట లెల్లఁజావు కొఱకె
దానమిచ్చుటయు ముందటి సంచితమునకే- ఘనముగాఁ జదువుట కడుపుకొరకె
యితర కామంబు గోరక సతతముగను భక్తి నీ యందు నిలుపుట
ముక్తికొఱకె
భూషణవికాస శ్రీ
ధర్మపుర నివాస - దుష్టసంహార నరసింహ
దురితదూర!! (54)
ప్రభూ లక్ష్మీనారసింహా ! అతిగా విద్య నేర్చుకోవడం
అన్నవస్త్రాల కోసమే గదా. పశువులను పెంచుకొనుట పాడికోసమే. సంసార సుఖం కోసమే పెళ్లి.
పుణ్యగతుల కోసమే కొడుకులను పోషించడం. శతృభయం తోనే
సైన్యాన్ని సమకూర్చు కోవడం . సాము గరిడీలు నేర్చుకోవడం కొట్టుకు చావడానికే
. దానం చేయడం పుణ్యాన్ని సంపాదించుకోవడానికే . గొప్ప చదువులు పొట్టనింపుకోవడానికే
. అదే విధంగా ఏ ఇతరమైన కోరికలు లేకుండా ఎల్లప్పుడు నీపై మనసుంచి నిన్ను ధ్యానించడం
ముక్తి కోసమే గదా ప్రభూ!
సాధు సజ్జనులతో జగడమాడినఁ గీడు- కవులతో వైరంబుఁ గాంచఁ గీడు
పరమ దీనులఁ జిక్కఁ బట్టికొట్టినఁ గీడు-బిచ్చగాండ్రను దుఖ
పెట్టగీడు
నిఱుపేదలను జూచి
నిందఁ జేసినఁ గీడు-పుణ్యవంతుల దిట్ట పొసగఁ గీడు
సద్భక్తులను దిరస్కార మాడినఁ గీడు-గురుని ద్రవ్యము
దోచుకొనినఁ గీడు
దుష్టకార్యము లొనరిచు దుర్జనులకు-ఘనతరంబైన నరకంబు
గట్టిముల్లె
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస -
దుష్టసంహార నరసింహ దురితదూర!! (56)
శ్రీ ధర్మపురి నరసింహా! మంచివారితోను ,శాంతస్వబావులతోను ,పోట్లాడుట , కవులతోపగ పెంచకొనుట , దీనులను హింసించుట , యాచకులను దుఖపెట్టుట , నిరుపేదలను నిందించుట ,పుణ్యవంతులను పరిహసించుట ,లేక దూషించుట , భక్తవరులను గేలి చేయుట,గురువుల ద్రవ్యమున కాశపడుట మొదలైనవి నరకమునకు రహదారులే గదా!
నీ భక్తులను గనుల్ నిండఁ జూచియు
రెండు- చేతుల జోహారు చేయువాడు
నేర్పుతో నెవరైన నీ కతల్ చెప్పంగ-వినయ మందుచుఁ జాల
వినెడువాడు
తన గృహంబునకు నీ
దాసులు రాఁజూచి- పీటపై గూర్చుండఁ బెట్టువాడు
నీ సేవకుల జాతి నీతులెన్నక చాల-దాసోహమని చేరఁ దలుచువాడు
పరమభక్తుండు ధన్యుండు భానుతేజ-వాని కనుగొన్న పుణ్యంబు వసుధ
లోన
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస -
దుష్టసంహార నరసింహ దురితదూర!! (58)
శ్రీ ధర్మపురి
లక్ష్మీనరసింహా! నీ భక్తులను చూడగానే చేతులెత్తి
నమస్కారం చేసేవాడు , ఎవరైనా సుధామధురమైన నీ కథలను
చెపుతుంటే వినయం గా ఆలకించేవాడు , నీ దాసులు తన గృహానికి వస్తే
వారిని సాదరంగా ఆహ్వానించి ఆసనంపై
కూర్చుండ బెట్టి ఆదరించే వాడు , జాతి ,నీతులను పరిగణించక
నీ సేవకులకు దాసోహమనే వాడే ఈ భూమిమీద ధన్యుడుగా చెప్పబడుతున్నాడు. అటువంటి వాడిని
చూస్తేనే పుణ్యము లభించి జనులు మోక్షగాములౌతారు.
ఈ
పద్యం చదువుతుంటే ప్రహ్లదచరిత్ర లోని పద్యం
చెవులలో మ్రోగుతూ వుటుంది.
“ పెద్దలఁ బోడగన్న భృత్యుని
కైవడిఁ జేరి నమస్కృతుల్సేయువాడు
కన్నుదోయి కి నన్యకాంత లడ్డంబైన మాతృభావము
జేసి మరలువాడు
తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల గానఁ
జింతించువాడు” (ఆం.మ. భాగ. 7-115 )
ఈ పద్యం లో ప్రహ్లాదుని
వ్యక్తిత్వాన్ని వర్ణించాడు మహాకవి పోతన. ఫై పద్యం లో నరసింహ భక్తుని
వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి అవకాశం
తీసుకున్నాడు శేషప్ప కవి. అలాగే తరవాత
పద్యం కూడ ప్రహ్లాదచరిత్ర ను
గుర్తుచేస్తోంది
వేమాఱు నీ కథల్ వినుచునండెడివాడు-పరుల ముచ్చట
మీద భ్రాంతి పడడు
అగణితంబుగ నిన్ను బొగడ నేర్చినవాడు-చెడ్డమాటల నోట చెప్పబోడు
ఆసక్తి చేత
నిన్ననుసరించెడి వాడు- ధనమదాంధుల వెంట దగులబోడు
సంతసంబున నిన్ను స్మరణ జేసెడివాడు -చెలగి నీచుల పేరు
దలపబోడు
నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగ- గోరి చిల్లరవేల్పుల
గొల్వబోడు
భూషణవికాస
శ్రీ ధర్మపుర నివాస - దుష్టసంహార నరసింహ
దురితదూర!! (62)
శ్రీ
నరసింహా! పరమభక్తి తో పలుమార్లు నీ
కథలు వినెడి వాడు పరులు చెప్పే ఊసుపోక
కబుర్ల పై మనసు పెట్టడు. లెక్కపెట్టలేనంతగా నిరంతరము నిన్ను ప్రార్థింప నేర్చిన వాడు చెడ్డ
మాటలను పలకలేడు. నీ మీద భక్తి తో నిన్నే
నమ్మి నీతోనే లోకమని భావించే వాడు గర్విష్ఠులైన ధనవంతుల చెంత చేరబోడు. భక్తి పారవశ్యం తో నారసింహ , నారసింహా అంటూ నీ నామ
స్మరణ చేసే వాడు ఇతరమైన నీచమైన పేర్ల ను స్మరింప లేడు. నిన్ను మనసారా నమ్మిన
భక్తుడు ఇతర చిల్లర దేవుళ్ళ ను సేవించ లేడు. ఇది సత్యము.
ఈ పద్యం
చదువుతుంటే ఆంథ్ర మహాభాగవతం లోని లోక ప్రసిద్థమైన
“మందార మకరంద మాధుర్య మున
దేలు మధుపంబు వోవునే మదనములకు
” (ఆం .మ.భాగ.150) అనే
పద్యం వెంటనే గుర్తుకొస్తుంది. ఈ
భాగం వ్రాసే సమయం లో శేషప్ప మనసు లో ప్రహ్లద చరిత్ర మననమౌతూ ఉండి ఉంటుంది.
సకల
విద్యలు నేర్చి సభ జయింపగ వచ్చు- శూరుడై రణమందుఁ బోరవచ్చు
రాజరాజై పుట్టి రాజ్యమేలగ వచ్చు -హేమ గోదానంబు లియ్యవచ్చు
గగనమందున్న చుక్కల నెంచగా వచ్చు- జీవరాశుల పేర్లు
చెప్పవచ్చు
నష్టాంగయోగంబు లభ్యసింపగ వచ్చు -కఠినమౌ రాల మ్రింగంగ వచ్చు
తామరసగర్భ హర పురందరులకైన నిన్ను వర్ణింపదరమౌనె నీరజాక్ష
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస - దుష్టసంహార నరసింహ దురితదూర!! (64)
శ్రీ
ధర్మపురి లక్ష్మీనరసింహా! సమస్త విద్యలు అభ్యసించి
సభలలో సన్మానాలను పొందవచ్చు. శూరుడై
యుద్ధరంగమందు విజయం సాధించవచ్చు. రాజరాజై
రాజ్యాన్ని పాలించవచ్చు. గోదాన హిరణ్య దానాలను ఇవ్వవచ్చు. ఆకాశం లోని
నక్షత్రాలను లెక్కపెట్టవచ్చు. సమస్త జీవరాసుల పేర్లను చెప్పవచ్చు. అష్టాంగ
యోగాలనూ నేర్చుకోవచ్చు. కఠినమైన గండశిలలను
సైతము మ్రింగవచ్చు. అనగా అనేక కష్టములైన కార్యముల నెన్నింటినో సాధించవచ్చు గాని త్రిమూర్తులకు
కూడ వర్ణింప నలవి కాని నీ గొప్పతనాన్ని మేమెట్లు వర్ణింప గలము స్వామీ!
నరసింహ నీవంటి దొరను
సంపాదించి కుమతి మానవుల నేఁ గొల్వజాల
నెక్కునైశ్వర్యంబు లియ్యలేకున్నను బొట్టకు మాత్రము పోయరాదె
ఘనము గాదిది నీకు గరుణను బోషింపఁ గష్ట మెంతటి స్వల్ప
కార్యమయ్య
పెట్టజాలక యేల భిక్ష
మెత్తించెదు నన్ను బీదను జేసినా వదేమి
విమల కమలాక్ష నేనిట్లు శ్రమ పడంగ గన్నులకు బండువై నీకు
గానబడునె
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస - దుష్టసంహార నరసింహ దురితదూర!! (65)
ప్రభూ ధర్మపురి నివాసా ! శ్రీ లక్ష్మీనరసింహప్రభూ! నీ వంటి గొప్పదేవుణ్ణి ఆరాధిస్తూ కూడా బతుకు తెరువు
కోసం దుర్మార్గులను నేనెట్లా ఆశ్రయించగలను.
అది నాకు సాధ్యం కాదు. నాకు నీవు కట్టుకు పోయేటంతటి ఐశ్వర్యాన్ని
ఇవ్వకపోయినా ఫరవాలేదు కాని ఉదరపోషణ కైనా
ఇవ్వరాదా తండ్రీ!! నీ దయతో నన్ను పోషించడం నీకేమైనా కష్టమైన
పెద్దపనౌతుందా స్వామీ. నీవు నా
పొట్టకు పట్టెడన్నం పెట్టకుండా నన్ను అడుక్కుని తినే వానిగా యాచకుని గా పేదవానిగా ఎందుకు చేశావు. ఓ లక్ష్మీనాథా! నేను ఈ విధంగా యాచకునిగా
బతుకుతుంటే నీకు కన్నుల పండువుగా ఉందా స్వామీ.!
యాయవారవృత్తి లో జీవించడం ఎంత
బాధో కవి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఈ
సమయం లోనే ఆ భగవంతుడు కూడ ఒకమారు యాచకునిగా బలి చక్రవర్తిని చేరిన వృత్తాంతం కవి
కి గుర్తుకొచ్చింది.
వాంఛ తో బలి చక్రవర్తి దగ్గరఁ జేరి భిక్ష మెత్తితి వేల బేల
పడక
యడవిలో శబరి
తియ్యని ఫలాలందియ్యఁ జేతులొగ్గితివేల సిగ్గుపడక
వేడ్కతో వేవేగ విదురునింటికి నేగి విందు గొంటి వదేమి వెలితి పడక
నటుకు లల్పము కుచేలుడు గడించుక చేర బొక్కసాగితి వేల
లెక్కగొనక
భక్తులకు నీవు పెట్టుట భాగ్యమౌను వారి కాశించితివి
తిండివాడవగుచు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస -
దుష్టసంహార నరసింహ దురితదూర !! (66)
నరసింహప్రభూ! ఏ మాత్రం చిన్నతనం
అనుకోకుండా బేలవై బలిచక్రవర్తి దగ్గరకు వెల్లి యాచించావు కదయ్యా! ఆనాడు అడవిలో శబరి తియ్యని పండ్లు అందిస్తుంటే సిగ్గుపడకుండా చేతులారా
స్వీకరించి వాటిని సేవించావు కదయ్యా.!వేడుక మీఱ విదురుని
ఇంటికి వెళ్లి మొహమాటం లేకుండా విందు నారగించావు కదయ్యా.పిడికెడు అటుకులు బక్క
బ్రాహ్మణుడైన కుచేలుడు కొంగున కట్టుకు రాగా ఎగబడి కొంగు నున్న మూట నూడదీసుకొని
మెక్కితివి కదయ్యా. భక్తులకు నీవు ఇవ్వడం భాగ్యమౌను గాని వారి తిండి కాశించి నీవు తిండిబోతువైనావు
తండ్రీ. దీనిలోని సూక్ష్మమేమిటయ్యా స్వామీ.!
ఇభ కుంభములమీది కెగిరెడు సింగంబు- ముట్టునే కుఱుచైన
మూషికమును
నవచూత పత్రముల్ నమలెడి కోయిల-కొఱకునే జిల్లేడు కొనలు నోట
నరవింద మకరంద మనుభవించెడి తేటి- పోవునే పల్లేరు పూలకడకు
లలితమైన రసాల ఫలము కోరెడి చిల్క- మెసవునే భ్రమను
నుమ్మెత్తకాయ
నిలను నీ కీర్తనలు పాడ నేర్చినతడు- పరుల కీర్తనఁ బడునే యరసి
చూడ
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస - దుష్టసంహార నరసింహ దురితదూర!!
(69)
శ్రీ
నారసింహా! మదించిన ఏనుగు కుంభస్థలం
పైకి దూకి వేడి రక్తాన్ని తాగ మఱిగిన
సింహాము అల్పమైన చిట్టెలుక కోసం ఆరాటపడుతుందా.? పడదు
కదా!లేతమావి చిగురులను నమిలే కోయిల జిల్లేడు చిగురులను
కొఱుకు తుందా.? వికసించిన పద్మముల యందలి మకరందాన్ని
గ్రోలడానికి అలవాటుపడిన తుమ్మెద పల్లేరు పూల చెంతకు వెళ్లదు కదా!తియ్యని మామిడి పండ్లరసాన్ని ఆస్వాదించే చిలుక ఉమ్మెత్తకాయలను తింటుందా
తినదు గదా! అలాగే స్వామీ! ఈ
భూమిమీద నీ కీర్తనలను ఆలపించడానికి అలవాటు
పడ్డవాడు ఇతరులను స్తుతించడానికి ఇష్టపడడు
కదా.!
ఈపద్యం లో శ్రీ నారసింహ గానామృత మాధుర్యాన్ని
కవి అనేక మైన ఉపమానాలతో వర్ణించి , ఆనందించాడు. ఈ పద్యం కూడ ప్రహ్లాదచరిత్ర లోని “లలిత రసాల పల్లవ ఖాదియై ” (ఆం.మ .భా. 7- 150) అనే
పద్యాన్ని గుర్తుచేస్తోంది.అక్కడ “అంబుజోదర దివ్య పాదారవింద,
చింతనామృత పానవిశేష మత్త చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు” అంటాడు ప్రహ్లాదుడు తండ్రి యైన
హిరణ్యకశిపునితో. ఇక్కడ “ఇలను నీ కీర్తనలు పాడ
నేర్చినతడు పరుల కీర్తన పాడునే యరసి చూడ ” అంటున్నాడు శేషప్ప.
----- నాల్గవ భాగం త్వరలో
********************************************
No comments:
Post a Comment