Saturday, 1 October 2016

శతకసౌరభాలు -9 పురుషోత్తమ కవి- శ్రీకాకుళ ఆంథ్రనాయక శతకము-8




శతకసౌరభాలు -9

కాసుల పురుషోత్తమ కవి     
 శ్రీకాకుళ ఆంథ్రనాయక శతకము-8
                                                   

                                               శ్రీకాకుళ శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారు


                                                       నినుఁ గోరు కున్న తండ్రిని నీ నిమిత్త మై
చింతించి మృతిఁ బొందఁ జేసినావు
నిను వని న్సేవింప ననుజు నాఁకటి కేమి
యొసఁగ కీవే పండ్లు మెసఁగినావు
నినుఁ గపు ల్గొల్చి తల్చినకార్య మీడేర్పఁ
బిదప వారలఁ జెట్లఁ బెట్టినావు
నిన్నుఁ బాయ కడవికిఁ జనుదేర నిల్లాలి
నొరుపంచఁ గొన్నాళు లుంచినావు
రాజ కళఁ జూచి ని న్నొక రాజు వనిన
మానుషం బేది? యిది యంత మాయ గాని
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                        హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                  69

                     ఆంధ్రదేవా  !  నువ్వే కుమారుడు గా  జన్మించాలని కోరుకున్న దశరధుని   నీ కొరకై  దు:ఖించి దు:ఖించి మరణింప చేశావు. వన వాస సమయం లో నీకు తోడుగా ఉంటూ , నిన్ను సేవించుకోవడానికి వచ్చిన తమ్ముడైన లక్ష్మణుని ఆకలి పట్టించుకోకుండా శబరి యిచ్చిన పండ్లన్నీ నీవే తినేశావు. కోతులన్నీ కలిసి నిన్ను సేవించి , నీ పనిని పూర్తిచేసిన తరువాత వాటన్నింటినీ చెట్లకు పుట్లకు వదిలేశావు. నిన్ను విడిచి ఉండలేక నీ వెంట అడవికి వచ్చిన ఇల్లాలు జానకీ దేవి ని పరాయి వాడి పంచన పది నెలలు ఉంచావు. ఇదం తా చూస్తుంటే  అంతా మాయ గా కన్పిస్తోంది. నిన్ను రాజు గా భావించడం  ఎంతవరకు సమంజసం.



కుల గురుద్వేషి నొజ్జలుగ నెన్కొని కాచి
నిష్ఠురమంత్రము ల్నేర్చినావు
పూర్వదేవతలు కాపుర మున్నపురియందు
వంచించి యగ్గిఁ బెట్టించినావు
తాతలతరమునఁ ద్రవ్వించినపయోధి
పేరుగాఁ గొంత పూడ్పించినావు
మోస మౌ టెఱుఁగక మోహించి వచ్చిన
యెలనాగముక్కుఁ గోయించినావు
బళిర! నీవంటి ధార్మికుఁ బ్రస్తుతింపఁ
గొదువ లింకేమి కైవల్య మెదుట వచ్చు
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                                                     హతవిమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ  !                                70వ
                             
                                   శ్రీకాకుళాంధ్రదేవ  !     నీ కులగురువైన వశిష్ఠుని విపరీతం గా ద్వేషించే విశ్వామిత్రుని నీ గురువు గా ఎన్నుకొని  మహిమాన్విత మంత్రాలన్నీ నేర్చుకున్నావు. పూర్వము దేవతానగరి గా  కొలవబడిన లంకానగరాన్ని హనుమంతుని చేత మాయ చేసి తగుల బెట్టించావు . నీ పూర్వీకుడైన సగరుడు తవ్వించిన సముద్రాన్ని  వంతెన కట్టి కొంతమేర పూడ్పించావు. మోసమని తెలియక నీపై మోహం తో చెంత చేరిన శూర్పమఖ ముక్కును  తమ్ముడైన లక్ష్మణుని  తో కోయించావు. ఆహా . నీ వంటి  ధార్మికుని ప్రస్తుతిస్తే   మాకింకా కొదవేముంటుంది. మోక్షమే  తనంత తాను  ఎదురు వచ్చి నిల బడు తుంది కదా !                       
                                           

                                             శౌర్య మెక్కించి విశ్వామిత్రుఁ డూరకఁ
దొడరింపఁ దాటకఁ దునిమినావు
వైదేహి వాక్య నిర్భంధంబుఁ ద్రోయలే
కఱిముఱి మారీచు నఱికినావు
వెనుకంజ వైచిన విడువక పైకి రా
నరుదుగా ఖరు తలఁ దరిగినావు
మొఱ్ఱో యనుచు దేవమునులు వా రెన్నాళ్ళో
యనుసరింప దశాస్యుఁ దునిమినావు
కాని రోసంబు గలదె నిక్కముగ నీకు?
మనసు మెత్తనివాఁడ వే మనఁగ వచ్చు
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!    71

                       ఆంధ్రదేవా !  గురువైన విశ్వామిత్రుడు చెప్పాడని ఆడదైన తాటకిని సంహరించావు. సీతమ్మతల్లి మాట తీసేయలేక వెంటాడి మారీచుని సంహరించావు. యుద్ధరంగం లో పైపైకి దూసుకొచ్చిన ఖరాసురుని కంఠాన్ని తెగ నఱికావు. కుయ్యో మని రోదిస్తూ దేవర్షులు  ఎంతోకాలం  నీ వెంట బడి ప్రార్ధిస్తే చివరకు రావణుని సంహరించావు.  మెత్తని మనస్సు గల నీకు   నిజమైన  కోపం రాదు గదయ్యా ప్రభూ!


                                          కొంచెపుఁ బని దాసి నించుక దండింపఁ
బగబట్టి యది యెన్నిపాట్లు వెట్టె
బలిమినిఁ బట్టి శూర్పణఖ నాసికఁ గోయ
నది నీకుఁ బిదప నెం తలఁతఁ దెచ్చె
జిన్నతనంబునఁ జెనకి పోఁ దోలిన
మారీచుఁ డొనరించె మాయ లెన్ని
నిరపరాధుని వాలి నురుశరాహతిఁ గూల్ప
వానియిల్లా లెంత వగచి తిట్టె
స్వామి వై యేమి యెఱుఁగవు స్వల్పకార్య
కారణంబున నెన్నెన్ని కతలు పుట్టె
చిత్ర చిత్ర ప్రభావ  ! దాక్షిణ్యభావ !
                                         హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ                                   72

                           ఆంధ్రదేవా ! నీ చిన్నతనం లో  ఆడుకుంటూ  నిన్నెత్తుకున్న పనిమనిషి  మంథర ను కాలితో తన్నావు అన్న కోపం తో సమయం కోసం ఎదురుచూసి  నీవు పెద్దవాడవైన తరువాత నీ పట్టాభిషేక సమయం లో కైకేయి ద్వారా తన పగ ను తీర్చుకొని నిన్ను అడవుల పాలు చేసింది. బలవంతంగా ఆనాడు శూర్పణఖ ముక్కుచెవులు కోయిస్తే , ఆ రాక్షసి పగబట్టి తన అన్న రావణుని ఎగద్రోసి ఎన్ని కష్టాలపాలు చేసిందో కదా  ! విశ్వామిత్రుని యాగ సంరక్షణ సమయం లో  మారీచుని చంపక వదిలివేయడం తో  వాడు మాయలేడి యై నిన్ను ఎన్ని కష్టాలకు గురి చేశాడో కదా !  నిరపరాధి యైన వాలిని   సంహరించినప్పుడు ఆతని ఇల్లాలు  బాధ లో నిన్ను ఎన్ని మాటలందో కదా ! నీవు ప్రభువు వై  ఉండి కూడ  తెలియనట్లు ప్రవర్తించావు. అందుకే చిన్నచిన్న  కార్య కారణాల మూలంగా ఎన్నెన్ని కథలు పుట్టాయో కదా!


                                          నీ పేరు వినుటకే యోపక చెవిఁ గంట
గట్టుకున్నాతనిఁ గావ నేమి?
కలన నీతోఁ గత్తిఁ గట్టుక పోరాడు
వాని సోదరుని బ్రోవఁగ బ నేమి?
బాధింపఁ దగు మహాపాత కుండటుచేర
నీవాఁడ నంటె మన్నింప నేమి?
మాయవేసముల నీ మర్మ మారయుచున్న
విమత దూతల బట్టి విడువ నేమి?
పతిత శరణాగతావన ప్రకటదీక్ష
లోకముల కబ్బురంబుగ నీకె గలదొ?
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ !   73

                           ఆంధ్రదేవా ! నీ పేరు కూడ వినడానికి ఇష్టం లేక చెవులకు ఘంటలు కట్టుకొని తిరుగుతున్న ఘంటాకర్ణుడనే రాక్షసుణ్ణి నీవెందుకు కరుణించి కాపాడావో నాకు తెలియడం లేదు. నీతో యుధ్ధం చేస్తున్న వాడి తమ్ముడు విభీషణుని నీవెందుకు  ఆదరించి , ఆశ్రయం కల్పించావో  తెలియదు. కాకాసురుడనే  మహాపాపి. సీతమ్మ నే ఇబ్బంది పెట్టాడు. అటువంటి వాడు శరణు అనగానే క్షమించి విడిచిపెట్టావు. మాయ వేషాలతో వచ్చి నీ యుద్దరహస్యాలు తెలుసుకుంటున్న రావణుని గూఢచారులను  పట్టుకొని , మరల క్షమించి వదిలి వేయడ మెందుకు. ఆలోచిస్తే లోకానికంతటికి ఆశ్చర్యం కల్గించే  శరణాగత రక్షణ మనే గొప్పవ్రతము నీకే ఉందేమో స్వామీ !


                                             పఱపిన శస్త్రంబె బహుముఖంబుల దైత్య
వాహినీమర్మము ల్వ్రచ్చి వెడల
ముందు దూసిన బాణమున కన్న సరి మించి
వెనుకమ్ము దైత్యుల విఱుగఁ బొడువ
నేసిన మార్గణం బెదు రెక్కి యితరాస్త్ర
మడఁచి క్రవ్యాదుల మగుడఁ జేయ
నిగిడించిన శరంబె నిర్జరారులఁ ద్రుంచి
తొడిఁదొడిఁ దనకుఁ దా దొసకుఁ జేరఁ
దొలఁగి రసురులు కొంత నీ బలిమి దెలిసె
ముష్టి నీ దెంత నీయస్త్రములదె వింత
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!      74

                               ఆంధ్రదేవా !  రామబాణ మహిమ  ఎంత గొప్పదో కదా.నీవు యుద్ధభూమి లో  వదిలిన బాణము రాక్షసవీరుల  రహస్యస్ధానాలను ఛేదించితే, ముందువేసిన బాణాని కన్న మించిన వేగం తో తరువాత వేసిన బాణం రాక్షసులను విఱగ పొడిచింది.మరొకబాణం వారినందరిని వెనక్కి తిరిగి పారిపోయేటట్లు చేస్తే , ఆపై నువ్వు ప్రయోగించిన బామం రాక్షస సంహారం చేసి మరలా మరలి వచ్చి నీ తూణీరం లో చేరింది. దానితో రాక్షసుల బెడద తీరింది .  నీ  పరాక్రమము తెలిసింది.  అయినా ముష్టి నీ బలమెంత . నీ అస్త్రాలదే వింత కాని . 

                                    కవి ఇక్కడ అలవోకగా ముష్టి నీ దెంత అంటూ ముష్టి అనే పదాన్ని వాడేశాడు. తెలుగు నాట ఈ పదం హీనతా సూచకం గా వాడబడుతోంది. ముష్టి నువ్విచ్చేది ఎవరిక్కావాలి. ముష్టి నీ బతుకెంత నువ్వెంత ....ఇలా వాడుతుంటారు. ఈ పద్యం లో పురుషోత్తమ కవి ఆంధ్రదేవుణ్ణి ముష్టి నీ దేమి ఉందయ్యా గొప్పతనం . నీ అస్త్రాలది కాని  .... అనేశాడు . ఇలా అర్ధం చెప్పుకుంటేనే వ్యాజస్తుతి పండుతుంది. శతకానికి అందమినుమడిస్తుంది.
                             అలాకాకుండా ముష్టి అంటే పిడికిలి అనే అర్ధం  చెప్పకొని   బాణాలు ప్రయోగించిన నీ పిడికిలిదేముందయ్యా గొప్పతనం . ఆ బాణాలది కాని ....... అని చెపితే అక్కడ  కవి హృదయం   పలకలేదేమో నని పిస్తోంది.

                                           అడవిలోఁ దెరువర్ల నుడుగక తినుచున్న
యాఁడుదాని వధించు టర్హ మగునె?
చిక్కినవారికిఁ జేతు లెంతయుఁ జాఁచు
మొండివాని వధించ ముఖ్య మగునె?
యెక్క డెక్కడ నైన నేఱుక తిను కాకి
కన్ను బోఁ బొడుచుట ఘన గుణంబె?
కడు వ్రేటుఁ బడి గడ్డి కఱచినఁ మారీచుఁ
దఱిమి బాధించుట నెఱతనంబె
యెవ్వ రేరాజు లొనరించి రిట్టిపనులు?
చేసితివి యింక నె ద్దేని సేయఁగలవు!
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!    75
                            
                              శ్రీకాకుళాంధ్రదేవ!    అడవిలో బాటసారులను పట్టుకు తిని బ్రతికే ఒక ఆడదాన్ని చంపడం నీవంటి వీరునకు  ఏమి గౌరవమయ్యాచేతులు చాచి చేతికి అందిన వారిని పట్టుకొని తినే తల మెడ లేని రాక్షసుని  చంపడం మర్యాదేనంటావా?  ఎక్కడెక్కడో తిరుగుతూ ఏదో దొరికిన దానిని  ఏఱుకు తిని బ్రతికే కాకి కన్ను పొడవడం వీరుని లక్షణమా ? సిద్ధాశ్రమం లో యాగ సంరక్షణ వేళ  సోదరుడు సుబాహునితో పాటు చావు దెబ్బతిని  చావక బతికి గడ్డి తింటున్న మారీచుని చంపడం గొప్పతనమా ? ఇంతకు ముందు ఏ రాజులు ఇటువంటి పనులు చేశారు. ఇటువంటి పనులు చేసిన నీవు ముందు ముందు ఇంకా ఏమైనా చేస్తావు. నీ చేతలన్నీ  చిత్రాలే కదయ్యా. దయాగుణ సంపన్నుడా ! శతృసంహార సమర్ధుడవైన ఆంధ్రదేవా  !

                
                                          
                                                   శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు యొక్క దివ్యమంగళ విగ్రహం


                                     శ్రీమహావిష్ణువు    రామావతారం లో  శ్రీరామచంద్రుడు  చేసిన ఘన కార్యాలను  గుర్తుచేసుకొని ఆనందిస్తూనే , అదెంత ఇదెంత ,అది న్యాయమేనా ఇది ధర్మమేనా అంటూ వితండవాదన చేస్తున్నాడు కవి. అంతేకాదు ఇంతకు ముందు  ఏ రాజులు ఇటువంటి పనులు చేశారు. అంటే వాళ్ళెవరూ చేయలేని పనులు నువ్వు చేశావని  ప్రశంస. నీవు కాబట్టే ఇవి చేయగలిగావని  ప్రపత్తి.
                  కాని పైకి మాత్రం ఇటువంటి పనులు చేశావేమయ్యా.  రాజులైన వారు ఎవరైనా ఇట్టిపనులు చేస్తారా  అని నిలదీత.  నీవు కాక  ఇంకా ఏ రాజు చేస్తాడయ్యా అని పొగడ్త.

                      గడ్డి కఱచిన మారీచుని చంపడం అనే ప్రయోగం అత్యంత భావగర్భితమై అందగిస్తోంది. తెలుగునాట   ఎవడైనా దుర్మార్గుడు నష్టపోతే   వాడు గడ్డి  కఱచి పోయాడు అనే  ఒక జాతీయం విరళం గా వాడబడుతోంది. కవి ఇక్కడ మారీచునికి ఈ పదాన్ని చక్కగా వాడుకున్నాడు. ఆనాడు సిద్ధాశ్రమం లో చావు తప్పి  బయటపడ్డ మారీచుడు రావణుని ప్రేరణ తో బంగారు లేడి  వేషం లో పచ్చిక (గడ్డి) మేస్తూ  సీతమ్మ కు కన్పించి  తనకు కావాలనిపించాడు. వెంటబడిన రాముడు  మారీచుని తఱిమివెంటాడి సంహరించాడు. గడ్డి కఱిచినఅనే పదం తో కవి చెప్పదలచిన  రామకథ ఇది.


రాజకార్యపరుండు తేజోబలాధికుఁ
డాంజనేయుఁడు భృత్యుడగుటఁ జేసి
యమితశౌర్యుఁడు ప్లవంగమ కులేశుఁ
డినజుఁ  డఱలేని స్నేహితుడగుట జేసి
విమతమర్మజ్ఞుండు విశ్వాసభరితాత్ముఁ
డల విభీషణుడాప్తుఁడగుటఁ జేసి
సుమనస్కులమనస్కులమృత వాక్యంబులఁ
బొసగ నాశీర్వదించుటను జేసి
లంక సాధించితివి గాని లావుచేత
నిర్జరారుల గెలువంగ నీ తరంబె.
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!     76

                           ఆంధ్రదేవా ! స్వామి భక్తి పరాయణుడు , పరాక్రమశాలి యైన ఆంజనేయుడు నీకు సేవకుడవడం మూలంగాను , అమిత పరాక్రమ సంపన్నుడు , వానరవీరుడునైన సుగ్రీవుడు  నకు స్నేహితుడవ్వడం వలన , శతృ రహస్యాలు తెలిసిన వాడు విశ్వాసపాత్రుడునైన విభీషణుడు నీకు ఆప్తుడైన కారణం గాను, దేవతలు, మహర్షుల అమృతమయమైన ఆశీస్సులు నీకు అండగా ఉండటం వలన నీవు రావణుని సంహరించి లంకను జయించావు కాని   కేవలం నీ బలం చేతనే నీవు రాక్షసులను గెలవగల్గడం సాధ్యమయ్యే పని కాదు కదా !




శ్రీకాకుళ ఆంజనేయుడు

నడువ జాలదని జానకి నెత్తుకొని ముందు
నడచు విరాధుని  నఱకుటేమి
చనవున వైదేహి చను బిడ్డవలె నోట
బట్టిన యైంద్రి కన్గొట్టుటేమి
సీత సంతోషింపఁ జిత్రవేషముఁ దాల్చి
తిరుగు మారీచుని నఱకుటేమి
తల్లిని వలెఁ దెచ్చి ధరణీజను నశోక
వని నిల్ప రావణు దునుము టేమి
కోపమటులేమి వారుమహాపరాథు
లైన ముక్తిప్రసాదార్హులగుట యేమి
 చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!     77

                                 శ్రీకాకుళాంధ్రదేవ !     అరణ్యం లో నడవలేక పోతున్న జానకీ దేవి ని ఎత్తుకొని వెళుతున్న విరాధుని  నరికి వేశావు. బిడ్డవలె తల్లి సీతమ్మ  స్తనాన్ని నోట పట్టుకున్న కాకి కన్ను ను పొడిచివేశావు. అందరినీ వదిలి అడవిలో ఉంటున్న సీతమ్మ ను ఆనంద పరుద్దామని  ఆమె ఎదుట బంగారు లేడి వేషంలో తిరుగుతున్న మారీచుణ్ణి సంహరించావు. తల్లి  వలే తీసుకొచ్చి సీతమ్మను అశోక వనం లో ఉంచిన రావణుని  పై దండెత్తి వచ్చి మరీ చంపావు. అంత కోపమైతే ఎలాగయ్యా ! నిజం గా వాళ్ళు అపరాథం చేసిన వాళ్ళయితే  మోక్షార్హులు ఎలాగయ్యారు. నీ చేతలు విచిత్రం గా ఉంటాయయ్యా స్వామీ ! చిత్ర చిత్ర ప్రభావుడవు కదా !

                       కవికి      శ్రీరామచంద్రుని మీద, రామకథ మీద ఉన్న అభిమానం ఇన్ని పద్యాలలో పొంగుతూ వచ్చింది. విరాధుడు సీతమ్మ ను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించడం, మారీచుడు బంగారు లేడి వేషం లో మోసపుచ్చడానికి యత్నించడం,రావణుడు సీతమ్మ ను అపహరించడం మొదలైనవన్నీ రాముని అనుగ్రహం కోసమే వాళ్ళు చేసినట్లు వాదించడం కవి లోని  వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. శ్రీరాముడు చేసిన పనులు  తొందరపాటు చర్యలంటూ స్వామిని కవ్వించడానికి, తద్వారా ఆయన అనుగ్రహ సంపాదనకు నిందాస్తుతిని ఆయుధం గా మార్చుకున్నాడు కవి కాసుల పురుషోత్తం.

ఒక్క వ్రేటునఁ గూలునో వాలి బలశాలి
చెట్టుమాటొగ్గి వేసితివి కాని
మొనసి నీల్గునె పంక్తి ముఖుడు తన్నాభికా
మృతకుంభ మగలఁగొట్టితివి గాని
 కుంభకర్ణుడు రణ క్షోణిలోఁ దీఱునే
తీఱని నిద్ర యెదిర్చె కాని
చిక్కునే యింద్రజిత్తుక్కున సోదరుం
డశనిద్రలు మాని యడచెఁ గాని
యిందఱాయంబు లెఱుగుదు వందువలన
మడిసి రసురులు నీచేత మడియు వారె
                                                   చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ
హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!      78

                                                         ఆంథ్రదేవా !  నీవు చెట్టు చాటునుండి కొట్టడం వలన వాలి నేల కూలాడు గాని ప్రత్యక్ష యుద్ధం లో అతను నీ దెబ్బ కు  చచ్చేవాడు కాదు గదా ! రావణుని నాభి ప్రదేశం లో గల అమృత భాండాన్ని పగలగొట్టడం మూలంగా  అతను నేలకూలాడు గాని అతనిని సంహరించడం నీ తరమయ్యేది కాదు గదా ! కుంభకర్ణుడు యుద్ధ భూమిలో మరణంచేవాడే కాదు. సగం నిద్ర లో అతన్ని లేపడం వలన అతనికి  మరణం ప్రాప్తించింది కాని లేకపోతే నీకు సాధ్యమయ్యేది కాదు. పధ్నాలుగు సంవత్సరాలు నీ సేవలో  నిద్రాహారాలు మానిన  లక్ష్మణుని వలన ఇంద్రజిత్తు మరణం సిద్ధించింది కాని నీ వల్ల కాదు. ఇంతమంది ఆయువు పట్టులు తెలుసుకున్నావు కాబట్టి ఆ రాక్షసులను సంహరించావు కాని లేకపోతే నీ చేతిలో వారెందుకు చచ్చేవాళ్ళు.
                                                                                     ******        తొమ్మిదో భాగం త్వరలో


*************************************************


No comments: