Friday, 2 September 2016

శతకసౌరభాలు -9 పురుషోత్తమ కవి - శ్రీకాకుళ ఆంథ్రనాయక శతకము-7

శతకసౌరభాలు -9

కాసుల పురుషోత్తమ కవి     


  శ్రీకాకుళ ఆంథ్రనాయక శతకము-7


                                   




                                          నీరు పట్టుగ నుంట నారాయణుఁడ వండ్రు
 నారాయణాఖ్యాధికార మేమి?
బలిసి యంతట నీవె గలుగ విష్ణుఁడ వందు
 రావిష్ణునామప్రభావ వేమి?
ముగురు నీవై వెలుంగఁగఁ గేశవుఁడ వండ్రు
 కేశవాభిఖ్యాప్రకాశ మేమి?
సిరికి మగఁడ వై మెరయ శ్రీపతి వండ్రు
 శ్రీపతి నామ ప్రసిద్ధి యేమి?
పెట్టుపేరు లనేకముల్‌ పుట్టుపేరు
గుఱు తెఱింగిన నీమూల మెఱుఁగవచ్చు
చిత్ర చిత్ర ప్రభావ  ! దాక్షిణ్యభావ
                      హత విమతజీవ !శ్రీకాకుళాంధ్రదేవ!                  56

                            ఆంధ్రదేవా! నీటిలో నివాసముండే కారణంగా నిన్ను నారాయణుడవని  పిలుస్తున్నారు కాని   నారాయణుడనే పేరుకున్న గొప్పతనమేమిటి ? సర్వవ్యాపివై ఉండుట వలన నిన్ను విష్ణువని పిలుస్తున్నారు తప్పితే విష్ణువను పేరుకున్న ప్రభావమేమిటి ? త్రిమూర్త్యాత్మకుడవై ప్రకాశించుట చేత నిన్ను కేశవుడంటారే కాని ఆ నామము యొక్క గొప్పతనమేమిటి  ?  లక్ష్మికి మగడవై శ్రీపతి యనే ప్రసిద్ధి పొందావు కాని  ఆ పేరుకున్న గొప్పతనమేమిటి ? నీకు భక్తులు పెట్టుకున్న పెట్టుపేర్లు కొల్లలు కాని అసలు నీకు పుట్టుక తో వచ్చిన పేరు తెలిసిన కాని  నీ యొక్క అసలు రూపం తెలియదు కదా స్వామీ !.
.
                                             వేఁడని చూడక విపిన వహ్నిజ్వాలఁ
 ద్రావెదో తేనియఁ ద్రావినట్లు
భార మంచనక గోవర్ధనపర్వతం
 బెత్తెదో పూబంతి యెత్తినట్లు
విషపుంజ మనక నాభీలాజగరజిహ్వఁ
 జింపెదో ప్రాబట్టఁ జింపినట్లు
వెస నసాధ్యుండని వెరవక నరకుని
 నఱికెదో పార్వేఁట నఱికినట్లు
భక్తసంరక్షణ త్వరా పరవశతను
జేసినా వేమొ యూరక సేయఁగలవె?
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!      57
                             
                             శ్రీకాకుళాంధ్రదేవ !   భక్తులను  రక్షించాలనే తొందరలో ఏవో కొన్ని సాహస కృత్యాలు చేశావు కాని ఆ పనులు  మామూలు  గా నీవు చేయగలిగినట్లు గా నా కనిపించడం లేదు.   భయంకరమైన దావాగ్ని ని  లెక్కచేయకుండా తేనెని మ్రింగినట్లు అలవోకగా త్రాగేశావు. బరువని ఆలోచించకుండా గోవర్ధన పర్వతాన్ని  పూబంతి ని ఎత్తినట్లు అలవోకగా  ఎత్తిపట్టుకున్నావు. విషమనే భయం లేకుండా మహా సర్పము యొక్క నాలుకను పాతబట్టను చింపినట్లు చీల్చివేశావు. అసాధ్యుడని కొంచెం కూడ ఆలోచించకుండా  నరకాసురుడు వంటి వాడిని  పార్వేట లో నరికినట్లు నరికేశావు. ఈ పనులన్నీ నీవు చేయగలిగి ఉంటే ఈ నాడు నీ ఆలయ నిర్వహణ కోసం  నా వంటి భక్తులు ఎందుకు యాయవారాలు చేసి, చందాలు పోగు చేసి  నీ  ఆలయ నిర్వహణ  చేయవలసి వస్తోందో నాకర్ధం కావడం లేదు.

                                           వత్సాపహరణ గర్వము మాని యజుఁడు దా
 నపరాధి ననుచు సాష్టాంగ మెఱఁగె
భవుఁడు బాణున కాజి బాసట యై వచ్చి
 భక్తునిఁ బట్టిచ్చి ప్రణుతిఁ జేసె
వజ్రి శిలావృష్టి వర్షించి లజ్జించి
 తప్పుఁ జేసితి నంచు దండ మిడియె
సమవర్తి భీతి నంజలిఁ జేసి యాత్మలో
 కస్థితు గురుపుత్రుఁ గాను కిచ్చె
క్షోణిఁ బుట్టుక మాలిన గొల్లవాని
నిన్ను నావేల్పు లోడింప నేర రేమి?
చిత్ర చిత్ర ప్రభావ  ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!     58

                                       ఆంధ్రదేవా ! ఆనాడు  బ్రహ్మదేవుడు ఆవులను అపహరించిన అహంకారాన్ని విడిచి పెట్టి స్వయంగా తాను లొంగిపోయి , అపరాధి నంటూ   దండప్రణామం చేశాడు కదా  ! త్రినేత్రుడైన ఈశ్వరుడు బాణాసురుని కి బాసట గా నిల్చియు తుదకు ఓడిపోయి , భక్తుని పట్టిచ్చి ప్రణామాలు సమర్పించాడు కదా  ! ఆనాడు ఇంద్రుడు గర్వం తో శిలావృష్ఠి కురిపించి అనంతరం అహాన్ని వీడి  సిగ్గు తో నిన్ను క్షమించమని ప్రార్థించాడు కదా ! యమధర్మరాజు లాంటి వాడు నీకు భయపడి  తన లోకం చేరిన గురుపుత్రుని  నీకు కానుక గా సమర్పించలేదా !  కాని ఇవన్నీ జరిగాయంటే అది నీ గొప్పతనమని నే నను కోవడం లేదు. ఆ బ్రహ్మాది దేవతలు నీపై  జాలి చూపించారు కాని వాళ్ళు తలుచుకంటే నిన్ను ఓడించలేకపోయేవారంటావా ? చెప్పు.

దశావతార వర్ణన
                                   మత్స్యావతారము

                                     కొనముట్ట హెచ్చుతగ్గుల ప్రాతఁసుద్దుల
 తాత పుస్తక మొకఁ డాతతాయి
మ్రుచ్చిలి నీటిలోఁ జొచ్చి డాఁగిన వాని
 పావన మేమి వెంబడిగఁ బెద్ద
కోఱమీనంబవై యాఱొండుసంద్రము
 ల్నిముసంబులో నీఁది నెమకి వాని
డొక్క వ్రక్కలుగాఁ గఱుక్కున బరిఁ గోసి
 కడ లేని నుడువు లెక్కటికి నోట
మాట వెళ్ళని వానికి మగుడ నిచ్చి
యింత పనికిని నవతార మెత్తి తీవు
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!   59

                        ఆంధ్రదేవా ! పూర్వకాలం లో సోమకుడనే రాక్షసుడు స్వరయుక్తమైన వేదమును బ్రహ్మదేవుని చెంత నుండి దొంగిలించి, సముద్ర గర్భం లో దాక్కొనగా, ఆ వేదముల పవిత్రత  ఎంతగొప్పదో గాని నీవు  మత్స్యావతారమును దాల్చి సప్త సముద్రములను నిమిషము లో ఈది , ఆ సోమకుని వెదకి పట్టుకొని, వాని డొక్కలు పగులునట్లు ప్రక్కలను ఖండించి , ఆ ప్రాబల్కులను తెచ్చి మరల బ్రహ్మ కు ఇచ్చినాడవు. ఇందుకోసమే నీవు మత్స్యావతారమును దాల్చితివి ప్రభూ.

కూర్మావతారము.


అబ్ధిపయఃపాత్ర మద్రిరాణ్మంథాన
 మహిరాజగుణము దా రమరఁ గూర్చి
యమృతాభిలాష దేవతాసురుల్‌ మథియింప-
 గిరి మున్గఁ గచ్ఛపాకృతి వహించి
నిర్వహించుట గాని సర్వకాశ్యపులలోఁ-
 బఙ్క్తిభేదముఁ జేసి పల్మ ఱాస
కొల్పి దైత్యులనోరుఁ గొట్టి యాదిత్యుల
 కమృతాన్న మిడితి వా యమరులందుఁ
బక్షపాతివి గావె? యభక్తిఁ బడిరి
నమ్ముదురె యానిశాటు లెన్నటికి నిన్ను
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!     60

                             శ్రీకాకుళాంధ్రదేవ !     దేవదానవులు అమృతమందలి ఆశ చేత పాలసముద్రమును  పర్వతరాజైన మంథరుడు కవ్వంగా ,సర్పరాజు వాసుకి కవ్వపు త్రాడు గా ,  కట్టి  చిలకడం ప్రారంభించినప్పుడు, ఆ మంథర పర్వతము మునిగి పోవు చుండగా ,నీవు  కూర్మరూపమున వచ్చి ఆ పర్వతమును నీ వీపు పై  మోసి అమృతావిర్బావమునకు కారణమైనావు. కాని ఆ అమృతము ను  పంచుకొను సమయమున దేవదానవులలో  పంక్తి భేదము కల్పించి , రాక్షసుల నోరు కొట్టి , అమృతమును దేవతలకు పంచావు. నీవు అమర పక్షపాతివి. నీలాంటి వాడిని  రాక్షసులు ఎన్నటికీ నమ్మరు కదా.

వరాహావతారము

                              
                                       ఉక్కునఁ బసిఁడికన్‌ రక్కసుఁ డొకఁడు ప
ల్దిక్కు లోరిచి బొల్లిపక్కి మావు
నెక్కు రౌ తెక్కడఁ జిక్కెడు నంచు నీ
యిక్కువ లరయంగఁ గిక్కురించి
నక్కితి విల క్రిందఁ జొక్కపుఁ బంది వై
కొక్కరింపుచు నాతఁ డక్కడికిని
మొక్కరింపఁగఁ జొరఁ బొక్కలే కట వాని
డొక్కగఱుక్కునఁ జెక్కిపట్టి
నొక్కి పుడ మింత నీటిపై కెక్కఁదీ
మక్కువ దనర్ప నది యేమి రక్కరింపు
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ  61
                   ఆంధ్రదేవా ! హిరణ్యాక్షుడను రాక్షసుడు తెల్లగుఱ్ఱాన్ని ఎక్కిన రౌతు ఎక్కడున్నాడని లోకాలన్నీ వెతుకుతూ, పాతాళానికి చేరుకోగా , వరాహరూపము లో నున్న నీవు ఆ రాక్షసుని డొక్కలను నీ వాడియైన కోరలచే చీల్చి వానిని మట్టుపెట్టి ,  భూమిని ఉద్ధరించిన నీ గొప్పతన మేమని చెప్పవచ్చు.
నృసింహావతాము
                        
                                          అయవారు చదివించినట్లుగాఁ జదువక
మఱి కొట్టి తిట్టగ వెఱపుఁ గొనక
తనయుఁ డెంతో పరధ్యానంబుగా నున్నఁ
దండ్రి వల్దని చెప్పఁ దగఁడె ధాత్రి
నీకుఁ గోపం బేమి నృహరి రూపంబున
స్తంభంబులోఁ బుట్టి చటులనేత్ర
దంష్ట్రా నఖప్రభ దహనకీలలఁ బోలి
భగ్గు రనంగఁ బైఁబడి హిరణ్య
కశిపుఁ దునుమాడి ప్రహ్లాదుఁ గరుణ నేలి
తందఱి కసహ్య మయ్యె ని న్నపుడె కనఁగ
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ  ! శ్రీకాకుళాంధ్రదేవ!  62

                                  ఆంధ్రదేవా ! గురువు చెప్పిన రీతి గా చదవకుండా ,కొట్టినా తిట్టినా భయం లేకుండా కొడుకు పెడదారుల పోతుంటే తండ్రి  అలా చేయకూడదని చెప్పగూడదా ? దానికి నీకు కోపం ఎందుకు రావాలి. నీవు భయంకరమైన నృసింహ రూపాన్ని ధరించి , స్థంభము నుండి ఉద్భవించి , ప్రకాశవంతమైన గోళ్ళ కాంతి అగ్ని జ్వాలలతో సమానం గా ప్రజ్వరిల్లు తుండగా హిరణ్య కశిపుని సంహరించి  ప్రహ్లాదుని కరుణ తో కాపాడితివి కదా. ఆనాటి నీ రూపము ఎంత భయద మనోహరమో కదా !




       వామనావతారము                          

                                   కశ్యపుఁ డదితి ని న్గన్నవారలు గారె
పెంచిరే మరుగుజ్జుబిడ్డ వనుచుఁ
గుండిక దండంబు గోఁచితో వచ్చిన
కపటవటుండు నిక్కముగ భూమి
సురుఁడు గాఁడని యాత్మగురుఁడీయవల దనఁ
గరుణించి బలిదాత కామితార్థ
మొసగంగ నభివృద్ధి నొంది మే లొర్వక
ధర్మంబు నాల్గుపాదముల జరుపు
నట్టి దాతను దిగద్రొక్కియతని సిరులు
దెచ్చి కులగోత్ర భేదికీ నిచ్చకంబొ
చిత్ర చిత్ర ప్రభావ  ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!  63

                                           ఆంధ్రదేవా !  అదితి, కశ్యపుడు నీ కన్నవారే కదా. పొట్టివాడవని నిన్ను పెంచి పోషించినారు కదా. దండ, కమండలము  లను ధరించి వచ్చిన కపట బ్రహ్మచారి  నిజమైన బ్రాహ్మణుడు కాడని కులగురువు శుక్రాచార్యుడు చెప్పుచున్నను వినిపించుకోక , బలిచక్రవర్తి దయతో నీకు  దానమును చేయగా , చేసిన మేలు కు శుభమును  అనుగ్రహించక   ధర్మమును నాల్గుపాదముల నడుపు మహాదాత ను బలిని పాతాళమునకు అణగద్రొక్కి, ఆతని సంపదను తెచ్చి ఇంద్రునకు  ఇచ్చినావు . ఇటువంటి పనులు నీకిష్టమైనవి గా కన్పించుచున్నవి. ఇదేమి న్యాయము ప్రభూ ?
   
 పరశు రామావతారము                                 

                                             జపతపోనిష్ఠుఁడౌ జమదగ్ని కుదయించి
కరము దారుణవృత్తిఁ గత్తి కట్టి
కినుక రాజద్రోహమునకు శంకింపక
సకలభూపతుల గొంతుకలు గోసి
కార్తవీర్యార్జును కరసహస్రం బొండు
తఱి గండ్రగొడ్డంట నఱికివైచి
వసుధపై రక్తప్రవాహంబు లొనరించి
తజ్జలంబులఁ బితృతర్పణములు
సేసి యిల విప్రులకు ధారఁ బోసినట్టి
కీర్తియే కాని బ్రాహ్మణ్యకృత్య మగునె
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                           హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                        64

                   ఆంధ్రదేవా ! జప తపోనిష్టుడైన జమదగ్ని కి కొడుకు గా పుట్టి ,  దారుణమైన రీతి లో కత్తిని పట్టి ,సమస్త రాజలోకమును నాశనము చేయుటకు పూనుకొని , సమస్త క్షత్రియుల గొంతుకలు కోసి , కార్తవీర్యార్జునుని వేయి చేతులను గండ్ర గొడ్డలి తో నరికి వేసి , పరశు రాముడవై ,  భూమిపై రక్తప్రవాహములను పాఱింప చేసి , ఆ రక్తము తో  పితృతర్పణ ల చేసి , భూమినంతటిని బ్రాహ్మణులకు  దానము చేసిన కీర్తియే కాని నీవు చేసిన  ఈ పనులు  సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుడు చేయవలసిన పనులేనా చెప్పు ?




రామావతారము

తా వచ్చెద నటంచు ధైర్యలక్ష్మి మహీజ
వెంట రా నడవికి వెడలినావు
సుగ్రీవుఁ డున్నచో సొమ్ము దా నిడ సీత
యాజాడ నతని   పొం దతికినావు
ముందు జానకి లంక మూర్ఖించి చొచ్చి నిన్‌
దెచ్చిన రిపుల సాధించినావు
వైదేహి భవదంక వసతిఁ గూర్చున్నచో
భువనసామ్రాజ్యముల్‌ పొందినావు
గట్టిగా మైథిలినిఁ జెట్టఁ బట్టినట్టి
పౌరుషము లబ్బె నేనాఁటి పూరుషుఁడవొ
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                 హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!             65

                          శ్రీకాకుళాంధ్రదేవ!   ఆనాడు నీవు రామావతారం లో అడవికి బయలుదేరుతున్నప్పుడు  సీతాదేవి తాను కూడ వస్తానని  ధైర్యలక్ష్మి గా నీ వెంట బయలుదేరింది. సుగ్రీవుడున్న ప్రదేశం లో ఆమె తన నగల మూట ను విడిచిపెట్టిన కారణం గానే నీవు సుగ్రీవుని తో స్నేహం  చేయగలిగావు. ముందు గా మా అమ్మ జానకి  లంకానగరం ప్రవేశించడం మూలంగానే నీవు ఆమె వెనుక వెళ్ళి శత్రువులైన రాక్షసమూక ను మట్టుపెట్టగలిగావు. సీతాదేవి నీ యంకపీఠి నారోహించడం వలననే   నీవు లోకాధిపత్యాన్ని పొంది సార్వభౌముడవయ్యాడు. సీతమ్మ ను వివాహం చేసుకోబట్టే నీకు ఇవన్నీ ప్రాప్తించాయి.  నీవు శ్రీ-రాముడవయ్యాడు.  లేకపోతే నీవు సాధారణ పురుషుడవే కదా !   

                           కవికి    రామకథ మీద నున్న మక్కువ ఇంకా రామావతారాన్నే వర్ణింప చేస్తోంది.


                                                    ధర్మవిఘాత మిద్ధర నీ వొనర్చిన
మూఁడులోకంబులు మ్రోసె నపుడె
జనకునికూఁతు నిచ్చను బెండ్లి యాడంగ
నరనాథకోటులు నవ్వి రపుడె
పుణ్యజనంబులఁ బోరి బాధింపంగ
సుర లద్భుతము నొంది చూచి రపుడె
సంతతాశ్రిత విభీషణు రాజుఁ జేయంగ
నల రవీందులు సాక్షి నిలిచి రపుడె
మంచి నడవడి నడిచినా వెంచి చూడఁ
గీర్తి గల మూర్తివే యిట్టి వార్త లరయ
చిత్ర చిత్ర ప్రభావ  ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!           66

                                   శ్రీకాకుళాంధ్రదేవ! ఆనాడు నీవు జనకుని సభ లో శివధనుస్సు ను విఱవగానే ముల్లోకాలు ఆనందం తో మురిసి పోయాయి.  జానకి ని నీవు పరిణయం మాడగానే సకల రాజన్యలోకము సంతోషించింది. రాక్షసులను  సంహారించినప్పుడు దేవతలందరు ఆశ్చర్యం తో పుష్పవృష్టి ని కురిపించారు. నిన్ను ఆశ్రయించిన విభీషణుని లంకారాజ్యానికి అథిపతి ని చేసినప్పుడు సూర్యచంద్రులే ఆ ఘన కార్యానికి సాక్షీ భూతులు గా నిల్చారు.  ఇదంతా చూస్తుంటే  నీవు మంచిపనులు చేశావని , మంచి కీర్తి గల మూర్తి వని అనిపిస్తోంది .    



                                          సన్ముని నధ్వరసాఫల్యుఁ గావింప
జానకీపరిణయోత్సవము గలిగె
రవి నందనునిఁ గీశరాజ్యాధిపతిఁ జేయ
సేతుబంధనకీర్తిఁ జెందఁ గలిగె
బహు దేవతాస్త్రీల బందిగంబులఁ బాపఁ
జెఱ నున్న వైదేహిఁ జెందఁ గలిగె
నల విభీషణుని లంకాధినాథునిఁ జేయ
నెలమి నయోధ్య నీ వేలఁ గలిగె
నబ్బె నీకుఁ బరోపకారైన ఫలము
లంతియే కాక నీచేత నైన దేమి?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ !
                          హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                  67

                          ఆంథ్రదేవా. నీవు విశ్వామిత్రుని యాగసంరక్షణ చేసిన కారణం గానే జానకీదేవిని పరిణయమాడే గొప్పయోగం నిన్ను వరించింది. సుగ్రీవుని  వానర రాజ్యానికి  రాజుగా చేయడం మూలంగానే సముద్రానికి వారథి కట్టావనే అపురూప కీర్తి నీకు దక్కింది. లంకానగరం లో అనేకమంది దేవతా స్త్రీలను   చెఱశాలల నుండి విడిపించడం చేతనే  మా అమ్మ సీతమ్మ చెఱ తొలగి నిన్ను చేరగల్గింది. విభీషణుని నీవు లంకాధినాథుని గా చేయడం వలనే అయోథ్యానగరాన్ని నీవు ఏలగలిగావు. ఇవన్నీ  కూడ  నీవు చేసిన పరోపకార ఫలితాలే కాని నీవు గొప్పగా సాధించింది ఏమీలేదు.


                                               ఒక పినతల్లి మే లోర్వలే కనిచిన
విపినంబులకుఁ బోవు వెఱ్ఱి గలఁడె?
తండ్రి మృతుండైనఁ దనరాజ్య మత్తఱి
నేల రాకుండిన బేల గలఁడె?
యనుజుండు వల దన నాలిమాటలు విని
చెడుగిఱ్ఱిఁ బట్టఁ బో వెడఁగు గలఁడె?
పరదేశమున నుండి బలవద్విరోధంబు
బలిపించుకొన్న వెంగలియు గలఁడె?
నీవు సేసినపను లిట్టి నేరుపరివె
జగదుపద్రవ మెట్లు పోఁ జఱచినావొ?
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!      68

                           శ్రీకాకుళాంధ్రదేవ !       పినతల్లి   గొప్పతనాన్ని  సహింపలేక అడవి కి పొమ్మంటే   వెళ్ళే వెఱ్ఱివాడు ఎవడైనా ఉంటాడా. తండ్రి మరణించిన తరువాత   పెద్దకొడుకు గా తనకు దక్కిన రాజ్యాన్ని పాలించడానికి రాకుండా ఉండే తెలివితక్కువ వాడు ఎవడైనా ఉంటాడా. నీవు కాక. తమ్ముడైన లక్ష్మణుడు వద్దన్న కొద్దీ వినకుండా  పెళ్ళాం మాట విని కపటలేడి ని పట్టుకోవడానికి వెళ్లే అమాయకుడెవడైనా ఉంటాడా. పరాయిదేశం లో ఉంటూ బలవంతుడైన రావణుడు వంటి శతృవులతో బలవద్విరోధం పెట్టుకున్న నీ వంటి అవివేకి ఎక్కడైనా ఉంటాడా. నీవు చేసినవన్నీ ఇటువంటి తెలివితక్కువ పనులే. మరి ఇటువంటి నీవు ఈ లోకానికి  దుర్మార్గుల వలన ప్రాప్తించిన జగదుపద్రవాలను ఎలా నివారించగలిగావో  నాకు  అర్థం కావడం లేదు.
                                                                                  
                                                                                              ఎనిమిదవ భాగం త్వరలో-           -------------------
                                                                     

                                                       


No comments: