ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వరశతకము-8
ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, యుండంగ గుహల్గల్గవో,
చీరానీకము వీధులం దొరకదో , శీతామృత స్వచ్ఛ వా:
పూరం బేరులం బారదో, తపసులం బ్రోవంగ నీవోపవో?
చేరం బోవుదురేల రాజుల జనుల్ ? శ్రీ కాళహస్తీశ్వరా !
శంకరా !
నీ భక్తులకు ఊరూర ప్రజలు శివార్పణమని భిక్ష సమర్పిస్తున్నారు కదా ! నివసించడానికి గుహలు ఉండనే
ఉన్నాయి కదా ! కట్టుబట్టలు
వీధుల్లో లభిస్తాయి కదా ! స్వచ్ఛమైన , తియ్యనైన చల్లని
త్రాగునీరు సెలయేరుల్లో ప్రవహిస్తూ
దాహార్తిని తీరుస్తోంది కదా ! తాపసులను కాపాడటానికి ఎలాగు నువ్వున్నావు గదా ! మరి వీటన్నింటినీ కాదని మూర్ఖులైన జనం రాజుల పంచన చేరుతున్నారెందుకో ప్రభూ ?
ఆరావం బుదయించె తారకము గా నాత్మాభ్ర వీధి న్మహా
కారోంకారమకారయుక్తమగు నోంకారాభి ధానంబు చె
న్నారు న్విశ్వమనంగ , తన్మహిమచే నానాద బిందు ల్సుఖ
శ్రీ రంజిల్ల గడంగు , నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా !
ఈశ్వరా !ఆత్మ యనే ఆకాశం లో ఆ> ఉ> మ అనే వర్ణాల కలయికతో తారక మంత్రమైన ఓంకారమనే ప్రణవ మావిర్భవించి విశ్వమంతా వ్యాపించింది. ఆ మహిమ చే విరాజిల్లుతున్న ఆనందమయ నిత్య
స్వరూపము నీవే గదా ప్రభూ!
నీ భక్తు ల్పదివేల భంగుల నిను న్సేవింపుచున్ వేడగా
లోభంబేటికి , వారి కోర్కులు కృపాళుత్వంబునం దీర్పరా
దా భవ్యంబు దలంచి చూడు ,పరమార్ధంబిచ్చి పొమ్మన్న ,నీ
శ్రీ భండారములో గొఱంతపడునా? శ్రీ కాళహస్తీశ్వరా !
ఈశ్వరా ! నీ భక్తులు వేలవేల విధాలుగా నిన్ను సేవిస్తూ , పరి పరి విధాల ప్రార్ధిస్తుంటే దయతో
వారి వారి కోర్కెలను తీర్చకుండా
పిసినారితనం గా ప్రవర్తిస్తున్నావెందుకు ? వారి పుట్టుక , పుణ్యాలను చూచి వారికి మోక్షమిచ్చి పొమ్మన్న నీ ధనాగారానికి లోటు ఏర్పడదు కదా స్వామీ !
మొదలన్ భక్తులకిచ్చినాడవు గదా ! మోక్షంబు నేడే మయా
ముదియంగా ముదియంగ బుట్టు ఘనమౌ మోహంబు లోభంబు న
న్నది సత్యంబు , కృప దలంప వొక పుణ్యాత్ముండు నిన్నాత్మ న్గొ
ల్చి దినంబు న్మొరపెట్టగా కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా !
శ్రీ కాళహస్తీశ్వరా ! పూర్వము నీ
భక్తుల కెందరకో మోక్షమిచ్చావు కదా . మరి
ఇప్పుడేమయ్యింది. ముసలి తనం లో రాను రాను పిసినారితనం పెరుగునన్న మాటలు నిజమే . లేకపోతే ఒక
పుణ్యాత్ముడు ఆత్మ లో నిన్నే ఆరాధిస్తూ ,
రోజంతా మొర పెట్టుకుంటున్నా పట్టించుకోవు.
అయ్యో ! ఎంత దారుణమయ్యా !
ఈ పద్యంలో “రోజంతా వేడుకుంటున్న పుణ్యాత్ముడు “ ఎవరో కాదు మహాకవి
ధూర్జటి యే. ఇంతకు ముందు , రాబోయే పద్యాల్లో కూడ తాను పాపాత్ముడ నని ,చెడ్డవాడనని
ఆదుకోమని వేడుకున్న కవి ఇక్కడ తానొక పుణ్యాత్ముడనని చెప్పుకుంటున్నాడు . అంటే
ముసలి తనం పైకొచ్చి ఆత్మస్తుతి పెరిగిందా అనిపిస్తుంది. కాని కాదు. పాపం శమించుగాక !
ఒక మహాకవి హృదయం లో ఏ సమయం లో ఎటువంటి భావతరంగాలు ఎగసి పడి, ఎటువంటి భావాలను
పండిస్తాయో విశ్లేషించడం సామాన్యులకు కసాధ్యమైన విషయం . విశ్వకవి రవీంద్రుడు , కవిసమ్రాట్
విశ్వనాథ లు కూడ దీని కతీతులు కారనేది విద్వల్లోక విదితం.
కాలద్వార కవాటబంధనము దుష్కాల
ప్రమాణ క్రియా
లీలాచాలక చిత్రగుప్త ముఖ వల్మీకోగ్ర జిహ్వాద్భుత
వ్యాళవ్యాళ విరోధి మృత్యుముఖ దంష్ట్రా నాహార్య వజ్రంబు ది
క్చేలాలంకృత! నీదు నామ మరయన్; శ్రీ కాళహస్తీశ్వరా !
దిక్కులనే
వస్త్రములుగా ధరించిన వాడా ! దిగంబరా ! శంకరా ! నీ నామము
యమధర్మరాజు లోకమున ప్రవేశించుటకు గల తలుపు నకు గడియ వంటిది.యముని విజృంఙణలను లీలగా అడ్డుకో గల్గినది. చిత్రగుప్తుని నోరు అనెడి పుట్టయందు కదలాడెడి నాలుక యనెడి మహాసర్పమునకు
గరుత్మంతుని వంటిది . మృత్యుదేవత నోటియందలి కోరలనెడి పర్వతాలకు వజ్రాయుధము
వంటిది. నీ నామమును స్మరించి నంతనే
మృత్యువు దూరంగా తొలగి మోక్షము లభించును కదా !
“దిక్చేలాలంకృత “ ఎంత అందమైన సంబోధన . మహాకవి
ఏకేశ్వరోపాసకుడై మహాశివుని మాత్రమే పరదైవతం గా
భావించి ,పూజించాడు . తాను వ్రాసిన రెండు కావ్యాలను ఆ మహాదేవునికే
సమర్పించిన పరమభక్తుడు. “ నమశ్శివాయ “ అంటేనే పాపాలు పటాపంచలౌతాయి. “నమశ్శివయ్య” అంటే ఆ స్వామి అక్కున చేర్చుకుంటాడు .
మహాకవి ధూర్జటి
సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవరాయల వారి ఆస్థానకవి గా మన్నన
లందినా తన కావ్యాలను మాత్రం శ్రీకాళహస్తీశ్వరునకే అంకితం చేశాడు. వైష్ణవ మతాన్ని
స్వీకరించి , ఆముక్తమాల్యద వంటి ఆళ్వారు వృత్తాంతాన్ని కావ్యంగా వ్రాసిన శ్రీ
కృష్ణ దేవరాయలు వీరశైవుడైన ధూర్జటిని తన
ఆస్థానం లో పోషించడం శ్రీ రాయల వారి పరమత సహనాననికి ప్రతీక యని కొందరు వ్రాశారు.
విమర్శకులు భావిస్తున్నట్లుగా శ్రీ రాయల వారి
మరణానంతరం కూడ ధూర్జటి జీవించి యుండవచ్చు.
జీవనాన్ని కొనసాగించడానికి రాజులను ఆశ్రయించి , వారి అభిరుచుల కనుగుణం గా
తానుండలేక ఇడుముల పాలయినట్లు గాను మనం భావించవచ్చు. కవి వ్రాసిన కవిత్వాన్ని తనకు అంకితం చేయకుండా
ఉన్నా అతన్ని పోషించడానికి రాజులు అందరూ శ్రీ రాయలవారి అంత ఉదారులు ఉండరు కదా .
అదే మహాకవి కి ఇబ్బందిని
కల్గించి ఉంటుంది. మహాకవి తీసుకున్న నిర్ణయం కూడ మహాదేవునికి కాక తన కవిత్వం మరొకరిపై
చెప్పననే మహాకవి తీసుకున్న నిర్ణయం కూడ
రాజులకు కంటకమై , కవికి జీవనవ్యయానికి ఇబ్బంది కల్గించి ఉండవచ్చు. నీకుంగాని కవిత్వమెవ్వరికి ........ (113 )
పద్యమే అందుకు ఉదాహరణ.
అందుకే మనకు ఈ శతకం లో
ఆత్మనివేదన తో పాటు రాజాశ్రయ
తిరస్కారము లేక రాజనింద అనేది ప్రధానాంశం గా కన్పిస్తోంది.
మనకు లభించని
కొందరు మహాకవుల చరిత్రల్లో ధూర్జటి జీవితం కూడ ఒకటి. ఈయన అష్టదిగ్గజాలలో ఒకరు గా ఉన్నట్లు ( ? ) చెప్పబడుతోంది కాని తల్లిదండ్రులను గురించి కాని , నివాసప్రాంతాన్ని గురించి కాని స్పష్టంగా
తెలియడం లేదు. కాళహస్తి లో నివసించేవాడని . ఈయన కోరిక మేరకే ఒకటి రెండు సార్లు
వైష్ణవుడైన శ్రీకృష్ణదేవరాయలు
శ్రీకాళహస్తిని దర్శించి ఉంటారని కొందరు వ్రాశారు.
భక్తి
శతకాలలో సహజం గా కన్పించే ఆత్మ నివేదన , ప్రస్తుతి తో పాటు ఈ శతకం లో సంసార నిరసనము , రాజతిరస్కారము
కూడ సమాన ప్రాతినిధ్యాన్ని పొందాయి.
సూక్ష్ణంగా యోచిస్తే కవిసార్వభౌముడు శ్రీనాథుని జీవితానికి, మహాకవి ధూర్జటి
జీవితానికి పోలికలున్నాయేమో ననిపిస్తోంది.
వయసు లో భోగలాలసత తో విలాస జీవితాన్ని గడిపిన ధూర్జటిని చివరి రోజుల్లో కుటుంబ ఖర్చులు , ఒత్తిళ్లు
ఇబ్బందికి గురిచేశాయి. కూతుళ్లు , పెళ్ళిళ్లు ,ఇచ్చిపుచ్చుకోవడాలు వీటికి అవసరమైన
ధనాన్ని కూర్చుకోలేక పడిన ఇబ్బందులు , ఇవన్నీ
కవిపై ప్రభావాన్ని చూపాయి.
” ఆలంచు న్మెడగట్టి ........ ఇచ్చిపుచ్చుకొను సంబంధంబు
గావించి ...” (36 ) వంటి
పద్యాలు ఇందుకు ఉదాహరణలు . నమ్ముకున్న ఈశ్వరుడు అవసరానికి తనను ఆదుకోవడం లేదనే ఉక్రోషం కూడ అప్పుడప్పుడూ కవిలో
కన్పిస్తుంది.
మంచి బంగారానికి ఒరిపిడి ,పరమ భక్తునికి పరీక్ష లు తప్పవు కదా.
పదివేలైనను లోక కంటకులచే ప్రాప్తించు సౌఖ్యంబు నా
మదికిన్ పథ్యము గాదు సర్వమునకున్ మధ్యస్థుడై సత్య దా
న దయాదుల్గల రాజు నాకొసగు మే న్నన్వాని నీయట్ల చూ
చి దినంబు న్ముద మొందుదుం గడపటన్ శ్రీ కాళహస్తీశ్వరా !
శంకరా ! ప్రజారంజకులు కాని వారి వలన ప్రాప్తించు వేలకువేలైనను నా మనస్సునకు ఆనందమును
కల్గించలేవు. అన్ని విధాల సమదర్శి గా ఉంటూ ,దయ , దాన , సత్య గుణములు గల్గిన రాజుని
ఒక్కని నాకు ప్రసాదింపుము . చివరి వరకు ఆయన యందు నిన్ను దర్శించుకొనుచు , ప్రతిదినమును ఆనందించెదను స్వామీ !
తాతల్ తల్లియుఁ దండ్రియున్ మఱియు బెద్దల్చావగా జూడరో
భీతిన్ బొందగనేల చావునకుఁగాఁబెండ్లాము
బిడ్డల్హిత
వ్రాతంబు ల్తిలకింప , జంతువులకు న్వాలాయమై
యుండగా
చేతోవీధి నరుండు నిన్గొలవడో శ్రీ కాళహస్తీశ్వరా !
శ్రీ కాళహస్తీశ్వరా ! తమ తాతలు , తండ్రులు ,వృద్ధులు తమ
కళ్ళముందే చావగా ఈ మానవులు చూస్తున్నారు
కదా ! మరి చావంటే
భయపడతారెందుకు ?భార్య ,పిల్లలు ,హితులు అందరూ చూస్తుండగానే జీవులకు
చావన్నది దాపురించుచుండగా దానిక్కూడా
భయపడుతున్నాడు ఈ మానవుడు. కాని
నిన్ను మాత్రం మనస్సులో కూడ
స్మరించలేక పోతున్నాడు. ఎంత దురదృష్టవంతుడో కదా !
జాతుల్సెప్పుట , సేవజేయుట ,మృషల్ సంధించుట న్యాయాప
ఖ్యాతిం బొందుట , కొండెగాడవుట , హింసారంభకుండౌట , మి
థ్యాతాత్పర్యము లాడుటన్నియు పరద్రవ్యంబు నాశించి , యా
శ్రీ తానెన్ని యుగంబు లుండగలదో ? శ్రీ కాళహస్తీశ్వరా !
ఈశ్వరా ! ఈ జనం డబ్బు సంపాదించడంకోసం
జాతకాలు చెప్పడం , రాజుల అడుగులకు మడుగులొత్తడం , అబద్ధాలు చెప్పడం , ధర్మము తప్పి ప్రవర్తించడం , పితూరీలు
చెప్పడం , హింసకు పాల్పడటం , పుస్తకాల్లో ఉన్నవి
లేనివి కల్పించి చెప్పడం వంటి అకృత్యాలకు
పాల్బడుతున్నారు. మరి ఈ సంపాద ఎన్ని యుగాలుంటుందో ఏమో ?
అస్థిరం ,అశాశ్వతం ,
క్షణభంగురం , చంచలం అయిన ధనం కోసం మానవులు
ఎన్నో అక్రమాలను చేస్తున్నారు
. ఈ ధనమేమైనా వీరితో
కలిసి యుగ యుగాలు ఉంటుందా ఏమిటి ?ఉండదు కదా ! ఈ విషయాన్ని మరచిపోయి వీరు
మూర్ఖులై ప్రవర్తిస్తున్నారు. శాశ్వతుడవైన
నిన్ను చేరడానికి మాత్రం వీరు
ప్రయత్నించడం లేదనేది కవి వేదన .
చెడుగుల్ కొందఱ కూడి చేయగ పనుల్
చీకట్లు దూరంగ బా
ల్పడితిం గాన గ్రహింపరాని నినునొల్లంజాల బొమ్మంచు ని
ల్వెడలం ద్రోచిన జూరుపట్టుకొని నే
వ్రేలాడుదుం గోర్కి ,గో
రెడి యర్థంబులు నాకు నేలయిడవో ? శ్రీ కాళహస్తీశ్వరా !
శంకరా ! “ కొంతమంది
చెడ్డవారి తో కలిసి చేయకూడని చీకటి పనులు
చేయడానికి నీవు ప్రయత్నించావు కాబట్టి
నిన్ను నేను స్వీకరింపనని నన్ను నీవు నీ లోకమునకు రాకుండా త్రోసివేసినా కూడ గాఢమైన కోరికతో చూరుపట్టుకొని వేలాడతాను. కాని
నీ లోకాన్ని వదిలి వెళ్ళను. అయినా
నాకోర్కెలను ఎందుకు తీర్చవు స్వామీ
. నాకు మోక్షము ఎందుకివ్వవని “ ప్రభువును నిలేస్తున్నాడు భక్తుడు .
భసిదోద్ధూళన ధూసరాంగులు , జటాభారోత్తమాంగుల్ ,తపో
వ్యసనుల్ , సాధిత పంచవర్గరతులున్ , వైరాగ్యవంతుల్ , నితాం
త సుఖస్వాంతులు , సత్యభాషణ సముద్యద్రత్న రుద్రాక్షరా
జి సమేతుల్ తుద నెవ్వరైన గొలుతున్ శ్రీ కాళహస్తీశ్వరా !
శంకరా ! విభూతి ధారులు , జడధారులు , తపశ్శాలురు, పంచాక్షరీ జపతత్పరులు , విరాగులు ,
నిత్యానందరూపులు , సత్యభాషణులు , రుద్రాక్షధారులు నైన వారెవ్వరైనా వారి లో నిన్ను
దర్శించి పూజిస్తాను ప్రభూ!
జలజశ్రీ గల మంచినీళ్లు గలవే చట్రాతిలో , బాపురే
వెలివాడ న్మరిబాపనిల్లు గలదా వేసాలుగా కక్కటా
నలి నారెండు గుణంబు లెంచి మదిలో నన్నేమి రోయంగ ఏ
చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా !
శ్రీ కాళహస్తీశ్వరా ! ఎక్కడైనా బండరాతి లోపల పద్మాలతో కూడూన మంచినీరు ఉంటాయా !వెలివాడ లో ఎక్కడైన విప్రగృహం ఉంటుందా ! ఇవి ఉండవనే విషయం నీకు తెలిసి కూడ
వేషాలు కాకపోతే నాలో మంచి గుణాలు కన్పించడం లేదని నీవు నన్ను దూరంగా ఉంచడం
ఆశ్చర్యంగా ఉంది . ఏమైనా సరే నాలో ఉన్న గుణాలలో
నీకు నచ్చిన దాన్ని ఎన్నుకొని
నన్ను రక్షించవలసినది కాని విడిచి పెట్టవద్దని కవి అభ్యర్ధన.
తనకు మోక్షాన్ని పొందే
అర్హత ఏ ఒక్కటి లేకపోయినా ,ఉన్న గుణాల్లో శంకరునికి నచ్చిన గుణాన్ని తీసుకొని తనకు
మోక్షమివ్వమని కవి ప్రార్ధన . అంటే కవి దృష్టి లో తన వద్ద నున్న ఏకైక గుణం కవిత్వమే. దాన్ని ఏనాడో మహాదేవునకు
అంకితం చేశాడు. కాబట్టి తాను కైలాస వాసానికి అర్హుడననే కవి వాదన.
ఘడియల్ రెంటికొ మూటికో ఘడియకో కాదేని
నేఁడెల్లియో
కడ నేడాది కొ యెన్నడో యెరుగమీ కాయంబు
లీ భూమిపై
బడగా నున్నవి , ధర్మమార్గ మొకటిం బాటింపరీ మానవుల్
చెడుగుల్ నీ పదభక్తియుం దెలియరో ? శ్రీ కాళహస్తీశ్వరా !
ఈశ్వరా ! ఘడియకో ,రెండు
ఘడియలకో ,మూడు ఘడియలకో కాకపోతే రేపో , ఎల్లుండో
మరి ఏడాదికో ఈ శరీరాలు భూమిపైన
పడబోతున్నాయన్న విషయం తెలిసి కూడ ఈ మానవులు ధర్మమార్గాన్ని అనుసరించడం లేదు.
మూర్ఖులైన వీరు నీ పాదాలను సేవించడం వలన కలిగే ప్రయోజనం కూడ
తెలుసుకోలేకపోతున్నారు . అయ్యో!
క్షితిలో దొడ్డ తురంగ సామజములే చిత్రమ్ము లాందోళికా
తతులే లెక్క విలాసినీ జన సువస్త్ర
వ్రాత భాషా కలా
ప తనూజాదిక మేమి దుర్లభమ నీ పాదమ్ములర్చించుచో
జితపంకేరుహ పాదపద్మయుగళా ! శ్రీ కాళహస్తీశ్వరా !
పద్మముల సౌందర్యమును గెలిచిన పాదములు గల వాడా !ఈశ్వరా ! నీ పాదములు సేవించువారికి ఈ భూమి మీద గుఱ్ఱాలు ,
ఏనుగులు , పల్లకిలు , విలాసినీజనం ,
పట్టువస్త్రాలు , మై పూతలు , సంతానం ఇవన్నీ ఒక లెక్కలోనివి కావు . నిన్ను సేవిస్తే
లభించనివి ఉండవు కదా.!
అంటే
కవి హృదయం లో ఎక్కడో ఒక మూల వీటిపై ఇంకా ఆశ
ఉంది. కావాలనే కోరిక ఉంది . కాని వీని కోసం రాజులను ఆశ్రయించడం ఇష్టంలేదు . అందుకే
నిన్ను ఆశ్రయిస్తే ఇవన్నీ లభించడం కష్టమేమీ కాదని
శంకరుణ్ణే పరోక్షంగా అవన్నీ ఇవ్వమని
అడుగుతున్నాడు కవి .
సలిలమ్ము ల్చిలుక ,ప్రమాణమొక పుష్పమ్ము న్భవన్మౌళి ని
శ్చలభక్తి ప్రతిపత్తి చే నరుడు
పూజల్సేయ గా ధన్యుడౌ
నిల గంగాజల చంద్ర ఖండముల దానిం దుదిం గాంచు నీ
చెలువం బంతయు నీ మహాత్మ్యమిదిగా శ్రీ కాళహస్తీశ్వరా !
ఈశ్వరా ! ఈ భూమి పైన మానవుడు నీ శిరస్సుపై కొద్దిగా నీటిని చిలకరిస్తేనే ,
శాస్త్రానికి నీ తల పై ఒక పువ్వును పెట్టి పూజి స్తేనే ధన్యుడౌతున్నాడు. ఆ పుణ్యఫలము చేతనే మరణానంతరం
నీ శిరము పై గల గంగను , చంద్రకళను దర్శించగలుగుతున్నాడు. ఇదంతా నీ గొప్పతనమే గదా స్వామీ !
తమనేత్రద్యుతిఁ దామె చూడ సుఖమై యేకత్వము న్గూర్పగా
విమలమ్ముల్కమలాభముల్ జనిత లసద్విద్యుల్లతా లాస్యముల్
సుమనోబాణ జయప్రదమ్ములనుచు న్జూచున్ జలంబూని హ
రిమృగాక్షి నివహమ్ము కన్నుగవలన్ శ్రీ కాళహస్తీశ్వరా !
చంద్రశేఖరా! సమాధి స్ధితిలో కూర్చుని తమ
నేత్రముల నడుమ భ్రుకుటి యందు జ్యోతి ని తామే దర్శించి , ఆనందించెడి పరమాత్మ సంయోగములో నిశ్చల బుద్ధి తో నుండలేక మూర్ఖులైన
ఈ జనం పద్మములతో సమానమైన కాంతిగలవి , మెఱుపుతీగల వంటి
విలాసములు గలవి , మన్మధునికి జయమ్మును
చేకూర్చునవి అని పొగడుచూ ఆడవారి నేత్రాలను చూస్తూ స్త్రీలోలురై పోతున్నారు.
నిను నిందించిన దక్షుపై దెగవొ! వాణీనాధు శాసింపవో !
చనునా నీ పదపద్మసేవకుల తుచ్ఛంబాడు దుర్మార్గులం
బెను పన్న్నీకును నీదు భక్తతతికిన్ భేదంబు గానంగ వ
చ్చెనొ , లేకుండిన నూరకుండగలవా? శ్రీ కాళహస్తీశ్వరా !
శంకరా ! ఆనాడు నిన్ను నిందించిన
దక్షునిపై దండెత్తావు. నిను అవమానించిన
బ్రహ్మదేవుని శిక్షించావు . కాని ఇప్పుడు నీ భక్తులను అతి హీనంగా
నిందిస్తున్న దుర్మార్గులను మాత్రం
ఏమనకుండా ఊరుకోవడమే కాకుండా వారి
అభివృద్ధికి కూడ సహకరిస్తున్నావు. అంటే
నీకు , నీ భక్తులకు మధ్య తేడాను
చూస్తున్నావా ఏమిటి ! లేకపోతే నీ భక్తులను
దూషించిన వారిని శిక్షించకుండా ఉండగలవా స్వామీ?
కరిదైత్యు న్బొరిగొన్న శూలము కరగ్రస్తంబు గాదో ,రతీ
శ్వరునిన్ గాల్చిన ఫాలలోచన శిఖావర్గంబు చల్లారెనో
పర నిందాపరుల న్వధింప విదియున్ భావ్యంబె వారేమి చే
సిరి నీకున్బరమోపకార మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా !
ఈశ్వరా ! నీవు గజాసురుని చంపిన శూలము ఇప్పుడు చేతినుండి
జారిపోయిందా ! మన్మధుని
మసి చేసిన నుదుటి నేత్రములోని
అగ్ని చల్లారిపోయిందా ! లేకపోతే
నీభక్తులను నిందించే వారిని శిక్షించకుండా వదిలేస్తున్నావు. ఇది న్యాయమా. కాకపోతే వారు నీకేమైనా గొప్ప ఉపకారాన్ని చేసి పెట్టారా ఏమిటి ?
దురమున్దుర్గము రాయబారము మరిన్ దొంగర్కమున్ వైద్యమున్
నరనాథాశ్రయ మోడబేరమును బెన్మంత్రంబు సిద్ధించినన్
అరయన్ దొడ్డఫలంబు గల్గునది కాగా కార్యమే తప్పినన్
సిరియుంబోవును బ్రాణహానియు నగున్ శ్రీ
కాళహస్తీశ్వరా !
శ్రీ పార్వతీనాథా ! ఆలోచింపగా యుద్ధము , రాయబారము ,
దొంగతనము , వైద్యము , రాజాశ్రయము , ఓడవ్యాపారము , మంత్రము ఇవి కనుక ఫలిస్తే గొప్పప్రయోజనాన్ని కల్గిస్తాయి . విఫలమైతే మాత్రం ఉన్నది ఊడ్చుకుపోవడమే కాకుండా చివరకు
ప్రాణాలమీదకు కూడ రావచ్చు .
ఇటువంటి లోకరీతిని చెప్పే నీతిపద్యాలు ఈ శతకం లో అతి తక్కువగా
ఉన్నాయి. ఈ పద్యం లో కూడ రాజాశ్రయాన్ని
వదిలి పెట్టలేదు కవి. రాజసేవ కత్తిమీద నడక వంటిదని కదా
పెద్దలంటారు.
నీకుం గాని కవిత్వ మెవ్వరికి నే నీ
నంచు మీదెత్తితిన్
చేకొంటిన్ బిరుదంబు ,కంకణము ముంజే గట్టితిం బట్టితిన్
లోకుల్ మెచ్చ వ్రతంబు , నాతనువు కీడుల్ నేర్పులుం గావు , ఛీ !
ఛీ! కాలంబు
రీతి దప్పెడు జుమీ ! శ్రీ
కాళహస్తీశ్వరా ! (113 )
శంకరా! నా కవిత్వాన్ని నీకు తప్ప
మఱెవ్వరికీ ఇవ్వనని ప్రతిన చేసి ,ముడుపు
కట్టాను. ముంజేతికి నియమ ధారణ గా కంకణం కూడ కట్టుకున్నాను . ప్రజలు మెచ్చుకొనే
టట్లుగా ఈ నియమాన్నే ఇంతకాలం పాటిస్తున్నాను
. దీని వలన వచ్చే మంచి చెడులు
పట్టించుకోను . కాని రాను రాను చూస్తుంటే కాలం లో మార్పు వస్తోంది. అయ్యో !ఛీ ! ఛీ !
ఈ పద్యం లో కవి లో
కల్గిన మానసికసంఘర్షణ స్పష్టంగా
కన్పిస్తోంది. కవిత్వం ఇతరులను గూర్చి చెప్పకపోతే రోజులు గడవడం కష్టమై
పోయి , తన నియమాన్ని వదులుకొని నరాంకితంగా కవిత్వం చెప్పలేక కవి పడిన మానసిక వేదన కు ఈ పద్యం అద్దం లాంటిది .
దంతంబుల్పడనప్పుడే తనువునందారూఢి
యున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే
వింతన్మేన చరింపనప్పుడె కురుల్వెల్లంగ
గానప్పుడే
చింతింపన్వలె నీ పదాంబుజములన్ శ్రీ
కాళహస్తీశ్వరా !
శంకరా ! ముసలితనం వచ్చి దంతాలు ఊడి పడిపోకముందే ,
శరీరపటుత్వం తగ్గక ముందే,ఆడవారు అసహ్యించుకోక ముందే , వెంట్రుకలు తెల్లపడక ముందే ,
ముసలి తనం ఆక్రమించుకొని శరీరం లోకి వింత వింత రోగాలు ప్రవేశించక ముందే నీ పాదాలను ఆశ్రయించి ధ్యానించుకోవాలి.
ఈ పద్యం
చదవగానే దాశరథీ శతకం చదివిన వారికి “ ముప్పున గాలకింకరులు …….
అనే పద్యం వెంటనే
గుర్తుకొస్తుంది.
దొప్పం డెంగిలి దెచ్చియిచ్చినను గండూషాంబు ధారావళిన్
దొప్పం దోగిన చెప్పుగాల తలపై ద్రొక్కంగ నట్లైన గ
న్నప్పం బాత్రుని జేసితింతటికి సన్మానంబు దీపింపగా
చెప్పన్నేరము నీ విహార మహిమల్ శ్రీ కాళహస్తీశ్వరా !
శ్రీ కాళహస్తీశ్వరా ! ఆకుదొన్నెలో ఎంగిలి మాంసాన్ని ,
పుక్కిలితో నీటిని తీసుకొచ్చి ,
చెప్పుకాలితో తలపై తొక్కిపట్టిన కన్నప్ప ను ఆదరించి , నీ దయకు పాత్రునిగా
చేసుకున్నావు. నీ మహిమలు చెప్పనలవి కానివి
కదయ్యా శివయ్యా !
అలయేకార్ణవవేళ నీవు వటపత్రాకారమై
యుండఁగా
చెలువంబొప్పగ మాధవుండు గలిగెన్ జేరంగఁ జోటంచు దా
నెలమిం దామరతంపరై బ్రతికినా డింతాకు పైనుండియే
సిలుగుల్ బొందక నీ కతంబున గదా శ్రీ కాళహస్తీశ్వరా ! (119 ప)
శ్రీ కాళహస్తీశ్వరా ! ఆ ప్రళయకాలపు వేళ నీవు వటపత్రరూపుడవై వెలుగొందుచుండగా , లక్ష్మీనాథుడు వచ్చివటపత్రము పై తనకు చోటివ్వమని మెల్లగా చేరి
,అనంతరం వటపత్రశయనుడై , ఎటువంటి ఇబ్బందులు
లేక తామరతంపరగా వర్ధిల్లుటకు కారణం నీవే
కదా ప్రభూ !
తామరతంపర :--- ఒక తామర గింజను కనుక చెఱువులో వేస్తే అది వేగంగా చెఱువంతా తన జాతిని వృద్ధి
చేసుకుంటుంది. ఒక వంశాన్ని వృద్ధిచెందమని ఆశీర్వదించేటప్పుడు పెద్దలు ఈ పదాన్ని వాడుతూ ఉంటారు.
ఈ పదాన్ని మహాకవి ధూర్జటి ఈ శతకంలో మొదటిపద్యం లోను ,చివరి
పద్యంలోను వాడాడు. దీనికేమైనా ప్రత్యేకత
ఉందా ? కవి ఏదైనా చెప్పదలుచుకున్నాడా ? పరిశీలించాలి.
“ దేవా నీ కరుణా శరత్సమయమింతేఁజాలు
సద్భావనా సేవం దామరతంపరై మనియెదన్ “……(1 వ ప)
"నెలమిం దామరతంపరై బ్రతికినా డింతాకుపై నుండియే ....... (119 వ ప )
ఇది మహాకవి ధూర్జటి శ్రీ కాళ హస్తీశ్వరునకు
సమర్పించిన శ్రీ కాళహస్తీశ్వర శతకము.శతకమంటే వందపద్యాలని మనకు తెలుసు. కాకపోతే అధికంగా మరి నాలుగైదు ఉండొచ్చు. కాని ఈ శతకంలో
119 పద్యాలున్నాయి. వీనిలో కొన్ని ప్రక్షిప్తాలేమో ?ననిపిస్తోంది ఎందుకంటే కొన్ని పద్యాలు
చెప్పిన భావాన్నే మళ్ళీ మళ్ళీ చెపుతున్నట్టు గా ఉన్నాయి. పునరుక్తి స్పష్టార్ధ ప్రతిపత్తి
కోసమేమో ననుకుంటే అలా అన్పించలేదు. అటువంటి వాటిలో మాధుర్యం కొరవడటం తో వాటిని వదలివేయక తప్పలేదు.
మరికొన్నింటిలో శృంగార పద పరిమళాల వెగటు వాసన కల్గిస్తుంటే వాటిని వదిలేశాను. అవి
మహాకవి వి కాకపోవచ్చు.
నాకు ఈ ఆలోచన
కల్గించిన ఆ పార్వతీ పతికి శత సహస్రాధిక
నమస్సుమాంజలులను సమర్పిస్తూ అందరికీ
వందనాలు.
ఇది కాళహస్తీశ్వర శతకము , తేజస్వినీ వ్యాఖ్యా సహితము,
సంపూర్ణము.
------------------------------- వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం ----------------------------
No comments:
Post a Comment