Thursday, 31 October 2013

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు - 3 నరకాసురవథ



                నరకాసుర వథ
                            (దీపావళి )
                      
                 


                   ఆంథ్ర మహాభాగవతం లో దశమస్కంథం ఉత్తరభాగం లో నందనందనుడైన శ్రీకృష్ణుడు పదహారువేలమంది  కన్యకామణులను వివాహమాడిన ఘట్టం లో నరకాసురవథ  ప్రస్తావనకు వస్తుంది.భూదేవి అపరావతారమే సత్యభామ యని భక్తుల విశ్వాసం. గోదాదేవి సత్యభామ అవతారమని వైష్ణవ సాంప్రదాయం చెపుతోంది. 
                  
                   శ్రీ రామావతారం లో విశ్వామిత్రుడే కృష్ణావతారం లో సత్యభామ గా జన్మించాడని జానపదులు  చెప్పుకుంటారు. అందుకే  శ్రీకృష్ణుడు సత్యభామ యొక్క వామపాద తాడనాన్ని కూడ సహించాడని చెపుతారు.
              
                      

                             శ్రీమద్రామాయణంలో యాగసంరక్షణకు తన వెంట రామలక్ష్మణులను తీసుకెళ్లే సమయంలో ఒక రాత్రి సరయూతీరం లో విశ్రమించారు. మరుసటి రోజు ప్రాత:కాల సమయం లో నిద్రాముద్రితుడైన బాలరామునికి  సుప్రభాతం  పలుకుతూ కౌసల్యా సుప్రజారామా!“నిద్రలేపాడు కదా.  ఆ సమయం లో పుంసాంమోహనురూపుడైన కౌసల్యాతనయుని ముగ్థమోహన సౌందర్యానికి ఆకృష్టుడై విశ్వామిత్రుడు శ్రీ  రామచంద్రుని   బిగికౌగిలిని  అడిగాడట. కాని శ్రీ రామచంద్రుడు తాను ఈ అవతారం లో ఏకపత్నీ వ్రతుడినని , కనుక కృష్ణావతారం లో మీ కోరిక తీరగలదని వరమిచ్చాడని, అందువలన విశ్వామిత్రుడే కృష్ణవతారం లో సత్యభామ గా జన్మించి,తరించాడని  జానపదులు,పౌరాణికులు చెపుతుండేవారు.   వీరికి ఆకరమైన ఆథారం ఎక్కడిదో తెలీదు. కథకు కాళ్లుండవు కదా !  
            
                   శ్రీ రామచంద్రుడికే గురువైన విశ్వామిత్రుడే సత్యభామ యైనప్పుడు యుద్ధానికి బయలుదేరిన శ్రీకృష్ణునితో   ఆమె కూడ వస్తానని బయలుదేరడం లో కాని, నరకాసురుని తో యుద్ధం చేయడం లో కాని ఆశ్చర్యం లేదు. ఈ ఘట్టం నాచనసోముని ఉత్తరహరివంశం లో అద్భుతమైన కవితా విన్యాసం తో ఆవిష్కరించబడింది.  ఆ విన్యాసానికి ముగ్థుడైన మహాకవి పోతన సోమన కవిత్వం పై నున్న  అభిమానం తో  అందులోని కొన్ని అందమైన పద్యాలను అనుకరించాడని విమర్శకుల భావన.
          
                     ఈనాడు మనం అస్సాం గా పిలుస్తున్న ప్రాంతమే ఆనాటి నరకుని ముఖ్యపట్టణమైన ప్రాగ్జ్యోతిషపురం గా చెప్పబడుతోంది.10 వ శతాబ్దానికి చెందినదిగా చెపుతున్న  ఉపపురాణమైన కాళికాపురాణం లో  నరకాసురుని ప్రస్తావన అధికంగా కన్పిస్తోంది. కామాఖ్యాదేవి వృత్తాంతం ఇందులో ప్రస్తావించబడింది. మహాభారత , రామాయణాల్లో సైతం ఇతని ప్రసక్తి వస్తోంది. మహాభారతం లో ఇతని కుమారుడు భగదత్తుడు  కౌరవుల పక్షాన కురుక్షేత్ర సంగ్రామం లో పాల్గొన్నాడు.  శతపథ బ్రాహ్మణం, హరివంశం, భాగవతం, విష్ణు పురాణాల్లో కూడ  భూదేవి, నరకాసురులకు శ్రీమహావిష్ణువు,  బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలు ప్రస్తావించబడ్డాయి.
              
                   నరకాసురుని ఆగడాలు, అత్యాచారాలు  పెచ్చు పెరిగి పోయాయి. అదితి కర్ణకుండలాలను అపహరించాడు. వరుణదేవుని ఛత్రాన్ని,దేవతల మణిపర్వతాన్నికూడ ఎత్తుకుపోయాడు. దేవేంద్రుడు వచ్చి శ్రీకృష్ణునికి మొర పెట్టుకున్నాడు.నరకుని పీడ ను త్వరగా వదిలించ వలసిందని    చేతులెత్తి ప్రార్థించాడు. ఆపన్నశరణ్యుడు, రాక్షసవిదారి అయిన మాథవుడు నరకాసుర సంహారానికి సమయ మాసన్నమైనదని నిర్ణయించి, యుద్ధసన్నద్ధుడై గరుడవాహనం పై నరకుని నగరమైన ప్రాగ్జ్యోతిషపురానికి బయలు దేరాడు.
              
                   ఇంతలో స్వామీ! మీరు యుద్ధరంగంలో రాక్షసమూకలను చీల్చి చెండాడుతుంటే నాకు చూడాలని కోరికగా ఉంది.ప్రాణేశ్వరా! నామాట మన్నించి నన్నుకూడ మీ వెంట తీసుకెళ్లండి.అక్కడ మీ ప్రతాపాన్ని కనులారా చూచి వచ్చి ఇక్కడ రాణులందరికీ  తెలియజేస్తాను అంటూ ప్రాథేయపడింది సత్యభామ.
                  
                     చిరునవ్వులను చిందించాడు శ్రీ కాంతుడు. చెలీ! రణరంగమంటే తుమ్మెదల ఝంకారాలు కావు.మదించిన ఏనుగుల ఘీంకారాలు. అక్కడ కన్పించేవి తామరవనం నుండి గాలికి ఎగిరివచ్చే పుప్పొడులు కావు.గుఱ్ఱపు డెక్కల చివరల నుండి లేచిన థూళి దుమారాలు. రాజహంసలతో కూడిన సరోవరాలు కావు. రాక్షససైన్య సమూహాలు. కలువలు కమలాలు అక్కడ కన్పడవు.అక్కడ  కన్పించేవి భయంకరమైన శత్రుశూలాలు.ఖడ్గాలు ఆయుధాలు. ఇటువంటి యుద్ధరంగానికి నీవెందుకు? నేను త్వరగా వచ్చేస్తా! నీవు రావద్దున్నాడు.
              
                   కాని సాత్రాజితి వినలేదు. మీ బాహువులనే కోట నాకు రక్ష గా ఉండగా  వారు రాక్షస సమూహాలైనా నన్నేం చేస్తారు. నేను కూడ మీతో వస్తాను అంటూ చేతులు జోడించి గోముగా ప్రార్థించింది.  అందుకు అంగీకరించి, సతీ సమేతంగా గరుడారూఢుడై నరకాసుర పట్టణానికి బయలుదేరాడు రుక్మిణీనాథుడు.
                 
                     మురాసురుడు ప్రాగ్జ్యోతిష పట్టణాన్ని తన భుజబలం తో  కాపాడుతున్నాడు. అటువంటి ప్రాగ్జ్యోతిష పట్టణం పై దాడి చేసి తన గదా ఘాతాలతో నగర ప్రాకారాలను పడగొట్టి రాక్షస సైన్యాన్ని భయభ్రాంతుల్నిచేస్తూ, ప్రళయకాల మేఘగర్జన వంటి  థ్వనితో తన పాంచజన్యాన్ని పూరించి, యుద్ధాన్ని ప్రకటించాడు శ్రీహరి. అప్పుడు జరిగిన మహాసంగ్రామం లో దేవేంద్రుని వజ్రాయుథం దెబ్బ కు శిఖరాలు తెగి కూలిన పర్వతం వలే మురారి చక్రాయుథం  దెబ్బ కు అయిదు తలలు  తెగి నేలకొరిగాడు మురాసురుడు.
                         
                               తన తండ్రి మరణవార్త విని  క్రోధోద్రిక్తులైన  మురాసురుని  కుమారులు ఏడుగురు తామ్రుడు,అంతరిక్షుడు,శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు అరుణుడు అనువారు పీఠుడు అనే సైన్యాథిపతి నాయకత్వం లో ప్రళయ కాలమందలి పవనసప్తకం వలే ఒకేసారి శ్రీకృష్ణుని మీద దాడి చేశారు.
                           
                       రాక్షసులు ప్రయోగిస్తున్న  వివిథ ఆయుథ సమూహాలను   రాక్షసాంతకుడైన మురారి  తన ఆయుథ పరాక్రమం తో నేలకూలుస్తూ, తన బాణాలతో ఆ రాక్షసుల  కాళ్లు ,చేతులు, కంఠాలను నువ్వుగింజల వలె చిద్రుపలు, చిద్రుపలు గా చేసేశాడు.
                      
                    దారుణ మైన తన వారి మరణవార్త ను విన్న నరకాసురుడు రోషంతో శ్రీ హరిని నిందిస్తూ, తనను తాను స్తుతించుకుంటూ,యుద్ధానికి సిద్ధమై రత్న ఖచిత కుండలాలను, వివిధ ఆభరణాలను  అలంకరించు కొని  మత్త వేదండంబుల దండు వెంటరాగా గజారూఢుడై రణరంగానికి తరలి వచ్చాడు.
             
                 గరుడవాహనాన్ని అథిరోహించిన నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుడు, వీపున అమ్ముల పొది దాల్చి, సత్యభామ కు సంగ్రామ రహస్యాలను బోథిస్తూ , చంద్రబింబం పై మెరుపుతీగ తో కూడిన మేఘం లా ప్రకాశించాడు. ఇంతలో యుద్ధానికి సిద్ధమై వస్తున్న నరకాసురుని చూచిన సత్యభామాదేవి ఇంక ఏమాత్రం ఆలస్యం చేయక, వెంటనే వాలుజడ ముడివేసి. చీరముడి బిగించింది. ఆభరణాలను చక్కచేసుకొని, పైట ను సరిచేసుకొంది. ముఖం కాంతితో ప్రకాశిస్తుంటే మురాంతకుని కంటే ఒక అడుగు ముందుకేసి నిలబడింది సాత్రాజితి.  సమరసన్నద్ధ యైన తన భామను చూచి, మురిసిపోయిన మురారి సరసం గా ఇలా అన్నాడు.
    
          లేమాఁ దనుజుల గెలవఁగ  లేమా నీవేలకడగి లేచితి విటురా
           లే మాను మానవేనిన్, లే మావిల్లందికొనుము లీలం గేలన్.
           
          అంటూనే శ్రీకృష్ణుడు విల్లును సత్యభామ కు అందించాడు. తన నాథుడు అందిచ్చిన విల్లును థరించి గొప్పతేజస్సు తో ,మహాప్రతాపం తో ప్రకాశించింది సాత్రాజితి.శత్రుసేనల గుండెలదిరేటట్లు, వారి యేనుగుల సమూహాలు భయము తో మూర్ఛిల్లేటట్లు ఒక్కసారిగా  అల్లెత్రాటిని మీటి యుద్ధానికి సిద్ధమైంది సత్యభామ.
    
                బంగారు కంకణాల సుమథుర  ధ్వనులు వింటినారి తో స్నేహం చేస్తుంటే , చెవికమ్మల లోని మణుల కాంతులు చెక్కిళ్ల పై ప్రతిఫలిస్తుండగా, క్రీగంటి చూపుల  ధవళ కాంతులు బాణ కాంతులను కప్పి వేస్తుంటే, బాణాలను ప్రయోగించడం వలన కలిగిన శబ్దం శత్రుసైన్యాల ఆర్త నాదాలను మింగివేస్తుంటే, వీరము, శృంగారము,భయము ,రౌద్రము, విస్మయాలు కలసి ఈ భామ గా రూపొందాయా అన్నట్లు , సత్యభామ బాణం  తొడగడం,ఎక్కుపెట్టడం , ప్రయోగించడం కూడ గుర్తించలేనంత వేగం గా యుద్ధం చేయసాగింది.

               పరుజూచున్  వరుఁజూచునొంప నలరింపన్ , రోషరాగోదయా
              విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
              జరగన్, గన్నులఁగెంపు సొంపుఁ బరఁగం జండాస్త్ర సందోహమున్
              సరసాలోక సమూహమున్ నెఱపుచుం జంద్రాస్య హేలాగతిన్ .
  
                        వీర శృంగార రసాలు ఆకారం దాల్చినట్లు చంద్రానన యైన సత్యభామ  నరకాసురుని ,శ్రీకృష్ణుని చూస్తూ,రోష రాగాలను కనుబొమ ముడితో, మందహాసం తో  ప్రకటిస్తూ, సోగ కన్నులతో నాథుని చూస్తూ,  కోపపు కన్నులతో నరకుని తిరస్కరిస్తూ,  అతివిలాసంగా,అలవోక గా  యుద్ధం చేయసాగింది.
  
            అళినీలాలక చూడ నొప్పెసగెఁ  ప్రత్యాలీఢపాదంబుతో
           నలికస్వేద వికీర్ణకాలకలతో నాకర్ణికానీత స
           ల్లలిత జ్యానఖపుంఖ దీథితులతో లక్ష్యావలోకంబుతో
           వలయాకర ధనుర్విముక్త విశిఖవ్రాతా హతారాతియై.

                    
              ఎడమపాదాన్నికొద్దిగా ముందుకు జరిపి నేలకు దట్టించి ,కుడికాలును కొద్దిగా వంచి, చెమటకు తడిసి ముఖాన పడుతున్న ముంగురులతో , ఆకర్ణాంతము లాగబడిన అల్లెత్రాటిని పట్టుకున్న చేతివ్రేళ్ల గోళ్ల కాంతులతో, లక్ష్యాన్ని ఖచ్చితంగా భేదిస్తూ, వలయాకారం గా వంచబడిన ధనుస్సు నుండి వదిలి పెడుతున్న 
బాణపరంపరలకు శతృసమూహాలను బలిస్తూ, సింహగర్జనలు చేసింది సత్యభామ.

                                                                                
       
                         ఆ యుద్ధాన్ని చూసి  బొమ్మలపెళ్లిళ్లకే వెళ్లని  ఈ మగువ యుద్ధభూమికి ఎందుకొచ్చింది.? ఉయ్యాల ఎక్కడానికే భయపడే ముద్దరాలు గరుత్మంతుని ఎలా అధిరోహించింది? పెంపుడు చిలుకకు పద్యాలు చెప్పలేని ఈ వనిత అస్త్రవిద్యలను ఎప్పుడు నేర్చుకొంది? అనుకంటూ శ్రీకృష్ణుడు ఆశ్ఛర్యపోయాడు.

                           వింటినారి థ్వని మేఘగర్జన గా,దేవతలు చాతకపక్షులుగా,ధనుస్సు ఇంద్ర చాపం గా, శ్రీకృష్ణుడు మేఘం గా , తాను మెరుపుతీగ గా, బాణ సమూహమనే వర్షం తో, రాక్షసులనే దావాగ్నిని  చల్లార్చడానికి సత్యభామాదేవి సంగ్రామాన్ని తీవ్రతరం చేసింది. ఆ అందాన్ని చూడండి.
      
           రాకేందు బింబమై రవిబింబమై యొప్పు నీరజాతేక్షణ నెమ్మొగంబు
           కందర్పకేతువై  ఘనధూమకేతువై యలరు బూఁబోడి చేలాంచలంబు
           భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెఱయు నాకృష్టమై మెలత చాప,
           మమృత ప్రవాహమై యనలసందోహమై తనరారు నింతి సందర్శనంబు
          
                 హర్షదాయియై మహారోషదాయియై ,పరగు ముద్దరాలి బాణవృష్టి
                 హరికి నరికి జూడ నందంద శృంగార , వీరరసము లోలి విస్తరిల్ల.
       
         సత్యభామ చేస్తున్న సంగ్రామ విహారాన్ని ఎంత వర్ణించినా మహాకవి కి  ఆ సుందరదృశ్యం ఇంకా మనోహరం గానే కన్పిస్తోంది.
  
                 సత్యభామ వదనారవిందం నందనందనునకు చంద్రబింబంగాను , నరకాసురునకు సూర్యబింబంగాను కన్పిస్తున్నాయి. ఆనారీమణి  చేలాంచలంమురారికి మన్మథుని జెండాగాను, సురారికి  థూమకేతువు గాను, ఎక్కుపెట్టిన థనుస్సు  సత్యాపతి కి మన్మథ పరివేషంగాను, నరకాసురునకు ప్రళయ భాను పరివేషం గాను, సత్యభామా సందర్శనం హరికి  అమృతమయం గాను, అరికి అనల సందోహం గాను , ఆమె కురిపిస్తున్న బాణవర్షం యశోదాపట్టికి ఆనందాన్ని,నరకాసురునికి కోపాన్ని కలిగిస్తుంటే శ్రీహరి లో శృంగారరసం , నరకాసురుని లో వీరరసం విస్తరిల్లే విథం గా సత్యభామ సమరాన్ని  సాగించి రాక్షససైన్యాన్ని కకావికలు గావించింది. రాక్షససైన్యం  నరకాసురుని చాటుకు పారిపోయింది.

                ఆమె యుద్ధ నైపుణ్యానికి ముగ్థుడైన శ్రీకృష్ణుడు కొమ్మా! మెచ్చితి నిచ్చెద కొమ్మాభరణములు నీవు గోరిన వెల్లన్ అనేశాడు. నీ విజయానికి మెచ్చాను.  నీవు ఎన్ని ఆభరణాలు కోరుకుంటే అన్ని ఆభరణాలు ఇచ్చేస్తాను అన్నాడట మురవిదారి.  ఆడవారికి  అందునా ఇల్లాలిని మెచ్చిఇచ్చే కానుకలలో ఆభరణాలకు మించినవి ఉండవని తెలిసిన వాడు కదా షోడశ సహస్రాంగనా వల్లభుడు.
  
                 తన సైన్యమంతా పలాయనం చిత్తగించడంతో కోపోద్రిక్తుడైన నరకాసురుడు శ్రీకృష్ణునికి ఎదురు వచ్చి, కృష్ణా ! మగవారి ఎదుట ఒక మగువ పౌరుషాన్ని ప్రదర్శిస్తుంటే యుద్ధం మానేసి మౌనం గా ఉండటం నీకు మగతనం కాదు. రాక్షసవీరులు మగలమగలు కాబట్టి మగువలతో యుద్ధం చేయరు అంటూ డంబాలు పల్కసాగాడు.నరకుని మాటలు వింటూనే సత్యభామ చేతినుండి విల్లందుకొని శతఘ్ని అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగించి, రాక్షససైన్యాన్ని తుత్తునియలు చేశాడు శ్రీకృష్ణుడు. నరకుడు శక్తి అనే ఆయుధాన్ని గరుడుని పై ప్రయోగించి ,శ్రీకృష్ణుని పై శూలాన్ని ప్రయోగించబోయేటంతలో అలిగిన ద్వారకానాథుడు చక్రాయుథాన్ని ప్రయోగించి నరకుని శిరస్సును ఖండించాడు . ఆనందం తో దేవతలు పూలవాన కురిపించారు.
  
            తల్లీ! వరాహావతారం లో నేను విష్ణుమూర్తి ఇల్లాలినని చెప్పుకున్నావు. నిన్ను చూసైనా నాపై దయ చూపకుండా శ్రీహరి నా తల నరికాడు. అని భూదేవి కి చెప్పుకుంటు న్నట్లుగా నరకాసురుడు  యుద్ధరంగంలో భూమికొరిగాడు.
        

  
                                                 శ్రీ వరాహస్వామి    (ఉండవల్లి గుహలోని స్థంభ శిల్పం)
   
              అంత భూదేవి వాసుదేవుని సమీపించి పలురీతుల స్తుతించి, వివిథ కానుకలను సమర్పించి,ఓభక్తమందారా !  ఈ బాలుడు నరకాసురుని కుమారుడు. దిక్కు లేనివాడు. వీడు తండ్రి వలే కాదు.  నీ పాదాలనే ఆశ్రయించాడు.  అని ప్రార్థించగా భగవంతుడైన మాథవుడు నరకాసురుని కుమారుడైన భగదత్తుని కభయమిచ్చి, సర్వసంపదలను అనుగ్రహించాడు.
  
                కొన్ని గ్రంథాలలో సత్యభామే నరకాసురుని సంహరించినట్టు చెప్పబడింది. కాని మహాభాగవత పురాణం లో మాత్రం శ్రీకృష్ణుడే నరకాసురని సంహరించినట్లు వ్రాయబడింది.
               
      ప్రచారం లో ఉన్న ఒక  కథ ఆథారం గా  -- తల్లి చేతుల్లోనే మరణం పొందేటట్లు బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు నరకుడు.ఈతని తల్లి భూదేవి. ఈమె  శ్రీమహావిష్ణువు చేత తాను అంగీకరించినప్పుడు మాత్రమే తన కుమారునికి మరణం సంభవించేటట్లు వరం పొందింది. ఆసురగర్వం తో నరకుడు ఇంద్రుని జయించి,అదితి కర్ణకుండలాలను అపహరించాడు.  వరుణుని ఛత్రాన్ని,మణి పర్వతాన్ని కూడ స్వంతం చేసుకున్నాడు.ఎందరో భామినులను చెఱ పట్టాడు.
  

                                        శ్రీ వరహస్వామి              (మహాబలిపురం)
            
                    తుదకు ఇంద్రాది దేవతల సంప్రార్థన తో శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణుడు నరకుని పైకి యుద్ధానికి వెళ్ళాడు. ఘోర సంగ్రామం లో నరకుడు ప్రయోగించిన శక్తి ఆయుథం  శ్రీకృష్ణుని స్వల్పం గా గాయపరచగా ఆయన మూర్ఛపోయాడు. సత్యభామ యుద్ధానికి సిద్ధమైంది. చివరకు సత్యా,కృష్ణులు యుద్ధం లో నరకుని నేల కూల్చారు.  భూదేవి  శ్రీకృష్ణావతారం లో సత్యభామ గా జన్మించింది కాబట్టి నరకాసురుని, భూదేవి ఇద్దరి వరాలు  నెరవేర్చబడ్డాయి. నరకుని చేతబంథించబడిన 16,100 మంది యువతులకు సమాజం లో వారి గౌరవాన్ని కాపాడటానికి శ్రీకృష్ణుడు వారిని వివాహం చేసుకున్నాడు.

                   శ్రీకృష్ణుడు అదితి ఆభరణాలను ఆమెకు అందించడానికి ఇంద్రలోకానికి వెళ్లాడు. ఆనందించిన అదితి సత్యభామను చూసి నిత్యయౌవన, సౌందర్యాలతో విలసిల్లేట్టు వరాన్ని ఇచ్చింది.  ఆ సమయంలోనే పనిలో పనిగా నందనవనం లోకి వెళ్లిన సత్యాకృష్ణులు పారిజాతవృక్షాన్ని మెచ్చి,అడ్డం వచ్చిన ఇంద్రుణ్ణి ఓడించి, భూలోకానికి తెచ్చి సత్యాదేవి పెరటిచెట్టు గా  నాటేశారు.
     
             నరకాసురుడు మరణిస్తూ తన చివరి కోరికగా తాను మరణించిన రోజున భూలోకవాసులంతా రంగురంగుల దీపకాంతుల వెలుగులలో ఉత్సవం  జరుపుకోవాలని కోరాడట.  పారిజాతం భూమికి దిగి వచ్చిన 
రోజు, నరకాసురుని పీడ విరగడైన రోజు మనకు  పర్వదినం.  అదే నరక-చతుర్థశి తరువాత వచ్చే దీపావళి.








-------------------------------అందరికీ దీపావళి శుభాకాంక్షలతో----------------------------------

No comments: