Wednesday, 13 November 2013

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు - 4 గోపికా వస్త్ర్రాపహరణము



    శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు -4
                   

        
       
                                                  గోపికా వస్త్రాపహరణము







                     హేమంతఋతువులో  చలిపులి లోకం పై విరుచుకు పడింది. చలికి తట్టుకోలేక త్రిమూర్తులు వంటి వారే వారి భార్యలను సగంలో కలిపేసుకున్నారు. పగళ్లు చిన్నవై పోయి, రాత్రి పొద్దులు పెరిగిపోయాయి.చలి అథికమై లోకమంతా ఊహూహూ అంటూ వణికిపోతోంది.
                 
                     ఇటువంటి హేమంతపు మొదటి మాసం లో  మార్గశీర్షం లోని  మొదటి రోజున నందుని మందలోని గోపకుమారిక లందరు వేకువఝూమునే లేచారు.కాళిందీ నదికి వెళ్లి స్నానాలు చేసి,  నదీ తీరంలో ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి, పరిమళపుష్పాలతో అర్చించి,చందన,థూప దీపనైవేద్యాలను సమర్పించి,భక్తితో ప్రార్థించారు. తల్లీ! కాత్యాయనీ! మా అందరికీ శీఘ్రంగా  శ్రీకృష్ణుని పతిగా ప్రసాదించవమ్మా భగవతీ!   శ్రీకృష్ణుడు మాకు ప్రాణేశ్వరుడైన రోజున మేమందరం నేతి వసంతా లాడుచూ, పరమభక్తితో నీకు జాతర చేస్తా మని మ్రొక్కుకొని, దేవికి నివేదించిన ప్రసాదాన్ని భక్తిగా స్వీకరిస్తూ ఒక నెల రోజులపాటు కాత్యాయనీ వ్రతాన్ని చేపట్టారు.
                
                            రమణులందరు ఒక రోజున ప్రాత :కాలం లోనే మేల్కొన్నవారై, ఒకరినొకరు పేరుపేరునా పిలుచుకుంటూ , అందరినీ కలుపుకొని కమలనయనలందరూ కమలాక్షుని స్తుతిస్తూ గజగమనలై యమునానదీ తీరానికి చేరుకున్నారు. ఒక ఏకాంతస్థలం లో సంశయము ఏ కోశానా లేకుండా వలువలనన్నింటినీ విడిచి , నీటిలోకి  దిగి జలకాలాడసాగారు.
           
             వారిజలోచను పాడుచు, వారిజలోచనలు వారివారికి వేడ్కన్
              వారి విహారము సలిపిరి వారి విహారము జగతి వారికి గలవే  (10.పూ.813)
              
                            వారు జలకాలాటలలో ఎంత ఆనందాన్ని పొందుతున్నారో మహాకవి  ఈ అందమైన పద్యంలో అందించారు.  ఆ పద్యాన్ని నడపించిన తీరు ఆ రమణీమణుల జలకాలాటలలోని ఒయ్యారపు విహారాలను దృశ్యమానం చేస్తోంది .
               
                రమణులందరూ యమునానది లో జలకాడుతున్న  కబురు తెలుసుకున్న నందనందనుడు తనతోటి గోపబాలురలతో కలసి  అక్కడకువచ్చాడు. గోపాలకులకు కదలవద్దని కనుసైగ చేసి,  మెల్లగా మెల్లగా వెళ్లి ఆ గోపికల వస్త్రాలను అపహరించాడు.  ఆద్యుడు ,విశ్వవిభుడు అయిన ఆ పరమాత్ముడు ఒక చిన్నపిల్లవాడిలాగ  స్నానం చేస్తున్నఆడవారి వస్త్రాలను  దొంగిలించి , సమీపంలోని కడిమిచెట్టు నెక్కి కూర్చున్నాడు. ఆ సమయం లో తాను చెట్టుగా జన్మించి నందుకు కల్గిన సంతాపాన్ని ఆ కడిమి చెట్టు పోగొట్టుకొని సంతోషాన్ని పొందిందట. దాని అదృష్ఠం అది.
         
                  తమ వస్త్రాలను కన్నయ్య దోచుకెళ్లాడని చూచిన గోపకాంతలు చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ, ఇలా అన్నారు.
                 
                    మా మా వలువలు ముట్టకు మామా! కొనిపోకు పోకు మన్నింపు తగన్
                     మా మాన మేలకొనియెదు  మా మానసహరణ మేల మానుము కృష్ణా! “  (10.పూ.820)
               
                    గోపికా మానస చోరా! మా మానమెందుకు హరిస్తావు. మా మనస్సుల నెందుకు దోచుకుంటావు! అని ప్రశ్నిస్తూనే ఆ దేవదేవుని యొక్క పరమాత్మ తత్త్వాన్ని, ఆథిక్యతను, గొప్పతనాన్ని పలురీతుల ప్రస్తుతించారు.
          

                                           ద్వారకా తిరుమల ఆలయ రాజగోపురం లోని కుడ్యచిత్రం
                      
                             ఈ ప్రస్తుతిలో దశావతారాల ప్రస్తావన  కన్పిస్తుంది. బుధులు మెచ్చ భువి ప్రబుద్ధత మెఱయుటో? అంటూ బుద్ధుణ్ణి తొమ్మిదవ అవతారం గా ఇక్కడ చెప్పడం మనం గమనించవచ్చు. అలాగే  ఎనిమిదవ అవతారమైన కృష్ణావతారం లోని  ఈ ఘట్టం లోనే కలికితనము సేయ ఘనత గలదె అనే పాదం లో  రాబోయే కలియుగం లోని కల్కి అవతారాన్ని  కూడ ఇక్కడ గోపికలు అన్యాపదేశం గా ప్రస్తావించినట్లు పండితులు భావిస్తున్నారు.  
               
                         రామావతారం లో దండకారణ్యం లోని  మునీశ్వరులందరూ తమ కోరిక మేరకు కృష్ణావతారం లో  గోపికలు గా జన్మించారని ఒక కథ ఉంది.
   
                  వావి లేదు వారి వారు నా వారని నెఱుగ వలదె వలువలిమ్ము అంటూ పరమాత్ముని సార్వభౌమత్వాన్ని ప్రతిష్ఠిస్తూనే, మా వలువలు మాకియ్యవయ్యా అంటూ ప్రార్థించారు గోపికలు .   
               
               “కొంటివి మా హృదయంబులు ; కొంటివి మానంబు; లజ్జఁ గొంటివి; వలువల్
                గొంటి; వికనెట్లు సేసెదో; కొంటెవు గద! నిన్నునెఱిగి కొంటిమి కృష్ణా !  (10.పూ.822)
   
                            " మా మనసులపహరించావు.మా మానం కొల్లగొట్టావు. సిగ్గులు దోచావు.ఇప్పడు వలువలు దోచావు. ఇంకా ఏంచేస్తావో!   “ నిన్ను నెఱిగి కొంటిమి కృష్ణా !” అనేశారు గోపికలు. సర్వం సహా సమర్పణమే భగవత్తత్వ పరిలబ్ధికి  ప్రధమ సోపానం.   ఆ మాట గోపికల నోట రావడమే ఈ వృత్తాంత పరమార్థం. అందుకే భగవంతుని గుణాతీతత్త్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, కాలాతీత తత్వ్తాన్ని బహుథా ప్రశంసించి, చివరకు
                  
                    నీవెరుగనిదేమున్నది నీవందఱిలోన థర్మననిరతుడవు గదే( 848) అన్నారు గోపికలు.
                    
                        అందుకే స్వామి కూడ ప్రౌఢంగా ఇలా అనేస్తాడు.   ఎరుగనే మీ లోన నెప్పుడు ఉన్నాడ 
 నేను జూడని మర్మమెద్ది గలదు. వ్రతదీక్ష లో ఉండి వలువలు ధరించకుండా  నియమాన్ని వివస్త్రలై తప్పి  జలకాలాడతారా.? ఇది కాత్యయనీ దేవికి  అపరాథం చేసినట్లు కాదా?. ఈ విథం గా నోము చేసే జవ్వను లెచ్చటైనా ఉన్నారా?. అంటూ ప్రశ్నించాడు. మీకు వ్రతఫలం దక్కాలంటే  చక్కగా చేతులెత్తి నాకు   నమస్కరించండి. అని బోథించాడు. 
                        

                         
                                                                  ఒక   అపురూప చిత్రం
                                            
                                                 ఆ పరమ పురుషుని మాటలు విన్న ఆ యువతులు తమలో  పరి పరి విధాల తర్కించుకున్నారు.వ్రతములు చేస్తూ ఏ ఉత్తమశ్లోకుని స్మరిస్తే  వ్రతభంగాలన్నీ తొలగిపోతాయో అటువంటి పరాత్పరుని మాటలు విన్నారు. కట్టుకోకలు విడిచి స్నానమాడటం తప్పని తెలుసుకొని, వ్రతభంగం కాకుండా కాపాడిన విశ్వలోకునకు ఫాలతటన్యస్త కరాబ్జలై  అంటే అరవిందాలవంటి తమ చేతులను నుదుటి పై నుంచుకొని వందనాలను సమర్పించారు. సంతోషించాడు నంద నందనుడు.

           బాలలకు హస్తకీలిత, ఫాలలకు నితాంతశీత పవనాగమ నా
            లోలలకు  నంబరములు కృపాలుడు హరి యిచ్చెభక్తపాలకుడగుటన్. (10.పూ.844)
                  
                హరి భక్త పాలకుడగుట వలననే ఆ చెలువలకు వలువ లొసగి, వ్రతఫలం దక్కేటట్లు చేశాడు.
        
         ‘చీర లపహరించి సిగ్గులు విడిపించి, పరిహసించి యైనఁ బరగఁమనకు
         ఘనుడు నోము కొఱత గాకుండ మ్రొక్కించె, ననుచు హరి నుతించి రబల లెల్ల.(10.పూ.845)
         
                    చీరలపహరించి, సిగ్గులు పోగొట్టినా మనకు నోము ఫలాన్ని అందించాడని ఆ రమణు లందరు యశోదానందనుని  కొనియాడారట. ఎందుకంటే  మనసుకు బాథ కలిగించినా, అపహసించినా , కలత కలిగించినప్పటికీ  ప్రియులు చేసే పని ప్రియురాండ్ర కు బాథాకరం కాదు. అది ఎంతో ప్రియం గానే ఉంటుంది.
     
                   వల్లభులు సేయు కృత్యము వల్లభలకు నెగ్గుకాదు వల్లభ మధిపా!” అంటాడు శుకమహర్షి  పరీక్షిన్మహారాజు తో.
     
          “ నన్నుఁ బొందగల్గు  నమ్మి పొండని హరి పల్క నింతులెల్ల  భ్రాంతిఁ జనిరి
            తపము పండె ననుచుఁ దత్పదాంభోజముల్, మానసించు కొనుచు మంద కడకు. (10.పూ.848)

                    సర్వమున్నతని దివ్యకళామయమని భావించి, ఆ పరమాత్ముని దివ్యచరణారవిందాలను మానసించి,   పూజించి, సర్వం  శ్రీకృష్ణార్పణమస్తు  అని  సమర్పించడమే భాగవత తత్త్వం.




             
***************   త్వమేవ శరణం మమ*******************  

No comments: