శత వార్షిక ముక్కోటి మహా మండపం. -నందిగామ
Limca book of records –2001
కృష్ణాజిల్లా నందిగామ అత్యంత ప్రాచీనమైన గ్రామం గా చారిత్రక ఆథారాలున్నాయి . మండల కేంద్రమైన నందిగామ హైద్రాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పై విజయవాడ కు ఉత్తరం గా 52 కి.మీ దూరం లో ఉంది.కాకతీయుల కాలం నుండి శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు పరిపాలన వరకు వివిధ దశల్లో చరిత్ర కెక్కిన ఈ నందిగామ 2001 వ సంవత్సరం లో” లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్” లో స్ధానాన్ని పొంది మరొక్కసారి,చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకొని, లోకం దృష్టి ని ఆకర్షించింది.
వంద సంవత్సరాలకు పైగా ఒకే కుటుంబం ముక్కోటి ఉత్సవాలను నిరాఘాటంగా నిర్వహించడం అందుకు కారణంగా గుర్తించడం జరిగింది. ఈ ముక్కోటి ఏకాదశి నే భక్తులు” వైకుంఠ ఏకాదశి “ అని కూడపిలుస్తారు. దీని ప్రాశస్త్యము పురాణాల్లో ఇలా చెప్పబడింది.
ఏకాదశి ఉపవాసాలు – విష్ణ్వారాధనము ప్రశస్తమైనవి గా “ఏకాదశ్యాంతు దళయోర్నిరాహార స్సమాహిత: రాత్రౌ జాగరణం కృత్వా యాతి విష్ణో: పరం పదమ్.”అని నారద పురాణం.(121-1-4 )
శ్రీ భూ, నీళా సమేత చెన్నకేశవ స్వామి
“ మాసానాం మార్గశీర్షో2హం “ అని గీతాచార్యుడు మార్గశీర్ష మాసమును విశిష్టమైనది తెలుపుట చే మార్గశీర్ష శుద్ధ ఏకాదశి ని“మోక్షైకాదశి “గా కూడా చెపుతుంటారు. కాలరూపి యైన సూర్యభగవానుడు చీకటి కాలము నుండి విముక్తి పొంది, పగటి కాలమైన ఉత్తరాయణము లోనికి ప్రవేశించే దానికి ఉష: కాలమిది. రవికి చీకటి నుండి విముక్తి కల్గుట చే దీనికి మోక్షైకాదశి అని పేరు వచ్చి ఉండవచ్చని పండితులు భావిస్తున్నారు. అందుకే మార్గ శీర్ష మాసమును ఆగ్రహాయనమంటారు. హాయనమునకు ముందు కాలము.అదియే ఉషస్సు.
అంతేకాదు మోక్షాఖ్యయైన మార్గశీర్ష శుద్ధైకాదశి యందు ఉపవసించి, ద్వాదశి ప్రాత: కాలమున హరిని అర్చించి సమస్తోపచారముల తో బ్రాహ్మణులకు భోజనము పెట్టి, దక్షిణ ల నొసంగి, బంధు సమేతుడై భుజించిన మానవుడు తనకు ముందు తరములను, తనకు తదుపరి పది తరములను, తనను ఉద్ధరించుకొని, హరి సాన్నిధ్యాన్ని పొందుతాడని నారద పురాణం చెపుతోంది. ఈ పర్వదినముమోక్షైకాదశి గా వైకుంఠప్రాప్తిని అందించుట చే దీనినే వైకుంఠఏకాదశి కూడ చెపుతున్నారు.
దీనినే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ముక్కోటి అనునది ముప్పది మూడు కోట్లకు” నామైక దేశే నామగ్రహణం “ అను న్యాయమున వ్యవహారమున కలిగిన సంగ్రహ రూపము గా భావించవచ్చు.ముప్పది మూడు కోట్ల మంది దేవతలు ఈ రోజు భూమికి దిగి వచ్చి, అర్చారూపుడైన శ్రీమన్నారాయణుని ఆలయ ఉత్తర ద్వారమున దర్శించి తరిస్తారని, పురాణాలు చెపుతున్నాయి. “దేవానాం దైవతం విష్ణు ర్దానవానాం త్రిశూల భృత్” అను పద్మపురాణ వచనము చే దేవతలకు విష్ణువు దేవుడు కాగా రాక్షసులు శంకరుని అబిమానిస్తున్నారు.
ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ముక్కోటిని నందిగామ లో గత నూటపదమూడు సంవత్సరాలుగా ఒకే కుటుంబం నిర్వహించడం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కి అర్హమైంది.
నందిగామ లోని ప్రసిద్ధ ఆలయాల్లో చెన్న కేశవాలయం ఒకటి. ఇది కాకతీయుల ప్రతిష్ట గా చెప్పబడుతోంది. ఈ ఆలయం లో దీవి వంశం వారు పారంపర్య అర్చకులు గా ఉంటున్నారు.19 వ శతాబ్దం లో శ్రీమాన్ దీవి రాఘవాచార్యలు గారు శ్రీవారి సేవలో ఉండగా ఈ ముక్కోటి ఉత్సవాలు ప్రారంభమైనాయి.
ఆనాటి ముక్కోటి పందిరి దృశ్యము
ఆంజనేయ ఉపాసకులు, దైవభక్తి పరాయణులైన శ్రీమాన్ రాఘవాచార్యులు గారికి మానవజాతికి మోక్షదాయకమైన ఈముక్కోటి ఉత్సవాలు నిర్వహించాలనే సత్సంకల్పం భగవదనుగ్రహం గా సంభవించింది. వీరి ఇల్లాలు శ్రీమతి లక్ష్మీ తులశమ్మ . ఇటువంటి ఆతిథేయ కార్యక్రమాలు చేయాలంటే ఇల్లాలి పూర్తి సహకారం కావాలి. “ఆ నిష్ఠానిథి గేహసీమ నడు రేయాలించినన్” అన్న వ్రాతలు కృష్ణరాయలు ఇటువంటి ఇళ్లను చూసే వ్రాసుంటాడ నిపిస్తుంది . అది పరిపూర్ణం గా లభించడం మూలంగానే మూడు తరాలుగా ఈ ముక్కోటి కార్యక్రమాలు ఈ ప్రదేశంలో అవిఛ్ఛిన్నంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమాలు ఐదు రోజు జరిగినా, ఎనిమిది రోజులు జరిగినా వచ్చిన వారందరకు వారి ఇంట్లోనే భోజనం,వసతి ఏర్పాటయ్యేది. ఆ సంప్రదాయమే ఇప్పటికీ కొనసాగుతోంది.
ఈనాటి ముక్కోటి మహామండపం
ఆ ఆలోచన రావడమే ఆలస్యం శ్రీ రాఘవాచార్యులు ఆనాడు నందిగామ సర్కిల్ ఇనస్పెక్టర్ గా ఉన్న శ్రీ సుసర్ల సత్యనారాయణ గారి తో కలసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఆ రోజుల్లో నాలుగు గుంజలు పాతి ,పందిరి వేసి దానిలో స్వామిని వేంచేపు చేయించి పూజలు చేసేవారు.ఒకరోజు తీర్ధ ప్రసాద వినియోగం తో కార్యక్రమాలు ముగిసేవి.ఈవిధంగా ఐదు సంవత్సరాలు ఉత్సవాలు నిర్వహించారు.
అనుగ్రహభాషణం చేస్తున్న శ్రీశ్రీశ్రీ శృంగేరి ఫీఠాథిపతి
1905 లో శ్రీమాన్ రాఘవాచార్యులు మరియు హెడ్కానిస్టేబుల్ శ్రీ వెంపా గోపాలరావు నాయుడు తో కలసి భక్తుల ఆదరణ పెరగడం మూలంగా ఈ కార్యక్రమాలను అయిదు రోజులు నిర్వహించాలని నిర్ణయించారు.బందరు నుంచి మండపం అలంకరించే వారిని, బాణసంచా తయారు చేసేవారిని ఇరవై రోజులు ముందుగానే పిలిపించి రహదారి బంగ్లా లో ఉంచి, అలంకరణ సామగ్రిని, బాణసంచాను తయారు చేయించేవారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామి పూలపల్లకిలో, దీపకాంతుల తో, బాణసంచా కాలుస్తూ నౌబత్ కానా, సన్నాయి మొదలైన మంగ ళ వాద్యాలతో స్వామి వారి నగరోత్సవం జరుగుతుంటే ప్రజలు వందలాది గా పాల్గొని, జాతర ను తలపింప జేసేవారట.
అనుగ్రహభాషణం చేస్తున్న శ్రీశ్రీశ్రీ ధత్త పీఠాథిపతి
ఈ అయిదు రోజుల్లో రెండు రోజులు కూచిపూడి కి చెందిన శ్రీ వేదాన్తంసత్యనారాయణ, పసుమర్తి, చింతావార్ల తో ఉషాపరిణయం, సత్యహరిశ్చంద్ర, భక్తప్రహ్లాద వంటి అనేక భక్తిరసాత్మక నాటకాలను ప్రదర్శించేవారు. వీటిని చూడ్డానికి చుట్టుప్రక్కల గ్రామాలవారు ఎడ్లబండ్లు కట్టుకొని వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారు.ఆ రోజుల్లొ అవనిగడ్డ వాస్తవ్యులు శ్రీ కోడూరి విశ్వనాథం గారి సతీసక్కుబాయి హరికథ ప్రత్యేక ఆకర్షణ గా ఉండేది. వీరు తన హరికథ లో అష్టపదులు, తరంగాలు గానం చేస్తూ ప్రజల్ని తన్మయుల్ని చేసేవారట. ఇదే కాలం లో శ్రీ బాలాజీ దాసు, అంబటి రాధాకృష్ణ గార్లు కూడ ఛక్కని కథ తో భక్తులను ఆకట్టుకునేవారు. 1914 లో తొలిసారి గా హరికథాపితామహ ఆదిభట్ల నారాయణ దాసు గారు ఈ ఉత్సవాల్లో మధుర భక్తి భావ రంజకంగా హరికథా గానం చేశారు. ఆ సమయం లో దాసు గారు నందిగామ ను ప్రశంసిస్తూ చెప్పిన పద్యం ఇప్పటికీ ముక్కోటి మహామండపం లో శిలా శాసనం గా కన్పిస్తోంది.
ఈవిధంగా ముప్పది ఐదు సంవత్వరాలు శ్రీరాఘవాచార్యలు గారు గోపాలరావు నాయుడు గారు నిరాఘాటంగా ఈ ఉత్సవాలను కొనసాగించారు .అనంతరం ఇరవై సంవత్సరాలు శ్రీరాఘవాచార్యులు గారుశ్రీదేవత ఘంటయ్య తో కలసి ఉత్సవాలను నిర్వహించారు. శ్రీ సూరె సత్యనారాయణ మూడు సం.రాలు, శ్రీ బవిరిశెట్టి సూర్యనారాయణ ఒక సం.రము బాధ్యతలు తీసుకోని కార్యక్రమాల్ని నిర్వహించారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆనాటి నుండి ఈ నాటి దాకా ఈ కార్యక్రమాలన్నీ భక్తులిచ్చే విరాళాల ఆధారం గానే నిర్వహించబడటం గమనించ దగ్గ విషయం.
అనుగ్రహ భాషణం చేస్తున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయరు స్వామి వారు
శ్రీమాన్ రాఘవాచార్యులు గారి కుమారుడు శ్రీమాన్ అథోక్షజాచార్యలు గారు వీరి సతీమణి శ్రీమతి రంగనాయకమ్మ . వీరు 1964 నుండి పదిహేనుసంవత్సరాలు శ్రీ కొమరగిరి నరసింహారావు, శ్రీపతి విశ్వనాథం తో కలసి అట్టహాసంగా ఈ కార్యక్రమాల్ని నిర్వహించారు. ఆథ్యాత్మిక ప్రసంగాలు, హరికథలు, భక్తి రసాత్మకమైన నాటకాలు హైందవ ధర్మాన్ని , సంస్కృతిని రక్షించడానికి తోడ్పడుతున్నాయనడం లో ఎంతమాత్రము అతిశయోక్తి లేదు.ఈ కార్యక్రమాల్లో నందివెలుగు వాస్తవ్యులు శ్రీ ప్రతాపగిరి లక్ష్మీనరసింహ శాస్త్రి ఏటా మూడు రోజులు హరికథా గానం చేశేవారు. ఈ ఉత్సవాలు జరిగే దేవాలయం చుట్టు బొమ్మలు, బూరలు,మంచంమిఠాయి, ఫ్యాన్సీ వస్తువులు అమ్మే కొట్లు విరివిగా వెలసేవి. అన్నాలుకట్టుకొని, తినుబండారాలు చేసుకొని బండ్లు కట్టుకొని చుట్టుప్రక్కల గ్రామాలవారు ఈ ఉత్సవాలకు వచ్చేవారు.
కార్యక్రమానంతరం సన్మానం స్వీకరిస్తున్న శ్రీమతి శోభానాయుడు
శ్రీమాన్ అధోక్షజాచార్యులు గారి కుమారుడు శ్రీమాన్ మంగనాథాచార్యులు . వీరి ధర్మపత్ని మేదినీదేవి. కాలక్రమంగా 1980 వ సంవత్సరం నుండి శ్రీ మంగనాథాచార్యులు ఈ కార్యక్రమాలను చేపట్టి వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ యేచూరి గుర్నాధం, పబ్బతి పొంగళ్లు, వెంకటేశ్వరరావు గార్ల సహాయసహకారాల తో భక్తుల వితరణ తో ఈ కార్యక్రమాలు జరుగుతున్నట్లు కార్యక్రమాల కన్వీనర్ శ్రీ మంగనాథాచార్యులు చెప్పారు.
ఆంధ్ర రాష్ట్రం లో లబ్ధ ప్రతిష్టులైన సాహితీ వేత్తలు, కళాకారులు, అష్టావధాన, శతావధాన, సహస్రావదానులు, సినీప్రముఖులు, కూచిపూడి కళాకారులులు, గాయనీ మణులు అందరు ఏదోఒక సంవత్సరంలో ఈ వేదిక ను అలంకరించారంటే దీని ప్రాముఖ్యత ను మనం గమనించవచ్చు.
సన్మానం స్వీకరిస్తున్నశ్రీమతి గురు కొండవీటి జ్యోతిర్మయి
హైదరాబాద్ వారిచే భువనవిజయం,వేదాంతం వారిచే విప్రనారాయణ,నాటకాలు,శ్రీయుతులు మేడసాని,మాడుగుల,గరికపాటి, ప్రసాదరాయయకులపతు, శ్రీ సి.వి.సుబ్బన్న, పాలపర్తి శ్యామలానందప్రసాద్ వంటి వారి అష్టావధానాలు ఇక్కడ నిర్వహించ బడ్డాయి.
2007వ సంవత్సరం లో డిశెంబరు 22,23 తేదీలలో 108 వ ముక్కోటి ఉత్సవాలసందర్భంగా శ్రీ మేడసాని శతావధానాన్ని కూడ ఈ వేదిక నిర్వహించింది. ఇదొక అపురూప కార్యక్రమంగా ఈప్రాంత ప్రజలకు గుర్తుండి పోయింది.
శ్రీ మేడసాని అష్ఠావధాన దృశ్యం
శతవార్షిక వేడుకలలో భాగంగా ప్రపంచ ప్రసిద్ధ కూచిపూడి నాట్యకారిణి శ్రీమతి” శోభానాయుడు” శ్రీకృష్ణ పారిజాతాన్ని ప్రదర్శించి, సన్మానాన్నిస్వీకరించారు. ముక్కోటి శతవార్షిక సంచిక ఈ కళాకారిణి కే అంకితం చేయడం ఒక ప్రత్యేకత.అలాగే 102 వ ఉత్సవాలలో అన్నమాచార్య భావనా వాహిని సృష్టికర్త శ్రీమతి “శోభారాజ్ “తన గానామృతం తో శ్రోతలను తన్మయీభూతులను చేశారు.
పండిత సత్కారాలు,కుడివైపు మొదట కన్వీనర్ శ్రీ మంగనాథా చార్యులు
105 వ ముక్కోటి ఉత్సవాల్లో అన్నమయ్య కళాపీఠం వ్యవస్ధాపకురాలు”,గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్ట్ రికార్డు” ప్రశంసలందిన” గురు కొండవీటి జ్యోతిర్మయి” తన భక్తి సంగీతం లో ప్రజలను ఓలలాడించారు.
ముక్కోటి ఉత్సవాల్లో శ్రీ పద్మనాభం, శ్రీ రావిికొండలరావు, శ్రీ జాలాది
95 వ ఉత్సవాల్లో శ్రీ చంద్రమోహన్,98 వ ఉత్సవం లో శ్రీ సాక్షిరంగారావు,99 లో శ్రీ బాలయ్య,102 లో శ్రీ నూతన్ ప్రసాద్,103 వ ఉత్సవం లో శ్రీ పద్మనాభం సన్మానాలందుకున్నారు. అలాగే శ్రీయుతులు కాంతారావు ,ధూళిపాళ, అల్లురామలింగయ్య, జె.వి సోమయాజులు, గుమ్మడి,రావికొండలరావు జాలాది వంటి సినీకళాకారుల్ని ఈ వేదిక సత్కరించుకుంది.
శ్రీ అల్లు రామలింగయ్య ను సన్మానిస్తున్న నిర్వాహకులు
శ్రీ శృంగేరి పీఠాథిపతి, శ్రీ దత్తపీఠాథిపతి, శ్రీ కుర్తాళం పీఠాథిపతి, శ్రీ అహోబిల పీఠాథిపతి, శ్రీ చినజియ్యరు స్వామి, శ్రీధవళేశ్వరం పీఠాథిపతి మొదలైన మహనీయుల ఆశీస్సులు ఈ ముక్కోటి వేదిక నుండే నందిగామ మరియు పరిసర ప్రాంత ప్రజలకు లభించాయి.
సన్మానం స్వీకరిస్తున్న శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ
శ్రీ ఉషశ్రీ, శ్రీమద్దులపల్లి మాణిక్యశాస్త్రి, ఆచార్య దివాకర్ల వెంకటావధాని, ఆచార్య జి.వి సుబ్రమణ్యం. ఆచార్య,యన్.గోపి, ఆచార్య శలాక రఘునాథశర్మ,ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం వంటి మహోపాధ్యాయుల ఉపన్యాసాలను ఈ వేదిక అందించింది. శ్రీమల్లాది చంద్రశేఖర శాస్త్రి,సామవేదం షణ్ముఖ శర్మ, ఫరిమి రామకృష్ణశాస్తి వంటి వారి ఆథ్యాత్మికోపన్యాసాలు, హరికథా చక్రవర్తి శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి, శ్రీమతి విన్నకోట రామ కుమారి, మంత్రిప్రగడ లలితకుమారి వంటి వారి హరికథలు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ముక్కోటి మండపం అందిస్తూనే ఉంది.
బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి ఉపన్యసిస్తున్న దృశ్యం
ది. 12.4 . 2011 శ్రీరామనవమి రోజున శ్రీచెన్నకేశవస్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమ శంఖుస్ధాపనకు ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గౌరవనీయులు, ఆంధ్ర రాష్ట్ర గవర్నరు, మాన్య మహోదయులు శ్రీమాన్ ఈ.ఎల్. నరసింహం గారి దంపతులను సన్మానించుకోవడం ఒక మహద్భాగ్యంగా ఈ ముక్కోటి మహామండపం భావిస్తోంది.
చిన్నపందిట్లో మొదలైన ఈ కార్యక్రమాలు క్రమంగా వృద్ధి చెందుతూ 2000 సంవత్సరం లో శత వసంతాల సంబరాల సందర్భంగా, భక్తుల వితరణ తో శతవార్షిక మహామండపానికి శ్రీమాన్ చినజీయరు స్వామి వారి చేతులమీదుగా శంఖుస్ధాపన చేసుకొని , అదే సంవత్సరం వారి కరకమలాలతోనే ప్రారంభోత్సవం చేయబడింది. ఈ ప్రాంతం లో ఇప్పుడు పూర్తిస్తాయి లో ఆథ్యాత్మిక, సాంస్కతిక కార్యక్రమాలు జరుపుకోవడానికి ఒక వేదిక ఏర్పడింది.
ఇంత చిన్న గ్రామం లో ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు జరగడం నిజం గా స్ధల ప్రభావమే నని చెప్పాలి. కర్త సంకల్ప బలం కూడ దానికి తోడయ్యింది.ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నవారికి, ఫ్రోత్సహిస్తున్నవారికి కూడ హైందవ సమాజం సదా కృతజ్ఞత తో ఉంటుందనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. భగవంతుడు వారికి ఎల్లవేళలా తోడుండాలని మనసారా కోరుకుంటున్నాను.మరి కొంతమందికైనా ఈ కార్యక్రమం ప్రేరణ కావాలనే ఆశ తో ఈ వ్యాసాన్ని సవినయంగా సమర్పిస్తున్నాను.
No comments:
Post a Comment