రెండవ ప్రకరణం
గుడిమెట్ట నగరం – చాగివారు -3
సమకాలీన పరిస్ధితులు-కావ్యనిర్మాణం:
చాగి వారి పాలన లో కొనసాగిన సాహిత్య సేవ ఎటువంటిదో చెప్పుకోవడానికి ఎటువంటి ఆథారాలు లభించడం లేదు.తెలుగుజాతికి పంచమవేదమైన ఆంధ్రమహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఆదికవి ని ప్రోత్సహించిన రాజన్యులు వేంగీ చాళుక్యులు. వారి ప్రోత్సాహం తో వెలిసిన మాండలిక రాజ్యమైనప్పటకీ, షుమారు రెండు శతాబ్దాలు సాగిన చాగి వారి పాలన లో వెలిసిన ఏ ఒక్క కావ్యము వెలుగ చూడలేదు. వీరు కవి పండిత పోషకులు కాలేదనడానికి అవకాశమే లేదు. ఆనాటి సభ ల్లో కవులను పోషించడం సంప్రదాయం గా వస్తూనే ఉంది. కులోత్తుంగ చోడుని ఆస్ధానకవి “జయగొండాన్”. ఈతను కులోత్తుంగుని కళింగ యుద్ధ వృత్తాంతాల్ని “కళింగత్తుప్పరణి” అనే కావ్యం లో విశేషం గా వర్ణించాడు. రాజరాజనరేంద్రుని ఆస్ధాన కవి నన్నయ ఆంథ్రజాతి కి ఆదికవి యైనవాడు. తెలుగు జాతి కి సుపరిచితుడు.అటువంటిది ఆ కాలం లో మాండలిక రాజ్యాల్లో కవులను పోషించి కావ్యాలను వ్రాయించడం జరిగే ఉంటుంది. కాని 12 వ శతాబ్దపు వీరశైవ ఉద్యమం , అనంతరం సాగిన మహమ్మదీయ దండయాత్రలు వాటిని ధ్వంసం చేసి ఉంటాయి. విచిత్రం గా ఏ ఒక్క కవి పేరు కాని , కావ్యం పేరు కాని ఈ మూడు దశాబ్దాల్లో విన్పించడం లేదు. ఏనుగు లక్ష్మణ కవి వ్రాసిన రామవిలాస కావ్యం వరకు గుడిమెట్ట ను స్మరించిన వారే లేరు. వేములవాడ భీమకవ చాటువు ఒకటి గుడ్డిలో మెల్లగా పోతరాజు పేరును స్మరించింది . కాని అది వివాదస్పదామైంది. అంటే ఈ కాలం లో కావ్యాలు వెలసినా అవి క్రమేణా కాలగర్భం లో కలిసి పోయాయని భావించాల్సి వస్తోంది.
-36-
సమకాలీన పరిస్థితులను ఒక్కసారి పరిశీలిస్తే – మనకు కొన్ని నిజాలు తెలుస్తాయి. ఆ కాలపు రాజులకు సాహిత్యపోషణ చేసే సమయంలేదేమో ననే వారూ ఉన్నారు.ముఫై వసంతాల పైచిలుకు రాజ్యపాలన చేసిన మొదటి రెండవ పోతరాజుల కాలంలో కూడ ఎట్టి కావ్య నిర్మాణం జరిగిన దాఖలాలు లేవు. ఆనాడు ఆంధ్రదేశం లో శైవానికి ఆదరణ మిక్కుటం గా ఉంది. జైనమతం తెలంగాణా , రాయలసీమల్లో అక్కడక్కడా కన్పిస్తున్నా మిగలిన ఆంధ్రప్రాంతం లో మాత్రం శైవ మే ఆదరించబడి , ప్రజలచేత ఆచరించబడుతోంది. అమరావతీ శాసనం లోని చైత్యమత్యున్నతిం యత్ర నానాచిత్ర విచిత్రితం అన్న వాక్యాన్ని బట్టి ఆనాటికి అమరావతి మహాచైత్యం నష్టం కాలేదని భావించవచ్చు. బౌద్ధ మత ప్రభావం ప్రజల్లో లేదు. అమరావతి ,కరీంనగర్, బెక్కల్లు శాసనాలను, పరిశీలిస్తే - బుద్ధభగవానుని ప్రజలు విష్ణుమూర్తి అవతారం గా భావించి, పూజిస్తున్నట్టు మనం గమనించవచ్చు. (ఆంధ్రుల చరిత్ర –సంస్కృతి .96.పే.)
అంతేకాదు .శ్రీ రామానుజుని ప్రచారం తో వైష్ణవానికి నూతనోత్తేజం వచ్చింది.ఈ చాళుక్య చోళ యుగం లో పెక్కు ద్రావిడ వైష్ణవ కుటుంబాలు ఆంధ్రదేశం లో స్థిర పడ్డాయి.కొమ్మన మంత్రి ముఫై రెండు క్షేత్రాల్లో విష్ణు ప్రతిష్టలు చేసినట్లు మంచెన తన కేయూరబాహ చరిత్ర లో వ్రాసాడు. శైవ ,వైష్ణ వాలు రెండింటిలోను ఈ యగం లోనే తీవ్రవాద ఉద్యమాలు బయలు దేరాయి శివుని మహావ్రతి గా ఈ కాలపు రాజకవి నన్నెచోడుడు వర్ణిస్తాడు. ఈమహాకవి కావ్యం కుమారసంభవమే తెలుగు వారికి చాలా ఆలస్యం గా దొరికింది.. ఈ విధంగానే ఏ చీకటి కోణాల్లోనో ఈ యుగపు కవులు దాగున్నారేమో. ఈ కాలం లో అలంపురం ,శ్రీశైలం,బెజవాడ ,పిఠాపురం శక్తి పూజా కేంద్రాలు గా ప్రసిద్ధి పొందాయి. బసవేశ్వరుని వీరశైవోద్యమం జాతిని జాగృతం చేసింది.
శివుడే పరదైవతమనే భావన ,లింగధారణ ,లింగ అంగ సమైక్య సాధన వీరశైవం లోని ప్రధానాంశాలు. జైన ,బౌద్ధాల లోని నైతిక వర్తన , సాఁఘిక సమత్వం పౌరాణికమతం లోని భక్తి ని బసవేశ్వరుడు వీరశైవం లో సమన్వయం చేశాడు. ఆంధ్రదేశం లో ఈ యుగం లో కొద్దిగా క్రింది వర్ణాల వారిని మినహాయిస్తే వీరశైవం ప్రజాదరణ పొందలేదు. శ్రీ రామానుజులు క్రింది
-37-
వర్ణాల వారికి వైష్ణవమతదీక్ష నిచ్చినా వర్ణవ్యవస్ధ ను ఖండించ లేదు. పల్నాటి బ్రహ్మనాయుడు మాత్రం వీరవైష్ణవాన్ని ప్రచారం చేశాడు. అతని ప్రచారం తో ఆంధ్రదేశం లో దాసర్ల సంఖ్య పెరిగింది. ( ఆంధ్రుల చరిత్ర- సంస్కృతి) బ్రహామనాయుడు వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించాడని , మాచర్ల చెన్న కేశవాలయం లో పంచములకు ప్రవేశం కల్పించాడని చెప్పుకుంటారు. ఇటువంటి విప్లవాత్మక సంస్కరణలు ఆనాడు అపూర్వాలేనని చెప్పాలి. కొంచెం లోతు గా ఆలోచిస్తే పల్నాటియుద్ధం సంప్రదాయ ప్రియత్వానికి ,సంస్కరణ వాదానికి మధ్య జరిగిన సంఘర్షణ గా కన్పిస్తుంది.
అయితే క్రమం గా శతాబ్దం చివరి కొచ్చేసరికి వీరశైవ ,వీరవైష్ణవ పరాజయం , స్మార్త మత పునరుద్ధరణ జరిగాయి. అద్వైత ధర్మ ప్రచారమే ఆశయం గా మహాకవి తిక్కన సోమయాగం చేసి సోమయాజి యై భారతాంధ్రీకరణ కు పూనుకున్నాడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్న భావం ప్రజలలో నెమ్మది గా వ్యాపించింది. రెండవ పోతరాజు విశ్వేశ్వర ,చోడనారాయణ ఆలయాలు రెండింటికి సమానం గా సువర్ణ కలశాలను ఎత్తించి ,దాన శాసనాలను వేయించి తన లోని శైవ వైష్ణవ సమానత్వాన్ని చాటుకున్నాడు. ప్రజలలో తీవ్రవాద మత భావాలు శమించి , వైదిక భావాలు మొలకెత్తుతున్న కాలమిది. కాకతి రుద్రదేవుడు రుద్రేశ్వరం లో ఈశ్వరుని తో పాటు కేశవుని సూర్యుని ప్రతిష్ఠించి ఫూజించాడు. అతని మంత్రి గంగాధరుడు విష్ణుభక్తుడు.మంచి భట్టోపాథ్యాయుడు కేశవ ,మహాదేవుల ఆలయాలను నిర్మించాడు. మొదటి పోతరాజు గుడిమెట్ట లో విశ్వేశ్వర మహాదేవరను , చోడనారాయణుని ప్రతిష్ఠించాడు. సింహాద్రి వరాహ లక్ష్మీనరసింహునికి చాగి సముద్రమనే తటాకాన్ని త్రవ్వించి, వేదాద్రి నరసింహస్వామి కి కానుకలు సమర్పించి , నరసింహవర్ధన పోతరాజయ్యాడ రెండవ పోతరాజు. ముక్త్యాల లో ముక్తేశ్వరుని ప్రతిష్టించి శివభక్తుడు గా కొనియాడబడ్డాడు.
దేవాలయాలు దేశ సంస్కృతికి మూలస్ధంభాలు.కాబట్టి ఆనాటి లయాలు గ్రామ ప్రజలకు ,పరిసర గ్రామాల ప్రజలకు కూడా కడలి కేంద్రాలు గా ఉండేవి.దేవస్ధానం గావ్యవహరించే ఈ ఆలయ భూముల్ని రైతులు సాగు చేశేవారు.
-38-
ఆనాడు ప్రతిఆలయానికి అనుబంధం గా మఠాలు ,సత్రాలు ,విద్యాలయాలు ఉండేవి. అంతేకాదు ఆలయాలు బ్యాంకు లు గా ,ప్రదర్శన శాలలు గా ,వర్తక శ్రేణులకు కార్యస్ధానాలు గా ఉండేవి. గ్రామానికి మథ్య లో దేవాలయ ముండేది. దానికి నాలుగువైపులా గ్రామాన్ని విస్తరింప చేసుకోవడం , నాలుగు వీధుల కూడలి స్థలం దేవాలయం నిర్మించబడేది. మరికొన్ని దేవాలయాలు ప్రభువుల అజమాయిషీ లో అంత:పుర కాంతల రాకపోకలకు అనుకూలం గా రాజప్రాసాదానికి అనుబంధం గా నిర్మించబడి , మరో మార్గాన్ని ప్రజల దర్శనానికి వదిలివేయడం జరిగేది. హంపీ విరూపాక్షాలయం నుండి వాడపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ఇందుకు ఉదాహరణలు గా నిలుస్తాయి.
గుడిమెట్ట కొండల పైన కన్పించే కొన్ని కట్టడాలు ఇటువంటివే. గుడిమెట్టలోని దేవాలయాలు రాజ భవనానికి తూర్పు గా నిర్మించబడినవిగా మనం శిథిలాలను బట్టి ఊహించవచ్చు. దేవాలయాల చుట్టు వైదికధర్మం ఇన్ని విధాలు గా అల్లుకున్నది కాబట్టే, ఐశ్వర్యవంతమైన హిందూ ఆలయాల చుట్టూ సామాజికి ,ధార్మిక కార్యక్రమాలు పెనవేసుకొని ఉన్నాయి కాబట్టేతురష్కులు హిందూదేవాలయాల పైనే దృష్టి కేంద్రీకరించి ,విధ్వంసానికి పాల్పడ్డారు . గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం మొదలుకొని శ్రీరంగం లోని శ్రీరంగనాయకస్వామి ఆలయం వరకు ఇందుకు నిదర్శనాలే. ఆలయం విథ్వంసం తో సామాజిక జీవితం విచ్ఛిన్న మై, దేశాక్రమణ సుగమం కాగలదని వారు భావించారు.చరిత్ర కొన్ని గుణపాఠాలను నేర్పిస్తుంది. సింహాచలం వంటి దేవాలయాల నిర్మాణం చూస్తే హిందూ రాజుల లో వచ్చిన మార్పు మనకు అర్ధమౌతుంది. కోటగోడల వంటి ప్రాకారాలు, రహస్య మార్గాలు దేవాలయ నిర్మాణం లో వాడటాన్ని మనం అక్కడ గమనించవచ్చు.
వేశ్యాప్రియత్వం ఈ యుగం లో సాధారణ విషయం గా కన్పిస్తోంది. దేవదాసీలకు,వేశ్యలకు సమాజం లో సాధారణం గా గౌరవస్ధాన ముండేది. గణపయరాజు విశ్వేశ్వర దేవరకు అంగరంగ వైభోగాలకు దాసదాసీలను దానం చేసిన శాసనం ఇందుకు సాక్ష్యమిస్తోంది.
-39-
శివకేశవులకు బ్రహ్మాండమైన దేవాలయాలను నిర్మించిన రాజులు వాని రక్షణ ,పోషణ కు గాను అనేకమైన దానధర్మాలు చేసేవారు. మన పరిశీలన లో కన్పించిన అనేక శాసనాలు ఇందుకు సంబంధించినవే. రుద్రమదేవి గుడిమెట్ట శాసనం గుడిమెట్ట విశ్వేశ్వర దేవరకు బేతవోలు గ్రామాన్ని దానం చేయగా మనుమగణపతి దేవరాజు “వేముపల్లి” గ్రామాన్ని ప్రతాప నరసింహ దేవరకు (వేదాద్రి) దానంచేశాడు. అంతే కాదు . ఈ దానాలన్నీ హవిర్బిల్వర్చనాదులకు ,అంగరంగ వైభోగా లకు ప్రత్యేకం గా నిర్దేశించి చేయడినట్లు గా మనం గమనించవచ్చు. అంగరంగవైభోగాలంటేనే దేవదాసీల కొరకు ,నృత్య నాట్య ప్రదర్శనలకు ,ఉత్సవాలకు అని అరధం. వాని కోసమై గ్రామాలను దేవునికి దానం చేయడం అనేక శాసనాల్లో కన్పిస్తోంది.
మరియు అఖండదీపం కొఱకు చేసిన దానశాసనాలు ఈ కాలం లో ప్రత్యేకంగా కన్పిస్తాయి. “శ్రీశైల సందీపిత దీపయుగ్మము కలవాడు” కల్లయ నాయకుడు .“కండ్రవాడి కేశవోర్వీపతి” ముక్త్యాల ముక్తేశ్వరునికి విమలాఖండ ప్రదీపశ్రీ కొఱకు 25 గోవులను దానం చేశాడు. ఈ శాసన కాలం క్రీ.శ.1207. (302/1924) . మాక చమపతి ముప్పాళ్ళ రామేశ్వరునకు అఖండ దీపారాధనకై 25 గోవుల్ని దానం చేశాడు.(257/1920). దీని కాలం క్రీ.శ.1277. ఈ విధం గా దానం చేసి ఆవులకు మేతకు కావలసిన పచ్చిక బయళ్ళ ను కూడ దానాలు చేసిన రాజవరేణ్యులున్నారు. వేదాద్రి నరసింహస్వామి వరి ఆలయ ప్రాంగణంలో పడమటి వైపు కృష్ణా నది లోనికి వెళ్ళే మెట్లమార్గం ప్రక్కనే రంగరాజు (?) వేయించిన దానశాసనం ఒకటి కన్పిస్తుంది. అది ఆవులకు వలసిన పచ్చిక కోసం గుండుబోయిన పాలెం రంగరాజు కొండకు నడుమ నున్న భూ భాగాన్ని సాలగ్రామ నరసింహ సాక్షి గా దానం చేసిన శాసనమిది. అంటే కొంతమంది భక్తులు దేవుని గోవులను కొష్ఠం లో ఉంచి పోషిస్తూ , అఖండ దీపానికి వలసిన నెయ్యి ని ఆలయానికి పంపుతుండే వారని, ఆ ఆవుల రక్షణ ,పోషణ కు మరికొందరు మహనీయులు భూ దానాలు చేస్తుండేవారని మనం అర్ధం చేసుకోవచ్చు. “ బెజవాడ తెలికివేవురు కులానికి చెందిన కుఱ్ఱిసెట్టి కొనకంచి నరేంద్రేశ్వర దేవరకు దీపమాలలు రెండు చేయించాడు. (270/1924).” ఫిరోజ్షా తన తమ్ముని పేర వేదాద్రి వద్ద ఒక చెఱువు ను త్రవ్వించినట్లు శాసనం కన్పిస్తోంది. (కృష్ణా
-40-
గెజిట్-46 వ.పే). ఇది కొనకంచి చెరువు అయి ఉండాలి. కృష్ణా నది ప్రక్కనే ఉండగా వేదాద్రి లో చెరువు అవసరం లేదు కదా. ఆనాడు కూడ చెఱువులు త్రవ్వించడం పుణ్య కార్యం గానే ప్రజలు భావించేవారు. దేవాలయాలకు అనుబంధం గా చెరువులను త్రవ్వించే వారన్న మాట. రెండవ పోతరాజు సింహాచలేశునకు చాగి సముద్రమనే తటాకాన్ని త్రవ్వించిన విషయం ఇంతకు పూర్వమే ప్రస్తావన కొచ్చింది. ఈ చెఱువులు స్వామి వారి పుష్కరిణు లేమో ? ఆలోచించాలి. ఇవన్నీ శాసనాలు విశ్లేషిస్తే తెలిసే రహస్యాలు. ఇంతగా తమ జీవన గమనం లో ఒక భాగం గా హిందువులు ఆలయాలను అభివృద్ధి చేసుకున్నారు. అందుకే తురుష్కులు వానిని ధ్వంసం చేశేవారు.
హిందువులు ఆవేశం లో జైనదేవాలయాలను శివాలయాలు గా మార్చేస్తే , అనంతరం వచ్చిన తురుష్కులు హిందూఆలయాలను మసీదులు గా మార్చుకున్నారు. వేములవాడ , జోగిపేట,కొలను పాక వంటి ప్రదేశాల్లో జైన మందిరాలు శివాలయాలు గా మారాయి.( ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి 145 వ. పే) రాజమండ్రి, పెనుగంచిప్రోలు, వంటి అనేక ప్రదేశాల్లో సివాలయాలు మసీదులు గా మారిపోయాయి. ప్రపంచ ప్రసిద్ద తాజ్మహల్ తేజోమహల్ అనే శివాలయమనే వాదన ఉండనే ఉంది. అయోధ్య వివాదం ఈనాటికీ ఆరని రావణాసుర కాష్టం లా మండుతూనే ఉంది. ఐతే ఈ సమయం లో మనం అంగీకరించాల్సిన విషయం ఒకటుంది. అదేమింటే తురుష్కుల దురాగతాలను ఎదుర్కోగల్గిన మతావేశం త్రిశూల ధారులైన వీరశైవం లోనే ఉందని, హరహరమహాదేవ శంభో లోని వీరావేశం త్రిశూలధారుల్ని పురిగొల్పుతుందని ఆనాటి ప్రజలు , ప్రభుత్వం బలంగా విశ్వసించాయి. లయకారకుడైన శంకరుడే పరదైవమని ఆనాటి సమాజం నమ్మింది. అందుకే ఈ యుగం లో ఎక్కువగా శివాలయాలు , మహాదేవునికిచ్చిన దాన శాసనాలే కన్పిస్తాయి. విశాలమైన దేవాలయ మండపాలు , అద్బుతమైన శిల్ప సంపద ను సంతరించుకొని సర్వజన రంజకంగా నిర్మించబడేవి. ఇటువంటి కట్టడాలే శిథిల శిల్పాలై మసీదు దిబ్బ గా పిలువబడే గుడిమెట్ట లో మిగిలి పోయాయి.
త్వరలో మూడవ ప్రకరణం - వెలుగు చూసిన తెలుగు శిల్పాలు.
No comments:
Post a Comment