Wednesday, 7 December 2016

శతకసౌరభాలు -9 పురుషోత్తమ కవి, ఆంథ్రనాయక శతకము-10


శతకసౌరభాలు -9

కాసుల పురుషోత్తమ కవి

ఆంథ్రనాయకశతకము-10


  భువనమోహన కృష్ణమూర్తివి నీ వేని
                                                       ఆ లీల లిచ్చట నాడవలదె?
బలసముజ్వల కామపాలుడ నీవేని
దీపించి యాబల్మిఁ జూపవలదె?
వీర నృసింహావతారుఁడ వీ వేనిఁ
దత్తేజ మింతైనఁ దాల్పవలదె
సత్యవిక్రమ రామచంద్రుఁడ వీ వేని
ఆపౌరుష మొకింత చూపవలదె?
యెంచ దేవర దైవమో యీవె కాని
చూపఱకు నీదు మహిమను జూపవలదె?
చిత్ర చిత్ర ప్రభావదాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!  89
                
                  ఆంధ్రదేవా !! సమస్త లోకాలను మోహింప జేసిన  శ్రీకృష్ణుడవు నీవే ఐతే ఆ లీలల నన్నింటినీ ఈ ఫుణ్యక్షేత్రమందు కూడ చూపించవచ్చు కదా !బలరాముడవు నీవే ఐతే ఆ బలాన్ని ఇక్కడ కూడా ప్రదర్శించవచ్చు కదావీర నృసింహావతారుడవు నీవే అయితే ఆ తేజస్సు ను కొంచెమైనా ఇక్కడ చూపించవచ్చు కదాసత్య పరాక్రమశీలి యైన  శ్రీ రామచంద్రమూర్తివి నీవే అయితే ఆ పౌరుషాన్ని కొంచె గా ఇక్కడ కూడా ప్రదర్శించవచ్చు కదా.?   ఓ దేవా ! నీవే కనుక నిజము గా నా ఇష్టదైవమే అయితే  నీమహిమను ఇక్కడి ప్రజలకు , నిన్ను నమ్మిన భక్తులకు   చూపించరాదా.?

          తనను తాను నిరూపించుకోవలసిన పరిస్ధితిని ప్రియభక్తుడు భగవంతునికి కల్పిస్తాడు. ప్రహ్లాదుడు కోరిక మేరకు నారసింహుడు ఆవిర్బవించలేదా ! తిన్నని కోరిక మేరకు శంకరుడు ప్రత్యక్షమౌ లేదా ! ఇవన్నీ చిత్రమైన దైవలీలలు. భక్తుని పై భగవంతుని కున్న అపారమైన కరుణ కు  ప్రత్యక్ష సాక్ష్యాలు కదా !


                                             ఆలగాపరివాఁడ వనక నిన్నఖిలవే
దాంతమార్గ విహారి వందు నేమి?
హలముఁ బట్టివవాఁడ వనకని న్బహువిధా-
జాండనిర్వాహుఁడ వందు నేమి?
యల్లసారథివాఁడ వంచనక నిన్ను సమస్త
శాస్త్రప్రపూర్ణుఁడ వందు నేమి?
యడవి ద్రిమ్మరువాఁడ వనక నిన్సకల లో
కాపన్నివారుఁడ వందు నేమి?
పుడమి నీ దగు కొంచెపు నడత లెంచ
కభినుతింతునె లోకైక విభుఁడ వనుచు
చిత్ర చిత్ర ప్రభావ  !దాక్షిణ్యభావ !
                                      హత విమతజీవ !శ్రీకాకుళాంధ్రదేవ!                            90
         ఆంథ్రనాయకా !  నిన్ను ఆవుల కాపరి వి అంటానే  కాని  వేదాంత మార్గ విహారి వని కీర్తించను. నాగలి పట్టిన వాడవని అంటానే కాని సమస్త లోకసంరక్షకుడవని పొగడలేను. నీవు రథం నడిపే వాడివే నని , రథసారథీ ని పిలుస్తానే కాని సమస్త శాస్త్ర ప్రపూర్ణుడవని పిలువలేను.  అడవి లో తిరిగేవాడవని అంటాను కాని మా కష్టాలను పట్టించుకొనే వాడివని అనలేను. ఈ భూమి మీద నీవు చేసిన పనులన్నీ చిన్న చిన్న వని విమర్శిస్తానే కాని  నీవు లోకనాయకుడవని స్తుతించలేను.
                            
                        మామ యింటికిఁ బోవ మంచితీర్థము పుట్ట

దతఁ డంత కారువాఁడతఁడె సుమ్ము
పునుక కంచము తోలు పుట్టంబు గల మిత్రుఁ
డెందు నన్నముఁ బెట్టు నేమి గప్పు
మాట మాత్రం బైన మగువ నో రాపదు
కొడుకు పెట్తునె తలగొట్లమారి
యన్నది మేషాండ మున్న దిచ్చే దొక్క
తొఱ్ఱిగొ డ్డది నీకుఁ దోలు నేమి
ఎవ్వరింటికిఁ బోయిన నేమి ఫలము
ఉన్నచో నుండి సిరులఁ బెంపొందు మయ్య
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవశ్రీకాకుళాంధ్రదేవ! 91

              ఆంథ్రదేవా ! ఏమి బంధువర్గమయ్యా నీది . ఎప్పుడన్నా  ఊసు పోక చుట్టాలింటికి వెడదామా అనుకుంటే నీకున్న బంధువులు, మిత్రులు అందరి కందరే కదయ్యా. మామాగారు కదా యని సముద్రుని చెంతకు వెడితే తాగడానికి మంచినీళ్ళు కూడ దొరకవు .  ఆయనంతటి ఉప్పుగాడు  ఆయనే కదయ్యా.  పుఱ్ఱె కంచము గాను , పులి తోలు కట్టు బట్ట గాను గల  స్నేహితుడు శంకరుని ఇంట కి వెడితే ఏ పాత్ర లో నీకు అన్నం పెడతాడు. ఎటువంటి బట్టలతో సత్కరిస్తాడు. పోనీ . కొడుకైన మన్మధుని దగ్గరకు వెడదామా అంటే కోడలు ఒక్కనిమిషమైనా  నోటిని ఆపుకోలేదు. మాట్లాడు తూనే ఉంటుంది. కొడుకు చూస్తే తగవుల మారి. అటువంటి కొడుకు నీకు అన్నం  ఏమి పెడతాడు. పోనీ అన్నయైన ఇంద్రుడు ఉన్నాడంటే అతనికి మేషాండాలే ఆస్తి.  తప్పుడు పనులు చేసి ఉన్నవాటిని పోగొట్టుకొని మేష వృషణాలు తెచ్చుకొన్న పెద్ద మనిషి ఆయన. ఆయన కున్నది ఒక ముసలి ఆవు . దాన్ని ఎలాగూ నీకు ఇవ్వలేడు కదా !
                                     అందువల్ల ఎవరింటికి పోయినా నీకు దక్కేది చుక్క నీరు కూడ ఉండదు కాబట్టి ఉన్నచోటు నే ఉండి, అంటే  ఈ  క్షేత్రం లోనే ఉంటూ  వచ్చిన సంపద తో సర్దుకుపోవయ్యా స్వామీ !


                                             దుర్జన  భంజనోద్యుక్త సుదర్శన
                                                      ధారివే నీవు యధార్థముగను
                                              
శాత్రవభయద నిస్వన పాంచజన్య భూ
 షిత కరాంబుజుఁడవే సిద్ధముగను
మత్తారిభేదనాయత్త కౌమోదకి
 నిజ  కరభరితమే నిశ్చయముగ
ఘోర విద్విడ్రక్త ధారార్ధ్రనందక
 సంధాన పాణివే సత్యముగను
సన్నుతామోఘ బాణైకశార్ఞ్గచక్ర
శయుఁడవే నమ్మవచ్చునే స్వామి! నిన్ను?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!  92


                        ఆంధ్రదేవానీవు నిజం గా దుష్ట సంహారం చేసిన సుదర్శన ధారివేనాశతృవులకు ప్రాణభయాన్ని కల్గించే శబ్దాన్ని గల్గించే పాంచజన్యాన్ని పూరించిన హస్తమేనా ఇదినీచేతిలో ఉన్నది మదించిన శతృవుల పీచ మడచిన కౌమోదకమేనానిజం గా ఘోరమైన  శతృవుల రక్తధారాలతో తడిసిన నందకమనే ఖడ్గాన్ని పట్టుకున్న చెయ్యి ఇదేనా ? కొనియాడబడెడి  శార్జ్ఞమనెడు ధనుస్సు ను ధరించిన వాడివి నువ్వేనానాకెందుకో సందేహం కల్గుతోంది. ఇన్ని శక్తి సంపదలుండి , అమోఘమైఆయుధాలుండి కూడ నీ ఆలయాన్ని నీవు ఎందుకు బాగు చేసుకోలేకపోతున్నావు?


                                         ఇల్లు రత్నాకరం బెన్నాళ్ళకును జాలు
 జీవనం బొరుల యాచింప  వలెనె?
ఇంట మహాలక్ష్మి యెప్పుడు దాండవం
 బొనరించు నొకఁడు నీ కొసఁగవలెనె?
స్థిరత లోలోన నిక్షేపించు ధనము నెం
 చఁగ రాని దొకరిఁ జేఁ జాపవలెనె?
పంటపైరులకాఁపు కంటఁ గాయుచునుండు
 కోరికఁ బెరసొమ్ము గొనఁగవలెనె?
ధాత్రి నెవ్వరి రక్షించఁ దలఁచినావొ
కోరువారలచేఁ బూజ గొందు వింతె
చిత్ర చిత్ర ప్రభావ !దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!  93

                     ఆంధ్రదేవా ! నీ నివాసమే సకల  సంపదలకు నిలయమైన రత్నాకరము. ఇక నీ ఇల్లాలు లక్ష్మీదేవి సమస్త సంపదలకు నెలవు.  నీ ఇంట నెలకొన్న ధనాన్ని లెక్కించడం ఎవ్వరికీ సాధ్యం కాదు . అటువంటి నీకు ఎవరో ధనాన్ని సహాయం చేయాలాఒకరి ముందు నీవు చేయి చాపాలాపంటలను పరిరక్షించు చంద్రుడు నీకు ఒక కన్ను గా ఉండగా నీవు మరొకరిని  యాచించవలసిన  అవసరం ఏమిటి  ?  ఈ భూమి మీద నీవు ఎవరిని రక్షించదలచినావో , వారినే ఆజ్ఞాపించి , వారలచే మాత్రమే నీ పనులను చేయించుకుంటావు కదా !


అబ్ధికన్యా వివాహ మహోత్సవము నాఁడుఁ
 జూడలే దిచ్చోట జూడఁ గలిగె
జానకీకల్యాణ సంభ్రమం బానాఁడు
 జూడలే దిచ్చోట జూడఁ గలిగె
భోజసుతోద్వాహ భూరివైభవమందుఁ
 జూడలే దిచ్చోటఁ జూడఁ గలిగె
రేవతీపరిణయ శ్రీవిలాసంబపుడు
 చూడలే దిచ్చోటఁ జూడఁ గలిగె
ననుచు నిట రాజ్యరమఁ బెండ్లియాడ
నిన్నుఁ బ్రజలు సేవించి సంతోషభరితులైరి
చిత్ర చిత్ర ప్రభావదాక్షిణ్యభావ!
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!  94
            
    ఆంథ్రదేవాగడచిన యుగాలలో కన్నుల పండువు గా జరిగిన లక్ష్మీకళ్యాణము , సీతాకళ్యాణము, రుక్మిణీ కళ్యాణము , రేవతీ కళ్యాణము , ఎంత గొప్పగొప్ప గా జరిగాయో మేము చూడలేదు .కాని ఇక్కడ శ్రీకాకుళం లో  కళ్యాణోత్సవాల్లో ఇప్పుడు రాజ్యలక్ష్మి ని నీవు పెండ్లాడే సుందర దృశ్యాన్ని కన్నులారా గాంచి భక్తజనులందరూ ఎంతో ఆనందిస్తున్నారు.

                                                                     
                                                             అమ్మవారు శ్రీ రాజ్యలక్ష్మీ దేవి.
                                           
                                                   కైలాస మేరు సంకాశ నాగాశన
స్కంధంబు పై రథోత్సవము గల్గఁ
జందనమందార సంతానకల్పక-
వనముల మృగయోత్సవమ్ము గల్గ
రంగత్పయఃపయోరాశి వీచికలపై
వర్ణింప డోలోత్సవంబు గల్గ
బహుఫణారత్న శుంభద్భుజంగమ
భోగవసతిఁ బర్యంకోత్సవంబు గల్గ
                                             బరకృతోత్సవ మిచ్చట బ్రాఁతె నీకు
భక్త జనులకు నేత్రోత్సవంబె కాని
చిత్ర చిత్ర ప్రభావదాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!   95
                          
                             ఆంథ్రదేవా ! కైలాస , మేరు పర్వతాలతో సమానమైన గరుత్మంతుని భుజస్కంధాలపై కూర్చొని రథోత్సవాన్ని,  శ్రీగంధము ,మందారము ,సంతానముకల్పవృక్షము వంటి వృక్షములు గల వనముల  నడుమ పాఱువేట యనెడి మృగయో త్సవాన్ని ,పాల సముద్రపు అలల పై శయనించి లీలగా డోలోత్సవాన్ని, పడగల పై వివిధ రత్నము లతో ప్రకాశించెడి ఆదిశేషుడే పాన్పు గా   అత్యంత భోగం గా పవళింపు ఉత్సవాన్ని  చేసుకునే నీకు ఈ భూలోకం లో భక్తులు చేసే ఉత్సవాలు  ఏమాత్రం చెప్పు . ఏదో భక్త జనుల ఆనందానికి ఆయా ఉత్సవాలను ఇచ్చట భక్తులు చేస్తూ ఉంటారు కాని ఇవి నీకు లెక్కలోనివి కాదు కదయ్యా !
                                                కోరిక లీను వైకుంఠంబులోని
               లోన నగరిలో నామూల నవ్యదివ్య
సౌధంబుదాపలి సరస మందారవ
                          నాంతరామృత సరఃప్రాంతచంద్ర
కాంతోపలోత్పల కల్పితపర్యంక
                        సకల సౌభాగ్య లక్షణనివాస
లక్ష్మీమనోజ్ఞ విలాసివశీకృత
                                   సంభోగసామ్రాజ్యసంతతాభి
రామమూర్తికి వాంఛేతర ప్రపంచ
      మేమి గావలె లీలార్థ మింతె కాని
చిత్ర చిత్ర ప్రభావ  !దాక్షిణ్యభావ!
                 హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!       96

                 ఆంధ్రదేవా! కోరుకున్న కోర్కేలను తీర్చే ఆ వైకుంఠపురము నందలి ఆ మూల నున్న నవ్య దివ్య సౌధానికి ఎడమ వైపున విలసిల్లెడి సరస సుందరమైన కల్పవృక్షపు తోటలో, అమృత సరస్సు ప్రక్కన  చంద్రకాంత శిలా వినిర్మితమైన వేదిక పైన పరచ బడిన కలువపూల పాన్పు మీద ఇల్లాలైన లక్ష్మీదేవి తో కూడి సరస సౌఖ్యాలలో  తేలియాడే మధుర మోహన సుకుమార మూర్తి వైన నీకు ఆటకాయతనం కాకపోతే ఈ లోకము నందలి ఈ ఇతర మైన ఆపేక్షలు ఎందుకు స్వామీ !

                   శతకం చివరి కొచ్చేసింది. కవి  తన వ్యధ నంతటిని వెళ్లబోసుకున్నాడు. ప్రార్థించాడు. స్తుతించాడు. నిందించాడు. బెదిరించాడు. బ్రతిమలాడాడు. అర్ధించాడు. తుదకు నైరాశ్యానికి వచ్చాడు. అయినా నీలాంటి వాడికి  ఇవన్నీ ఎందుకయ్యా! ఏదో మా  భ్రాంతి గానీ! లక్ష్మీదేవి తో కలిసి హాయిగా అల వైకుంఠ పురంబు లో  “విహరించే నీకు అంటూ నిష్ఠూర మాడుతున్నాడు.ఇక్కడ కూడ భక్తకవి బమ్మెరపోతన చూపిన మార్గం లోనే వైకుంఠాన్ని , ఆమూల సౌధాన్ని , దాని సమీపం లోని కల్పవృక్ష వనాన్ని , దానిలోని అమృత సరోవరాన్ని , దాని చెంత నిర్మితమైన చంద్రశిలా వేదికను , దానిపై మెత్తగా పరచిన కలువ పూల పాన్పు ను , దానిపై ల్లాలి తో సరస క్రీడలలో నున్న సుకుమార మూర్తిని మనసారా దర్శించి, తనువెల్లా  పులకించి పోయాడు పురుషోత్తమకవి.
                                    ఈ పద్యం  ముమ్మూర్తులా  పోతన గారి ఆంధ్రమహాభాగవతం లోని  గజేంద్ర మోక్ష ఘట్ట లోనిది వలే ఉన్నదన్న విషయం విజ్ఞులకు తెలుసు. అయితే  ఈ నెపం తో మనసారా ఆ పద్యాన్ని మరొక్కసారి స్మరించుకొని తన్మయులమౌదాం.
             
              అల వైకుంఠ  పురంబు లో నగరి లో నా మూల సౌధంబు దా
                 పల మందార వనాంతరామృత సర ప్రాతేందు కాంతోప లో
                 త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
             హ్వల నాగేంద్రమ  పాహి పాహి  యన కుయ్యాలించి సంరంభియై. ( ఆం.మ భా.8 -9) 


                                          గుఱుతుగ సద్భక్తకోటి కీనాఁటికి
విడరాని బహుఋణస్థుఁడవు నీవు
సేవకు లెన్నెన్ని త్రోవలఁ జనుచున్న
వదలక యనుసరించెదవు నీవు
నిజదాసు లాత్మేచ్ఛ నిలిపి రెచ్చో నిన్నుఁ
దొలఁగ కచ్చోటనే నిలచె దీవు
శ్రితు లంబలియు నైనఁ జేఁ జూప నది యెంత
యమృతభోగంబుగా నలరె దీవు
జగము లన్నియు నీకు వశ్యము లటంటి
వీవు నిజదాసవశ్యుఁడ వెంత ఘనత?
చిత్ర చిత్ర ప్రభావ  !దాక్షిణ్యభావ !
                  హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ               97
                       
        శ్రీకాకుళాంధ్రదేవా ! నిజం చెప్పాలటే నీకు నీభక్తులతోటి ఋణానుబంధమే ఉంది.  ఎందుకంటే వాళ్లు ఎక్కడకు పోతే  వదిలిపెట్టకుండా నీవు అక్కడకు వెడతావు. అంతేకాదు  నీ భక్తులు నిన్ను వాళ్ల ఇష్టానుసారం  ఎక్కడ ప్రతిష్ఠిస్తే అక్కడే ఉంటావు కాని పిసరంత కూడ అటు ఇటు కదలవు. నీ భక్తులు  నీకు నివేదనగా గంజి  తీసుకొచ్చినా దాన్నే అమృతోపమం గా స్వీకరిస్తావు. లోకమంతా నీ వశం లో ఉందంటారు కాని నీవు మాత్రం భక్తపరాథీనుడవై  భక్తుల చెప్పుచేతల్లో ఉంటావు. నీ వెంత గొప్పవాడివయ్యా స్వామీ !

                                     




                                           వెనుక వేసుకొని యుర్వీనాథకోటులు
సైంథవుఁ గావంగఁ జాలినారె?
ధర నేయు తన సుతు శిర మెవ్వఁడతఁ డీల్గ
శాపించి సింధురా జోపినాఁడె?
సాటింతు నా సర్వసైన్యంబు లని కర్ణు
చేశక్తి నరు నేయఁ జెప్పినారె?
పరులచే నొవ్వని పంతంబు గలభీష్ము
డర్జునాస్త్రంబుల కాఁగినాఁడె?
మనుజ యత్నంబు బల మెంత మాత్ర మీవు
నిజము కరుణించు నాతఁడే విజయుఁ డరయ
చిత్ర చిత్ర ప్రభావ !దాక్షిణ్యభావ!
హత విమతజీవ !శ్రీకాకుళాంధ్రదేవ!       98

                      దేవా! నీవు ఎవ్వరినీ కరుణిస్తావో వాడే విజయుడౌతాడు కాని ఎంత ప్రయత్నించినా  మానవ ప్రయత్నం  నీ కరుణ లేకుండా విజయం సాధించదు కదా ! భారతయుద్ధం లో రాజులందరూ కలిసి సైంధవుణ్ణి కాపాడాలని ప్రయత్నించినా  కాపాడలేకపోయారు కదా? తన కుమారుని శిరస్సును భూమి మీద వేసినవాడు శిరస్సు పగిలి మరణిస్తాడని శపించిన  సింధురాజు బ్రతికి బట్టకట్టాడా?  నా సైన్యాన్నంతటినీ కాపాడతానని శక్తిని  సంపాదించిన కర్ణుడు అర్జునుని ఏమిచేయగలిగాడు? ఇతరులచే ఏనాడు ఓడించబడని పితామహుడు అర్జునుని ముందు నిలవగలిగాడా? లేదుకదా ! అందుకే నీ అనుగ్రహం లేకపోతే  అన్నీ ఉండి కూడ లేనిదే ఔతుంది కదా ప్రభూ!


                                           ఆగామి సంచిత ప్రారబ్ధము లటుండ
నిజజన్మమందు నే నెల్లవేళ
నఘములే చేసితి నని యుష్మత్సుధా
సదృశ నిర్హేతుక జాయమాన
కరుణాకటాక్ష వీక్షణ మెంచ కెప్పుడో
ప్రసరింపవలె నే నపారదురిత
వారధిఁ దరియింపవలెఁ గాని గతి యితః
పర మెఱుంగను భక్తపాలనాంక!
శేషపర్యంక! రాజ్యలక్ష్మీ సహాంక
ప్రధన నిశ్శంక! యదుకులాంబుధి శశాంక!
చిత్ర చిత్ర ప్రభావ !దాక్షిణ్యభావ!
                                        హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!                    99

                            ఆంధ్రదేవా. ! ఆగామి , సంచిత ,ప్రారబ్ద ఖర్మ ల సంగతి అటుంచితేఈ జన్మలో మాత్రం నేను అనేకమైన పాపకర్మలను చేశాను. నీయొక్క అమృతమయమైన  నిర్హేతుకమైన కరుణాకటాక్షాలను నాపై ప్రసరింపచేయి స్వామీ !  అంతులేని పాపమనే   ఈ సముద్రాన్ని నేను తరించాలి. నీవు తప్పితే నాకు వేరు విధమైన ఆధారం కాని ,గతి కాని లేదు. నీవే నాకు దిక్కు. భక్తులను కాపాడటమనేబిరుదును దాల్చిన వాడా ! శేషశయనా ! రాజ్యలక్ష్మీ సమేతా ! యుద్ధ విశాదుడా ! యాదవ కులమనే సముద్రమునందు ఆవిర్భవించిన చంద్రమా ! నన్ను కాపాడే భారం నీదేనయ్యా.

నీవే తప్ప నిత: పరం బెరుగ మన్నింపందగు దీనునిన్
 రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా  అంటాడు గజేంద్రుడు ఆంధ్రమహాభాగవతం లో. ఇది భక్తునిలో వచ్చిన పరిపక్వత  కు సూచన.భక్తుని లో అహంకారం నశించినప్పుడే శరణాగతతత్త్వం అలవడుతుంది అదే ఆత్మ సమర్పణ కు దారి చూపుతుంది.  కవిలో ఆ పరిణామ దశ  స్పష్టం గా కన్పిస్తోంది. శతక ప్రారంభం లో నీ సంగతి చెపుతా  చూడమని  డబాయించిన కవి చివరలో ప్రాధేయపడుతూ, నీవు లేకపోతే నేను లేను అనే దశకు వచ్చాడు.

                                        పూర్వ కవీంద్రులు పుణ్యఫలం బేమి
సాక్షాత్కరించి యస్మత్పరంబు
గా గద్యపద్యముల్‌ గల్పించు మనిన వే
వ ర మొసంగితి వండ్రు వాంఛఁ జేసి
నేర్చి నట్లుగఁ గూర్చి నేఁటి కవిత్వంబు
నీకంకితముఁ జేసి నెనరు దోఁపఁ
జేదోయి యొగ్గిన శ్రీపాదరజ మింత
నామీఁదఁ బాఱ నీ వేమి సామి
కృపకుఁ బాత్రముఁ జేయు మక్షీణభాగ్య
లక్షణాంచిత పాదపల్లవకరాబ్జ!
చిత్ర చిత్ర ప్రభావ  ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ !శ్రీకాకుళాంధ్రదేవ!  100
                              ఆంధ్రదేవా !   శ్రీ లక్షణాంకిత పాదపపల్లవ కరాబ్జా! పూర్వకవులు తమ పుణ్య వశాన నీవు వారికి సాక్షాత్కరించి నీకు అంకితం గా గద్యాత్మకమైన కావ్యాలు వ్రాయమని ఆజ్ఞాపించి , వారిని కరుణించావని చెప్పేవారు కాని నేను నేర్చిన నేటి కవిత్వాన్ని నీ కంకితము గా వ్రాసి, నీకు సమర్చించి, నీ ముందు దోసిలొగ్గి నిలబడ్డాను. నన్ను నీ అనుగ్రహానికి పాత్రుణ్ణి చేసి , నీ శ్రీ పాదరజాన్ని నాపై జల్లుము స్వామీ .
కావ్యదోషము లెఱుంగని మత్కవిత్వంబు
విద్వన్నుతంబుఁ గావించినావు
బహిరంత రింద్రియ పరిశుద్ధి లేని నా
తలఁపులోపల వచ్చి నిలచినావు
పుణ్యకర్మ మొకింత పూని సేయని నన్నుఁ
బెద్దలచేత మెప్పించినావు
పురుషప్రయత్నంబు గురు తెఱుంగని నన్ను
భుక్తి గల్గఁగ జేసి ప్రోచినావు
పతితుఁ జేపట్టినావు చేపట్టినావె
యన్యగతిఁ బోవనీయకు మార్తరక్ష!
చిత్ర చిత్ర ప్రభావ !దాక్షిణ్యభావ!
హత విమతజీవశ్రీకాకుళాంధ్రదేవ!    101
     
                       స్వామీ ! ఆర్తజన రక్షకా ! కావ్యలక్షణాలు ,దోషాలు తెలియని నా కవిత్వాన్ని విద్వాంసులు మెచ్చుకొనేటట్లు చేశావు. బాహ్యశుధ్ధికాని , అంతరంగశుధ్ధి కాని లేని నావంటి వాడి మదిలోకి వచ్చి నిలిచి  నన్ను పవిత్రుని చేశావు. కొంచెం కూడ పుణ్యం చేయని నన్ను పెద్దలు మెచ్చుకునేటట్లు చేశావు.  పురుష ప్రయత్నమే చేయని నాకు బతుకు తెరువు చూపించావు. ఈ భ్రష్టుడిని ఎలాగూ చేపట్టావు .ఇంక ఏ మాత్రం వదిలి పెట్టకు స్వామీ !


                                         శబరి యెంగిలిపండ్లు చవిఁజూచు ననుకంప
 కుబ్జ గంధము పూఁతఁ గొన్నకరుణ
పాంచాలి కోర సాపడిన దయారతి
 గోపమ్మ యుగ్గుఁబాల్‌ గ్రోలుకృపను
మాలికుఁ డొసఁగు తోమాలెఁ దాల్చినప్రేమ
 ద్విజుని కొం గటుకులు దిన్నకూర్మి
గుహుఁడు పాదములు బట్టుట కుబ్బు నెనరును
 నుడుతదాస్యమునకుఁ బొడము ప్రేమ
శతక మంగీకరింపుము జగతి జనకుఁ
డర్భ కావ్యక్త భాషల నలరి నట్లు
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!  102

               ఆంధ్రదేవా ! శబరి ఇచ్చిన యెంగిలి పండ్లు తిన్న దాక్షిణ్యం,కుబ్జ  అందించిన గ్దాన్ని తీసుకున్న కరుణ, పాంచాలి  వేడుకోగా సహాయపడిన దయాగుణము ,గోపమ్మ చనుబాలు త్రాగిన కృపాగుణము , మాలికుడిచ్చిన పూలమాలను దాల్చిన  ప్రేమ , బ్రాహ్మణుని ఉత్తరీయపు  అంచున కట్టిన అటుకులను తిన్న ఆత్మీయత , గుహుడ పాదాలు కడగటానికి ఇచ్చిన చనవు , ఉడుత సాయాన్ని అంగీకరించిన ప్రేమ  వీటన్నింటినీ ఒక్కసారి తలచు కొని ఈ నాశతకాన్ని స్వీకరించు. ఎందుకంటే ఈ లోకం లో తండ్రి తన చిన్ని కొడుకు వచ్చీ రాని మాటలను విని ఆనంద పడినట్టు అర్భకుడనైన నా శతకాన్ని నీవు అంకితం తీసుకోవాలి  స్వామీ !

                         తన శతకాన్ని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఎందుకు అంకితం తీసుకోవాలో  చెపుతూ కవి చూపించిన ఉపపత్తులు అద్భుతం గా ఉన్నాయి.ఇంతకంటే ఒక భక్తకవి తన స్వామి కి ఏమని చెప్పుకోగలడు. ఆనాడు రామచంద్రుడు శబరి కొఱికి ఇచ్చిన ఎంగిలి పండ్లను ఎందుకు తిన్నాడో , కుబ్జ ఇచ్చిన గంధాన్నిమధురా నగర ప్రవేశ సందర్భం లో  శ్రీ కృష్ణుడు ఏ  కరుణ తో తీసుకున్నాడో , పాంచాలి ప్రార్ధన ను మన్నించి   ఎటువంటి దయతో  నిండు సభ లో ఆణె మానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కాపాడాడో, ఉడుత సహాయాన్ని మన్నించి ఆ నాడు రాముడు ఏ ప్రేమ తో దాన్ని ఆదరించాడో అదే కరుణ ,అదే ప్రేమ , అదే దయ , అదే స్నేహము నామీద కూడ చూపించమని ప్రాధేయ పడుతున్నాడు పురుషోత్తమ కవి. అంతే కాకుండా మాటలు వచ్చీరాని కొడుకు పలికే తొక్కు పల్కులకు తండ్రి ఆనందపడతాడు కదా . అలాగే  వచ్చీరానిదనుకున్నా నా కవిత్వాన్ని  పసివాని పల్కుల వలే  స్వీకరించి నన్ను కరుణించమని అర్ధిస్తున్నాడు.



                                    శతక మొకటి 'మనసా హరిపాదము
 లాశ్రయించవెయని యల్లినాఁడఁ
గరిమ 'రామా! భక్త కల్పద్రుమా!యని
యొప్పగా శతకంబుఁ జెప్పినాఁడ
నలరులదండ మీ కనఁగ 'హంసలదీవి
 గోపాల శతకంబుఁగూర్చినాఁడ
యుష్మ దంకితముగా నూహించ శతకమే
 నంచితంబుగ రచియించినాఁడ
భవదనుగ్రహ కవితచేఁ బ్రబలువాఁడ
నవని గాసుల పురుషోత్త మాఖ్యవాఁడ
చిత్రజిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ!
హతవిమతజీవ!శ్రీ కాకుళాంధ్ర దేవ!  103

                  ఆంధ్రదేవాఇంతకు పూర్వము  “మనసా హరిపాదము లాశ్రయింపవేఅన్ మకుటం తో ఒక శతకాన్ని  వ్రాశాను.ఆ తరువాత “రామా భక్త కల్పద్రుమా” అనే మకుటం తో మరొక శతకం చెప్పాను. నీకు పూలమాల వలే “హంసలదీవి గోపాలశతకాన్ని” అందించాను.  నీ దయతో అబ్బిన కవితాశక్తి తో ఇప్పుడు ఈ శతకాన్ని నీకు సమర్పిస్తున్నాను. నన్ను కాసుల పురుషోత్తమ కవి  అని పిలుస్తూ ఉంటారు.

                                    అంటూ కాసులపురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతాన్ని పూర్తి చేశాడు.ఈ శతకం లో మరికొన్ని పద్యాలున్నట్లు పాఠభేదాలు కన్పిస్తున్నాయి కాని శైలి విషయం లోను , భావగాంభీర్యం లోను పురుషోత్తమ కవి పద్యాలు గాఅన్పించకపోవడం వలన వాటిని వదిలి వేశాను. దీనిలో కూడ చివరి రెండు మూడుపద్యాలు ఆయనవి కావేమోననిపించేట్లు గా ఉన్నాయి.  భవతు నామ.
                                       నా ఈ వ్యాఖ్యానాన్ని ఆదరిస్తున్న పాఠకులకు కృతజ్ఞతలు.త్వరలో మరొక విశేష విషయం తో మళ్లీ కలుద్దాం.

                    ఇది   కాసుల పురుషోత్తమకవి  వ్రాసిన ఆంధ్రనాయక శతకము నకు
  తేజస్వినీ వ్యాఖ్య సంపూర్ణము.

No comments: