శతకసౌరభాలు -8
జయ జయ శ్రీనివాస- శ్రీవల్లి -1
జయజయ శ్రీనివాస అనే పేరుతో రచయిత్రి శ్రీవల్లి రచించిన తేటగీతి శతకం ఇది .ఈ శతకం లో తిరుమల వాసుని
దివ్యదర్శనానికి తహతహలాడే జీవుని వేదన
తేటతేట తెలుగు పదాలతో ముగ్ధమనోహరంగా వర్ణించబడింది. ఆ తిరుమల వాసుని దర్శనం భూలోకవాసులకు కల్గించే
ఆనందాన్ని అక్షరాల్లో వర్ణించడం పదివేల
పడగల ఆ ఆదిశేషువు కు కూడ అసాధ్యమన్న విషయం జగద్వితమే. ఆ ఆనంద నిలయుని సురుచిర
సుందర రూపాన్ని ఎంతసేపు దర్శించినా తనివి తీరని తపన కోట్లాది మంది భక్తులకు అనుభవైకవేద్యమే
.
రచయిత్రి ఆ ఏడుకొండలవాని
అనంతమయ తేజోరూపాన్ని దర్శించి
పొందిన ఆనందం , ఆ పద్మావతీ ధవుని
స్నిగ్ధ దరహాస చంద్రికలు తనను నిలువెల్లా
తడివి పులకరింపచేస్తే ఆ పులకలు ఆమని మొలకలై, కవితలు గా వెలికివచ్చి , తనివి తీరని
ఆనందంతోశతకరూపాన్ని పొందాయి.
రచయిత్రి పేరు శ్రీవల్లి యని ముఖపత్రం(Title page) మీద ప్రకటించబడింది. కాని అది చూడగానే ఇది అసలు
పేరు కాదేమో నని , కలం పేరు( Pen name) అయ్యుంటుందని
అనిపించింది. అందుకు ఆధారంగా 108 వ పద్యం
లో-
అందుకో
అనురాగ మరంద పూర్ణ
మన్న పూర్ణేశ్వరీ హృదయాంబుజమ్ము
వందరేకులు వలపులు చిందుచుండె
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస!
శతకాన్ని
పూర్తి చేసిన ఆనందం అన్నపూర్ణేశ్వరి హృదయం నుండి శతదళ పద్మమై వలపులను చిందించింది.
ఆ ఆనందనిలయుని పై ఒక అచ్చ తెలుగు ఛందస్సు
లో తెలుగు వారి హృదయాలకు చేరువుగా ఒక
శతకాన్ని వ్రాసి, ఆ తిరుమలగిరి
రాయని కి సమర్పించిన ధన్యజీవి రచయిత్రి. ఆ ఏడుకొండలవానికి తన చిరుపొత్తాన్ని అంకిత
మిస్తూ ఇలా అంటుంది.
అణువణువు కూడ నీకె సమర్పితమ్ము
అక్షరమక్షరమ్ము నీ కంకితమ్ము
ఏడుకొండలసామి గ్రహింపవేమి
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!
ఈ శతకాన్ని 1980
కృష్ణాపుష్కరాల ప్రచురణ గా తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రచురించింది. ముఖపత్రం మీద 1981 అని , ముఖపత్రం
చివరిపేజి క్రింద 15-1 82 అని , రెండవపేజీ లో 1980 అని ఉంది. నేను మాత్రం ఈ
పుస్తకాన్ని 21-9-92 న పుష్కరవేళ విజయవాడ
లో కొన్నాను. ఎందుకంటే పాఠకులకు పుస్తకానికి సంబంధించిన ముద్రణ సమాచారాన్ని
అందించడానికి మాత్రమే ఈ ప్రస్తావన.
ఈ
శతకం “స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!” అనే మకుటం తో తేటగీతి ఛందస్సు లో వ్రాయబడింది. ఈ శతకం లో 108 పద్యాలున్నాయి . శ్రీ తిరుమల తిరుపతి దేవస్ధానం వారు శ్రీనివాస బాలభారతి – క్రమంలో ఈ గ్రంధాన్ని 17 వ గ్రంధం గా
అందించింది. ఈ జయజయ శ్రీనివాస అలతి అలతి
పదాలతో మధురభక్తి భావ గుంఫితమై పాఠక హృదయాలను రసవాహిని లో ఓలలాడిస్తుంది. ఈ శతకం
లో రచయిత్రి కొన్నియెడల మీరాబాయి
మధురభక్తి, కొన్నియెడల రాధాదేవి ప్రణయ తత్వాన్ని, మరికొన్ని యెడల గోపభామల పారవశాన్ని
, పలుతావుల అన్నమయ్య ఆరాథనాభావాన్ని బహుభంగుల
ప్రదర్శించి , ఒకే నర్తకి బహురూపుల
నర్తించి రక్తి కట్టించినట్లు శ్రీ శ్రీవల్లి తిరుమలవాసుని శ్రీచరణ మంజీరమై
నర్తించి తరించింది.
ఇటువంటి రచనకు నాలుగు మాటలు వ్రాసే భాగ్యం నాకు లభించడం ఆ తిరుమలవాసుని అనుగ్రహం గానే
భావిస్తున్నాను.
ఓం నమో వేంకటేశాయ.
శ్రీకరంబైన తిరుమల
శిఖరి కరుణ
కాకరంబైన దివ్యమహస్సు
దాల్చి
ఆర్తులను బ్రోచు
కళ్యాణమూర్తి వీవు
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!
సర్వ శుభములను
అందించెడి ఈ తిరుమల కొండపై కరుణాసముద్రుడవై నిలిచి ,దివ్యమైన మహత్వముతో ఆర్తులను
ఆదుకొనెడి చిరుదరహాస భాసా ! తిరుమలవాసా ! శ్రీనివాసా! జయము. జయము.
నీకు జయమగు గాక !.
ఏడుకొండలపైన నీరేడు జగము
లేడు గడ యంచు నమ్మి
నిన్ వేడుకొనగ
నిండుకొలువున్న
బంగారుకొండ వీవు
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!
ఆపద మొక్కుల వాడా ! అడుగడుగు దండాల వాడా! ఈ ఏడేడు లోకాలకు రక్షకుడవు నీవే నని నమ్మి నిన్ను ప్రార్ధించగా
ఏడుకొండలపైన నిండుగా కొలువున్న బంగారు కొండవు నీవు. సుమ సుందర దర హాసా ! తిరుమల వాసా ! నీకు జయము. జయము.
మోహ గాఢాంధ కార
విమోచనములు
సురుచిరోదార చైతన్య
సూచనములు
లోక బాంధవ నీ
దివ్యలోచనములు
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!
సుమధుర సుందర దరహాసా ! శ్రీ శ్రీనివాసా ! నీ దివ్య నేత్రములు మోహమనే గాఢాంధకారాన్ని తొలగించి , కాంతిమయమైన
చైతన్యాన్ని దర్శింపచేసి , సర్వలోకాలను తేజోమయం చేసేవి స్వామీ ! .
విశ్వ విశ్వంభరా
పర్యవేక్షణములు
రచిత నిత్య జగత్త్రయ
రక్షణములు
వేంకటేశ్వర భవదీయ
వీక్షణములు
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!
శ్రీవేంకటేశ్వరా ! నీయొక్క చల్లని చూపులు సమస్తమైన
విశ్వాన్ని అవలోకిస్తూ , ముల్లోకాలను సర్వ వేళలా సంరక్షిస్తూ ఉండేవి కదా స్వామీ
!.
సరస రాకా సుధాకర స్వామి
వీవు
నిండు గుండెల
పండువెన్నెలను నేను
పొరలి ప్రవహింతు నీ
శుభంకర కరాల
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!
శ్రీ శ్రీనివాసా ! నిండుపున్నమి చందమామవు
నీవు. నిండుగా గుండెలను పులకరింప జేసెడి
పండువెన్నెలను నేను. శుభంకరమైన నీ చేతులలోచేరి
పులకించి ప్రవహిస్తాను ప్రభూ !.
చిద్వలాసుడైన శ్రీనివాసుని చేతులలో
లీలగా వెన్నెల సోనగా వాలి సోలి పోవాలనే
మధురమైన కోరిక రచయిత్రిది.
నిత్య పరిపూర్ణ
రసపయోనిధి వి నీవు
లలిత లావణ్య శృంగార
లహరి నేను
కలసి పోయెద నీ తరంగముల
స్వామి
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!
ముగ్ధ మనోహర
సుందర హాస భాసా ! శ్రీ శ్రీనివాసా !
నీవు నిత్య పరిపూర్ణ రసాంబుధివి. నేను లలిత లావణ్య శృంగార ప్రవాహమునై, నీ
తరంగముల ,కలసిపోయి నీలో లీనమై పోతాను
స్వామీ !.
పతితపావన వేదసంహితవు నీవు
పరమ సుకుమార భాస్వర
స్వరము నేను
నీ పదము లంటి
చరియింపనిమ్ము నన్ను
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
శ్రీ ఏడుకొండల వేంకటేశ్వరా!
పరమ పవిత్రమైన వేదసంహితవు నీ వైతే నేను
వేదమును ప్రకాశింపచేసెడి పరమ సుకుమార స్వరాన్నై నీ పాదాల నాశ్రయించి తరించే
భాగ్యాన్ని నాకు ప్రసాదించు స్వామీ
!.
ముగ్ధమోహన గోపాలమూర్తి వీవు
కావి కెమ్మోవి పిల్లన గ్రోవి నేను
సృష్టి పులకింపగా ధ్వనించెదను నేను
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!
తిరుమలగిరి వాసా ! నీవు ముగ్ధ మోహన
సుకుమార సుందర మోహన రూపుడవైన గోపాలుడవు నీవు.
మధురమైన నీ ఎఱ్ఱని పెదవి పై రాగాలు పలికెడి వేణువు నేనై ఈ సృష్టి సర్వము
పులకించేటట్లు మధురంగా ధ్వనిస్తాను ప్రభూ
!.
తిరుమల వాసుని గూర్చి వచ్చిన గ్రంథాలు
చిన్నవి, పెద్దవి కలిపి లక్షల్లో ఉండి ఉండవచ్చు. వానిలో తాను కూడ కలిసిపోయి ఆ
కమలానాథుని వర్ణించిన ఒక రచయిత్రి గా
మిగిలిపోవాలని శ్రీ శ్రీవల్లి కోరిక. అందుకే ఆ మోహనరూపుని పిల్లనగ్రోవిని తానై సృష్టి పులకించగా
ధ్వనిస్తానని కోరుకుంటోంది. ఈ జయజయశ్రీనివాస
అనే పిల్లన గ్రోవి సృష్టించిన కవనమే మధుర నాదమే ఈ
సృష్టి ని పులకింప చేస్తుందని కవయిత్రి మాటల్లో ధ్వని.
నిత్య సుందర సాహిత్య సత్య మీవు
విశ్వ మంగళ భావనావేశ మేను
అంకితమ్మౌదు నీదు ప్రేమాంకము నకు
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస! (15)
శ్రీ పద్మావతీ
మనోహరా ! సత్యము నిత్యము సుందరము నైన సాహిత్యానివి నీవైతే విశ్వ శుభంకరమైన భావావేశాన్ని నేనై ప్రేమమయ మైన నీ అంకసీమ ఒదిగిపోయి నన్ను నీకు అంకితం చేసుకొని నీలో
లీనమై పోదును స్వామీ !
నిత్య కళ్యాణ సౌందర్య
నిధివి నీవు
వికచ సురభిళ వకుళ మాలికను
నేను
నీదు గళసీమ నన్ను
రాణింప నిమ్ము
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
శ్రీనివాసా ! నీవు నిత్యకళ్యాణ సౌందర్య రాశివి. నేను వికసించి పరిమళించెడి పొగడ పూల
మాలికను. ఈ పొగడపూల మాల నీ గళసీమ ను అలంకరించెడి అదృష్టాన్ని ప్రసాదించు ప్రభూ ! .
నిర్మలంబైన శబ్దసన్నిధివి నీవు
యోగ్యమైనట్టి భావసౌబాగ్య మేను
లోకమున చిల్కెదము రసశీకరములు
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!
శ్రీనివాసా ! నీవు శక్తి వంతమైన శబ్దానివి. నేను అర్ధవంతమైన భావ సౌభాగ్యాన్ని. మనమిద్దరము ఏకమై ఈ
లోకాన రసబిందువులను చిలకరిద్దాము.
కవికులతిలకుడైన మహాకవి
కాళిదాసు పార్వతీ పరమేశ్వరుల యోగాన్ని
వాగర్ధాలతో ఉపమించిన వైనం రసజ్ఞులకు పరిచయ పూర్వమే. ఆ శ్లోకాన్ని ఒక్కసారి మననం
చేసుకుందాం.
వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ :ప్రతిపత్తయే
జగత:
పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !!
ముగ్ధ మోహన
కారుణ్యమూర్తి వీవు
సరస మంజుల కరుణారసమ్ము నేను
కరగి ప్రవహింతు నీ వాలుగనుల యందు
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
(18)
శ్రీ వేంకటేశా ! ముగ్ధమోహన
కారుణ్య మూర్తివి నీవు . సరస మంజుల
కరుణ రసాన్ని నేను. కరుణరసమైన నేను కరిగి
కారుణ్య మూర్తి వై, భక్తులను కటాక్షించెడి
నీ వాలు కనుల నుండి ప్రవహించెడి భాగ్యాన్ని
నాకు ప్రసాదించు స్వామీ ! .
నీవు నటరాజు నేను నీ పావనాంఘ్రి
కాపురంబుండు సౌవర్ణ నూపురమును
పొంగి పులకింతు నీ నాట్య భంగిమముల
స్నిగ్ధ
దరహాస! జయజయ శ్రీనివాస! (20)
సుందర దరహాసా ! శ్రీ శ్రీనివాసా !
నీకు జయము. నీవు నటరాజమూర్తివైతే నేను నీ
పవిత్ర పాదముల నంటిపెట్టుకొని ఉన్న బంగారు
మువ్వనై , నీవు నర్తించెడి వివిధమైన నాట్యభంగిమల
పొంగి పులకించి పోతాను. నీ పాద మంజీరమై జీవించెడి అదృష్టాన్ని నాకు
కల్గించు ప్రభూ!.
ముగ్ధ సంగీత
శృంగారమూర్తి వీవు
సరస సాహిత్య సౌందర్య
సార మేను
అల్లుకోనిమ్ము
నీ తనూవల్లి నిండ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస! (21)
తిరుమలగిరి వాసా ! మధుర మోహన
సంగీత శృంగార రసైక మూర్తివి నీవు. సరస సాహిత్య సౌందర్య సారాన్ని నేను. సన్నని తీగ
వంటి నీ సుందర మైన శరీరాన్నంతటిని నన్ను గాఢంగా
అల్లుకోనిమ్ము స్వామీ ! నీకు జయయ మగు గాక !
రెండవ
భాగం త్వరలో-----
*******************************************
No comments:
Post a Comment