శతక సౌరభాలు -4
వేమన శతకము -1
తొలకరి వానలో తడవని వాడు , వేమన పద్యం చదువని వాడు తెలుగు వాడు
కాదనేది తెలుగు నాట నానుడి. జీవితం తొలిరోజుల్లో భోగి వేమన గా విలాసాల్లో
తేలియాడిన వేమారెడ్డి తుదకు కామిగాని వాడు
మోక్షగామి కాడని జగతికి తత్త్వగురువై, లోకసంచారం చేసి , వేలాది ఆటవెలదులతో తెలుగుజాతి ముంగిట్లో
విజ్ఞాన జ్యోతులను వెలిగించి ,
మూఢనమ్మకాల్ని నిరసించి , సంఘసంస్కర్త గా ప్రజల మన్ననల నంది , తుదకు కటారుపల్లె లో
జీవసమాధి పొందాడు. తెలుగు భాషకు ఎంతో సేవ
చేసిన ఆంగ్లదొర సి.పి బ్రౌన్ ఆంధ్రదేశం
నలుమూలల నుండి వేలాదిగా వేమన పద్యాలను సేకరించి , అచ్చొత్తించి , వేమన
సాహిత్యాన్ని రాబోయే తరాలకు పదిలంగా
అందించాడు.
పదిహేడవ
శతాబ్దానికి చెందిన వేమన వేలాది
పద్యాలు వ్రాసినట్లుగా చెప్పబడుతున్నా ,3500
పై చిలుకు పద్యాలు మాత్రమే “వేమన పద్య రత్నాకరము “ పేరుతో ముద్రించబడి లభిస్తున్నాయి. తెలుగు లోగిళ్ళ లో వేమన శతకం పఠనీయ గ్రంథమై
పోయింది. అందుకే వేమన పద్యం రాని వాడు
తెలుగు నాట లేడు. “విశ్వదాభిరామ
వినురవేమ “ అనే మకుటంతో ఉన్న ఈ శతకం లో ని
మకుటానికి
అర్ధాలు మాత్రం
రకరకాలు గా చెపుతున్నారు. అభిరామయ్య అనే కంసాలి
వేమనకు స్వర్ణ విద్య నేర్పాడని , ఆ విశ్వాసంతో అతనిపేరు వచ్చేటట్లుగా మకుటం
ఉందని ఒక వాదన. విశ్వదుడైన వాడు అభిరాముడు
. అనగా
భగవంతుడైన వాడు
ఆనందదాయకుడు అని, ఆయనను ఉద్దేశించి ఆత్మయోగి
యై వేమన ఈ పద్యాలను చెప్పాడని మరో వాదన.
నిత్యాన్వేషణ శీలియై లోక సంచారం చేసి మానవజీవితం లోని సత్యాసత్యాలను వివేచించిన మహాయోగి మన వేమన.
అందుకే తెలుగునాట వేమన వాక్కు వేదవాక్కు
అయ్యింది. వేమన యోగం అంతా అన్వేషణ గానే సాగిందని విమర్శకుల అభిప్రాయం. సామాన్యుల
భాష లోనే శక్తివంతమైన ఉపమానాలను ప్రయోగించి తాను చెప్పదలచిన భావాన్ని సూటిగా
పాఠకుని గుండెకు తాకేటట్లుగా చెప్పగలగడం వేమన యోగి ప్రత్యేకత.
వేమన పద్యాలకు
టీకా , వ్యాఖ్యానం అవసరం లేదన్నంతగా అలతి అలతి పదాలతో అనల్పార్ధాల్ని
అందించిన మహాకవి వేమన.అందుకే ప్రజల నాలుక పైనే నాట్యమాడుతూ , శతాబ్దాలు గడిచినా
వేమన పద్యాలు తెలునాట వెలుగులను నింపుతూనే ఉన్నాయి. ఇంతకు ముందు అందించిన మూడు శతకాలకు తేజస్వినీ పేరుతో వ్యాఖ్యానం అందించాను. ఇక్కడ కూడ వేమన వెంటే నడుస్తాను .
నా ఈ blog ని ఆదరిస్తున్న అశేష వీక్షకులకు ముఖ్యంగా ఖండాంతర
, దేశాంతరాలలో ఉండి కూడ మాతృభాషా మాధుర్యాన్ని
ఆస్వాదిస్తూ , తెలుగు భాషామతల్లిని అపురూపంగా ఆదరిస్తున్న సహృదయ వీక్షకులకు (viewers) నిండు మనస్సు తో కృతజ్ఞతా పూర్వక అభివందనాలను అందిస్తున్నాను.
నిక్కమైన
మంచి నీలమొక్కటి చాలు
తళ్కుబెళ్కురాళ్ళు
తట్టెడేల
చాటుపద్య మిలను చాలదా
యొకటైన
విశ్వదాభిరామ వినురవేమ !
జాతి
రత్నానికి ఉన్న విలువ మెఱుగు రాళ్ళ కు
రాదు. వేలాది పద్యాలు ఉన్నా చాటు
పద్యానికి ఉన్న విలువ మిగిలిన వాటికి ఉండదు కదా. వేమన పద్యాలు ఇంద్రనీలమణు లనుకుంటే ఇతర పద్యాలు ఎన్నో రంగురాళ్ళ వంటివే కదా.
గంగిగోవుపాలు
గంటెడైనను చాలు
కడివెడైన నేమి
ఖరము పాలు
భక్తిగల్గు కూడు
పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ
వినురవేమ !
మంచి ఆవుపాలు గరిటెడైన శ్రేష్టమే. గాడిదపాలు
కడివేడైనను ప్రయోజనం లేదు. అదే విధంగా ప్రేమతో పెట్టెడి అన్నం పిడికెడైనా
తృప్తినిస్తుంది.కాని అభిమానం లేని కూడు కుండెడు తిన్నా తృప్తి లభించదు.
ప్రియములేని విందు పిండివంటల
చేటు
భక్తిలేని పూజ పత్రి చేటు
పాత్రమెఱుగని ఈవి బంగారు చేటురా
విశ్వదాభిరామ వినురవేమ !
అపాత్ర దానం వలన ధనవ్యయం తప్పితే ఫలిత ముండదు. ఏ విధంగా
నంటే దేవుని మీద విశ్వాసం లేని పూజ
కు పూలు దండగ. మనసు లో ప్రేమ లేకుండా పెట్టిన విందు భోజనానికి
వంటలు దండగ.యోగ్యుడు కాని వాడికి చేసిన దానం కూడ దండగే అవుతుంది.
మృగమదంబు చూడ మీద నల్లగ నుండు
పరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీ లాగురా
విశ్వదాభిరామ వినురవేమ !
కస్తూరి చూడటానికి నల్లగా
ఉన్నా దాని పరిమళం సమ్మోహనాన్ని కల్గిస్తుంది. అలాగే మంచివారి గుణాలు పైకి కన్పించకపోయినా గొప్పగా ఉండి ,లోకంలో
మెప్పు పొందుతాయి.
మేడిపండు చూడ మేలిమై
యుండును
పొట్ట విచ్చి చూడ
పురుగు లుండు
పిరికి వాని మదిని
బింక మీలాగురా
విశ్వదాభిరామ
వినురవేమ !
మేడిపండు చూట్టానికి పైకి నిగనిగలాడుతూ
కన్పించినా దాన్ని ఒలిచి చూస్తే లోపలన్నీ
పురుగు లుంటాయి. అదే విధంగా పిరికివాడు పైకి ధైర్యంగా డాంబికంగా కన్పించినా వాని లోపల భయం ఉండనే ఉంటుంది.
కులములోన నొక్క గుణవంతుఁ డుండిన
కులము వెలయు వాని గుణము చేత
వెలయు వనములోన మలయజమున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ !
వనములో ఒక్క మంచిగంధం చెట్టు ఉంటే దాని
మూలంగా ఆ వనమంతా గంధపు పరిమళాలు
వ్యాపించి ఆహ్లాదాన్ని
కల్గిస్తాయి. అలాగే కులం లో ఒక్క మంచివాడు పుడితే అతని వలన ఆ వంశానికే ఎంతో పేరు
ప్రతిష్టలు వస్తాయి.
పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు
దృఢము
కులము కన్న నెంచ గుణము
ప్రధానంబు
విశ్వదాభిరామ
వినురవేమ !
దేవుని పూజలు చేసి నంత మాత్రాన
బుద్ధి మంతుడు కాడు. పూజ కన్న నిశ్చలమైన
బుద్ధే ప్రధానము. మంచిమాటలు చెప్పిన దాని కంటే వానిని ఆచరించే దృఢమైన చిత్తశుద్ధి
ఉండాలి. అందుకే కులము కంటే కూడ గుణమే
ప్రధానమని చెప్పబడుతోంది.
వేఱుపురుగు
చేరి వృక్షంబుఁ జెఱచును
చీడపురుఁగు చేరి చెట్టు చెఱచుఁ
కుత్సితుండు
చేరి గుణవంతుఁ జెఱచురా
విశ్వదాభిరామ
వినురవేమ !
వేఱు పురుగు చేరి మహావృక్షాన్ని సైతం సర్వనాశనం
చేస్తుంది. చీడ పట్టిన చెట్టు మొదలంటా ఎండి పోయి
నాశనమై పోతుంది. అదే విధంగా చెడ్డవానితో చేసే సహవాసం
గుణ వంతుని సర్వనాశనం చేస్తుంది.
అల్పబుద్ధి
వాని కధికారమిచ్చిన
దొడ్డవారి
నెల్లఁ దొలగఁ ద్రోచు
చెప్పుదినెడి
కుక్క చెఱకు తీపెఱుగునా
విశ్వదాభిరామ
వినురవేమ !
చెప్పు
తినే కుక్కకి చెఱకు తీపి తెలియనట్లుగా
అల్పబుద్ధి యైన వానికి మంచితనమంటే ఏమిటో తెలియదు కాబట్టి అల్పబుద్ధిగలవానికి అధికారం ఇస్తే మంచివారి నందరిని ఉద్యోగాల్లోంచి
తీసేస్తాడు. మంచితనం లోని తీయదనం దుర్మార్గుడుకి
తెలియదు కదా !
విద్యలేనివాడు
విద్యాధికుల చెంత
నుండి నంతఁ
బండితుండు కాడు
కొలని హంసలఁ కడ
కొక్కెర యున్నట్లు
విశ్వదాభిరామ
వినురవేమ !
చదువురానివాడు పండితుల చెంత ఉన్నంత మాత్రం చేతనే
పండితుడైపోడు.ఎందుకంటే సరోవరంలో హంసలతో కొంగలు ఉంటున్నాయి కదా ! మరి ఏనాడైనా ఒక్క కొంగ అయినా హంసగా మారిందా ? లేదు కదా !
పాముకన్న లేదు పాపిష్టి జీవంబు
అట్టి పాము జెప్పి నట్టె వినుము
ఖలుని గుణము మాన్ప ఘనులెవ్వరును లేరు
విశ్వదాభిరామ
వినురవేమ !
పాము కంటే ప్రమాదకరమైన విష జంతువు మరొకటి లేదు కాని ఆ పామును
కూడ మచ్చిక చేసుకొని చెప్పినట్టు చేయించవచ్చును. కాని దుర్మార్గుని
గుణాలను మార్చడమనేది ఎంత గొప్పవారికైనా
సాధ్యంకాదు.
వేము పాలు
వోసి ప్రేమతోఁ బెంచిన
చేదు విఱిగి
తీపి చెంద బోదు
ఓగు నోగేఁగాక యుచితజ్ఞుఁ డెటులౌను
విశ్వదాభిరామ
వినురవేమ !
వేపచెట్టు కి పాలుపోసి పెంచినా దాని సహజసిద్దమైన చేదు
పోయి తీపిదనం రాదు. అదేవిధంగా చెడ్డవాడు చెడ్డవాడే కాని ఎన్ని మంచి మాటలు చెప్పినా చెడ్డవాణ్ణి మంచి
వానిగా మార్చలేము.
పాలు
పంచదార పాపరపండ్ల లో
జాల
బోసి వండఁ జవికిరాదు
కుటిల
మానవులకు గుణమేల కల్గురా
విశ్వదాభిరామ
వినురవేమ !
పాపర పండ్లు
కటికచేదుగా ఉండే పండ్లు. అటువంటి పండ్ల లోని చేదు పోవడానికి పాలు, పంచదార
పెద్దమొత్తంలో గుమ్మరించి వంటచేసినా
చేదుపోనట్లే దుర్మార్గులకు మంచిబుద్ధులు చెప్పి ఎంతగా
మార్చుదామనుకున్నా ఫలితం ఉండదు. వారి లోని
దుర్గుణాలు ఎంతకు పోవు కదా. !
ముష్టి వేపచెట్టు మొదలంట ప్రజలకు
బరగ మూలికలకుఁ బనికి వచ్చు
నిర్దయాత్మకుండు నీచుఁ డెందులకౌను
విశ్వదాభిరామ వినురవేమ !
వేపచెట్టు
చేదు గల్గిన చెట్టయినా కూడ దాని అన్నిభాగాలు మూలికలుగా వైద్యానికి ఉపయోగపడతాయి.
కాని నిలువెల్ల చెడును అంటే దుర్మార్గపు ఆలోచనలను నింపుకున్న నీచుడు ఎందుకూ
ఉపయోగపడడు కదా. !
కాని వారి తోడఁ
గలసి మెలగుచున్నఁ
గాని వాని గానె
కాంతు రవనిఁ
తాటి క్రిందఁ
బాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ
వినురవేమ !
చెడ్డవారితో కలిసి తిరుగుతుంటే మనల్ని కూడ చెడ్డవారి గానే ఈ లోకం భావిస్తుంది.
ఎందుకంటే తాటిచెట్టు క్రింద కూర్చొని పాలుతాగినా చూసేవారు కల్లు తాగుతున్నావనే
అనుకుంటారు కదా !
తామసించి
చేయదగ దెట్టి కార్యంబు
వేగిరింప
నదియు విషమె యగును
పచ్చికాయఁ
దెచ్చి పండింప ఫలమౌనె
విశ్వదాభిరామ
వినురవేమ !
ఆవేశంతో ,
కోపం తో ఏ పని చేయకూడదు. తొందరపడి చేస్తే
ఆ పని పాడైపోవచ్చు. ఎందుకంటే పచ్చికాయ ను తెచ్చి పండపెడితే మాత్రం అది
ఫలమవ్వదు కదా ?
కోపమునను ఘనత
కొంచెమై పోవును
గోపమునను మిగుల గోడు
గలుగు
గోప మడచె నేని
గోర్కెలు నీడేరు
విశ్వదాభిరామ
వినురవేమ !
మన లోని
గొప్పతనం కోపం మూలం గా తగ్గిపోతుంది. కోపం వలన మిక్కిలి ఇబ్బందులు కలుగుతాయి. కోపాన్ని తగ్గించుకుంటే కోర్కెలను సాధించుకోవచ్చు.
నీళ్ళమీద నోడ
నిగిడి తిన్నగ బ్రాకు
బైట మూరె డైన
బాఱ లేదు
నెలవు తప్పుచోట
నేర్పరి కొరగాడు
విశ్వదాభిరామ వినురవేమ !
నీటి మీద పడవ ఒడిదుడుకులు లేకుండా చక్కగా ప్రయాణం
చేస్తుంది. నేలమీద మూరెడైనా ముందుకు వెళ్లలేదు. ఎందుకంటే తన చోటు కానిచోట
ఎంతనేర్పరి యైన నెగ్గుకు రాలేడు కదా !
**************
************* రెండవభాగం త్వరలో**********************************
No comments:
Post a Comment