Monday, 7 April 2014

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు - 10 సుయజ్ఞోపాఖ్యానము అను తత్త్వవిలోకనము




శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు --10       
             
                             సుయజ్ఞోపాఖ్యానము  అను తత్త్వవిలోకనము
                
                  



                     శ్రీ మన్నారాయణుని అవతారమైన ఆదివరాహమూర్తి చేతిలో హిరణ్యాక్షుడు మరణించాడు.తన సోదరుని శ్రీమహావిష్ణువు చంపివేశాడని తెలుసుకున్న హిరణ్యకశిపుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆ ఘోణిగాడు (వరాహము)  నాకు భయపడి   ఏ అడవుల్లోనో , సముద్రం లోనో, పర్వతాల చాటునో ,మునుల పంచనో ఎక్కడో ఒకచోట దాక్కుని ఉంటాడు. వాడి పుట్టుపూర్వోత్తరాలు ఎవ్వరికీ తెలియవు. మనం ఎదురు తిరిగితే వాడు ఎదుర్కొంటాడు. మనం వెంట పడితే కాని దొరకడు.  వాడు ఎక్కడ దాక్కున్న  పట్టుకొని నా పదునైన బల్లెంతో వాడి కంఠాన్ని  తెగ నరికి ఆ వేడి నెత్తురు తో నా తమ్మునికి తర్పణం విడుస్తాను అంటూ  చిందులు వేయసాగాడు.
                                           “   శ్రీ మహా విష్ణువు ను సంహరిస్తే ఆ దేవతల పని  అయిపోయినట్టే.   అందుకని ఎక్కడ  వేదాధ్యయనము ,యజ్ఞయాగాదులు , జపతపాలు , వ్రతాలు నిర్వహించబడుతుంటాయో అక్కడికి వెళ్ళి వాని నన్నింటిని ధ్వంసం చేయండి. ఎందుకంటే  విష్ణువంటే ఎవరో కాదు.అతడే వేదం . అతడే యజ్ఞం. వైదిక కర్మకాండకు అతడే మూలం.  అందుకే  ఎక్కడ గోవులు ,విప్రులు సుఖం గా జీవిస్తుంటారో, ఎక్కడ వేద ధర్మాలు, ఆశ్రమ నియమాలు , క్రమం తప్పక ఆచరించబడుతుంటాయో వాని నన్నింటినీ సర్వనాశనం చేయండి. అప్పుడు విష్ణువు తనకు తానే దిగి వస్తాడని తన అనుచరులైన రాక్షసవర్గాన్ని  ఆదేశించాడు హిరణ్యకశిపుడు.
                      
                  ఈ సమయం లో హిరణ్యాక్షుని భార్యలను, కొడుకులను ఓదార్చి, పుత్రశోకం తో తల్లడిల్లిపోతున్న తల్లి దితిని  ఊరడిస్తూ  హిరణ్యకశిపుడు   ఎన్నో జీవనసత్యాలను  వివరిస్తాడు. ఆ సందర్భం లోనిదే సుయజ్ఞోపాఖ్యానము. శ్రీ మదాంధ్ర మహాభాగవతం సప్తమస్కంధం లో మనకు ఈ ఉపాఖ్యానం కన్పిస్తుంది. తల్లితో  హిరణ్యకశిపుడు ఇలా అంటున్నాడు.
               
                ఓ తల్లీ ! ఈ లోకం ఒక చలువపందిరి  వంటిది.   ప్రాణులందరు కూడ దాహం కోసం వచ్చే బాటసారులే. చలివేంద్రం వద్దకు బాటసారులు దాహం తీర్చుకోవడానికి వచ్చి వెళ్లిపోతున్నట్లు , మనం కూడ ఈ సంసారం లోకి  వచ్చి  మన పని కాగానే వెళ్లిపోతూ ఉంటాం. ఎప్పుడు ఒకేచోట కలిసి ఉండం. కలుస్తూ ఉంటాం.విడిపోతూ ఉంటాం. అలాగే నీ చిన్నకుమారుడు కూడ  మహావీరులు వెళ్లే లోకానికే వెళ్లాడు. నీవు దు:ఖించాల్సిన అవసరం లేదు.
                 సర్వజ్ఞుడయిన  ఆ ఈశ్వరుడు సర్వాధికారి . సర్వాత్ముడు. సత్యుడు. నిర్మలుడు. అనంతుడు. ఆఢ్యుడు. ఆత్మస్వరూపుడు. నిరంతరం తన మాయా ప్రవర్తన మహిమ వలన త్రిగుణాలను కల్పించి , ఆ గుణసంయోగం వలన శరీరం ధరించి , లీలగా వినోదిస్తూ ఉంటాడు. కదలని చెట్లు కదలాడే నీళ్ళల్లో కదులుతున్నట్లు కన్పించినట్లుగా , కళ్లు తిరుగుతుంటే భూమి తిరుగుతున్నట్లుగా  అన్పించినట్లు  , భావవికారాలు లేని ఆత్మస్వరూపుడైన ఆ భగవంతుడు చంచల మనస్కులకు చంచలుడు గా అన్పిస్తాడు కాని ఆయన అచంచలుడు.
                         లక్షణ రహితుడైన ఆ భగవంతుడు  అప్పుడప్పుడు  కొన్నిలక్షణాలను పొంది కర్మబంధాలలో చిక్కుకొని యోగ వియోగాలను అనుభవిస్తుంటాడు. పుట్టుక ,నాశము ,శోకము ,వివేకము , చింత ,స్మరణము అనేవి అనేక రకాలు. ఈ పరమార్థాన్ని వివరించడానికి పెద్దలు ప్రేతబంధు యమ సంవాదము అనే కథ చెప్తారు. ఆ కథ చెపుతాను విన మని  చెప్పి సుయజ్ఞోపాఖ్యానాన్ని తల్లికి విన్పించాడు హిరణ్యకశిపుడు.
             పరమ భక్తాగ్రగణ్యుడైన ప్రహ్లాదునకు తండ్రి . పూర్వజన్మ లో సర్వలోకశరణ్యుడైన శ్రీమన్నారాయణునకు  ద్వారపాలకుడు నైన హిరణ్యకశిపుని చేత  ఈ ఉపాఖ్యాన ప్రస్తావన  శ్రీ మహాభాగవత ప్రత్యేకత.  
              “ ఉశీనరదేశం లో సుయజ్ఞుడనే ఒక రాజు ఉండేవాడు. అతడు ఒకానొక యుద్ధం లో  శతృవుల చేతిలో  అతి ఘోరం గా మరణించాడు. అతని రత్నకవచం చిరిగిపోయింది. ఖడ్గం విరిగి పోయి ,రత్నహారాలు తెగిపోయి, శరీరమంతా ధూళి ధూసరితమై , గాయాలనుండి  నుండి నెత్తురు కారుతోంది .దంతాలు బిగుసుకు పోయి ,చేతులు తెగిపోయి  వేరుగా పడి పోయాయి.  
                     ఆ  సుయజ్ఞుని కళేబరం చుట్టూ  అతని భార్యాపుత్రులు , బంధుజనులు  చేరి భోరుభోరున విలపిస్తున్నారు. నీవు లేకపోతే  మేము బతకలేమని ,మేము నీతోనే సహగమనం చేస్తామని అతని భార్యలు రోదిస్తున్నారు. ఇంతలో సాయంత్ర మయ్యింది. ఆ సమయం లో వారి రోదనలను విని యమధర్మరాజు విప్రబాలకుని వేషం లో  అక్కడకు వచ్చాడు. వారి దగ్గరకు వెళ్లి కాలనిర్ణయాన్ని  గూర్చిఈ విధం గా  బోధించసాగాడు.
                    మందమతులారా !   తనవారి మీద ఎక్కువగా మక్కువ  పెంచుకొని , కాలం తీరిన వారి కోసం ఇంతగా  దు:ఖించడం విచిత్రం గా ఉంది. పుట్టిన ప్రతిజీవి  మరణించడం  మీరు నిత్యం చూస్తూనే ఉంటారు. పుట్టిన తరువాత గిట్టని ప్రాణి ఉండదు . మరి చనిపోని వారి లాగా మీరు చనిపోయిన వారికోసం  ఎందుకు ఏడుస్తున్నారు. చావు ను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాని పని.  ప్రాణి ఎక్కడ నుండి వచ్చిందో మళ్లీ  అక్కడ కు వెళ్ళడం దాని సహజలక్షణం. చిన్ననాడే తల్లిదండ్రులను వీడి అడవిలో క్రూరమృగాల మధ్య చిక్కినా ఆ పరమేశ్వరుని  దయవుంటే  సురక్షితం గా ఉంటాం.  మనం తల్లి గర్భం లో ఉండగా ఎవడు మనల్ని పోషించాడో  ఆ భగవంతుడే అడవిలో ఉన్నా కూడ రక్షిస్తాడు. అంటే భగవంతుడే  సర్వదా సర్వథా రక్షకుడు.

 ఎవ్వడు సృజించుఁ బ్రాణుల , నెవ్వడు రక్షించుఁ ద్రుంచు నెవ్వఁ డనంతుం
 డెవ్వఁడు విభు డెవ్వఁడు వాఁ డివ్విధమున మనుచుఁ బెనుచు హేలారతుడై . (7 – 48 )
                
                      ఈ విశ్వాన్ని ఎవ్వడు సృష్టించి, రక్షించి , నశింప చేస్తున్నాడో, ఎవ్వడు అనంతుడో , ఎవ్వడు ఈ బ్రహ్మాండానికంతటికీ అథిపతి యో , వాడే లీలావిలాసం గా ఈ లోకాన్ని రక్షిస్తూ , పోషిస్తూ ఉంటాడు. డబ్బుని వీథి లో పడేసినా దైవయోగం బాగుంటే సురక్షితంగా ఉంటుంది. గీత బాగుండకపోతే ఇంట్లో మూల దాచి పెట్టినా  పోతుంది. అలాగే  బలహీనుడు అడవిలో ఉన్నా భగవంతుని కృప ఉంటే వృద్ధి పొందుతాడు. దైవానుగ్రహం లేకపోతే బలవంతుడైనా ఒంటిస్థంభం మేడలో  రక్షకభటులచే రక్షింపబడుతున్నా మరణిస్తాడు.
                అడవి రక్షలేని యబలుండు వర్థిల్లు
               రక్షితుండు మందిరమునఁ జచ్చు. ( 7 – 49 )
                ఆ భగవంతుని తత్వ్తం ఎవ్వరికీ అర్థం కాదు.  ఆయన వలన ఈ సమస్త జీవకోటి కాలకర్మ వశమై ఈ బ్రహ్మాండ చక్రం లో వర్తిల్లుతూ ఉంటుంది. ఆత్మ స్వరూపుడు, అగమ్యుడు నైన ఆ ఈశ్వరుడు త్రిగుణాతీతుడు. పంచభూతాత్మకమైన ఈ  దేహమనే భవనం లో  పురుషుడు పూర్వకర్మానుసారియై ప్రవర్తిస్తూ, కాలం తీరగానే ఈ దేహం నుంచి వెళ్లి పోతాడు. దేహం అశాశ్వతం. అందులోని ఆత్మపురుషుడు శాశ్వతుడు. ఎప్పటికైనా దేహం చెడిపోతుంది కాని  ఆత్మకు నాశనము లేదు. పురుషుడు ,దేహము వేరువేరే కాని ఎప్పుడూ ఒకటి కాదు.  దారువు లో అగ్ని దాగి ఉన్నట్లు ,శరీరం లో గాలి ఉన్నట్లు , తామరతూడు లోపల  శూన్యం ఉన్నట్లు, దేహం లో దేహి వేరుగా ఉంటాడు.
                   ఈ మహారాజు  దీర్ఝనిద్రలోకి  వెళ్లిపోయాడు. ఇతని లోని మాటలు మాట్లాడే , మాటలు వినే జీవుడు ఎప్పుడో వెళ్లిపోయాడు. ప్రాణానికి మూలమైనటువంటి వాయువు ఉన్నా అది విడిగా భాషించలేదు. వినలేదు . జీవుడు ప్రాణానికీ , దేహానికీ వేరుగా ఉండి కూడ ముఖ్యుడై ఇంద్రియప్రభావం తో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ఆత్మరూపుడు పంచభూతాలను , పంచేద్రియాలను , మనస్సును , లింగదేహాన్ని విలాసం గా ధరిస్తూ మళ్లీ విడిచి పెడుతూ ఉంటాడు. ఈ ప్రపంచానికంతటికీ ఫ్రభువు వేరే ఉన్నాడు.   అందువలన దీని కోసం మీరు బాధపడటం , దు:ఖించడం అవివేకం కదా. ఎప్పటి వరకు ఆత్మ దేహాన్ని ధరించి ఉంటుందో  అప్పటి వరకూ ఈ కర్మయోగం జరుగుతూనే ఉంటుంది. ఆ తరువాత ఆత్మ దేహాన్ని విడిచి పెట్టగానే   ఈ బంధాలన్నీ తెగిపోతాయి. వీటితో సంబంధ మే ఉండదు. అది తెలియక మీరు దు:ఖిస్తున్నారు.
                   
                  ప్రాణులు  మహామాయ అనే భ్రాంతి లో పడి తల్లిదండ్రులు , భార్యబిడ్డలు , స్నేహితులు, బంధువులు , ఆశ్రితులు అంటూ  అనురాగాలను, అనుబంధాలను పెంచుకొని , ఇళ్లు , వాకిళ్లు , సంపదలూ , సామ్రాజ్యాలను  సంపాదించుకుంటారు, ఎప్పుడైనా మనకు కలలో కన్పించిన సంపద యథార్థమౌతుందా ?  కర్మానుబంధం ఉన్నంతకాలం సంయోగం , కర్మఫలం అనుభవించాక వియోగం ఏర్పడుతుంది.
                         ఈ మాయా గుణ ప్రపంచాన్ని గూర్చి తెలిసిన తత్త్వజ్ఞులు నిత్యానిత్యములను గురించి సుఖ దు:ఖాలను పొందరు. అజ్ఞానులు మాత్రమే సంయోగం కలిగితే పొంగిపోతూ , వియోగం కలిగితే కుంగిపోతూ ఉంటారు. 
                                   పూర్వం ఒక అడవిలో   ఒక కిరాతుడు  పక్షులను వేటాడి జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉదయమే లేచి వాడు వేట కు బయలుదేరాడు. అడవి లో వలలు వేసి పిట్టలను పట్టుకుంటూ , దొరికిన పక్షుల రెక్కలు విరిచి  సంచిలో వేసుకుంటూ లోకభీకరం గా  తిరుగసాగాడు. ఇంతలో కాలచోదితమై ఒక అడవి పిచ్చుకల జంట కిరాతుడి కంటపడింది. ఇంకేముంది. నేర్పు గా వలపన్ని ఆడపిచ్చుక ను పట్టుకొని , రెక్కలు విరిచి సంచిలో వేసుకున్నాడు. అది చూచి  మగపిచ్చుక  వలవల విలపించసాగింది.
                   
                అయ్యో! ప్రియురాలా ! అడవిలో ఎక్కడో ఇంత మేత మేసి, పడియల నీరు త్రాగి , ఒకరికి అపకారం చేయక బతుకుతున్నాం కదా. కఠినాత్ముడైన ఆ బ్రహ్మ మన నొసటిని ఈ బోయవాడి చేతిలో చావమని వ్రాశాడు కాబోలు. ఆ పాపిష్టిదేవుడికి మన బతుకు ఇంత బరువయ్యిందా ?   మనందరినీ ఒకేసారి  ఆ కిరాతుని వలలో వేయక   ఇలా ఎడబాటు కల్గించిన  ఆ విధి వంకర చేష్టలను ఏమనాలి.                              

ఱెక్కలు రావు పిల్లలకు ,ఱేపటి నుండియు మేత గానమిం
బొక్కుచుఁ గూటిలో  నెగసి పోవగ నేరవు , మున్ను తల్లి యీ
దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కినిక్కి న
ల్దిక్కులఁ చూచుచున్న వతిదీనత నెట్లు భరింతు నక్కటా ! ( 7 – 63 )
   
         అయ్యయ్యో ! మన పిల్లలుకు ఇంకా  రెక్కలు కూడ రాలేదు. తెల్లవారిన దగ్గర నుంచి మేత లేక ఏడుస్తుంటాయి. గూటినుంచి వెళ్లడానికా ఎగరలేవు. అమ్మ ఆహారం పట్టుకుని ఇటువైపు నుంచే వస్తుందనే ఆశతో దీనం గా నాలుగు దిక్కులు  చూసే ఈ పిల్లల వేదనను ఎలా భరించగలను.
                అంటూ ఆడపిచ్చుక వియోగాన్ని తలచుకొని దు:ఖిస్తోంది ఆ మగపిచ్చుక.   ఇంతలో బోయవాడు  ఆ పిచ్చుకను చూచి , వెంటనే బాణం తో కొట్టాడు . కాలం తీరిన మగపక్షి కెవ్వున అరుస్తూ  నేలకూలి ప్రాణాలు విడిచింది.
                   కాలము డాసిన నేలం , గూలక పోవశమె యెట్టి గుణవంతులకున్. ( 7-66)
   కాలం మూడితే ఎంతటి గుణవంతుడు , ధనవంతుడు , బలవంతుడైనా మరణించక తప్పదు కదా.!              
                 కాబట్టి  మరణం ఎప్పుడు ఎలా ఎక్కడొస్తుందో తెలియదు. చచ్చిపోయిన మీ నాథుని కోసం మీరు  వంద  సంవత్సరాలు ఏడ్చినా   ఆయనను  చేరుకోలేరు. మృతిఁ బొందిన వారలు చేర వత్తురే. ( 7 -67 ) చచ్చిన వారు ఎప్పుడైనా లేచి వచ్చారా!  “ అంటూ పల్కిన  కపటబాలకుడైన యమధర్మరాజు మాటలను విన్న సుయజ్ఞుని  బంధువులు ఆశ్చర్యపోయారు.   ఈ విశ్వం శాశ్వతం కాదని అర్థం చేసుకొని , శోకాన్ని వదిలి మహారాజు కు ఉత్తర క్రియలు పూర్తిచేశారు.  బాలుని రూపం లో వచ్చిన యమధర్మరాజు అంతర్థానమయ్యాడు.
                   ఈ వృత్తాంతమంతా హిరణ్య కశిపుడు తన తల్లికి, తమ్ముని భార్యాబిడ్డలకు చెప్పి వారిని సమాధానపరచి  మరల ఇలా అన్నాడు.
పరులెవ్వరు దామెవ్వరు  పరికింపగ నేక మగుట భావింపరు, త
త్పరమజ్ఞానము లేమిని బరులును నేమనుచుఁ దోఁచుఁభ్రాణు కెల్లన్.( 7 – 69 )
                       ప్రాణులకు పరతత్త్వ చింతన లేకపోవుడం వలన  నేను , మనము  , వాడు , పరులు అనే , తేడాగా భావిస్తారు. వారు , మేము అని అజ్ఞానులు మాత్రమే అనుకుంటారు. ఆలోచిస్తే మనం అందరూ ఒక్కటే .  ఆ పరమాత్మ ఒక్కడే. అటువంటి వివేచన మనకు కలగాలి. అంటూ ముగించాడు హిరణ్య కశిపుడు.
                                                    హిరణ్యకశిపుని  యొక్క ఈ సుదీర్ఘ వివరణ తో తత్త్వవిలోకనం కలిగిన  ఆతని తల్లి యైన దితి , హిరణ్యాక్షుని ఇల్లాండ్రైన ఆమె కోడళ్లు దుఖోపశమనాన్ని పొందగలిగారు. కాని విచిత్రమేమిటంటే  -- ఇంత చెప్పిన హిరణ్యకశిపునకు మాత్రం వార్ధక్యము , మరణము లేని జీవితము , త్రిలోకాధిపత్యము కావాలనే సంకల్పం కలిగి మందరాద్రి కి వెళ్లి ఘోర తపస్సు ప్రారంభించాడు.     దైవ యోగము అనుల్లంఘనీయము కదా !
                  
                   చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతా లవిత్రంబులు స
                   న్మిత్రంబులు మునిజన వన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్ .( 7 – 6)
                               
                                          నమో వేదమాతరం



                               
      


*******************************************************************************



No comments: