Friday, 10 January 2014

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు - 6 శ్రీ కృష్ణ (అష్టమహిషీ) కళ్యాణం


శ్రీ భాగవత  కల్పద్రుమ ఫలాలు -6
                        
          శ్రీ కృష్ణ (అష్ట మహిషీ) కళ్యాణం
                  
                       




                    

                  భక్త జనరక్షకుడు, ఆర్తజనబాంధవుడు, భాగవత కథానాయకుడు అయిన శ్రీకృష్ణుడు రుక్మిణీ మొదలైన ఎనిమిదిమందిని  పరిణయం చేసుకోవడమే కాకుండా నరకుని చెరలో ఉన్న పదహారువేలమందిని విడిపించి, వారిని పరిగ్రహించిన వృత్తాంతం మనకు దశమస్కంధం ఉత్తర భాగం లో కన్పిస్తుంది.  కమనీయ మైన శ్రీకృష్ణుని కళ్యాణ ఘట్టాన్ని చూడలేకపోయానని  ఆ కన్నయ్య కన్నతల్లి దేవకీదేవి యే బాధపడిందని చెపుతారు.కాని అటువంటి రమణీయ దృశ్యాల్ని మహాకవి పోతన మధుర మనోహరం గా తెలుగు వారి కందించాడు. సీతాకళ్యాణం, సీతారామ కళ్యాణం, శ్రీరామ కళ్యాణం,రుక్మిణీ కళ్యాణం,రాధాకళ్యాణం అనే మాటలు మనం వింటుంటాము కాని శ్రీకృష్ణ కళ్యాణం అనే పదం మనకు కొత్తగా వినిపిస్తుంది.కారణం నందనందనుడు షోడశ సహస్రాంగనా పరివృతుడు.   అష్టభార్యా సమేతుడు  కావడమేనేమో.!
                      
                             రుక్మిణీ కళ్యాణం మనం ఇంతకు ముందే దర్శించాము.కొంతకాలానికి రుక్మిణీదేవి కి  మగశిశువు జన్మించాడు.  పూర్వం పరమేశ్వరుని కంటిమంట లో భస్మమైన మన్మథుడు ఈశ్వరుని అనుగ్రహం తో రుక్మిణీకృష్ణులకు   కుమారుడు గా జన్మించాడు. అతనే ప్రద్యుమ్నుడు అనే పేరుతో ప్రసిద్దుడయ్యాడు. ప్రద్యుమ్నుడు సూతికాగృహం లో తల్లి పొత్తిళ్ల లో ఉండగానే శంబరాసురుడనే  రాక్షసుడు ప్రద్యుమ్నుని వలన తనకు హాని ఉందని తెలుసుకొని ప్రద్యుమ్నుని అపహరించి, తీసుకొని వెళ్లి సముద్రం లో పారవేశాడు. ఒక చేప ఆ పసివాని ని మింగేసింది. చేపలు పట్టే వారి వలలో మిగిలిన చేపలతో పాటు ఆ చేప కూడ దొరికి పోయి, శంబరుని వంటశాలకు చేరింది. వంటవారు చేప కడుపుని కోయగా చంద్రబింబం వంటి బిడ్డ  కన్పించాడు.  
                           
                                  ఇంతలో అక్కడకు వచ్చిన నారదుడు ఆ బాలుని వృత్తాంతాన్ని  మాయాదేవి  పేరుతో  శబరుని ఇంట ఉంటున్న  రతీదేవి కి చెప్పాడు. ఆతను తన భర్తయే నని  తెలుసుకున్న  రతీదేవి  పుత్రార్థిని వలే శంబరుని అనుమతి తో ఆ బిడ్డను తీసుకెళ్లి, పెంచసాగింది. అచిరకాలం లోనే అతను యౌవనవంతుడయ్యాడు. శంబరుని వృత్తాంతాన్ని సంపూర్ణం గా ప్రద్యుమ్నునికి చెప్పిన రతీదేవి అతనికి సర్వ శత్రు మాయావినాశిని యైన మహామాయ అనే విద్యను ఉపదేశించింది. దానితో ప్రద్యుమ్నుడు శంబరాసురుని యుద్ధం లో ఓడించి,  ఇల్లాలైన రతీదేవితో కలిసి ద్వారకానగరం  చేరుకున్నాడు.
                     

                          
                         ఇది ఇలా ఉండగా సత్రాజిత్తు సూర్యుని ఆరాథించి , రోజుకు ఎనిమిది బారువుల బంగారాన్ని ప్రసాదించే స్యమంతకమణిని పొందాడు. అటువంటి మణి మహారాజు ఉగ్రసేనుని వద్ద ఉండటం  శ్రేయస్కరమని, కావున దానిని  మహారాజు కివ్వమని చెప్పాడు శ్రీకృష్ణుడు . కాని సత్రాజిత్తు కృష్ణుని మాట వినలేదు ఒకరోజున సత్రాజిత్తుని తమ్ముడైన ప్రసేనుడు ఆ మణిని ధరించి అడవికి వేటకు వెళ్లాడు. అరణ్యం  లో ఒక సింహం ప్రసేనుని  చంపి, ఆ మణిని నోట కరచుకొని పోతుండగా, జాంబవంతుడు ఆ సింహాన్ని  సంహరించి, ఆ మణి ని  తీసుకొళ్లి తన కుమారునకు ఆటబంతి గా ఇచ్చాడు.

      కని జాంబవంతుఁ డా మణిఁ , గొనిపోయి సమీప శైలగుహఁ జొచ్చి ముదం
  బునఁ దనకూరిమి సుతునకు, ఘనకేళీ కందుకముగాఁ జేసె నృపా”!  (10.56)
    
                 ఇంతలో సత్రాజిత్తు తన సోదరుడు కనిపించక విలపిస్తూ, శ్రీకృష్ణుడే తన సోదరుని చంపి,  ఆ మణి ని అపహరించాడని దూషించసాగాడు. ఆ నీలాపనిందను  తొలగించుకోవడానికి తన వారితో కలిసి శ్రీకృష్ణుడు  అరణ్యానికి వెళ్లి ప్రసేనుని వెదకుచూ, జాంబవంతుని గుహను చేరుకొని తన వారినందరిని గుహ వెలుపలే ఉంచి, లోనికి ప్రవేశించాడు. అక్కడ బాలుడు ఆడుకుంటున్న స్యమంతకమణిని చూశాడు.  ఇంతలో దాది అరవడం , ఆ కేక విని వచ్చిన జాంబవంతుడు శ్రీకృష్ణుని తో తలపడటం జరిగిపోయాయి. ఆ యుద్ధం ఇరవై ఎనిమిది రోజులు జరిగింది. తుదకు జాంబవంతుడు రావణ సంహారం చేసినమహావీరుడే ఈ కారుణ్య మూర్తి యని తెలుసుకొని, చేసిన అపచారానికి క్షమాపణ వేడుకున్నాడు. స్యమంతక మణి తో పాటు తన కుమార్తె యైన జాంబవతీ దేవి
ని కూడ   శ్రీకృష్ణునకు కానుకగా సమర్పించాడు.

                        




                              జాంబవతీ దేవిని పరిగ్రహించిన శ్రీకృష్ణుడు ద్వారకానగరం చేరాడు. సత్రాజిత్తు ను రాజసభ కు పిలిపించి జరిగిన విషయాన్ని వివరించి, మణిని ఇచ్చి వేశాడు.  కాని  అనవసరం గా శ్రీహరి పైన నిందవేసి, బలవంతునితో విరోధం తెచ్చుకున్నందుకు సిగ్గుపడ్డాడు. భయ పడ్డాడు సత్రాజిత్తు.  తన కుమార్తెను సమర్పించి, శ్రీకృష్ణుని పై నిందవేసిన తన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు .

పాపాత్ముల పాపములం , బాపం గా నోపునట్టి పద్మాక్షునిపైఁ
బాపము గలదని నొడివినఁ పాపాత్ముని పాపమునకుఁ బారము గలదే”! (10.ఉ.77)

       -అని కూడ భావించాడు. బాధపడ్డాడు . అందుకే-

మణిని గూతునిచ్చి మాధవుపదములు , పట్టుకొంటినేని బ్రదుకు కలదు
సంతసించు నతడు సదుపాయమగు నిది ,సత్య మితరవృత్తిఁ  జక్కబడదు. (10.ఉ.77)

               స్యమంతక మణి తోపాటు తన కుమార్తెయైన సత్యభామ ను కూడ సమర్పించుకొని  శ్రీకృష్ణుని సంతోషింప జేయ యత్నించాడు సత్రాజిత్తు.

 “తామరసాక్షుఁ డచ్యుతుఁ డుదార యశోనిధి బెండ్లియాడె నా
నా మనుజేంద్రనందిత గుణస్థితిలక్షణ సత్యభామ ను
ద్దామ పతివ్రతాత్వ నయ ధర్మవిచక్షణతా దయా యశ :
కామను సత్యభామను ముఖద్యుతి నిర్జిత సోమ నయ్యెడన్.(10- ఉ- 81)

                 అయితే శ్రీకృష్ణుడు  కన్యామణిని తీసుకొని, శ్యమంతకమణి ని  తిరిగి సత్రాజిత్తు కు ఇచ్చివేశాడు. అనంతరం దాన్ని శతధన్వుడు అపహరించడం,  సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు అతన్ని సంహరించడం ఇవన్నీ కథాంతరాలు.



                పాండవులను చూడటానికి కృష్ణుడు ఇంద్రప్రస్థానికి వచ్చి , కొన్ని నెలల పాటు అక్కడే ఉండిపోయాడు. ఒక రోజున కృష్ణార్జునులు అశ్వారూఢులై అరణ్యానికి వేటకు వెళ్లారు. కొంత సమయానికి వేట లో అలసిపోయి, యమునా తటాన సేదతీరుతున్న సమయం లో వారికి సూర్యుని కుమార్తె కాళింది కన్పించింది. శ్రీకృష్ణుడు పంపగా అర్జునుడు ఆమెను పల్కరించాడు. తన తండ్రి తనకోసం ప్రత్యేకం గా ఏర్పాటుచేసిన గృహం లో తాను శ్రీకృష్ణుని గూర్చి తపస్సు చేస్తున్నానని, వేటకు వచ్చిన శ్రికృష్ణుడు తనను వివాహమాడగలడని తండ్రి చెప్పాడని  పల్కింది కాళింది. సర్వజ్ఞుడైన శ్రీహరి ఆమెను రథ మెక్కించకొని ఇంద్రప్రస్థానికి, అనంతరం  ద్వారకకు చేరుకున్నాడు.బంధువులందరూ ఆనందిస్తుండగా ఒక శుభ ముహూర్తం  లో కాళింది ని వివాహం చేసుకున్నాడు.       

               అనంతరం - విందానువిందుల సోదరి మిత్రవింద .వీరితల్లి రాజాథిదేవి శ్రీకృష్ణునకు మేనత్త అవుతుంది. విందానువిందులు తమ సోదరి కి  స్వయంవరం ప్రకటించారు.  ఆ స్వయం వరానికి హాజరైన శ్రీకృష్ణుడు రాజలోకమంతా చూస్తుండగానే  తన పరాక్రమాన్ని ప్రదర్శించి మిత్రవింద ను  పరిణయం చేసుకున్నాడు.

భూరమణులు సూడగ హరి , వీరతఁ జేకొనియె మిత్రవిందను నిత్యా
పూరిత సుజనానందం ,జారు చికురకాంతి విజిత షట్పదబృందన్. (10. ఉ. 125)

                           కోసలదేశాన్ని నగ్నజిత్తు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని కుమార్తె నాగ్నజితి. ఆ రాజు వద్ద మదించిన ఏడు ఆబోతులున్నాయి. ఏ వీరుడు ఆ ఆబోతులను తన బాహుబలం తో బంధించగలడో అతనే తన కుమార్తె కు భర్త అని  ప్రకటించాడు.  ఆ వార్త ను విన్న శ్రీకృష్ణుడు సేనాసమేతం గా కోసలరాజ్యానికి వచ్చాడు. కోసలరాజు కృష్ణుని గొప్పగా గౌరవించాడు.  మోహనరూపుడైన శ్రీకృష్ణుని చూచిన నాగ్నజితి  ఇలా అనుకొంది.

విష్ణుఁడవ్యయుండు విభుడు గావలె నని ,నోఁచినట్టి తొంటి నోము ఫలము
సిద్దమయ్యెనేనిఁ జేకొనుఁబో నన్ను,జక్రధరుడు  వైరిచక్రహరుడు.   (10.ఉ.130)

             నాగ్నజితిని తనకు ఇల్లాలిని చేయమని శ్రీకృష్ణుడు నగ్నజిత్తు ను అడిగాడు. ఆ కోసలరాజు అందుకు ఎంతగానో సంతోషించాడు కాని  ఆమె వివాహ విషయం లో తాను తీసుకున్న నిర్ణయాన్ని  పరిపూర్తి చేయమని  కోరాడు. శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వులు చిందిస్తూ ఆ వృషభాలను అవలోకించాడు.

చేలము చక్కఁగట్టుకొని చిత్రగతిన్ వడి నేడు మూర్తులై
బాలుఁడు దారురూపముల  బట్టెడు కైవడిఁ బట్టి వీర శా
ర్దూలుడు గ్రుద్ది నేలఁ బడఁద్రోచి మహోద్దతిఁ గట్టి యీడ్చె భూ
పాలకులెల్ల మెచ్చ వృషభంబులఁ బర్వత సన్నిభంబులన్.  (10 .ఉ.140)        

          అచ్చట చేరిన రాజ సమూహమంతా జయ జయ ధ్వానాలు చేస్తుండగానే  వృషభాసుర సంహారి 
యైన ఆ చిన్మయ రూపుడు శ్రీకృష్ణుడు  పై వస్త్రాన్ని నడుము కు బిగించి  విచిత్రమైన రీతిలో ఏడు రూపాలను ధరించి బాలకుడు కొయ్యబొమ్మలను పట్టుకున్నట్లు గా పర్వతాల వంటి ఆ ఆబోతులను పట్టుకొని గ్రుద్ది    నేలపై పడవేశాడు. నగ్నజిత్తు  నాగ్నజితి ని శ్రీకృష్ణునకిచ్చి వివాహం చేసి, అఖండమైన , అపురూపమైన కానుకలను  అరణంగా  శ్రీకృష్ణునకు సమర్పించి, సాగనంపాడు. ఆబోతుల నెదిరించలేక పరాజితులైన రాజులందరూ ఒక్కటై  మార్గమథ్యం లో శ్రీకృష్ణుని పై దాడి చేయగా,  అర్జునుడు తన గాండీవం తో సింహం కుందేళ్లను తరిమినట్టు. వెంటాడి సంహరించాడు. నాగ్నజితి తో కూడి ద్వారకా నగరం చేరుకున్నాడు శ్రీకృష్ణుడు.

                  
                 

                           అనంతరం కేకయరాజైన శ్రుతకీర్తి కుమార్తె, సందర్శనాదులకు సోదరి, మేనత్తకూతురు యైన భద్ర ను శత్రురాజులు భయపడుతుండగా  అతి వైభవం గా వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు.
                   
జన వంద్యన్ శ్రుతకీర్తి నంద్యఁ దరుణిన్ సందర్శన క్షోణి పా
ద్యనుజన్ మేనమఱందలిన్ విమలలోలాపాంగఁ గైకేయి ని
ద్ద నయోన్నిద్రఁ బ్రపూర్ణసద్గుణసముద్రన్ భద్ర నక్షుద్ర నా
వనజాతాక్షుఁడు  పెండ్లియాడె నహితవ్రాతంబు భీతిల్లగన్. (10.ఉ. 145 )

                 ఆ  తరువాత  మదాంధులైన రాజులను జయించి, మద్రరాజ కుమార్తె యైన లక్షణా దేవి ని కూడ  పరిణయ మాడాడు శ్రీకృష్ణుడు.

కమలదళాయతాక్షుడు గైకొని తెచ్చెను మద్రకన్యకన్
సమదమృగేక్షణన్ నయవిచక్షణ లక్షణఁ బుణ్యలక్షణన్”. (10 ఉ. 147)

                   నరకాసుర వథానంతరం  అతని చెరలో ఉన్న రోహిణీ మొదలైన పదహారువేలమంది కన్యామణులను విడిపించి  ముందు గా ద్వారకకు పంపించాడు శ్రీకృష్ణుడు. అనంతరం దేవలోకం నుండి పారిజాత వృక్షాన్ని  సత్యభామ కోరిక మేరకు భూలోకానికి తెచ్చి సత్యాదేవి ఉద్యాన వనం లో నాటించిన తరువాత ఈ పదహారువేల మందికి వేరువేరు సౌథాలను ఏర్పాటు చేయించాడు యశోదానందనుడు.  ఒక శుభముహూర్తం లో ఈ పదహారువేల భవనాల్లో ఉన్న పదహారువేలమంది రాజ కన్యలను పదహారువేల రూపాలతో పదహారువేల రీతులతో శోభిస్తూ శాస్త్రోక్తం గా  వివాహమాడాడు. ఆ బాలామణులందరకు అన్ని విధాలుగా కన్పిస్తూ ఉత్తమ గృహస్థధర్మాన్ని పాటిస్తూ ఆనందిచాడట  నల్లనయ్య.ఇంత కమనీయమైన కళ్యాణ కథనాన్ని విన్న వారికి, చదివిన వారికి  సకలైశ్వర్య సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయనడం లో సందేహమేముంది. ఎందెందు వెతకి చూచిన అందందే కన్పించే లీలామానుష  విగ్రహుడు కదా ఆ మోహనరూపుడు. అందుకే ఎవరికివారు  ఆ నల్లనయ్య తనవాడే నని మురిసి పోతారట.

నన్నే పాయడు, రాత్రులన్ దివములన్ నన్నేకృపం జెందెడిన్
నన్నేదొడ్డగఁ జూచు వల్లభలలో , నాథుండు నా యింటనే
యున్నాడంచుఁ బదాఱువేలుఁ దమలో నూహించి సేవించి రా
యన్నుల్ గాఢ పతివ్రతాత్వ పరిచర్యా భక్తి యోగంబులన్ . “(10.ఉ224.)

                   ఈ విథం గా శ్రీకృష్ణునకు రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ  అనువారు ఎనిమిది మంది భార్యలు గా కీర్తించబడుతున్నారు.

                                        రుక్మిణీ మొదలైన అష్ట మహిషులకు పుట్టిన వారిలో  పదునెనిమిదిమంది బాహుబల పరాక్రమ వైభవాలతో ప్రసిద్దులయ్యారు.  వారిపేర్లు ఇలా ఉన్నాయి. ప్రద్యుమ్నుడు, అనిరుద్దుడు,దీప్తిమంతుడు,బానుడు , సాంబుడు ,బృహద్భానుడు ,మధుడు , మిత్రవిందుడు,  వృకుడు , అరుణుడు ,పుష్కరుడు ,దేవబాహుడు , శ్రుతదేవుడు , సునందుడు ,చిత్రబాహువు , వరూధుడు , కవి, న్యగ్రోధుడు. అంతేకాక శ్రీకృష్ణునకు త్రివక్ర  యను స్త్రీ యందు  ఉపశ్లోకుడు నే వాడు జన్మించి, తండ్రియైన శ్రీకృష్ణుని  పాదపద్మాలను సేవిస్తూ , నారదుని శిష్యుడయ్యాడు. ఈయన వ్రాసిన గ్రంథము సాత్వ్తత తంత్ర మనే వైష్ణవ స్మృతి గ్రంథాన్ని రచించాడు.

                 శ్రీకృష్ణుని కుమారులందరినీ లెక్కపెట్టాలంటే పదివేల సంవత్సరాలు చాలవు. వారి గురువులే మూడుకోట్ల ఎనభై ఎనిమిది వేల నూరుమంది  ఉన్నారట. (10.ఉ.1331). రుక్మిణీ కుమారుడు ప్రద్యుమ్నుడు .  ఇతను రుక్మి కుమార్తె యైన శుభాంగి  ని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు అనిరుద్ధుడు. 









 ***********   వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో     *********              *****

No comments: