Tuesday, 1 October 2013

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు -1 రుక్మిణీ కళ్యాణ సంవీక్షణం



                   
                     

                 రుక్మిణీ కళ్యాణ సంవీక్షణం                              
                                    
                     


            


                  సిరి మల్లెల విరి జల్లులా, పసిపాపల  చిరునవ్వులా,   నిండైన  వరద గోదారి లా,  హొయల నడల  కృష్ణమ్మ లా తెలుగువారి హృదయాలకు దగ్గరై, మనది అని చెప్పుకునే తెలుగుదనపు తీయదనం తో, మనోహర ముగ్థశైలి లో  ఆంథ్ర మహాభాగవతాన్ని  అందించి, అజరామరమైన కీర్తికాంత ను వరించి ఆంథ్రజాతి  నీరాజనాలందుకుంటున్న మహాకవి బమ్మెర పోతన.
                            

                    అలనాడు తెలుగునాట ఒక సంప్రదాయముండేది. పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లకు సంబంధాలు ఆలస్యమౌతుంటే కన్నవారు తమ బిడ్డ చేత రుక్మిణీ కళ్యాణాన్ని చదివించేవారు. ఒకనాడు తెలుగునాట ప్రతియింట ఆంథ్ర మహా భాగవతం  ఉండేది.లేకపోతే కనీసం భాగవత భాగాలైన ప్రహ్లాదచరిత్ర, కుచేలోపాఖ్యానం, గజేంద్రమోక్షం, రుక్మిణీకళ్యాణం,వామనచరిత్ర వంటి చిన్నపుస్తకమైనా  లేని ఇల్లు ఉండేది కాదంటే అతిశయోక్తిలేదు.  పోతన పద్యం రాని వాడు తెలుగు వాడు కాదని ఆనాటి తరం లో ఒక వాడుక ఉండేదంటే పోతన భాగవతం తెలుగుజాతికి ఎంత దగ్గరైందో మనం అర్థంకోవచ్చు.
                   
                           సకలసంపత్కారిణి,మానవైభవ గాంభీర్య విహారిణి, సాధుబాంధవసత్కారిణి, పుణ్యసంచారిణి, మహాదారిద్ర్య సంహారిణి, సువిభూషాంబరధారిణి,  గుణవతీచూడామణి అయిన రుక్మిణిని  దిగంత వ్యాప్త కీర్తిసాంద్రుడైన  శ్రీకృష్ణుడు పరిణయ మాడాడు,
                     
                  
               శ్రీకృష్ణునిచే కురూపిగా చేయబడిన రుక్మిని బంధవిముక్తుని చేసిన బలరాముడు, రుక్మిణీ దేవి తో ఇలా అంటాడు. అమ్మా!  నీ అన్న అవమానించబడ్డాడని బాధపడవద్దు.గత జన్మలో చేసిన కర్మలను బట్టి జీవులు మంచి చెడ్డలననుభవిస్తుంటారు. శిక్షించడానికి,రక్షించడానికి కర్త ఒకడంటూలేడు. నీతోడ బుట్టినవాడు కర్మశేషంతో ఈనాడు ఇక్కడ పరాభవించ బడ్డాడు. చంప దగిననేరం చేసినప్పటికి కూడ బంధువులను చంపకూడదు.క్షమించి విడిచి పెట్టడమే న్యాయం.
                                 
                    


              దైవమాయ వలన దేహాభిమానం గల మానవులకు ఇతడు శత్రువు,ఇతడు బంధువు, ఇతడు తటస్థుడు అనే భావం కలుగుతుంది. నీటియందు  రవిచంద్రులు, ఘటాదులయందు ఆకాశం  అనేకములు గా కన్పించినట్లుగా,ప్రాణులందరికి ఆత్మ ఒక్కటైనప్పటికీ పెక్కండ్రు గా గోచరిస్తుంది. పుట్టుక, మరణము కల్గిన ఈ శరీరము పంచ భూతాల తోను,పంచ ప్రాణాల తోను,త్రిగుణాలతోను కూడినదై అజ్ఞానం చే ఆత్మయందు కల్పించబడుతోంది. ఈ దేహం జీవుణ్ణి సంసారచక్రం లో త్రిప్పుతోంది. ఆత్మకు మరొకదానితో కూడిక కాని, ఎడబాటు కాని లేవు. వృధ్ధిక్షయాలు చంద్రకళలకే కాని చంద్రునికి లేనట్లు చావు పుట్టుకలు శరీరానికే గాని ఆత్మకు ఉండవు. నిద్ర పోయినవాడు  ఆత్మను సుఖదు:ఖాదులను అనుభవింప చేయునట్లు జ్ఞానహీనుడు అసత్యమైన  అర్థము నందు అనుభవం కల్గించుకుంటాడు.
                 
                        
                 ఓ రుక్మిణీ ! అజ్ఞానమనే దుఖాన్నివిజ్ఞానమనే చూపుతో విడిచిపెట్టు. నీవు ప్రజ్ఞా వతివి.అజ్ఞానుల వలే దు:ఖించకూడదు. అంటూ ఓదార్చాడు.
                   
                    
             అంతేకాదు. యాదవ సైన్యం చేత పరాభూతులై పారిపోతున్న జరాసంధాదులు ఒకచోట చేరారు. భార్యను కోల్పోయిన వాడిలా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న శిశుపాలుణ్ణి చూచిన వారు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు కదా. ప్రాణాలుంటే బ్రతకవచ్చు. బ్రతికుంటే భార్య వస్తుంది  కదా ! “ అంటూ ఓదార్చారు.
                       
                               అప్పుడు శిశుపాలునితో జరాసంధుడు ఇలా  అన్నాడు. మిత్రమా! దేహధారి ఎప్పుడు స్వతంత్రుడు కాదు. బొమ్మలాడించే వాని చేతిలో కీలుబొమ్మలా  అతడు ఈశ్వర మాయకు లోనై, సుఖదు:ఖాలతో నర్తనమాడుతుంటాడు. ఇంతకు ముందు పరాక్రమం తో మధురాపురం పై పదిహేడుసార్లు దండెత్తి, చివరకు కృష్ణుని చేతిలో ఓడిపోయిన నేను బలరాముని చేత పట్టుబడ్డాను. అప్పుడు కృష్ణుడు దయ తలచి వదిలి పెడితే బయటపడ్డాను. తరువాత పద్దెనిమిదోసారి మూడక్షౌహిణుల సైన్యం తో దండెత్తి  విజయాన్ని సాథించాను. నేను ఎప్పుడు గెలుపు ఓటములలో మోద ఖేదాలను పొందలేదు. ఎందుకంటే దైవ ప్రేరితమైన కాలం చేత ఈ లోకాలు పరిభ్రమిస్తుంటాయి. కాలం కలిసి వస్తే మనం కూడ గెలుస్తాము అంటూ శిశుపాలుని ఓదార్చాడు.
                  
                   
                 ఇది భాగవత కల్పవృక్ష ప్రభావం.  ఈ కల్పవృక్ష ఛాయ లోకి వచ్చిన ఏ పాత్ర అయినా భగవత్తత్వాన్ని    ప్రసావిస్తుందే కాని వేరుగా  మాట్లాడదు.  అందుకే బలరాముడే కాకుండా జరాసంధుడు  కూడ భగవన్మహిమ ను, భగవత్తత్వాన్ని వివేచన చేస్తాడు. ఇది పోతన  చేత రామభద్రుడు పలికించిన భాగవతం   కదా.
           
                  “ భూషణములు సెవులకు బుధ తోషణము లనేక జన్మదురితౌఘ విని
             శ్శోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణభాషణముల్

                   
      --  అంటాడు పరీక్షిన్మహారాజు .
                   
                       భీష్మక నందన యైన రుక్మిణి  రమాభగవత్యంశ భవ అన్నాడు పోతన .అంటే రుక్మిణీ దేవి లక్ష్మీ అంశ సంభూతురాలని  పోతన ఉవాచ.   రాఘవత్వే భవేత్సీతా రుక్మిణీ కృష్ణ జన్మనీ   అని చెపుతోంది  విష్ణుపురాణం.  శ్రీ మహాలక్ష్మి రామావతారం లో సీతాదేవి గాను, కృష్ణావతారం లో  రుక్మిణీదేవి గాను జన్మించింది. అందుకే  రుక్మిణీ దేవి అగ్నిద్యోతుని తో శ్రీకృష్ణునికి  పంపించిన సందేశంతో --
                  
                      ఏ నీ చరణసేవ లే ప్రొద్దుఁజేసిన భువనోన్నతత్వ్తంబు బొంద గలుగు
                    నట్టి నీ యందు నా చిత్త మనవరతము,నచ్చియున్నది నీ యాన నానలేదు.
   
             అనగలిగింది రుక్మిణి . అంతేకాదు. నీ వంటి లోకాభిరాముని ఏ కన్యలు  కోరుకోకుండా ఉండగలరని కూడ ప్రశ్నిస్తుంది.
             
                ధన్యున్ లోకమనోభిరాముఁ గులవిద్యారూపతారుణ్య సౌ
               జన్యశ్రీ బలదాన శౌర్యకరుణా సంశోభితున్  నిన్ను నే
               కన్యల్ గోరరు కోరదే మును రమాకాంతా లలామంబు రా
               జన్యానేకప సింహ నా వలననే జన్మించెనే మోహముల్.
                
                              ఆవిడ నిత్యఅనపాయిని. ఆయన లక్ష్మీనాథుడు. ఈ భావనే పోతన మనస్సులో  గాఢంగా ఉంది. అందుకే ఆ పద్యంలో అంత చక్కని ఎత్తిపొడుపు నిష్ఠూరం మధురం గా ధ్వనిస్తున్నాయి. ఆ మధుర భావనే మధుర భక్తి గా పరిణామం చెంది  పోతనే రుక్మిణి గా తాదాత్మ్యత ను భజించాడు.  అటువంటి ప్రభావం వల్లనే భాగవతం తెలుగువారికి నిత్యపారాయణ గ్రంథమైంది.
                
                ఘను లాత్మీయ తమోనివృత్తి కొఱకై గౌరీశు మర్యాద నె
                  వ్వని పాదాంబుజ తోయమందు మునుగన్ వాంఛింతురే నట్టి నీ
                  యనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూఱు జన్మంబులన్
                  నినుఁ జింతించుచుఁ బ్రాణముల్  విడిచెదన్  నిక్కంబు......       
             
                            మహత్ములైన వారు అజ్ఞాన రాహిత్యం కోసం  శ్రీ పరమేశ్వరుని వలే ఏ మహానుభావుని పాదపద్మాలలో ప్రభవించిన పవిత్రజలాలలో ఓలలాడాలని కోరుకుంటారో అటువంటి నీ అనుగ్రహానికి  నేను అర్హురాలను కాకపోతే ......  ప్రాణాలర్పిస్తానన్నమాట  ఒక మహాభక్తురాలు మాత్రమే      ( మహాభక్తుడు )  మాత్రమే అనగలదు..
       
                నీవు భోగింపగా లేని  తనూలత వలని సౌందర్యమేల ? నీ యధరామృతం బానగా లేని జిహ్వకు ఫల రససిద్ధి ఏల ?”
      
                         --- అని ఒక  తెలుగింటి  ఆడపిల్ల  కాబోయే వరుని కి సందేశం పంపడ  మంటే  కొంచెం వింత గానే అనిపిస్తుంది.     కాని ఈ మాటలు మధుర భక్తి  భావనా నిర్మగ్నుడై  ఒక భక్తురాలు లేక భక్తుడు   భగవంతునితో అనగలిగిన మాటలే కాని  ఆడపిల్ల పంపిన సందేశం కాదని మనం గుర్తించాలి.  అది పోతన పూర్వజన్మకృత పుణ్యఫలం. పోతన తెలుగువాడవడం తెలుగువారి పుణ్యఫలం.

        “ లగ్నంబెల్లి వివాహముం గదిసె.........   ఘనుఁ డా భూసురుడేగెనో..... పోడను బ్రాహ్మణుండు ........    చెప్పదు తల్లికిం ..............      తుడువదు కన్నులన్ ........ మలగున్ మెల్లని గాలికిన్ ........... వంటి పద్యాలు  స్వామి రాక కోసం  ఆందోళనతో ఎదురు చూస్తున్న భక్తురాలి మనస్సంఘర్షణకు దర్పణాలు.
  
             ఈ ఘట్టం లోని ఎన్నోపద్యాలు తెలుగువారి జిహ్వాగ్రాల మీద ఎప్పుడు  నాట్యమాడుతూనే ఉన్నాయి.      
        
                     “ నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్
                  మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతు గదమ్మ   మేటి పె
                  ద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరిం బతి సేయు మమ్మ  నిన్
                  నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ యీశ్వరీ!”
     
                            --   నిన్ నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ యీశ్వరీ .-- అంటూ చేతులు జోడించింది రుక్మిణి.     
    
             ఇదిగో ఈ విశ్వాసమే ఇంతకాలం గా  ఈ జాతిని  బ్రతికిస్తోంది.  నేనున్నానని ధైర్యంగా  ముందుకు నడిపిస్తోంది.పోతన భాగవతాన్ని తలపై పెట్టుకొని మోయిస్తోంది.

                    గజేంద్రమోక్ష ఘట్టంలో శ్రీ మహావిష్ణువుని అలవైకుంఠ పురంబులో నగరిలో  ఆమూల సౌథంబు దాపల దర్శించిన మహాకవి రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో జగన్మోహనుడైన శ్రీకృష్ణుని ..
     
                     కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం గంఠీరవేంద్రావ ల
                     గ్నుం  నవాంభోజదళాక్షుఁ జారుతరవక్షున్ మేఘసంకాశ దే
                     హు నగారాతి గజేంద్ర హస్తనిభబాహుం జక్రి బీతాంబరున్
                    ఘనభూషాన్వితుఁ గంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్.
                              
                      ఒక్కసారి మనం గుండెల నిండా గాలి పీల్చుకొని ప్రశాంతంగా కళ్లు మూసుకుంటే, చంద్రమండల ముఖుడు,సింహమధ్యముడు, అంభోజదళాక్షుడు,    చారుతర వక్షుడు. నీలమేఘశ్యాముడు, పీతాంబరుడైన చక్రధారి కన్నులముందు ప్రత్యక్షమౌతాడు.
              
                      అది పోతన భాగవతం తెలుగువారికిచ్చిన వరం.








**************  కృష్ణం వందే జగద్గురుమ్******************************                         

    

No comments: