మా నిషాద -హే లక్ష్మీనివాస
విశ్వ సాహితీ విపంచిక పై రామకథ ను
పలికించి భారతజాతి ఆదర్శాలను, ఔన్నత్యాన్ని, ప్రపంచానికి ప్రదర్శించిన వాల్మీకి
రామాయణ మహాకావ్యానికి నాందీగీతం
ఈ “మానిషాద శ్లోకం.
మా నిషాద ప్రతిష్ఠాంత
మగమ శ్శాశ్వతీస్సమా:
యత్క్రౌంచ మిథునా దేక మవథీ: కామమోహితం !!
క్రౌంచ హనన సందర్భ సంజనిత శోకమే శ్లోకమై ఋషి
కవిగా మారిన కళ్యాణఘడియ లో శోకార్తుడైన వాల్మీకి ముఖ వినిర్గత శ్లోకమే ” మానిషాద” .
కావ్యావిర్భావ
ప్రథమదశలో కవిలో చెలరేగే వివిధమైన అనుభూతులకు ప్రత్యక్షోదాహరణం మానిషాద శ్లోకావిర్భావ
సన్నివేశము.
విశ్వశ్రేయస్సుని కాంక్షించే కవి
లోకం కోసం తపించి బహిర్జగత్తులో ఆత్మైక్యం
పొందుతాడని, అటువంటి తాదాత్మం నుండే కవిత్వ మావిర్భవిస్తుందని లౌకిక జగత్తుకి
తెలియజెప్పిన ఆదికవి కృత ప్రథమకవిత్వం “ మానిషాద” .
కవిలో కలిగిన ఆవేదన ఆవేశాలు అనుభూతికి
దగ్గరగా అక్షరాకృతిని దాలిస్తే అది కవిత్వమౌతుందన్న ప్రాచ్య,పాశ్చాత్య కవిత్వ
నిర్వచనాలకు ప్రాణం –ప్రేరణ "మానిషాద”.
“Poetry is the spontaneous over flow of powerful feelings”—words
worth “The thought of in which emotion spontaneously
embodies it self-“ john stuart mill
“ Poetry is a vent for over charged feeling “–john kebel
“ “Poetry Is responsible for mankind –Even for animals”–కవిసేన మానిఫెస్టో పుట -202
“ “Poetry Is responsible for mankind –Even for animals”–కవిసేన మానిఫెస్టో పుట -202
నారదమహర్షి చెప్పి వెళ్లిన
రామచంద్రుని గాథను మననం చేసుకుంటూ స్నానార్ధం తమసానదీ తీరానికి చేరుకున్నారు
వాల్మీకి. ఇంతలో ఒక బోయవాడు ప్రణయపారవశ్యం
తో విహరిస్తున్న క్రౌంచపక్షి జంటలో మగపక్షిని నేలకూల్చాడు. మనోహరమైన రామకథను
భావించు కుంటూ తన్మయుడై యున్న
మహర్షికి భర్తను కోల్పోయిన ఆడపక్షి శోకం రామ చంద్రునికి దూరమై రావణునిచే బంధించబడి
విలపిస్తున్న సీతమ్మ శోకం వలె థ్వనించింది.
ప్రశాంత మైన హృదయం లో చెలరేగిన బాథ కోపమై ప్రభవించింది. కోపం శాప మై వెలువడింది. శోకమే శ్లోకమైంది. “శోకార్తస్య ప్రవృత్తోమే శ్లోకోభవతు నాన్యథా “అని మహర్షి ఉవాచ. లౌకిక జగత్తు కి అనుష్టుప్ ఛందం లబించింది. మహర్షి శోకము శ్లోకమై సుశ్లోకార్హమైంది .
ఈ శ్లోకం కథాపరంగా చూస్తే
బోయవానికి “ ఓ నిషాదుడా! నీవు
కామమోహితమైన క్రౌంచ మిథునములోని ఒక
దానిని కొట్టితివి కావున నీవు ప్రతిష్ఠను
పొందకుందువు గాక “అని వాల్మీకి యిచ్చిన శాపం గా కన్పిస్తున్నప్పటికి,
ఇది చతుర్ముఖ వరప్రసాదితుడైన వాల్మీకి
ముఖము నుండి వెలువడిన ప్రథమ శ్లోకం కాబట్టి
ఇది శాప మో శోకమో కాదని ఇది రామాయణ మహాకావ్యానికి నాందీశ్లోకం వంటి దని
భావించిన రామాయణ వ్యాఖ్యాతలు ఈశ్లోకంలో
క్రొత్త అందాలను దర్శించారు.
“ అర్థతశ్శబ్ధతోవా2పి మనాక్కావ్యార్ధసూచనం “అన్నఆలంకారికోక్తి ననుసరించి “మానిషాద “ శ్లోకంలో” పౌలస్త్య వథ” { “ కామమోహిత మవధీ
రిత్యనేన – పౌలస్త్యవథ మిత్యేవేతి విరోథి రావణ నిర్థేశ:” శ్రీ.మద్రా.
గోవిందరా.వ్యాఖ్య-137 }నిరూపించబడిందని,
రామాయణ గాథ యావత్తూ దీనిలో ప్రస్తావించబడిందని వ్యాఖ్యానకర్తలు వివరిం చారు.
“
.....దేవర్షిగణం.... అవసాదయతీతి పీడయతీతి నిషాద తస్య సంబుద్ది: హే నిషాద ! రావణ – యద్యస్మాత్ క్రౌంచమిథునాత్ .....
క్రౌంచం- రాజ్యక్షయ వనవాసాది దుఖేన
పరమకార్శం గతం యన్మిథునం సీతారామ రూపం తస్మాదేకం సీతా రూపం....”.ఈవిధంగా మహేశ్వరతీర్థుల వ్యాఖ్యానం కన్పిస్తోంది.
దేవతలను, ,ఋషులను పీడించిన రావణుడే నిషాదుడు
కాగా భర్తృవియోగాన్ని పొంది విలపిస్తున్న
క్రౌంచిని సీతాదేవి గా భావించి రామకథను సమన్వయించారు మహేశ్వర తీర్థులు.
“ “మానిషాద” శ్లోకంలోని ప్రతిపదాన్ని రామాయణంలోని కథ తోను , కాండల పరంగాను విభజించి వ్యాఖ్యానకారులు చేసిన సమన్వయాన్ని చూస్తే ఆ మహానుభావులకు మరొక్కసారి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది.
“ “మానిషాద” శ్లోకంలోని ప్రతిపదాన్ని రామాయణంలోని కథ తోను , కాండల పరంగాను విభజించి వ్యాఖ్యానకారులు చేసిన సమన్వయాన్ని చూస్తే ఆ మహానుభావులకు మరొక్కసారి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది.
“మా నిషాద” –
ఇత్యనేన సీతాపరిణయ పర్యవసానే
బాలకాండ కథా ---- ఇచ్చట” మా” అనే మాటకు “ వద్దు” ,”కూడదు” , అనే నిషేధార్ధం కాకుండా “ మా” అంటే “లక్ష్మీ”అనే అర్ధం తో సమన్వయం
సాధించారు.” ఇందిరా లోకమాతా మా “అని అమరకోశం .
“ మా లక్ష్మీ : తస్యా: నిషాద : మానిషాద: శ్రీనివాస: తత్రసంబుద్ధి హే శ్రీనివాస ! అని గోవిందరాజీయం. “ లక్ష్మీ –నివాస” ఇతి” మా లక్ష్మీ నిషీదత్యస్మిన్నితి మా నిషాద తత్సంబోధనం హే మా నిషాద విష్ణో: “ అని తత్త్వ దీపికా వ్యాఖ్యానం.
అదేవిదంగా ......... “ ప్రతిష్ఠాం త్వ మగమ “ అన్న రెండవ పదానికి “పితృవచన పరిపాలనా ప్రతిష్ఠాభిధాయిన్యయోథ్యకాండ కథా---“ . అని పితృ వాక్యపరి పాలన పూర్వక అయోథ్య కాండ ను,
“ శాశ్వతీ స్సమా
----“ అన్న మూడవ పదానికి …… “ శాశ్వతీ స్సమా
ఇత్యనేన ఋషిగణ విషమ ప్రతిజ్ఞా నిర్వహణేన
ప్రతిష్ఠానువృత్తి మభిదధ త్యరణ్యకాండ కధా సూచితా
---- అని ఋషి సంరక్షణ ప్రతిజ్ఞా
పరిపూర్తి యనెడు -అరణ్య కాండ ను ,
“ కామమోహితం “--- అన్న
పదానికి ....... కామమోహితం సుగ్రీవ భార్యాపహర్తారం వాలిన మవధీరితి
కిష్కింధకాండ కథా అభిహితా .....”.అని సుగ్రీవుని భార్యను అపహరించిన కాముకుడైన వాలి వధ ను పూర్తి చేసిన కిష్కంధ
కాండను,
“ క్రౌంచా......
తయోరన్యోన్య విరహ క్లేశ కృశీయశో సీతారామయోరేక మవయవం సీతా రూప మవథీ భృశం పీడితవానసీతి సీతా విరహ వర్ణన పరా సుందర కాండ కథా స్పోరితా” .... అని సుందరి యైన సీతా విరహ వర్ణన పరంగా
సుందర కాండ ను ,
“...... క్రౌంచౌ
కుటిలౌ రాక్షసాత్త న్మిథునాదేకం కామమోహితం రావణమ వథీరితి యుద్ధకాండ కథా
సూచితా.....” కామమోహితుడై
మోసంతో ఒక జంటను విడదీసిన రావణుని వథను చెప్పే యుద్దకాండ తోను, ........... సమన్వయించారు.
శ్రీమద్రామాయణ మహాకావ్యానికి నాందీగీతమైన ఈ
శ్లోక ప్రాథాన్యాన్ని ఒక్కసారి విజ్ఞులతో
కలిసి పంచుకొని, రామాయణ ఔన్నత్యాన్ని, దాన్ని అందించిన మహనీయుల మహదౌన్నత్యాన్ని మరొక్కసారి గర్వంగా
స్మరించుకోవడానికి చేసిన చిన్న ప్రయత్నం ఇది.
######## జననీ
జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి #########
No comments:
Post a Comment