ఎద పొంగిన భావఝరులు
గుండెలోన సుళ్ళు తిరిగి
అక్షరాల వెల్లువలై
పెదవులపై రవళిస్తే కూనిరాగం ****!
ఆకాశంలో హరివిల్లు విరిస్తే
వాకిట్లో వడగళ్లు కురిస్తే
చిన్నారుల కన్నుల్లో సంతోషం మెరిస్తే
మనసు పాడుతుందొక ఆనందమయరాగం****!
పసిపాపల చిరునవ్వులు
పైరు పచ్చని పంటపొలాలు
పడుచుజంటల తీపి ఊసులు
కావ్యకల్పనకు పరిపోషకాలు ****!
అమ్మానాన్నల ఆప్యాయత
ఆలుబిడ్డల అనురాగం
పరిపూర్ణంగా పొందిన పురుషుడు
ఆలాపిస్తాడు
మోహనరాగం ****!
కూ కూ అనే స్వరమే
కోయిల గానమై
పంచమస్వరంగా పరిఢవిల్లి
ప్రసిద్ధమైందిగా కూనిరాగమై ****!
క్రౌంచిరోదనతో కదిలిన హృదయం
ఆలాపించింది మానిషాద శ్లోకం
ఆదికవి అందించిన అనుష్టుప్ ఛందం
కావ్యజగతికే యది భూపాలం ****!
విశ్వనాధ వంటి కవి
బాపిరాజు వంటి కథకుడు
శేషేంద్ర వంటి విమర్శకుడు
లభించడం తెలుగుజాతి సుకృతం ****!
మొల్ల రచించిన రామాయణం
పోతన అందించిన భాగవతం
వేమన చెప్పిన పద్యాలు
లేని ఇంట్లో మరి ఉన్నదేమిటి ****!
No comments:
Post a Comment