Monday, 2 January 2017

శత వార్షిక ముక్కోటి మహా మండపం. -నందిగామ

 

           శత వార్షిక ముక్కోటి మహా మండపం.  -నందిగామ   
                   Limca book of records –2001

                           
  
                  కృష్ణాజిల్లా నందిగామ అత్యంత ప్రాచీనమైన గ్రామం గా చారిత్రక ఆథారాలున్నాయి . మండల కేంద్రమైన నందిగామ హైద్రాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పై విజయవాడ కు ఉత్తరం గా 52 కి.మీ దూరం లో ఉంది.కాకతీయుల కాలం నుండి శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు పరిపాలన వరకు వివిధ దశల్లో చరిత్ర కెక్కిన ఈ నందిగామ 2001  వ సంవత్సరం లో” లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్” లో స్ధానాన్ని పొంది మరొక్కసారి,చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకొని, లోకం దృష్టి ని ఆకర్షించింది.
                

          
       
                వంద సంవత్సరాలకు పైగా ఒకే కుటుంబం  ముక్కోటి ఉత్సవాలను  నిరాఘాటంగా నిర్వహించడం అందుకు కారణంగా గుర్తించడం జరిగింది. ఈ ముక్కోటి ఏకాదశి నే భక్తులు” వైకుంఠ ఏకాదశి “ అని కూడపిలుస్తారు. దీని ప్రాశస్త్యము పురాణాల్లో  ఇలా చెప్పబడింది.
                     ఏకాదశి ఉపవాసాలు – విష్ణ్వారాధనము ప్రశస్తమైనవి గా “ఏకాదశ్యాంతు దళయోర్నిరాహార స్సమాహిత: రాత్రౌ జాగరణం కృత్వా యాతి విష్ణో: పరం పదమ్.”అని నారద పురాణం.(121-1-4 )
       

                   
                                                          శ్రీ భూ, నీళా సమేత చెన్నకేశవ స్వామి
               
                       “  మాసానాం మార్గశీర్షో2హం “  అని గీతాచార్యుడు మార్గశీర్ష మాసమును విశిష్టమైనది  తెలుపుట చే మార్గశీర్ష శుద్ధ ఏకాదశి ని“మోక్షైకాదశి “గా కూడా చెపుతుంటారు. కాలరూపి యైన సూర్యభగవానుడు  చీకటి కాలము నుండి విముక్తి పొంది, పగటి కాలమైన ఉత్తరాయణము లోనికి ప్రవేశించే దానికి ఉష: కాలమిది. రవికి చీకటి నుండి విముక్తి కల్గుట చే దీనికి మోక్షైకాదశి అని పేరు వచ్చి ఉండవచ్చని పండితులు భావిస్తున్నారు.   అందుకే మార్గ శీర్ష మాసమును ఆగ్రహాయనమంటారు. హాయనమునకు ముందు కాలము.అదియే ఉషస్సు.
                  అంతేకాదు మోక్షాఖ్యయైన మార్గశీర్ష శుద్ధైకాదశి యందు ఉపవసించి, ద్వాదశి ప్రాత: కాలమున హరిని అర్చించి సమస్తోపచారముల తో బ్రాహ్మణులకు  భోజనము పెట్టి, దక్షిణ ల  నొసంగి, బంధు సమేతుడై భుజించిన మానవుడు తనకు ముందు తరములను, తనకు తదుపరి పది తరములను, తనను ఉద్ధరించుకొని, హరి సాన్నిధ్యాన్ని పొందుతాడని నారద పురాణం చెపుతోంది.   ఈ పర్వదినముమోక్షైకాదశి గా వైకుంఠప్రాప్తిని అందించుట చే దీనినే వైకుంఠఏకాదశి కూడ చెపుతున్నారు.
                   దీనినే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ముక్కోటి అనునది ముప్పది మూడు కోట్లకు” నామైక దేశే నామగ్రహణం “  అను న్యాయమున వ్యవహారమున  కలిగిన సంగ్రహ రూపము గా భావించవచ్చు.ముప్పది మూడు కోట్ల మంది దేవతలు ఈ రోజు  భూమికి దిగి వచ్చి, అర్చారూపుడైన శ్రీమన్నారాయణుని ఆలయ ఉత్తర ద్వారమున దర్శించి తరిస్తారని, పురాణాలు చెపుతున్నాయి. “దేవానాం దైవతం విష్ణు ర్దానవానాం త్రిశూల భృత్” అను పద్మపురాణ వచనము చే దేవతలకు  విష్ణువు దేవుడు కాగా రాక్షసులు శంకరుని అబిమానిస్తున్నారు.
               ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ముక్కోటిని  నందిగామ లో గత నూటపదమూడు సంవత్సరాలుగా ఒకే కుటుంబం నిర్వహించడం లిమ్కా బుక్ ఆఫ్  రికార్డ్స్ కి అర్హమైంది.
                 
           నందిగామ లోని ప్రసిద్ధ ఆలయాల్లో చెన్న కేశవాలయం ఒకటి.  ఇది కాకతీయుల ప్రతిష్ట గా  చెప్పబడుతోంది.  ఈ ఆలయం లో దీవి వంశం వారు పారంపర్య అర్చకులు గా ఉంటున్నారు.19 వ శతాబ్దం లో  శ్రీమాన్ దీవి  రాఘవాచార్యలు గారు     శ్రీవారి సేవలో ఉండగా  ఈ ముక్కోటి ఉత్సవాలు  ప్రారంభమైనాయి.
               
                
                                         
                 ఆనాటి   ముక్కోటి పందిరి      దృశ్యము
                      
                    ఆంజనేయ ఉపాసకులు, దైవభక్తి పరాయణులైన శ్రీమాన్ రాఘవాచార్యులు గారికి మానవజాతికి మోక్షదాయకమైన  ఈముక్కోటి ఉత్సవాలు నిర్వహించాలనే సత్సంకల్పం భగవదనుగ్రహం గా సంభవించింది. వీరి ఇల్లాలు శ్రీమతి లక్ష్మీ తులశమ్మ . ఇటువంటి ఆతిథేయ  కార్యక్రమాలు చేయాలంటే ఇల్లాలి పూర్తి సహకారం కావాలి. “ఆ నిష్ఠానిథి గేహసీమ నడు రేయాలించినన్”  అన్న వ్రాతలు  కృష్ణరాయలు  ఇటువంటి ఇళ్లను చూసే వ్రాసుంటాడ నిపిస్తుంది . అది పరిపూర్ణం గా లభించడం మూలంగానే మూడు తరాలుగా ఈ ముక్కోటి కార్యక్రమాలు  ఈ ప్రదేశంలో అవిఛ్ఛిన్నంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమాలు ఐదు రోజు జరిగినా, ఎనిమిది రోజులు జరిగినా  వచ్చిన వారందరకు వారి ఇంట్లోనే భోజనం,వసతి ఏర్పాటయ్యేది. ఆ సంప్రదాయమే ఇప్పటికీ కొనసాగుతోంది.
                      

                     
                                         
        
                                              ఈనాటి    ముక్కోటి మహామండపం 
                 
            ఆ ఆలోచన రావడమే ఆలస్యం శ్రీ రాఘవాచార్యులు  ఆనాడు నందిగామ సర్కిల్ ఇనస్పెక్టర్ గా ఉన్న శ్రీ సుసర్ల సత్యనారాయణ గారి తో కలసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఆ రోజుల్లో నాలుగు గుంజలు పాతి ,పందిరి వేసి దానిలో  స్వామిని వేంచేపు  చేయించి పూజలు చేసేవారు.ఒకరోజు తీర్ధ ప్రసాద వినియోగం తో కార్యక్రమాలు ముగిసేవి.ఈవిధంగా ఐదు సంవత్సరాలు ఉత్సవాలు నిర్వహించారు.
            
         

                    
                                    అనుగ్రహభాషణం చేస్తున్న శ్రీశ్రీశ్రీ శృంగేరి ఫీఠాథిపతి

              
                     1905 లో శ్రీమాన్ రాఘవాచార్యులు మరియు హెడ్కానిస్టేబుల్ శ్రీ వెంపా గోపాలరావు నాయుడు  తో కలసి  భక్తుల ఆదరణ పెరగడం మూలంగా ఈ కార్యక్రమాలను అయిదు రోజులు నిర్వహించాలని నిర్ణయించారు.బందరు నుంచి మండపం అలంకరించే వారిని, బాణసంచా తయారు చేసేవారిని ఇరవై రోజులు ముందుగానే పిలిపించి రహదారి బంగ్లా లో ఉంచి, అలంకరణ సామగ్రిని, బాణసంచాను తయారు చేయించేవారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామి పూలపల్లకిలో, దీపకాంతుల తో, బాణసంచా కాలుస్తూ నౌబత్ కానా, సన్నాయి మొదలైన మంగ ళ వాద్యాలతో స్వామి వారి  నగరోత్సవం జరుగుతుంటే ప్రజలు వందలాది గా పాల్గొని, జాతర ను తలపింప జేసేవారట. 
               
                                 అనుగ్రహభాషణం చేస్తున్న శ్రీశ్రీశ్రీ ధత్త పీఠాథిపతి
                            
                     ఈ అయిదు రోజుల్లో రెండు రోజులు కూచిపూడి కి చెందిన శ్రీ వేదాన్తంసత్యనారాయణ, పసుమర్తి, చింతావార్ల తో ఉషాపరిణయం, సత్యహరిశ్చంద్ర, భక్తప్రహ్లాద వంటి అనేక భక్తిరసాత్మక నాటకాలను ప్రదర్శించేవారు. వీటిని చూడ్డానికి చుట్టుప్రక్కల గ్రామాలవారు ఎడ్లబండ్లు కట్టుకొని వచ్చి ఈ కార్యక్రమాల్లో  పాల్గొనేవారు.ఆ రోజుల్లొ అవనిగడ్డ వాస్తవ్యులు శ్రీ కోడూరి విశ్వనాథం గారి  సతీసక్కుబాయి హరికథ ప్రత్యేక ఆకర్షణ గా ఉండేది. వీరు తన హరికథ లో అష్టపదులు, తరంగాలు గానం చేస్తూ ప్రజల్ని తన్మయుల్ని చేసేవారట. ఇదే కాలం లో శ్రీ బాలాజీ దాసు, అంబటి రాధాకృష్ణ గార్లు కూడ ఛక్కని కథ తో  భక్తులను ఆకట్టుకునేవారు. 1914 లో తొలిసారి  గా హరికథాపితామహ ఆదిభట్ల నారాయణ దాసు గారు ఈ ఉత్సవాల్లో మధుర భక్తి భావ రంజకంగా హరికథా గానం చేశారు. ఆ సమయం లో దాసు గారు నందిగామ ను ప్రశంసిస్తూ చెప్పిన పద్యం ఇప్పటికీ ముక్కోటి మహామండపం లో శిలా శాసనం గా కన్పిస్తోంది.
           
                      
                        ఈవిధంగా ముప్పది ఐదు సంవత్వరాలు శ్రీరాఘవాచార్యలు గారు గోపాలరావు నాయుడు గారు నిరాఘాటంగా ఈ ఉత్సవాలను కొనసాగించారు .అనంతరం ఇరవై సంవత్సరాలు శ్రీరాఘవాచార్యులు గారుశ్రీదేవత ఘంటయ్య తో కలసి ఉత్సవాలను నిర్వహించారు. శ్రీ సూరె సత్యనారాయణ మూడు సం.రాలు, శ్రీ బవిరిశెట్టి సూర్యనారాయణ ఒక సం.రము  బాధ్యతలు తీసుకోని కార్యక్రమాల్ని నిర్వహించారు.  ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆనాటి నుండి ఈ నాటి దాకా ఈ కార్యక్రమాలన్నీ భక్తులిచ్చే విరాళాల  ఆధారం గానే నిర్వహించబడటం  గమనించ దగ్గ విషయం.
            
                  
                  
                                  అనుగ్రహ భాషణం చేస్తున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయరు స్వామి వారు
                    

                       శ్రీమాన్ రాఘవాచార్యులు గారి కుమారుడు శ్రీమాన్ అథోక్షజాచార్యలు గారు వీరి సతీమణి శ్రీమతి రంగనాయకమ్మ . వీరు 1964 నుండి పదిహేనుసంవత్సరాలు శ్రీ కొమరగిరి నరసింహారావు, శ్రీపతి విశ్వనాథం తో కలసి అట్టహాసంగా ఈ కార్యక్రమాల్ని నిర్వహించారు.  ఆథ్యాత్మిక ప్రసంగాలు, హరికథలు,  భక్తి రసాత్మకమైన నాటకాలు హైందవ ధర్మాన్ని , సంస్కృతిని రక్షించడానికి  తోడ్పడుతున్నాయనడం లో ఎంతమాత్రము  అతిశయోక్తి లేదు.ఈ కార్యక్రమాల్లో నందివెలుగు వాస్తవ్యులు శ్రీ ప్రతాపగిరి లక్ష్మీనరసింహ శాస్త్రి ఏటా మూడు రోజులు హరికథా గానం చేశేవారు. ఈ ఉత్సవాలు జరిగే దేవాలయం చుట్టు  బొమ్మలు, బూరలు,మంచంమిఠాయి, ఫ్యాన్సీ వస్తువులు అమ్మే కొట్లు విరివిగా  వెలసేవి. అన్నాలుకట్టుకొని, తినుబండారాలు చేసుకొని  బండ్లు కట్టుకొని చుట్టుప్రక్కల గ్రామాలవారు ఈ  ఉత్సవాలకు వచ్చేవారు.
        
                       
     
                     
                            కార్యక్రమానంతరం సన్మానం స్వీకరిస్తున్న శ్రీమతి శోభానాయుడు

         
                        శ్రీమాన్ అధోక్షజాచార్యులు గారి కుమారుడు శ్రీమాన్ మంగనాథాచార్యులు . వీరి ధర్మపత్ని మేదినీదేవి. కాలక్రమంగా 1980  వ సంవత్సరం నుండి శ్రీ మంగనాథాచార్యులు  ఈ కార్యక్రమాలను చేపట్టి వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ యేచూరి గుర్నాధం, పబ్బతి పొంగళ్లు, వెంకటేశ్వరరావు గార్ల సహాయసహకారాల తో భక్తుల వితరణ తో ఈ కార్యక్రమాలు జరుగుతున్నట్లు కార్యక్రమాల కన్వీనర్ శ్రీ మంగనాథాచార్యులు  చెప్పారు.
                            ఆంధ్ర రాష్ట్రం లో లబ్ధ ప్రతిష్టులైన  సాహితీ వేత్తలు, కళాకారులు, అష్టావధాన, శతావధాన, సహస్రావదానులు, సినీప్రముఖులు, కూచిపూడి కళాకారులులు, గాయనీ మణులు అందరు ఏదోఒక సంవత్సరంలో ఈ వేదిక ను అలంకరించారంటే దీని ప్రాముఖ్యత ను మనం గమనించవచ్చు.
                  

                         సన్మానం స్వీకరిస్తున్నశ్రీమతి గురు కొండవీటి జ్యోతిర్మయి 
                         

                          హైదరాబాద్ వారిచే భువనవిజయం,వేదాంతం వారిచే విప్రనారాయణ,నాటకాలు,శ్రీయుతులు మేడసాని,మాడుగుల,గరికపాటి, ప్రసాదరాయయకులపతు, శ్రీ సి.వి.సుబ్బన్న, పాలపర్తి శ్యామలానందప్రసాద్ వంటి వారి అష్టావధానాలు ఇక్కడ నిర్వహించ బడ్డాయి.                     
                 2007వ సంవత్సరం లో డిశెంబరు 22,23 తేదీలలో 108 వ ముక్కోటి ఉత్సవాలసందర్భంగా  శ్రీ మేడసాని శతావధానాన్ని కూడ   ఈ వేదిక నిర్వహించింది. ఇదొక అపురూప  కార్యక్రమంగా ఈప్రాంత ప్రజలకు గుర్తుండి పోయింది.
                                   
                  
              
               
                                     శ్రీ     మేడసాని అష్ఠావధాన    దృశ్యం


                         శతవార్షిక వేడుకలలో భాగంగా ప్రపంచ ప్రసిద్ధ  కూచిపూడి నాట్యకారిణి శ్రీమతి” శోభానాయుడు” శ్రీకృష్ణ పారిజాతాన్ని ప్రదర్శించి, సన్మానాన్నిస్వీకరించారు.  ముక్కోటి శతవార్షిక సంచిక ఈ కళాకారిణి కే అంకితం చేయడం ఒక ప్రత్యేకత.అలాగే 102 వ ఉత్సవాలలో  అన్నమాచార్య భావనా వాహిని సృష్టికర్త శ్రీమతి “శోభారాజ్ “తన గానామృతం  తో శ్రోతలను తన్మయీభూతులను చేశారు.
                   
         
                       పండిత సత్కారాలు,కుడివైపు మొదట కన్వీనర్  శ్రీ మంగనాథా చార్యులు
  
                 105 వ ముక్కోటి ఉత్సవాల్లో అన్నమయ్య కళాపీఠం వ్యవస్ధాపకురాలు”,గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్ట్ రికార్డు” ప్రశంసలందిన” గురు కొండవీటి జ్యోతిర్మయి”  తన  భక్తి సంగీతం లో  ప్రజలను ఓలలాడించారు.
                        
              
             
                     ముక్కోటి ఉత్సవాల్లో  శ్రీ పద్మనాభం, శ్రీ రావిికొండలరావు, శ్రీ జాలాది

            
                95 వ ఉత్సవాల్లో  శ్రీ చంద్రమోహన్,98 వ ఉత్సవం లో శ్రీ సాక్షిరంగారావు,99 లో శ్రీ బాలయ్య,102 లో శ్రీ  నూతన్ ప్రసాద్,103 వ ఉత్సవం  లో  శ్రీ పద్మనాభం సన్మానాలందుకున్నారు. అలాగే  శ్రీయుతులు కాంతారావు ,ధూళిపాళ, అల్లురామలింగయ్య, జె.వి సోమయాజులు, గుమ్మడి,రావికొండలరావు జాలాది వంటి సినీకళాకారుల్ని ఈ వేదిక సత్కరించుకుంది.
               
                      
               
                                   శ్రీ అల్లు రామలింగయ్య ను సన్మానిస్తున్న నిర్వాహకులు
                       
                     శ్రీ శృంగేరి పీఠాథిపతి, శ్రీ దత్తపీఠాథిపతి, శ్రీ కుర్తాళం పీఠాథిపతి, శ్రీ అహోబిల పీఠాథిపతి, శ్రీ చినజియ్యరు స్వామి, శ్రీధవళేశ్వరం పీఠాథిపతి మొదలైన మహనీయుల ఆశీస్సులు ఈ ముక్కోటి వేదిక నుండే నందిగామ మరియు పరిసర ప్రాంత ప్రజలకు లభించాయి.
             
                                     సన్మానం స్వీకరిస్తున్న శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ
                 

                    శ్రీ ఉషశ్రీ,  శ్రీమద్దులపల్లి మాణిక్యశాస్త్రి, ఆచార్య దివాకర్ల వెంకటావధాని, ఆచార్య జి.వి సుబ్రమణ్యం.  ఆచార్య,యన్.గోపి,  ఆచార్య శలాక రఘునాథశర్మ,ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం వంటి మహోపాధ్యాయుల ఉపన్యాసాలను ఈ వేదిక అందించింది. శ్రీమల్లాది చంద్రశేఖర శాస్త్రి,సామవేదం షణ్ముఖ శర్మ, ఫరిమి రామకృష్ణశాస్తి వంటి వారి ఆథ్యాత్మికోపన్యాసాలు, హరికథా చక్రవర్తి శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి, శ్రీమతి విన్నకోట రామ కుమారి, మంత్రిప్రగడ లలితకుమారి వంటి వారి హరికథలు గత కొన్ని సంవత్సరాలుగా  ఈ ముక్కోటి మండపం  అందిస్తూనే ఉంది.
         
                       బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి   ఉపన్యసిస్తున్న దృశ్యం
                                 
                       ది.  12.4 . 2011 శ్రీరామనవమి రోజున శ్రీచెన్నకేశవస్వామి ఆలయ  పునర్నిర్మాణ కార్యక్రమ శంఖుస్ధాపనకు  ఆహ్వానాన్ని  మన్నించి విచ్చేసిన గౌరవనీయులు,  ఆంధ్ర రాష్ట్ర గవర్నరు,  మాన్య మహోదయులు శ్రీమాన్  ఈ.ఎల్. నరసింహం గారి దంపతులను సన్మానించుకోవడం ఒక మహద్భాగ్యంగా ఈ ముక్కోటి  మహామండపం భావిస్తోంది.
                                     

                         
                           చిన్నపందిట్లో  మొదలైన ఈ కార్యక్రమాలు  క్రమంగా వృద్ధి చెందుతూ 2000 సంవత్సరం లో శత వసంతాల సంబరాల సందర్భంగా, భక్తుల వితరణ తో  శతవార్షిక మహామండపానికి శ్రీమాన్ చినజీయరు స్వామి వారి చేతులమీదుగా  శంఖుస్ధాపన చేసుకొని , అదే సంవత్సరం వారి కరకమలాలతోనే ప్రారంభోత్సవం చేయబడింది.    ఈ ప్రాంతం లో ఇప్పుడు పూర్తిస్తాయి లో ఆథ్యాత్మిక, సాంస్కతిక కార్యక్రమాలు జరుపుకోవడానికి ఒక   వేదిక  ఏర్పడింది.                                 
                         
                                       
                       
   
                   ఇంత చిన్న గ్రామం లో ఇంత పెద్ద  పెద్ద కార్యక్రమాలు జరగడం నిజం గా స్ధల ప్రభావమే నని  చెప్పాలి. కర్త సంకల్ప బలం కూడ దానికి తోడయ్యింది.ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నవారికి, ఫ్రోత్సహిస్తున్నవారికి కూడ హైందవ సమాజం సదా కృతజ్ఞత తో ఉంటుందనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.  భగవంతుడు వారికి ఎల్లవేళలా తోడుండాలని మనసారా కోరుకుంటున్నాను.మరి కొంతమందికైనా ఈ కార్యక్రమం ప్రేరణ కావాలనే ఆశ తో ఈ  వ్యాసాన్ని సవినయంగా సమర్పిస్తున్నాను.





**********************************************************  ******************

Friday, 30 December 2016

గుడిమెట్ట నగరం – చాగివారు -3

  రెండవ ప్రకరణం

    గుడిమెట్ట నగరం – చాగివారు -3  


సమకాలీన పరిస్ధితులు-కావ్యనిర్మాణం:
                   

                      చాగి వారి పాలన లో కొనసాగిన సాహిత్య సేవ ఎటువంటిదో చెప్పుకోవడానికి ఎటువంటి ఆథారాలు లభించడం లేదు.తెలుగుజాతికి పంచమవేదమైన ఆంధ్రమహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఆదికవి ని ప్రోత్సహించిన రాజన్యులు వేంగీ చాళుక్యులు. వారి ప్రోత్సాహం తో  వెలిసిన మాండలిక రాజ్యమైనప్పటకీ, షుమారు రెండు శతాబ్దాలు సాగిన చాగి వారి పాలన లో వెలిసిన ఏ ఒక్క కావ్యము  వెలుగ చూడలేదు. వీరు కవి పండిత పోషకులు కాలేదనడానికి అవకాశమే లేదు. ఆనాటి సభ ల్లో కవులను పోషించడం సంప్రదాయం గా వస్తూనే ఉంది. కులోత్తుంగ చోడుని ఆస్ధానకవి “జయగొండాన్”. ఈతను కులోత్తుంగుని  కళింగ యుద్ధ వృత్తాంతాల్ని “కళింగత్తుప్పరణి” అనే కావ్యం లో విశేషం గా వర్ణించాడు. రాజరాజనరేంద్రుని ఆస్ధాన కవి నన్నయ ఆంథ్రజాతి కి ఆదికవి యైనవాడు. తెలుగు జాతి కి సుపరిచితుడు.అటువంటిది ఆ కాలం లో మాండలిక రాజ్యాల్లో కవులను పోషించి కావ్యాలను వ్రాయించడం జరిగే ఉంటుంది. కాని 12 వ శతాబ్దపు వీరశైవ ఉద్యమం , అనంతరం సాగిన మహమ్మదీయ దండయాత్రలు వాటిని ధ్వంసం చేసి ఉంటాయి. విచిత్రం గా ఏ ఒక్క కవి పేరు కాని , కావ్యం పేరు కాని ఈ మూడు  దశాబ్దాల్లో విన్పించడం లేదు. ఏనుగు లక్ష్మణ కవి వ్రాసిన రామవిలాస కావ్యం వరకు గుడిమెట్ట ను స్మరించిన వారే లేరు. వేములవాడ భీమకవ చాటువు  ఒకటి గుడ్డిలో మెల్లగా పోతరాజు పేరును స్మరించింది . కాని అది వివాదస్పదామైంది. అంటే ఈ కాలం లో కావ్యాలు వెలసినా అవి క్రమేణా కాలగర్భం లో కలిసి పోయాయని భావించాల్సి వస్తోంది.
                                     


                                                 -36-
  
                      సమకాలీన పరిస్థితులను ఒక్కసారి పరిశీలిస్తే – మనకు  కొన్ని నిజాలు తెలుస్తాయి. ఆ కాలపు రాజులకు సాహిత్యపోషణ చేసే సమయంలేదేమో ననే వారూ ఉన్నారు.ముఫై వసంతాల పైచిలుకు రాజ్యపాలన చేసిన మొదటి రెండవ పోతరాజుల కాలంలో కూడ ఎట్టి కావ్య నిర్మాణం జరిగిన దాఖలాలు లేవు. ఆనాడు ఆంధ్రదేశం లో శైవానికి ఆదరణ మిక్కుటం గా ఉంది. జైనమతం తెలంగాణా , రాయలసీమల్లో అక్కడక్కడా కన్పిస్తున్నా మిగలిన ఆంధ్రప్రాంతం లో మాత్రం శైవ మే ఆదరించబడి , ప్రజలచేత ఆచరించబడుతోంది. అమరావతీ శాసనం లోని చైత్యమత్యున్నతిం యత్ర నానాచిత్ర విచిత్రితం అన్న వాక్యాన్ని బట్టి ఆనాటికి అమరావతి  మహాచైత్యం నష్టం కాలేదని భావించవచ్చు.  బౌద్ధ మత ప్రభావం ప్రజల్లో లేదు. అమరావతి ,కరీంనగర్, బెక్కల్లు శాసనాలను, పరిశీలిస్తే - బుద్ధభగవానుని  ప్రజలు విష్ణుమూర్తి అవతారం గా భావించి, పూజిస్తున్నట్టు మనం గమనించవచ్చు. (ఆంధ్రుల చరిత్ర –సంస్కృతి .96.పే.)
                       
                  



     అంతేకాదు .శ్రీ రామానుజుని ప్రచారం తో వైష్ణవానికి నూతనోత్తేజం వచ్చింది.ఈ చాళుక్య చోళ యుగం లో పెక్కు ద్రావిడ వైష్ణవ కుటుంబాలు ఆంధ్రదేశం లో స్థిర పడ్డాయి.కొమ్మన మంత్రి ముఫై రెండు క్షేత్రాల్లో విష్ణు ప్రతిష్టలు చేసినట్లు మంచెన తన కేయూరబాహ చరిత్ర లో వ్రాసాడు. శైవ ,వైష్ణ వాలు రెండింటిలోను ఈ యగం లోనే తీవ్రవాద ఉద్యమాలు బయలు దేరాయి శివుని మహావ్రతి గా ఈ కాలపు రాజకవి నన్నెచోడుడు వర్ణిస్తాడు. ఈమహాకవి కావ్యం కుమారసంభవమే తెలుగు వారికి చాలా ఆలస్యం గా దొరికింది.. ఈ విధంగానే ఏ చీకటి కోణాల్లోనో ఈ యుగపు కవులు  దాగున్నారేమో. ఈ కాలం లో అలంపురం ,శ్రీశైలం,బెజవాడ ,పిఠాపురం  శక్తి పూజా కేంద్రాలు గా ప్రసిద్ధి పొందాయి. బసవేశ్వరుని వీరశైవోద్యమం జాతిని జాగృతం చేసింది.
                                    
                      శివుడే పరదైవతమనే భావన ,లింగధారణ ,లింగ అంగ సమైక్య సాధన వీరశైవం లోని ప్రధానాంశాలు. జైన ,బౌద్ధాల లోని నైతిక వర్తన , సాఁఘిక సమత్వం  పౌరాణికమతం లోని భక్తి ని బసవేశ్వరుడు వీరశైవం లో సమన్వయం చేశాడు. ఆంధ్రదేశం లో ఈ యుగం లో కొద్దిగా క్రింది వర్ణాల వారిని మినహాయిస్తే వీరశైవం ప్రజాదరణ పొందలేదు. శ్రీ రామానుజులు క్రింది

                                                       
                                             -37-

వర్ణాల వారికి వైష్ణవమతదీక్ష నిచ్చినా వర్ణవ్యవస్ధ ను ఖండించ లేదు. పల్నాటి బ్రహ్మనాయుడు మాత్రం వీరవైష్ణవాన్ని  ప్రచారం చేశాడు. అతని ప్రచారం తో ఆంధ్రదేశం లో దాసర్ల సంఖ్య పెరిగింది. ( ఆంధ్రుల చరిత్ర- సంస్కృతి) బ్రహామనాయుడు వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించాడని , మాచర్ల చెన్న కేశవాలయం లో పంచములకు ప్రవేశం కల్పించాడని చెప్పుకుంటారు. ఇటువంటి విప్లవాత్మక సంస్కరణలు ఆనాడు అపూర్వాలేనని చెప్పాలి.  కొంచెం లోతు గా ఆలోచిస్తే పల్నాటియుద్ధం సంప్రదాయ ప్రియత్వానికి ,సంస్కరణ వాదానికి మధ్య జరిగిన సంఘర్షణ   గా కన్పిస్తుంది.
                                        
                     అయితే క్రమం గా శతాబ్దం చివరి కొచ్చేసరికి వీరశైవ ,వీరవైష్ణవ పరాజయం , స్మార్త మత పునరుద్ధరణ జరిగాయి. అద్వైత ధర్మ ప్రచారమే ఆశయం గా మహాకవి తిక్కన సోమయాగం చేసి సోమయాజి యై భారతాంధ్రీకరణ కు పూనుకున్నాడు. శివాయ విష్ణురూపాయ  శివరూపాయ విష్ణవే అన్న భావం ప్రజలలో నెమ్మది గా వ్యాపించింది. రెండవ పోతరాజు  విశ్వేశ్వర ,చోడనారాయణ ఆలయాలు రెండింటికి సమానం గా సువర్ణ కలశాలను ఎత్తించి ,దాన శాసనాలను  వేయించి తన లోని శైవ వైష్ణవ సమానత్వాన్ని చాటుకున్నాడు. ప్రజలలో తీవ్రవాద మత భావాలు శమించి , వైదిక భావాలు మొలకెత్తుతున్న కాలమిది. కాకతి రుద్రదేవుడు రుద్రేశ్వరం లో ఈశ్వరుని తో పాటు కేశవుని సూర్యుని ప్రతిష్ఠించి ఫూజించాడు. అతని మంత్రి గంగాధరుడు విష్ణుభక్తుడు.మంచి భట్టోపాథ్యాయుడు కేశవ ,మహాదేవుల ఆలయాలను నిర్మించాడు. మొదటి పోతరాజు  గుడిమెట్ట లో  విశ్వేశ్వర మహాదేవరను , చోడనారాయణుని ప్రతిష్ఠించాడు. సింహాద్రి వరాహ లక్ష్మీనరసింహునికి చాగి సముద్రమనే తటాకాన్ని త్రవ్వించి, వేదాద్రి  నరసింహస్వామి కి కానుకలు సమర్పించి , నరసింహవర్ధన పోతరాజయ్యాడ రెండవ పోతరాజు. ముక్త్యాల లో ముక్తేశ్వరుని ప్రతిష్టించి  శివభక్తుడు గా కొనియాడబడ్డాడు.
                                    
                         దేవాలయాలు దేశ సంస్కృతికి మూలస్ధంభాలు.కాబట్టి ఆనాటి లయాలు గ్రామ ప్రజలకు ,పరిసర గ్రామాల ప్రజలకు కూడా కడలి కేంద్రాలు గా ఉండేవి.దేవస్ధానం గావ్యవహరించే ఈ ఆలయ భూముల్ని రైతులు సాగు చేశేవారు.  


                                                               -38-

ఆనాడు ప్రతిఆలయానికి అనుబంధం గా మఠాలు ,సత్రాలు ,విద్యాలయాలు ఉండేవి. అంతేకాదు ఆలయాలు బ్యాంకు లు గా ,ప్రదర్శన శాలలు గా ,వర్తక శ్రేణులకు కార్యస్ధానాలు గా ఉండేవి.  గ్రామానికి మథ్య లో దేవాలయ ముండేది. దానికి నాలుగువైపులా గ్రామాన్ని విస్తరింప చేసుకోవడం  , నాలుగు వీధుల కూడలి స్థలం దేవాలయం  నిర్మించబడేది. మరికొన్ని దేవాలయాలు ప్రభువుల అజమాయిషీ లో అంత:పుర కాంతల రాకపోకలకు అనుకూలం గా రాజప్రాసాదానికి  అనుబంధం గా నిర్మించబడి , మరో మార్గాన్ని ప్రజల దర్శనానికి వదిలివేయడం జరిగేది. హంపీ విరూపాక్షాలయం నుండి వాడపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ఇందుకు ఉదాహరణలు గా నిలుస్తాయి. 
                                 
                 


      గుడిమెట్ట కొండల పైన కన్పించే కొన్ని కట్టడాలు ఇటువంటివే. గుడిమెట్టలోని దేవాలయాలు రాజ భవనానికి తూర్పు గా నిర్మించబడినవిగా మనం  శిథిలాలను బట్టి ఊహించవచ్చు. దేవాలయాల చుట్టు వైదికధర్మం ఇన్ని విధాలు గా అల్లుకున్నది కాబట్టే,  ఐశ్వర్యవంతమైన హిందూ ఆలయాల చుట్టూ సామాజికి ,ధార్మిక కార్యక్రమాలు  పెనవేసుకొని ఉన్నాయి కాబట్టేతురష్కులు హిందూదేవాలయాల పైనే దృష్టి కేంద్రీకరించి ,విధ్వంసానికి పాల్పడ్డారు . గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం మొదలుకొని శ్రీరంగం లోని శ్రీరంగనాయకస్వామి ఆలయం వరకు ఇందుకు నిదర్శనాలే. ఆలయం విథ్వంసం తో సామాజిక జీవితం విచ్ఛిన్న మై, దేశాక్రమణ  సుగమం కాగలదని  వారు భావించారు.చరిత్ర కొన్ని గుణపాఠాలను నేర్పిస్తుంది. సింహాచలం వంటి దేవాలయాల నిర్మాణం చూస్తే  హిందూ రాజుల లో వచ్చిన మార్పు మనకు అర్ధమౌతుంది. కోటగోడల వంటి ప్రాకారాలు, రహస్య మార్గాలు దేవాలయ నిర్మాణం లో వాడటాన్ని మనం అక్కడ గమనించవచ్చు.
                                 
                 వేశ్యాప్రియత్వం ఈ యుగం లో సాధారణ విషయం గా కన్పిస్తోంది. దేవదాసీలకు,వేశ్యలకు సమాజం లో సాధారణం గా గౌరవస్ధాన ముండేది. గణపయరాజు విశ్వేశ్వర దేవరకు అంగరంగ వైభోగాలకు  దాసదాసీలను దానం చేసిన శాసనం  ఇందుకు సాక్ష్యమిస్తోంది.


                                                           -39-

            శివకేశవులకు బ్రహ్మాండమైన దేవాలయాలను నిర్మించిన రాజులు వాని రక్షణ ,పోషణ కు గాను అనేకమైన దానధర్మాలు చేసేవారు. మన పరిశీలన లో కన్పించిన అనేక శాసనాలు ఇందుకు సంబంధించినవే. రుద్రమదేవి గుడిమెట్ట శాసనం  గుడిమెట్ట విశ్వేశ్వర దేవరకు బేతవోలు గ్రామాన్ని దానం చేయగా మనుమగణపతి దేవరాజు “వేముపల్లి” గ్రామాన్ని ప్రతాప నరసింహ దేవరకు (వేదాద్రి) దానంచేశాడు. అంతే కాదు .  ఈ దానాలన్నీ హవిర్బిల్వర్చనాదులకు ,అంగరంగ వైభోగా లకు  ప్రత్యేకం గా నిర్దేశించి చేయడినట్లు గా మనం గమనించవచ్చు. అంగరంగవైభోగాలంటేనే దేవదాసీల కొరకు ,నృత్య నాట్య ప్రదర్శనలకు ,ఉత్సవాలకు అని అరధం. వాని కోసమై గ్రామాలను దేవునికి దానం చేయడం అనేక శాసనాల్లో కన్పిస్తోంది.
                        
     మరియు అఖండదీపం కొఱకు చేసిన దానశాసనాలు ఈ కాలం లో ప్రత్యేకంగా కన్పిస్తాయి.  “శ్రీశైల సందీపిత దీపయుగ్మము కలవాడు” కల్లయ నాయకుడు .“కండ్రవాడి కేశవోర్వీపతి” ముక్త్యాల ముక్తేశ్వరునికి విమలాఖండ ప్రదీపశ్రీ కొఱకు 25 గోవులను దానం చేశాడు. ఈ శాసన కాలం క్రీ.శ.1207. (302/1924) . మాక చమపతి ముప్పాళ్ళ రామేశ్వరునకు అఖండ దీపారాధనకై  25 గోవుల్ని దానం చేశాడు.(257/1920). దీని కాలం క్రీ.శ.1277.  ఈ విధం గా దానం చేసి ఆవులకు  మేతకు కావలసిన పచ్చిక బయళ్ళ ను కూడ దానాలు చేసిన రాజవరేణ్యులున్నారు. వేదాద్రి నరసింహస్వామి వరి ఆలయ ప్రాంగణంలో పడమటి వైపు కృష్ణా నది లోనికి వెళ్ళే మెట్లమార్గం ప్రక్కనే రంగరాజు (?) వేయించిన దానశాసనం ఒకటి కన్పిస్తుంది. అది ఆవులకు వలసిన పచ్చిక కోసం  గుండుబోయిన పాలెం రంగరాజు కొండకు నడుమ నున్న భూ భాగాన్ని సాలగ్రామ నరసింహ సాక్షి గా  దానం చేసిన శాసనమిది. అంటే కొంతమంది భక్తులు దేవుని గోవులను కొష్ఠం లో ఉంచి పోషిస్తూ , అఖండ దీపానికి వలసిన నెయ్యి ని ఆలయానికి పంపుతుండే వారని, ఆ ఆవుల రక్షణ ,పోషణ కు మరికొందరు మహనీయులు భూ దానాలు చేస్తుండేవారని మనం అర్ధం చేసుకోవచ్చు. “ బెజవాడ తెలికివేవురు కులానికి చెందిన కుఱ్ఱిసెట్టి కొనకంచి నరేంద్రేశ్వర దేవరకు దీపమాలలు రెండు చేయించాడు. (270/1924).” ఫిరోజ్షా తన తమ్ముని పేర వేదాద్రి వద్ద ఒక చెఱువు ను త్రవ్వించినట్లు శాసనం కన్పిస్తోంది. (కృష్ణా

                                                             -40-


గెజిట్-46 వ.పే). ఇది కొనకంచి  చెరువు అయి ఉండాలి. కృష్ణా నది ప్రక్కనే ఉండగా వేదాద్రి  లో చెరువు అవసరం లేదు కదా. ఆనాడు కూడ చెఱువులు త్రవ్వించడం పుణ్య కార్యం గానే ప్రజలు భావించేవారు. దేవాలయాలకు అనుబంధం గా చెరువులను త్రవ్వించే వారన్న మాట. రెండవ పోతరాజు సింహాచలేశునకు చాగి సముద్రమనే తటాకాన్ని త్రవ్వించిన విషయం  ఇంతకు పూర్వమే ప్రస్తావన కొచ్చింది. ఈ చెఱువులు స్వామి వారి పుష్కరిణు లేమో  ? ఆలోచించాలి. ఇవన్నీ శాసనాలు విశ్లేషిస్తే తెలిసే రహస్యాలు. ఇంతగా తమ జీవన గమనం లో ఒక భాగం గా హిందువులు ఆలయాలను అభివృద్ధి చేసుకున్నారు. అందుకే తురుష్కులు వానిని ధ్వంసం చేశేవారు.
   
           


      
                హిందువులు ఆవేశం లో జైనదేవాలయాలను శివాలయాలు గా మార్చేస్తే , అనంతరం వచ్చిన తురుష్కులు  హిందూఆలయాలను మసీదులు గా మార్చుకున్నారు. వేములవాడ , జోగిపేట,కొలను పాక  వంటి ప్రదేశాల్లో జైన మందిరాలు శివాలయాలు గా మారాయి.( ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి 145 వ. పే)  రాజమండ్రి, పెనుగంచిప్రోలు,  వంటి అనేక ప్రదేశాల్లో సివాలయాలు మసీదులు గా మారిపోయాయి. ప్రపంచ ప్రసిద్ద తాజ్మహల్  తేజోమహల్ అనే శివాలయమనే వాదన ఉండనే ఉంది. అయోధ్య వివాదం ఈనాటికీ ఆరని రావణాసుర కాష్టం లా మండుతూనే ఉంది. ఐతే ఈ సమయం లో మనం అంగీకరించాల్సిన విషయం ఒకటుంది. అదేమింటే    తురుష్కుల దురాగతాలను ఎదుర్కోగల్గిన మతావేశం త్రిశూల ధారులైన వీరశైవం లోనే ఉందని, హరహరమహాదేవ శంభో లోని వీరావేశం త్రిశూలధారుల్ని పురిగొల్పుతుందని ఆనాటి ప్రజలు , ప్రభుత్వం బలంగా విశ్వసించాయి. లయకారకుడైన శంకరుడే పరదైవమని ఆనాటి సమాజం నమ్మింది. అందుకే ఈ యుగం లో ఎక్కువగా శివాలయాలు , మహాదేవునికిచ్చిన  దాన శాసనాలే కన్పిస్తాయి. విశాలమైన దేవాలయ మండపాలు , అద్బుతమైన శిల్ప సంపద ను సంతరించుకొని సర్వజన రంజకంగా నిర్మించబడేవి. ఇటువంటి కట్టడాలే శిథిల శిల్పాలై మసీదు దిబ్బ గా పిలువబడే గుడిమెట్ట  లో  మిగిలి పోయాయి.
                                                  
                                                  త్వరలో మూడవ ప్రకరణం - వెలుగు చూసిన తెలుగు శిల్పాలు.



******************************************************