Saturday, 3 May 2014

శతకసౌరభాలు - 1 దాశరథీ శతకము - 3

శతకసౌరభాలు – 1
          కంచర్లగోపన్న   దాశరథీ శతకము -3



            

             పండితరక్షకుం డఖిలపాపవిమోచను డబ్జసంబవా
             ఖండలపూజితుండు దశకంఠ విలుంఠన చండకాండ కో
             దండ కళాప్రవీణు డను తావక కీర్తివధూటి కిత్తుఁబూ
             దండయుఁ గాకఁ నాకవిత దాశరథీ! కరుణాపయోనిధీ!
                   
      ఓ రామా  ! పండితులనుకాపాడువాడు , సమస్త పాపములను  వదిలించువాడు , బ్రహ్మేంద్రాదుల చేత పూజించబడువాడు ,రావణుని పరిమార్చగల్గిన భయంకరమైన  కోదండవిద్య లో నేర్పరి యైన వాడు అనెడి తమ యొక్క కీర్తికాంతకు నేను నా కవిత్వమనెడి పూలమాలను సమర్పించుచున్నాను.

            అజునకుఁ దండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యు ,స            
           ద్విజమునికోటికెల్లఁ గులదేవతవయ్యు దినేశవంశ భూ
           భుజులకు మేటివయ్యుఁ బరిపూర్ణుడవై వెలుగొందు పక్షి రా
           డ్ఢ్వజ  మిముఁ బ్రస్తుతించెదను దాశరథీ ! కరుణాపయోనిధీ !

             శ్రీ దాశరథీ  ! నీవు బ్రహ్మదేవునకు తండ్రివి.సనకాది మహర్షులకు పరబ్రహ్మమూర్తివి. ముని ద్విజ శ్రేష్ఠులకు ఇలవేల్పువు వయ్యు సూర్యవంశపు రాజులలో మేటివయ్యు  పరిపూర్ణుడవై ప్రకాశించెడి గరుడ ధ్వజుడవని  కీర్తించుచున్నాను.

   శ్రీ రమ సీతగాఁగ నిజసేవకబృందము వీరవైష్ణవా
         చార జనంబు గాఁగ విరజానది గౌతమి గా,వికుంఠ ము
         న్నారయ భద్ర శైల శిఖరాగ్రము గాఁగ , వసించు చేతనో
         ద్ధారకుఁడైన విష్ణువవు దాశరథీ! కరుణాపయోనిధీ !      

                   శ్రీరామచంద్రా ! కరుణాసముద్రా !  శ్రీమహాలక్ష్మీదేవియే  సీతాదేవి. నీసేవకబృందమే వీరవైష్ణవాచార్య సమూహము. విరజానదియే గోదావరి.  శ్రీ వైకుంఠమే భద్రశైలశిఖరము. కాగా భూలోకమునందలి జీవుల నుద్దరించుటకు ఆవిర్భవించిన శ్రీ మహావిష్ణవవు నీవు.

              కంటి నదీతటంబుఁ బొడగంటిని భద్రనగాధివాసమున్
        గంటి నిలాతనూజ ,నురుకార్మక మార్గణ శంఖచక్రముల్
       గంటిని ,మిమ్ము లక్ష్మణుని గంటి , గృతార్ధుడనైతి , నో జగ
       త్కంటక దైత్యనిర్ధళన !  దాశరథీ! కరుణాపయోనిధీ!      

                   శ్రీరామా ! గోదావరీ తీరమును ,భద్రగిరి యందలి తమ నివాసమును , శ్రీ  సీతాదేవి ని , మీయొక్క విల్లు ,బాణమును ,శంఖ చక్రములను , మిమ్ము ,లక్ష్మ ణుని చూచి ధన్యుడనైతిని .లోకములను బాధించు రాక్షసులను సంహరించిన ప్రభూ !

           హలికునకున్ హలాగ్రమున నర్ధముసేకురుభంగి , దప్పి చే
           నలమట నొందు వానికి సురాపగ లో జలమబ్బినట్లు , దు
            ర్మలిన మనోవికారినగు మర్త్యు నను  దయ జూచి నీపయిన్
           దలపు ఘటిల్లఁ జేసితివి దాశరథీ ! కరుణాపయోనిధీ !      

            శ్రీరామా ! దయాసముద్రా !  పొలము దున్నుకొను వానికి నాగలి కొనను  ధనము లభించనట్లు , దప్పిక తో పీడించబడేవాడికి గంగాజలం లభించినట్లు ,దుర్మార్గుడనైన నాపై దయచూపి నీయెడల భక్తిని కల్గచేశావు .

            కొంజక తర్కవాదమను గుద్దలి చేఁ బరతత్త్వ భూస్ధలిన్
            రంజిలఁ ద్రవ్వి కన్గొనిన రామనిధానము నేడు భక్తి సి
            ద్ధాంజనమందు హస్తగతమయ్యె బళీ యనగా మదీయ హృ
             త్కంజమునన్ వసింపుమిక  దాశరథీ! కరుణాపయోనిధీ !      

                      శ్రీరామచంద్రా ! కారణవాదమనెడి గుద్దలి చే వేదాంతమనెడి నేలను త్రవ్వగా భక్తియనెడి సిద్ధాంజనము వలన శ్రీరామ యనెడి నిధి లభించినది .ఎంత సంతోషము .ఇక  నాహృదయమనెడి కమలము నందు ఎల్లప్పుడు నివసింపుము స్వామీ !

               రాముడు ఘోరపాతక విరాముడు , సద్గుణకల్పవల్లికా
               రాముడు , షడ్వికారజయరాముడు ,సాధుజనావనవ్రతో
                                                   ద్దాముడు , రాముడే పరమదైవము మాకని మీ యడుంగు
                                                    దామరలే భజించెదము దాశరథీ! కరుణాపయోనిధీ !   
                        శ్రీరామా  ! భయంకరమైన పాపములను తొలగించువాడు , సద్గుణముల ప్రోవు , కామక్రోధాది అరి
షడ్వర్గములను జయించు లీల కలవాడు , సజ్జన రక్షణయే వ్రతము గా గలవాడు నైన శ్రీరామచంద్రుడే మా కులదైవమని ప్రకటించి నీ పదపద్మములను సేవించెదము .

                                              చెక్కెరమాని చేదు దినజాలిన కైవడి మానవాధముల్
                                              పెక్కులు బక్క దైవముల వేమఱు గొల్చెద రట్లకాదయా !
                                            మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్షమొసంగిన నీవె యీవలెన్
             దక్కినమాట లేమిటికి ? దాశరథీ! కరుణాపయోనిధీ !             


                 శ్రీరామా  ! భయంకరమైన పాపములను తొలగించువాడు , సద్గుణముల ప్రోవు , కామక్రోధాది అరి

              శ్రీ రామచంద్రా !చెక్కెరను మాని చేదు వస్తువును  తిన్నట్లు గా  కొందఱు తెలివి లేని వారు నిన్ను మాని చిల్లర దేవతలను సేవింతురు. అది తప్పు కదా. సేవిస్తే నిన్నే సేవించాలి . మోక్షమిస్తే నీవే వ్వాలి. తరమైన మాటలు ఎందులకు దేవా !.       
                      ఈ పద్యం లో శ్రీ రామదాసు  శ్రీ రామసేవాప్రాశస్త్యం తో పాటు కులదైవం పై భక్తునకుండే అనిర్వచనీయమైన నమ్మకాన్ని ,విశ్వాసాన్ని ప్రకటించాడు. ఉంటే నీవే.  లేకపోతే లేదు . నీవే తప్ప నిత: పరంబెరుగనన్నదే భక్తుని ఆర్తి. అదే భక్తుని నమ్మకం. ఆ  నమ్మకానికే భగవంతుడు బందీ అవుతాడు.  భక్తపరాధీనుడౌతున్నాడు.

               ‘ రా’ కలుషంబులెల్ల బయలంబడఁ ద్రోసిన ‘మా’ కవాటమై
           ఢీకొని ప్రోచు , నిక్కమని థీయుతులెన్నం దదీయవర్ణముల్
           గైకొని భక్తిచే నుడువ గానరు గాక ! విపత్పరంపరల్
           దాకొను నే జగజ్జనుల దాశరథీ ! కరుణాపయోనిధీ. !      
          
                             శ్రీరామా ! ‘ రా’ అనెడి  అక్షరము మనలోని పాపములన్నింటినీ  నోటినుండి బయటకు పడత్రోయగా ‘మా ‘అనే అక్షరం కవాటమై  ఢీకొని మరల వానిని లోనికి రాకుండా నిరోధిస్తుందని పండితులు చెప్పిన మాటను ఈ మానవులు  అంగీకరించి రామనామ స్మరణ చేయరు. అట్లు చేసినచో కష్టములు కలుగవు కదా.!
                                                                  చదువుతూ ఉండండి. మరికొన్ని అందిస్తా.




*********************************************************************************

Friday, 2 May 2014

శతకసౌరభాలు 1 దాశరథీ శతకము - 2

శతక సౌరభాలు – 1
                                                    కంచర్లగోపన్న  దాశరథీశతకము -  2


      

               శ్రీ రమణీయహార ! అతసీకుసుమాభ శరీర ! భక్త మం
         దార ! వికారదూర ! పరతత్త్వవిహార ! త్రిలోకచేతనో
         ద్ధార ! దురంతపాతకవితానవిదూర ! ఖరాదిదైత్య కాం
         తార కుఠార ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిథీ !

                        శ్రీరామా ! శ్రీకరమైన రమణీయమైన హారములు ధరించినవాడా ! అవిశెపూవు వలె అతి సుకుమారమైన శరీరము కలవాడా ! భక్తుల పాలిట కల్పవృక్షము వంటివాడా ! పరబ్రహ్మ వై ముల్లోకములను తరింపచేయువాడా ! అంతులేని పాతకములను పోగొట్టువాడా ! ఖరుడు మొదలైన రాక్షసులనెడి అడవి పాలిట గొడ్డలి వంటివాడా !

          దురితలతాలవిత్ర ! ఖరదూషణ కానన వీతిహోత్ర ! భూ
          భరణ కళావిచిత్ర ! భవబంధవిమోచన సూత్ర ! చారు వి
          స్ఫురదరవింద నేత్ర ! ఘనపుణ్యచరిత్ర ! వినీల భూరికం
          ధరసమగాత్ర ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిథీ !

                        శ్రీ రామచంద్రా!  నీవు పాపములనెడి తీగల పాలిట కొడవలి వంటి వాడవు. ఖర దూషణులనెడి  అడవి పాలిట కార్చిచ్చు వంటి వాడవు.  భూభరణ సమర్థుడవు.  సంసార బంధ విమోచన
మర్మజ్ఞుడవు. వికసించిన తామరల వంటి నేత్రములు కలవాడవు . ఘనమైన చరిత్ర కలవాడవు. నీలమేఘశ్యాముడవు .ఓరామా నీ గొప్పతనమేమని వర్ణించగలను.

                 కనకవిశాలచేల ! భవకానన శాతకుఠారధార ! స
          జ్జన పరిపాలశీల ! దివిజస్తుత సద్గుణ కాండ ! కాండ సం
          జనిత పరాక్రమ క్రమ విశారద ! శారద చంద్ర కుంద చం
          దన ఘనసారసార యశ ! దాశరథీ ! కరుణాపయోనిథీ !

                 ఓజానకీజానీ ! కనకమయ వస్త్రమును దాల్చిన వాడవు. సంసారమనెడి అరణ్యమునకు గొడ్డలి వంటి వాడవు.  మంచివారిని కాపాడటమే వ్రతముగా కలవాడవు.దేవతలచే పొగడబడిన సద్గుణములు కలవాడవు. ధనుర్విద్యా పారంగతుడవు.  శరత్కాల చంద్రుని , మరుమల్లెలను, మంచిగంధమును , పచ్చకర్పూరమును పోలిన సునిర్మల కీర్తి కలవాడవు .

            దారుణ పాతకాబ్దికి సదా బడబాగ్ని, భవాకులార్తి వి
            స్తారదవానలార్చికి సుధారసవృష్టి ,దురంతదుర్మతా
            చార భయంకరాటడవికిఁ జండకఠోర కుఠార ధార , నీ
            తారకనామ మెన్నుకొన దాశరథీ ! కరుణాపయోనిథీ !

                         ఓ రామచంద్రా ! భవసాగరమును తరింపచేసెడి  రామ అనెడి  నీ తారక నామము  ఆలోచింపగా , పాపమనెడి భయంకర సముద్రమునకు బడబాగ్ని వంటిది. సంసారబాధలనెడి కార్చిచ్చును అణచివేసెడి అమృతవర్షము వంటిది.  దుర్మతాచారములనెడి భయంకరమైన అరణ్యమును ఖండించివేయు వాడియైన గొడ్డలి వాదర వంటిది.

             హరునకు నవ్విభీషణునకద్రిజకుం దిరుమంత్ర రాజమై
             కరికినహల్యకున్ ద్రుపదకన్యకు నార్తి హరించు చుట్టమై
             పరగిన యట్టి నీ పతిత పావన నామము జిహ్వపై నిరం
             తరము నటింప జేయుమిక దాశరథీ ! కరుణాపయోనిథీ !

              శ్రీ దాశరథీ !  శివునకు , ఆ విభీషణునకు  , పార్వతీదేవికి  పవిత్ర మంత్రమై , గజేంద్రునికి ,అహల్యకు , ద్రౌపదికి  దు:ఖములను  హరించు చుట్టమై , ప్రకాశించిన నీ పతిత పావన నామము నా నాలుక పై   ఎల్లవేళల  నటించుచుండునట్లు చేయుము.

                     ముప్పున గాలకింకరులు ముంగిటకొచ్చినవేళ రోగముల్
            గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండిన వేళ , బాంధవుల్
            గప్పినవేళ ,మీ స్మరణ గల్గునొ కల్గదొ నాటి కిప్పుడే
            తప్పక చేతు మీ భజన దాశరథీ ! కరుణాపయోనిథీ !

             ఓ రామచంద్రా ! ముసలితనము లో యమభటులు  సమీపించి నప్పుడు , రోగములు పెరిగి పోయి  కఫము గొంతులో నిండిపోయి మాటరానప్పుడు , చుట్టాలు చుట్టు కమ్ముకొన్నప్పుడు , నేను మీ స్మరణ  చేయగలనో లేదో  కావున ఇప్పుడే మీ భజన చేసెదను .
                       కొందరు దురదృష్టవంతులకు  కష్టాలు కమ్ముకున్నప్పుడు ఆ భగవంతుడు గుర్తుకు రాడు. తరువాత బాధ పడతాడు. తన స్వామిని ఎందుకు వేడుకోలేక పోయానని . దానినే పూర్వజన్మ జ్ఞాన సంపత్తి అన్నారు పెద్దలు. అందుకే ఆ సమయం వరకు ఎదురు చూడకుండా ఇప్పుడే  తారకనామాన్ని భజిస్తానంటున్నాడు రామదాసు.

             “ పరమదయానిధే ! పతితపావననామ హరే “ యటంచును
          స్థిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా
          శిరమున దాల్తు మీరటకుఁజేరకుడంచు యముండు కింకరో
          త్కరమున కాన పెట్టునట దాశరథీ ! కరుణాపయోనిథీ !


                      ఓరామా!  “పరమ దయానిధే పరమ పావననామ హరే “అంటూ ఎల్లప్పుడు నీ నామ స్మరణ చేయు మహాత్ముల పాదధూళిని  నేను తలపై ధరిస్తాను. ఎందుకంటే రామభక్తుల వద్దకు  వెళ్లవద్దని యముడు తన భటులను ఆజ్ఞాపించునట కదా స్వామీ !.

                                        చదువుతూ ఉండండి .........................మరికొన్ని అందిస్తాను.
 



********************************************************************************

Thursday, 1 May 2014

శతక సౌరభాలు - 1 కంచర్ల గోపన్న దాశరథీ శతకము -1




శతక సౌరభాలు -1
               

                                           కంచర్ల గోపన్న  దాశరథీ శతకము -1
        
                             


                                    భక్త రామదాసు   అని , భద్రాచల రామదాసు  అని , బందిఖానా రామదాసు  అని  తెలుగు ప్రజలు అంతా అభిమానం గా  పిలుచుకునే  కంచర్ల గోపన్న -  వ్రాసిన భక్తి శతకం దాశరథీ శతకం.  భక్త రామదాసు ఈ శతకమే కాక   కీర్తనలు కూడ చాలా వ్రాసియున్నాడు. రామదాస ముద్ర కల్గిన రామదాసు కీర్తనలు దాశరథీ శతకాన్ని మించి భక్తలోకం లో ప్రాచుర్యాన్ని పొందాయి. పలుకే బంగారమైన రామచంద్రుని  కదిలించి , తానీషా కు   పైకం కట్టించి , చెరశాల నుండి  విడిపించి ,  సాయుజ్యాన్ని చేర్చినవి ఈ కీర్తనలే.
                   కంచర్ల  గోపన్న  ఆదిశాఖా బ్రాహ్మణుడు. ఆత్రేయస గోత్రుడు. కామాంబ ,లింగనమంత్రి దంపతుల కుమారుడు. గోల్కొండ యందు మంత్రి పదవుల పొందిన  అక్కన్న మాదన్న లకు రామదాసు మేనల్లుడని    రామదాసు చరిత్ర చెపుతోంది.  క్రీ.శ  1664 -1687 వరకు  గోల్కొండను పాలించిన తానీషా  కాలము లో రామదాసు భద్రాచలానికి తహశీలుదారు గా నియమించబడినట్లు గా  తెలుస్తోంది .
                భక్తరామదాసు దాశరథీ శతకము , రామదాసు కీర్తనలు మాత్రమే కాకుండా మరికొన్ని గ్రంథములు  వ్రాసి నరాంకితము చేసినట్లు , దాని వలన తాను మోసపోయినట్లు దాశరథీ శతకం లోని  ఈ  పద్యం  లో చెప్పుకున్నాడు .
                                 మసగొని రేగుబండ్లకును మౌక్తికముల్ వెలపోసినట్లు దు
                               ర్వ్యసనముఁ జెంది  కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యె

                    ముత్యాలను రేగుపండ్ల కోసం  అమ్ముకున్నట్లు తన కావ్యాలను దురాత్ములకిచ్చి మోసపొయానని చెప్పుకున్నాడు కాని   ఆ కావ్యాలు ఏవో తెలియడం లేదు.   శతక వాజ్ఞ్మయం లో  మాత్రం గోపన్న పేరు ఈ దాశరథీ శతకం తోనే  చిరస్థాయి గా నిల్చిపోయింది. ఈ దాశరథీ శతకాన్ని  నిత్యం పారాయణ చేసేవారు  నాకు తెలుసు. మా జేజమ్మ గారు తొంభై ఏళ్ల వయసు లో రాత్రి వేళ నిద్ర లో మసలుతూ, దాశరథీ శతకం లోని పద్యాలను వల్లెవేస్తుంటే, పసితనం తో మేము నవ్వుకున్నరోజులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అమృతపు తునకలు , పాల తారికలు , పూతరేకులు  పనసతొనలు వంటి   ఈ పద్యాల మాధుర్యం తెలిసిన ఈ వయసు లో ఆ నాటి చేష్టలు పసితనపు తప్పిదాలు కాక మరేమిటి  అనిపిస్తుందిప్పుడు.
              
                శ్రీ రఘురామ ! చారు తులసీదళదామ ! శమక్షమాదిశృం
                గారగుణాభిరామ ! త్రిజగన్నుత శౌర్యరమాలలామ ! దు
                ర్వార కబంధరాక్షసవిరామ ! జగజ్జన కల్మషార్ణవో
                     త్తారక నామ ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ!
                      ఓ రామచంద్రా !  దయాసముద్రుడా ! అందమైన తులసీదళమాలలను ధరించినవాడా !  శాంతి , ఓర్పు మొదలైన సద్గుణముతో శోభించువాడా !. ముల్లోకములచేత కొనియాడబడెడి శౌర్యలక్ష్మీ సమేతుడా ! దుర్వారపరాక్రముడైన కబంధాసురుని పరిమార్చినవాడా ! లోకములందలి సమస్త జనులను పాపసముద్రమునుండి తరింపచేయు తారకనాముడా !  భద్రగిరి యందు కొలువుతీరిన దశరధకుమారా ! జయము.
             
                రామ! విశాలవిక్రమ పరాజిత భార్గవరామ! సద్గుణ
            స్తోమ ! పరాంగనా విముఖ సువ్రత కామ! వినీలనీరద
            శ్యామ ! కకుత్థ్స వంశ కలశాంబుధిసోమ ! సురారిదోర్బలో
            ద్దామ విరామ ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ !
           
                                 ఓ రామచంద్రా !  గొప్పపరాక్రమ శాలియైన పరశురాముని ఓడించిన వాడవు. సుగుణ రాశివి. పరస్ర్తీలను కామించని వ్రతము గలవాడవు. నీల నీరదశ్యాముడవు. కకుత్థ్స వంశమనెడి పాలసముద్రమునందు పుట్టిన చంద్రుడవు. రాక్షస పరాక్రమమును  అణచినవాడవు నైన ఓ భద్రగిరి రామా !
             
              అగణిత సత్యభాష ! శరణాగతపోష ! దయాలసజ్ఝరీ
              విగతసమస్తదోష ! పృధివీసురతోష ! త్రిలోకపూతకృ
             ద్గనధురీ మరంద పదకంజ విశేష మణిప్రభాధగ
             ద్దగితవిభూష ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ !

                     శ్రీ రామచంద్రా  !  అగణిత సత్యవాక్యపరిపాలకుడా !శరణాగత రక్షకుడా ! దయచే సమస్త పాపములను పోగొట్టెడి వాడవు. పృధివీసురలకు ఆనందము కల్గించువాడా !  ముల్లోకములను పవిత్రము చేయు ఆకాశగంగ  నీ పదాబ్జములందు ఆవిర్భవించినది. విశేషమైన మణిమయకాంతులతో ప్రకాశించెడి ఆభరణములను ధరించినవాడా. నీవే మాకు రక్ష.     


          రంగదరాతిభంగ ! ఖగరాజతురంగ ! విపత్పరంపరో
         త్తుంగ తమ:పతంగ ! పరితోషితరంగ ! దయాంతరంగ ! స
         త్సంగ ! ధరాత్మజాహృదయ సారసభృంగ ! నిశాచరాబ్జమా
         తంగ ! శుభాంగ ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ !

                                శ్రీరామచంద్రా  ! చెలరేగెడి శత్రువులను సంహరించువాడా ! గరుడవాహనా.! ఆపద లనెడి భయంకరమైన కారుచీకట్లను పారద్రోలెడి సూర్యుని వంటివాడా ! సంతోషపెట్టబడిన భూమండలము కలవాడా !  మంచివారిని అభిమానించెడి వాడా ! దయాంతరంగుడవు. జానకీదేవి యొక్క హృదయకమలమునకు తుమ్మెద వంటివాడా ! రాక్షసులనెడి పద్మములకు మత్త మాతంగము వంటివాడా ! భువనమోహనమైన రూపముకలవాడా !



             శ్రీద ! సనందనాది మునిసేవితపాద ! దిగంతకీర్తి సం
             పాద ! సమస్త భూతపరిపాలవినోద ! విషాదవల్లికా
             చ్ఛేద ! ధరాధినాథ కులసింధు సుధామయపాద ! నృత్తగీ
             తాది వినోద ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిథీ !
                  
                               శ్రీదాశరథీ ! సమస్త సంపదలను ఇచ్చువాడా ! సనకసనందనాది మునులచేత సేవించబడు పాదములు కలవాడా ! దిగంతవ్యాప్తమైన కీర్తి కలవాడా ! సమస్త భూతరాశిని కాపాడుట యందు ఆనందమును పొందెడివాడా ! దు:ఖములను తొలగించువాడా ! రాజవంశమనెడి సముద్రము నందు ఆవిర్భవించిన చందమామా !  నృత్తగీతాది వినోదా ! శ్రీ రామచంద్రా ! శరణు  !
                                                              చదువుతూ ఉండండి...... మరికొన్ని అందిస్తాను.





*********************************************************************************

Monday, 7 April 2014

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు - 10 సుయజ్ఞోపాఖ్యానము అను తత్త్వవిలోకనము




శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు --10       
             
                             సుయజ్ఞోపాఖ్యానము  అను తత్త్వవిలోకనము
                
                  



                     శ్రీ మన్నారాయణుని అవతారమైన ఆదివరాహమూర్తి చేతిలో హిరణ్యాక్షుడు మరణించాడు.తన సోదరుని శ్రీమహావిష్ణువు చంపివేశాడని తెలుసుకున్న హిరణ్యకశిపుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. “ ఆ ఘోణిగాడు (వరాహము)  నాకు భయపడి   ఏ అడవుల్లోనో , సముద్రం లోనో, పర్వతాల చాటునో ,మునుల పంచనో ఎక్కడో ఒకచోట దాక్కుని ఉంటాడు. వాడి పుట్టుపూర్వోత్తరాలు ఎవ్వరికీ తెలియవు. మనం ఎదురు తిరిగితే వాడు ఎదుర్కొంటాడు. మనం వెంట పడితే కాని దొరకడు.  వాడు ఎక్కడ దాక్కున్న  పట్టుకొని నా పదునైన బల్లెంతో వాడి కంఠాన్ని  తెగ నరికి ఆ వేడి నెత్తురు తో నా తమ్మునికి తర్పణం విడుస్తాను ” అంటూ  చిందులు వేయసాగాడు.
                                           “   శ్రీ మహా విష్ణువు ను సంహరిస్తే ఆ దేవతల పని  అయిపోయినట్టే.   అందుకని ఎక్కడ  వేదాధ్యయనము ,యజ్ఞయాగాదులు , జపతపాలు , వ్రతాలు నిర్వహించబడుతుంటాయో అక్కడికి వెళ్ళి వాని నన్నింటిని ధ్వంసం చేయండి. ఎందుకంటే  విష్ణువంటే ఎవరో కాదు.అతడే వేదం . అతడే యజ్ఞం. వైదిక కర్మకాండకు అతడే మూలం.  అందుకే  ఎక్కడ గోవులు ,విప్రులు సుఖం గా జీవిస్తుంటారో, ఎక్కడ వేద ధర్మాలు, ఆశ్రమ నియమాలు , క్రమం తప్పక ఆచరించబడుతుంటాయో వాని నన్నింటినీ సర్వనాశనం చేయండి. అప్పుడు విష్ణువు తనకు తానే దిగి వస్తాడని ” తన అనుచరులైన రాక్షసవర్గాన్ని  ఆదేశించాడు హిరణ్యకశిపుడు.
                      
                  ఈ సమయం లో హిరణ్యాక్షుని భార్యలను, కొడుకులను ఓదార్చి, పుత్రశోకం తో తల్లడిల్లిపోతున్న తల్లి దితిని  ఊరడిస్తూ  హిరణ్యకశిపుడు   ఎన్నో జీవనసత్యాలను  వివరిస్తాడు. ఆ సందర్భం లోనిదే సుయజ్ఞోపాఖ్యానము. శ్రీ మదాంధ్ర మహాభాగవతం సప్తమస్కంధం లో మనకు ఈ ఉపాఖ్యానం కన్పిస్తుంది. తల్లితో  హిరణ్యకశిపుడు ఇలా అంటున్నాడు.
               
              “  ఓ తల్లీ ! ఈ లోకం ఒక చలువపందిరి  వంటిది.   ప్రాణులందరు కూడ దాహం కోసం వచ్చే బాటసారులే. చలివేంద్రం వద్దకు బాటసారులు దాహం తీర్చుకోవడానికి వచ్చి వెళ్లిపోతున్నట్లు , మనం కూడ ఈ సంసారం లోకి  వచ్చి  మన పని కాగానే వెళ్లిపోతూ ఉంటాం. ఎప్పుడు ఒకేచోట కలిసి ఉండం. కలుస్తూ ఉంటాం.విడిపోతూ ఉంటాం. అలాగే నీ చిన్నకుమారుడు కూడ  మహావీరులు వెళ్లే లోకానికే వెళ్లాడు. నీవు దు:ఖించాల్సిన అవసరం లేదు.
                 సర్వజ్ఞుడయిన  ఆ ఈశ్వరుడు సర్వాధికారి . సర్వాత్ముడు. సత్యుడు. నిర్మలుడు. అనంతుడు. ఆఢ్యుడు. ఆత్మస్వరూపుడు. నిరంతరం తన మాయా ప్రవర్తన మహిమ వలన త్రిగుణాలను కల్పించి , ఆ గుణసంయోగం వలన శరీరం ధరించి , లీలగా వినోదిస్తూ ఉంటాడు. కదలని చెట్లు కదలాడే నీళ్ళల్లో కదులుతున్నట్లు కన్పించినట్లుగా , కళ్లు తిరుగుతుంటే భూమి తిరుగుతున్నట్లుగా  అన్పించినట్లు  , భావవికారాలు లేని ఆత్మస్వరూపుడైన ఆ భగవంతుడు చంచల మనస్కులకు చంచలుడు గా అన్పిస్తాడు కాని ఆయన అచంచలుడు.
                         లక్షణ రహితుడైన ఆ భగవంతుడు  అప్పుడప్పుడు  కొన్నిలక్షణాలను పొంది కర్మబంధాలలో చిక్కుకొని యోగ వియోగాలను అనుభవిస్తుంటాడు. పుట్టుక ,నాశము ,శోకము ,వివేకము , చింత ,స్మరణము అనేవి అనేక రకాలు. ఈ పరమార్థాన్ని వివరించడానికి పెద్దలు ‘ ప్రేతబంధు యమ సంవాదము ‘ అనే కథ చెప్తారు. ఆ కథ చెపుతాను విన మని  చెప్పి సుయజ్ఞోపాఖ్యానాన్ని తల్లికి విన్పించాడు హిరణ్యకశిపుడు.
             పరమ భక్తాగ్రగణ్యుడైన ప్రహ్లాదునకు తండ్రి . పూర్వజన్మ లో సర్వలోకశరణ్యుడైన శ్రీమన్నారాయణునకు  ద్వారపాలకుడు నైన హిరణ్యకశిపుని చేత  ఈ ఉపాఖ్యాన ప్రస్తావన  శ్రీ మహాభాగవత ప్రత్యేకత.  
              “ ఉశీనరదేశం లో సుయజ్ఞుడనే ఒక రాజు ఉండేవాడు. అతడు ఒకానొక యుద్ధం లో  శతృవుల చేతిలో  అతి ఘోరం గా మరణించాడు. అతని రత్నకవచం చిరిగిపోయింది. ఖడ్గం విరిగి పోయి ,రత్నహారాలు తెగిపోయి, శరీరమంతా ధూళి ధూసరితమై , గాయాలనుండి  నుండి నెత్తురు కారుతోంది .దంతాలు బిగుసుకు పోయి ,చేతులు తెగిపోయి  వేరుగా పడి పోయాయి.  
                     ఆ  సుయజ్ఞుని కళేబరం చుట్టూ  అతని భార్యాపుత్రులు , బంధుజనులు  చేరి భోరుభోరున విలపిస్తున్నారు. నీవు లేకపోతే  మేము బతకలేమని ,మేము నీతోనే సహగమనం చేస్తామని అతని భార్యలు రోదిస్తున్నారు. ఇంతలో సాయంత్ర మయ్యింది. ఆ సమయం లో వారి రోదనలను విని యమధర్మరాజు విప్రబాలకుని వేషం లో  అక్కడకు వచ్చాడు. వారి దగ్గరకు వెళ్లి కాలనిర్ణయాన్ని  గూర్చిఈ విధం గా  బోధించసాగాడు.
                    మందమతులారా !   తనవారి మీద ఎక్కువగా మక్కువ  పెంచుకొని , కాలం తీరిన వారి కోసం ఇంతగా  దు:ఖించడం విచిత్రం గా ఉంది. పుట్టిన ప్రతిజీవి  మరణించడం  మీరు నిత్యం చూస్తూనే ఉంటారు. పుట్టిన తరువాత గిట్టని ప్రాణి ఉండదు . మరి చనిపోని వారి లాగా మీరు చనిపోయిన వారికోసం  ఎందుకు ఏడుస్తున్నారు. చావు ను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాని పని.  ప్రాణి ఎక్కడ నుండి వచ్చిందో మళ్లీ  అక్కడ కు వెళ్ళడం దాని సహజలక్షణం. చిన్ననాడే తల్లిదండ్రులను వీడి అడవిలో క్రూరమృగాల మధ్య చిక్కినా ఆ పరమేశ్వరుని  దయవుంటే  సురక్షితం గా ఉంటాం.  మనం తల్లి గర్భం లో ఉండగా ఎవడు మనల్ని పోషించాడో  ఆ భగవంతుడే అడవిలో ఉన్నా కూడ రక్షిస్తాడు. అంటే భగవంతుడే  సర్వదా సర్వథా రక్షకుడు.

 ఎవ్వడు సృజించుఁ బ్రాణుల , నెవ్వడు రక్షించుఁ ద్రుంచు నెవ్వఁ డనంతుం
 డెవ్వఁడు విభు డెవ్వఁడు వాఁ డివ్విధమున మనుచుఁ బెనుచు హేలారతుడై . (7 – 48 )
                
                      ఈ విశ్వాన్ని ఎవ్వడు సృష్టించి, రక్షించి , నశింప చేస్తున్నాడో, ఎవ్వడు అనంతుడో , ఎవ్వడు ఈ బ్రహ్మాండానికంతటికీ అథిపతి యో , వాడే లీలావిలాసం గా ఈ లోకాన్ని రక్షిస్తూ , పోషిస్తూ ఉంటాడు. డబ్బుని వీథి లో పడేసినా దైవయోగం బాగుంటే సురక్షితంగా ఉంటుంది. గీత బాగుండకపోతే ఇంట్లో మూల దాచి పెట్టినా  పోతుంది. అలాగే  బలహీనుడు అడవిలో ఉన్నా భగవంతుని కృప ఉంటే వృద్ధి పొందుతాడు. దైవానుగ్రహం లేకపోతే బలవంతుడైనా ఒంటిస్థంభం మేడలో  రక్షకభటులచే రక్షింపబడుతున్నా మరణిస్తాడు.
                అడవి రక్షలేని యబలుండు వర్థిల్లు
               రక్షితుండు మందిరమునఁ జచ్చు. ( 7 – 49 )
                ఆ భగవంతుని తత్వ్తం ఎవ్వరికీ అర్థం కాదు.  ఆయన వలన ఈ సమస్త జీవకోటి కాలకర్మ వశమై ఈ బ్రహ్మాండ చక్రం లో వర్తిల్లుతూ ఉంటుంది. ఆత్మ స్వరూపుడు, అగమ్యుడు నైన ఆ ఈశ్వరుడు త్రిగుణాతీతుడు. పంచభూతాత్మకమైన ఈ  దేహమనే భవనం లో  పురుషుడు పూర్వకర్మానుసారియై ప్రవర్తిస్తూ, కాలం తీరగానే ఈ దేహం నుంచి వెళ్లి పోతాడు. దేహం అశాశ్వతం. అందులోని ఆత్మపురుషుడు శాశ్వతుడు. ఎప్పటికైనా దేహం చెడిపోతుంది కాని  ఆత్మకు నాశనము లేదు. పురుషుడు ,దేహము వేరువేరే కాని ఎప్పుడూ ఒకటి కాదు.  దారువు లో అగ్ని దాగి ఉన్నట్లు ,శరీరం లో గాలి ఉన్నట్లు , తామరతూడు లోపల  శూన్యం ఉన్నట్లు, దేహం లో దేహి వేరుగా ఉంటాడు.
                   ఈ మహారాజు  దీర్ఝనిద్రలోకి  వెళ్లిపోయాడు. ఇతని లోని మాటలు మాట్లాడే , మాటలు వినే జీవుడు ఎప్పుడో వెళ్లిపోయాడు. ప్రాణానికి మూలమైనటువంటి వాయువు ఉన్నా అది విడిగా భాషించలేదు. వినలేదు . జీవుడు ప్రాణానికీ , దేహానికీ వేరుగా ఉండి కూడ ముఖ్యుడై ఇంద్రియప్రభావం తో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ఆత్మరూపుడు పంచభూతాలను , పంచేద్రియాలను , మనస్సును , లింగదేహాన్ని విలాసం గా ధరిస్తూ మళ్లీ విడిచి పెడుతూ ఉంటాడు. ఈ ప్రపంచానికంతటికీ ఫ్రభువు వేరే ఉన్నాడు.   అందువలన దీని కోసం మీరు బాధపడటం , దు:ఖించడం అవివేకం కదా. ఎప్పటి వరకు ఆత్మ దేహాన్ని ధరించి ఉంటుందో  అప్పటి వరకూ ఈ కర్మయోగం జరుగుతూనే ఉంటుంది. ఆ తరువాత ఆత్మ దేహాన్ని విడిచి పెట్టగానే   ఈ బంధాలన్నీ తెగిపోతాయి. వీటితో సంబంధ మే ఉండదు. అది తెలియక మీరు దు:ఖిస్తున్నారు.
                   
                  ప్రాణులు  మహామాయ అనే భ్రాంతి లో పడి తల్లిదండ్రులు , భార్యబిడ్డలు , స్నేహితులు, బంధువులు , ఆశ్రితులు అంటూ  అనురాగాలను, అనుబంధాలను పెంచుకొని , ఇళ్లు , వాకిళ్లు , సంపదలూ , సామ్రాజ్యాలను  సంపాదించుకుంటారు, ఎప్పుడైనా మనకు కలలో కన్పించిన సంపద యథార్థమౌతుందా ?  కర్మానుబంధం ఉన్నంతకాలం సంయోగం , కర్మఫలం అనుభవించాక వియోగం ఏర్పడుతుంది.
                         ఈ మాయా గుణ ప్రపంచాన్ని గూర్చి తెలిసిన తత్త్వజ్ఞులు నిత్యానిత్యములను గురించి సుఖ దు:ఖాలను పొందరు. అజ్ఞానులు మాత్రమే సంయోగం కలిగితే పొంగిపోతూ , వియోగం కలిగితే కుంగిపోతూ ఉంటారు. 
                                   పూర్వం ఒక అడవిలో   ఒక కిరాతుడు  పక్షులను వేటాడి జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉదయమే లేచి వాడు వేట కు బయలుదేరాడు. అడవి లో వలలు వేసి పిట్టలను పట్టుకుంటూ , దొరికిన పక్షుల రెక్కలు విరిచి  సంచిలో వేసుకుంటూ లోకభీకరం గా  తిరుగసాగాడు. ఇంతలో కాలచోదితమై ఒక అడవి పిచ్చుకల జంట కిరాతుడి కంటపడింది. ఇంకేముంది. నేర్పు గా వలపన్ని ఆడపిచ్చుక ను పట్టుకొని , రెక్కలు విరిచి సంచిలో వేసుకున్నాడు. అది చూచి  మగపిచ్చుక  వలవల విలపించసాగింది.
                   
               “ అయ్యో! ప్రియురాలా ! అడవిలో ఎక్కడో ఇంత మేత మేసి, పడియల నీరు త్రాగి , ఒకరికి అపకారం చేయక బతుకుతున్నాం కదా. కఠినాత్ముడైన ఆ బ్రహ్మ మన నొసటిని ఈ బోయవాడి చేతిలో చావమని వ్రాశాడు కాబోలు. ఆ పాపిష్టిదేవుడికి మన బతుకు ఇంత బరువయ్యిందా ?   మనందరినీ ఒకేసారి  ఆ కిరాతుని వలలో వేయక   ఇలా ఎడబాటు కల్గించిన  ఆ విధి వంకర చేష్టలను ఏమనాలి.                              

ఱెక్కలు రావు పిల్లలకు ,ఱేపటి నుండియు మేత గానమిం
బొక్కుచుఁ గూటిలో  నెగసి పోవగ నేరవు , మున్ను తల్లి యీ
దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కినిక్కి న
ల్దిక్కులఁ చూచుచున్న వతిదీనత నెట్లు భరింతు నక్కటా ! ( 7 – 63 )
   
         అయ్యయ్యో ! మన పిల్లలుకు ఇంకా  రెక్కలు కూడ రాలేదు. తెల్లవారిన దగ్గర నుంచి మేత లేక ఏడుస్తుంటాయి. గూటినుంచి వెళ్లడానికా ఎగరలేవు. అమ్మ ఆహారం పట్టుకుని ఇటువైపు నుంచే వస్తుందనే ఆశతో దీనం గా నాలుగు దిక్కులు  చూసే ఈ పిల్లల వేదనను ఎలా భరించగలను.”
                అంటూ ఆడపిచ్చుక వియోగాన్ని తలచుకొని దు:ఖిస్తోంది ఆ మగపిచ్చుక.   ఇంతలో బోయవాడు  ఆ పిచ్చుకను చూచి , వెంటనే బాణం తో కొట్టాడు . కాలం తీరిన మగపక్షి కెవ్వున అరుస్తూ  నేలకూలి ప్రాణాలు విడిచింది.
                   కాలము డాసిన నేలం , గూలక పోవశమె యెట్టి గుణవంతులకున్. ( 7-66)
   కాలం మూడితే ఎంతటి గుణవంతుడు , ధనవంతుడు , బలవంతుడైనా మరణించక తప్పదు కదా.!              
                 కాబట్టి  మరణం ఎప్పుడు ఎలా ఎక్కడొస్తుందో తెలియదు. చచ్చిపోయిన మీ నాథుని కోసం మీరు  వంద  సంవత్సరాలు ఏడ్చినా   ఆయనను  చేరుకోలేరు. మృతిఁ బొందిన వారలు చేర వత్తురే. ( 7 -67 ) చచ్చిన వారు ఎప్పుడైనా లేచి వచ్చారా!  “ అంటూ పల్కిన  కపటబాలకుడైన యమధర్మరాజు మాటలను విన్న సుయజ్ఞుని  బంధువులు ఆశ్చర్యపోయారు.   ఈ విశ్వం శాశ్వతం కాదని అర్థం చేసుకొని , శోకాన్ని వదిలి మహారాజు కు ఉత్తర క్రియలు పూర్తిచేశారు.  బాలుని రూపం లో వచ్చిన యమధర్మరాజు అంతర్థానమయ్యాడు.
                   ఈ వృత్తాంతమంతా హిరణ్య కశిపుడు తన తల్లికి, తమ్ముని భార్యాబిడ్డలకు చెప్పి వారిని సమాధానపరచి  మరల ఇలా అన్నాడు.
పరులెవ్వరు దామెవ్వరు  పరికింపగ నేక మగుట భావింపరు, త
త్పరమజ్ఞానము లేమిని బరులును నేమనుచుఁ దోఁచుఁభ్రాణు కెల్లన్.( 7 – 69 )
                       ప్రాణులకు పరతత్త్వ చింతన లేకపోవుడం వలన  నేను , మనము  , వాడు , పరులు అనే , తేడాగా భావిస్తారు. వారు , మేము అని అజ్ఞానులు మాత్రమే అనుకుంటారు. ఆలోచిస్తే మనం అందరూ ఒక్కటే .  ఆ పరమాత్మ ఒక్కడే. అటువంటి వివేచన మనకు కలగాలి. “ అంటూ ముగించాడు హిరణ్య కశిపుడు.
                                                    హిరణ్యకశిపుని  యొక్క ఈ సుదీర్ఘ వివరణ తో తత్త్వవిలోకనం కలిగిన  ఆతని తల్లి యైన దితి , హిరణ్యాక్షుని ఇల్లాండ్రైన ఆమె కోడళ్లు దుఖోపశమనాన్ని పొందగలిగారు. కాని విచిత్రమేమిటంటే  -- ఇంత చెప్పిన హిరణ్యకశిపునకు మాత్రం వార్ధక్యము , మరణము లేని జీవితము , త్రిలోకాధిపత్యము కావాలనే సంకల్పం కలిగి మందరాద్రి కి వెళ్లి ఘోర తపస్సు ప్రారంభించాడు.     దైవ యోగము అనుల్లంఘనీయము కదా !
                  
                   చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతా లవిత్రంబులు స
                   న్మిత్రంబులు మునిజన వన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్ .( 7 – 6)
                               
                                          నమో వేదమాతరం



                               
      


*******************************************************************************