Saturday, 4 January 2014

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు - 5 శ్రీ పరశురాముని చరిత్రము

  
 శ్రీ   భాగవత కల్ప ద్రుమ ఫలాలు  -5
                                            

                                    శ్రీ  పరశు రాముని చరిత్రము

                                 
                      భృగువంశోద్భవుడు,  జమదగ్ని మహర్షి కుమారుడైన  భార్గవరాముడు  సహస్ర బాహుడైన కార్తవీర్యార్జునుని సంహరించిన మహావీరుడు.   తండ్రి ఆజ్ఞను పాటించి తల్లిని, సోదరులను సంహరించి,మరల తండ్రి  ఆశీస్సులతో పునరుజ్జీవితులు గా చేసుకున్న ధర్మ వీరుడు . భగవంతుడైన శ్రీహరియే భూ భారాన్ని తగ్గించడానికి పరశురాముడు గా జన్మించాడని భాగవతం చెపుతోంది. దశావతారాలలో భార్గవరాముడు ఆరవ అవతారం గా పూజలందుకుంటున్నాడు. ఈ వృత్తాంతం ఆంథ్ర మహా భాగవతం నవమస్కంధం లో మనకు  కన్పిస్తుంది.


                 
                      
                               భారతీయ భాషల్లో వెలసిన భాగవతాలన్నీ పోతన భాగవతం తరువాతవే నని విమర్శకుల అభిప్రాయం. కన్నడ భాగవత కాలం  క్రీ.శ 1530. కర్త విఠల నాథుడు. తమిళ భాగవత కర్త అరియప్ప పులవర్. కాలం క్రీ.శ 17 శతాబ్దము. మహారాష్ట్ర భాగవతాన్ని రచించిన ఏకనాథుడు 1580 ప్రాంతం వాడు. ఒరియాభాష లో భాగవతం వ్రాసిన జగన్నాథుడు 15 వ శతాబ్దం వాడు. మళయాళ భాగవతం రచించిన విజుతచ్చన్ కాలం 15 వ శతాబ్దం. వంగభాగవతం వ్రాసిన  మాలాధరదాసు 16 వ శతాబ్దం వాడు. అస్సాం లో భాగవతాన్ని నిర్మించిన శంకరదేవుడు క్రీ. శ 14 -15 శతాబ్దాల మథ్య కాలం వాడు. అంటే వీరందరిమీద కూడ పోతన భాగవత ప్రభావం పరోక్షం గానో, ప్రత్యక్షం గానో ఉందనేది చరిత్ర చెప్పిన సత్యం. అటువంటి మహాకవి తెలుగు వాడు కావడం తెలుగు జాతి అదృష్టం.
                         
                          హైహయవంశ రాజులలో కార్తవీర్యార్జునుడు మహావీరుడు .ఇతను శ్రీ దత్తాత్రేయుని ఆరాథించి ఆయన అనుగ్రహం తో శత్రువిజయాన్ని , సహస్రబాహువులను, అష్టసిద్ధులను , అఖండమైన ఇంద్రియ పటుత్వాన్ని పొందాడు. దానితో మదగర్వితుడై సంచరిస్తున్న ఆ రాజు ఒకనాడు రేవానదిలో తన భార్యలతో జలక్రీడలను ప్రారంభించాడు. ఆటలలో భాగం గా ఆ నదీజలాలను తన వేయి చేతులతో ఆపి ఆనందించ సాగాడు. కాని అదే సమయం లో  సంగ్రామాభిలాషియై శత్రువును  వెతుకుతూ  అక్కడకు వచ్చిన రావణుడు  ఎదురుతన్నిన ఆ నదీప్రవాహపు పోటుకు గురయ్యాడు. తనను ఎదిరించే వాడి కోసం వెతుకుతున్న రావణునికి మంచి అవకాశం దొరికింది.   పెల్లుబికిన కోపం తో, రణదాహం తో రావణుడు కార్తవీర్యార్జునుని పైకి యుద్ధానికి వెళ్లాడు.     
                        
                      కాని కార్తవీర్యార్జునుడు  రావణుని తన బాహుబలం తో ఓడించి, జుట్టు పట్టుకొని మోకాళ్ళ తో పొడిచి, కోతిని కట్టిపడేసినట్టు తన భటులచేత కట్టించి,చెఱసాల లో  పెట్టించి, అనంతరం దయ తలచి వదిలేశాడు.
          
                        అటువంటి మహావీరుడైన కార్తవీర్యుడు ఒకసారి వేటకోసం అడవికి వెళ్ళి,అలసి పోయి, బాగా ఆకలితో జమదగ్ని ఆశ్రమానికి వెళ్లాడు. అతిథి గా వచ్చిన రాజును ఆదరించిన మహర్షి తన హోమధేనువు రప్పించి, దాని అనుగ్రహం తో, రాజుకు , రాజపరివారానికి సుష్ఠు గా భోజనం పెట్టాడు. కడుపు నిండుగా తిన్న రాజుకు కామధేనువు పైన కోరిక కలిగింది. తిన్న ఇంటి వాసాలనే  లెక్కపెట్టి నట్లు, తన భటులను పిలిచి ఆ ధేనువు ను తోలించుకొని  మాహిష్మతీ పురానికి వెళ్ళిపోయాడు కార్తవీర్యుడు.
                      
                     ఆ తరువాత ఆశ్రమానికి చేరిన పరశురామునికి విషయం తెలిసి ఆగ్రహోదగ్రుడయ్యాడు. అన్నం పెట్టిన చేతినే నరికినట్లు, కామధేనువు పెట్టిన అన్నాన్నే తిని దాన్నే బంథించి తీసుకెళ్లిన కార్తవీర్యుని అకృత్యాన్ని సహించలేకపోయాడు పరశురాముడు.

“  అద్దిరయ్య యింట నశనంబుఁ గుడిచి మా యయ్య వలదనంగ నాక్రమించి
   కోరిమొదవు రాజు గొనిపోయినాఁ డట, యేను రాముడౌట యెఱుగఁ డొక్కొ. !” (9.442)
             
               అంటూ పరశువు.కోదండ విల్లంబులను దాల్చి, కవచావృత శరీరుడై, ప్రళయాగ్ని వలే ప్రజ్వరిల్లుతూ, ఏనుగు వెంట పడే సింహం లాగ పరశురాముడు  కార్తవీర్యర్జునుని వెంబడించాడు.   

“ కనియెన్ ముందటఁ గార్తవీర్యుడు సమిత్కాముం, బ్రకాముం, శరా
సన తూణీర కుఠారభీము, నతిరోష ప్రోచ్చల ద్భ్రూయుగా
నన నేత్రాంచల సీము ,నైణపట నానామాలికోద్దాము నూ
తన సంరంభ నరేంద్రదాన శుభసూత్రక్షామునిన్ రామునిన్. “(9.446)

               మాహిష్మతీ పురం చేరిన కార్తవీర్యునకు  చలించే కనుబొమలతో, గండ్రగొడ్డలిని ధరించి ,మిడిసిపడే రాజుల మంగళ సూత్రాల్ని తొలగించేవాడైన పరశు రాముడు ఎదురుగా  వచ్చి కన్పించాడు.ఒక బ్రాహ్మణ బాలకుడు తనకు ఎదురుగా వచ్చి కయ్యానికి కాలుదువ్వడం అవమానం గా భావించిన అర్జునుడు ఈ బ్రాహ్మణుని పట్టి కొట్టి చంపుడని సేనాపతులను ఆజ్ఞాపించాడు.

                  పదిహేడు అక్షౌహిణుల సైన్యం తో దండనాయకులు కదలి పరశురాముని ఎదిరించారు. కాని తొలకరి వేళలో చేలోని దుబ్బులను పెళ్ళగించే  కృషీవలుని వలే పరశురాముడు ఆ సైన్యాన్నంతటిని తెగనరికి కార్తవీర్యార్జునుని వైపు మళ్లాడు. అప్పుడు జరిగిన ఘోరయుద్ధం లో పరశురాముడు పరశువుతో కార్తవీర్యుని చేతులను, శిరస్సును ఖండించి, నేలపడగొట్టాడు. భయంతో అతని పదివేల మంది కుమారులు ప్రాణ భయం తో పారిపోగా, దూడతో కూడిన ఆవును మరల ఆశ్రమానికి తోలుకొచ్చాడు. తన కుమారుని పరాక్రమాన్ని విన్న జమదగ్ని విష్ణ్వంశ కలిగిన రాజును సంహరించడాన్ని సమర్థించలేకపాయాడు.

      


        “  తాలిమి మనకును ధర్మము , తాలిమి మూలంబు ధర్మతత్త్వంబునకున్
          దాలిమి గలదని యీశుం, డేలించును బ్రహ్మపదము నెల్లన్ మనలన్ .”(9.462)
         
   “క్షమ కలిగి ఉండటం వలనే  ఈశ్వరుడు మనలను బ్రహ్మ పదం లో కలిపాడు.మనకు క్షమ యే ధర్మము” 
అన్నాడు .

           “ క్షమ కలిగిన సిరి గలుగును క్షమ గలిగిన వాణి గలుగు సౌఖ్యములెల్లన్
          క్షమ గలుగఁదోన కలుగును , క్షమ కలిగిన మెచ్చుశౌరి సదయుఁడు తండ్రీ.!” (9.463)

               రాజును చంపిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక సంవత్సర కాలం  పుణ్యతీర్థాలు  సేవించి రమ్మని ఆజ్ఞాపించాడు జమదగ్ని. తండ్రి ఆజ్ఞను శిరసావహించి , ఏడాది పాటు తీర్థ యాత్రలు చేసి వచ్చాడు పరశురాముడు.
                       
              ఒకరోజున జమదగ్ని ఇల్లాలు రేణుక గంగానదికి నీటికోసమై వెళ్ళింది. అదే సమయం లో  నీటిమధ్యలో అప్సరసలతో జలకాలాడుతున్న చిత్రరథుడనే గంధర్వుని చూస్తూ  ఉండిపోయి కాలయాపన చేసింది.  హోమానికి సమయం దాటిపోయింది. ఆలస్యం గా వచ్చి, తడబడుతూ నిలబడిన   ఇల్లాలిని చూసి, దివ్యదృష్టి తో  సర్వం తెలుసుకొన్నాడు మహర్షి.  “మత్తం దీనిం జావగ మొత్తుండని ”జమదగ్ని తన కుమారులను ఆదేశించాడు.తండ్రి ఆజ్ఞను విన్న కుమారులు దుఖిస్తూ ఉండిపోయారే కాని తల్లి ని చంపలేకపోయారు.  దానితో కడపటి వాడైన పరశురాముని ఆజ్ఞాపించాడు మహర్షి.

“ కడుకొని పెండ్లముఁ జంపని , కొడుకులఁ బెండ్లాముఁ జంపఁ గురు డానతి యీ
నడుగులకు నెఱగిఁ రాముం ,డడుగిడకుండగఁ ద్రుంచె నన్నలఁ దల్లిన్. “ (9.471)
           
       తండ్రి మాటను వినకపోతే కోపం తో శపిస్తాడు. ఆజ్ఞ ను పాటిస్తే తపోధనుడైన తన తండ్రి అన్నలను తల్లిని  బ్రతికిస్తాడని  భావించిన పరశురాముడు తండ్రి ఆజ్ఞ ను శిరసావహించి, అన్నలను, తల్లిని ఖండించాడు. తన చిన్నకొడుకు తన యాజ్ఞ పాలించినందుకు  ఎద నిండుగా ఆనందించాడు జమదగ్ని.

“మెచ్చిన తండ్రినిఁ గనుగొని, చెచ్చెర నీ పడిన వారి జీవంబులు నీ
విచ్చితి ననుమని మ్రొక్కిన , నిచ్చెన్ వారలును లేచి రెప్పటి భంగిన్. “ (9.475)

                   ఆ సమయం చూసి “ఈ మరణించిన వారిని మరల బ్రతికించమని” ప్రార్థించాడు రాముడు. ముని  అనుగ్రహించాడు. వారు ఎప్పటిలాగే  లేచి కూర్చున్నారు. అందుకే -

“పడిన వారల మరల బ్రతికింపనోపును, జనకుఁ డనుచుఁ జంపె జామదగ్నుఁ
డతడు సంపె ననుచు నన్నలఁ దల్లిని జనకునాజ్ఞ నైనఁ జంపదగదు. “ ( 9.476)

    పరశురాముడు చంపాడు కదా  అని తండ్రి చెప్పినా కూడ  లోకంలో ఎవరూ అన్నలను, తల్లిని చంపకూడదు. ఎందుకంటే చనిపోయిన వాళ్ల ను తన తండ్రి తపోబలం తో మరల బ్రతికించగలడని తెలుసు కాబట్టే  పరశురాముడు ఆ విధం గా ప్రవర్తించాడని మనం తెలుసుకోవాలి. 

                  ఆనాడు పరశురాముని కి భయపడి పారిపోయిన కార్తవీర్యార్జునుని కుమారులు పదివేలమంది పరశురాముని పై కక్ష కట్టి  అదనుకోసం ఎదురుచూస్తున్నారు. ఒకరోజు యజ్ఞశాలలో ధ్యానవృత్తి లో నున్న జమదగ్నిని  కదలనీయకుండా పొదివి పట్టుకొని, రేణుక అడ్డంపడినా  లెక్కచేయక జమదగ్ని తలను నరికి వెళ్లి పోయారు.

 “జనకుం జంపిన వైర మేమఱక రాజన్యాత్మజుల్ నేఁడు మీ
జనకుం జంపిరి రామ! రామ! రిపులన్ శాసింతు రమ్మంచు న
మ్ముని పై వ్రాలి లతాంగి మోఁది కొనియెన్ ముయ్యేడు మారుల్ రయం
బున రాముం డరుదెంచి యెన్నికొన నాపూర్ణాపదాక్రాంతయై.”  ( 9.480)

                 “  రామా! నీతండ్రిని చంపిన పగను మనసులో పెట్టుకొని అర్జునుని కొడుకులు నీ తండ్రిని చంపారు. శత్రువులను శిక్షించడానికి వేగం గా రావలసిందని” తల్లి రేణుక రాముడు లెక్కపెట్టుకొనేటట్లు గా  భర్త  మీద పడి ఇరువది ఒక్కసార్లు ఆక్రోశిస్తూ గుండెలు బాదుకున్నది.

               సమిథలు,కట్టెలకోసం సమీపారణ్యానికి వెళ్లిన జమదగ్ని కుమారులు పరుగు పరుగున ఆశ్రమానికి చేరారు. “కొడుకులు తోడు లేకుండా గుమ్మం కూడ దాటని నీవు ఒంటరిగా స్వర్గానికి  వెళ్లడానికి కాళ్లు ఎలా వచ్చాయని”  తండ్రిని పట్టుకొని  దు:ఖిస్తున్న అన్నలను  చూచి క్రోధోద్విగ్నుడయ్యాడు పరశురాముడు. అన్నలారా ! దు:ఖించకండి. తండ్రి కళేబరాన్ని జాగ్రత్తగా  రక్షిస్తూ ఉండండి. పగ తీరుస్తాను” అంటూ  రాముడు పరశువు ను ధరించి   మాహిష్మతీ పురానికి వెళ్లి, బ్రహ్మహత్యాపాతకులైన కార్తవీర్యుని కుమారులను పదివేలమందిని వెంటపడి  రక్తపుటేరులు ప్రవహించేటట్లు గా చిద్రుప చిద్రుపలుగా నరికి పోగులుపెట్టాడు.

            అంతటితో ఆగకుండా పరశురాముడు తండ్రి పగను తీర్చుకోవడం కోసం భూమి పైన క్షత్రియ శబ్దం  వినబడనీయకుండా ఇరవై ఒక్క  మార్లు భూమంతా తిరిగి  రాజులను గాలించి సంహరించాడు. “ తండ్రి పగ తీర్చలేని కొడుకు కూడా ఒక కొడుకేనా “ ? అంటాడు మహాకవి.

“అయ్య పగకు రాముఁ డలయక రాజుల , నిరువదొక్కమాఱు లరసి చంపె
జగతి మీఁద రాజశబ్దంబు లేకుండ సూడు దీర్పలేని సుతుడు సుతుడే”? ( 9.487 )

               పరశురాముడు శమంతక పంచకం లో  రాజుల రక్తం తో తొమ్మిది మడుగులను చేసి తండ్రి తలను తెచ్చి శరీరం తో చేర్చి సర్వదేవమయుడైన తానే దేవుడు కాబట్టి తన్నుఉద్దేశించి తానే యాగం చేశాడు.  సమస్త దిక్కులను  హోతకు ,బ్రహ్మ కు, అధ్వర్యునకు , ఉద్గాతకు మొదలైన వారందరికి దానం చేసి, సరస్వతీ నది లో అవబృథ స్నానం చేసి  సర్వపాపాలను పోగొట్టుకొని మబ్బు విడిచిన సూర్యుని వలే ప్రకాశించాడు.


                                                   గుడిమల్లం లోని అతి ప్రాచీన  పరశురామేశ్వర లింగం

  ( చూ.  divyakshetralu.blogspot.com  లో గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరాలయం)
                           

                        వంశోద్దారకుడైన కుమారుని వలన జమదగ్ని సంకల్ప శరీరం పొంది తన తపోబలం తో సప్తర్షిమండలం లో ఏడవవాడై వెలుగుతున్నాడు. రాబోయే మన్వంతరం లో పరశురాముడు సప్తర్షులలో ఒకడు గా ప్రకాశిస్తాడు. అప్పటివరకూ గంధర్వులు , సిద్ధులు తన పవిత్ర చరిత్రను గానం చేస్తుండగా పరశురాముడు ఐహిక బంధ విముక్తుడై, ప్రశాంతచిత్తం తో మహేంద్రగిరి మీద  తపోనిష్టలో ఈ నాటికీ ప్రవర్తిల్లు తుంటాడు. అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటే –

“భగవంతుడు హరి యీ క్రియ ,భృగుకులమునఁ బుట్టి యెల్ల పృథివీ పతులన్
జగతీభారము వాయగ ,బగఁగొని పలుమాఱు చంపె బవరమున నృపా .!”(9.492)
              
              అంటుంది భాగవతం. భగవంతుడైన శ్రీహరి భూభారం తొలగించడానికి భృగుకులం లో పుట్టి, క్షత్రియులను పలుమార్లు యుద్ధం లో పరిమార్చాడట.




*****************************************************

Wednesday, 13 November 2013

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు - 4 గోపికా వస్త్ర్రాపహరణము



    శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు -4
                   

        
       
                                                  గోపికా వస్త్రాపహరణము







                     హేమంతఋతువులో  చలిపులి లోకం పై విరుచుకు పడింది. చలికి తట్టుకోలేక త్రిమూర్తులు వంటి వారే వారి భార్యలను సగంలో కలిపేసుకున్నారు. పగళ్లు చిన్నవై పోయి, రాత్రి పొద్దులు పెరిగిపోయాయి.చలి అథికమై లోకమంతా’ ఊహూహూ’ అంటూ వణికిపోతోంది.
                 
                     ఇటువంటి హేమంతపు మొదటి మాసం లో  మార్గశీర్షం లోని  మొదటి రోజున నందుని మందలోని గోపకుమారిక లందరు వేకువఝూమునే లేచారు.కాళిందీ నదికి వెళ్లి స్నానాలు చేసి,  నదీ తీరంలో ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి, పరిమళపుష్పాలతో అర్చించి,చందన,థూప దీపనైవేద్యాలను సమర్పించి,భక్తితో ప్రార్థించారు.” తల్లీ! కాత్యాయనీ! మా అందరికీ శీఘ్రంగా  శ్రీకృష్ణుని పతిగా ప్రసాదించవమ్మా భగవతీ!   శ్రీకృష్ణుడు మాకు ప్రాణేశ్వరుడైన రోజున మేమందరం నేతి వసంతా లాడుచూ, పరమభక్తితో నీకు జాతర చేస్తా” మని మ్రొక్కుకొని, దేవికి నివేదించిన ప్రసాదాన్ని భక్తిగా స్వీకరిస్తూ ఒక నెల రోజులపాటు కాత్యాయనీ వ్రతాన్ని చేపట్టారు.
                
                            రమణులందరు ఒక రోజున ప్రాత :కాలం లోనే మేల్కొన్నవారై, ఒకరినొకరు పేరుపేరునా పిలుచుకుంటూ , అందరినీ కలుపుకొని కమలనయనలందరూ కమలాక్షుని స్తుతిస్తూ గజగమనలై యమునానదీ తీరానికి చేరుకున్నారు. ఒక ఏకాంతస్థలం లో సంశయము ఏ కోశానా లేకుండా వలువలనన్నింటినీ విడిచి , నీటిలోకి  దిగి జలకాలాడసాగారు.
           
            “ వారిజలోచను పాడుచు, వారిజలోచనలు వారివారికి వేడ్కన్
              వారి విహారము సలిపిరి వారి విహారము జగతి వారికి గలవే”  (10.పూ.813)
              
                            వారు జలకాలాటలలో ఎంత ఆనందాన్ని పొందుతున్నారో మహాకవి  ఈ అందమైన పద్యంలో అందించారు.  ఆ పద్యాన్ని నడపించిన తీరు ఆ రమణీమణుల జలకాలాటలలోని ఒయ్యారపు విహారాలను దృశ్యమానం చేస్తోంది .
               
                రమణులందరూ యమునానది లో జలకాడుతున్న  కబురు తెలుసుకున్న నందనందనుడు తనతోటి గోపబాలురలతో కలసి  అక్కడకువచ్చాడు. గోపాలకులకు కదలవద్దని కనుసైగ చేసి,  మెల్లగా మెల్లగా వెళ్లి ఆ గోపికల వస్త్రాలను అపహరించాడు.  ఆద్యుడు ,విశ్వవిభుడు అయిన ఆ పరమాత్ముడు ఒక చిన్నపిల్లవాడిలాగ  స్నానం చేస్తున్నఆడవారి వస్త్రాలను  దొంగిలించి , సమీపంలోని కడిమిచెట్టు నెక్కి కూర్చున్నాడు. ఆ సమయం లో తాను చెట్టుగా జన్మించి నందుకు కల్గిన సంతాపాన్ని ఆ కడిమి చెట్టు పోగొట్టుకొని సంతోషాన్ని పొందిందట. దాని అదృష్ఠం అది.
         
                  తమ వస్త్రాలను కన్నయ్య దోచుకెళ్లాడని చూచిన గోపకాంతలు చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ, ఇలా అన్నారు.
                 
                  “  మా మా వలువలు ముట్టకు మామా! కొనిపోకు పోకు మన్నింపు తగన్
                     మా మాన మేలకొనియెదు  మా మానసహరణ మేల మానుము కృష్ణా! “  (10.పూ.820)
               
                    గోపికా మానస చోరా! మా మానమెందుకు హరిస్తావు. మా మనస్సుల నెందుకు దోచుకుంటావు! అని ప్రశ్నిస్తూనే ఆ దేవదేవుని యొక్క పరమాత్మ తత్త్వాన్ని, ఆథిక్యతను, గొప్పతనాన్ని పలురీతుల ప్రస్తుతించారు.
          

                                           ద్వారకా తిరుమల ఆలయ రాజగోపురం లోని కుడ్యచిత్రం
                      
                             ఈ ప్రస్తుతిలో దశావతారాల ప్రస్తావన  కన్పిస్తుంది. “ బుధులు మెచ్చ భువి ప్రబుద్ధత మెఱయుటో? అంటూ బుద్ధుణ్ణి తొమ్మిదవ అవతారం గా ఇక్కడ చెప్పడం మనం గమనించవచ్చు. అలాగే  ఎనిమిదవ అవతారమైన కృష్ణావతారం లోని  ఈ ఘట్టం లోనే “కలికితనము సేయ ఘనత గలదె” అనే పాదం లో  రాబోయే కలియుగం లోని కల్కి అవతారాన్ని  కూడ ఇక్కడ గోపికలు అన్యాపదేశం గా ప్రస్తావించినట్లు పండితులు భావిస్తున్నారు.  
               
                         రామావతారం లో దండకారణ్యం లోని  మునీశ్వరులందరూ తమ కోరిక మేరకు కృష్ణావతారం లో  గోపికలు గా జన్మించారని ఒక కథ ఉంది.
   
                  “వావి లేదు వారి వారు నా వారని నెఱుగ వలదె వలువలిమ్ము” అంటూ పరమాత్ముని సార్వభౌమత్వాన్ని ప్రతిష్ఠిస్తూనే,” మా వలువలు మాకియ్యవయ్యా” అంటూ ప్రార్థించారు గోపికలు .   
               
               “కొంటివి మా హృదయంబులు ; కొంటివి మానంబు; లజ్జఁ గొంటివి; వలువల్
                గొంటి; వికనెట్లు సేసెదో; కొంటెవు గద! నిన్నునెఱిగి కొంటిమి కృష్ణా !  (10.పూ.822)
   
                            " మా మనసులపహరించావు.మా మానం కొల్లగొట్టావు. సిగ్గులు దోచావు.ఇప్పడు వలువలు దోచావు. ఇంకా ఏంచేస్తావో!   “ నిన్ను నెఱిగి కొంటిమి కృష్ణా !” అనేశారు గోపికలు. సర్వం సహా సమర్పణమే భగవత్తత్వ పరిలబ్ధికి  ప్రధమ సోపానం.   ఆ మాట గోపికల నోట రావడమే ఈ వృత్తాంత పరమార్థం. అందుకే భగవంతుని గుణాతీతత్త్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, కాలాతీత తత్వ్తాన్ని బహుథా ప్రశంసించి, చివరకు –
                  
                   “ నీవెరుగనిదేమున్నది నీవందఱిలోన థర్మననిరతుడవు గదే”( 848) అన్నారు గోపికలు.
                    
                        అందుకే స్వామి కూడ ప్రౌఢంగా ఇలా అనేస్తాడు.   “ఎరుగనే మీ లోన నెప్పుడు ఉన్నాడ 
 నేను జూడని మర్మమెద్ది గలదు.’  వ్రతదీక్ష లో ఉండి వలువలు ధరించకుండా  నియమాన్ని వివస్త్రలై తప్పి  జలకాలాడతారా.? ఇది కాత్యయనీ దేవికి  అపరాథం చేసినట్లు కాదా?. ఈ విథం గా నోము చేసే జవ్వను లెచ్చటైనా ఉన్నారా?. అంటూ ప్రశ్నించాడు. మీకు వ్రతఫలం దక్కాలంటే  చక్కగా చేతులెత్తి నాకు   నమస్కరించండి. అని బోథించాడు. 
                        

                         
                                                                  ఒక   అపురూప చిత్రం
                                            
                                                 ఆ పరమ పురుషుని మాటలు విన్న ఆ యువతులు తమలో  పరి పరి విధాల తర్కించుకున్నారు.వ్రతములు చేస్తూ ఏ ఉత్తమశ్లోకుని స్మరిస్తే  వ్రతభంగాలన్నీ తొలగిపోతాయో అటువంటి పరాత్పరుని మాటలు విన్నారు. కట్టుకోకలు విడిచి స్నానమాడటం తప్పని తెలుసుకొని, వ్రతభంగం కాకుండా కాపాడిన విశ్వలోకునకు” ఫాలతటన్యస్త కరాబ్జలై “  అంటే అరవిందాలవంటి తమ చేతులను నుదుటి పై నుంచుకొని వందనాలను సమర్పించారు. సంతోషించాడు నంద నందనుడు.

          ‘ బాలలకు హస్తకీలిత, ఫాలలకు నితాంతశీత పవనాగమ నా
            లోలలకు  నంబరములు కృపాలుడు హరి యిచ్చెభక్తపాలకుడగుటన్.’ (10.పూ.844)
                  
                హరి భక్త పాలకుడగుట వలననే ఆ చెలువలకు వలువ లొసగి, వ్రతఫలం దక్కేటట్లు చేశాడు.
        
         ‘చీర లపహరించి సిగ్గులు విడిపించి, పరిహసించి యైనఁ బరగఁమనకు
         ఘనుడు నోము కొఱత గాకుండ మ్రొక్కించె, ననుచు హరి నుతించి రబల లెల్ల.’(10.పూ.845)
         
                    చీరలపహరించి, సిగ్గులు పోగొట్టినా మనకు నోము ఫలాన్ని అందించాడని ఆ రమణు లందరు యశోదానందనుని  కొనియాడారట. ఎందుకంటే  మనసుకు బాథ కలిగించినా, అపహసించినా , కలత కలిగించినప్పటికీ  ప్రియులు చేసే పని ప్రియురాండ్ర కు బాథాకరం కాదు. అది ఎంతో ప్రియం గానే ఉంటుంది.
     
                  ” వల్లభులు సేయు కృత్యము వల్లభలకు నెగ్గుకాదు వల్లభ మధిపా!” అంటాడు శుకమహర్షి  పరీక్షిన్మహారాజు తో.
     
          “ నన్నుఁ బొందగల్గు  నమ్మి పొండని హరి పల్క నింతులెల్ల  భ్రాంతిఁ జనిరి
            తపము పండె ననుచుఁ దత్పదాంభోజముల్, మానసించు కొనుచు మంద కడకు.” (10.పూ.848)

                    సర్వమున్నతని దివ్యకళామయమని భావించి, ఆ పరమాత్ముని దివ్యచరణారవిందాలను మానసించి,   పూజించి, సర్వం  శ్రీకృష్ణార్పణమస్తు  అని  సమర్పించడమే భాగవత తత్త్వం.




             
***************   త్వమేవ శరణం మమ*******************  

Thursday, 31 October 2013

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు - 3 నరకాసురవథ



                నరకాసుర వథ
                            (దీపావళి )
                      
                 


                   ఆంథ్ర మహాభాగవతం లో దశమస్కంథం ఉత్తరభాగం లో నందనందనుడైన శ్రీకృష్ణుడు పదహారువేలమంది  కన్యకామణులను వివాహమాడిన ఘట్టం లో నరకాసురవథ  ప్రస్తావనకు వస్తుంది.భూదేవి అపరావతారమే సత్యభామ యని భక్తుల విశ్వాసం. గోదాదేవి సత్యభామ అవతారమని వైష్ణవ సాంప్రదాయం చెపుతోంది. 
                  
                   శ్రీ రామావతారం లో విశ్వామిత్రుడే కృష్ణావతారం లో సత్యభామ గా జన్మించాడని జానపదులు  చెప్పుకుంటారు. అందుకే  శ్రీకృష్ణుడు సత్యభామ యొక్క వామపాద తాడనాన్ని కూడ సహించాడని చెపుతారు.
              
                      

                             శ్రీమద్రామాయణంలో యాగసంరక్షణకు తన వెంట రామలక్ష్మణులను తీసుకెళ్లే సమయంలో ఒక రాత్రి సరయూతీరం లో విశ్రమించారు. మరుసటి రోజు ప్రాత:కాల సమయం లో నిద్రాముద్రితుడైన బాలరామునికి  సుప్రభాతం  పలుకుతూ “ కౌసల్యా సుప్రజారామా!“నిద్రలేపాడు కదా.  ఆ సమయం లో పుంసాంమోహనురూపుడైన కౌసల్యాతనయుని ముగ్థమోహన సౌందర్యానికి ఆకృష్టుడై విశ్వామిత్రుడు శ్రీ  రామచంద్రుని   బిగికౌగిలిని  అడిగాడట. కాని శ్రీ రామచంద్రుడు తాను ఈ అవతారం లో ఏకపత్నీ వ్రతుడినని , కనుక కృష్ణావతారం లో మీ కోరిక తీరగలదని వరమిచ్చాడని, అందువలన విశ్వామిత్రుడే కృష్ణవతారం లో సత్యభామ గా జన్మించి,తరించాడని  జానపదులు,పౌరాణికులు చెపుతుండేవారు.   వీరికి ఆకరమైన ఆథారం ఎక్కడిదో తెలీదు. కథకు కాళ్లుండవు కదా !  
            
                   శ్రీ రామచంద్రుడికే గురువైన విశ్వామిత్రుడే సత్యభామ యైనప్పుడు యుద్ధానికి బయలుదేరిన శ్రీకృష్ణునితో   ఆమె కూడ వస్తానని బయలుదేరడం లో కాని, నరకాసురుని తో యుద్ధం చేయడం లో కాని ఆశ్చర్యం లేదు. ఈ ఘట్టం నాచనసోముని ఉత్తరహరివంశం లో అద్భుతమైన కవితా విన్యాసం తో ఆవిష్కరించబడింది.  ఆ విన్యాసానికి ముగ్థుడైన మహాకవి పోతన సోమన కవిత్వం పై నున్న  అభిమానం తో  అందులోని కొన్ని అందమైన పద్యాలను అనుకరించాడని విమర్శకుల భావన.
          
                     ఈనాడు మనం అస్సాం గా పిలుస్తున్న ప్రాంతమే ఆనాటి నరకుని ముఖ్యపట్టణమైన ప్రాగ్జ్యోతిషపురం గా చెప్పబడుతోంది.10 వ శతాబ్దానికి చెందినదిగా చెపుతున్న  ఉపపురాణమైన కాళికాపురాణం లో  నరకాసురుని ప్రస్తావన అధికంగా కన్పిస్తోంది. కామాఖ్యాదేవి వృత్తాంతం ఇందులో ప్రస్తావించబడింది. మహాభారత , రామాయణాల్లో సైతం ఇతని ప్రసక్తి వస్తోంది. మహాభారతం లో ఇతని కుమారుడు భగదత్తుడు  కౌరవుల పక్షాన కురుక్షేత్ర సంగ్రామం లో పాల్గొన్నాడు.  శతపథ బ్రాహ్మణం, హరివంశం, భాగవతం, విష్ణు పురాణాల్లో కూడ  భూదేవి, నరకాసురులకు శ్రీమహావిష్ణువు,  బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలు ప్రస్తావించబడ్డాయి.
              
                   నరకాసురుని ఆగడాలు, అత్యాచారాలు  పెచ్చు పెరిగి పోయాయి. అదితి కర్ణకుండలాలను అపహరించాడు. వరుణదేవుని ఛత్రాన్ని,దేవతల మణిపర్వతాన్నికూడ ఎత్తుకుపోయాడు. దేవేంద్రుడు వచ్చి శ్రీకృష్ణునికి మొర పెట్టుకున్నాడు.నరకుని పీడ ను త్వరగా వదిలించ వలసిందని    చేతులెత్తి ప్రార్థించాడు. ఆపన్నశరణ్యుడు, రాక్షసవిదారి అయిన మాథవుడు నరకాసుర సంహారానికి సమయ మాసన్నమైనదని నిర్ణయించి, యుద్ధసన్నద్ధుడై గరుడవాహనం పై నరకుని నగరమైన ప్రాగ్జ్యోతిషపురానికి బయలు దేరాడు.
              
                   ఇంతలో” స్వామీ! మీరు యుద్ధరంగంలో రాక్షసమూకలను చీల్చి చెండాడుతుంటే నాకు చూడాలని కోరికగా ఉంది.ప్రాణేశ్వరా! నామాట మన్నించి నన్నుకూడ మీ వెంట తీసుకెళ్లండి.అక్కడ మీ ప్రతాపాన్ని కనులారా చూచి వచ్చి ఇక్కడ రాణులందరికీ  తెలియజేస్తాను” అంటూ ప్రాథేయపడింది సత్యభామ.
                  
                     చిరునవ్వులను చిందించాడు శ్రీ కాంతుడు.” చెలీ! రణరంగమంటే తుమ్మెదల ఝంకారాలు కావు.మదించిన ఏనుగుల ఘీంకారాలు. అక్కడ కన్పించేవి తామరవనం నుండి గాలికి ఎగిరివచ్చే పుప్పొడులు కావు.గుఱ్ఱపు డెక్కల చివరల నుండి లేచిన థూళి దుమారాలు. రాజహంసలతో కూడిన సరోవరాలు కావు. రాక్షససైన్య సమూహాలు. కలువలు కమలాలు అక్కడ కన్పడవు.అక్కడ  కన్పించేవి భయంకరమైన శత్రుశూలాలు.ఖడ్గాలు ఆయుధాలు. ఇటువంటి యుద్ధరంగానికి నీవెందుకు? నేను త్వరగా వచ్చేస్తా! నీవు రావద్దు” అన్నాడు.
              
                   కాని సాత్రాజితి వినలేదు.” మీ బాహువులనే కోట నాకు రక్ష గా ఉండగా  వారు రాక్షస సమూహాలైనా నన్నేం చేస్తారు. నేను కూడ మీతో వస్తాను” అంటూ చేతులు జోడించి గోముగా ప్రార్థించింది.  అందుకు అంగీకరించి, సతీ సమేతంగా గరుడారూఢుడై నరకాసుర పట్టణానికి బయలుదేరాడు రుక్మిణీనాథుడు.
                 
                     మురాసురుడు ప్రాగ్జ్యోతిష పట్టణాన్ని తన భుజబలం తో  కాపాడుతున్నాడు. అటువంటి ప్రాగ్జ్యోతిష పట్టణం పై దాడి చేసి తన గదా ఘాతాలతో నగర ప్రాకారాలను పడగొట్టి రాక్షస సైన్యాన్ని భయభ్రాంతుల్నిచేస్తూ, ప్రళయకాల మేఘగర్జన వంటి  థ్వనితో తన పాంచజన్యాన్ని పూరించి, యుద్ధాన్ని ప్రకటించాడు శ్రీహరి. అప్పుడు జరిగిన మహాసంగ్రామం లో దేవేంద్రుని వజ్రాయుథం దెబ్బ కు శిఖరాలు తెగి కూలిన పర్వతం వలే మురారి చక్రాయుథం  దెబ్బ కు అయిదు తలలు  తెగి నేలకొరిగాడు మురాసురుడు.
                         
                               తన తండ్రి మరణవార్త విని  క్రోధోద్రిక్తులైన  మురాసురుని  కుమారులు ఏడుగురు తామ్రుడు,అంతరిక్షుడు,శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు అరుణుడు అనువారు పీఠుడు అనే సైన్యాథిపతి నాయకత్వం లో ప్రళయ కాలమందలి పవనసప్తకం వలే ఒకేసారి శ్రీకృష్ణుని మీద దాడి చేశారు.
                           
                       రాక్షసులు ప్రయోగిస్తున్న  వివిథ ఆయుథ సమూహాలను   రాక్షసాంతకుడైన మురారి  తన ఆయుథ పరాక్రమం తో నేలకూలుస్తూ, తన బాణాలతో ఆ రాక్షసుల  కాళ్లు ,చేతులు, కంఠాలను నువ్వుగింజల వలె చిద్రుపలు, చిద్రుపలు గా చేసేశాడు.
                      
                    దారుణ మైన తన వారి మరణవార్త ను విన్న నరకాసురుడు రోషంతో శ్రీ హరిని నిందిస్తూ, తనను తాను స్తుతించుకుంటూ,యుద్ధానికి సిద్ధమై రత్న ఖచిత కుండలాలను, వివిధ ఆభరణాలను  అలంకరించు కొని  మత్త వేదండంబుల దండు వెంటరాగా గజారూఢుడై రణరంగానికి తరలి వచ్చాడు.
             
                 గరుడవాహనాన్ని అథిరోహించిన నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుడు, వీపున అమ్ముల పొది దాల్చి, సత్యభామ కు సంగ్రామ రహస్యాలను బోథిస్తూ , చంద్రబింబం పై మెరుపుతీగ తో కూడిన మేఘం లా ప్రకాశించాడు. ఇంతలో యుద్ధానికి సిద్ధమై వస్తున్న నరకాసురుని చూచిన సత్యభామాదేవి ఇంక ఏమాత్రం ఆలస్యం చేయక, వెంటనే వాలుజడ ముడివేసి. చీరముడి బిగించింది. ఆభరణాలను చక్కచేసుకొని, పైట ను సరిచేసుకొంది. ముఖం కాంతితో ప్రకాశిస్తుంటే మురాంతకుని కంటే ఒక అడుగు ముందుకేసి నిలబడింది సాత్రాజితి.  సమరసన్నద్ధ యైన తన భామను చూచి, మురిసిపోయిన మురారి సరసం గా ఇలా అన్నాడు.
    
        “  లేమాఁ దనుజుల గెలవఁగ  లేమా నీవేలకడగి లేచితి విటురా
           లే మాను మానవేనిన్, లే మావిల్లందికొనుము లీలం గేలన్.”
           
          అంటూనే శ్రీకృష్ణుడు విల్లును సత్యభామ కు అందించాడు. తన నాథుడు అందిచ్చిన విల్లును థరించి గొప్పతేజస్సు తో ,మహాప్రతాపం తో ప్రకాశించింది సాత్రాజితి.శత్రుసేనల గుండెలదిరేటట్లు, వారి యేనుగుల సమూహాలు భయము తో మూర్ఛిల్లేటట్లు ఒక్కసారిగా  అల్లెత్రాటిని మీటి యుద్ధానికి సిద్ధమైంది సత్యభామ.
    
                బంగారు కంకణాల సుమథుర  ధ్వనులు వింటినారి తో స్నేహం చేస్తుంటే , చెవికమ్మల లోని మణుల కాంతులు చెక్కిళ్ల పై ప్రతిఫలిస్తుండగా, క్రీగంటి చూపుల  ధవళ కాంతులు బాణ కాంతులను కప్పి వేస్తుంటే, బాణాలను ప్రయోగించడం వలన కలిగిన శబ్దం శత్రుసైన్యాల ఆర్త నాదాలను మింగివేస్తుంటే, వీరము, శృంగారము,భయము ,రౌద్రము, విస్మయాలు కలసి ఈ భామ గా రూపొందాయా అన్నట్లు , సత్యభామ బాణం  తొడగడం,ఎక్కుపెట్టడం , ప్రయోగించడం కూడ గుర్తించలేనంత వేగం గా యుద్ధం చేయసాగింది.

              “ పరుజూచున్  వరుఁజూచునొంప నలరింపన్ , రోషరాగోదయా
              విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
              జరగన్, గన్నులఁగెంపు సొంపుఁ బరఁగం జండాస్త్ర సందోహమున్
              సరసాలోక సమూహమున్ నెఱపుచుం జంద్రాస్య హేలాగతిన్ .”
  
                        వీర శృంగార రసాలు ఆకారం దాల్చినట్లు చంద్రానన యైన సత్యభామ  నరకాసురుని ,శ్రీకృష్ణుని చూస్తూ,రోష రాగాలను కనుబొమ ముడితో, మందహాసం తో  ప్రకటిస్తూ, సోగ కన్నులతో నాథుని చూస్తూ,  కోపపు కన్నులతో నరకుని తిరస్కరిస్తూ,  అతివిలాసంగా,అలవోక గా  యుద్ధం చేయసాగింది.
  
           “ అళినీలాలక చూడ నొప్పెసగెఁ  ప్రత్యాలీఢపాదంబుతో
           నలికస్వేద వికీర్ణకాలకలతో నాకర్ణికానీత స
           ల్లలిత జ్యానఖపుంఖ దీథితులతో లక్ష్యావలోకంబుతో
           వలయాకర ధనుర్విముక్త విశిఖవ్రాతా హతారాతియై.”

                    
              ఎడమపాదాన్నికొద్దిగా ముందుకు జరిపి నేలకు దట్టించి ,కుడికాలును కొద్దిగా వంచి, చెమటకు తడిసి ముఖాన పడుతున్న ముంగురులతో , ఆకర్ణాంతము లాగబడిన అల్లెత్రాటిని పట్టుకున్న చేతివ్రేళ్ల గోళ్ల కాంతులతో, లక్ష్యాన్ని ఖచ్చితంగా భేదిస్తూ, వలయాకారం గా వంచబడిన ధనుస్సు నుండి వదిలి పెడుతున్న 
బాణపరంపరలకు శతృసమూహాలను బలిస్తూ, సింహగర్జనలు చేసింది సత్యభామ.

                                                                                
       
                         ఆ యుద్ధాన్ని చూసి  బొమ్మలపెళ్లిళ్లకే వెళ్లని  ఈ మగువ యుద్ధభూమికి ఎందుకొచ్చింది.? ఉయ్యాల ఎక్కడానికే భయపడే ముద్దరాలు గరుత్మంతుని ఎలా అధిరోహించింది? పెంపుడు చిలుకకు పద్యాలు చెప్పలేని ఈ వనిత అస్త్రవిద్యలను ఎప్పుడు నేర్చుకొంది? అనుకంటూ శ్రీకృష్ణుడు ఆశ్ఛర్యపోయాడు.

                           వింటినారి థ్వని మేఘగర్జన గా,దేవతలు చాతకపక్షులుగా,ధనుస్సు ఇంద్ర చాపం గా, శ్రీకృష్ణుడు మేఘం గా , తాను మెరుపుతీగ గా, బాణ సమూహమనే వర్షం తో, రాక్షసులనే దావాగ్నిని  చల్లార్చడానికి సత్యభామాదేవి సంగ్రామాన్ని తీవ్రతరం చేసింది. ఆ అందాన్ని చూడండి.
      
          “ రాకేందు బింబమై రవిబింబమై యొప్పు నీరజాతేక్షణ నెమ్మొగంబు
           కందర్పకేతువై  ఘనధూమకేతువై యలరు బూఁబోడి చేలాంచలంబు
           భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెఱయు నాకృష్టమై మెలత చాప,
           మమృత ప్రవాహమై యనలసందోహమై తనరారు నింతి సందర్శనంబు
          
                 హర్షదాయియై మహారోషదాయియై ,పరగు ముద్దరాలి బాణవృష్టి
                 హరికి నరికి జూడ నందంద శృంగార , వీరరసము లోలి విస్తరిల్ల.”
       
         సత్యభామ చేస్తున్న సంగ్రామ విహారాన్ని ఎంత వర్ణించినా మహాకవి కి  ఆ సుందరదృశ్యం ఇంకా మనోహరం గానే కన్పిస్తోంది.
  
                 సత్యభామ వదనారవిందం నందనందనునకు చంద్రబింబంగాను , నరకాసురునకు సూర్యబింబంగాను కన్పిస్తున్నాయి. ఆనారీమణి  చేలాంచలంమురారికి మన్మథుని జెండాగాను, సురారికి  థూమకేతువు గాను, ఎక్కుపెట్టిన థనుస్సు  సత్యాపతి కి మన్మథ పరివేషంగాను, నరకాసురునకు ప్రళయ భాను పరివేషం గాను, సత్యభామా సందర్శనం హరికి  అమృతమయం గాను, అరికి అనల సందోహం గాను , ఆమె కురిపిస్తున్న బాణవర్షం యశోదాపట్టికి ఆనందాన్ని,నరకాసురునికి కోపాన్ని కలిగిస్తుంటే శ్రీహరి లో శృంగారరసం , నరకాసురుని లో వీరరసం విస్తరిల్లే విథం గా సత్యభామ సమరాన్ని  సాగించి రాక్షససైన్యాన్ని కకావికలు గావించింది. రాక్షససైన్యం  నరకాసురుని చాటుకు పారిపోయింది.

                ఆమె యుద్ధ నైపుణ్యానికి ముగ్థుడైన శ్రీకృష్ణుడు “ కొమ్మా! మెచ్చితి నిచ్చెద కొమ్మాభరణములు నీవు గోరిన వెల్లన్ “అనేశాడు.” నీ విజయానికి మెచ్చాను.  నీవు ఎన్ని ఆభరణాలు కోరుకుంటే అన్ని ఆభరణాలు ఇచ్చేస్తాను” అన్నాడట మురవిదారి.  ఆడవారికి  అందునా ఇల్లాలిని మెచ్చిఇచ్చే కానుకలలో ఆభరణాలకు మించినవి ఉండవని తెలిసిన వాడు కదా షోడశ సహస్రాంగనా వల్లభుడు.
  
                 తన సైన్యమంతా పలాయనం చిత్తగించడంతో కోపోద్రిక్తుడైన నరకాసురుడు శ్రీకృష్ణునికి ఎదురు వచ్చి, “కృష్ణా ! మగవారి ఎదుట ఒక మగువ పౌరుషాన్ని ప్రదర్శిస్తుంటే యుద్ధం మానేసి మౌనం గా ఉండటం నీకు మగతనం కాదు. రాక్షసవీరులు మగలమగలు కాబట్టి మగువలతో యుద్ధం చేయరు” అంటూ డంబాలు పల్కసాగాడు.నరకుని మాటలు వింటూనే సత్యభామ చేతినుండి విల్లందుకొని శతఘ్ని అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగించి, రాక్షససైన్యాన్ని తుత్తునియలు చేశాడు శ్రీకృష్ణుడు. నరకుడు శక్తి అనే ఆయుధాన్ని గరుడుని పై ప్రయోగించి ,శ్రీకృష్ణుని పై శూలాన్ని ప్రయోగించబోయేటంతలో అలిగిన ద్వారకానాథుడు చక్రాయుథాన్ని ప్రయోగించి నరకుని శిరస్సును ఖండించాడు . ఆనందం తో దేవతలు పూలవాన కురిపించారు.
  
           “ తల్లీ! వరాహావతారం లో నేను విష్ణుమూర్తి ఇల్లాలినని చెప్పుకున్నావు. నిన్ను చూసైనా నాపై దయ చూపకుండా శ్రీహరి నా తల నరికాడు.” అని భూదేవి కి చెప్పుకుంటు న్నట్లుగా నరకాసురుడు  యుద్ధరంగంలో భూమికొరిగాడు.
        

  
                                                 శ్రీ వరాహస్వామి    (ఉండవల్లి గుహలోని స్థంభ శిల్పం)
   
              అంత భూదేవి వాసుదేవుని సమీపించి పలురీతుల స్తుతించి, వివిథ కానుకలను సమర్పించి, “ఓభక్తమందారా !  ఈ బాలుడు నరకాసురుని కుమారుడు. దిక్కు లేనివాడు. వీడు తండ్రి వలే కాదు.  నీ పాదాలనే ఆశ్రయించాడు.”  అని ప్రార్థించగా భగవంతుడైన మాథవుడు నరకాసురుని కుమారుడైన భగదత్తుని కభయమిచ్చి, సర్వసంపదలను అనుగ్రహించాడు.
  
                కొన్ని గ్రంథాలలో సత్యభామే నరకాసురుని సంహరించినట్టు చెప్పబడింది. కాని మహాభాగవత పురాణం లో మాత్రం శ్రీకృష్ణుడే నరకాసురని సంహరించినట్లు వ్రాయబడింది.
               
      ప్రచారం లో ఉన్న ఒక  కథ ఆథారం గా  -- తల్లి చేతుల్లోనే మరణం పొందేటట్లు బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు నరకుడు.ఈతని తల్లి భూదేవి. ఈమె  శ్రీమహావిష్ణువు చేత తాను అంగీకరించినప్పుడు మాత్రమే తన కుమారునికి మరణం సంభవించేటట్లు వరం పొందింది. ఆసురగర్వం తో నరకుడు ఇంద్రుని జయించి,అదితి కర్ణకుండలాలను అపహరించాడు.  వరుణుని ఛత్రాన్ని,మణి పర్వతాన్ని కూడ స్వంతం చేసుకున్నాడు.ఎందరో భామినులను చెఱ పట్టాడు.
  

                                        శ్రీ వరహస్వామి              (మహాబలిపురం)
            
                    తుదకు ఇంద్రాది దేవతల సంప్రార్థన తో శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణుడు నరకుని పైకి యుద్ధానికి వెళ్ళాడు. ఘోర సంగ్రామం లో నరకుడు ప్రయోగించిన శక్తి ఆయుథం  శ్రీకృష్ణుని స్వల్పం గా గాయపరచగా ఆయన మూర్ఛపోయాడు. సత్యభామ యుద్ధానికి సిద్ధమైంది. చివరకు సత్యా,కృష్ణులు యుద్ధం లో నరకుని నేల కూల్చారు.  భూదేవి  శ్రీకృష్ణావతారం లో సత్యభామ గా జన్మించింది కాబట్టి నరకాసురుని, భూదేవి ఇద్దరి వరాలు  నెరవేర్చబడ్డాయి. నరకుని చేతబంథించబడిన 16,100 మంది యువతులకు సమాజం లో వారి గౌరవాన్ని కాపాడటానికి శ్రీకృష్ణుడు వారిని వివాహం చేసుకున్నాడు.

                   శ్రీకృష్ణుడు అదితి ఆభరణాలను ఆమెకు అందించడానికి ఇంద్రలోకానికి వెళ్లాడు. ఆనందించిన అదితి సత్యభామను చూసి నిత్యయౌవన, సౌందర్యాలతో విలసిల్లేట్టు వరాన్ని ఇచ్చింది.  ఆ సమయంలోనే పనిలో పనిగా నందనవనం లోకి వెళ్లిన సత్యాకృష్ణులు పారిజాతవృక్షాన్ని మెచ్చి,అడ్డం వచ్చిన ఇంద్రుణ్ణి ఓడించి, భూలోకానికి తెచ్చి సత్యాదేవి పెరటిచెట్టు గా  నాటేశారు.
     
             నరకాసురుడు మరణిస్తూ తన చివరి కోరికగా తాను మరణించిన రోజున భూలోకవాసులంతా రంగురంగుల దీపకాంతుల వెలుగులలో ఉత్సవం  జరుపుకోవాలని కోరాడట.  పారిజాతం భూమికి దిగి వచ్చిన 
రోజు, నరకాసురుని పీడ విరగడైన రోజు మనకు  పర్వదినం.  అదే నరక-చతుర్థశి తరువాత వచ్చే దీపావళి.








-------------------------------అందరికీ దీపావళి శుభాకాంక్షలతో----------------------------------