Tuesday, 5 January 2016

శతకసౌరభాలు -7 శేషప్ప కవి - నరసింహశతకము .7


శతకసౌరభాలు -7

       శేషప్ప కవి  - నరసింహశతకము .7




హరి నీకు బర్యంకమైన శేషుడు చాల –బవను బక్షించియు బ్రతుకుచుండు
ననువుగా నీకు వాహనమైన ఖగరాజు –గొప్పపామును నోట గొఱుకుచుండు
యది గాక నీ భార్య యైన లక్ష్మీదేవి –దినము పేరంటమ్ము దిరుగుచుండు
నిన్ను భక్తులు పిల్చి నిత్యపూజలు చేసి – ప్రేమ పక్వాన్నముల్ బెట్టుచుండ్రు
స్వస్ధముగ నీకు గ్రాసము జరుగుచుండ – గాసు నీ చేతి దొకటైన గాదు వ్యయము
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
            

         శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహా !నీకు పాన్పు గా నున్న ఆది శేషువు గాలిని మేసి బతికేస్తున్నాడు. నీకు వాహనమైన గరుత్మంతుడు  పాములను తింటూ జీవిస్తున్నాడు. నీ ఇల్లాలైన లక్ష్మీదేవి రోజూ  పేరంటాలంటూ ఇంటింటికి తిరుగుతూ ఉంటుంది. ఇక నీ సంగతి చూస్తే నిత్యము నీ భక్తులు పిల్చి నిత్యపూజలు చేసి ప్రేమతో పంచభక్ష్య పర మాన్నాలను  వడ్డిస్తూ ఉంటారు.  నీ చేతిదొక్క పైసా అయినా ఖర్చు కాకుండా రోజులు ఇంత హాయిగా గడిచిపోతున్నాయిగా స్వామీ!

           తను  దిన గ్రాసానికి  అంటే రోజు గడవడానికి నానా బాధలు పడుతుంటే  నీవు మాత్రం హాయిగా పైసా ఖర్చులేకుండా బ్రతికేస్తున్నావని కవి భగవంతుని ఆక్షేపిస్తున్నాడు అంటే నా బతుకు ఇంత దరిద్రం చేసి నీవు మాత్రం సుఖంగా ఉన్నావా! నన్ను ఉద్ధరించు స్వామీ! అని వేడుకుంటున్నాడు.

పుండరీకాక్ష నా రెండు కన్నుల నిండ-నిన్ను జూసెడి భాగ్య మెన్నడయ్య
వాసిగా నా  మనోవాంఛ దీరెడునట్లు –సొగసుగా నీరూపు జూపవయ్య
పాపకర్ముని కంట బడక పోవుద మంచుఁ-బరుషమైన బ్రతిజ్ఞ బట్టినావ
వసుధ లోఁ బతిత పావనుడ వీవంచు నేఁ బుణ్యవంతుల నోట బొగడవింటి
నేమిటికి విస్తరించె నీ కింత కీర్తి – ద్రోహి నైనను నా కీవు దొరకరాదె
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
                   
               శ్రీ ధర్మపుర నివాసా! లక్ష్మీనరసింహ !సహస్ర దళ కమలాలవంటి విశాలమైన నేత్రాలు కలిగిన మనోహర రూపా! కన్నుల నిండుగా నీ రూపాన్ని దర్శించగలిగిన భాగ్యము నా కెప్పుడు తండ్రీ! నలుగురికి నేను చెప్పుకోగలిగిన తీరులో  మనోజ్ఞమైన నీ రూపాన్ని నాకు చూపించు తండ్రీ! ఈ పాపాత్మునికి కన్పించ గూడదని కఠినమైన  ప్రతిజ్ఞ ఏమైనా  చేశావా తండ్రీ! కాని ఈ లోకం లో పతితపావనుడవు నీవే నని పుణ్యాత్ములు చెపుతుంటే నేను విని నిజమనుకున్నాను తండ్రీ! నీకీర్తి ఇంత గొప్పగా నలుచెఱగుల  వ్యాపించి ఉంటే దుర్మార్గుడనైన నాకు కూడ కన్పించ రాదా ప్రభూ!.

             నీలమేఘశ్యామ నీవె తండ్రివి మాకు-కమలవాసిని మమ్ము గన్నతల్లి
నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్-నీ కటాక్షము మా కనేకధనము
నీ కీర్తనల్ మాకు లోక ప్రపంచంబు- నీ సహాయము మాకు నిత్య సుఖము
నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య- నీ పద ధ్యానంబు నిత్య జపము
తోయజాతాక్ష నీ పాద తులసిదళము-రోగముల కౌషధము బ్రహ్మవినుత
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
         
                   శ్రీ ధర్మపుర నిలయా! నారసింహా!  నీలమేఘవర్ణుడా! నీవె మాకు దిక్కు. కమలాలయ యైన లక్ష్మీమాతయే మాకు తల్లి. నీ భక్తజనులంతా మాకు నిజమైన బంధువులు.  కరుణ తో నిండిన నీ చూపే మాకు అష్టైశ్వర్యాలు. నీ కీర్తనలే మాకు లోకము. నీ సహాయమే మాకు నిత్య సుఖము. “నమో నారసింహాయ”యనెడి నీ నామ మంత్రమే మాకు నిష్కళంకమైన విద్య. నీ పాదములను జపించుట కంటే మించిన జపము వేఱొకటి లేదు. బ్రహ్మ, రుద్రాదుల చేత పొగడ బడిన నీ పాదముల చెంత ఉంచబడిన తులసి దళమే సకల రోగములను పోగొట్ట గల్గిన దివ్యౌషధము తండ్రీ!.



జందెమింపుగ వేసి సంధ్య వార్చిన నేమి- బ్రహ్మ మందక కాడు బ్రాహ్మణుండు
తిరుమణి శ్రీచూర్ణ గురు రేఖ లిడినను –విష్ణునొందక కాడు వైష్ణవుండు
బూదిని నుదుటను బూసుకొనిన నేమి-శంభునొందక కాడు శైవజనుడు
కాషాయవస్త్రాలు గట్టి కప్పిననేమి-యాస పోవక కాడు యతి వరుండు
ఇట్టి లౌకికవేషాలు గట్టుకొనిన –గురుని చెందక సన్ముక్తి దొరకబోదు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
              
            శ్రీ ధర్మపురనిలయా! మెరుస్తున్న జంధ్యాన్ని వేసుకొని , మూడు పూటలా సందెవార్చినంత మాత్రాన బ్రాహ్మణుడు కాడు. బ్రహ్మజ్ఞానము నందిన వాడే బ్రాహ్మణుడు. పెద్ద పెద్ద నామాలు ధరించి నంత మాత్రాన వైష్ణవుడు కాడు. విష్ణువు ను తెలుసుకున్న వానినే వైష్ణవుడంటారు.శంకరుని తెలిసికోకుండా ఒంటినిండా విభూతి  పూసుకున్నంత మాత్రాన శైవుడు కాజాలడు గదా.   అలాగే ఆశ లు వదిలి పెట్టని వాడు కాషాయాలు కట్టుకున్నా యతివరుడు కాలేడు కదా! కావున నరసింహ ప్రభూ! లౌకిక వేషాలు  ఎన్ని ధరించినా  గురువును ఆశ్రయించి బోధ పొందని యెడల ముక్తి లభించదని  ఎల్లరూ తెలుసుకోవాలి.

పలు రోగములకు నీ పాదతీర్ధమె కాని- వలపు మందులు నాకు వలదు వలదు
చెలిమి చేయుచు నీకు సేవచేసెద కాని –నీ దాసకోటిలో నిలపవయ్య
గ్రహ భయంబునకు జక్రముఁ దలంచెదఁ గాని- ఘోర రక్షలు కట్ట గోరనయ్య
పాముకాటుకు నిన్ను భజన చేసెదఁ గాని – దాని మంత్రము నేను దలపనయ్య
దొరికితివి నాకుఁ దండ్రి వైద్యుడవు నీవు-వేయికష్టాలు  వచ్చిన వెఱవనయ్య
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
                     
                   శ్రీ నరసింహ ప్రభూ! సమస్త రోగములకు నీ  పాదతీర్ధమే కాని  ఇతర మందులు నాకు  ఏనాడూ వద్దు. నీతో సఖ్యభక్తి నెఱపి నీకు సేవ చేసుకుంటాను గాని నీ భక్తకోటిలో ఒకడి గా నన్ను కూడ  ఉండేటట్లు అనుగ్రహించు స్వామీ! భూత ప్రేత పిశాచాది గ్రహ బాధలు సంభవిస్తే సుదర్శన చక్రాన్ని తలుచుకుంటాను గాని తాయెత్తులు , రక్షరేకులు అంటూ ఆరాటపడను స్వామీ !  నన్ను పాము కాటు వేస్తే నీ నామ జపమే చేస్తాను గాని  పాము మంత్రం కోసం పాకులాడను స్వామీ ! స్వామీ !. నారసింహ ప్రభూ!. మెండైన వైద్యుడవు నీవు నాకు దొరికావు. .ఇంకపైన  ఎన్నికష్టాలు వచ్చినా నేను భయపడనయ్యా!.
                                            
                             ఈ పద్యం చదుతుంటే “ దొరికెను నాకు వేంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను” అంటూ ఆనంద తాండవం చేసే  సంకీర్తనాచార్య అన్నమాచార్య మన ముందు ప్రత్యక్షమౌతాడు. భక్తవరుల తాదాత్య్మత కు, పారావశ్యానికి హద్దులు లేవు కదా.!

పంజరంబునఁ గాకి –పట్టి యుంచిన లెస్స –పలుకునే వింతైన జిలుక వలెను
గార్ధభంబును దెచ్చి కళ్ళెమింపుగ వేయఁ –దిరుగునే  గుఱ్ఱంబు తీరుగాను
ఎనుపబోతును మావటీడు శిక్షించిన-నడచునే మదవారణంబు వలెను
పెద్దపిట్టను మేతఁబెట్టి పెంచినఁ గ్రొవ్వి – సాగునే వేటాడు డేగ వలెను
కుజనులను దెచ్చి నీ సేవ కొఱకుఁ బెట్టి –వాంఛతోఁ జేతురే భక్తవరుల వలెను
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
                               

                      శ్రీ ధర్మపుర నివాసా! రత్నాభరణ భూషా! లక్ష్మీనరసింహా! నీ సేవకులు గా నియమించబడే వారు నీ భక్తులైతే మక్కువతో నీకు సేవ చేస్తారు గాని దుర్మార్గులను తెచ్చి నీ సేవకులు గా పెడితే వారు నీ భక్తుల వలే సేవ లందించలేరు. వారి లోని దుర్మార్గం, స్వార్ధప్రవృత్తి వారిని అవినీతి మార్గాలను పట్టిస్తుంది కదా! ఏ విధంగా నంటే కాకి ని పట్టుకొచ్చి పంజరం లో పెట్టినంత మాత్రాన అది చిలుక పలుకులు పలకలేదు . గాడిద ను పట్టుకొచ్చి అందం గా కళ్ళాన్ని తగిలించినా  అది గుఱ్ఱం వలే తిరగ లేదు కదా. ఎనుబోతు కు మావటి వాని చేత చక్కని శిక్షణ ఇప్పించినా కూడ అది మత్తగజం వలే నడవలేదు కదా. ఒక పెద్ద పిట్టను తెచ్చి పుష్టి గా మేపినా కూడ అది డేగ వలే వేటాడ గలుగు తుందా! లేదు కదా! అలాగే దుర్మార్గులను నీ ఆలయాలకు ధర్మకర్తలు గానో  , అధికారులు గానో నియమించినా వారు పూర్వపు టలవాట్ల ను మర్చిపోయి నీ భక్తులు గా నిన్ను సేవించుట అసంభవము.

నిగమాది శాస్త్రముల్ నేర్చిన ద్విజుడైన –యజ్ఞకర్తగు సోమాయాజియైన
ధరణి లోపల ప్రభాత స్నాన పరుడైన- నిత్య సత్కర్మాది నిరతుడైన
నుపవాస నియమంబు నొందు సజ్జనుఁడైన – గావి వస్త్రము గట్టు ఘనుడు నైన
దండి పోషక మహా దానపరుండైన – సకల యాత్రలు సల్పు సరసుడైన
గర్వమునఁ గష్టపడి నిన్ను గానకున్న –మోక్షసామ్రాజ్య మొందడు మోహనాంగ
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
                          
                 శ్రీ ధర్మపుర నివాసా! మోహనరూపా! నరసింహా.వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుడైనా , యజ్ఞకర్తయైన సోమయాజియైనా , ప్రాత కాలం లో లేచి  స్నాన , సంధ్యావందనాదు లాచరించే శ్రోత్రీయుడైనా,  ఎల్లవేళలా సత్కర్మల నాచరించే ఉత్తముడైనా, ఉపవాస నియమములను పాటించు వ్రతుడైనా , కాషాయము ను ధరించు యతి యైనా, షోడశ మహాదానములను చేసిన దాతయైనా , సమస్త తీర్ధయాత్రలను సలుపు ఘనుడైనా గర్వం తో నిన్ను దర్శించకుండా ఉంటే మాత్రం ముక్తిని పొందలేడు. ఇది నిజము  .

పక్షివాహన నేను బ్రతికి నన్ని దినాలు –కొండెగాండ్రను గూడి కుమతి నైతి
అన్నవస్త్రము లిచ్చి ఆదరింపుము నన్ను - కన్న తండ్రివి నీవె కమలనాభ
మరణమయ్యెడి నాడు మమతతో నీయొద్ద-బంట్ల దోలుము ముందు బ్రహ్మజనక
ఇనజ భటాళి ఈడిచి కొనిపోక- కరుణతో నాయొద్దఁ గావలుంచు
కొనకు నీ సన్నిధి కిఁ బిల్చుకొనియు నీకు-సేవకునిఁ జేసికొనవయ్య శేషశయన
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!
              
              ధర్మపుర నివాసా! గరుడవాహనా! నేను బ్రతికినన్ని రోజులు కొండెగాళ్లను చేరి దురాలోచనలతో దుర్మార్గుడనయితి. ఇప్పుడు అన్నవస్త్రముల నిచ్చి ఆదుకోవలసింది నీవే నాకు కన్నతండ్రివి కమలనాభా. నాకు మరణం సంభవించినప్పుడు యమభటులు లాక్కుపోకుండా నాపై దయఉంచి  నీ సేవకులను కాపాలా ఉంచి , చివరలో  నీ దగ్గరకు  పిలిపించుకొని నీ సేవకుడిగా చేసికొనవలసినది  శేషశయనా!.



అతిలోభులను భిక్షమడుగఁ బోవుట రోత –తన ద్రవ్యమొకరింట దాచరోత
గుణహీనుడగు వాని కొలువుఁగొల్చుట రోత-యొరుల పంచలక్రింద నుంట రోత
భాగ్యవంతుని తోడఁ బంతమాడుట రోత –గుఱిలేని బంధుల గూడ రోత
యాదాయములు లేక యప్పుఁ దీయుట రోత –జారచోరుల గూడి చనుట రోత
యాది లక్ష్మీశ నీ బంటు నైతినయ్య – యింక  నెడబాపు జన్మం బదెన్న రోత
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.

                    శ్రీ లక్ష్మీనరసింహా! పిసినారులను యాచించడం  అసహ్యం.మన డబ్బును ఒకరి దగ్గర దాచుకోవడం అసహ్యం. గుణ హీనుని వద్ద కొలువు చేయడం , పరాయి పంచన బ్రతకడం అసహ్యం. ధనవంతుని తో పంతమాడటం ,  మన మీద గౌరవం లేని బంధువులతో కలిసి తిరగడం అసహ్యమే.సంపాదన లేకుండా అప్పులు చేయడం, దొంగలు , వ్యభిచారుల తో  స్నేహం గా తిరగడం  కూడ అసహ్యకరమైన పనులే. హే లక్ష్మీనాథా! నేను నీ సేవకుడను. ఈ బతుకంటేనే అసహ్యమేస్తోంది. నన్ను కడతేర్చి కాపాడు తండ్రీ!




శేషప్ప యను కవి చెప్పిన పద్యముల్- చెవుల కానందమై చెలగు చుండు
నే మనుజుండైన నెలమి నీ శతకంబు - భక్తితో విన్న సత్ఫలము కలుగు
జెలగి  పద్యముల్ చేర్చి వ్రాసినవారు –కమలాక్షు కరుణను గాంతురెపుడు
నింపుగా పుస్తకం బెపుడు పూజించిన – దురిత జాలంబులు తొలగిపోవు
ఇద్ది పుణ్యకరంబని యెపుడు జనులు –కష్టమనక పఠించినం గలుగు ముక్తి
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.(100)
                              
                      శ్రీ ధర్మపురి  నరసింహా ! హే లక్ష్మీనాథా! శేషప్ప అను పేరు కలిగిన ఈ కవి చెప్పిన పద్యములు చెవులకు ఆనందాన్ని  ఇస్తాయి. ఏ మానవుడైనా భక్తితో సంతోషంగా  ఈ శతకాన్ని విన్నట్లైతే మంచి ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఈ పద్యాలను చూసి కుదురు గా మరల వ్రాసి నట్లైతే  వారికి ఆ కమలనాథుని అనుగ్రహం లభిస్తుంది. ఈ పుస్తకాన్ని ఎవరు ఎప్పుడు పూజించినా వారి పాపములు , బాధలు తొలగిపోతాయి. ప్రజలు ఈ కార్యము కష్టమనుకోకుండా  భావించి , పుణ్యకార్యం గా తలంచి ఈ పుస్తకాన్ని చదివినచో  ఆ ధర్మపుర నివాసుడైన లక్ష్మీనారాసింహుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడని   కవి ఆశంస.
                    

                       ఇది శేషప్ప కవి రచించిన నరసింహ శతకము నకు

                                  తేజస్వినీ వ్యాఖ్య సంపూర్ణము.
 *****************************************

Monday, 28 December 2015

శతకసౌరభాలు-7 శేషప్ప కవి -నరసింహశతకము .6

  
 శతకసౌరభాలు-7
        
        శేషప్ప కవి  -నరసింహశతకము .6



అర్థి వాండ్రకు నీక హాని చేయుట కంటే-దెంపు తో వసనాభి దినుట మేలు
ఆడుబిడ్డల సొమ్ము నపహరించుట కంటె-బండకట్టుక నూత బడుట మేలు
పరుల కాంతల బట్టి బల్మి గూడుట కంటె- బడబాగ్ని కీలల బడుట మేలు
బ్రతుకజాలక దొంగ పనులు చేయుట కంటె- కొంగుతో ముష్టెత్తు కొనుట మేలు
జలజదళనేత్ర నీభక్తజనులతోడ- జగడమాడుట కంటెను చావుమేలు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!

        
                ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ!.యాచకులకు దానం చేయకుండా ఉండటమే కాక దానం చేయనివ్వకుండా అడ్డంపడటం కూడ పాపమే. ఇటువంటి పాపాలు చేసినదాని కంటే ఇంత విషం తిని చావడం మేలు. నాభి అనేది విషతుల్యమైన ఒక మూలిక. దీనిని ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తూ ఉంటారు.ఆడపడుచుల ఆస్తులను అపహరించిన దానికన్నా  మెడ కు ఒక బండరాయి కట్టుకొని నూతిలో దూకి చావడం మంచిది.   నూతి లోకి   చావాలని దూకినప్పుడు దూకగానే పైకి తేలితే చూసినవాళ్లెవరైనా  దూకి కాపాడే ప్రమాదం ఉంది. అదే మెడకు బండ కట్టుకొని దూకితే పైకి తేలే అవకాశం ఉండదు కాబట్టి  ఖచ్చితం గా మరణించవచ్చని ప్రజల్లో  ఒక ఆలోచన ఉంది. పర స్త్రీలను బలవంతంగా  పట్టుకొచ్చి అనుభవించిన దాని  కంటే  నిప్పుల గుండం లో దూకి చావడం మంచిది. బ్రతడానికి దొంగపనులు చేసిన దాని కంటే ఏ గుడి మెట్లమీదో కొంగు పఱుచుకొని అడుక్కోవడం, ముష్టెత్తు కోవడం మంచిది. నీ భక్తులైన  హరిదాసులతో తగవులాడుట కంటే చావడం నయం.

పసరంబు పంజైన బసులఁగాపరి తప్పు-ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు
భార్య గయ్యాళైనఁ బ్రాణనాధుని తప్పు-తనయుండు దుష్టైన తండ్రి తప్పు
సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు-కూతురు చెడుగైన మాత తప్పు
అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు –హస్తి దుష్టైన హస్తీపకుని తప్పు
ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చవచ్చి-నటుల మెలగుదు రిప్పుడీ యవని జనులు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.

                     శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహా ! ఒక పశువు  పనికిరానిదై క్రూరం గా ప్రవర్తిస్తోందంటే అది పశువుల కాపరి తప్పు.భార్య గయ్యాళిగా మారిందంటే అది భర్త చేతకానితనం.కొడుకు చెడునడత గలవాడైతే అది తండ్రి తప్పు. యుద్ద రంగం నుండి సైన్యం  పారిపోతోందంటే అది  సైన్యాధికారి అసమర్ధత. కూతురు చెడిపోతోందంటే అది తల్లి తప్పు.గుఱ్ఱము చెడ్డదయితే రౌతు తప్పు. ఏనుగు  మొండికేస్తోందంటే తప్పు మావటి వానిదే కదా. ఇటువంటి  తప్పులు తెలుసుకోలేక లోకం లో ప్రజలు  ఏవేవో మాట్లాడుతూ ఉంటారు.


కోతికి జలతారు కుళ్ళాయి యేటికి-విరజాజి పూదండ విధవ కేల
ముక్కిడితొత్తుకు ముత్తెంపునత్తేల-అద్దమేటికి  జాత్యంధునకును
మాచకమ్మకు నేల మౌక్తికహారముల్-క్రూర చిత్తునకు సద్గోష్ఠులేల
ఱంకుబోతుకు నేల బింకంపు నిష్టలు- వావియేటికి దుష్టవర్తనునకు
మాట నిలకడ సుంకరి మోటుకేల- చెవిటి వానికి సత్కధా శ్రవణమేల
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
           
                శ్రీ నరసింహా! కోతికి జరీ అంచు తలపాగా ఎందుకు. భర్తపోయిన స్త్రీకి విరజాజి పూల మాలలు నిష్ప్రయోజనం కదా ! చప్పిడి ముక్కు నకు ముత్యాల ముక్కెర  ప్రయోజనం లేదు కదా ! పుట్టుగ్రుడ్డి కి అద్దము, మాచకమ్మ కు ముత్యాలహారాలు, దుర్మార్గునకు  సద్గోష్టులు , వ్యభిచారి కి నియమాలు , చెడ్డవానికి వావివరసలు ,సుంకము వసూలు చేసేవాడికి మాట నిలకడ , చెవిటివానికి సత్కధా కాలక్షేపాలు ప్రయోజనారహితాలు కదా స్వామీ!

తనువులోఁ బ్రాణముల్ తరలిపోయెడి వేళ- నీ స్వరూపమును ధ్యానించునతడు
నిముషమాత్రము లోన నిను జేరును గాని-యముని చేతికి జిక్కి శ్రమల బడడు
పరమ సంతోషాన భజనఁ జేసెడి వారి - పుణ్యమేమన వచ్చు భోగి శయన
మోక్షము నీ దాసముఖ్యుల కగుఁ గాని- నరకమెక్కడిదయ్య నళిన నేత్ర
కమల నాభుని మహిమలు గానలేని- తుచ్ఛులకు ముక్తి దొరకుట దుర్లభంబు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
                           
                  ధర్మపురి లక్ష్మీనరసింహా! ఈ బొంది లో నుండి ప్రాణాలు పోయే సమయం లో ఎవడైతే నీ రూపాన్ని ధ్యానిస్తాడో వాడు క్షణకాలంలో నీ పాదసన్నిధి ని చేరుతాడు గాని యముని చేతికి చిక్కి బాధలను పడడు . ఆనందం తో నిన్ను భజన చేసే వారి అదృష్టమే అదృష్టము. నీ భక్త వరులకు మోక్షమే గాని నరకముండదు కదా. నీ మహిమలు తెలుసుకోలేని  మూర్ఖులకు  ముక్తి లభించుట అసాధ్యము కదా!

ఉర్వి లో నాయుష్యమున్న పర్యంతంబు-మాయ సంసారంబు మఱగి నరుడు
సకల పాపములైతె సంగ్రహించును గాని – నిన్ను జేరెడి యుక్తి నేర్వలేడు
తుదకు కాలుని వద్ద దూత లిద్దరు వచ్చి -గుంజుక చని వారు కొట్టుచుండ
హింస కోర్వగ లేక యేడ్చి గంతులు వైచి- దిక్కు లేదని నాల్గు దిశలుఁ జూడ
తన్ను విడిపింప వచ్చెడి ధన్యుడేడి- ముందె నీ దాసుడై యున్న ముక్తి గలుగు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
                       
       శ్రీ నారసింహా! ఈ జీవుడు భూమిపై ఆయుర్దాయం ఉన్నంతకాలం సంసారమనే మాయ లో పడి సమస్త మైన పాపాల్ని మూటకట్టుకుంటూ నిన్ను చేరే మార్గాన్ని మాత్రంనేర్చుకోడు. ప్రాణావసాన సమయంలో యమ భటులిద్దరు వచ్చి ప్రాణాలను గుంజుకుపోయి,  రకరకాలుగా శిక్షిస్తుంటే  ఆ హింస భరించలేక,  కాపాడే దిక్కు లేక నాలుగు దిక్కులు చూస్తూ గంతులు వేసి ఏడుస్తూ ఉంటే  కాపాడే పుణ్యాత్ముడెవడూ ఉండడు. అలా కాకుండా ముందుగానే నీ భక్తుడై  ప్రార్ధిస్తే మోక్షం లభిస్తుంది కదా !

అవనిలో గల యాత్ర లన్ని చేయగవచ్చు- ముఖ్యమౌ నదులందు మునుగవచ్చు
ముక్కుపట్టుక సంధ్యమొనసి వార్చగ వచ్చు-దిన్నగా జపమాలఁ ద్రిప్ప వచ్చు
వేదాల కర్ధంబు విఱిచి చెప్పగవచ్చు-శ్రేష్టక్రతువు లెల్ల జేయవచ్చు
ధనము లక్షలు కోట్లు దానమీయగ వచ్చు-నైష్టికాచారముల్ నడపవచ్చు
జిత్త మన్యస్ధలంబునఁ జేరకుండ – నీ పదాంభోజముల  యందు నిలుపగలమె
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
             
             ధర్మపురి వాసా ! భూలోకం లోని యాత్రలన్నీ చేయవచ్చు.పుణ్యనదులన్నిటా స్నానం చేయవచ్చు.ముక్కుపట్టుకొని మూలకూర్చొని సంధ్యావందనం చేసుకోవచ్చు.జపమాలను తిప్పుతూ జపము నూ చేసుకోవచ్చు.వేదాలకర్ధాన్ని వివరించవచ్చు గొప్పగా యజ్ఞయాగాదులను నిర్వహించనూ వచ్చు.లక్షలు , కోట్లు గా డబ్బును దానం చేయవచ్చు. నిష్ట తో ఆచారాలను  సాగింపనూ వచ్చు. కాని మనస్సు ను ఇతర స్ధలాలకు పోకుండా నీ పాద పద్మముల యందు లగ్నం చేయడం మాత్రం అసాధ్యం గా కన్పిస్తోంది స్వామీ!

           దేహమున్నవరకు మోహసాగరమందు –మునుగు చుందురు శుద్ధ మూఢజనులు
సలలితైశ్వర్యముల్ శాశ్వతంబనుకొని-షడ్బ్రమలను మాన జాలరెవరు
సర్వకాలము మాయ సంసారబద్ధులై-గురుని కారుణ్యంబుఁ గోరుకొనరు
జ్ఞాన భక్తి విరక్తులైన  పెద్దలఁ జూచి- నిందఁజేయక తాము నిలవలేరు
మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్ల – నిన్ను గనలేరు మొదటికే నీరజాక్ష
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
              

                        శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహా ! ఈ శరీరమున్నంతవరకు మోహ మనే సముద్రం లో పడి ఈ మూర్ఖులైన జనులు మునకలేస్తూ, సిరిసంపదలే స్ధిరమనుకొని , కామక్రోధలోభ మోహ మద మాత్సర్యాల మాయలో పడి సంసారబద్ధులై , జ్ఞానము నకై గురువులను ఆశ్రయించరు. అంతేకాకుండా జ్ఞానభక్తి వైరాగ్య కోవిదులైన మహాత్ములను నిందించుచూ ఆ పాపాన్ని కూడ తలకెత్తుకుంటున్నారు.  ఇటువంటి మదోన్మత్తులైన దుర్మార్గులు ఎప్పటికీ కూడ నిన్ను దర్శంచలేరు గా ప్రభూ !

              ధరణి లోపల నేను తల్లి గర్భము నందు- బుట్టి నప్పటి నుండి పుణ్యమెఱుగ
ఏకాదశీ వ్రతం బెన్నడుండగ లేదు-తీర్థయాత్రలకైనఁ దిరుగలేదు
పారమార్ధికమైన పనులు సేయగలేదు –భిక్షమొక్కనికైనఁ  బెట్టలేదు
జ్ఞానవంతులకైనఁ బూని మ్రొక్కగ లేదు- ఇతర దానములైన నీయలేదు
నళినదళనేత్ర నిన్ను నే నమ్మినాను-జేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
               
                    స్వామీ నరసింహప్రభూ ! తల్లి గర్భము నుండి బయటకు వచ్చిన నాటి నుండి పుణ్యమంటే ఏమిటో తెలియకుండా పెరిగాను. ఏనాడు ఏకాదశీ ఉపవాసం ఉండలేదు. తీర్ధయాత్రలు చేయలేదు.పారమార్ధికమైన ఎటువంటి పుణ్యకార్యాలు చేయలేదు. ఒక్కడికైనా పిడికెడు ముష్టి  వేయలేదు. జ్ఞానవంతులకైనా చేతులెత్తి నమస్కరించలేదు. ఎటువంటి దానములూ  ఇవ్వలేదు. అయినా పద్మపత్రాక్షా. నిన్నే నేను నమ్ముకొన్నాను. త్వరగా వచ్చి నన్ను రక్షించు తండ్రీ !
                                           ----------    చివరిభాగం త్వరలో.




*********************************************************************************

Thursday, 17 December 2015

శతకసౌరభాలు-7 శేషప్పకవి- నరసింహశతకము -5



        శతకసౌరభాలు-7
        
               శేషప్పకవి- నరసింహశతకము -5


ధర్మపురి  శ్రీ లక్ష్మీనరసింహస్వామి        



ఫణుల పుట్టల మీదఁ బవ్వళించిన యట్లు-పులుల గుంపుల జేర బోయినట్లు
మకరి వర్గంబున్న మడుగు జొచ్చిన యట్లు-గంగ దాపున నిండ్లు గట్టినట్లు
చెదల భూమిని జాప చేర బరచియట్లు- తోలు తిత్తిని బాలు పోసినట్లు
వెఱ్ఱి వానికి బహువిత్త మిచ్చిన యట్లు-కమ్మ గుడిసె మందుఁ గాల్చినట్లు
స్వామీ నీ భక్తవరులు దుర్జనుల తోడ-జెలిమిఁ జేసిన యటులైన జేటువచ్చు
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (80)
                      


                         ధర్మపురి లక్ష్మీనరసింహా! పాముల పుట్టల మీద పడుకున్నట్లు, పులుల గుంపులలో చేరినట్లు ,మొసళ్ల మడుగులో స్నానానికి దిగినట్లు , నది అంచున ఇళ్లు కట్టుకున్నట్లు ,చెదలున్న  చోట చాప వేసుకున్నట్లు, తోలు తిత్తి లో పాలు పోసినట్లు, వెఱ్ఱివానికి ఎక్కువగా ధనమిచ్చినట్లు , తాటి కమ్మలతో వేసిన గుడిసె లో మందు గుండు సామాను కాల్చినట్లు నీ భక్తులు చెడ్డవారితో   చేరి చెడిపోతున్నారు .వారిని కాపాడు స్వామీ!

                       అమరేంద్ర వినుత నిన్ననుసరించిన వారు-ముక్తి బొందిర వేగ ముదము తోడ
నీ పాదపద్మముల్ నెఱ నమ్మియున్నాను-నాకు మోక్షంబిమ్ము నళిన నేత్ర
కాచి రక్షించు నన్గడతేర్చు వేగమే- నీ సేవకుని జేయుశ్చయముగఁ
గాపాడినను నీకు గేంకర్యపరుఁడనే- చెలగి నీ పనులను జేయువాడ
ననుచుఁ బలుమారు వేఁడెద నబ్జనాభ- నాకు  బ్రత్యక్షమగు నిన్నె నమ్మినాను
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (81)
                   
                    ఇంద్రుని చే పొగడ బడెడి శ్రీ లక్ష్మీ నరసింహా! నిన్ను  సేవించినవారు ఆనందంతో మోక్షాన్ని పొందారు. ఓ పద్మముల వంటి నేత్రములు కలవాడా. నేను కూడ నీ పాదపద్మములను నమ్మి సేవించుచున్నానుకదా. నాకు కూడ త్వరగా మోక్షమిమ్ము స్వామీ.నన్ను రక్షించి, నీ సేవకుని గా చేసుకొని ,త్వరగా కడతేర్చు స్వామీ! నన్ను కాపాడినను నేను నిన్ను మర్చిపోను . నీ బంటు గా నీ  సేవలను చేసు కుంటూనే ఉంటాను. ఈ విధంగా నేను  ఎన్నో సార్లు నిన్ను వేడుకుంటూనే ఉంటున్నాను పద్మనాభ. నిన్నే నమ్మిన  నాకు నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించు ప్రభూ!

వనరుహనాభ నీ వంకఁ జేరితి నేను- గట్టిగా ననుఁ గావు కావు మనుచు
వచ్చినందుకు వేగము వరము లీయక కాని-లేవబోయిన నిన్ను లేవనియ్య
గూర్చుండ బెట్టి నీ కొంగు గట్టిగఁ బట్టి-పుచ్చుకొందును జూడు భోగిశయన
యీ వేళ  నాకడ్డ మెవరు వచ్చినఁ గాని-వారికైనను లొంగి వణకబోను
కోపగాడను నీవు  నా గుణము దెలిసి-యిప్పుడే నన్ను రక్షించి యేలు కొమ్ము
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (84)
                                       

             శ్రీ పద్మనాభా! ధర్మపురి లక్ష్మీనృసింహా. నన్ను కాపాడమని , నను కాచే దైవం నీవేనని నీ చెంత చేరాను.నేను నీ దరి చేరినందుకు వేగంగా నాకు వరము లీయకుండా నీవు లేచి వెళ్లి పోదామనుకున్నా నిన్ను లేవనీయను. నిన్ను బలవంతంగా కూర్చోబెట్టి నీ కొంగు గట్టిగా నీవు కదలకుండా పట్టుకుంటాను.  ఈ రోజు ఎవరు అడ్డమొచ్చినా నేను అదరను. బెదరను. అసలే నేను కోపిష్టిని. కాబట్టి నా గుణము తెలుసుకొని  నన్ను ఇప్పుడే రక్షించి ,ఏలుకోవలసింది స్వామీ!

                          నేనెంత వేడిన నీకేల దయరాదు -పలుమాఱు పిలచిన బలుకవేమి
పలికిన నీకున్న పదవేమి పోవును-మోమైన బొడ చూపవేమి నాకు
శరణు జొచ్చిన వాని సవరించవలె గాక-పరిహరించుట నీకు బిరుదు గాదు
నీ దాసులను నీవు నిర్వహింపక యున్న-బరులెవ్వ రగుదురు పంకజాక్ష
దాత దైవంబు తల్లియు దండ్రి వీవె-నమ్మి యున్నాను నీ పాద నలినములను
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (85)
    
                                   స్వామీ ధర్మపురి నరసింహ !ప్రభూ! నేను ఎంతగా ప్రార్ధించినా నామీద నీకెందుకు దయ కలగడంలేదు. ఎన్నిసార్లు పిలిచినా పలుకవేమి తండ్రీ! పలికితే నీ గొప్పతనానికి భంగం ఏర్పడుతుందని భయమా! నీ ముఖారవిందాన్ని  నాకు చూపించకుండా పెడమరులుగా తిప్పుకుంటావేమిటి స్వామీ! నీకు శరణన్న వాడిని రక్షించాలి గాని నిర్లక్ష్యం చేయడం నీకు  గౌరవం కాదు. నీ సేవకులను నీవు కాపాడకపోతే ఇతరులెవ్వరు కాపాడతారు పంకజాక్షా! నాకు తల్లి,తండ్రి, దాత, దైవము  అన్నీ నీవే నని నీ పాదపద్మములను సేవించుచున్నాను స్వామీ ! నన్ను రక్షించు ప్రభూ!.
                

                     నా తండ్రి ! నా దాత! నా యిష్ట దైవమా!-నన్ను మన్నన సేయు నారసింహ!
దయయుంచు నామీద దప్పులన్ని క్షమించి- నిగమ గోచర నాకు నీవె దిక్కు,
 నే దురాత్ముడనంచు నీ మనంబున గోప-గింపబోకుము స్వామి కేవలముగ,
ముక్తిదాయక నీకు మ్రొక్కినందుకు నన్ను-గరుణించి రక్షించు కమలనయన
దండి దొర వంచు నీ వెంట దగిలినాను-నేడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపు
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (86)

                         
                    శ్రీ ధర్మపురి నరసింహా! నా దాత, నా తండ్రి నా యిష్టదైవము సర్వము నీవే ప్రభూ ! నన్ను మన్నించి కాపాడు నరసింహ దేవా!ఓ నిగమగోచరా నా తప్పులు మన్నించి నన్నేలు కోవయ్యా   నారసింహా !నేను దుర్మార్గుడనని నీ మనస్సు లో నాపై కోపముంచకు ప్రభూ.కేవలము నీకు మ్రొక్కినందుక మాత్రమే నాకు మోక్షమియ్య వయ్యా ప్రభూ  నీవు గొప్ప దైవానివని నమ్మి నిన్ను ఆశ్రయించి ,అర్ధిస్తున్నాను ప్రభూ !నాకు ప్రత్యక్షమై నన్ను కరుణించు ప్రభో నారసింహా!

                      
                             కూటి కోసరము నేఁ గొఱగాని జనులచే-బలు గద్దరింపులు పడగ వలసె
దార సుత భ్రమఁ దగిలి యుండగ గదా- దేశదేశము లెల్లఁదిరుగ వలసె
బెను దరిద్రత పైనిఁ బెనగి యుండగ గదా-చేరి నీచుల సేవఁ జేయవలసె
నభిమానములు మది నంటి యుండగ గదా-పరుల జూచిన భీతిఁ బడగ వలసె
నిటుల సంసారవారిధి నీదలేక- వేయి విధముల నిన్ను నే వేడుకొంటి
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (87)
                            

                  ప్రభూ!నరసింహదేవా ! పిడికెడు మెతుకుల కోసమే కదా పనికిమాలిన  వాళ్ల గద్దింపులు భరించవలసి వస్తోంది.  భార్య పుత్రులు అనే భ్రమలో చిక్కుకొనే గదా వారి పోషణ కై దేశదేశాలు తిరగవలసి వస్తోంది. దరిద్రం నెత్తిన కూర్చోబట్టే కదా  బతుకు తెరువు కోసం నీచులను సేవించవలసి వస్తోంది.ఇంకా అభిమానం అంతో ఇంతో మదిలో మిగిలి యుండబట్టే కదా నేను చేస్తున్న పనులు ఇతరులు  చూస్తున్నారేమో నని పరులను చూసి  భయపడవలసి వస్తోంది. ఇటువంటి సంసార సముద్రాన్ని ఈద లేకే స్వామీ నిన్ను వేయి విధాల వేడుకుంటున్నాను. నన్ను కాపాడి రక్షించు ప్రభూ!

                           తాపసార్చిత! నేను పాపకర్ముడనంచు- నాకు వంకలుఁ బెట్టబోకు సుమ్మి
నాటికి శిక్షలు నన్నుఁ జేయుటకంటె-నేడు సేయుము నీవు నేస్త మనక
అతి భయంకరులైన యమదూతలకు నన్ను-నొప్పగింపకు మయ్య యురగశయన
నీ దాసులను బట్టి నీవు దండింపంగ -వద్దు వద్దన రెంత పెద్దలైన
తండ్రివై నీవు పరపీడఁ దగులఁ జేయ-వాసిగల పేరు కపకీర్తి వచ్చునయ్య
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (88)
                           

              మునులచే పూజించబడే శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహా! పాపములు చేసితినని నాకు వంకలు పెట్టకు స్వామీ! నన్ను మన్నించి నాడు ఎప్పుడో విధించే శిక్షలు నాకు ఇప్పుడే విధించు. స్వామీ! నాగశయనా! అతి భయంకరమైన ఆ యమభటులకు నన్ను అప్పగించకు స్వామీ!నీ దాసులను నీవే దండించిన వద్దనే పెద్దలెవ్వరుంటారు. అంతే కాదు నీవంటి వాడు తండ్రియై ఉండగా  నీబిడ్డ  ఇతరులచే పీడించబడుట ప్రసిద్ధుడవైన  నీకు కూడ అపకీర్తి కదా ప్రభూ! అందుకే నేను చేసిన నేరాలకు నాకిక్కడే నీవే శిక్ష విధించు ప్రభూ!
                 
                            కాయమెంత భయానఁ గాపాడినం గాని- ధాత్రిలో నది చూడ దక్కబోదు,
ఏ వేళ నేరోగ మేమరించునొ-సత్వ మొందగఁ జేయు మే చందమునను,
 ఔషధంబులు మంచి వనుభవించినఁ గాని-కర్మ క్షీణంబైన గాని విడదు,
కోటి వైద్యుల గుంపు కూడి వచ్చినఁ గాని-మరణ మయ్యెడు వ్యాధి మాన్ప లేరు,
జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన-నిలుచునా  దేహమిందొక్క నిమిషమైన,
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (89)
                   
                         ప్రభూ! ఈ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా అది శాశ్వతం కాదు .ఏదో ఒక రోజున మట్టిలో కలిసిపోయేదే. ఏ రోజు ఏక్షణం లో  ఏ రోగమొస్తుందో  తెలియదు. కర్మబంధం తీరి పాపం నశించే వరకూ వచ్చిన ఆ రోగం ఎంత మంచి మంచి మందులు వాడినా  తగ్గదు. ప్రపంచం లోని వైద్యులు కోట్లమంది  కట్టకట్టుకు వచ్చి చికిత్స చేసినా మరణం ఖాయమైన వ్యాధిని మాన్పలేరు. ఈ జీవునికి ప్రయాణకాల మాసన్నమైన తరువాత ఒక్క నిమేషం కూడ ఈ శరీరం లో  నిలువడు కదా!.
                
                    “పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే” అన్నది ఆయుర్వేదోక్తి. పూర్వ జన్మలో చేసిన పాపమే ఈ జన్మలో వ్యాధి రూపం లో బాధిస్తుంది. వైద్యుడు ఆయుష్షు ఉన్నవాడికి చికిత్స చేయగలడు కాని ఆయుర్దాయం లేనివాడికి వైద్యుని మందు పనిచేయదు. వందల కొద్ది వైద్యులు వచ్చి చికిత్స చేసినా చావు వచ్చెడివాని వ్యాధిని మాన్పలేరు.ఈ జీవునికి ప్రయాణకాల మాసన్నమైనప్పుడు ఒక్కక్షణం కూడ ఇంకా ఈ దేహం లో నిలువడు కదా.

 అంత్య కాలము నందు నాయాసమున నిన్ను-దలతునొ తలపనో తలతు నిపుడె
నరసింహ!  నరసింహ!  నరసింహ! లక్ష్మీశ! – దానవాంతక!  కోటి భానుతేజ!
గోవింద! గోవింద! గోవింద! సర్వేశ!-పన్నగాధిప శాయి! పద్మనాభ!
మధువైరి! మధువైరి!మధువైరి! లోకేశ!-నీలమేఘ! శరీర నిగమ వినుత!
                    ఈ విధంబున నీ నామ మిష్టము గను-భజన సేయుచు నుందు నా భావమందు
                    భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (90)

                 
                             వివిధాభరణ భూషిత శరీరా ధర్మపురి నారసింహా ! మరణమాసన్నమైనపుడు ఆయాసము తో నిన్ను ప్రార్ధించగలనో లేదో నని ఇప్పుడే నిన్ను వేడుకొంటున్నాను.నరసింహ! నరసింహ!నరసింహ! లక్ష్మీనాథా !దానవాంతక! కోటి సూర్యప్రకాశా! గోవింద! గోవింద! గోవింద! సర్వేశ!  పన్నగ శయన! శ్రీ పద్మనాభ! !మధువైరి! మధువైరి! మధువైరి! లోకేశ! నీలమేఘ శరీర! వేద వినుత!   అంటూ నీ భజన చేస్తాను ప్రభూ!

                  ఈ పద్యం వ్రాసేటప్పుడు శేషప్ప కు  కంచర్ల గోపన్న దాశరథీ శతకం లోని  “ముప్పున గాల కింకరులు ముంగిటకొచ్చిన వేళ ”అనే పద్యం చెంగటి కొచ్చి నిలిచే వుంటుంది.

     ముప్పున గాలకింకరులు ముంగిటకొచ్చినవేళ రోగముల్
            గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండిన వేళ , బాంధవుల్
            గప్పినవేళ ,మీ స్మరణ గల్గునొ కల్గదొ నాటి కిప్పుడే
            తప్పక చేతు మీ భజన దాశరథీ ! కరుణాపయోనిథీ !

                                      
                                                                ------------   ఆరవ భాగం త్వరలో





****************************************************************