Tuesday, 3 June 2014

శతకసౌరభాలు - 2 ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకము -7


శతక సౌరభాలు -2
                                               ధూర్జటి   శ్రీ కాళహస్తీశ్వర శతకము -7





పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్వింటి సాంఖ్యాది యో
గ రహస్యంబులు , వేదశాస్త్రములు వక్కాణించితిన్ శంక వో
దరయం  గుమ్మడి కాయలోని యవగింజంతైన , నమ్మించి , సు
స్ధిర విజ్ఞానము త్రోవ చెప్పగదవే శ్రీకాళహస్తీశ్వరా !
                 
       శంకరా ! ఎన్నో మంత్రశాస్త్ర గ్రంధాలను పరిశీలించాను . సాంఖ్యాది యోగరహస్యాలను తెలుసుకున్నాను . వేదశాస్త్రాలను  అధ్యయనం చేశాను . ఇంత చదివినా కూడ
గుమ్మడి కాయ లో ఆవగింజంతైనా నాలోని అనుమానాలు నివృత్తి కాలేదు . స్వామీ  ! నాకు నమ్మకము కల్గునట్లు, శాశ్వత బ్రహ్మజ్ఞానము ను పొందగలిగే మార్గాన్ని  ప్రసాదించవలసింది ప్రభూ  !
   
మొదలన్ చేసినవారి ధర్మములు నిర్మూలంబు గా చేసి , దు
ర్మదులై  యిప్పటి వారె ధర్మమములొనర్పం ,దమ్ము దైవంబు న
వ్వదె , రానున్న దురాత్ములెల్ల తమత్రోవం  బోవరే ఏల చే
సెదరో మీదు దలంచి చూడ రధముల్ శ్రీకాళహస్తీశ్వరా !
   
     శంకరా ! .పూర్వీకులు అనగా తమకు ముందు వారు చేసిన  ధర్మ నిర్ణయాలను  ఇప్పటి వారు స్వార్ధం తో మదోన్మత్తులై   మార్చివేసి క్రొత్త నిర్ణయాలను చేయడం చూసి దైవం  నవ్వుతోంది . ఎందుకంటే  రాబోయే తరం వారు కూడ వీరి మార్గం లోనే దురాత్ములై  వీరు చేసిన నిర్ణయాలను మారుస్తారు కదా . మూర్ఖులైన  వీరు ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేక పోతున్నారు కదా !

                         అనగా తమ ముందు ప్రభుత్వాలు చేసిన  కొన్ని నిర్ణయాలను క్రొత్తగా వచ్చిన ప్రభుత్వాలు తిరుగదోడి , నూత్న నిర్ణయాలను తీసుకోవడం ఇప్పుడు చూస్తున్నాము కాని ఈ విధానం  ధూర్జటి  కాలానికే ఉందని , దాని వలన ప్రజలు ఇబ్బందులు పడుతూ , మళ్లీ వచ్చే పాలకులు వీనిని  ఎప్పుడు మారుస్తారని ఎదురు చూస్తుండేవాళ్ళని , ఈ మాటల్లో మనకు అర్ధమౌతోంది .  

కాసంతైన సుఖం బొనర్చునొ,మన:కామంబు లీడేర్చునో
 వీసంబైనను వెంటవచ్చునొ , జగద్విఖ్యాతి గావించునో
 దోసంబు ల్వెడబాపునో ,వలసినం దోడ్తో మిముంచూపునో
 ఛీ ! సంసార దురాశ యేలుడుపవో? శ్రీకాళహస్తీశ్వరా !

       శంకరా ! మానవులమైన మాకు ఈ సంసారము మీద నున్న దురాశ  లేక ఆరాటం కొంచెమైనా సుఖాన్ని ఇస్తుందా  ! మనస్సులోని కోరికలు ఏమైనా తీరుస్తుందా . మరణించినప్పుడు కొంచెమైనా వెంట వస్తుందా  ! పోనీ లోకం లో ఏమైనా కీర్తి ప్రతిష్టలను కల్గిస్తుందా . చేసిన పాపాలను ఏమైనా కడిగేస్తుందా  ! అవసరమైనప్పుడు మీ దర్శనమైనా కల్గిస్తుందా ! ఛీ ! ఛీ ! రోత కలిగించే ఈ సంసారము పై  మోహమును  ఎందుకు పోగొట్టవు స్వామీ ! ఈ సంసార బంధముల నుండి విముక్తి చేసి నీ చెంతకు చేర్చుకో ప్రభూ !

ఒక పూటించుక కూడు తక్కువగు నేనోర్వంగలే ,దెండకో
కోపక నీడన్వెదకుం , చలిం జడిసి కుంపట్లెత్తుకో జూచు ,వా
నకు ఇండ్లిండ్లును దూరు , నీ తనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో
సి కడాసింపరు గాక మర్య్తులకటా ! శ్రీకాళహస్తీశ్వరా !

                శంకరా !  ఈ మానవులు ఎంత మూర్ఖులు. ఈ శరీరము ఒక్క పూట పిడికెడు అన్నం తక్కువైతే తట్టుకోలేదు . ఎండ  వేడి కి తాళలేక నీడను వెతుక్కుంటుంది.  చలికి భయపడి కుంపట్లను కావిలించు కోవాలనుకుంటుంది . వాన వచ్చిందంటే తలదాచుకోవడానికి ఇల్లిల్లు వెతుక్కుంటుంది . అటువంటి ఈ శరీరం  వలన కలిగే సుఖాలను  అసహ్యించుకొని ,  జనులు శాశ్వత మైన బ్రహ్మ పదమును  ఎందుకు కోరుకోలేకపోతున్నారు  ఎంత ఆశ్చర్యము ..

కేదారాది  సమస్త తీర్ధములు కోర్కిం జూడ బోనేటికిన్
కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు నీ
పాదధ్యానము సంభవించునపుడే భావింప నజ్ఞాన ల
క్ష్మీ దారిద్ర్యులు గారె లోకులకటా ! శ్రీకాళహస్తీశ్వరా !  (80)
              
               ఈశ్వరా  ! నీ పాదధ్యానము సంభవించినపుడే  ముంగిలి వారణాసి  కడుపే కైలాసగిరి అవుతుంది . అది తెలియని ఈ  జనులు  కేదారాది పుణ్య తీర్థముల దర్శనానికి పరుగెత్తుతున్నారు  నిన్ను భావిస్తే  అజ్ఞానమనెడి సంపద తొలగి శాశ్వత జ్ఞానవంతులవుతారు కదా  ! 

తమకంబొప్పఁ బరాంగనాజన పరద్రవ్యంబులన్ మ్రుచ్చిలం
గ మహోద్యోగము సేయు నెమ్మనము దొంగంబట్టి వైరాగ్య పా
శములంజుట్టి బిగించి నీదు చరణ స్తంభంబునం గట్టివై
చి ముదంబెప్పుడుఁ గల్గజేయఁ గదవే శ్రీకాళహస్తీశ్వరా !

                శ్రీ కాళహస్తీశ్వరా . నా మనస్సనెడి దొంగ పర స్త్రీల యందాసక్తి , పరధనములను దొంగిలించుట యందు వ్యామోహము చే ఆరాటపడు చున్నాడు. ఆ దొంగ ను  పట్టి  వైరాగ్య పాశములతో  బంధించి ,  నీ పాదములనెడి స్తంభములకు కట్టివేసి శాశ్వతమైన ఆనందాన్ని నాకు ఎప్పుడు కల్గిస్తావో  కదా ప్రభూ  !

వేధం దిట్టగ రాదు గాని భువి లో విద్వాంసులం జేయనే
లా థీచాతురిఁ  జేసిన గులామాపాటునే పోక క్షు
ద్బాధాదుల్ కలిగింపనేల యదికృత్యంబైన దుర్మార్గులన్
ఛీ ధాత్రీశులఁ జేయనేటి కకటా ! శ్రీకాళహస్తీశ్వరా !

               ఈశ్వరా ! ఆ బ్రహ్మదేవుని నిందించకూడదు కాని ఈ భూమి మీద పండితులను సృష్టించడం ఎందుకు  తన బుద్ధి నైపుణ్యము తో చేసినను  ఆ బ్రతుకును అలానే పోనీయక మధ్యలో ఆకలి బాధలను కల్గించడమెందుకు. అది ఆయన ధర్మమైన దుర్మార్గులైన  ఈ రాజులను  సృష్టించడమెందుకు . మాకు ఈ బానిస జీవనాన్ని ఇవ్వడం ఎందుకు  స్వామీ !

పుడమి న్నిన్నొక బిల్వ పత్రముననేఁ బూజించి  పుణ్యంబునుం
బడయ న్నేరక పెక్కుదైవములకుం బప్పుల్ ప్రసాదంబులుం
గుడుముల్ దోసెలు  సారెసత్తు లటుకుల్ గుగ్గిళ్ళునుం
 బెట్టుచున్ జెడి యెందుం గొఱగాక పోదు రకటా ! శ్రీకాళహస్తీశ్వరా ! ( 84 )
           
                   శంకరా ! ఈ భూమి మీద  నిన్ను ఒక్కమారేడు దళముతో పూజించినను పుణ్యము కలుగుతుంది. ఆ విధంగా పుణ్యాన్ని పొందకుండా  ఈ మూర్ఖపు జనులు అన్యదైవాలను ఆశ్రయించి   వారికి వడపప్పులు ,  ప్రసాదాలు ,  కుడుములు , అట్లు , జంతికలు , అటుకులు , గుగ్గిళ్ళు మొదలైన నివేదనలను సమర్పిస్తూ  చెడిపోయి ,  రెంటికీ  పనికిరాకుండా పోతున్నారు కదా  !

విత్తజ్ఞానము పాదు నిత్యము భవావేశంబు రక్షాంబువుల్
మత్తత్వంబు తదంకురంబనృతముల్ , మారాకు లత్యంత దు
ర్వ్యత్తుల్ పువ్వులు పండ్లు మన్మధముఖావిర్భూత దోషంబులుం
చిత్తాభ్యున్నత నింబ భూజమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా !

               శంకరా !  మనస్సు లో పెరిగే వేపచెట్టుకు  ధన వ్యామోహమే పాదు . మనస్సులో కలిగే ఆవేశ కావేశములే కంచె . అహంభావమే నీరు .   మనం ఆడే అబద్దాలే  మొలకలు . చేసే చెడు పనులే మారాకులు .  కామసంబంధమైన తప్పులే పూలు పండ్లు  కావున ఈ వృక్షాన్ని నా మనస్సులో నుండి తొలగించి జ్ఞాన వృక్షాన్ని  నాటవలసింది స్వామీ  !

నీపై గావ్యము జెప్పుచున్న యతడు న్నీపద్యముల్ వ్రాసి యి
మ్మా పాఠం బొనరింతునన్న యతడున్ ,మంజుప్రబంధంబు ని
ష్టా పూర్తిం బఠియించుచున్న యతడున్ సద్భాంధవుల్ గాక ఛీ
ఛీ పృష్టాగత బాంధవంబు నిజమా శ్రీ కాళహస్తీశ్వరా !

               శంకరా  ! నీ యొక్క మాహాత్య్మాన్ని గురించి  కావ్యము వ్రాసేవారు  ,  నిన్ను గురిచి పద్యాలు వ్రాసిస్తే  పారాయణ చేసుకుంటానని  కవులను అర్ధించేవారు , నీ యొక్క   మనోహర ప్రబంధములను మధురముగా గానము చేయువారే  నాకు బంధువులు కాని జన్మ సంబంధమైన బంధువులు  నాకు బంధువులు కారు . 

సంపద్గర్వముఁ బాఱఁదోలి రిపులన్ జంకించి యాకాంక్షలన్
దంపుల్వెట్టి  కళంకముల్నఱికి బంధక్లేశ దోషంబులం
జింపుల్చేసి , వయోవిలాసములు సంక్షేపించి , భూతంబులం
జెంపల్వేయక నిన్నుఁ గాననగునా ? శ్రీ కాళహస్తీశ్వరా !

          శ్రీకాళహస్తీశ్వరా !  ఐశ్వర్యము వలన వచ్చిన గర్వాన్ని పారద్రోలి , అరిషడ్వర్గాలనే అంతశ్శత్రువులను భయపెట్టి , కోరికలను పాతర వేసి, పాపములను  అరికట్టి , స్వపర భావనాదులచే ఏర్పడ్డ తప్పులను నశింపజేసి , వయస్సు వలన వచ్చు కామాది వికారములను నిగ్రహించుకొని , భవబంధములను తెంచుకోనెడల నీ దర్శన భాగ్యము మాకు లభించదు కదా స్వామీ !

నిన్నం జూడరొ మొన్నఁజూడరొ జనుల్ నిత్యంబుఁజావంగ నా
పన్నుల్గన్న నిధానమయ్యెడి ధనభ్రాంతి న్విసర్జింప లే
కున్నారెన్నడు నిన్ను గందురిక మర్త్యుల్ గొల్వరేమో నిను
న్విన్నం బోవక యన్యదైవరతులన్ శ్రీ కాళహస్తీశ్వరా !

                   పరమేశ్వరా ! మూర్ఖులైన ఈ జనులు  తమ కళ్ళ ఎదుట  రోజూ జనం చచ్చిపోవడం చూస్తూనే ఉన్నారు . కాని ఆపదలో పెన్నిధానం వలే  అనుకొని ఎన్నడు కూడ ధనం మీద వ్యామోహాన్ని మాత్రం వదులు కోలేక పోతున్నారు.  ఏ రోజు ఇతర మోహాలను వదలి నిన్ను ఆశ్రయిస్తారో తెలియదు . ఇతర దేవతలను పూజిస్తూ నిన్ను చిన్నబుచ్చుతున్న ఈ జనులు అవివేకులు .

రాజశ్రేణికి దాసులై ,సిరుల గోరంజేరగా సౌఖ్యమో
ఈ జన్మంబు తరింపజేయగల మిమ్మే ప్రొద్దు సేవించు ,ని
ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరో మానవుల్పాపరా
జీ జాతాది మదాంధ బుద్దులగుచున్ శ్రీ కాళహస్తీశ్వరా !

              ఈశ్వరా !  ఈ జనులు చేసిన పాపముల చేత ఈ భూమిపై  పుట్టి ,  మదాంధులైన ఈ నరులు అజ్ఞానము చేత కప్పివేసి.రాజులకు దాస్యం చేస్తూ సంపదల నాశించడం సౌఖ్యమా ? లేక మిమ్ములను సదా సేవించి కైవల్యాన్ని పొందడం సౌఖ్యమో? తెలుసుకోలేక  పోతున్నారు .

వన్నే ఏనుగు తోలు దుప్పటము ,బువ్వా కాలకూటంబు , చే
గిన్నే బ్రహ్మ కపాలముగ్రమగు భోగే కంఠహారంబు , మే
ల్నిన్నీలాగున నుంటయుం దెలిసియు న్నీ పాదపద్మంబు చే
ర్చెన్నారాయణుఁడెట్లు మానసమునన్  శ్రీ కాళహస్తీశ్వరా !     (90 )   

                    శ్రీ శంకరా !  నీవు కట్టే బట్ట ఏనుగు చర్మము . తినే ఆహారము కాలకూట విషం. చేతిలోని గిన్నె బ్రహ్మ కపాలము . కంఠాభరణాలు  భయంకర సర్పాలు   మరి ఇవన్నీ తెలిసి కూడ లక్ష్మీనాథుడైన ఆ శ్రీమన్నారాయణుడు నీ పాదపద్మాలను తన మనస్సు లో చేర్చి  నిన్ను  ఎలా పూజిస్తున్నాడు స్వామీ !

                                                చదువుతూ.... ఉండండి .  చివరి భాగం త్వరలో





********************************************************************************





Monday, 2 June 2014

శతకసౌరభాలు - 2 ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకము - 6


శతకసౌరభాలు - 2
          
                           ధూర్జటి  శ్రీ కాళహస్తీశ్వర శతకము - 6






అంతా సంశయమే శరీరఘటనం బంతా విచారంబె లో
నంతా దు:ఖపరంపరాన్వితమె మేనంతా భయభ్రాంతమే
యంతానంత శరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్
చింతన్నిన్ను దలంచి పొందరు నరుల్ శ్రీకాళహస్తీశ్వరా !
                  
                శంకరా  ! ఈ జీవికి జన్మంతా సంశయమే . శరీర ఘటనమే ఒక సంశయము . జీవుడు  ఒక దుఖం నుండి మరొక దుఖం లోకి పడిపోతూ , ఒక జన్మ నుండి మరొక జన్మలోకి  జారిపోతుంటాడు.  విచారించి చూడగా జరుగుచున్నదంతా  శరీరాన్ని శుష్కింపజేసే దుర్వ్యాపారాలే. అయినా ఈ మానవులు  తమ మనస్సులలో  నిన్ను ధ్యానించి నిన్ను చేరుకొనే ప్రయత్నం చేయడం లేదు.

సంతోషించితి చాలుచాలు రతిరాజద్వార సౌఖ్యంబులన్
శాంతింబొందితి చాలుచాలు బహురాజద్వార సౌఖ్యంబులన్
శాంతి బొందెద జూపు బ్రహ్మపదరాజద్వార సౌఖ్యంబు  ని
శ్చింతన్ శాంతుడనౌదు నీ కరుణ చే ;  శ్రీకాళహస్తీశ్వరా !
         
           స్వామీ  ! రతికేళీ విలాసముల సంతృప్తి పొందాను . ఇక ఆ సుఖాలు వద్దు . అనేక రాజ సభలలో గౌరవ సత్కారములను పొంది సంతోషించాను. అవి కూడ చాలు.  నీ దయను నాపై ప్రసరింపజేసి  పరబ్రహ్మ పద సౌఖ్యాన్ని నాకు కల్గజేయవలసింది . దానితో  ఇతర కోరికలు లేక నిశ్చింతగా  ఉంటాను స్వామీ !

స్తోత్రంబన్యుల జేయనొల్లని వ్రతస్ధుల్వోలె వేసంబుతో
బుత్రీబుత్ర కళత్ర రక్షణ కళాబుద్ధిన్ నృపాలాధమున్
బాత్రంబంచు భజించబోదు రిదియు న్భావ్యంబె యివ్వారి చా
రిత్రం బెన్నడు మెచ్చ నెంచ మదిలో   శ్రీకాళహస్తీశ్వరా !

                ఈశ్వరా !    కొందఱు నిన్ను తప్ప ఏ ఇతరులను స్తుతించుటకు ఇష్టపడని వ్రతస్ధులవలే డాంబికాలు పలుకుతూ , భార్యాపుత్రుల పోషణార్ధము  రాజులను సేవిస్తూ  ,జీవిస్తున్నారు . ఇది భావ్యం కాదు . ఇటువంటి వారి ప్రవర్తనను నే నెప్పుడు మెచ్చుకోలేను .

అకలంకస్థితి న్నిలిపి నాదమనుఘంటారవమున్ బిందు దీ
ప కళాశ్రేణి  వివేక సాధనములొప్పన్బూని యానంద తా
రక దుర్గాటవిలో  మనోమృగము గర్వస్ఫూర్తి వారించు  వా
రికిగా  వీడు భవోగ్రబంధలతికల్ ; శ్రీకాళహస్తీశ్వరా !

                ఓ శంకరా  !  నిశ్చలస్ధితిలో నిల్చి ,  ఓంకారనాదమను ఘంటారావముతో , బుద్ది యనెడు  దీపపు సామగ్రి తో ,  వివేకమనెడి  సాధనములను కూర్చుకొని ,  ఆనందమనెడి భయంకరమైన అరణ్యము లో తిరిగెడి మనస్సు అనే మృగము  యొక్క మదాన్ని అణచిన    వారికి కదా సంసారమనెడి భయంకరమైన బంధములు తెగి  నీ  దర్శనభాగ్యం  లభించేది స్వామీ  !

ఒక యర్ధంబున నిన్ను నేనడుగగా యూహింప నెట్లైన బొ
మ్ము  కవిత్వంబులు నాకు చెందవని యేమో యంటివా నాదు జి
హ్వకు  నైసర్గిక కృత్యమంతియ సుమీ  ప్రార్ధించుటే కాని కో
రికల న్నిన్నును గాన నాకు వశమా ? శ్రీకాళహస్తీశ్వరా !

                 స్వామీ  ! శంకరా ! నేను ఏవో కోరికలు మనస్సు లో పెట్టుకొని నిన్ను  ప్రార్ధించుట లేదు , అయినా ఈ కవిత్వములు అవీ నాకు చెందనివి  పొమ్ము అని నీవన్నాకూడ అలాగే కానిమ్ము. ఎందుకంటే నా నాలుక కు సహజలక్షణం గా వచ్చినది , నాకు చేతనైనదీ ఈ కవిత్వం చెప్పడమే స్వామీ  !   నిన్ను ప్రార్ధించుటే నాకు వచ్చును  కాని కోరికలున్నంత మాత్రాన   నిన్ను దర్శించుట నాకు సాధ్యమా  ప్రభూ !

శుకముంల్కింశుక పుష్పములగని ఫలస్తోమంబటంచు న్సము
త్సుకతం జేరగబోవగ నచ్చట మహాదు:ఖంబు సిద్ధించు ,క
ర్మ కళాభాషల కెల్ల ప్రాపులగు శాస్త్రంబు ల్విలోకించు వా
రికి నిత్యత్వ మనీష దూరమగు చున్ శ్రీకాళహస్తీశ్వరా !

             శంకరా  ! చిలుకలు  మోదుగ పూవులను చూచి వాటిని పండ్లను కొని భ్రాంతి తో వాని చెంతక చేరి  అక్కడ నిరాశను పొందుచున్నవి . అట్లే నిన్ను ధ్యానించక   కొందరు  కర్మ కాండల మీద కావ్య చర్చలమీద  కాలమును వెళ్లబుచ్చుచూ , శాశ్వత జ్ఞానాన్ని దూరం చేసుకుంటున్నారు కదా !

ఒకరిం జంపి పదస్ధులై బ్రతుక తామొక్కొక్క రూహింతురే
లొకొ తామెన్నడు జావరో తమకు బోవో సంపదల్ పుత్ర మి
త్ర కళత్రాదులతోడ నిత్యసుఖమందం గందురో, యున్న 
వారికి లేదో మృతి యెన్నడుం గటగటా శ్రీకాళహస్తీశ్వరా !

                       ఓ శివా ! కొందరు ఒకరిని చంపి  పదవిని పొంది  బ్రతుకుదామని ఆలోచిస్తారు . ఆశ్చర్యం గా ఉంది కదా ! వారు మాత్రం ఏదో ఒక రోజున చావరా  ? వారి సంపదలు మాత్రం పోవా ! వాళ్లేమైనా భార్యాపుత్రులతో ఎల్లకాలం  సుఖంగా ఉంటారా ? బ్రతికున్నవారికి ఎన్నడూ చావురాదా ?  ఎంత ఆశ్చర్యము ! స్వామీ ! అయ్యో !

నీ కారుణ్యము గల్గినట్టి నరుడే నీచాలయంబుం చొరం
డే కార్పణ్యపు మాటలాడనరుగం డెవ్వరితో ,వేషముల్
గైకోడే మతము ల్భజింప డిల నే కష్టప్రకారంబులన్
చీకాకై చెడిపోడు జీవనదశన్ ; శ్రీకాళహస్తీశ్వరా !

          శంకరా  ! నా అనుగ్రహం పొందిన  నరుడు  ఏ నీచుల కొలువు కు వెళ్ళడు. ఎవ్వరినీ  దీనంగా యాచించడు .   మాయవేషాలు వేయడు.  ఏ ఇతర మతములను సేవించడు.  బ్రతుకు నందు  ఎంత కష్టములు కమ్ముకున్నను  స్ధిరత్వమును కోల్పోక  నిలబడతాడు .

జ్ఞాతు ల్ద్రోహులు వారుసేయు కపటీర్ష్యాది క్రియాదోషముల్
మా తండ్రాన సహింపరాదు ,ప్రతికర్మంబించుకే జేయగా
బోతాదోషము గానమాని యతినై పోగోరినన్ సర్వదా
చేత:క్రోధము మానదెట్లు నడతున్ శ్రీకాళహస్తీశ్వరా !

          శంకరా !  దాయాదులు అపకారులు. వారు  చేసే  మోసము అసూయ తో కూడిన పనులు సహింపరానివి . మా తండ్రి గారిమీద ఒట్టు.  వారి పనులకు ప్రతీకారము చేద్దామంటే పాపమంటారు . పోనీ సన్యాసం తీసుకుందామంటే నా మనసు లోని కోపం అణగిపోవడం లేదు. ఆ కోపాన్ని ఎలా జయించాలో చెప్పు స్వామీ !.


రోసిందేఁటిది? రోతలేఁటివి ? మనోగ్రస్తుండు గా దేహి తా
పూసిందేటిది ? పూతలేఁటివి ? మదాపూతంబు లీదేహముల్
మూసిందేఁటిది ? మూఁతలేటవి ? సదా మూఢత్వమే కాని తా
జేసిందేటిది చేఁతలేటివి వృథా ! శ్రీకాళహస్తీశ్వరా !

          శ్రీ శంకరా  !ఈ దేహి  దేన్ని  అసహ్యించుకుంటున్నాడు . పిచ్చివాడివలే ప్రవర్తిస్తున్నాడు. ఒంటికి విభూతి పూసుకుంటున్నాడే కాని అది విభూతి కాదు మదమనే మైపూత . మూసివేశానంటాడు తనలో ఎటువంటి దుర్గుణాలు లేవంటాడు  మూఢత్వ ముండగా మూసిందేమిటి . ఎన్నో చేశానంటాడే కాని అన్నీ వృథా పనులే కాని సత్కార్యం ఒక్కటీ ఉండదు. ఇదీ ఈ  జీవి తాపత్రయం.

శ్రీ శైలేశు భజింతునో యభవు గాంచీనాథు సేవింతునో
కాశీవల్లభు గొల్వబోదునొ మహా కాళేశు బూజింతునో,
నాశీలం బణువైన మేరువనుచున్ రక్షింపవే నీ కృపా
శ్రీ శృంగార  విలాస హాసములచే ; శ్రీకాళహస్తీశ్వరా !
         
           శ్రీ కాళహస్తీశ్వరా ! నేను శ్రీ శైలమల్లిఖార్జునుని సేవించలేదు  కంచిలోని ఏకామ్రనాథుని పూజించలేదు . కాశీ విశ్వేశ్వరుని  భజించలేదు .  ఉజ్జయిని లోని మహా కాళేశ్వరుని సేవించలేదు.  నేను ఎవ్వరినీ  పూజించని వాడనైనప్పటికీ  దేవా ! .నా  భక్తి అణువంతైనను మేరువు వలే భావించి  నీదయ యనెడి సంపత్కరమైన చిరునవ్వులతో నన్ను రక్షింపుము . .

వెనకం జేసిన ఘోర దుర్దశలు భావింపంగ రోతయ్యెడున్
వెనుకన్ముందట వచ్చు దుర్మణముల్వీక్షింప భీతయ్యెడున్
నను నే జూడగ నా విధుల్దలచియున్నాకే భయంబయ్యెడిన్
చెనకుం జీకటి నాయె కాలమునకున్ శ్రీకాళహస్తీశ్వరా !   ( 75 )
                  
             స్వామీ ! ఇంతకు ముందు చేసిన పాపపు పనులను తలచుకుంటేనే అసహ్యం వేస్తోంది .  నా కళ్లముందు సంభవించెడి దుర్మరణాలను చూస్తుంటే భయం వేస్తోంది . నన్ను , నేను చేసే పనులను పరిశీలించుకుంటుంటే నాకే భయం వేస్తోంది . నల్లని చీకటి నా పైపైకి వచ్చి కమ్ముకుంటున్నట్లు గా కలిగే భావన నన్నుభయాందోళనలకు గురిచేస్తోంది స్వామీ రక్షించు !
                   

                    చదువుతూ ... ఉండండి . మరికొన్ని త్వరలో అందిస్తాను .



***************************************************************













  


Friday, 30 May 2014

శతకసౌరభాలు -2 ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకము -5


శతక  సౌరభాలు -2
                                                 ధూర్జటి   శ్రీ కాళహస్తీశ్వర శతకము  - 5




భవదు:ఖంబులు రాజకీటకములనే బ్రార్ధించినన్ బాయునే
భవదంఘ్రి స్తుతి చేతగాక , విలసద్బాలక్షుధా క్లేశ దు
ష్ట విధుల్మానునె చూడ మేక చంటం దల్లి కారుణ్య దృ
ష్టి విశేషంబుల నిచ్చు చంటి వలె శ్రీ కాళహస్తీశ్వరా !
                    

                శ్రీ కాళహస్తీశ్వరా  ! జనన మరణాది సంసార దు:ఖములు నీ పాదపాద్మములను సేవించుట చేత కాక రాజులనే కీటకములను సేవించుటచే సేవించుట వలన పోవునా . ఎట్లనగా  ఎదుగుచున్న శిశువు యొక్క ఆకలి బాధ  కరుణామృత హృదయముతో కన్నతల్లి ఇచ్చెడి  చనుబాల తో తీరును కాని   మేక మెడక్రింద చన్నుల వలన తీరదు కదా !

 పవి పుష్బంబగు, నగ్ని మంచగు ,నకూపారంబు భూమీస్ధలం
 బవు ,శత్రుం డతిమిత్రుడౌ, విషము దివ్యాహారమౌ నెన్నగా
 నవనీ మండలి లోపలన్ శివశివే త్యాభాషణోల్లాసికిన్
 శివ నీ నామము సర్వ వశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా !

    
                   ఓ శంకరా  !    ఈ భూమి మీద   అత్యంతమహిమ కల్గిన శివ శివ అనెడి నీ నామస్మరణము చేయువానికి   వజ్రాయుధము పూలమాలగాను , అగ్ని గుండము మంచుకొండగను , సముద్రము భూ ప్రదేశముగను , శత్రువు అతి మిత్రుడు గను , కాలకూట విషము దివ్యాహారము గను  మారిపోవును . ఆలోచింప గా నీ నామము సర్వ వశ్యకరమనుటలో సందేహమే లేదు. 

లేవో  కానల కందమూలఫలముల్ లేవో గుహల్తోయముల్
లేవో యేరుల పల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మ లో
లేవో  నీవు విరక్తులన్మనుప జాలిం బొంది , భూపాలురన్
సేవల్సేయగ బోదురేలొకో జనులు ? శ్రీ కాళహస్తీశ్వరా !

                   ఈశ్వరా  ! అడవులలో తినుటకు కందమూల ఫలాలు , నివసించ డానికి గుహలు ,సెలయేర్ల   యందు నీరు , పత్రి మున్నగు పూజాద్రవ్యాలు , చిగురాకుల శయ్యలు లభించుచున్నవి కదా .  విరక్తులైన వారిని ఆదరించి కాపాడటానికి నీవు ఉన్నావు కదా . మరి ఈ మూర్ఖపు ప్రజలు   ఎందుకు రాజులను ఆశ్రయిస్తారో తెలియడం లేదు . 
             
మును  నేఁ బుట్టిన పుట్టులెన్ని గలవో మోహంబు చే నందు చే
సిన కర్మంబుల ప్రోవులెన్ని గలవో చింతించినం గాని , యీ
జననం బేయని యున్నవాడ నిదియే చాలింపవే నిన్ను గొ
ల్చిన పుణ్యంబునకుం గృపారతుడవై శ్రీ కాళహస్తీశ్వరా !

                      ఓ శంకరా  ! నేను ఇంతకు ముందు ఎన్ని జన్మలెత్తానో , ఆ జన్మల్లో అజ్ఞానం తో ఎన్ని పాపాలు చేశానో  తెలియదు . ఇప్పుడున్న ఈ జన్మయే చివరిదని భావిస్తున్నాను . నిన్ను సేవించిన పుణ్యానికి  నన్ను కరుణించి   ఈ జన్మ నే  చివరి జన్మ గా చేసి నన్ను రక్షించవలసినది ప్రభూ. !   

తనువెందాక ధరిత్రి నుండు నను నందాక న్మహా రోగ దీ
పన దు:ఖాదుల బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా
వెనుక న్నీపదపద్మము ల్దలచుచు న్విశ్వ ప్రపంచంబుఁ బా
సిన చిత్తంబున నుండ జేయ గదవే ! శ్రీ కాళహస్తీశ్వరా !

                ఓ ఈశ్వరా  ! ఈ భూమి మీద నేనెంత కాలం బ్రతికుంటానో అంతకాలం మహారోగాల మూలం గా   కలిగే దుఖాలు లేకుండా  దయతో చూసి , ఆపై ఇహలోక విషయాలను వదలి వేసి , నీ పాదపద్మములను సేవించే భాగ్యాన్ని కల్గించు స్వామీ  !

జలకంబుల్ రసముల్ ప్రసూననములు వాచాబంధముల్ వాద్యము
ల్కల శబ్దధ్వను లంచితాంబరమలంకారంబు దీప్తు ల్మెఱుం
గులు నైవేద్యము , మాధురీ మహిమ గా గొల్తు న్నినున్ భక్తి రం
జిల దివ్యార్చన గూర్చి  నేర్చిన క్రియన్ శ్రీ కాళహస్తీశ్వరా !

          శంకరా  ! నేను  నిన్ను   నా   కవిత్వముచే పూజించెదను . కవిత్వమునందలి  రసములే అభిషేక జలం గా ,  వాక్కులే  పూజా పుష్పాలు గా , అనుభూతి ప్రకటితమైన ధ్వనులే  శంఖాది మంగళ వాద్యాలు గా , సుప్రకాశమైన ఆకాశమే ఆభరణం గా , కావ్య గుణములే దీపాలు గా , కావ్యమందలి మాధుర్యమే మహర్నివేదన గా  దివ్యార్చన  గురించి  నేను నేర్చిన రీతిలో భక్తి తో నిన్ను పూజిస్తాను ప్రభూ.  !
                           
ఏ లీల న్నుతియింపవచ్చు నుపమోత్ర్పేక్షాధ్వని వ్యంగ్య శ
బ్దాలంకార విశేష భాషల కలభ్యంబైన నీ రూపముం
చాలుంజాలుఁ గవిత్వమున్నిలుచునే నిత్యంబు వర్ణించుచో ?
ఛీ ! లజ్జింపరు గాక మాదృశ కవుల్ ! శ్రీ కాళహస్తీశ్వరా !

                       శ్రీ కాళహస్తీశ్వరా   !  నీ రూపాన్ని వర్ణించడానికి  ఉపమ ,ఉత్ప్రేక్ష  ,ధ్వని , వ్యంగ్యము , శబ్ధ , అర్దాలంకారాలు ,  విశేష వ్యాకరణాదులకు కూడ అసాధ్యము . మరి ఎలా నిన్ను వర్ణించగలను . అసలు నీ సత్యరూపాన్ని వర్ణించాలంటే  కవిత్వం  నిలబడుతుందా  ? నిలబడదు . కాని మా వంటి కవులు సిగ్గు లేకుండా నిన్ను వర్ణించాలని చూస్తున్నారు . సిగ్గుచేటు. ఛీ  ! ఛీ !.

పాలుం బువ్వయు బెట్టెదన్ గుడువరా పాపన్న ,రాయన్న లే
లే లెమ్మన్న నరంటి పండ్లు గొని తే , లేకున్ననే నొల్ల నం
టే , లాలింపరె తల్లిదండ్రులపుడట్లే తెచ్చి వాత్సల్య ల
క్ష్మీ లీలా వచనంబులం గుడుపరా !  శ్రీ కాళహస్తీశ్వరా !

                       ఈశ్వరా  !  తల్లిదండ్రులు తమ బిడ్డకు   పాలబువ్వ పెడతాను తినరా ! నాయనా  !  రా రా బాబూ  !  అని బుజ్జగిస్తుంటే ఆ పిల్లవాడు   నాకు అరటి పండ్లు  కావాలి తెచ్చిన గాని తిననని మారాం చేస్తే  , ఆ బిడ్డకు అరటి పండ్లు తెచ్చి తినిపింతురు కదా  !  అట్లే నీవు నాకు ప్రేమ తో నిండిన ముద్దు మాటలతో   అన్నము తినిపించవలసినది స్వామీ !

                     ఈ పద్యం లో కవియొక్క  ఆత్మ నివేదన తుది దశకు చేరింది. కన్నబిడ్డ లా తనను ఓదార్చి , దగ్గరకు తీసుకొని  అన్నం తినపించమని తన దైవాన్ని  కోరుకుంటున్నాడు .

కలలంచు న్శకునంబులంచు గ్రహయోగంబంచు సాముద్రికం
బు లటంచుం దెవులంచు ,దిష్టియనుచు న్భూతంబులంచు న్విషా
దు లటంచు న్నిమిషార్ధ జీవనములందుం బ్రీతి పుట్టించి నా
సిలుగుల్ ప్రాణుల కెన్ని చేసితివయా ! శ్రీ కాళహస్తీశ్వరా !        

                   ఈశ్వరా !  రెప్పపాటు లో మరణించే  ఈ జీవుల యొక్క  జీవితాల లో మమకారాన్ని పుట్టించి ,  కలలనీ , శకునాలనీ ,  గ్రహా యోగ సాముద్రికాలనీ , రోగాలు ,  దిష్టులు భూతాలనీ , విషప్రయోగాలనీ  ఎన్ని ఆపదలను సృష్టించావు  స్వామీ  !

తలమీద కుసుమ ప్రసాద మలిక స్ధానంబు పై భూతియున్
గళ సీమంబున దండనాసిక తుదన్గంధ ప్రసారంబు ,లో
పల నైవేద్యంబు జేర్చు నే మనుజుడా భక్తుండు నీ కెప్పుడున్
జెలికాడై  విహరించు రౌప్యగిరి పై ; శ్రీ కాళహస్తీశ్వరా !      

                ఈశ్వరా !  ఏ పురుషుడు నిత్యము నీ నిర్మాల్యమును తలపై ధరించుచూ , నుదుటి పై విభూతిని ,  మెడలో  రుద్రాక్షలను  ధరించి , నీ పూజాపుష్పాల నిర్మాల్యాన్ని ఆఘ్రాణిస్తూ , నీ నైవేద్యం తో కడుపు నింపుకుంటాడో  ఆ భక్తుడు  ఎల్లవేళలా నీకు చెలికాడై ,  వెండికొండ మీద  విహరించ గలుగుతాడు .

ఆలుంబిడ్డలు మిత్రులున్ హితులు నిష్టార్థంబు లీ నేర్తురే
వేళన్వారి భజింప జాలిపడకావిర్భూత మోదంబునన్
కాలం బెల్ల సుఖంబు నీకు , నిక భక్తశ్రేణి రక్షింపకే
శ్రీ లెవ్వారికి కూడబెట్టెదవయా ? శ్రీ కాళహస్తీశ్వరా !      

                                శ్రీ కాళహస్తీశ్వరా !  భార్యాబిడ్డలు ,మిత్రులు , అనువారు ఎల్లవేళల వారి  స్తోత్రము చేసినను కోరిన కోరికలు తీర్చలేరు కదా ! నీవు  ఎల్లవేళలా ఆనందమయుడవై మా వంటి వారిపై జాలి చూపకున్నావు .  నీ భక్తులను కాపాడకుండా  సంపదలు ఎవ్వరికోసం కూడబెడుతున్నావు స్వామీ.!

గతి నీవంచు భజించు వార లపవర్గం బొందగానేల సం
తతముం గూటికినై చరింప వినలేదా  ? “ యాయురన్నం ప్రయ
చ్ఛతి “  యంచు  న్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధ కారాభి దూ
షిత దుర్మార్గులు గాన గానబడవో ?  శ్రీ కాళహస్తీశ్వరా !     ( 60 )  

                         శ్రీ శంకరా  !  నీవే దిక్కని సేవించిన వారు మోక్షాన్ని పొందుచుండగా , ఎల్లప్పుడూ కూటికై పాకులాడుచూ , సంసారమనే మోహంలో పడి కొట్టుకుపోయే వారు    “ఆయుష్షు ఉన్నవారికే అన్నం లభిస్తుందని “ శ్రుతులు చెప్పిన మాట వినలేదా ?  లేక వారికి వినబడదా  ?


                             చదువుతూ ... ఉండండి  . మరికొన్ని అందిస్తాను  మరి .......





*********************************************************************************