Tuesday, 11 September 2012

రామాయణము --- రమణీయకధనాలు - 3 - సరమ


సరమ

                         
                    శ్రీ మద్రామాయణంలో వాల్మీకిమహర్షిచే నామమాత్రంగా ప్రస్తావించబడి తెఱచాటుకు తొలగిపోయిన అతి కొద్ది  అందమైన పాత్రల్లో ఊర్మిళ,మాండవి,శ్రుతకీర్తుల తరువాత గుర్తుకొచ్చే పాత్ర సరమ.
                       సరమ విభీషణుని ఇల్లాలు. విభీషణస్తు ధర్మాత్మా న తు రాక్షస చేష్టితః అని శూర్పణఖ విభీషణుని గూర్చి రామునికి పరిచయం చేస్తుంది.[వా.3-17-24] రావణుని తమ్ముడు విభీషణుడు ధర్మాత్ముడు.   

                  రామాయణకధకు కారకుడై   “పౌలస్త్యవధనామాంతర రామాయణంలో రావణుడు ప్రతినాయకుడు  కాగా, లంకలో పుట్టినా లంక లక్షణాలులేని ధర్మాత్ముడు విభీషణుడు. ఆయనకు తగిన థర్మపత్ని సరమ.
              
            సరమా నామ ధర్మజ్ఞాం లేభే భార్యాం విభీషణామ్  అని  [ ఉత్తరకాండ 12-2 ] .ధర్మాత్మా  ధర్మజ్ఞా  అనే విశేషణాలు  వాల్మీకి ప్రయుక్తాలే.   రాక్షసవంశంలో జన్మించినా విభీషణుడు ,సరమ కూడా ధర్మాత్ములే నని మహాకవి ఉవాచ. అందుకే  రామసేవాభాగ్యం లభించిన అదృష్టవంతులయ్యారు వారు. వీరి కుమార్తె  పేరు అనల.

 జ్యేష్టకన్యా2నలానామా...................విభీషణసుతా....అని వాల్మీకం [సుం-కాం 32-10-11,12.}                                                                                 
              
                 సీత అశోకవనంలో ఉండగా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఆమెను ఆదుకున్న కుటుంబంగాను, సేవచేసి తరించిన వ్యక్తులుగాను మనకు రామాయణం లో కన్పిస్తారు. రాముని శరణు జొచ్చిరావణవధకు కారకుడైన విభీషణుడు సీతకు పరోక్షంగా సహాయం చేస్తే, రామ విభీషణుల సమాగమాన్ని,  రామదండు పురోగమనాన్ని, గగనమార్గంలోనుండి అదృశ్యగా వీక్షించి సమస్త సమాచారాన్ని, తుదకు రామచంద్రుని విజయాన్ని కూడ సీతకు చెప్పి, రామవియోగమనే గ్రీష్మతాపంతో బీడువారిన జానకి హృదయంలో తొలకరి జల్లులను చిలకరించి శాంతింపజేస్తుందీ సరమ. 
                
                       చంకదుడ్డు శరణార్థివలె వచ్చిన విభీషణుని సుగ్రీవాదులు శతృవుగా భావించి – నివారించినా తుదకు రాముడు వారలందరిని సమాధానపరచి , ఆనాడు శూర్పణఖ చెప్పిన మాటలను గుర్తుచేసుకొని, విభీషణునకు అభయమిచ్చాడు. ఈ సమయంలో పలురకాల ధర్మసూక్ష్మాలు రాముని గొంతుకలో ప్రచలితమౌతాయి.
    
  సకృదేవ ప్రసన్నాయ తవాస్మీతి చ యాచతే !
  అభయం సర్వభూతేభ్యో దదామే తద్ర్వతం మమ
  విభీషణోవా సుగ్రీవ యదివా రావణస్స్వయమ్ ||  యు.కాం.18-33-34

రామచంద్రుని శరణాగత వత్సలుడని, ఆర్తత్రాణపరాయణుడని ,జగత్ప్రభుడని లోకం జోతలందించడానికి పరమప్రమాణంగా నిలుస్తుందీ ఘట్టమే. శరణుజొచ్చినవాడు రావణుడైనా అంగీకరిస్తానన్న రఘునాధుని మహత్వం రామాయణానికి జీవగఱ్ఱ. శరణాగతితత్త్వం రామచంద్రుని జగత్ప్రభువుని చేస్తే గీతామృత బోధ శ్రీకృష్ణుని జగద్గురువుని చేసింది.అంటే రామచంద్రునిలోని శరణాగతి తత్త్వం  వెల్లివిరియడానికి ఈ ఘట్టమే ఆధారమైంది.

అశోకవనంలో రావణుడు ఇంద్రజాలప్రభావంతో నెత్తురోడుతున్న రాముని శిరస్సుని చూపి, వానరసైన్యమంతా నాశనమైందని ప్రకటించి సీతాహృదయంలో బడబాగ్నిజ్వాలలు రేపి, భయపెట్టి వెళ్లిపోగా—తనవల్లనే పుణ్యాత్ముడైన రామచంద్రుడు మరణించాడని భోరున విలపిస్తున్న సీతమ్మను ఓదార్చడానికి వస్తుంది సరమ.

సీతాం తు మోహితాం దృష్ట్వా----------ప్రియా ప్రణయనీం సఖీం  [ యు.కాం.  33-1 -2 -4 ]

ఆశ్వాసయామాస  తదా సరమా మృదుభాషిణీ-----సఖీస్నేహేన సువ్రతా  ||

                         అన్న  పల్కులు వాల్మీకివి. సఖీ స్నేహంతో కష్టాల్లో ఉన్న నెచ్చెలిని ఓదార్చడానికి మృదుభాషిణియైన సరమ వచ్చింది. మరణించాడనుకొన్న రాముని క్షేమం తెలపడమే కాకుండా రావణుని ఇంద్రజాలవిద్యను తేటపరచి ఆమె హృదయానికి ఆనందాన్ని కల్గిస్తుంది. రాముని సముద్రతరణాన్ని గర్వంగా ప్రకటించడమేకాకుండా యుద్దంజరగబోతోందని .శుభం నిన్ను వరిస్తుందని, నామాటలు  నిజమని నమ్మబలుకుతుంది. నిరాశా నిస్పృహలతో నిండి నావంటి పాపిష్టిదాన్ని చేసుకోబట్టే ఆపుణ్యాత్ముడు మరణించాడన్న”{ యు.కాం.32-28,29 ] ఆత్మన్యూనతాభావాన్ని పొందిన సీతకు ఆత్మస్థయిర్యాన్ని కల్గించడానికి ఈ పాత్ర ఎంతగానో తోడ్పడుతుంది.
    
  శోకస్తే  విగత స్సర్వః కళ్యాణం త్వా ముపస్థితమ్
   ధ్రువం త్వాం భజతే లక్ష్మీః ప్రియం ప్రీతికరం శృణు |            [యు.కాం.33-14  ]
   
 ఈ మాటలు సీతాదేవి హృదయంలో అమృతపుజల్లులను కురిపించాయి. మరణోన్ముఖురాలైన ఆమెకు తిరిగి నూత్నోత్సాహాన్ని కల్గించాయి.అంతేకాదు.ఎంతోకాలంగా చిక్కుపడి ఏకవేణిగా నున్న నీ శిరోజాలను శ్రీరాముడు చక్కదిద్దగలడు అంటుంది మృదుభాషిణి గా సఖీస్నేహంతో సరమ. బాధలో ఉన్న వారిని సముదాయించాలంటే ఆత్మీయుల ప్రస్తావన తీసుకురావాలని ఇక్కడ చెప్పకనే నిరూపించాడు మహాకవి.ఆ సందర్భంలో  శ్రీ రామచంద్రుల ప్రస్తావన    బరువెక్కిన సీతమ్మ హృదయాన్నే కాదు భారమైన ఆ సన్నివేశాన్ని  తేలిక పరచింది. ఇది మహాకవి శిల్పం. అందుకనే ఈ సందర్భంలోని ఈ శ్లోకం సీతమ్మ కష్టాలను చూచి కరిగిన వాల్మీకిమహామునే  సరమ తో ఇలా పలికించాడేమో ననిపిస్తుంది.
  
   అశ్రూణ్యానందజాని  త్వం వర్తయిష్యసి శోభనే
   సమాగమ్య పరిష్వజ్య తస్యోరసి మహోరస : |                         [యు-కాం.33-33

                            “రాముని కౌగిలించు కొని ఆయన బిగికౌగిలిలో  విశాలమైన అతని వక్షస్థలం మీద ఆనందాశ్రువులను రాల్చగలవు. ఇది సరమ చేస్తున్న ఆశ్వాసనం కాదు. వాల్మీకి గొప్ప మనసుతో  చేతులెత్తి సీతమ్మకు అందిస్తున్న చల్లని ఆశీర్వచనమే ననిపిస్తుంది. మధురమైన సరమ అనునయవాక్యాలకు    కోలుకున్న సీత సరమను స్నేహపూర్వకంగా దగ్గరకు తీసుకొంది. అప్పుడే రమా సహితయైన  ఆ  రాక్షసి { స –రమ ] సరమ యైంది.   రాముని కౌగిలి విభీషణునికి లభిస్తే సీతమ్మ కౌగిలి అతని బార్య సరమకు లభించింది.  వారి జన్మలు ధన్యమైనాయి. నమ్మిన వారినెప్పుడు రామచంద్రుడు విడిచిపెట్టడు. అభయం సర్వభూతేభ్యో…”
...అనిగదా  ఆయనవ్రతం. అందుకే బుధకౌశిక ఋషి–
                     
                          "ఆత్త సజ్య ధనుషావిషుస్పృశావక్షయాశుగ నిషజ్గసజ్గినౌ
                    రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రత : పథి సదైవ గచ్ఛతామ్ ||

పరిపూర్ణవిశ్వాసంతో గర్వంగా ప్రకటిస్తాడు శ్రీ రామరక్షాస్తోత్రం లో. ఎక్కుపెట్టిన ధనుస్సుల్లోని బాణాలను స్పృశిస్తూ, అక్షయతూణీరములు కల్గిన రామలక్ష్మణులు నన్ను రక్షించడానికి నేను నడిచేమార్గంలో నాకన్న ముందు నడిచెదరు గాక ! ఇదీ-  శ్రీ రామచంద్రుని పై భక్తులకున్ననమ్మకం.
                     
   అయితే సరమకు ఆ పేరు రావడానికి మాత్రం అసలు కారణం రామాయణం ఉత్తరకాండ  లో ఇలా ఉంది.
                    ‘మానససరోవర తీరంలోఈ కుమార్తెను ప్రసవించిన ఈమె తల్లి వానల వలన పెరుగుతున్నసరస్సునీరు పసిబిడ్డ వద్దకు రావడం  చూచి సరో మా వర్ధయ అని పల్కిందని ,అదే ఆ శిశువు పేరుగా మారి స ర మ  అయ్యిందని ఉత్తర కాండ   చెపుతోంది.    [ ఉ.కాం.—12-24]  
                                     ఏమైనా కష్టసమయంలో సీతమ్మకు తోడుగా నిల్చిన ఒక స్త్రీమూర్తి గా రామాయణంలో తన పాత్రను సుస్ధిరం చేసుకున్న భాగ్యశాలి సరమ.
                      
**వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్   **[******                                                                      

Saturday, 8 September 2012

ఒకసందేహము– సమాధానము {రామచంద్రుని వంశవృక్షము}


              రామచంద్రుని వంశవృక్షము
                    అంతా రామమయం  {SEP-2-2011]  -చదివిన మిత్రులొకరు ప్రశ్నఒకటి పించారు. దానికి సమాధానం వ్యక్తిగతంగా కాకుండా సర్వేక్షణ గా అయితే మరో నలుగురికి చేరుతుందని ఈ  మార్గంలో అందిస్తున్నాను.
ప్రశ్న:-- dear sir can u give me the details of the sons of rama/lakshmana/bharatha/satrughna nd also the sons names of lava nd kusa in ramaayanaa...09884675329 

సమాధానం  :--   



        నేను వేరే మకాం లో ఉండటం వలన నా స్వంత గ్రంధాలయం అందుబాటులో లేదు.అందువలన అధికసమాచారాన్ని మరోమారు విశదంగా అందించడానికి ప్రయత్నిస్తాను.
                                            #
                               వందే వాల్మికి కోకిలమ్.
                                                     ***

Sunday, 2 September 2012

అంతా రామమయం

                         




                               అంతా రామమయం
                                     


                         శ్రీ రామ భక్తులకు లోకమంతా రామమయంగానే కన్పిస్తుందట.ఈ మధ్య  అటువంటి పరిస్ధితే నాకూ ఎదురైంది. రామాయణ సాహిత్యం మీద డాక్టరేట్ తీసుకున్నాననే విషయం తెలిసిన సన్నిహితులు, మిత్రులు వారికెక్కడ రామసంబంధమైన విషయం తెలిసినా నాతో పంచుకోవడం ఒక అలవాటైపోయింది.ఆ మథ్యన నా సహోద్యోగి ఒకరు ఒక బంగారు నాణాన్ని తీసుకొచ్చి నా ముందుంచాడు. దాన్ని చూసిన నాకు మాటలు కరువయ్యాయి. సుమారు పదిహేనుగ్రాముల బరువున్నబంగారునాణెమది.దానిపై ఒకవైపు శ్రీరామచంద్రుని పట్టాభిషేకదృశ్యము,రెండవవైపు విల్లంబులు థరించిన రామలక్ష్మణులు స్పష్టంగా ముద్రించబడున్నాయి. ఇదిగో  చిత్రం ఒకటిలో ఆ నాణెము ముందువెనుకలను మనం స్పష్టంగా దర్శించవచ్చు.
                              

                       విచిత్రమేమిటంటే అతను నాకు పూర్వవిద్యార్ధి కూడాను. తరువాత వేరే ఉద్యోగం రావడంతో ఈ తాత్కాలిక ఉద్యోగాన్ని వదిలేసి అతను వెళ్లిపోయాడు .ఇది జరిగి చాలాకాలమైంది. ఆనాడు ఆర్ట్ పేపరు మీద తీసిన ప్రింటు యిది. కాలగమనంలో మెరుపు తగ్గింది. తిరుపతి లో జరిగిన రామాయణ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో నా పేపర్ తో పాటు దీన్ని కూడా చర్చకు పెట్టడం జరిగింది.ఆ తరువాత కొంతకాలానికి కాన్ఫరెన్స నిర్వాహకులురామాయణ సమ్మేళనం ప్రత్యేక సంచికను ముద్రిస్తున్నామని,ఆప్రింటు ఒక దానిని పంపిస్తే ప్రత్యేక సంచికలో ముద్రిస్తామని   లేఖ వ్రాయడం దీని నకలు ఒక దానిని ఆరోజు నేను పంపించడం జరిగిపోయాయి . ఆనాడే యిదిఎంత విలువైన నాణెమో అర్ధమైంది.కాని  ఆ నాణాన్ని తను నాకు ఇవ్వడానికి కాదు గదా! అమ్మడానికి కూడ అతను సిద్దంగా లేడు. నా మీద ఉన్న అభిమానంతో అతను తీసుకొచ్చి చూపించాడే కానీ అమ్మే ఉద్దేశ్యం కూడా అతనికి లేదు. అది తన కుటుంబంలో తాతల నాటినుంచి వస్తోందని అతను చెప్పినప్పుడు నాకుఆశ్చర్యం వేసింది.ఎందుకంటే అతను కొంతకాలం  దుబాయ్ల్ లో పనిచేసి ఆరోగ్య కారణాల వలన వచ్చేశాడు.ఇప్పటికీ కుటుంబసభ్యులు కొందరు అక్కడే ఉన్నారని చెప్పినట్టు గుర్తు. వారి కుటుంబాల్లోనే ఇవి ఇంతగా భద్రపరచబడ్డాయంటే ఇంకా ఎంతమంది దగ్గర ఎన్ని రూపాల్లో చరిత్ర దాగి ఉందా !అనిపిస్తోంది. అందుకే ఈ చిన్నప్రయత్నంతో విజ్ఞుల ముందుకు దీన్ని పంపిస్తున్నాను.  


 

  
చిత్రము—1                   బంగారునాణెం



             వృత్తిరీత్యా,కుటుంబరీత్యా ఉన్నబాధ్యతలు,ఒత్తిడుల మూలంగా కొంతకాలం దీన్నిపక్కన పెట్టడం జరిగింది. కాని పులి మీద పుట్ర లాగా ఇంకొక నాణెం వచ్చి మీద పడింది. అదికూడ రాముడి పేరు చెప్పుకొనే వచ్చింది.దానికి కారణం నా పరిశోధనా వ్యాసమే నని చెప్పవచ్చు. నా పుస్తకం మీద ఉన్న రాముడి చిత్రాన్ని చూసిన మా కాలేజి అటెండరు రాముడికి నాకు ఉన్నసంబంధాన్ని గుర్తించాడేమో, ఒకరోజు సాయంత్రం డిపార్టుమెంటులో ఉన్న నన్ను బయటకు పిలిచి ఈ నాణాన్ని నా చేతిలో పెట్టాడు. ఈ నాణెం కూడ ఇంచుమించు పై నాణెమంత వెడల్పు లావు బరువు ఉన్నా ఇది వెండి నాణెం. రామలక్ష్మణుల వలే రంగులో భేదం తప్పపై నాణెం వలే ఒకే పోలికలున్నఆ నాణాన్ని చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది. అతను చెప్పిన విషయం విని ఆశ్చర్యం పోవడం నా తోటివారి వంతయ్యింది. ఏది ఎవరికి దొరకాలో వారికే దొరుకుతుందనేది పెద్దలమాట .
                        
                 ఒక సెలవురోజున తను భద్రాద్రి వెళ్లాడట.గోదావరిలో స్నానంచేసి తడిబట్టను ఆరబట్టుకుంటూ ఇసుకలో అటు ఇటు తిరుగుతున్నాట్ట కాలితో ఇసుకను రేపు కుంటూ. ఇంతలో ఇసుకతోపాటు ఏదో లేచి అవతలపడింది. చూస్తే వెండినాణెం. దాని ప్రాచీనత, ప్రాధాన్యత అతనికి తెలియవు.వెండినాణెం అని మాత్రమే తెలుసు. తీసి జేబులో వేసుకున్నాడు. ఇదీ దాని చరిత్ర.
                           ఈవిధంగా ఆనాణెం  అతని దగ్గరికొచ్చి,తరువాత నాముందు ప్రత్యక్షమైంది. బంగారు నాణెంవలెనే ఇది కూడ సుమారు పదిహేను గ్రాముల బరువుంటుంది. ఒకవైపు సీతారామపట్టాభిషేకదృశ్యము ముద్రించబడివుంది.రెండోవైపు రామసేతు నిర్మాణ చేస్తున్న వానర సైన్యం కన్పిస్తుంది. వారి చేతుల్లో వివిధ ఆయుధాలు,పతాకలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. వారికి పై భాగంలో   శూన్యంలో   అంటే      ఆకాశంలో    राम सीतः అని స్పష్టంగా సంస్కృతంలో ముద్రించబడియుండటం మనం స్పష్టంగా గమనించవచ్చు. అంటే సేతునిర్మాణం చేస్తూ వానరసైన్యం సీతారాముల పేర్లను నినదిస్తున్నారని ముద్రాపకుల అభిప్రాయంగా మనం చెప్పకోవచ్చు. ఈనాడు మనకు మార్కెట్లోకి వచ్చిన పదిరూపాయల నాణానికన్నా ఒక్క వీసం పెద్దదిగా, పాతకాలపు మన వెండి రూపాయి అంత మందంగాను ఉందది.
                               బంగారు నాణెం లోని పట్టాభిషేక దృశ్యంలో సీతారాములతోపాటు ముగ్గురే కన్పిస్తుంటే వెండినాణెంలోని పట్టాభిషేకదృశ్యంలో నలుగురు కన్పిస్తున్నారు.



చిత్రం-2 లో దీన్ని చూడవచ్చు


                                   వెండినాణెం


           అయితే రెండు నాణాల్లోను హనుమంతుడు దాసాంజనేయుడై సింహాసనం చెంతనే దర్శనమిస్తున్నాడు.బంగారు నాణెంలో సింహాసనం చెంత కన్పించే ముగ్గురు కిరీటధారులుగా ఉండటం వలన లక్ష్మణభరతశతృఘ్నులుగా బావించవచ్చు. కాని వెండి నాణెంలో సింహాసనం వద్ద నలుగురు కన్పిస్తున్నారు.కొంచెం లోతుగా చూస్తే నాలుగోవ్యక్తికి తోక కన్పిస్తోంది.అంటే ఇక్కడ సుగ్రీవుడు కూడ సింహాసనం దగ్గర సోదరులతో సమానంగా గౌరవించబడ్డాడన్నమాట.
                    బంగారు నాణెం మీదున్న పట్టాభిషేకదృశ్యంలో సీతాదేవి రామునివలెనే సభకు అబిముఖంగా అభయహస్తధారిణియై ఉంటే వెండి నాణెం మీద మాత్రం రామచంద్రునివైపు తిరిగి ముకుళితహస్తాలతో నమస్కరిస్తున్నట్టు ముద్రించబడింది.
                               

 ఇక నాణాల రెండోవైపు పరిశీలిస్తే---చిత్రం---4 –గమనించవచ్చు.        

  


               బంగారు నాణెం వెనుకవైపు రామలక్ష్మణులు థనుర్బాణధారులై ఉండగా,వారి పైన గుండ్రంగా....ద్దమన జానక జవల హనుమతక.... ఇత్యాదిగా ప్రాకృతంలో(అనుకుంటా) వ్రాసిఉంది. వెండి నాణెంమీద రామసీతః అని సంస్కృతంలో వ్రాయబడింది. రెండింటిలోను సంవత్సరాలు 4 తోనే ప్రారంభమౌతున్నాయి.
            నాకున్న పరిమితజ్ఞానంతో,రామాయణం మీద,రాముని మీద ఉన్న భక్త్యభిమానాలతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఇంతకు ముందే ఇటువంటివి లభించి వుంటే,పరిశోధన జరిగివుంటే దయచేసి ఆ ఆకరువును తెలియజేయండి.జాతికి చరిత్రకు ఉపయోగపడే విషయంగా భావించి దీన్నిఅందిస్తున్నా.ఏ ఒక్కరికి ఇది ప్రయోజనం కల్గించినా నా ప్రయత్నం సఫలమైనట్లే భావిస్తాను.
                             
                        జయన్తి తే సుకృతినః రససిద్దాః కవీశ్వరాః  (9441056609)

****************************************************************





Sunday, 24 June 2012

కూనిరాగాలు


ఎద పొంగిన భావఝరులు
గుండెలోన సుళ్ళు తిరిగి
అక్షరాల    వెల్లువలై
పెదవులపై రవళిస్తే  కూనిరాగం ****!

ఆకాశంలో హరివిల్లు విరిస్తే
వాకిట్లో వడగళ్లు కురిస్తే
చిన్నారుల కన్నుల్లో సంతోషం మెరిస్తే
మనసు పాడుతుందొక ఆనందమయరాగం****!

పసిపాపల చిరునవ్వులు
పైరు పచ్చని పంటపొలాలు
పడుచుజంటల తీపి ఊసులు
కావ్యకల్పనకు పరిపోషకాలు ****!

అమ్మానాన్నల ఆప్యాయత
ఆలుబిడ్డల అనురాగం
పరిపూర్ణంగా పొందిన పురుషుడు
ఆలాపిస్తాడు  మోహనరాగం ****!


కూ  కూ అనే స్వరమే

కోయిల గానమై
పంచమస్వరంగా పరిఢవిల్లి 
ప్రసిద్ధమైందిగా కూనిరాగమై ****!

క్రౌంచిరోదనతో కదిలిన హృదయం
ఆలాపించింది మానిషాద శ్లోకం
ఆదికవి అందించిన అనుష్టుప్ ఛందం
కావ్యజగతికే యది భూపాలం ****!

విశ్వనాధ వంటి కవి
బాపిరాజు వంటి కథకుడు
శేషేంద్ర వంటి విమర్శకుడు
లభించడం తెలుగుజాతి సుకృతం ****!

మొల్ల రచించిన రామాయణం
పోతన అందించిన భాగవతం
వేమన చెప్పిన పద్యాలు
లేని ఇంట్లో మరి ఉన్నదేమిటి ****!

Wednesday, 20 June 2012

ఆ రోజుల్లో


                  ఆ రోజుల్లో వేసవికాలం ఎంత బాగుండేది. వయసు మీద కొచ్చాక ఎండలంటే భయమేస్తోంది కాని ఆరోజుల్లో వేసవి బాగుండేది. మాది కృష్ణాజిల్లా కురుమద్దాలి. అవును.విజయవాడ బందరు మార్గంలో రోడ్డుమీద కన్పించే ఊరే. రోడ్డుప్రక్కనే రెండు దేవాలయాలు వాటి మీద రంగులువేసిన పెద్దపెద్దబొమ్మలు ఆ దారిన వెళ్లిన వారందరికి గుర్తే . అదే మాఊరు. తాతగారు స్వాతంత్య్రసమరయోధులు.నాన్నగారు ఇంటికి పెద్దకొడుకు కావడం వల్ల తాతగారింట్లోనే కలిసుండేవాళ్లం.బాబాయి కుటుంబం వేరే ఊళ్లో ఉండేది.ఐదుగురు మేనత్తలు పెళ్లిళ్లై వాళ్ల వాళ్ల ఊళ్ళల్లోఉండేవారు.
                                         వేసవి సెలవలు వచ్చాయంటే బాబాయిగారి పిల్లలు, అత్తయ్యగారి పిల్లలు తాతగారింటికి వచ్చేవాళ్ళు. ఇంకేముంది.పిల్లలందరం కలిస్తే ముఫైఐదు నలభైమందిఅయ్యేవాళ్ళం. నిజం. ఉదయం పిల్లల చద్దన్నం కోసం అడ్డెడుగిన్నె దించేవాళ్ళు.ఆ రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్లే కాఫీలు తాగేవారు.టిఫిన్ కల్చర్ అప్పటికింకా రాలేదు. తొమ్మిది గంటలకల్లా చద్దన్నాలు తినేసి పక్కనున్న గుళ్ళొకో ,పంచాయతీపార్కులోకో దూకేసేవాళ్లం పిల్లలందరం.మాతోపాటు ఎదురింటివాళ్ల  పిల్లలు,పక్కింటివాళ్ల పిల్లలు కలిస్తే మరోపదిమంది .అంటే యాభైమంది . ఎవరికొచ్చిన, నచ్చిన ఆటలు వాళ్ళు ఆడుకొనేవాళ్ళు. ఇంటిప్రక్కన విశాలమైన గుడి ఆవరణ, రోడ్డుదాటితే పంచాయతీ పార్కు,దాని ప్రక్కనే చెఱువు ,దాని ఒడ్డున తూర్పుగా గవర్నమెంటు బడి ,ఉత్తరంగా తాళ్ళతోపు,ఇవన్నీ మా ఆటస్దలాలే.
                               మధ్యాహ్నం బోజనాలవగానే పెద్దవాళ్ళందరూ ఎండలకి ఆపసోపాలు పడుతూ తాటాకు విసనకర్రల్నినీళ్లల్లో ముంచుకొని విసురుకొంటూ పడుకుంటే పిల్లలందరం గుళ్లోకి జారుకొని నెమ్మదిగా రోడ్డెక్కెసేవాళ్లం. కొందరు గడవాసం భుజానేసుకొని ఈతకాయలు, దొరికితే సీమతుమ్మకాయల కోసం బయలుదేరితే, మరికొంతమంది కొత్తఆవకాయ పచ్చడిని బాదంఆకులో చుట్టి జేబులో పెట్టుకొని.ముంజికాయలకోసం పొలంగట్లు పట్టేవాళ్లం.   ముంజికాయలు తింటూ ఆవకాయ నంజుకుంటే కడుపులోనెప్పి రాదని తోటివాళ్ళు చెపుతుండేవాళ్లు. ఆవకాయ కారం నిక్కరు జేబునిండాకారి మరకలవడం,ఇంట్లోవాళ్లు తిట్టడం అవన్నీ వేరేసంగతి. ఈతకాయగెలల్ని తెచ్చి పశువులపాక ప్రక్కనే గుంటతీసి పాతిపెడితే,మగ్గి,తెల్లారేసరికి పండేవి. ఆ ఎచ్చి పచ్చి కాయల్నిఅందరం పంచుకొని తినడం గొప్ప ఘనకార్యంలా భావించేవాళ్లం. సాయంత్రం చల్లబడే సమయానికి ఎండగట్టిన చెరువులోకి తామరగింజలకోసం జట్లుజట్లుగా బయలుదేరేవాళ్లం. చెఱువులోని తామరపూలు ముదిరి ఎండి తామరడిప్పల్లోంచి గింజలు పడిపోయేవి. చెఱువు ఎండిపోయినప్పడు ఆ నల్లమట్టిలోంచి తామరగింజల్నిఏరుకొచ్చి కొట్టుకొని తినడం ఒకఆటగాఉండేది.ఎవరు ఎక్కువ గింజలు ఏరితే వాళ్లు గొప్పగా ఫీలయేవాళ్లం.ఇంటికొచ్చి బావిదగ్గర బక్కెట్లకొద్దీ చల్లని స్నానాలు. స్నానాలు అయ్యే సరికి అన్నాలు సిద్ధం. ఎక్కడ. పురిగట్టుమీద.అదొక అందమైన దృశ్యం.మసకవెన్నెల్లో,సంధ్యాదీపపు కాంతుల్లో పురిగట్టుమీద పిల్లలందరూ గుండ్రంగా కూర్చుంటే మధ్యలో అత్తయ్య కూర్చొని అందరికీ అడిగి అడిగి వడ్డిస్తూంటే కబుర్లు చెప్పుకుంటూ మసకవెలుతుర్లో అన్నాలు తినడం తలుచుకుంటే గొప్ప అనుభూతి. ఈరోజుల్లో moon light dinner అంటారేమో దాన్ని. వడ్లు పురి కట్టడానికి సిమెంటుతో చేసే చప్టాని పురిగట్టు అంటారు.     
                               ఆరోజుల్లో కుటుంబం అంటే తల్లిదండ్రులు ఏడెనిమిదిమందిపిల్లలు ఉండేవారు.ఉమ్మడికుటుంబవ్యవస్ధ పోయి కుటుంబనియంత్రణ పెరిగిన ఈకాలంలో ఇవన్నీ ఎక్కడ కన్పడతాయి కధల్లో తప్పితే.ఏదో నష్టపోతోందన్పిస్తోంది ఈతరం. ఇంట్లోఉన్నఒక్కపిల్లాడికి ఆడుకోవడానికి చెల్లినో,తమ్ముణ్ణో ఇవ్వడానికే లెక్కలు చూసుకుంటున్న దంపతులున్న కాలమిది.
                               అన్నాలు అయిపోగానే మళ్లీ ఆటల్లోకే. ఆడపిల్లలు దాగుడుమూతలు,వెన్నెలకుప్పలు ఆడుకుంటుంటే,మగపిల్లలు పక్కనే ఉన్నపార్కులే కోతికొమ్మచ్చులాడేవాళ్లం. వెన్నెలవెలుగులో కోతికొమ్మచ్చులు. రాత్రి తొమ్మిది పదింటిదాక ఆడి,అలిసి, అప్పుడు ఆ ప్రక్కనే ఉన్నచాకలి చెఱువులో ఒళ్లు, కాళ్లు కడుక్కొని వచ్చి, గుళ్లో మండపంలో పెట్టుకున్న పక్కబట్టలు తీసి దుప్పటి మడతకూడ విప్పకుండా పరచి పడుకంటే  సూరీడు బారెడు పైకొచ్చి చురుక్కు మనిపిస్తుంటే, ఉలిక్కిపడి లేచి కూర్చునేవాళ్లం .కొద్దితేడాతో వేసవి సెలవలన్నీ ఇలాగేగడిచిపోయేవి.కోతి కొమ్మచ్చిలాడే సమయంలో ఎక్కడో కొమ్మల్లోఉన్నతేనెపట్టు కదిలి తేనెటీగలు దాడి చేయడం,రాత్రిపూట చెఱువులో దిగేటప్పుడు కనపడక  బురదకొయ్యమీదో, బావురుకప్ప మీదో కాలేస్తే అది నెత్తురొచ్చ్చేటట్లు గీరి నీళ్లల్లోకి జారిపోతే,పాము కరిచింది చచ్పిపోతానేమోనని తెల్లవార్లు భయం భయంగా పడుకోవడం తలుచుకుంటుంటే ఇప్పుడు నవ్వువస్తుంది . విచిత్రమేమిటంటే అంతమందిఉన్నాకొట్టుకోవడాలు,పోట్టాడుకోవడాలు ఉండేవికావు.అందుకే పెద్దవాళ్లుకూడా ఆడుకుంటారులే అని వదిలేసేవాళ్లు .అప్పుడప్పుడు పిల్లలమధ్య కీచులాటలొస్తే  అలిగి దూరంగాపోయి, మళ్లీ కాసేపటికొచ్చి జట్టులో కలిసిపోయేవాళ్లు కాని కక్షలకు,కోపతాపాలకు తావుండేదేకాదు. అందుకే భాల్యమెంత మధురం అనిపిస్తుంది ఆరోజుల్ని తలుచుకుంటే.
          ------

Saturday, 16 June 2012

రామాయణము -రమణీయకధనాలు -2 -స్వయంప్రభ


                                                     

                           స్వయంప్రభ       

                            

                                  
                  శ్రీ  రామకధ తెలిసిన చాలామందికి కూడ వెంటనే గుర్తుకు రాని  పాత్ర స్వయంప్రభ.  కాని రామ కధాగమనానికి అవసరమైన విశిష్ట పాత్రల్లొ స్వయంప్రభ కూడ ఒకటి. అసలు రామాయణంలోని  పాత్రల్ని విమర్శక దృష్టితో పరిశీలిస్తే రెండువిధాలుగా విభజించవచ్చు.
   1.రామునితో చరించే పాత్రలు         2. రాముని కొఱకు జీవించే పాత్రలు.    
మరొకరీతిగా విశ్లేషిస్తే       1.విశిష్ట పాత్రలు.               2. విశేష పాత్రలు

     ఇంకొక పద్దతిలో రామునితో -            1.ప్రత్యక్ష సంబంధం కలవి.          2.పరోక్ష సంబంధం కలవి
స్వయంప్రభ రామకధతో పరోక్ష సంబంధంగల పాత్ర.
 శ్రీరామచంద్రుని సేవలో జీవితాన్ని పండించుకొన్న యోగిని.           
స్వయంప్రభ. సీతాన్వేషణలో రాత్రింబగళ్ళు శ్రమించి అలసిపోయి ఆకలిదప్పులతో పీడించబడుతూ ఆశ్రయం కోరిన వానరసేనను, ఆదుకొని వారికి  అతిధి సత్కారాలందించి, తిరిగి రామకార్యసాధనకు వలసిన జవసత్త్వాలను వారి కందించి రామసేవకులకు సేవచేసి,పరోక్షంగా రామసేవను చేసుకొని తరించిన దివ్యప్రభ ఈ స్వయంప్రభ.
  మహాభాగాం   తాపసీం ధర్మచారిణీం        తాపసీం ధర్మచారిణీం
           ------ జ్వలంతీమివ తేజసా     -అని స్వయంప్రభ ను పరిచయం చేస్తాడు మహాకవి వాల్మీకి.  ఆమె నివసించే వనాన్ని-"వనముత్తమం ,--“- కాంచనంవనం  ----మహద్దరణ్యం- మహావనే–“ వనందుర్గం అని సైతం వర్ణించి ఆమెను స్వయంగా కాంతివంతమైన పాత్రను చేశాడు ఆదికవి. "తాపసీ ధర్మచారిణీ అనే విశేషణం ఆమెకు పెక్కుసార్లు వాడబడింది.
              తమకు మేలుచేసిన ఆ తపస్వినికి తమ వల్ల కలిగే ప్రయోజనం ఏమైనా ఉంటే ఆజ్ఞాపించ వలసిందని ఆంజనేయుడు  ప్రార్ధించినపుడు స్వయంప్రభ –-“  చరంత్యా మమ ధర్మేణ న కార్యమిహ కేనచిత్.(ధర్మమార్గంలో చరించే నాకు తరుల వల్ల కలిగే పని ఏముంటుంది) అంటుంది. అంటే సన్మార్గంలో నడిచేవారికి ఇంకెవరితోనూ చేయించుకొనే పని ఏమీ ఉండదు అనే ఆత్మవిశ్వాసం ఆమెది. ధర్మచారిణీ అన్న పదంలోనే వాల్మీకి మనోభావం స్పష్టం. వన్నె తరగని ముఖవర్చస్సు ,వాడని శరీరము, దుర్నిరీక్ష్యమైన తేజస్సు స్వయంప్రభ వి. జ్వలంతీమివ తేజసా అన్నవాల్మీకి పల్కులలోని అంతరార్దమిదే.
                           ఆంజనేయుని అభ్యర్ధనతో ప్రసన్నురాలైన స్వయంప్రభ, హేమా విశ్వకర్మల వృత్తాంతంతో ముడివడిన తన గాధను ప్రస్తావిస్తుంది.    స తు వర్షాణి సహస్రాణి తప స్తప్త్వా మహావనే “–బ్రహ్మ అనుగ్రహంతో శిల్ప శాస్త్రజ్ఞానాన్ని పొంది, అపురూపమైన  కాంచనభవనాన్న నిర్మించాడు మయుడు. హేమతో ఇష్టోపభోగాల ననుభవిస్తూ ఎక్కువకాలం భూలోకంలోనే నివసించసాగాడు. మయుని సుఖాన్ని చూసి కన్నుకుట్టిన దేవేంద్రుడు వజ్రాయుధంతో మయుని సంహరించగా, ఒంటరియైన హేమ ఈ వనాన్ని స్వయంప్రభ కిచ్చి తాను వెళ్లిపోయింది. ఆనాటి నుంచి తాను తపోదీక్షలో ఉంటూ వనాన్ని రక్షిస్తున్నానని చెపుతుంది.                

              స్వయంప్రభ  ఆంజనేయునితో. ఇదం రక్షామి భవనం హేమయా వానరోత్తమ. దుహితా మేరుసావర్ణే  రహం తస్యా స్వయంప్రభా (ఆనాటి నుండి హేమకు సంబంధించినదిగానే ఈవనాన్ని కాపాడుతున్నాను. మేరుసావర్ణి కుమార్తె యైన నన్ను స్వయంప్రభ అంటారు). వానరోత్తమ అని సంబోధించిన స్వయంప్రభ తో ఆంజనేయుడు రామకార్యాన్ని ప్రస్తావించి,సమయం గడిచిపోవడంవలన తమ ప్రాణాలకు ముప్పువాటిల్లుతుందని, రామకార్యం భగ్నమౌతుందని, అందువలన తమకు మార్గనిర్ధేశం చేయవలసిందని ప్రార్ధిస్తాడు.
                      కాని ఈ బిలములో ప్రవేశించిన వారు తిరిగి ప్రాణాలతో బయట పడటం అసాధ్యమని , కాని తన తప:ప్రభావం చేత  రామకార్యార్ధం వారినందరిని బయటకు పంపిస్తానని హామీ యిచ్చి వానరసేననంతటిని ఎవరికివారు తమచేతులతో కళ్లు మూసుకోవలసిందిగా ఆజ్ఞాపిస్తుంది స్వయంప్రభ. నిమీలయతి చక్షూంషి సర్వే వానర పుంగవా: ”-ఆవిధంగా వానరశ్రేష్టులందరూ తమ చేతులతో కళ్లను మూసుకోని తల్లిగర్భంనుండి బయటకొచ్చిన పిల్లలవలే ఆ ఋక్షబిలం నుండి బయటపడి  తిరిగి సీతాన్వేషణ మనే బృహత్కార్యానికి సిద్ధపడి రామసేవకు పునరంకితమయ్యారు. ప్రయాణంలో దారితప్పి, ప్రాణాపాయస్ధితిలో ఉన్న వానరసేనకు తిరిగి జవసత్త్వాలను ప్రసాదించి వారికి మార్గనిర్ధేశం చేసి, ఆవిధంగా పరోక్షంగా రామసేవలో పునీతురాలైన మహాయోగిని స్వయంప్రభ. 
                ఆలోచిస్తే రామాయణంలో ఆదికవి తన పాత్రలకు పెట్టిన ప్రతిపేరు సార్ధకమే. ఈ విషయాన్ని ప్రత్యేక వ్యాసంలో ప్రస్తావించుకొందాం. ఆవిధంగానే  ఇక్కడ స్వయంప్రభ కూడ అన్వర్ధనామధేయ.తనకు తానుగా స్వయంప్రకాశమానయైన జ్ఞానయోగిని ఆమె. ఈ వృత్తాంతాన్ని వాల్మీకి రామాయణం కిష్కింధకాండలో చూడవచ్చు.
                   ఘట్టాన్ని కేనోపనిషత్తు లోని అంశాలతో పోల్చి విశ్లేషించిన విమర్శకులున్నారు .       స్వయంప్రభ గాధ చదివేటప్పుడు కేనోపనిషత్తు గుర్తుకొస్తుంది. ఆమె గుహ నుండి వానరులు వెలువడాలంటే కళ్లు మూసుకోమనడం పదాలకు ప్రతిధ్వని. యదేతత్ విద్యుతో వ్యద్యుత్తదా ఇతీన్యమీనిషదా-- కంటిలో మెరుపువలే క్షణకాలంలో మెరిసిన మెరుపు కన్పించి అది అదృశ్యమైంది.
                స్వయంప్రభ వృత్తాంతం కేవలం అపార్ధివతత్త్వ కధనంగానే కాక ఈ  మయా మయ విశ్వంలో మీమాంసాశాస్త్రంగా, యోగశాస్త్రపాఠ్యాంశంగా, సాహిత్యంలో ఒక కళాఖండంగా భావించాలి. అన్న ప్రముఖ విమర్శకులు ఇలపావులూరి వారి పల్కులు అక్షరసత్యాలు.
                 రామచంద్రుని దర్శనం ప్రత్యక్షంగా పొందలేకపోయినా రామసేవకులకు సేవచేసి, రామసేవాభాగ్యాన్ని పొందిన ధన్య చరిత, జ్ఞానయోగిని స్వయంప్రభ.ధర్మమార్గంలో జీవించేవారికి ఏ ఇతరుల సహకారము అవసరం లేదని నిరూపించిన పాత్ర స్వయంప్రభ. చరంత్యా మమ ధర్మేణ నకార్యమిహ కేనచిత్ –“అన్న పలుకులు స్వయంప్రభ వే కాదు, ధర్మాన్నే నమ్ముకొని  అరణ్యమధ్యం లో ఆశ్రమవాసియై జీవిస్తున్న  వాల్మీకి మహర్షి వే నని భావించవచ్చు.
     ఆథారాలు  :--
1.            1 శ్రీమద్వాల్మీకి రామాయణం కిష్కింధ 50,51                                2.రామాయణం లో స్త్రీ పాత్రలు .పు.85
.           ******************************************                                      _____  *****______

Sunday, 10 June 2012

రామాయణము – రమణీయ కధనాలు - 1 -శ్రవణుడు

                        


                       మునికుమార వృత్తాంతము -శ్రవణుడు


           వాల్మీకి రామాయణంలో శ్రీరాముని  ప్రాదుర్భావానికి ముందే దశరధుని జీవితంలో సంభవించిన విచిత్ర విషాద సంఘటన –మునికుమారవృత్తాంతము. రాముడు వనవాసానికి వెళ్లిన తర్వాత దశరధుడే ఈ వృత్తాంతాన్ని కౌసల్యకు చెప్పుకుంటాడు.

                అరవైవేలసంవత్సరాలు రాజ్యపరిపాలన చేసి సమస్త భోగాలను అనుభవిస్తూ కూడా పుత్రసంతానము లేక నిస్సారమైన జీవితంలోకి వేట ను ఆహ్వానించి,ఆ వ్యసనానికి బానిసయై రాత్రి పగలు తేడా లేకుండా గడపసాగాడు అయోధ్యానాధుడు.
                                              ఒకనాటి సాయంత్రపు వేళ సరయూనదీతీరంలో శబ్దవేధి విద్యను సాధన చేస్తున్న దశరధుఢు -- తల్లిదండ్రుల కోసం మంచినీళ్లు తీసుకెళ్లడానికి వచ్చి నీళ్లు ముంచుకుంటున్న మునికుమారుణ్ణి గజ భ్రాంతి తో తన బాణానికి బలి చేశాడు. బిడ్డను కోల్పోయిన ముని మరణావసాన సమయంలో—దశరధుడు తనకు కల్గించిన పుత్ర శోకానికి విలపించి-కోపించి--,
                     ‘’ఏవం త్వం పుత్ర శోకేన రాజ న్కాలం కరిష్యతి ‘’
-అని శపించి సపత్నీయుతంగా మరణించి స్వర్గప్రాప్తి పొందాడు. పుత్రసంతానం కోసం పరితపిస్తున్న దశరధునకు ఆ శాపం వరంగా విన్పించి ఆనందించాడా రోజున. కాని రాముడు అడవికి వెళ్లిన తర్వాత ఆ శాపం లోని చరమాంశ దశరధుని ప్రాణాలను బలితీసుకొంది. ఆంటే రామ వనవాసానికి కైక వరాలు ప్రధానకారణంగా కన్పిస్తున్నా-మునిశాపమే ఇచ్చట ప్రబలమైంది.
               వాల్మీకి ఆ మునిబాలకుని తాపసుడని, తపోధనుడని సంబోధించాడే కాని నామకరణం చేయలేదు. అంతేకాక తాను బ్రాహ్మణుడను కాదని ,శూద్రస్త్రీ యందు వైశ్యునకు పుట్టినవాడనని ,అందువల్ల దశరధునకు బ్రహ్మహత్యాపాతకం తగలదని చెప్పుకున్నాడు వాల్మీకి రామాయణంలో మునిబాలకుడు దశరధునితో.
                            ఈ మునికుమారవృత్తాంతం ఇతర గ్రంధాలలో వేరువేరు పేర్లతో కన్పిస్తోంది అగ్నిపురాణంలో చూస్తే యఙ్ణదత్తుడనే పేరున ఈకధ కన్పిస్తోంది. శ్రీమద్రామాయణం పశ్చిమోత్తర శాఖీయపాఠం ‘”లోను,రంగనాధ రామాయణంలోను అదేఫేరున ప్రస్తావించబడింది. తులసీదాసు తన రామచరితమానస్ లో సరవన అని మునిబాలకుని కధను ప్రస్తావించాడు. ఇది శ్రమణ శబ్దానికి వికృతి. హిందీ శబ్దసాగర్  బౌద్ధమత సంప్రదాయంలో నుండి శ్రమణ కధ వచ్చి మనలో కలిసి ఉండవచ్చని భావించింది.
                                          ఇండో-ఆంగ్లికన్ రచయిత్రి తోరోదత్తు సింధు అనే పేరున ఈ పితృభక్తుని కధను ప్రకటించింది. జాతిపిత మహాత్మాగాంధీ శ్రవణపితృభక్తి నాటకం చేత తో స్ఫూర్తిని పొందినట్లు ఆత్మకధ లో వ్రాసుకున్నారు.
“The book and the picture left an indelible impression on my mind. Here is an example for  you  to copy’ ”I said  to   myself  the  agonized comment of the parents over  sravana’s  death is still Fresh in my memory .’శ్రవణశ్రావణ  శబ్ధాలు సమానార్దకాలుగా ప్రయోగించబడ్డాయి.
                                      ఈ విధంగా రామాయణంలో నామమాత్రంగా కన్పించిన మునికుమారుని వృత్తాంతం అనంతర కాలంలో చిగురులు తొడిగి అద్భుతేతివృత్తమై ఎందరో మహాపురుషులకు ఆదర్శప్రాయమైంది.’ Sindhu ‘ deals with the eternal theme of parental love’”అన్నారు విమర్శకులు. ‘’పితృభక్తి కి ప్రతీకగా శ్రవణుని పేరు చెప్పుకోవడం లోకంలో అలవాటుగా మారింది. కావడిలో  తల్లిదండ్రులను మోస్తూ తీర్ధయాత్రలు చేయించే పితృభక్తి పరాయణుడుగా  శ్రవణుడు చదువరులకు ప్రత్యక్షమౌతాడు. కాని ఇది వాల్మీకి సృష్టి కాదు. శ్రావణ పితృభక్తి,” “ శ్రావణచరిత్ర “ “,శ్రావణము వంటి  కావ్యాలు వ్రాసిన ఆధునిక కవుల ప్రయత్నఫలితమే.  
                                    శ్రమణ శబ్దమే శ్రవణ గా రూపాంతరం చెందిందని , శ్రమణ వృత్తిలో జీవించే మునికుమారుని వృత్తమే శ్రావణచరిత్ర గా మారిందని – కొందరు భావిస్తే, దశరధుడు వేటకై వెళ్లింది-వర్షాకాలం -అనగా శ్రావణమాసం. ఈ శ్రావణ నామానికి, ఆ శ్రావణమాసం ఏ  మాత్రమైనా దోహదము చేసినదేమో నని అర్ధోక్తిలో వదిలేశారు శ్రీమాన్ రాళ్లపల్లి వారు.
                       వినికిడి అనగా శ్రవణ ప్రధానమైన అస్త్రవిద్యతో-అనగా శబ్దవేధి తో కొట్టబడిన మునికుమారుని కరుణామయగాధ శ్రావణమై,ఆ మునికుమారుని పేరు శ్రవణుడుగా-. శ్రావణుడుగా-మారిందని భావించవచ్చు. ఏమైనా శ్రావణుని చరిత్ర  పితృభక్తి కి ప్రతీకగా లోకంలో నిలిచిపోయింది.
ఆధారాలు
1.శ్రీమద్వాల్మీకి రామాయణం           
 2.Puranic  Encyclopedia
3.The Selected Works of Mahatma Gandhi – Vol-1                                
4.Toru Dutt- A.N.Dwivedi