Sunday, 7 May 2017

పుణ్యక్షేత్రాల్లో చాగి వారు - నృసింహతీర్థం (వేదాద్రి ).


నాల్గవ ప్రకరణం

          
             

            పుణ్యక్షేత్రాల్లో  
       
                                                                                        చాగివారు
                     
                     నృసింహతీర్థం  (వేదాద్రి ).
                            
                                చాగివారి పాలన లో విలసిల్లిన మరొక తీర్థరాజం నృసింహతీర్థం. ఇదే నేటి వేదాద్రి.  శ్రీ మన్మగణపతి దేవరాజు వేయించిన క్రీ.శ. 1259 లో వేయించిన  వేదాద్రి శాసనం లో ఈ పుణ్యతీర్థాన్ని  నృసింహతీర్థ మని  ప్రస్తావించడం జరిగింది. నరసింహవర్థన బిరుదాంకితుడై , గుడిమెట్ట సామ్రాజ్యాన్ని రెండు దశాబ్దాలకు పైగా పరిపాలించిన రెండవపోతరాజు                                                                                              శ్రీ యోగానంద నరసింహ పాదపద్మారాధకుడుగా పొగడబడ్డాడు. ఈ మహనీయుడు వేయించిన ముక్త్యాల శాసనం లో  అనేక ధర్మకార్యాలు ప్రస్తావించబడ్డాయి. కాని  వానిలో వేదాద్రి నారసింహుని ప్రసక్తి  కన్పించక పోవడం ఆశ్చర్యాన్ని కల్గించే విషయమే. కాని లోతుగా ఆలోచిస్తే గుడిమెట్ట రాజభవనానికి చేరువలో ఈ నారసింహునికి చాగివారు అధికమొత్తం లోనే ముడుపులు చెల్లించి ఉంటారు. వాటిని శాసనాల్లో పొందుపరచి ఉండవచ్చు. కాని  అవి నేడు కన్పించడం లేదు. కారణాలు కొల్లలు. పెనుగంచి ప్రోలు యుద్ధానంతరం ఈ ఆలయం పై మహమ్మదీయుల దాడి జరిగి ఉంటుంది. అప్పుడు జరిగిన మారణ కాండ లో ఈ శాసనాలన్నీ  ఛిద్రమై ఉండవచ్చు. క్రీ.శ 1259 లో చాగిమన్మగణపతి దేవరాజు వేయించిన శాసనం ఒకటి ఇప్పటికీ వేదాద్రి ఆలయ ప్రాంగణం లో కన్పిస్తోంది. ఈ శాసనానికి రెండోవైపు ఫిరోజ్ షా 1417 లో వేయించిన శాసనం ఉంది . ఈ శాసనం ఉండబట్టే  దీనికి రెండోవైపున ఉన్న చాగి మనుమగణపతి వేయించిన శాసనం ఛిద్రం చేయబడలేదని మాకు అనిపిస్తోంది. చరిత్ర తెలిసిన ఎవరైనా అలాగే భావిస్తారు.
         చాగి మనుమ గణపతిదేవుడు నతవాడి సీమ ను పరిపాలిస్తూ , ప్రభవ నామ సంవత్సర జ్యేష్టఅమావాస్య నాటి సూర్యగ్రహణ కాలమున కృష్ణవేణీ తీరమందుగల నరసింహతీర్థనిలయుడైన

                                                -75-


           ప్రతాప శ్రీనరసింహ దేవరకు హవిర్బిల్వర్చనల కొఱకు  వేములపల్లి గ్రామాన్ని ధారపోశాడు. ఈ గ్రామానికి హద్దులు గా తూర్పున సున్నంకొండ ని ,ఆగ్నేయం లో మొసలిమడుగు  ని, దక్షిణం లో పోంకలవాగు కూడలిని , పడమర లో కృష్ణానది ని పేర్కొన్నారు. ఇది కాక దేవాలయము నుండి  నదిలోనికి దిగే మెట్లమార్గం ప్రక్కన మరొక శిథిల శాసనం  రంగరాజు   వేయించింది మరొకటి కన్పిస్తోంది. ఈ రంగరాజు చాగితరము లో చివరితరము వాడు. ఈ శాసనం లో గుండుబోయినపాలెం వేదాద్రి  మధ్యగల ప్రదేశాన్ని  పచ్చిక బీడు గా  దానము చేసి  సాలగ్రామ నరసింహునకు ధారవోసిన దానశాసనమిది. ఇది ఎక్కువభాగం విరిగిపోయి, ఉత్సవాల సమయం లో వేసే తెల్లసున్నం కూడ వేయించుకొని, శిథిలమై  కన్పిస్తుంది.
               



                                         ఇవి కాక మరి మూడు శాసనాలు ఆలయ ఆవరణ లోనే గుర్తించలేనంతగా నాశనమై కన్పిస్తున్నాయి.  (ఇప్పుడు అవి కూడ తొలగించబడి ఉండవచ్చు.) మహాకవి శ్రీనాథ కవిసార్వభౌముడు తన కాశీఖండం లోని  ఇష్టదేవతాస్తుతి లో వేదాద్రి నరసింహ విపుల వక్షస్థలీ కల్హారమాలికా గంథలహరి తన లోని కవిత్వవికసనానికి కారణాలలో ఒకటి గా చెప్పుకున్నాడు.   కవిత్రయం లో చివరివాడైన ఎఱ్ఱాప్రగ్గడ ఈ ఆలయం లో మూడు రోజులు బసచేసి , తురుష్కుల దాడులచే ఆలయాన్ని వదిలి భయం తో పారిపోయిన పూజారుల ను రావించి ,  శ్రీ స్వామి వారికి మహాసంప్రోక్షణాది కార్యక్రమాలు చేయించి , నిత్యార్చనలు యథావితిగా జరుగునట్లు  ఏర్పాట్లు చేసినట్లు ఆ శిథిల శాసనాల్లోని విషయమని స్థలపురాణం చెపుతోంది.
                                       -76-
  స్థలపురాణం  :-     బ్రహ్మాండ పురాణోక్తమైన స్థలపురాణాన్ని శ్రీ మందపాటి రామకృష్ణకవి వేదాచల మాహాత్మ్యము  అనుపేర పద్యకావ్యం గా రచించి , ముక్త్యాల జమీందారైన రాజా వాసిరెడ్డి భవానీ ముక్తేశ్వర ప్రసాదునాయుడు గారికి అంకితమిచ్చారు. ఈ వేదాద్రి కృష్ణజిల్లాలో విజయవాడ  - హైదరాబాదు జాతీయ రహదారి లో  చిల్లకల్లు నుండి దక్షిణం గా పదికిలోమీటర్ల దూరం లో కృష్ణానదీతీరం లో వెలసిన పుణ్యతీర్థం. ఇచ్చట నారసింహుడు జ్వాల సాలగ్రామ  వీరయోగానంద లక్ష్మీనరసింహస్వామి గా పంచరూపాత్మకుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. దీనికి పంచనారసింహక్షేత్రమనే ప్రసిద్ధి కలదు.
                    


                        బ్రహ్మదేవుని వద్ద నుండి వేదాలను దొంగిలించిన సోమకాసురుని మత్స్యావతారుడై శ్రీమన్నారాయణడు సంహరించి., వేదాలను ఉద్ధరించాడు. శ్రీ మహావిష్ణువు చే రక్షించబడిన వేదములు పురుషరూపముల దాల్చి ,ఆ శ్రియ:పతి ని పలుఱీతులుగా స్తుతించి , కష్టముల నుండి తమ్ము కడతేర్చి నందుకు కొనియాడి , ఎల్లవేళలా తమ శిరస్సులపై నెలకొని తమను తరింపచేయవలసినది గా ప్రార్థించినవి.   అందుకు సంతసించిన ఆదినారాయణుడు నృసింహావతారము నందు హిరణ్యకశిపుని సంహరించి ,ప్రహ్లాదుని రక్షించిన యనంతరము పంచరూపాత్మకుడనై మీ శిరముల వసించెదను . అప్పటి వరకు మీరు కృష్ణ వేణీగర్బమున సాలగ్రామరూపమున వర్తిల్లుడు. మీరు కోరినట్లు కృష్ణవేణియు ప్రతినిత్యము  తన పావన జలము తో నన్ను అభిషేకించ ఉత్సహించుచున్నది.  కావున మీయందరి   కోరికలు ఏకకాలమున తీరగలవని వరమిచ్చెను.
                     
          


                                         శ్రీ జ్వాలానరసింహుని సన్నిథి
                                అనంతరము నృసింహావిర్భావమ జరిగి,హిరణ్యకశిపుని సంహరణానంతరం ఆ ఉగ్రనరసింహుడు శ్రీ జ్వాలానరసింహుడై ఈ వేదాద్రి శిఖరాన వెలసినట్లు స్థలపురాణం చెపుతోంది.

                                                   -77-
శ్రీ సాలగ్రామ నరసింహుడు బ్రహ్మదేవుని ప్రతిష్ట కాగా శ్రీ యోగానంద నరసింహస్వామి భారద్వాజాది మహర్షుల ప్రతిష్ట . గరుడాదుల ప్రార్థన చేగరుడాద్రి పై శ్రీ వీరనరసింహస్వామి గా కొలువు తీరాడు స్వామి. యోగనిష్ట లో నున్న స్వామి కళ్యాణానికి సంసిద్దుడు కాడని భావించి మహర్షి ఋష్యశృంగుడు ధర్మపత్ని శాంతాదేవి తో కలసి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శ్రీయోగానంద నరసింహస్వామి పీఠం పై నే ప్రతిష్టించి లోకకళ్యాణం కోసం  శాంతికళ్యాణం నిర్వహించాడు. అదే సంప్రదాయం తో  ఇప్పటికి కూడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రతిసంవత్సరం వైశాఖశుద్ద ఏకాదశి మొదలు పంచాహ్నికము గా తిరుక్కళ్యాణము నిర్వహించబడుతున్నది. ధనుర్మాసం ,ముక్కోటి ఏకాదశి ,పవిత్రోత్సవాలు ఇక్కడ జరిగే ప్రత్యేక ఉత్సవాలు.
                     


                                               శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి

                    ఈ ఆలయం లోని ప్రధాన మూర్తి శ్రీయోగానందనరసింహస్వామి.ఈ స్వామి యోగ పట్టసమాసీనుడై , మోకాళ్ల  పై చేతులుంచుకొని , చతుర్భుజు డై శంఖచక్రాలతో, యోగానందుడై, ఆశ్రయించి ఆర్తులను ఆదుకొంటున్నాడు. దీర్ఘవ్యాధులు , మానసిక రుగ్మతలు , ఈ స్వామి సన్నిధి లో తొలగిపోతాయని భక్తుల గాఢ విశ్వాసం.తియ్యని కృష్ణ నీరు ,చల్లటి ఏటిగాలి , నిశ్శబ్ద మైన వాతావరణం , రమ్యమైన అటవీ ప్రకృతి , రోగార్తులను  సేద దీరుస్తాయి. మూలవిరాట్టు  పడమటి దిశ గా కృష్ణానది కి అభిముఖం గా ఉంటాడు. ఏదురుగా సాలగ్రామ నరసింహుడు కృష్ణవేణి గర్భం లో కొలువు తీరి ఉంటాడు. తూర్పు వైపు గాలిగోపురం నుండి ఆలయం లోకి ప్రవేశిస్తాము . ఉత్తరం గా ఎతైన  వేదగిరి పర్వతం. దీని పైనే జ్వాలానరసింహుడు కొలువు దీరి ఉన్నాడు. ఈ జ్వాలానరసింహస్వామి కి పైన ఎటువంటి ఆచ్చాదన ఉండదు. ఆచ్ఛాదన వేయడానికి ప్రయత్నించి నప్పుడల్లా ఏదో  ఒక అవాంతరం వచ్చిఆగిపోయేదని పెద్దవాళ్ల మాట. ముందు వైపు మాత్రం ముఖమండపం టుంది. క్రీ.శ 12 వ శతాబ్దానికే  అడవి మధ్యలో నిర్మించబడిన ఈ ఆలయం నదీతీరం లో ఉండటం వలన , ఆనాడు  నదీప్రయాణాలే సాధారణం అవ్వడం వలన 12,13 శతాబ్దాల్లో తురుష్కుల  దాడులు ఈ ఆలయాన్ని తాకే ఉంటాయి. కాబట్టే ఇంత ప్రాచీనమైన ఈ

                                                -78-
ఆలయం లో ఆనాటి రాజుల నిర్మాణాలను  నిరూపించే  కట్టడాలు ఏమీ కన్పించడం లేదు. మూలవిరాట్టు సాలగ్రామ శిల. తొలిరోజుల్లో ఆలయం తూర్పు దిక్కుకే తిరిగి ఉండేదేమో నని,తురుష్కుల దాడులనుండి తప్పుకోడానికి గర్భాలయాన్ని కొంతకాలం మూసివేసి , అనంతరం  జరిగిన మార్పుల్లో విగ్రహం పడమర కు మరల్చి ఉండవచ్చు. స్వామివారి సోమసూత్రం (అనగా అభిషేక జలం బయటకు వెళ్లే తూము వంటి మార్గం ) సాథారణం గా మూలవిరాట్టు కు ఎడమవైపు ఉంటుంది. కాని ఇప్పుడున్న ఆలయం లో సోమసూత్రం మూలవిరాట్టు కు కుడివైపు ఉంది. ఇది కూడ మన సందేహానికి బలం చేకూరుస్తోంది. విగ్రహాన్ని కొంతకాలం రక్షించి మరల పున:ప్రతిష్ట చేసేటప్పుడు జీవనదియైన కృష్ణానదికి అభిముఖం గా చేసిఉంటారు.  తురుష్కులకు భయపడి  శ్రీరంగేశుడు శ్రీరంగం నుండి తిరుపతి కే వచ్చాడు. ఎందరో భక్తులు తమ స్వామి  మూల విరాట్టులను కాపాడుకోవడానికి బావుల్లో పడేసిన ఘట్టాలు , నేలలో దాచిపెట్టిన ఘట్టాలు చరిత్ర లో కోకొల్ల్లలు కొండవీడు గోపీనాథస్వామి  వృత్తాంతం మనకందరకు తెలుసు.  (చూ.divyakshetralu.blogspot.com. కొండవీడు గోపీనాథస్వామి ఆలయం.) ఏమైనా ఊహలు కాదు నిజాలు కావాలి .కాని అవి తెలియవు. చరిత్ర లో నలిగిపోయాయి.
                  


  


                        కృష్ణవేణీ మధ్యస్థ      శ్రీ సాలగ్రామ నరసింహస్వామి
               

                        కొండపైన జ్వాలా నరసింహునికి కుడివైపు దక్షిణం గా ఒక చిన్న గుహాద్వారం కన్పిస్తుంది. అది ఇప్పుడు పెరిగిన రాళ్ళ తో, కూలిన మట్టిపెళ్ళలతో ప్రవేశ యోగ్యం గా లేదుగాని . పూర్వకాలం లో ఈ గుహలో నుండి రెండుమైళ్ల దూరం లో గల  గరుడాద్రి కి మునులు ప్రయాణం చేసేవారని, ఈ గుహలోపల యోగానందుని అపురూపమూర్తి ఉందని వెనుకటి తరాల వాళ్లు చెప్పుకొనేవారట. గరుడాద్రి పై వీరనరసింహుడు స్వయంభువు గా దర్శనమిస్తాడు. కొండలోనుండి ముందుకు చొచ్చుకొచ్చిన వీరనరసింహుడు ఊర్ధ్వపుండ్రాలతో  వివృతాస్యుడై శతృకోటికి భయాన్ని ,భక్తకోటికి ఆనందాన్ని కల్గిస్తుంటాడు. ఈ గుహల్లో అనేక ప్రదేశాలు యోగులు ,సాధకులు ఎక్కువకాలం కూర్చోవడం వలన , అనుకోవడం వలన అరిగి పోయి నున్నగా కన్పిస్తాయి.
                          
                                                -79-
  ఈ కొండకు దగ్గరలోనే శిథిల దుర్గమొకటి కన్పిస్తుంది. దీన్ని రంగరాజు కొండ యని స్థానికులు పిలుస్తున్నారు. ఇది గుడిమెట్ట  రాజ్యం లోని చివరి మజిలీ అయ్యుండవచ్చు.
                       ఇక్కడి శాసనాలు కొన్ని గుడి లోనికి చేర్చబడినట్లు చెపుతున్నారు. వేదాద్రి ఆలయం లో లభిస్తున్న  క్రీ.శ 1417  నాటి శాసనం లో బహమనీసుల్తాన్ ఫిరోజ్ తన సోదరుడు వాడపల్లి  (వజీరాబాద్)  లో ఉన్న వాని పేర ఒక చెఱువు తవ్వించినట్లు గా చెప్పబడింది.( కృష్ణాగెజిటర్  42 వ పేజి.)
             

                                                       ఆలయ రాజగోపురం
                    
                     చరిత్ర లో పోయినవి పోగా వేదాద్రిని వెలుగులోనికి తీసుకొచ్చిన మరియొక శాసనం జగ్గయ్యపేట బౌద్దస్తూపం పై లభించింది. దీనిలో ఇక్ష్వాకుమహారాజైన రపురుషదత్తు పేరు పేర్కొనబడింది. ప్రాకృతం లో ఉన్న ఈశాసనానికి బర్లిసుదొర సంస్కృత పాఠం వ్రాయించారు.
                          సిద్ధం  రాజ్ఞో మాధవీపుత్రస్య ఇక్ష్వాకునాం  వీరపురుషదత్తస్య సంవత్సర :
                              పక్ష:   దివస: కమక
                           రాష్ట్ర  గ్రామే ............................. ఏవం జ్ఞాతి మిత్ర సంబంధి వర్గేణ (ర్గ:)
                           తేన  గ్రామే      వేల్లగిరో భగవతో బుద్ధస్య మహా బైత్యే
                           పూర్వ ద్వారే   ఆయక స్తంభ : ………………………
                                                ఇలా కొనసాగిన  ఈ శాసనం లో ప్రస్తావించిన వేల్లగిరి >  వేదగిరి యని ,వేదగిరి వేల్లగిరి>   ఏలాద్రి >  ఏదాద్రి > వేదాద్రి గా రూపాంతరం పొంది ఉండవచ్చునని చరిత్రకారుల అంచనా.(బుద్ధజయంతి మహోత్సవ సంచిక -134 వ పే ).  అనగా జగ్గయ్యపేట స్దూపమున్న ఈ ప్రదేశము 2000 సంవత్సరాలనాటి దనుకుంటే వేల్లగిరి లేదా వేదాద్రి యొక్క ప్రాచీనత కూడా ఒక వైష్ణవ క్షేత్రం గా మనం లెక్కించవచ్చు.
                 
                                                             -80-
  




                                  వేదాద్రి శాసనానికి నకలు

          ఇంత ప్రాచీనత గల వేదాద్రి లో చాగివారి సేవలు వేదాద్రి చరిత్ర ను వెలుగులోకి తెచ్చాయి. అంతేకాకుండా చాగివారు కృష్ణాపరీవాహప్రాంతం లో ఉన్న అనేక శివాలయాలకు  భూరి దానాలు చేసినట్లు శాసనాలు లభిస్తున్నాయి. కురుకూరు స్వయంభూదేవాలయానికి ఇచ్చిన  98 పంక్తుల దానశాసనం  శిథిలమై మనకు లభిస్తోంది. (275/1924 ) దీనిలో పోతరాజు సోదరుడు గణపతిరాజు ప్రసక్తి కూడ ఉంది. అంతేకాదు కురుకూరు  లోని సోమనాథ దేవరకు , కోసవీడు లోని విశ్వేశ్వర దేవరకు ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి చేసిన దానశాసనాలున్నాయి. (274/1924) మునగానపల్లి లోని భీమేశ్వర దేవరకు మనుమ చాగిరాజు క్రీ.శ. 1268 లో చేసిన దానశాసనం కన్పిస్తోంది. (259/1924 ). అంతేకాదు .కొనకంచి లో చాగిపోతరాజు కాలం లో కుఱ్ఱిశెట్టి వేయించిన  దానశాసనాలున్నాయి.
                                                                
                                         తరువాయి భాగం లో   నతవాడి సీమ లో
                                                చాగివారి శాసనాలు - పరిశీలన.





*******************************

No comments: