శతకసౌరభాలు-8
జయ జయ శ్రీనివాస-3
దేవ నీ కంకితము కాని దేహమేల
స్వామి నీకర్పితము కాని స్వాంతమేల
నాథ నిన్నందుకోని మానవత యేల
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
శ్రీనివాస ప్రభూ! నీకు
అంకితము కాని ఈ శరీర మెందుకు ? నీకు అర్పించలేని ఈ
మనస్సెందుకు? ప్రభూ ! నిన్ను
అందుకోలేని ఈ మానవజన్మ మెందుకు ? సర్వము నీవై ఉన్నప్పుడు నీవు లేని నేనెందుకు
ప్రభూ!.
అల్లనల్లన
అమృతంపు జల్లు చల్లు
చల్ల చల్లని దివ్య హస్తములు నీవి
ఆ కరమ్ములు శుభముల కాకరములు
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
శ్రీ వేంకటేశ్వరా! మెల్ల మెల్ల గా అమృతంపు జల్లు ను
చిలకరించెడి దివ్య హస్తములు నీవి. ఆ నీ దివ్య హస్తములు సర్వ శుభములకు నిలయములు కదా ప్రభూ !. సర్వ శుభములకు నీ దివ్య ఆశీస్సులే కారణములు.
మంద మారుత సంస్పర్శలందు కరగి
కమ్మతేనెలు చిందు నెత్తమ్మి లీల
తన్మయంబగు నీ స్మృతిన్ మన్మనంబు
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
శ్రీనివాసా ! హే జగన్నివాసా! మలయ మారుతములతో పులకించి,
కమ్మని తేనెలను చిందించు తామరపువ్వు వలె
నా మనస్సు నీ స్మరణ తోనే పులకించి పోతోంది ప్రభూ !.
దివ్య కరుణా తరంగాల తేలిపోవు
నాదు మనమున నీ చిరునవ్వు వాన
వెల్లి విరిసెను మల్లెలు చల్లినట్లు
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస ! (57)
హే
శ్రీనివాసా! దివ్యమైన కరుణాతరంగాల తేలిపోయెడి నీ చిరునవ్వు
అనెడి వాన మల్లెలు చల్లినట్లు గా నా మనసు
లో వెల్లి విరిసింది ప్రభూ !.
చిమ్మ చీకట్ల నటు నిటు చీల్చి వైచి
శాంతి సుధ చింది కాంతులు జాలువార్చె
మధుర దరహాస రేఖ నా మానసమున
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస ! (60)
శ్రీ శ్రీనివాసా !. మధుర సుధారసాన్ని చిలకరించే నీ చిరునవ్వు నా మదిలో ఆవరించిన అజ్ఞానమనెడి
కారుచీకట్లను నలుదిక్కులకు తరిమి వేసి
ప్రశాంతత అనే అమృతాన్ని ప్రవహింప చేసింది గా ప్రభూ !.
నాల్గు గడియలు చాలదా నాదు బ్రతుకు
వరద భవదీయ స్మరణమే వరము కాగ
ప్రాప్తమయ్యెను ఆత్మ సంతృప్తి నాకు
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !(64)
ప్రభూ !. శ్రీనివాసా!.
నిన్ను స్మరించెడి భాగ్యము కల్గిన ఈ మానవ జన్మ నాల్గు ఘడియలైతే మాత్రం ఏమయ్యింది తండ్రీ!. ఈ స్వల్ప సమయమే నాకు అమృత తుల్యమైన
ఆత్మ సంతృప్తిని మిగిల్చింది స్వామీ !.
పరమ
పురుషుడవేని నే ప్రకృతి నగుదు
విశ్వరూపుడవేని నే విశ్వమగుదు
భావ గమ్యుడవేని నే భావమగుదు
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
శ్రీ శ్రీనివాసా! నీవు పరాత్పరుడవైతే నేను ప్రకృతి నవుతాను ! నీవు విరాడ్రూపుడవైతే నేను విశ్వాన్ని
అవుతాను . నీవు భావగమ్యుడవైతే నేను భావాన్ని అవుతాను. ఏమైనా నేను నీతోనే , నీ పాదeల చెంతే పడి ఉంటాను స్వామీ
!.
విశ్వమోహన నిన్ను సేవించు కొరకు
యెన్ని యుగముల నుండియో యీ తపస్సు
ఇంపు దళుకొత్త సాక్షాత్కరింప వేమి
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
“అతృప్త్యమృత రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్” అని కదా ఆచార్యుల వారు శ్రీనివాసుని
స్తుతించారు. ఎన్ని సార్లు చూచినా తనివి తీరని దివ్యమంగళ రూపం శ్రీ
వేంకటేశ్వరునిది. ఈ అనుభవం వేంకటేశ్వరుని
దర్శించిన ప్రతిభక్తునికి కలుగుతుంది. మళ్లీ మళ్లీ ఆ దివ్యమోహనాకారుని
దర్శించాలనే ఆశ అంకురిస్తూనే ఉంటుంది.
అందుకే రచయిత్రి ఇలా ప్రార్థిస్తోంది. విశ్వమోహన సౌందర్య రూపా ! శ్రీ శ్రీనివాసా !
నిన్ను సేవించడం కోసం ఎన్ని యుగాల నుండో
చేస్తున్న ఈ నా తపస్సు సార్థక మయ్యే టట్లు గా నా కనులకు ఒక్కసారి నీ దివ్యదర్శనాన్ని
ప్రసాదించు స్వామీ !.
పాపపంకిలమగు నీ ప్రపంచమందు
పుణ్యసృష్టి నొనర్చు కారుణ్య జలధి
దుష్టుడెవడుండు నీ కృపాదృష్టి లోన
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
శ్రీ వేంకటేశా ! పాపం చేత కళంకితమైన ఈ లోకం లో పుణ్యాన్ని
పండించగల కరుణాసముద్రుడవు నీవే కదా ! ప్రభూ ! నీ కరుణామృత
దృష్టి ప్రసరించిన తావుల ఇంకా దుర్మార్గుడనేవాడు ఎవడుంటాడు స్వామీ !.
సుందరములైన
పాదారవిందములను
కాంతు,ధ్యానింతు, సేవింతు, కాంక్షనింతు
పూజ గావింతు భావాల పూలతోడ
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
శ్రీ వేంకటేశ్వరుని
నిజపాద దర్శనం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలమని
భక్తులు భావించి , దర్శించి , తరిస్తున్నారు.
అందుకే రచయిత్రి ఇలా అంటోంది.
శ్రీ శ్రీనివాసా ! సుందర మైన నీ పాదారవిందాలను తనివితీరా దర్శించి, సేవించి , భావాలు అనే పుష్పాలతో
పూజించి తరిస్తాను స్వామీ !.
మెట్టు మెట్టు కు నీ నామమే స్మరించి
కాసు కాసు కు వడ్డీలు కట్టి కట్టి
నిన్ను సేవింప వత్తురనేక జనులు
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
తిరుమల కొండకు నడిచి వెళ్ళడం శ్రీ
వేంకటేశ్వరుని భక్తులకు కొండంత ఆనందాన్నిచ్చే విషయం. అందులోనూ వెన్నెల రాత్రుల్లో,
చల్లని గాలులు ఆ వేంకటేశ్వరుని దివ్యమైన పరామర్శ లాగ శరీరాన్ని తాకి పలకరిస్తుంటే ,
పగలంతా ఒకటికి రెండు సార్లు క్యూలైన్ల లో వెళ్లి శ్రీ వారిని మళ్లీ మళ్లీ దర్శించు కొని , అతి మధురం గా
ఉండే స్వామి వారి ప్రసాదమైన తిరుపతి
లడ్డూని కొసరి కొసరి పంచుకొని , మధుర మదురంగా సేవించి , స్నేహితులతో కలిసి
కబుర్లాడుతూ మెట్లమార్గం లో నడిచి వచ్చిన
రోజులు జీవితం లో మరువ లేనివి కదా.
ఏడుకొండల వందల మెట్లు ఎక్కడానికి భక్తునికి ఇచ్చే బలం గోవింద నామం. గోవిందా అని ఒక్కసారి అంటే చాలు
పసి వాడైనా పరుగున పదిమెట్లు ఎక్కేస్తాడు. అది
ఆ దివ్యనామ స్మరణ లో ఉన్న
గొప్పతనం. అందుకే మెట్టు మెట్టుకూ గోవిందా అంటూ కొండ
చేరుకొని, కాసు కాసు కు వడ్డీలు కట్టి
వడ్డి కాసులవానిని సేవించుకొని ధన్యులౌతారు భక్తులు.
నమ్ముకొన్నాను
నిన్ను నా నెమ్మనమున
అమ్ముకొన్నాను నీకు నా అంతరాత్మ
రమ్ము రమ్ము ప్రభూ దర్శనమ్ము నిమ్ము
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
శ్రీ శ్రీనివాసా !. నిన్ను నేను మనసారా నమ్ముకొని , నా మనసు ని నీకు
అమ్ముకొని, ఎద నిండా నిన్నే నింపుకున్నాను స్వామీ ! . నీవే కదలి వచ్చి నన్ను కరుణించి నీ దర్శనాన్ని ప్రసాదించు ప్రభూ !. తన ఇష్ఠదైవాన్ని తన చెంతకే కదిలి రమ్మనడం పరమ భక్తునిలో కలిగే భక్తి పారవశ్యమేమో. ఒక భక్తురాలి ప్రార్థన చూడండి.
కొండదేవర
నిను చేరి దండమిడగ
చేదుకొని ఆదుకొందువు వేదవేద్య
అండగా నిల్వు స్వామి కైదండ నిచ్చి
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
స్వామీ ! శ్రీ శ్రీనివాసా ! ఒక
పిలుపులో పిలిచితే పలుకుతావట. గోవిందా
అనగానే నేనున్నానని భక్తులకు అండగా నిలుస్తావట. ఓ కొండదేవరా ! నిన్నే నమ్ముకొని అడుగడుగున
దండాలు పెట్టుకుంటూ నీ కొండకు చేరిన
భక్తులకు నీవే కొండంత అండవై నిల్చి కైదండ
నిచ్చి ఆదుకొనే ఏడుకొండలవాడా!. శరణు శరణు.
వడ్డి కాసులతో మమ్ము నొడ్డు చేర్చి
కష్టముల దీర్చి రక్షించి కావుమయ్య
కలియుగస్వామి నిను వేడ కాంచవేమి
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
కలియుగ దైవమైన శ్రీ
వేంకటేశ్వరా !. కష్టకాలం లోఉన్న మేము నిన్ను తలచుకుంటే వడ్డి కాసులతో మమ్మల్ని
ఒడ్డుకు చేర్చి ఆదుకొనే పర దైవమా !. ఒక్కసారి నీ చిరుదర హాస
భాసురమైన సుందర రూపాన్ని తనవి దీరా
దర్శించే భాగ్యాన్ని నాకు ప్రసాదించవయ్యా !.
పాహిమాం దేవదేవ! దివ్యప్రభావ!
పాహిమాం
వేంకటేశ! భవ్యప్రకాశ!
పాహిమాం వేణులోల! గోపాలబాల!
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
దేవదేవా
! దివ్యప్రభావ ! శ్రీ వేంకటేశ్వరా ! పాహిమాం ! భవ్యప్రకాశా ! సుందరాతి
సుందర రూపా ! నీవే నాకు రక్ష. గోపాల బాల ! శ్రీ
వేణుగోపాల నీవే నాకు శరణు.
అజ్ఞానినా మయా దోషానశేషాన్విహితాన్ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే !
శేషశైలవాసా ! శ్రీనివాసా ! అజ్ఞాని నైన నాచేత అనేకమైన పాపాలు
చేయబడ్డాయి. హే ప్రభూ ! నన్ను క్షమించు. నన్ను క్షమించి రక్షించు ప్రభూ!. అని కదా మనం
స్వామి చెంత చేతులుమోడ్చి వేడుకుంటాము.అదే సంప్రదాయాన్ని శతకము యొక్క చివరలో రచయిత్రి అనుసరించింది.
నందనందన గోవింద వందనములు
వందితాఖిల సురబృంద వందనములు
కందళిత సచ్చిదానంద వందనములు
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస !
శ్రీ శ్రీనివాసా ! నందకుమారా
! నమస్కారములు. గోవిందా ! వందనాలు.సమస్త దేవతా
సమూహము చేత పూజించ బడెడి దేవదేవా ! నీకు వందనములు.
ఎల్లప్పుడు చిరునవ్వులను చిందించెడి సచ్చిదానంద రూపా !. నీకు
శతకోటి వందనాలు.
కలియుగ దైవాన్ని ప్రార్థించి తరించాలని ప్రతి జీవి
కోరుకుంటుంది. ఒక భక్తి శతకాన్ని స్నిగ్ధదరహాస భాసురుడైన శ్రీనివాసునిపై వ్రాసి
ధన్యురాలైంది రచయిత్రి. ఒకరోజు నా ఇంటి
గ్రంథాలయాన్ని సర్దుకుంటుంటే ఈ గ్రంథం నా
కంటపడి పడేటట్లు చేసి , ఇంత దాక తీసుకొచ్చిన ఆ తిరుమలగిరి రాయనికి మరొక్క శతకోటి వందనాలు.
ఒక్క విషయం. త్రేతాయుగం లోని శ్రీరాముడు , ద్వాపర యుగం లోని
శ్రీకృష్ణుడు కలియుగం లో వేంకటాద్రి పై
శ్రీ వేంకటేశ్వరుడుగా వెలిశాడని
శ్రీ వేంకటాచల మహాత్మ్యం లో చెప్పబడింది.
“ కౌసల్యా కీటకగృహం
తింత్రిణీ దశ దిగ్రధ:
గిరిరూపో 2నుజస్సాక్షాదయోధ్యా భూదధిత్యకా. !
ఇత్థం రామావతారేణ సమాం
క్రీడా మకల్పయత్ . ! (18 శ్లో)
వల్మీకం
దేవకీ సాక్షాద్వసుదేవో 2ధతింత్రిణీ
బలభద్ర శ్శేషశైలో మధురా2భూ దధిత్యకా .
ఏవం శ్రీకృష్ణ రూపేణ క్రీడతో వేంకటాచలే !! ( 20)
భవిష్యోత్తర పురాణాంతర్గత శ్రీవేంకటాచల మాహాత్మ్యే చతుర్ధో
అధ్యాయ:
అందుకే శ్రీ రామకృష్ణ రూపాత్మకుడి గా శ్రీ
వేంకటేశ్వరుని భక్తులు కీర్తిస్తారు. అంతేకాదు . తిరుమల శ్రీ వేంకటేశ్వరుని
గర్భగుడి లో శ్రీ స్వామి వారి ఉత్సవ మూర్తులతో పాటు శ్రీరామ శ్రీ కృష్ణుల ఉత్సవ విగ్రహాలు కూడ పూజలందుకొంటున్నాయి . ఈ ఉత్సవ మూర్తులు ఏ
కాలం లో ఏ కారణం గా శ్రీస్వామి వారి గర్భగుడి ఉంచబడ్డాయో చెప్పడానికి సరైన ఆధారాలు
లేవని తిరుమల చరిత్రకారులు భావిస్తున్నారు.
“తిరుమలనంబి తన కాలములోనే శ్రీరామ శ్రీకృష్ణ
విగ్రహాలను, అంతకు పూర్వం నెలకొల్పబడనప్పటికిని శ్రీవారి గర్భగృహము లో
అర్చకస్వాముల యనుమతి తో సమర్పించెనని
నిర్ణయమునకు రావచ్చును.” (తిరుపతి చరిత్రము. 253 వ
పేజి.)
ఆయన అదృష్టమేమో
గాని ఒక భక్తుని కైతే శ్రీ వేంకటేశ్వరుడు
రామకృష్ణరూత్మకుడై స్వప్నం లో సాక్షాత్కరించాడు. ఇదిగో ఆ రూపం ఇది.
ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి
వ్యాసం ఇదే blogger
లో ఓ
అపురూపచిత్రం-కలిసంతరణ వేంకటరమణ మూర్తి అనే వ్యాసం లో చూడవచ్చు.
రచయిత్రి ఈ శతకం లోని 107 వ పద్యం లో నందనందనునకు వందనాలు
సమర్పించడం తో శ్రీ రామకృష్ణుల ప్రశంస
ఇక్కడ మనకు ప్రస్తావన కొచ్చింది.
మరొక్కసారి గోవిందుని స్మరించుకొనే మహద్భాగ్యం మనకు లభించింది. “హరే రామ హరే రామ రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే
హరే ”అంటుంది కలి సంతరణోపనిషత్తు.
ఇది జయజయశ్రీనివాస శతకానికి తేజస్వినీ వ్యాఖ్య సంపూర్ణము.
******** ओं नमो वेंकटेशाय *********