Friday, 30 December 2016

గుడిమెట్ట నగరం – చాగివారు -3

  రెండవ ప్రకరణం

    గుడిమెట్ట నగరం – చాగివారు -3  


సమకాలీన పరిస్ధితులు-కావ్యనిర్మాణం:
                   

                      చాగి వారి పాలన లో కొనసాగిన సాహిత్య సేవ ఎటువంటిదో చెప్పుకోవడానికి ఎటువంటి ఆథారాలు లభించడం లేదు.తెలుగుజాతికి పంచమవేదమైన ఆంధ్రమహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఆదికవి ని ప్రోత్సహించిన రాజన్యులు వేంగీ చాళుక్యులు. వారి ప్రోత్సాహం తో  వెలిసిన మాండలిక రాజ్యమైనప్పటకీ, షుమారు రెండు శతాబ్దాలు సాగిన చాగి వారి పాలన లో వెలిసిన ఏ ఒక్క కావ్యము  వెలుగ చూడలేదు. వీరు కవి పండిత పోషకులు కాలేదనడానికి అవకాశమే లేదు. ఆనాటి సభ ల్లో కవులను పోషించడం సంప్రదాయం గా వస్తూనే ఉంది. కులోత్తుంగ చోడుని ఆస్ధానకవి జయగొండాన్. ఈతను కులోత్తుంగుని  కళింగ యుద్ధ వృత్తాంతాల్ని కళింగత్తుప్పరణి అనే కావ్యం లో విశేషం గా వర్ణించాడు. రాజరాజనరేంద్రుని ఆస్ధాన కవి నన్నయ ఆంథ్రజాతి కి ఆదికవి యైనవాడు. తెలుగు జాతి కి సుపరిచితుడు.అటువంటిది ఆ కాలం లో మాండలిక రాజ్యాల్లో కవులను పోషించి కావ్యాలను వ్రాయించడం జరిగే ఉంటుంది. కాని 12 వ శతాబ్దపు వీరశైవ ఉద్యమం , అనంతరం సాగిన మహమ్మదీయ దండయాత్రలు వాటిని ధ్వంసం చేసి ఉంటాయి. విచిత్రం గా ఏ ఒక్క కవి పేరు కాని , కావ్యం పేరు కాని ఈ మూడు  దశాబ్దాల్లో విన్పించడం లేదు. ఏనుగు లక్ష్మణ కవి వ్రాసిన రామవిలాస కావ్యం వరకు గుడిమెట్ట ను స్మరించిన వారే లేరు. వేములవాడ భీమకవ చాటువు  ఒకటి గుడ్డిలో మెల్లగా పోతరాజు పేరును స్మరించింది . కాని అది వివాదస్పదామైంది. అంటే ఈ కాలం లో కావ్యాలు వెలసినా అవి క్రమేణా కాలగర్భం లో కలిసి పోయాయని భావించాల్సి వస్తోంది.
                                     


                                                 -36-
  
                      సమకాలీన పరిస్థితులను ఒక్కసారి పరిశీలిస్తే  మనకు  కొన్ని నిజాలు తెలుస్తాయి. ఆ కాలపు రాజులకు సాహిత్యపోషణ చేసే సమయంలేదేమో ననే వారూ ఉన్నారు.ముఫై వసంతాల పైచిలుకు రాజ్యపాలన చేసిన మొదటి రెండవ పోతరాజుల కాలంలో కూడ ఎట్టి కావ్య నిర్మాణం జరిగిన దాఖలాలు లేవు. ఆనాడు ఆంధ్రదేశం లో శైవానికి ఆదరణ మిక్కుటం గా ఉంది. జైనమతం తెలంగాణా , రాయలసీమల్లో అక్కడక్కడా కన్పిస్తున్నా మిగలిన ఆంధ్రప్రాంతం లో మాత్రం శైవ మే ఆదరించబడి , ప్రజలచేత ఆచరించబడుతోంది. అమరావతీ శాసనం లోని చైత్యమత్యున్నతిం యత్ర నానాచిత్ర విచిత్రితం అన్న వాక్యాన్ని బట్టి ఆనాటికి అమరావతి  మహాచైత్యం నష్టం కాలేదని భావించవచ్చు.  బౌద్ధ మత ప్రభావం ప్రజల్లో లేదు. అమరావతి ,కరీంనగర్, బెక్కల్లు శాసనాలను, పరిశీలిస్తే - బుద్ధభగవానుని  ప్రజలు విష్ణుమూర్తి అవతారం గా భావించి, పూజిస్తున్నట్టు మనం గమనించవచ్చు. (ఆంధ్రుల చరిత్ర సంస్కృతి .96.పే.)
                       
                  



     అంతేకాదు .శ్రీ రామానుజుని ప్రచారం తో వైష్ణవానికి నూతనోత్తేజం వచ్చింది.ఈ చాళుక్య చోళ యుగం లో పెక్కు ద్రావిడ వైష్ణవ కుటుంబాలు ఆంధ్రదేశం లో స్థిర పడ్డాయి.కొమ్మన మంత్రి ముఫై రెండు క్షేత్రాల్లో విష్ణు ప్రతిష్టలు చేసినట్లు మంచెన తన కేయూరబాహ చరిత్ర లో వ్రాసాడు. శైవ ,వైష్ణ వాలు రెండింటిలోను ఈ యగం లోనే తీవ్రవాద ఉద్యమాలు బయలు దేరాయి శివుని మహావ్రతి గా ఈ కాలపు రాజకవి నన్నెచోడుడు వర్ణిస్తాడు. ఈమహాకవి కావ్యం కుమారసంభవమే తెలుగు వారికి చాలా ఆలస్యం గా దొరికింది.. ఈ విధంగానే ఏ చీకటి కోణాల్లోనో ఈ యుగపు కవులు  దాగున్నారేమో. ఈ కాలం లో అలంపురం ,శ్రీశైలం,బెజవాడ ,పిఠాపురం  శక్తి పూజా కేంద్రాలు గా ప్రసిద్ధి పొందాయి. బసవేశ్వరుని వీరశైవోద్యమం జాతిని జాగృతం చేసింది.
                                    
                      శివుడే పరదైవతమనే భావన ,లింగధారణ ,లింగ అంగ సమైక్య సాధన వీరశైవం లోని ప్రధానాంశాలు. జైన ,బౌద్ధాల లోని నైతిక వర్తన , సాఁఘిక సమత్వం  పౌరాణికమతం లోని భక్తి ని బసవేశ్వరుడు వీరశైవం లో సమన్వయం చేశాడు. ఆంధ్రదేశం లో ఈ యుగం లో కొద్దిగా క్రింది వర్ణాల వారిని మినహాయిస్తే వీరశైవం ప్రజాదరణ పొందలేదు. శ్రీ రామానుజులు క్రింది

                                                       
                                             -37-

వర్ణాల వారికి వైష్ణవమతదీక్ష నిచ్చినా వర్ణవ్యవస్ధ ను ఖండించ లేదు. పల్నాటి బ్రహ్మనాయుడు మాత్రం వీరవైష్ణవాన్ని  ప్రచారం చేశాడు. అతని ప్రచారం తో ఆంధ్రదేశం లో దాసర్ల సంఖ్య పెరిగింది. ( ఆంధ్రుల చరిత్ర- సంస్కృతి) బ్రహామనాయుడు వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించాడని , మాచర్ల చెన్న కేశవాలయం లో పంచములకు ప్రవేశం కల్పించాడని చెప్పుకుంటారు. ఇటువంటి విప్లవాత్మక సంస్కరణలు ఆనాడు అపూర్వాలేనని చెప్పాలి.  కొంచెం లోతు గా ఆలోచిస్తే పల్నాటియుద్ధం సంప్రదాయ ప్రియత్వానికి ,సంస్కరణ వాదానికి మధ్య జరిగిన సంఘర్షణ   గా కన్పిస్తుంది.
                                        
                     అయితే క్రమం గా శతాబ్దం చివరి కొచ్చేసరికి వీరశైవ ,వీరవైష్ణవ పరాజయం , స్మార్త మత పునరుద్ధరణ జరిగాయి. అద్వైత ధర్మ ప్రచారమే ఆశయం గా మహాకవి తిక్కన సోమయాగం చేసి సోమయాజి యై భారతాంధ్రీకరణ కు పూనుకున్నాడు. శివాయ విష్ణురూపాయ  శివరూపాయ విష్ణవే అన్న భావం ప్రజలలో నెమ్మది గా వ్యాపించింది. రెండవ పోతరాజు  విశ్వేశ్వర ,చోడనారాయణ ఆలయాలు రెండింటికి సమానం గా సువర్ణ కలశాలను ఎత్తించి ,దాన శాసనాలను  వేయించి తన లోని శైవ వైష్ణవ సమానత్వాన్ని చాటుకున్నాడు. ప్రజలలో తీవ్రవాద మత భావాలు శమించి , వైదిక భావాలు మొలకెత్తుతున్న కాలమిది. కాకతి రుద్రదేవుడు రుద్రేశ్వరం లో ఈశ్వరుని తో పాటు కేశవుని సూర్యుని ప్రతిష్ఠించి ఫూజించాడు. అతని మంత్రి గంగాధరుడు విష్ణుభక్తుడు.మంచి భట్టోపాథ్యాయుడు కేశవ ,మహాదేవుల ఆలయాలను నిర్మించాడు. మొదటి పోతరాజు  గుడిమెట్ట లో  విశ్వేశ్వర మహాదేవరను , చోడనారాయణుని ప్రతిష్ఠించాడు. సింహాద్రి వరాహ లక్ష్మీనరసింహునికి చాగి సముద్రమనే తటాకాన్ని త్రవ్వించి, వేదాద్రి  నరసింహస్వామి కి కానుకలు సమర్పించి , నరసింహవర్ధన పోతరాజయ్యాడ రెండవ పోతరాజు. ముక్త్యాల లో ముక్తేశ్వరుని ప్రతిష్టించి  శివభక్తుడు గా కొనియాడబడ్డాడు.
                                    
                         దేవాలయాలు దేశ సంస్కృతికి మూలస్ధంభాలు.కాబట్టి ఆనాటి లయాలు గ్రామ ప్రజలకు ,పరిసర గ్రామాల ప్రజలకు కూడా కడలి కేంద్రాలు గా ఉండేవి.దేవస్ధానం గావ్యవహరించే ఈ ఆలయ భూముల్ని రైతులు సాగు చేశేవారు.  


                                                               -38-

ఆనాడు ప్రతిఆలయానికి అనుబంధం గా మఠాలు ,సత్రాలు ,విద్యాలయాలు ఉండేవి. అంతేకాదు ఆలయాలు బ్యాంకు లు గా ,ప్రదర్శన శాలలు గా ,వర్తక శ్రేణులకు కార్యస్ధానాలు గా ఉండేవి.  గ్రామానికి మథ్య లో దేవాలయ ముండేది. దానికి నాలుగువైపులా గ్రామాన్ని విస్తరింప చేసుకోవడం  , నాలుగు వీధుల కూడలి స్థలం దేవాలయం  నిర్మించబడేది. మరికొన్ని దేవాలయాలు ప్రభువుల అజమాయిషీ లో అంత:పుర కాంతల రాకపోకలకు అనుకూలం గా రాజప్రాసాదానికి  అనుబంధం గా నిర్మించబడి , మరో మార్గాన్ని ప్రజల దర్శనానికి వదిలివేయడం జరిగేది. హంపీ విరూపాక్షాలయం నుండి వాడపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ఇందుకు ఉదాహరణలు గా నిలుస్తాయి. 
                                 
                 


      గుడిమెట్ట కొండల పైన కన్పించే కొన్ని కట్టడాలు ఇటువంటివే. గుడిమెట్టలోని దేవాలయాలు రాజ భవనానికి తూర్పు గా నిర్మించబడినవిగా మనం  శిథిలాలను బట్టి ఊహించవచ్చు. దేవాలయాల చుట్టు వైదికధర్మం ఇన్ని విధాలు గా అల్లుకున్నది కాబట్టే,  ఐశ్వర్యవంతమైన హిందూ ఆలయాల చుట్టూ సామాజికి ,ధార్మిక కార్యక్రమాలు  పెనవేసుకొని ఉన్నాయి కాబట్టేతురష్కులు హిందూదేవాలయాల పైనే దృష్టి కేంద్రీకరించి ,విధ్వంసానికి పాల్పడ్డారు . గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం మొదలుకొని శ్రీరంగం లోని శ్రీరంగనాయకస్వామి ఆలయం వరకు ఇందుకు నిదర్శనాలే. ఆలయం విథ్వంసం తో సామాజిక జీవితం విచ్ఛిన్న మై, దేశాక్రమణ  సుగమం కాగలదని  వారు భావించారు.చరిత్ర కొన్ని గుణపాఠాలను నేర్పిస్తుంది. సింహాచలం వంటి దేవాలయాల నిర్మాణం చూస్తే  హిందూ రాజుల లో వచ్చిన మార్పు మనకు అర్ధమౌతుంది. కోటగోడల వంటి ప్రాకారాలు, రహస్య మార్గాలు దేవాలయ నిర్మాణం లో వాడటాన్ని మనం అక్కడ గమనించవచ్చు.
                                 
                 వేశ్యాప్రియత్వం ఈ యుగం లో సాధారణ విషయం గా కన్పిస్తోంది. దేవదాసీలకు,వేశ్యలకు సమాజం లో సాధారణం గా గౌరవస్ధాన ముండేది. గణపయరాజు విశ్వేశ్వర దేవరకు అంగరంగ వైభోగాలకు  దాసదాసీలను దానం చేసిన శాసనం  ఇందుకు సాక్ష్యమిస్తోంది.


                                                           -39-

            శివకేశవులకు బ్రహ్మాండమైన దేవాలయాలను నిర్మించిన రాజులు వాని రక్షణ ,పోషణ కు గాను అనేకమైన దానధర్మాలు చేసేవారు. మన పరిశీలన లో కన్పించిన అనేక శాసనాలు ఇందుకు సంబంధించినవే. రుద్రమదేవి గుడిమెట్ట శాసనం  గుడిమెట్ట విశ్వేశ్వర దేవరకు బేతవోలు గ్రామాన్ని దానం చేయగా మనుమగణపతి దేవరాజు వేముపల్లి గ్రామాన్ని ప్రతాప నరసింహ దేవరకు (వేదాద్రి) దానంచేశాడు. అంతే కాదు .  ఈ దానాలన్నీ హవిర్బిల్వర్చనాదులకు ,అంగరంగ వైభోగా లకు  ప్రత్యేకం గా నిర్దేశించి చేయడినట్లు గా మనం గమనించవచ్చు. అంగరంగవైభోగాలంటేనే దేవదాసీల కొరకు ,నృత్య నాట్య ప్రదర్శనలకు ,ఉత్సవాలకు అని అరధం. వాని కోసమై గ్రామాలను దేవునికి దానం చేయడం అనేక శాసనాల్లో కన్పిస్తోంది.
                        
     మరియు అఖండదీపం కొఱకు చేసిన దానశాసనాలు ఈ కాలం లో ప్రత్యేకంగా కన్పిస్తాయి.  శ్రీశైల సందీపిత దీపయుగ్మము కలవాడు కల్లయ నాయకుడు .కండ్రవాడి కేశవోర్వీపతి ముక్త్యాల ముక్తేశ్వరునికి విమలాఖండ ప్రదీపశ్రీ కొఱకు 25 గోవులను దానం చేశాడు. ఈ శాసన కాలం క్రీ.శ.1207. (302/1924) . మాక చమపతి ముప్పాళ్ళ రామేశ్వరునకు అఖండ దీపారాధనకై  25 గోవుల్ని దానం చేశాడు.(257/1920). దీని కాలం క్రీ.శ.1277.  ఈ విధం గా దానం చేసి ఆవులకు  మేతకు కావలసిన పచ్చిక బయళ్ళ ను కూడ దానాలు చేసిన రాజవరేణ్యులున్నారు. వేదాద్రి నరసింహస్వామి వరి ఆలయ ప్రాంగణంలో పడమటి వైపు కృష్ణా నది లోనికి వెళ్ళే మెట్లమార్గం ప్రక్కనే రంగరాజు (?) వేయించిన దానశాసనం ఒకటి కన్పిస్తుంది. అది ఆవులకు వలసిన పచ్చిక కోసం  గుండుబోయిన పాలెం రంగరాజు కొండకు నడుమ నున్న భూ భాగాన్ని సాలగ్రామ నరసింహ సాక్షి గా  దానం చేసిన శాసనమిది. అంటే కొంతమంది భక్తులు దేవుని గోవులను కొష్ఠం లో ఉంచి పోషిస్తూ , అఖండ దీపానికి వలసిన నెయ్యి ని ఆలయానికి పంపుతుండే వారని, ఆ ఆవుల రక్షణ ,పోషణ కు మరికొందరు మహనీయులు భూ దానాలు చేస్తుండేవారని మనం అర్ధం చేసుకోవచ్చు. “ బెజవాడ తెలికివేవురు కులానికి చెందిన కుఱ్ఱిసెట్టి కొనకంచి నరేంద్రేశ్వర దేవరకు దీపమాలలు రెండు చేయించాడు. (270/1924).” ఫిరోజ్షా తన తమ్ముని పేర వేదాద్రి వద్ద ఒక చెఱువు ను త్రవ్వించినట్లు శాసనం కన్పిస్తోంది. (కృష్ణా

                                                             -40-


గెజిట్-46 వ.పే). ఇది కొనకంచి  చెరువు అయి ఉండాలి. కృష్ణా నది ప్రక్కనే ఉండగా వేదాద్రి  లో చెరువు అవసరం లేదు కదా. ఆనాడు కూడ చెఱువులు త్రవ్వించడం పుణ్య కార్యం గానే ప్రజలు భావించేవారు. దేవాలయాలకు అనుబంధం గా చెరువులను త్రవ్వించే వారన్న మాట. రెండవ పోతరాజు సింహాచలేశునకు చాగి సముద్రమనే తటాకాన్ని త్రవ్వించిన విషయం  ఇంతకు పూర్వమే ప్రస్తావన కొచ్చింది. ఈ చెఱువులు స్వామి వారి పుష్కరిణు లేమో  ? ఆలోచించాలి. ఇవన్నీ శాసనాలు విశ్లేషిస్తే తెలిసే రహస్యాలు. ఇంతగా తమ జీవన గమనం లో ఒక భాగం గా హిందువులు ఆలయాలను అభివృద్ధి చేసుకున్నారు. అందుకే తురుష్కులు వానిని ధ్వంసం చేశేవారు.
   
           


      
                హిందువులు ఆవేశం లో జైనదేవాలయాలను శివాలయాలు గా మార్చేస్తే , అనంతరం వచ్చిన తురుష్కులు  హిందూఆలయాలను మసీదులు గా మార్చుకున్నారు. వేములవాడ , జోగిపేట,కొలను పాక  వంటి ప్రదేశాల్లో జైన మందిరాలు శివాలయాలు గా మారాయి.( ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి 145 వ. పే)  రాజమండ్రి, పెనుగంచిప్రోలు,  వంటి అనేక ప్రదేశాల్లో సివాలయాలు మసీదులు గా మారిపోయాయి. ప్రపంచ ప్రసిద్ద తాజ్మహల్  తేజోమహల్ అనే శివాలయమనే వాదన ఉండనే ఉంది. అయోధ్య వివాదం ఈనాటికీ ఆరని రావణాసుర కాష్టం లా మండుతూనే ఉంది. ఐతే ఈ సమయం లో మనం అంగీకరించాల్సిన విషయం ఒకటుంది. అదేమింటే    తురుష్కుల దురాగతాలను ఎదుర్కోగల్గిన మతావేశం త్రిశూల ధారులైన వీరశైవం లోనే ఉందని, హరహరమహాదేవ శంభో లోని వీరావేశం త్రిశూలధారుల్ని పురిగొల్పుతుందని ఆనాటి ప్రజలు , ప్రభుత్వం బలంగా విశ్వసించాయి. లయకారకుడైన శంకరుడే పరదైవమని ఆనాటి సమాజం నమ్మింది. అందుకే ఈ యుగం లో ఎక్కువగా శివాలయాలు , మహాదేవునికిచ్చిన  దాన శాసనాలే కన్పిస్తాయి. విశాలమైన దేవాలయ మండపాలు , అద్బుతమైన శిల్ప సంపద ను సంతరించుకొని సర్వజన రంజకంగా నిర్మించబడేవి. ఇటువంటి కట్టడాలే శిథిల శిల్పాలై మసీదు దిబ్బ గా పిలువబడే గుడిమెట్ట  లో  మిగిలి పోయాయి.
                                                  
                                                  త్వరలో మూడవ ప్రకరణం - వెలుగు చూసిన తెలుగు శిల్పాలు.



******************************************************

Tuesday, 20 December 2016

గుడిమెట్ట నగరం – చాగివారు -2



రెండవ ప్రకరణం
  
  గుడిమెట్ట నగరం – చాగివారు -2
                                     

                                  ఈ చాగి వంశం లో ముప్పభూపాలడు మొదటి వాడు. చారిత్రక పురుషుడు. ఈతడు రాజేంద్రచోడుని మెప్పించి సామంత రాజ లాంఛనాలను పొందినట్లు ఇంతకు ముందే చెప్పుకున్నాము. కాని కొన్ని శాసనాల్లో ముప్పభూపతి కుమారుడైన  దోరభూపతి ఈ మర్యాదలను పొందినట్లు  చెప్పబడింది. ఇది ప్రమాద పతిత మనుకొన్న దాని కంటే తండ్రి  బిరుదుల్ని గౌరవచిహ్నం గా కుమారుడు కూడ ప్రకటించుకోవడం సంప్రదాయ మనుకుంటే  సరిపోతుంది. ఈ ప్రస్తావన కల్లయ నాయకుని అమరావతి శాసనం లో కన్పిస్తుంది. (Arc-253 ,271/1897 ).  దోరభూపతి అనంతరం  త్యాగ సత్య శౌర్యాది గుణమణి విభూషితుడగు మొదటి పోతరాజు రాజ్యానికి వచ్చాడు. గుడిమెట్ట రాజధాని నగరం గా నతవాటి సీమ ను పరిపాలించాడు.
                                       
                                         శ్రీ కృష్ణ వేణ్నా తట  భూమిభాగే
                                            శ్రీ పోత భూపో గుడిమెట్ట నామ్నే
                                             విశ్వేశ్వరాఖ్యం శివమాదిదేవం
                                                సంస్ధాపయామాస పురే స్వకీయే     (Arc-313/1924)

   శ్రీశైల సందీపిత దీపయగ్మములు గల కల్లయ నాయకుడు ఇతని సోదరుడు.
                                            
                                                సోయం సముద్యాహిత విప్రవర్గ:
                                                 శ్రీశైల సందీపిత దీపయుగ్మ
                                                 విధాన సంపాదిత పూతధర్మ
                                              
                                                      -23-
                                                  స్పర్ధాన  సంతోషిత యాచకేషు”   (Arc-253/1897)


            మొదటి పోతరాజు తన ప్రధాన నగరమైన గుడిమెట్ట లో విశ్వేశ్వర దేవరకు ఆలయం నిర్మించినట్లు శాసనం చెపుతోంది. కాని రామ విలాస కర్త సాగి పోతరాజు మనుమడు ను నరసింహరాజు కుమారుడు నైన మన్మ పోతరాజు  కట్టించి నట్లు వ్రాశాడు.
      

         “స్థిర భక్తిన్ గుడిమెట్ట లోపల ప్రతిష్ఠించెన్ గృపాసింధు సింధు బం
            ధుర సౌధంబున విశ్వ నాధు .............................................    భారతి.నవం/1932) 
              
           -  అని రామవిలాసము.       గుడిమెట్ట శాసనం ప్రకారం  విశ్వనాధ దేవరకు గుడి కట్టించింది పోతరాజు. ఇతన్ని ఏనుగులక్ష్మణ కవి నరసింహుని కుమారుడు పోతరాజు గా బావించాడు. అసలు చాగి వంశం లో నరసింహ నామధేయుడే లేడు. రెండవ పోతరాజు నరసింహవర్ధన బిరుదాంచితుడు. సింహాచల నరసింహునకు చాగి సముద్రమను పేర కొలనును నిర్మించిన పరమ భక్తుడు.  ఇతను శ్రీ యోగానంద నరసింహ దేవ దివ్యశ్రీ పాద పద్మారాధకుడని , శ్రీ నరసింహవర్ధన స్త్యాగి ధరణీపతి:”అని బెజవాడ శాసనం .పోతరాజు అల్లుడు వేయించిన జుజ్జూరు శాసనం లోను మనం ఈ ప్రశస్తి ని గమనించవచ్చు.  కాబట్టి నరసింహవర్ధన బిరుదే కాని నామము కాదు. చాగి వారి పాలన లో పోతరాజు నంతరం రాజ్యానికి వచ్చిన గణపయ రాజు ,మన్మ చాగి గణపతి దేవరాజులు కూడ ఈ బిరుదాన్ని వాడుకున్నారు .కాబట్టి ఏనుగులక్ష్మణ కవి మాట ను పరిశీలిస్తే-అతను వ్రాసిన రామ విలాసకావ్యం కొన్ని శతాబ్దాల అనంతరం వ్రాయబడి,  వత్సవాయి గోపరాజు కు అంకితమివ్వబడింది. కాబట్టి ఇక్కడ మొదటి పోతరాజు  ను రెండవపోతరాజు గా భావించడం ప్రమాద పతితం.
                      

                                                    స్వయంభూ దేవాలయం
                   
                         మొదటి పోతరాజు కాలం సుమారు గా క్రీ.శ 1145  82 మధ్య. ఈ పల్నాటియుద్ధం లో పాల్గోన్నాడు. ఈ విషయాన్ని మొదటి ప్రకరణం లో చర్చించాం.రెండవ దోరభూపతి శాసనాలు శా.శ1117 (క్రీ.శ. 1195 ) వరకు మాత్రమే కన్పిస్తున్నాయి. అనంతరం

                            
                                                -24-


 రెండవ పోతరాజు   శాసనాలు  లభిస్తున్నాయి.కాబట్టి దోరభూపతి శా.శ.1104 నుండి 1119 వరకు మాత్రమే పాలించినట్లు నిర్ధారించవచ్చు. అనగా పల్నాటి యుద్ధానంతరమే దోరభూపతి పాలన ప్రారంభమౌతోంది. ఈ యుద్ధానంతరం ఇతని కుమారుడు రాజ్యానికి వచ్చాడంటే పల్నాటి యుద్ధం లో  చాగి వంశ వృద్ధ సింహం మొదటి పోతరాజు మరణించి ఉంటాడని భావించవలసి వస్తోంది. మొదటి పోతరాజు కాలం లోనే చాగి వంశం సర్వాలంకార శోభితమై విరాజిల్లింది. కోట , దేవాలయ ప్రాకారాది నిర్మాణాలతో పాటు, రాజ్య విస్తరణ చేసి ప్రజల మన్ననలను పొందిన పరిపాలనా దక్షుడు మొదటి పోతరాజు. పల్నాటి హైహయులతో ఉన్న సంబంధ బాంధవ్యాల మూలంగా వయస్సు మీద కొస్తున్నా సైన్యాన్ని తీసుకొని పల్నాటి యుద్ధానికి తరలివెళ్లాడు మొదటి పోతరాజు. కాలం వక్రించింది. నాలుగు దశాబ్దాల పోతరాజు పాలన అంతరించింది.  అనంతరం విశాలమైన చాగి రాజ్యానికి దోరభూపతి ప్రభువై విజయవాటికను రాజధాని గా చేసుకొని పరిపాలన కొనసాగించాడు.
                      
  

                              చాగిరాజ: పంచదశ వర్షాణి విజయ వాటికాం శశాస. (Arc-335/1892). ఈ దోరభూపతి త్యాగధనుడు గా కీర్తించబడ్డాడు. ఇతను యువరాజు గా ఉండగానే గుడిమేట్ట నగరం లో తన తండ్రి చే ప్రతిష్టించబడిన విశ్వేశ్వర దేవరకు దాస దాసీ జనులను , అంగరంగ వైభోగాలకు మాన్యాలను ఇచ్చినట్లు గా శాసనాల్లో కన్పిస్తోంది.(Arc-
316/1924)
                                     
                                            “శ్రీమత్పోత నరేశ్వరా న్మనునిభా
                                              ద్రాజాంబికాయా మభూ
                                                             ..................................
                                        తస్య త్యాగ గుణాంకస్య దోరభూపస్య నందన:
                                         త్యాగిపోత ధరాధీశో రాజతే రాజమండలే” .  (Arc-300/1924)


                                                             -25-

అని పొగడబడిన త్యాగధనుడు రెండవ దోరభూపతి. వీరస్త్యాగీ భోగ పురందర: శశాస నగరం జిష్ణోర్నందన స్యేహ సర్వత:”(Arc-316/1924).ఇతని కుమారులు పోతరాజు ,గణపతి,భీమరాజు అను వారలు కలరు.
                   
              నరసింహవర్ధన బిరుదాంకితుడైన రెండవపోతరాజు దోరభూపతి యనంతరం రాజ్యానికి వచ్చాడు. ఇతని కాలం గిమెట్ట రాజ్యానికి స్వర్ణ యుగమని చెప్పవచ్చు. తాతగారి పేరు నిలబెట్టిన మనుమడితడు. సింహాచలం వరకు తన యశశ్చంద్రికలను విరియింపజేసిన వీరు డితడు.అనేక ధర్మకార్యాలు చేసి , విరివిగా దానధర్మాలు చేశాడు.ఇతని పాలనా కాలం శా.శ.1119 నుండి1152  వరకు సాగినట్లు శాసనాధారాలు కన్పిస్తున్నాయి. ముక్తేశ్వర మహాదేవరకు ముక్త్యాలలో దేవాలయ నిర్మాణం చేశాడు. త్రిపురాంతక ,కాశ్మీర మల్లేశ్వర ,విశ్వనాధ చోడ నీరాయణ దేవాలయాలకు కనక కలశాలను ఎత్తించాడు. సింహాచల నాపసింహునకు చాగి సముద్రమనే  చెఱువును త్రవ్వించాడు. శ్రీశైల మల్లి ఖార్జునుని ముందు నందికేశ్వరుని ప్రతిష్ఠించి , దేవభోగముల నిమిత్తం కంభంపాడు , ముచ్చింతాల ,బూదపాడు గ్రామాలను దానంగా ఇచ్చినట్లు ముక్త్యాల లోని ముక్తేశ్వర ఆలయం లోని శాసనం చెపుతోంది. అంతే కాదు. ముక్తేశ్వరునకు హవిర్బిల్వార్చనలకు  ముక్తి యనే గ్రామాన్ని, మూడువందల ఆవులను , మరియు , రత్నమయ కిరీటాన్ని సమర్పించాడు.
                                                        

                                                           శ్రీ ముక్తేశ మహేశ్వరాయ
                                                         హవిర్బిల్వర్చనాభ్యో దదత్
                                                             ముక్తిగ్రామ ముపాధినా విరహితం
                                                       చాసాం గవాం త్రిం శతం
                                                        రాజద్రత్నమయం కిరీట....
                                                         త్యాగి పోతాధిప:”

                                                             -26-

                            స్వవంశ రక్షణార్ధం  గుడిమెట్టలో స్వయం భూదేవుని ప్రతిష్ఠించాడు. రాజేంద్రచోడుని ద్వారా ప్రాప్తించిన తమ సామంత రాజ్యము నకు గర్తు గా, కులోత్తుంగ రాజేంద్ర చోడుని పై నున్న అభిమానం తో తన ప్రధాన నగరమైన గుడిమెట్ట లో చోడ నారాయణ స్వామి ఆలయము త్యాగి రాజులచే నిర్మించబడింది. మనకు గుడిమెట్ట శిథిలాలలోకన్పించే వైష్ణవాలయ శిథిలాలు ఈ చోడనారాయణ స్వామి ఆలయానివై యుండనోపు.చాగిరాజులు ఆనాటి అనేకానేక రాజులవలెనే శైవమతానుయాయులయ్యూ, వైష్ణవమతాన్ని సైతం ఆదరించడం కాలం లో వచ్చిన మార్పుగా స్వీకరించారు. కాకతీయులు కూడ ఈమార్గాన్నే అనుసరించారు.  సింహాచల నరసింహునికి రెండవపోతరాజు చేసిన దానధర్మాలు ఇందుకు తార్కాణాలు.
                       

                      


                                                    ఆలయ అంతర్భాగం
                     

                    ఇతని బిరుద నామమే నరసింహవర్ధన ” అని ఇంతకుముందే చెప్పుకున్నాం. శ్రీయోగానంద నారసింహదేవర దివ్య పాదపద్మారాధకుడనని వేదాద్రి నారసింహుని గూర్చి చెప్పుకున్న విశిష్ట వ్యక్తిత్వం ఇతనిది.విజయవాడ లోని శ్రీమల్లేశ్వర స్వామి కి హవిర్బిల్వర్చనాదులకు నోచెండ్ల గ్రామాన్ని, జక్కంపూడి లోని రెండు భాగాలను దానం చేశాడు.(Arc-335/1882).జక్కంపూడి లోని మిగిలిన భాగాలను రాజనారాయణ దేవరకు ,గోగ్రా సార్ధము గోరా లంకను దానం చేశాడు. క్రీ.శ 1230 లో తన సోదరుడు గణపతి తో కలసి కుఱుకూరు లోని సోమనాధ దేవరకు , స్యయంభూ దేవరకు మాన్యాలను దానం చేశాడు.(Arc-273,275/1924 ).అనుమంచిపల్లి గ్రామం లో శివాలయాన్ని నిర్మించి  ఆ మహాదేవరకు భూమలను దానం చేశాడు.(ప్రా.చా. భూ.185 వ పే.).తనపేర పోతపుర మనేఅగ్రహారాన్ని పెంపొందించి,హింతాల ,తాళ, అగరు ,నారికేళ వృక్షాలతో విలసిల్లునట్లు చేశాడు.ఈ విధం గా 33 వసంతాల పైచిలుకురాజ్యపాలన చేసిన ఘనుడు. రెండవపోతరాజు.చాగి వంశం లో కలికితురాయి యనదగిన వీరుడు ఈ  నరసింహవర్ధన పోతరాజు. ఈ విధం గా దేవతారాధన తోనే ప్రొద్దుపుచ్చక నతవాటిసీమ సస్యశ్యామలమై, పాడిపంటలతో పచ్చ గా ఉండటానికై క్షీరనది నుండి (పాలేరు )  కావేరి ని బోలు పెద్ద పంటకాలువ ను త్రవ్వించిన రాజశేఖరుడు ఈ రెండవ పోతరాజు.
                                      
                                               పరోపకార  సంపత్తి సిద్ధయే పుణ్య వృద్ధయే

                                                             -27-
                                            

                                             తుల్యాం క్షీరనదీ కుల్యాంకావేరా కృతవానసౌ
                                                పోతపురాఖ్యం ప్రథితాగ్రహారం..............” (ప్రా.చా.భూ.185 వ.పే.)
       

                      నరసింహవర్ధన పోతరాజు కు సంతానం లేకపోవడం వలన ఇతని యనంతరం ఈతని సోదరుడు గణపయ రాజు రాజ్యానికి వచ్చాడు. ఇతను అన్నగారిచ్చిన రాజ్యాన్ని కాపాడుకోవడానికే కష్టపడినట్లుగా కనిపిస్తోంది.రెండవపోతరాజు ,గణపయ రాజు కలిసి వేయించిన కుఱుకూరు , కోసవీడు శాసనాల్ని పరిశీలిస్తే ,సంతానం లేని నరసింహవర్ధన పోతరాజు  తమ్ముణ్ణే అనురాగం తో చేఱదీసి , ఆదరించి ,రాజ్యాన్ని అప్పగించినట్లు భావించవచ్చు. నవాబు పేట శాసనం లో కూడ అన్నదమ్ములిద్దరూ కలిసి సమర్పించిన దానాలే ప్రస్తావించబడ్డాయి. పోతరాజు గుడిమెట్ట ను పాలిస్తుండగా , గణపయరాజు పెనుగంచిప్రాలు ఏలిక గా ఉన్నాడు. అందుకే ఈ మూడు శాసనాల్లోను గణపతి ని “ పెనుగంచిప్రోలు గణపతి దేవుండు అని మాత్రమే సంబోధించారు. దీన్ని బట్టి పెనుగంచిప్రోలు వేరు రాజ్యం గా  పాలించబడలేదని ,చాగి వారి రాజ్యానికి ఉపకేంద్రం గా మాత్రమే వెలుగొందిందనే పూర్వోక్త భావాలు ఈ విషయాలకు ప్రోద్బలకాలౌతున్నాయి. ఇది అన్నదమ్ముల మధ్య నున్న  ఆత్మీయతా భావానికి మంచి ఉదాహరణ. పరిపాలనా సౌలభ్యం కోసం సోదరుని పెనుగంచిప్రోలు భాగానికి అధికారి గా నియమించిన ఉదారత త్యాగిరాజులది. ఇది రెండవ దోరభూపతి నాటికే జరిగి ఉండవచ్చు. రెండవ పోతరాజు నాటికిది  స్పష్టంగా కన్పిస్తోంది.
                                      
            


      
                         స్వయంభూ దేవాలయానికి వెళ్లేమార్గం లో కన్పించే వినాయకుడు
                      
         రెండవ పోతరాజు అనంతరం గణపయ రాజు చాగి రాజ్యానికి ఉత్తరాధికారి అయ్యాడు.ఈ గణపయ రాజు శా.శ.1172 వరకు మాత్రమే పాలించినట్లు శాసనాలు లభిస్తున్నాయి. అది క్రీ.శ. 1250 శ్రీగణపయరాజు కృష్ణాతీరం లోని దాములూరు గ్రామాన్ని అమరేశ్వరస్వామి కి దానం చేసాడు. (Arc-255/1897). తల్లి యైన ముప్పాంబ తో కలిసి త్రిపురాంతకం వెల్ళి గోదానం చేసి వచ్చాడు. (Arc-234/235/1905).ఇంతకు మించి గణపయరాజు ను గురించిన విషయాలేమీ లభించడం లేదు. ఇతను అన్నగారితో కలిసి వేయించిన శాసనాల్ని గూర్చి ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఈయన కాలం ప్రశాంతంగా


                                                          -28-

గడిచిపోయినట్లు కన్పిస్తోంది. ఆంధ్రజాతి హృదయాల్లో   తిక్కన హరిహరాద్వైతం ప్రవేశించి, ప్రశాంత మనస్కు లౌతున్న  సమయమది .
                          
                  గణపయ చిన్నాంబికల కుమారుడు మనుమ చాగి గణపతిదేవరాజు.త్యాగి పోతరాజు మనుమడు కాబట్టి మనుమ చాగిరాజని ,తండ్రిపేరు గణపయ కాబట్టి మనుమ చాగి గణపతి దేవరాజు గా పిలువబడ్డాడు. క్రీ.శ. 1250 నుండి 70 వరకు ఇతని శాసనాలు               కన్పి స్తున్నాయి. మనుమ చాగి గణపతి దేవరాజు ప్రభవ నామ సంవత్సర జ్యేష్ట బహుళ అమావాస్య నాడు సూర్యగ్రహణ సమయం లో నరసింహ తీర్ధ నిలయుడైన వేదాద్రి ప్రతాప శ్రీ నరసింహ దేవునికి వేముపల్లి ( వేముల పల్లి) అగ్రహారాన్ని కృష్ణవేణీ నదీతీరం లో ధారాపూర్వకం గా  దానం చేశాడు. (Arc-309/1924). శ్రీవత్స గోత్రీకుడు, చెవలీంద్ర యజ్వ మనుమడు ,కుమారస్వామి యజ్వ కుమారుడు నైన సోమయాజి భాస్కరుడు  చాగి వారి రాజ్యాభివృద్ధి కై చాగి మన్మగణపేశ్వరుని పేరు తో ఈశ్వరాలయాన్ని నిర్మించగా,శ్రీ మనుమ గణపతి దేవరాజు ఈ ఆలయానికి  కొంత మాన్యాన్ని దానం చేశాడు. (Arc-283/1924).
                       
                          చాగి మనుమ గణపతి దేవరాజు యనంతరం మూడవ పోతరాజు శాసనం ఒకటి బెజవాడ లో లభించింది. ఇంతకు మించిన వివరాలేవీ లభించలేదు.
                       

            ఇతని యనంతరం భీమరాజు కుమారుడు దోరపరాజు రాజ్యానికి వచ్చాడు. చాగి భీముని కుమారుడు దోరభూపతి నతవాడి సీమ నేలుతూ,  ఏలేశ్వర మహాదేవుని ప్రతిష్టించి, .మున్నా నది  కవతలనున్న కొన్ని భూములను హవిర్బిల్వార్చనలకు యిచ్చినట్లు గా శాసనం లభిస్తోంది.(Arc-279/1924 ).
                                           
                   దీన్ని బట్టి దోరభూపతి కుమారులు ముగ్గురు కొంచెం ముందు వెనుకలు గా  నతవాడి సీమ నేలినట్లు గా మనం భావించవచ్చు.నరసింహవర్ధన పోతరాజు సంతాన హీనుడవడం తో అతని తమ్ముడు గణపయ్య రాజ్యానికి వచ్చాడు. ఇతని మనుమడు మూడవ పోతరాజు యనంతరంగణపయ రాజు తమ్ముడైన భీమరాజు కుమారుడు దోరభూపతి సింహాసనం

                                                     -30-

    అథిష్టించాడు. సోదరులందరికీ  ప్రాతినిధ్యం     లభించింది కాని అగ్రగణ్యుడు అగ్రజుడైన నరసింహ వర్ధన పోతరాజే.
                            

                            ఈ విధంగా గుడిమెట్ట ,బెజవాడ ,పెనుగంచిప్రోలు ప్రధాన నగరాలుగా ,ప్రధాన కేంద్రాలుగా చాగి రాజ్యం  కొనసాగింది. కొన్ని సమయాల్లో గుడిమెట్ట, పెనుగంచిప్రోలు , మరికొన్ని సమయాల్లో బెజవాడ  ,పెనుగంచిప్రోలు  కేంద్రాలు గా చేసుకొని చాగి వారు పాలన సాగించారు. ప్రధాన రాజధాని గుడిమెట్ట ,బెజవాడ లే ఐనా ,పెనుగంచిప్రోలు కూడా చివరి రోజుల్లో ప్రదాన నగరం గా విలసిల్లినట్లు ఆ పట్టణ శిథిలాలు సాక్ష్యాలిస్తున్నాయి. చాగి మన్మ రాజు ,మనుమ చాగిరాజు ,రుద్రయ త్యాగి రాజు అనే వారు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు శాసనాలు చెపుతున్నాయి. (Arc-254 /259/317/-1924).సరైన  వివరాలు లభ్యం కావడం లేదు. గుడిమెట్ట లో మనకు క్రీ.శ. 1268 నాటి శాసనం ఒకటి లభిస్తోంది. దాని వలన గుడిమెట్ట స్ధితి ఆనాటికి బాగానే న్నట్టు తెలుస్తోంది.
                                  
                          ఆ యనంతరం నలభై, యాభై ఏళ్ళ లో చాగి వారి లో ముగ్గురు నల్గురు రాజుల పరిపాలన సాగే అవకాశం ఉంది. అంతర్గత కలహాలు ,రెడ్డిరాజుల దాడులు , బహమనీ సుల్తానుల దండయాత్ర లు 13 వ శతాబ్ది ప్రారంబం లో  కృష్ణా ఉత్తర తీరాన్ని కుదుపి వేశాయి. క్రీ.శ.1323 లో ముస్లిం దండయాత్ర లు,  హైందవ రాజుల అంతర్గత కలహాలతో కాకతీయరాజ్యం పతనమైంది. ఓరుగల్లు కోట శత్రువుల వశమైంది. తెలుగు పతాక నేలకొరిగింది. సామంత రాజ్యాలకు కష్టకాలం  దాపురించింది.
                                        
                      పదమూడవ శతాబ్జం చివర  లోనే ఇచ్చటి చరిత్ర పూర్తి గా శిథిలమైంది.దానికి కారణం బహమనీ సుల్తానుల , గోల్కొండ నవాబుల, రెడ్డిరాజుల దాడులు వీరిపై అధికంగా జరిగాయి. నదీ తీరం లో అన్నింటికీ మార్గమధ్యం లో ఉన్న సామంత రాజ్యం గా ఇదిఎన్నో ఆటుపోట్లను తట్టుకోవలసి వచ్చింది.బహమనీ సుల్తును ఫిరోజ్ షా క్రీ.శ 1437 లో వేయించిన శాసనాలు రెండు వేదాద్రి లో కన్పిస్తున్నాయి.(కష్ణా గెజిట్.46p.p.).ఈఒక్క సాక్ష్యం చాలు ఈ శిథిలాలకు సమాధానం చెప్పడానికి.

                                                           -31-
        
                         నరసింహవర్ధన పోతరాజు బెజవాడ  రాజధాని గా పాలన సాగించేటప్పుడు  గణపయరాజు పెనుగంచిప్రోలును చూసుకున్నాడు. గణపయరాజు బెజవాడ రాజధాని కి వెళ్ళగానే భీమరాజు కు పెనుగంచిప్రోలు లభించింది. ప్రధాన కేంద్ర పోయిన తర్వాత కొద్దికాలం  ఉపకేంద్రం లో రెడ్డిరాజుల కు  సామంతులు గా ఈరాజ్యం కొంతకాలం సాగి డవచ్చు. మహమ్మదీయులకు కప్పం గడుతూ మరి కొంతకాలం ఈడ్చి ఉండడచ్చు. కాని ఇవేమీ చరిత్ర కందటం లేదు. కృష్ణానది ఇసుక పొరల్లోనో, మున్నానది ఇసుక మేటల్లోనో కూరుకు పోయి,ఉండవచ్చు.  ఆ  గాథల్ని అగాధాల్లో నుంచి వెలికితీయడం భావి పరిశోధకుల కు సాథ్యం కావచ్చునేమో.
                                        
                           బహమనీ సుల్తానులు,రెడ్డిరాజులు,గోల్కొండ నవాబులే కాక సామంతరాజుల్లో ఒకరి నొకరు పరస్పర ఆహరణోద్యమం తో ఆంధ్రభూమి అట్టుడికిపోయిన కాలం 13,14 శతాబ్దాలు. పెద్దదొరల తోనే కాక చిన్న సంస్ధానాలు కూడ తమ లో తామ సంఘర్షించుకొని కూలిపోయాయి. ఆబోతుల నడుమ లేగలై  నలిగిపోయాయి. క్రీ.శ.1268 నాటి రుద్రమ దేవి గుడిమెట్ట సాసనాలు ,1259 నాటి చాగి మనుమ గణపతిదేవ వేదాద్రి శాసనాలు చాగి చరిత్ర లో శిలా శాసనాలే.  1323 నుండి చింతపల్లి, (Arc-173/1917) ,తాడికొండ  (Arc-561/1909) ప్రాంతాల్లో కాకతి ప్రతాప రుద్రుని శాసనాలు కన్పిస్తున్నాయి.1306  లోను మరియు1314 లోను నందిగామ తాలూకా నడిగూడెం లో (Arc-297/298/1924)శ్రీమన్మహా సామంత చెఱకుజగదాళు అన్నమ రెడ్డి రాజ్యం చేస్తుండగా అల్లుసూరిశెట్టి వేయించిన శాసనాలు రెండు కన్పిస్తాయి. చెన్న మల్లి ఖార్జునునకు చేసిన  దానశాసన మిది. దీనిలో ప్రతాపరుద్రుడు మహామండలేశ్వరుడు గా గౌరవించబడ్డాడు.
                           

                   


                                      స్వయంభూ దేవాలయానికి వెళ్లేమార్గం లో కార్తికేయ శిల్పం
                      
                         గుడిమెట్ట చాగి రాజులు  రెడ్డి, కాకతీయల సామంతులు గా పాలన సాగించినట్లు పూర్వ విమర్శకులు భావించారు.(కృష్ణా గెజిట్/49 పే.) కాని ఇక్కడ శాసనాధారాలు  కాకతీయుల వరకే పరిమితమౌతున్నాయి. శిథిలాల్లో ఏమైనా ఉన్నాయేమో లభించలేదు. కృష్ణా గెజిట్  లో చెప్పిన వాక్యాలకు ఉదాహృత శాసనాలు లేవు.
                                               

                                                       -32-
                         
                             ఇక్కడ మరొక్క విషయాన్ని ప్రత్యేకం గా గుర్తించాలి. అదేమిటంటే-క్రీ.శ 1130 నుండి 1290 వరకు సాగిన గుడిమెట్ట పాలనలోలభించిన  సాక్ష్యాలు ఆధారాలను బట్టి ఈ తేదీలు నిర్ణయించబడ్డాయి. లభించిన ఏ  శాసనం లోను వేరొకరాజును గౌరవసూచకం గా  చాగివారు ప్రస్తావించలేదు. వారి విజయాభివృద్ధి కి ఏ దానధర్మాలు చేయలేదు. 313/1924  శాసనం లో చేసిన రాజేంద్ర చోడుని తమ వంశప్రతిష్ట ను పెంచుకోవడం కోసం చేసినదే కాని వేరు కాదు.  అంతేకాని నడిగూడెం శాసనం లో వలే ప్రధాన మండలేశ్వరుడని పొగడటం, వారి క్రింది సామంతుని,దానకర్త ని  ప్రస్తావించడం వంటివి చాగివారి శాసనాల్లో కన్పించవు. దీన్ని బట్టి వీరి మాండలిక రాజ్యం ఎంత పటిష్టం గా ఉందో మనం ఊహించవచ్చు. కాబట్టే రెండు శతాబ్దాలు నిరాటంకం గా కొనసాగింది.
                         
                 

                     

                                                 కాకతీయ సామ్రాజ్యం

                        క్రీ.శ 1268 లో రుద్రమదేవి ప్రస్తావన కల్గిన గుడిమెట్ట శాసనం  శివరాత్రి నాడు గుడిమెట్ట లోని విశ్వేశ్వర  మహాదేవరకు బేతవోలు గ్రామం దానం చేయబడి నట్లుంది. కట్టసాహిణి ప్రస్తావన దీనిలో కన్పిస్తుంది .కాని ఆనాటి గుడిమెట్ట పాలకుని ప్రస్తావన కూడ ఇందు లో లేదు. మరి రెండు శాసనాలు కూడ ఇదే కాలం లోనివి ఈ శిథిలాల్లో మనకు కన్పిస్తాయి. ఇవి పూర్తి గా నాశనం చేయబడ్డాయి.( చిత్రాలు 17,18.) రుద్రమదేవి క్రీ.శ. 1269 లో పట్టోద్దతి పొందినట్లు పల్నాటి లోని దుర్గి శాసనం చెపుతోంది.(Arc-573/1909). అంటే 1268 లోన గుడిమెట్ట శాసనం రుద్రమదేవి యువరాజ్ఞి గా  ఉన్నప్పటి శాసనం .
                                                     
                 



                    అయితే రామవిలాస కావ్యకర్త శ్రీ ఏనుగు లక్ష్మణకవివత్సవాయి మూలపురుషుడు గా సాగిపోతరాజు ను కొనియాడాడు. ఈ కావ్యం వత్సవాయి గోపరాజు కు కితం చేయబడింది. కాని పూసపాటి రాచిరాజు వ్రాసిన సీసమాలిక లో వత్సవాయి వంశానికి మూల పురుషుడు గా దానరాజు ను పేర్కొని ,అతను చంద్రవర్మ చే వత్సవాయి ని కానుక గా పొందాడని ,  బహుమతి పొందిన తారీకు క్రీ.శ. 1175 గా చెప్పాడు.(స.ఆ.సా/చాళుక్య యుగము-ఆరుద్ర ).కాని శాసనాద్యాధారాలు పరిశీలిస్తే   క్రీ.శ. 1175 నాటికి మదటి పోతరాజు వైభవం గా రాజ్యపాలన


                                                                -33-
చేస్తున్నట్లు , ఇతను పల్నాటి యుద్ధం లో పాల్గొన్నట్టు మనం గమనించాము. కాబట్టి ఈ  వాదన తప్పు.
                                     
           
                                                        
                                                             శిథిల శాసనాలు

                           సాగిపోతరాజ మనుమని  మనుమడైన రామరాజ కాలం లో చాగి వారికి  వత్సవాయి లభించింది.  వత్సవాయి వీరికి ప్రధాన నగరం అవడం వలన   వీరు ఆనాటి నుండి వత్సవాయి వారుగా పిలవ బడుతున్నారు.(ఆంధ్రుల  సంస్ధానములు సాహిత్య పోషణము/264 వ పేజి.).రెడ్డిరాజుల కాలం లో వీరు కొంతకాలం వారికి సరదారులు గా పనిచేశారు.    వత్సవాయ చతుర్భుజ తిమ్మరాయ జగపతి బహద్దరు వారు ఈ సంస్ధాన స్ధాపకులు. వీరి తండ్రి వత్సవాయి పేర్రాజు గారు. తిమ్మరాయజగపతి బహద్దర వారు  పరిసర రాజజులను ఓడించి ,రాజ్యవిస్తరణ గావించి ,పెద్దాపురము లో కోటను నిర్మించినట్లు గా చెప్పబడుతోంది. వీరి తల్లి గొట్టుముక్కల వారి యాడపడుచు నారమాంబ గారు. దీన్ని బట్టి చాగి వంశం వత్సవాయి గా నామాంతరం పొంది , పెద్దాపురం సంస్ధానం గా రూపుదిద్దుకుంది. మనుమ చాగి గణపతి దేవుని యనంతరం నాల్గయిదు తరాల అంతరం తర్వాత వత్సవాయి లో వెలిసిందని భావించవచ్చు. షేరు మహమ్మదు ఖానుడు  చతుర్భుజ తిమ్మరాజు వీరోచిత కృత్యాలకు మెచ్చి కత్తి నొక దానిని బహూకరించి నట్లు రామవిలాస కథనం.
               
                       షేరుమహమ్మదు క్షితిప శేఖరు డద్భుత శౌర్య ధైర్య దు
                   ర్వారుడు మెచ్చి పైడి యొర వాల్దన కేల నొసంగు వేళ దై
                  త్యారికి సమాన మూర్తి తనహస్తము మీదుగ నందె వార్ధి గం
                గంభీరుడ వత్సవాయి కుల పేరయ తిమ్మ నృపాలుడున్నతిన్.”(ఆం సం.-సా.పో/264.)
                          

                తిమ్మరాజు కాలం 16 వశతాబ్దం. క్రీ.శ.1555-1607.   కులీకుతుషా  1531-32 లో (కృష్ణరాయల మరణానంతరం) తెలగాణా , తీరాంధ్ర దేశం పై నాలుగు దండయాత్రలు చేశాడు. ఈతని మూడవ దండయాత్ర లో ప్రతాప రుద్ర గజపతి  సామంతుడు, వరంగల్లు పాలకుడైన

                                                            
                                                             -34-

 షితాబ్ ఖాన్  అనబడే సీతాపతి తో ,కొండపల్లి ని పాలిస్తున్న ప్రతాపరుద్రుని కుమారుని తోను తలపడ్డాడు.(దక్షిణ భారత దేశ చరిత్ర,1336-1795/ 98 వ.పే.)  ఈ యుద్ధం పెనుగంచిప్రోలు లో జరిగింది.పరిసరాల తెలుగు రాజులు కూడ ఈ యుద్ధం లో పాల్గొన్నారు.  3 లక్షల కాల్బలాన్ని, 30 వేల ఆశ్విక బలాన్ని ,700 వందల ఏనుగుల్ని హిందూరాజులు యుద్ధం లోకి దింపారు. (ఆంథ్రుల చరిత్ర సంస్కృతి/ 283 .పే) కాని ఇంత సైన్నాన్ని సుల్తాన్ కులీ ఐదువేల అశ్వ సైన్యం తో ఓడించాడు.  హిందూరాజుల సైన్యం అధికంగా ఉండటం వలన వారికే కాలు చేతులు ఆడని స్థితి కల్గింది. మెరుపు యుద్ధం లో  కులీనేర్పరి అని  మద్దానీ వ్రాశాడు . ఈ యుద్ధం పెనుగంచిప్రోలు వద్ద  జరగడం తో చాగి వంగడం లో మిగిలిన కొద్ది వెలుగు కొడి గట్టింది. పెనుగంచిప్రోలు శిల్ప సంపద యావత్తూ మునేరు  పాలయ్యింది. ఆయనంతరమే వత్సవాయి సంస్ధానం  ఆవిర్భవించింది. శ్రీ తిమ్మరాజు కాలం క్రీ.శ. 1555  గా చెప్పుకున్నాం.వీరే పెద్దాపుర సంస్ధానాన్ని  స్ధాపించారు. 
                            
                  వత్సవాయి  చతుర్భుజ తిమ్మరాయ జగపతి బహద్దరు వారు పెద్దాపుర సంస్ధాన స్ధాపకులు. ఇది అతి పురాతన సంస్ధానము. మూడు శతాబ్దాల అతి ప్రాచీన చరిత్ర గల సంస్ధానమిది. గోదావరీ మండలం లోని కొంతభాగాన్ని, కృష్ణా గుంటూరు మండలాల్లోని కొంతభాగాన్ని , విశాఖ పట్టణం మండలం లోని కొన్ని గ్రామాలు ఒకనాటి పెద్దాపురం సంస్ధానం లోనివే.   ఈ సంస్ధానానికి ముఖ్యపట్టణమైన పెద్దాపురం రాజమహేంద్ర వరానికి ఈశాన్యం గా పది క్రోసుల దూరం లో ఉంది. వీరి ఆస్ధానం లో కవిశేఖరులు  కావ్యాలు వ్రాసి చరిత్ర కు వెలుగుచూపారు.   వీరిలో ఏనుగు లక్ష్ణణ కవి ప్రసిద్ధులు . కవి పండితులను పోషించి  పెద్దాపురం సంస్ధానం ప్రసిద్ధి పొందింది.

                                                                      తరువాయి భాగం త్వరలో  ----------------






************************************************