శతకసౌరభాలు – 6
తమ్మర గోపన్న – శ్రీ జానకీ శతకము -2
ధరణియు నాకసంబును నథ శ్శిల పై శిల గాగ సత్యమే
స్ధిరమగు బొడ్డుగాగ నతి శీఘ్రత వర్తిలు నీ ప్రపంచమన్
తిరుగలి లో నలంగు నతి దీనుని వీనిని
గావుమంచు నీ
వరుసము తోడ శ్రీ రఘుకులాగ్రణి తో నను మమ్మ
జానకీ !
అమ్మా! జానకీదేవీ! ప్రపంచమనే ఈ తిరుగలికి భూమ్యాకాశాలు క్రింది రాయి , పై రాయి కాగా సత్యమే మధ్య బొడ్డు పుడక గా ఉండి మిక్కిలి వేగం తో పరిభ్రమిస్తుడగా ఈ తిరుగలి లో పడి నలిగి పోతున్న ఈ దీనుని కాపాడమని రఘుకులాగ్రణి తో చెప్పు తల్లీ.!
మతి గల మీర లిట్టి మతిమాలినబిడ్డల కాటవస్తు సం
తతులిడి , వానితో సదమదంబయి మిమ్ముఁ
దలంపకున్నచో
నతి కలుషాత్ములంచెనె దరా కఱుణాళులకిధ్ది ధర్మమే
గతి నగునంచుఁ బల్కు
రఘుకాంతునితో దయయుంచి జానకీ !
అమ్మా.! సీతమ్మ తల్లీ.! మతిమంతులయిన మీరే మతిమాలిన బిడ్డలకు ఈ లౌకిక ప్రపంచం లో ఆడు
కోవడానికి వివిధములైన వస్తువులను సమకూర్చి , వాటితో వాడు సతమతమై పోతూ మిమ్మల్ని స్మరించడం మర్చిపోతే
వాడిని పాపాత్ముడని నిందిస్తారా. కరుణాళువు లైన మీకు ఇది ఏ విధంగా ధర్మమని పిస్తోంది స్వామీ. అని
రఘుకాంతుని అడగవమ్మా జనకుని కూతురు వైన ఓ రామచంద్రుని ఇల్లాలా.!
సకల చరాచర ప్రజల జన్మ జరామరణస్వభావ బో
ధకమగు పద్దు నుండి మన దాసుని తప్పు
రికార్ఢు మీ రహే
తుక కృప నెఱ్ఱ గీత యిడి త్రోసి
క్షమింపక తప్ప దంచు మ
చ్చిక మెయి విన్నవింపు రఘుశేఖరు తో
దయయుంచి జానకీ !
అమ్మా!. జానకీమాత.!సమస్త చరాచర జీవరాశి
యొక్క జన్మ జరామరణాదులను వ్రాసే పద్దు నుండి మన దాసుని యొక్క తప్పుల రికార్డు ను
అంటే పాపాల చిట్టా ను మీరు
దయాన్వితులై ఎఱ్ఱగీత గీసి కొట్టివేసి వీడిని క్షమింపక తప్పదని మచ్చిక మన ప్రభువునకు విన్నవించు తల్లీ.!
లోకం లో ఉన్న సంప్రదాయం ప్రకారం Red line గీయడమంటే వ్రాసింది అది తప్పు అని , దానిని సరి చేయాలనేది సంకేతం. ఆ విషయాన్నే కవి అమ్మ సీతమ్మ కు చెపుతున్నాడు. తన తప్పుల చిట్టా ను ఒక్క ఎఱ్ఱగీత తో కొట్టేసి తనను పవిత్రుణ్ణి చేయమని , అందుకు అమ్మను సిఫార్సు(recommendation) చేయమని వేడుకుంటున్నాడు. అమ్మ దగ్గర బిడ్డకు అడగకూడనిది ఉండదు కదా. తల్లి వద్ద బిడ్డకుండే చనువు అటువంటిది.
తప్పు లొనర్చినాడనని తానయి
చెప్పుచు మీ సమక్షమం
దిప్పగిదిన్ విధేయుడగు నీతనిఁ
బ్రోవకయున్న నెప్పుడున్
దప్పు లొనర్చి లేదను నతథ్యపు వాదిని
బ్రోచుటెట్టులో
చెప్పుడు చూతమంచు రఘుశేఖరు తో
ననుమమ్మ జానకీ ! ( 51 )
అమ్మా .! సీతామాతా ! తాను
తప్పుల చేశానని తనకు తాను గా మీసమక్షం లో తప్పులొప్పుకుంటున్న విధేయుడైవ వీడిన మనం
బ్రోవని యెడల తప్పులు కూడ తాను టువంటి తప్పులు చేయలేదని బుకాయించే అబద్దాలకోరు ను
కాపాడటం ఎలాగో చెప్పండి చూస్తానని రఘునాథునితో అనవమ్మ జానకీ.
వరమతియైన
గౌతముని పత్నికిఁ గల్గిన జారదోష బం
ధురతర మంతయు న్దొలగ ద్రోచి స్వపాద విసర్పణంబునన్
స్థిర తర కీర్తి చంద్రికల దేశము
నెల్లెడ నింపినట్టి నీ
వరునకు రామచంద్రున కవశ్యము నాగతి దెల్పు జానకీ !
అమ్మా! సీతమ్మ తల్లీ ! సుగుణ శీల యైన గౌతమమహర్షి ధర్మపత్ని కి అంటిన జారత్వమనే భయంకరమైన కళంకాన్ని తన పాదస్పర్శ చే
తోసివేసి , శాశ్వతమైన కీర్తి చంద్రికలతో ప్రకాశింపచేసిన నీ వరుడైన
మా రామచంద్ర ప్రభువు నకు నన్నుగూర్చి తెలియ చెప్పుము తల్లీ.!
చనువున స్వీయరాజ్య మనుజప్రకరంబుల నెల్ల బిడ్డలన్
జనకుడు వోలె నేలికొను సద్గుణుఁ డా
జనకుండొనర్చు చుం
డిన సవనంబుఁ జూడగ వడిన్ గుశికాత్మజు
వెంబడించు రా
మునకు మదీప్సితం బఖిలము న్వివరింప
గదమ్మ జానకీ ! (55)
అమ్మా.! జానకీ దేవీ.! జనకుడు (తండ్రి ) తన బిడ్డలను చూసుకున్నట్టు గా తన పాలన లోని ప్రజలందరిని
జనకుని వలే పాలించు సద్గుణ శీలి యైన ఆ జనకమహారాజు చేసెడి యజ్ఞాన్ని చూడడానికి
గురువైన విశ్వమిత్రుని వెంట వడివడిగా అడుగు లేస్తూ మిథిలా నగరం లో ప్రవేశించిన శ్రీ రామచంద్రునకు నా కోరికను
మెల్లగా వెల్లడించు తల్లీ.!
దివిజుల కేన్గదల్చుట కతి శ్రమ సాథ్య మనల్పసార మా
భవుని శరాసమద్ది వెస భగ్నమొనర్చె
విదేహరాట్సభా
భవనగతాఖిలప్రజ సెబాసని మెచ్చుకొనంగ
నట్టి రా
ఘవులకు నావెతల్ తెలుపఁగా వలె నమ్మ
యిఁకేని జానకీ !
అమ్మా.! దేవతలకు కూడ కదల్చడానికి
అతిశ్రమము , అసాధ్యము , అనల్పము నైన శివధనుస్సు ను జనకరాజ సభా భవనం లో చేరిన సమస్త
జనవాహిని సెబాసని మెచ్చుకొనేటట్లు గా భగ్నమొనర్చిన ఆ రాఘవునకు ఏ విధంగానైనా నా బాధలను
తెలియ జేయాలి తల్లీ.!
శ్రీరామచంద్రుని
గొప్పతనాన్ని ప్రస్తావిస్తూనే తన ఘోషను తల్లి కి వినిపించడం మాత్రం మర్చిపోవడం లేదు
కవి. ఈ సమయం లో నైనా రామయ్య తనను ఔ నంటాడేమో నని కవి
ఆశ.
అమిత సురూప సంపదల నందఱి
మీఱెడు మిమ్ముజూచి వి
భ్రమ పడినట్టి రాముని కరంబున నీ కరముంచి
యవ్విదే
హమహిపు డొప్పగింప నతి హర్షమునన్
గ్రహియించు నాటి మో
దము దలపించువేళఁ దమ దాసుని ముచ్చట తెల్పు జానకీ
!
అమ్మా.! అత్యంత సుందర సుకుమార
లావణ్యసీమ వైన నిన్ను చూసి శ్రీ
రామచంద్రుడు విభ్రమాంబుథిలో తేలియాడుతున్న
వేళ నీ తండ్రి జనకమహారాజు ఆ రాఘవేంద్రుని చేతిలో నీ చేతిని
ఉంచగా , శ్రీ రామచంద్రుడు నీ మృదుపాణి ని అందుకొంటూ , అనుభవించిన ఆ ఆనందపు మధుర మనోహర క్షణాలను గుర్తుచేసుకొనే మీ ముచ్చట్ల మథ్య లో ఈ దాసుని గురించి కూడ ఒక్కమాట చెప్పు తల్లీ.!
కాంత లతాంత సౌరభ వికస్వర భాస్వర పుష్పవాటికా
భ్యంతర భర్మ హర్మ్య హరిణాంకమణి
ప్రవిభక్త వేదికో
పాంతములందుఁ గేల్గొని విహార
ముచ్చటలాడువేళ వృ
త్తాంతము నాది తెల్పు హృదయాధిపుతో దయయంచి జానకీ
! (60 )
అమ్మా.! సీతమ్మ తల్లీ !. పూలపరిమళాలు మత్తుగా
పరుచకొనే పుష్పవనం లోపలి
అభ్యంతర మందిర సమీపమందలి చంద్ర శిలా వినిర్మిత వితర్దికల చెంత చేయి చేయి కలుపు కొని ముచ్చటలాడుకొనుచు
విహరించే సమయం లో నీ హృదయనాథుని తో నా హృదయ వేదనను దయచేసి కాస్త విన్పించు తల్లీ !
కవికి ఈ పద్య నిర్మాణ సమయం లో మహాకవి
బమ్మెర పోతన ఆంధ్రమహా భాగవతం గజేంద్రమోక్ష ఘట్టం లోని
“అల వైకుంఠపురంబు లో నగరి
లో ఆమూల సౌథంబు దా
పల
మందార వనాంతరామృత సర: ప్రాంతేందు కాంతోపలోత్పలపర్యంకం” గుర్తుకొచ్చింది.
ఆ లక్ష్మీ నారాయణులే ఈ సీతారాములు కదా ! అనుకొంది కవి మనస్సు.
ఇంకేముంది. ఒక అందమైన పూలతోట. అందు లో ఒక ఏకాంత
మందిరం. దాని చెంత
చంద్రశిలానిర్మితమైన తిన్నెలు. వాని చెంత చేతిలో చెయ్యి వేసుకొని
ముచ్చటలాడుకుంటూ విహరిస్తున్న కొత్త దంపతులు గా సీతారాములు కవి మన: ఫలకం మీద కదలాడారు. ఎంత మధురదృశ్యమో
చూడండి.ఆ దృశ్యాన్ని దర్శించిన కవి ఎంత అదృష్ట వంతుడో కదా! కాని ఈ సమయం లో తన ప్రాణనాథునికి తనను గురించి
వివరించమని అమ్మ సీతమ్మ ను
అర్ధిస్తున్నాడు కవి. ఆ
శ్రీరామచంద్రునకు తన వంటి పాపాత్ముడి
పాపాలను విని సహించి సముద్ధరించమని చెప్పడానికి ఇదే సరైన సమయమని కవి భావనై
ఉంటుంది.
“నడి రేయి ఏ జాము లో స్వామి నినుఁ జేర
దిగివచ్చునో... విభునకు మా మొఱ వినిపించలేవా” అంటూ ఆర్తి తో వేడుకొనే భక్తజన సందోహం ప్రభువును నిత్యం పిలుస్తూనే ఉన్నారు
కదా!
దోసము లెన్నఁబోక కృపతో నతరక్షణ దీక్షితుండు దా
నే సమయంబు నందయిన నేగి నతార్తుల నెల్ల
నేలి పోఁ
ద్రోసి గృహంబు సేర రుచిరూషిత రమ్య
సువర్ణ రత్న సిం
హసన మిచ్చువేళ నను నాదట
జెప్పఁగదమ్మ జానకీ ! (61 )
ఈ సమయం లో కవి లో గజేంద్రమోక్షణ ఘట్టం కదలాడుతోందనడానికి ఈ పద్యం కూడ నిదర్శనమే.
అమ్మా! సీతమ్మ తల్లీ.! దీనజనరక్షణ వ్రతుడైన
ప్రభువు రామయ్య వేళాపాలా లేకుండా ఎప్పుడు పడితే
అప్పుడు బయలుదేరి వెళ్లి ఆర్త జన రక్షణ,
దుష్ట జన శిక్షణ చేసి ఆలస్యం గా ఇంటికి వస్తే “స్వామీ! ఎక్కడకు వెళ్ళారు ?ఏం చేసి వచ్చారు? “వంటి ప్రశ్నలతో స్వామిని తప్పు పట్టక ఆయన అర్ఘ్య,
పాద్యాదులను ఇస్తూ నన్ను కూడ ఆదుకొమ్మని చెప్పు తల్లీ.
ఇంట్లో ఉన్న ఇల్లాలికి చెప్పకుండా దీనజనుల ఆర్తరావం వినగానే బయలుదేరి వెళ్ళిపోవడం శ్రీ హరి కి అలవాటు. “తను వేంచేయు పదంబు పేర్కొనక పోవడం” ఆర్త జన రక్షకునకు అలవాటే కదా! అందుకే “సిరికిం చెప్పడు, శంఖ చక్రయుగమున్ సంధింపడు” అంటూ చెప్పుకొచ్చాడు గజేంద్రమోక్షం లో పోతన మహాకవి. పాపం ఆయన ఎక్కడకు వెడుతున్నాడో అడుగుదామనుకొన్న లక్ష్మీదేవి కూడ ---
“అడిగెదనని కడువడి జను
అడిగిన దను మగుడ నుడువడని నడయుడుగున్ “–
అంటూ ఆ శ్రీమహాలక్ష్మి ఆతృత ఈ పద్యం గా రూపుదిద్దుకొంది గజేంద్రమోక్ష ఘట్టం లో.
శ్రీ
తులసీదళంబు లమరించి యనల్ప సుగంధ బంధుర
ఖ్యాతము లైన భవ్య కుసుమాదులఁ గూర్చిన మాలికావళుల్
ప్రీతిని కంఠమందు సవరించుచు మెల్లన
దాపుచేరి నా
చేతలు విన్నవింపు రఘుశేఖరుతో దయయుంచి జానకీ
!
అమ్మా! సుగంధ బంధురమైన సుమమాలల
మధ్య అందంగా కూర్చిన తులసీ దళాలతో అల్లిన పూలదండలను ప్రేమ మీర నీ నాథుని మెడ లో వేసి మృదువు గా సరిచేయుచూ
మెల్లగా దగ్గరకు చేరి నను గూర్చి విన్నవించవా తల్లీ!
కూరిమి పేరిమిన్
కపిల గోరసముల్ నులిగోరు వెచ్చగా
నారిచియుంచితిన్ ఘనకృపాకర మీఱిక
నారగింపుడీ
క్షీరములంచు నర్పణముఁ జేసెడు వేళనైన
దాసునిం
గూరిచి విన్నవింపు రఘుకుంజరు తో
దయయుంచి జానకీ.
అమ్మా!జానకీదేవీ! “ఓ దయా సాగరుడవైన రామచంద్ర ప్రభూ.!
ప్రేమానురాగాలతో కపిలథేనువు పాలను నులివెచ్చగా
చల్లార్చి మీకోసం సిద్ధంచేశాను. ఇకనైనా స్వీకరించండీ “ అని స్వామి కి సమర్పించెడి ఆ మధురమైన సమయంలో నైనా
ఈ దాసుని గూర్చి స్వామి తో వివరించు తల్లీ!
అతిశయ నవ్యసౌరభము లన్ని కకుప్పుల నిండ నిండు న
ద్ఫుతమగు వింత యత్తరువుఁ బూయుచునో,
ఘనసార దీప్తహా
రతుల మరించియో రఘువరా మన బిడ్డని మాట
యేమి చే
సితిరని మాతృవత్సలత చే నడుగన్వలెనమ్మ
జానకీ!
అమ్మా!
అతిశయించిన క్రొత్త పూల వాసనల ఘమఘమ లు
దిక్కులు నిండు చుండ గా అద్ఫుతమైన వింత
వాసనల వెదజల్లు అత్తరును స్వామికి అలదేటప్పుడో , మంచి కర్పూరపు మంగళ హారతు లను
అందిస్తూనో, ఓ రఘువీరా. మన బిడ్డ విషయం ఏం
చేశారని మాతృప్రేమ తో నీవే అడగాలమ్మా.!
ఇక్కడ ముందు
వెనుక ఒక ఇరవై పద్యాలను వ్రాసేటప్పుడు కవి కి వాల్మీకి రామాయణం లోని అయోథ్య ,
అరణ్య కాండలలో వాల్మీకి వర్ణించిన
చిత్రకూట, పంచవటుల లోని సీతారాముల విహారాలు గుర్తుకొచ్చాయనిపిస్తోంది. అనంతర కవులు కూడ సీతారాముల
గోదావరీ తీర విహారాలను మధుర మనోహరం గా
వర్ణించారు కదా.!
శ్రీ గుణశాలి లాలి! యతసీకుసుమాభ శరీర లాలి! ది
వ్యాగమ సన్నుతోత్తమపదాంబుజ లాలి యటంచు
దాసికా
పూగము రాగతాళము లపూర్వము గా మణి హేమడోలికా
భాగమునం బరుండిన యపార కృపాంబుధి నూచుచుండగా – (
69 )
అమ్మా! సీతమ్మ తల్లీ.! నవరత్న ఖచితమైన బంగారు తూగుటుయ్యల పై పరుండిన
అపార దయా సముద్రుడైన మా రామయ్య తండ్రి ని “రామాలాలీ! మేఘశ్యామా లాలీ! దివ్యాగమ సన్నుతోత్తమ
పదాంబుజ లాలీ! దశరథ తనయా లాలీ !అంటూ సేవకా జనము
రాగతాళ పూర్వకంగా గానం చేస్తూ ఊయల ఊపుతుంటే --------
నూగుచుఁ దత్సమీపమున నుండిన నీ జలతారు
పయ్యెదన్
లాగుచు హావభావ సువిలాసము లొప్పగ
నార్తదీనర
క్షాగుణపాలినీ యని యెకానొకముచ్చట
జెప్పువేళలన్
నాగతి
విన్నవింపు రఘునాధునితో దయయుంచి జానకీ ! (70)
శ్రీ రామభద్రుడు ఊయల
ఊగుచూ ఆ సమీపం లో ఉన్న నీ జలతారు పైటను
విలాసం గా లాగుచూ “ఆర్త దీన రక్షా గుణ పాలినీ” అని పిలిచి ముచ్చటించు
వేళ నా గతి కూడ తెలియచెప్పు తల్లీ.!
ఆంథ్రమహా భాగవతం లో
కుచేలుడు శ్రీకృష్ణ మందిరాన్ని చేరేసరికి శ్రీకృష్ణపరమాత్మ తూగుటుయ్యల లోనే గదా దర్శనమిస్తాడు. ఆ
సన్నివేశమే కవికి ఇక్కడ ప్రేరకమై “ఆర్త దీన రక్షా గుణపాలిని” యైన అమ్మ సీతమ్మ పైటను రామయ్య చేతిలో ఉంచాడు.
కొంతకుఁ గొంత నిద్దురను గూర విభుండు, సఖీజనాళి శు
ద్ధాంతము వీడునంత హృదయాధిపు తల్ప మలంకరించి యే
కాంత మిథ:ప్రసంగములయందు నొకింతగ నేని నాదు వృ
త్తాంతము సెప్పుమా రఘుకులాబ్ది
సుధానిథి తోడ జానకీ ! (71)
అమ్మా! జానకీ దేవీ.! ఊయల ఊగుచూ స్వామి కొద్ది కొద్ది
గా నిద్రలోకి జారుకుంటున్న వేళ , దాసీ జనమంతా
అంత:పురం
నుంచి వెళ్ళిపోగా, నీవు శయ్యను అలంకరించి , ఏకాంత ప్రసంగాల సమయం లో
కొంచెం గా నా విషయాన్ని రఘుకులాబ్ది
సోముని తోటి విన్నవించు తల్లీ.!
మూడవ భాగం ---త్వరలో
సీతారామశ్రీరామ
శ్రీరామశ్రీరామశ్రీరామశ్రీరామశ్రీరామ
శ్రీరామశ్రీరామశ్రీరామశ్రీరామశ్రీరామశ్రీరామశ్రీరామసీతారామ
No comments:
Post a Comment