Thursday, 16 July 2015
Sunday, 12 July 2015
శతకసౌరభాలు – 6 తమ్మర గోపన్న – శ్రీ జానకీ శతకము -2
శతకసౌరభాలు – 6
తమ్మర గోపన్న – శ్రీ జానకీ శతకము -2
ధరణియు నాకసంబును నథ శ్శిల పై శిల గాగ సత్యమే
స్ధిరమగు బొడ్డుగాగ నతి శీఘ్రత వర్తిలు నీ ప్రపంచమన్
తిరుగలి లో నలంగు నతి దీనుని వీనిని
గావుమంచు నీ
వరుసము తోడ శ్రీ రఘుకులాగ్రణి తో నను మమ్మ
జానకీ !
అమ్మా! జానకీదేవీ! ప్రపంచమనే ఈ తిరుగలికి భూమ్యాకాశాలు క్రింది రాయి , పై రాయి కాగా సత్యమే మధ్య బొడ్డు పుడక గా ఉండి మిక్కిలి వేగం తో పరిభ్రమిస్తుడగా ఈ తిరుగలి లో పడి నలిగి పోతున్న ఈ దీనుని కాపాడమని రఘుకులాగ్రణి తో చెప్పు తల్లీ.!
మతి గల మీర లిట్టి మతిమాలినబిడ్డల కాటవస్తు సం
తతులిడి , వానితో సదమదంబయి మిమ్ముఁ
దలంపకున్నచో
నతి కలుషాత్ములంచెనె దరా కఱుణాళులకిధ్ది ధర్మమే
గతి నగునంచుఁ బల్కు
రఘుకాంతునితో దయయుంచి జానకీ !
అమ్మా.! సీతమ్మ తల్లీ.! మతిమంతులయిన మీరే మతిమాలిన బిడ్డలకు ఈ లౌకిక ప్రపంచం లో ఆడు
కోవడానికి వివిధములైన వస్తువులను సమకూర్చి , వాటితో వాడు సతమతమై పోతూ మిమ్మల్ని స్మరించడం మర్చిపోతే
వాడిని పాపాత్ముడని నిందిస్తారా. కరుణాళువు లైన మీకు ఇది ఏ విధంగా ధర్మమని పిస్తోంది స్వామీ. అని
రఘుకాంతుని అడగవమ్మా జనకుని కూతురు వైన ఓ రామచంద్రుని ఇల్లాలా.!
సకల చరాచర ప్రజల జన్మ జరామరణస్వభావ బో
ధకమగు పద్దు నుండి మన దాసుని తప్పు
రికార్ఢు మీ రహే
తుక కృప నెఱ్ఱ గీత యిడి త్రోసి
క్షమింపక తప్ప దంచు మ
చ్చిక మెయి విన్నవింపు రఘుశేఖరు తో
దయయుంచి జానకీ !
అమ్మా!. జానకీమాత.!సమస్త చరాచర జీవరాశి
యొక్క జన్మ జరామరణాదులను వ్రాసే పద్దు నుండి మన దాసుని యొక్క తప్పుల రికార్డు ను
అంటే పాపాల చిట్టా ను మీరు
దయాన్వితులై ఎఱ్ఱగీత గీసి కొట్టివేసి వీడిని క్షమింపక తప్పదని మచ్చిక మన ప్రభువునకు విన్నవించు తల్లీ.!
లోకం లో ఉన్న సంప్రదాయం ప్రకారం Red line గీయడమంటే వ్రాసింది అది తప్పు అని , దానిని సరి చేయాలనేది సంకేతం. ఆ విషయాన్నే కవి అమ్మ సీతమ్మ కు చెపుతున్నాడు. తన తప్పుల చిట్టా ను ఒక్క ఎఱ్ఱగీత తో కొట్టేసి తనను పవిత్రుణ్ణి చేయమని , అందుకు అమ్మను సిఫార్సు(recommendation) చేయమని వేడుకుంటున్నాడు. అమ్మ దగ్గర బిడ్డకు అడగకూడనిది ఉండదు కదా. తల్లి వద్ద బిడ్డకుండే చనువు అటువంటిది.
తప్పు లొనర్చినాడనని తానయి
చెప్పుచు మీ సమక్షమం
దిప్పగిదిన్ విధేయుడగు నీతనిఁ
బ్రోవకయున్న నెప్పుడున్
దప్పు లొనర్చి లేదను నతథ్యపు వాదిని
బ్రోచుటెట్టులో
చెప్పుడు చూతమంచు రఘుశేఖరు తో
ననుమమ్మ జానకీ ! ( 51 )
అమ్మా .! సీతామాతా ! తాను
తప్పుల చేశానని తనకు తాను గా మీసమక్షం లో తప్పులొప్పుకుంటున్న విధేయుడైవ వీడిన మనం
బ్రోవని యెడల తప్పులు కూడ తాను టువంటి తప్పులు చేయలేదని బుకాయించే అబద్దాలకోరు ను
కాపాడటం ఎలాగో చెప్పండి చూస్తానని రఘునాథునితో అనవమ్మ జానకీ.
వరమతియైన
గౌతముని పత్నికిఁ గల్గిన జారదోష బం
ధురతర మంతయు న్దొలగ ద్రోచి స్వపాద విసర్పణంబునన్
స్థిర తర కీర్తి చంద్రికల దేశము
నెల్లెడ నింపినట్టి నీ
వరునకు రామచంద్రున కవశ్యము నాగతి దెల్పు జానకీ !
అమ్మా! సీతమ్మ తల్లీ ! సుగుణ శీల యైన గౌతమమహర్షి ధర్మపత్ని కి అంటిన జారత్వమనే భయంకరమైన కళంకాన్ని తన పాదస్పర్శ చే
తోసివేసి , శాశ్వతమైన కీర్తి చంద్రికలతో ప్రకాశింపచేసిన నీ వరుడైన
మా రామచంద్ర ప్రభువు నకు నన్నుగూర్చి తెలియ చెప్పుము తల్లీ.!
చనువున స్వీయరాజ్య మనుజప్రకరంబుల నెల్ల బిడ్డలన్
జనకుడు వోలె నేలికొను సద్గుణుఁ డా
జనకుండొనర్చు చుం
డిన సవనంబుఁ జూడగ వడిన్ గుశికాత్మజు
వెంబడించు రా
మునకు మదీప్సితం బఖిలము న్వివరింప
గదమ్మ జానకీ ! (55)
అమ్మా.! జానకీ దేవీ.! జనకుడు (తండ్రి ) తన బిడ్డలను చూసుకున్నట్టు గా తన పాలన లోని ప్రజలందరిని
జనకుని వలే పాలించు సద్గుణ శీలి యైన ఆ జనకమహారాజు చేసెడి యజ్ఞాన్ని చూడడానికి
గురువైన విశ్వమిత్రుని వెంట వడివడిగా అడుగు లేస్తూ మిథిలా నగరం లో ప్రవేశించిన శ్రీ రామచంద్రునకు నా కోరికను
మెల్లగా వెల్లడించు తల్లీ.!
దివిజుల కేన్గదల్చుట కతి శ్రమ సాథ్య మనల్పసార మా
భవుని శరాసమద్ది వెస భగ్నమొనర్చె
విదేహరాట్సభా
భవనగతాఖిలప్రజ సెబాసని మెచ్చుకొనంగ
నట్టి రా
ఘవులకు నావెతల్ తెలుపఁగా వలె నమ్మ
యిఁకేని జానకీ !
అమ్మా.! దేవతలకు కూడ కదల్చడానికి
అతిశ్రమము , అసాధ్యము , అనల్పము నైన శివధనుస్సు ను జనకరాజ సభా భవనం లో చేరిన సమస్త
జనవాహిని సెబాసని మెచ్చుకొనేటట్లు గా భగ్నమొనర్చిన ఆ రాఘవునకు ఏ విధంగానైనా నా బాధలను
తెలియ జేయాలి తల్లీ.!
శ్రీరామచంద్రుని
గొప్పతనాన్ని ప్రస్తావిస్తూనే తన ఘోషను తల్లి కి వినిపించడం మాత్రం మర్చిపోవడం లేదు
కవి. ఈ సమయం లో నైనా రామయ్య తనను ఔ నంటాడేమో నని కవి
ఆశ.
అమిత సురూప సంపదల నందఱి
మీఱెడు మిమ్ముజూచి వి
భ్రమ పడినట్టి రాముని కరంబున నీ కరముంచి
యవ్విదే
హమహిపు డొప్పగింప నతి హర్షమునన్
గ్రహియించు నాటి మో
దము దలపించువేళఁ దమ దాసుని ముచ్చట తెల్పు జానకీ
!
అమ్మా.! అత్యంత సుందర సుకుమార
లావణ్యసీమ వైన నిన్ను చూసి శ్రీ
రామచంద్రుడు విభ్రమాంబుథిలో తేలియాడుతున్న
వేళ నీ తండ్రి జనకమహారాజు ఆ రాఘవేంద్రుని చేతిలో నీ చేతిని
ఉంచగా , శ్రీ రామచంద్రుడు నీ మృదుపాణి ని అందుకొంటూ , అనుభవించిన ఆ ఆనందపు మధుర మనోహర క్షణాలను గుర్తుచేసుకొనే మీ ముచ్చట్ల మథ్య లో ఈ దాసుని గురించి కూడ ఒక్కమాట చెప్పు తల్లీ.!
కాంత లతాంత సౌరభ వికస్వర భాస్వర పుష్పవాటికా
భ్యంతర భర్మ హర్మ్య హరిణాంకమణి
ప్రవిభక్త వేదికో
పాంతములందుఁ గేల్గొని విహార
ముచ్చటలాడువేళ వృ
త్తాంతము నాది తెల్పు హృదయాధిపుతో దయయంచి జానకీ
! (60 )
అమ్మా.! సీతమ్మ తల్లీ !. పూలపరిమళాలు మత్తుగా
పరుచకొనే పుష్పవనం లోపలి
అభ్యంతర మందిర సమీపమందలి చంద్ర శిలా వినిర్మిత వితర్దికల చెంత చేయి చేయి కలుపు కొని ముచ్చటలాడుకొనుచు
విహరించే సమయం లో నీ హృదయనాథుని తో నా హృదయ వేదనను దయచేసి కాస్త విన్పించు తల్లీ !
కవికి ఈ పద్య నిర్మాణ సమయం లో మహాకవి
బమ్మెర పోతన ఆంధ్రమహా భాగవతం గజేంద్రమోక్ష ఘట్టం లోని
“అల వైకుంఠపురంబు లో నగరి
లో ఆమూల సౌథంబు దా
పల
మందార వనాంతరామృత సర: ప్రాంతేందు కాంతోపలోత్పలపర్యంకం” గుర్తుకొచ్చింది.
ఆ లక్ష్మీ నారాయణులే ఈ సీతారాములు కదా ! అనుకొంది కవి మనస్సు.
ఇంకేముంది. ఒక అందమైన పూలతోట. అందు లో ఒక ఏకాంత
మందిరం. దాని చెంత
చంద్రశిలానిర్మితమైన తిన్నెలు. వాని చెంత చేతిలో చెయ్యి వేసుకొని
ముచ్చటలాడుకుంటూ విహరిస్తున్న కొత్త దంపతులు గా సీతారాములు కవి మన: ఫలకం మీద కదలాడారు. ఎంత మధురదృశ్యమో
చూడండి.ఆ దృశ్యాన్ని దర్శించిన కవి ఎంత అదృష్ట వంతుడో కదా! కాని ఈ సమయం లో తన ప్రాణనాథునికి తనను గురించి
వివరించమని అమ్మ సీతమ్మ ను
అర్ధిస్తున్నాడు కవి. ఆ
శ్రీరామచంద్రునకు తన వంటి పాపాత్ముడి
పాపాలను విని సహించి సముద్ధరించమని చెప్పడానికి ఇదే సరైన సమయమని కవి భావనై
ఉంటుంది.
“నడి రేయి ఏ జాము లో స్వామి నినుఁ జేర
దిగివచ్చునో... విభునకు మా మొఱ వినిపించలేవా” అంటూ ఆర్తి తో వేడుకొనే భక్తజన సందోహం ప్రభువును నిత్యం పిలుస్తూనే ఉన్నారు
కదా!
దోసము లెన్నఁబోక కృపతో నతరక్షణ దీక్షితుండు దా
నే సమయంబు నందయిన నేగి నతార్తుల నెల్ల
నేలి పోఁ
ద్రోసి గృహంబు సేర రుచిరూషిత రమ్య
సువర్ణ రత్న సిం
హసన మిచ్చువేళ నను నాదట
జెప్పఁగదమ్మ జానకీ ! (61 )
ఈ సమయం లో కవి లో గజేంద్రమోక్షణ ఘట్టం కదలాడుతోందనడానికి ఈ పద్యం కూడ నిదర్శనమే.
అమ్మా! సీతమ్మ తల్లీ.! దీనజనరక్షణ వ్రతుడైన
ప్రభువు రామయ్య వేళాపాలా లేకుండా ఎప్పుడు పడితే
అప్పుడు బయలుదేరి వెళ్లి ఆర్త జన రక్షణ,
దుష్ట జన శిక్షణ చేసి ఆలస్యం గా ఇంటికి వస్తే “స్వామీ! ఎక్కడకు వెళ్ళారు ?ఏం చేసి వచ్చారు? “వంటి ప్రశ్నలతో స్వామిని తప్పు పట్టక ఆయన అర్ఘ్య,
పాద్యాదులను ఇస్తూ నన్ను కూడ ఆదుకొమ్మని చెప్పు తల్లీ.
ఇంట్లో ఉన్న ఇల్లాలికి చెప్పకుండా దీనజనుల ఆర్తరావం వినగానే బయలుదేరి వెళ్ళిపోవడం శ్రీ హరి కి అలవాటు. “తను వేంచేయు పదంబు పేర్కొనక పోవడం” ఆర్త జన రక్షకునకు అలవాటే కదా! అందుకే “సిరికిం చెప్పడు, శంఖ చక్రయుగమున్ సంధింపడు” అంటూ చెప్పుకొచ్చాడు గజేంద్రమోక్షం లో పోతన మహాకవి. పాపం ఆయన ఎక్కడకు వెడుతున్నాడో అడుగుదామనుకొన్న లక్ష్మీదేవి కూడ ---
“అడిగెదనని కడువడి జను
అడిగిన దను మగుడ నుడువడని నడయుడుగున్ “–
అంటూ ఆ శ్రీమహాలక్ష్మి ఆతృత ఈ పద్యం గా రూపుదిద్దుకొంది గజేంద్రమోక్ష ఘట్టం లో.
శ్రీ
తులసీదళంబు లమరించి యనల్ప సుగంధ బంధుర
ఖ్యాతము లైన భవ్య కుసుమాదులఁ గూర్చిన మాలికావళుల్
ప్రీతిని కంఠమందు సవరించుచు మెల్లన
దాపుచేరి నా
చేతలు విన్నవింపు రఘుశేఖరుతో దయయుంచి జానకీ
!
అమ్మా! సుగంధ బంధురమైన సుమమాలల
మధ్య అందంగా కూర్చిన తులసీ దళాలతో అల్లిన పూలదండలను ప్రేమ మీర నీ నాథుని మెడ లో వేసి మృదువు గా సరిచేయుచూ
మెల్లగా దగ్గరకు చేరి నను గూర్చి విన్నవించవా తల్లీ!
కూరిమి పేరిమిన్
కపిల గోరసముల్ నులిగోరు వెచ్చగా
నారిచియుంచితిన్ ఘనకృపాకర మీఱిక
నారగింపుడీ
క్షీరములంచు నర్పణముఁ జేసెడు వేళనైన
దాసునిం
గూరిచి విన్నవింపు రఘుకుంజరు తో
దయయుంచి జానకీ.
అమ్మా!జానకీదేవీ! “ఓ దయా సాగరుడవైన రామచంద్ర ప్రభూ.!
ప్రేమానురాగాలతో కపిలథేనువు పాలను నులివెచ్చగా
చల్లార్చి మీకోసం సిద్ధంచేశాను. ఇకనైనా స్వీకరించండీ “ అని స్వామి కి సమర్పించెడి ఆ మధురమైన సమయంలో నైనా
ఈ దాసుని గూర్చి స్వామి తో వివరించు తల్లీ!
అతిశయ నవ్యసౌరభము లన్ని కకుప్పుల నిండ నిండు న
ద్ఫుతమగు వింత యత్తరువుఁ బూయుచునో,
ఘనసార దీప్తహా
రతుల మరించియో రఘువరా మన బిడ్డని మాట
యేమి చే
సితిరని మాతృవత్సలత చే నడుగన్వలెనమ్మ
జానకీ!
అమ్మా!
అతిశయించిన క్రొత్త పూల వాసనల ఘమఘమ లు
దిక్కులు నిండు చుండ గా అద్ఫుతమైన వింత
వాసనల వెదజల్లు అత్తరును స్వామికి అలదేటప్పుడో , మంచి కర్పూరపు మంగళ హారతు లను
అందిస్తూనో, ఓ రఘువీరా. మన బిడ్డ విషయం ఏం
చేశారని మాతృప్రేమ తో నీవే అడగాలమ్మా.!
ఇక్కడ ముందు
వెనుక ఒక ఇరవై పద్యాలను వ్రాసేటప్పుడు కవి కి వాల్మీకి రామాయణం లోని అయోథ్య ,
అరణ్య కాండలలో వాల్మీకి వర్ణించిన
చిత్రకూట, పంచవటుల లోని సీతారాముల విహారాలు గుర్తుకొచ్చాయనిపిస్తోంది. అనంతర కవులు కూడ సీతారాముల
గోదావరీ తీర విహారాలను మధుర మనోహరం గా
వర్ణించారు కదా.!
శ్రీ గుణశాలి లాలి! యతసీకుసుమాభ శరీర లాలి! ది
వ్యాగమ సన్నుతోత్తమపదాంబుజ లాలి యటంచు
దాసికా
పూగము రాగతాళము లపూర్వము గా మణి హేమడోలికా
భాగమునం బరుండిన యపార కృపాంబుధి నూచుచుండగా – (
69 )
అమ్మా! సీతమ్మ తల్లీ.! నవరత్న ఖచితమైన బంగారు తూగుటుయ్యల పై పరుండిన
అపార దయా సముద్రుడైన మా రామయ్య తండ్రి ని “రామాలాలీ! మేఘశ్యామా లాలీ! దివ్యాగమ సన్నుతోత్తమ
పదాంబుజ లాలీ! దశరథ తనయా లాలీ !అంటూ సేవకా జనము
రాగతాళ పూర్వకంగా గానం చేస్తూ ఊయల ఊపుతుంటే --------
నూగుచుఁ దత్సమీపమున నుండిన నీ జలతారు
పయ్యెదన్
లాగుచు హావభావ సువిలాసము లొప్పగ
నార్తదీనర
క్షాగుణపాలినీ యని యెకానొకముచ్చట
జెప్పువేళలన్
నాగతి
విన్నవింపు రఘునాధునితో దయయుంచి జానకీ ! (70)
శ్రీ రామభద్రుడు ఊయల
ఊగుచూ ఆ సమీపం లో ఉన్న నీ జలతారు పైటను
విలాసం గా లాగుచూ “ఆర్త దీన రక్షా గుణ పాలినీ” అని పిలిచి ముచ్చటించు
వేళ నా గతి కూడ తెలియచెప్పు తల్లీ.!
ఆంథ్రమహా భాగవతం లో
కుచేలుడు శ్రీకృష్ణ మందిరాన్ని చేరేసరికి శ్రీకృష్ణపరమాత్మ తూగుటుయ్యల లోనే గదా దర్శనమిస్తాడు. ఆ
సన్నివేశమే కవికి ఇక్కడ ప్రేరకమై “ఆర్త దీన రక్షా గుణపాలిని” యైన అమ్మ సీతమ్మ పైటను రామయ్య చేతిలో ఉంచాడు.
కొంతకుఁ గొంత నిద్దురను గూర విభుండు, సఖీజనాళి శు
ద్ధాంతము వీడునంత హృదయాధిపు తల్ప మలంకరించి యే
కాంత మిథ:ప్రసంగములయందు నొకింతగ నేని నాదు వృ
త్తాంతము సెప్పుమా రఘుకులాబ్ది
సుధానిథి తోడ జానకీ ! (71)
అమ్మా! జానకీ దేవీ.! ఊయల ఊగుచూ స్వామి కొద్ది కొద్ది
గా నిద్రలోకి జారుకుంటున్న వేళ , దాసీ జనమంతా
అంత:పురం
నుంచి వెళ్ళిపోగా, నీవు శయ్యను అలంకరించి , ఏకాంత ప్రసంగాల సమయం లో
కొంచెం గా నా విషయాన్ని రఘుకులాబ్ది
సోముని తోటి విన్నవించు తల్లీ.!
మూడవ భాగం ---త్వరలో
సీతారామశ్రీరామ
శ్రీరామశ్రీరామశ్రీరామశ్రీరామశ్రీరామ
శ్రీరామశ్రీరామశ్రీరామశ్రీరామశ్రీరామశ్రీరామశ్రీరామసీతారామ
Wednesday, 8 July 2015
శతక సౌరభాలు -6 తమ్మరగోపన్న -శ్రీ జానకీ శతకము.
శతక సౌరభాలు – 6
తమ్మర గోపన్న – శ్రీ జానకీ శతకము -1
తమ్మర గోపన్నరచించిన భక్తి శతకాలలో జానకీ శతక మొకటి. సహజంగా భక్తి శతకాలలో కన్పించే ఆర్తి ,అభ్యర్ధన దీనిలోను కన్పిస్తాయి. కాని అమ్మ తో చెప్పుకోవడం కాబట్టి కాస్త చనువు, కాస్త గారాము అన్నింటికీ మించి నువ్వు కాకపోతే నన్ను ఎవరు చూస్తారనే అలక ఇవన్నీ సమపాళ్ళ లో కన్పిస్తాయి. తనను కాపాడమని రామయ్య తో చెప్పవలసిందని అమ్మ సీతమ్మ ను కవి ప్రార్ధించడం ఇందులో ప్రధానాంశం. ప్రస్తావనా వశం లో రామకథంతా ప్రచలితమౌతుంది. శ్రీ రామచంద్రుని శౌర్యపరాక్రమాలు, అమ్మ సీతమ్మతల్లి దయా దాక్షిణ్యాలు ఈ శతకం లో అనేకమార్లు అవకాశం తీసుకుంటాయి. ఈ శతకాన్ని సమష్టి గా చూస్తే ---ఒక కన్నతల్లి చిన్నకుమారుడు ముద్దు ముద్దు గా అమ్మ ప్రక్కన చేరి తన చిన్నచిన్న కోరికలనన్నింటినీ ఏకరువు పెట్టినట్లు కవి తనను కాచి , రక్షించమని , బ్రోచే దొర రామయ్య కు తనను గూర్చి చెప్పి తన పని సానుకూలం చేయమని అమ్మ యైన సీతమ్మ దగ్గర మారాములు పోవడమే ఇందులో కన్పించే మధురభక్తి .
అన్నింటి కంటే చెప్పుకోవలసిన అంశమేమిటంటే తాను పాపాత్ముడ నని, తనను బ్రోవమని , కాపాడి రక్షించమని ప్రార్థించడం కవి భక్తిశతకాలలో సహజం గా కన్పించే లక్షణం .
“ పాపోహం పాపకర్మో2హం పాపాత్మా పాపసంభవ:
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్షో జనార్థన !! అని క్షమా స్తోత్రం.
( హే పరమ పురుషా ! నేను పాపిని, పాపకర్ముడను. నేనుపాపాత్ముడను. నేను పాపసంభవుడను. కాబట్టి కారుణ్యభావం తో నన్నుకాపాడవలసింది ప్రభూ ! )
కాని ఈ భక్త కవి తనను, తన కుటుంబాన్ని తన వారిని, తన బంధువులను , మిత్రులను ,స్నేహితులను అందరనూ కాపాడమని జానకీ మాత ను ప్రార్థిస్తాడు. ఇది ఒక అపురూప అంశం గా కన్పిస్తోంది. ఇది కవి లోని విశాలత కు, ఆత్మీయతకు , వసుథైక కుటుంబ భావనకు నిదర్శనం గా కన్పిస్తోంది. ఈ ఆలోచన పూర్వ కవులలో ఎక్కడైనా ఉందేమో కాని ఇది చదవగానే మాత్రం నాకు చాలా ముచ్చటేసింది. ఆ భక్తకవిశేఖరుని లోని మహోన్నత భావనకు ఒక్కసారి చేతులు జోడించి నమస్కరించాను. ఆ పద్యం ఇది.
“నేనొకరుండగాను దయనీయుడ నాదు కుటుంబమంతయున్
నా నిఖిలాత్మబాంధవులు నాప్రియమిత్రులు నాసుహృత్తు ల
న్యూనరఘూత్తమోత్తమ కృపోచితులై సుఖియింప భద్ర సం
ధాన మొనర్చి
బ్రోవుమిక తల్లి కృపా2మృతవల్లి జానకీ!” (గ్రంథాంత ప్రార్థన )
ఈ కవిని గూర్చి మనం ఇంతకు పూర్వమే “ శ్రీరామనామామృతజీవనుడు – తమ్మరగోపన్న “ అనే శీర్షిక తో ఇదే బ్లాగు లో ఒక వ్యాసం ప్రచురించబడి , విశేషాదరణ పొందింది. అందుకు వీక్షకులకు కృతజ్ఞతలు .
ఈ భక్త కవి నల్గొండజిల్లా తమ్మరవాసి. వీరు డెభ్భై కి పైగా గ్రంథాలను రచించారు. అన్నీ శ్రీ సీతారామచంద్రులకే అంకింతం చేయబడ్డాయి. వీరి గ్రంథాలన్నీ కవి మిత్ర బాంధవుల సహాయం తో ముద్రించబడినవే. అన్నీ అమూల్యము లై పాఠకులకు అందించబడ్డాయి. వీరి గ్రంథాలు అన్నింటి లోను వరుసగా మొదటి మూడు పద్యాల్లో ఉండే మొదటి మూడు అక్షరాలు వరుసగా శ్రీ రా మ అని ఉండటం ఒక ప్రత్యేకత.
అంతేకాదు. ముఫ్పై , నలభై పాదాల ఉత్పల మాలిక కాని , చంపక మాలిక కాని వీరి
ప్రతి గ్రంథం లోను కన్పిస్తుంది. ఈ శతకం చివర లో కూడ “కవివిజ్ఞప్తి” అనే శీర్షికతో
పూర్ణబిందుపూర్వక డకార ప్రాస తో కూడిన
నలభై పాదాల ఉత్పలమాలిక ను మనం చదువవచ్చు. వీరు శ్రీ మద్వాల్మీకి రామాయణాన్ని నాలుగు సార్లు స్వహస్తాలతో లిఖించి ఆనందించారు
.ఒకసారి వ్యాస భాగతాన్ని పూర్తిగా స్వహస్తాలతో
లిఖించారు. రెండు కోట్లు రామనామాన్ని
రామకోటి గా వ్రాసి ఆ శ్రీ రామచంద్రునకు సమర్పించారు. ఇంకా వీరిని గురించిన విశేషాంశాలు పైన ఉటంకించిన ప్రత్యేక వ్యాసం లో చూడవచ్చు. ఈ విధం గా ఆ శ్రీ సీతారామచంద్రుల దివ్యనామాన్ని
మరల మరల స్మరించే భాగ్యం కల్గడం నా పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నాను. ఈ శతకాన్ని తేజస్వినీ వ్యాఖ్య తో మీకందిస్తున్నాను. భక్తి
రసాంబుథి ఓలలాడుదురు గాక.
శ్రీ గృహివై చరాచర విశిష్ట జగజ్జనకుండవై మహా
యోగిజనావనుండవయి యొప్పు మిమున్ భజియించుగోర్కి నా
నా గతులన్నుతించు మన నందను డీతని
బ్రోవుమంచిఁకేన్
నా గతి విన్నవింపు రఘునాథుని తో
దయయుంచి జానకీ !
“ అమ్మా సీతమ్మ తల్లీ ! నన్ను కాపాడమని రామచంద్రుని తో విన్నవించు తల్లీ.
లక్ష్మీనాథుడివై, సమస్త చరాచర సృష్టి కి రక్షకుండవై , యోగిజన పరిరక్షకుండవైన
మిమ్ములను భజించెడి కోర్కెతో పరిపరి విథాల తపిస్తున్న మన తనయుని కాపాడమని రామయ్య తో చెప్పు తల్లీ !”
రాగహతాత్మడై యెపుడు రాలను రప్పలఁ జెట్లఁ జేమలన్
వాగుల వంతలన్ గడు నవశ్యముఁ బుట్టుచు
గిట్టి యిప్పుడే
యీగతి మానవాకృతి వహించెను కావున
గావు మంచిఁకేన్
నాగతి విన్నవింపు రఘునాయకు తో
దయయుంచి జానకీ ! ( 2 పద్యం)
అమ్మా! విషయలోలుడైన ఈ వీడు ఇన్ని జన్మలుగా ఱాళ్ళు,రప్పల్లో, చెట్లు, చేమల్లో, వాగు వంకల్లో పుట్టుచు గిట్టుచు తుదకు ఇప్పుడు ఈ మానవాకృతిని పొందాడు. కాబట్టి ఇకనైనా వీడిని బ్రోచి , రక్షించమని అనాథ నాథు డైన నీ రఘునాథునితో నన్ను గూర్చి చెప్పు తల్లీ!
మగటిమి చూపు
శత్రుజనమండలి పై గరుణించు మీ రన
న్యగతుల నార్తచిత్తుల సమాదరణం
బొనరించు టొక్క విం
తగఁ గనరాదు, గాన మన దాసుని తప్పు
క్షమించుఁ డంచిఁకేఁ
దగు గతి
విన్నవింపు రఘుధాత్రిపు తో దయయుంచి జానకీ ! ( 3 పద్యం)
అమ్మా ! జానకీమాత ! మీతో యుద్ధరంగం లో ఎదుర నిలిచి పోరాడే వారినే వివిధ రీతులుగా
కరుణించి అక్కున చేర్చకునే మీకు ఆర్తులైన రామభక్తులను ఆదరించడం లో విచిత్రమేమీ లేదు. కాబట్టి మన
దాసుడైన వీడి తప్పులను క్షమించి ,
చేదుకోమని తగు రీతిలో తండ్రి యైన రామయ్య కు నను గూర్చి విన్నవించు తల్లి.!
ఏదియొ
నిత్యకృత్యముగ నీతనికిన్ భవదీయనామ మ
త్యాదరతన్ లిఖియించు పని నబ్బగ
చేసితి రౌట ,క్షేమ యో
గాదులు మీఱ చూడవలె నంచిది తప్పదటం
చొకింత య
త్యాదృతిఁ జెప్పుమీ రఘుకులాగ్రణి తో
దయయుంచి జానకీ!
తల్లీ! జానకీ! “వీడికి నిత్యకృత్యం
గా మీ దివ్య నామాన్ని రామకోటి గా వ్రాసే పనిని అలవాటు చేశారు. అటువంటప్పుడు వాడి యోగక్షేమాలను కూడ
మారే చూడాలి కదా ! మరి ఇది తమకు తప్ప దని రాఘవేంద్రునితో కాస్త గోము గా చెప్పమ్మా!
“
ఈ పద్యం వ్రాసే నాటికి
తను వ్రాస్తున్న రామనామము 74 లక్షలు పూర్తయినాయని, 15.1.1972 నాటికి రెండవ కోటిలో సగమైనదని ఈ పద్యాంతం లో కవి స్వయంగా వ్రాసుకున్నారు.
పుట్టెడు నట్టివేళఁ బరిపూర్ణ కృపారసదృష్టి వీనిపై
బెట్టితిరౌట మోక్షపదవిన్ సమకూర్చు
భవత్పదాబ్జముల్
పట్టుగ నాశ్రయించి మనవారలలో
నొకడయ్యెనంచిఁకేన్
గట్టిగఁ జెప్పుమమ్మ
రఘుకాంతునితో దయయుంచి జానకీ !
అమ్మా ! సీతమ్మ తల్లీ! పుట్టునప్పుడే అటువంటి పరిపూర్ణ కృపాదృష్టిని వీనిపై మీరు ప్రసరింపచేశారు .కాబట్టే మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించే మీ పాద పద్మాలను ఆశ్రయించి మన వారిలో ఒకడయ్యాడని, ఇకనైనా వీడిని కరుణించమని రఘుకాంతునితో చెప్పు తల్లీ!
మన చరణంబులం బడి క్షమాపణఁ గోరక యుండునట్టి వా
రిని గరుణింపు డటంచును మఱిన్మఱిఁ జెప్పను,
మీకృపాబలం
శరణాగతుండగుచు మోడ్చెఁ గరంబులు వీడటంచు నా
మనవి ని దెల్పు మర్కకుల మండను తో
దయయుంచి జానకీ !
అమ్మా! జానకీమాత.మన కాళ్లమీదపడి క్షమాపణ
కోరనివారినెవ్వరిని కరుణించమని నేనెప్పుడు చెప్పును. మీ అనుగ్రహబలం చేత శరణాగతుడై చేతుల మోఢ్చి వేడుకుంటున్న
వీడిని రక్షించమని సూర్యకులాలంకారుడైన నా
నీ రామయ్య తో మనవి చెయ్యి తల్లీ.!
అనవరతం బనాత్మవిషయాభి రతింబడు నా
యకృత్యముల్
జనకుఁడు గాన నాతని కసహ్యములై
కనవచ్చుగాక ,నా
జననికి నీకు మద్విధ మసహ్యము గా
దటుగాన నెంతయున్
జనవున విన్నవింపు రఘుసత్తము తో
మదఘంబు జానకీ !
జానకీ మాత ! తల్లీ !ఎల్లప్పుడు లౌకిక విషయాలలో బడి దుష్కర్ముడనైన నా పనులు
తండ్రి కాబట్టి ఆయనకు సహింపరానివై కోప కారణాలవ్వచ్చు. కాని తల్లివైన నీకు నా
చేష్టలు బాధకల్గించవు కదా. అందువలన చనువుతో రామచంద్రునకు నన్ను గూర్చి కాస్త మంచిగా చెప్పమ్మా.!
కొడుకు భవిష్యత్తును గూర్చి ఆలోచించే తండ్రికి వాడు దుష్ప్రవర్తకుడైనప్పుడు తండ్రికి కోపం వస్తుంది. కుమారుని దండించడానికి సిద్ధపడతాడు . కాని తల్లి తన కుమారుడు ఎంత చెడ్డవాడైనా మాటలతో మారుద్దామని చూస్తుంది గాని దండించే సంఘటనలు చాల అరుదు గా వస్తాయి. అదే మాతృహృదయ మమకారం. అందుకే కవి ఆ విధంగా అర్ధిస్తున్నాడు. అంతే కాదు. రాబోయే పద్యం లో కు పుత్రులుంటారు కాని కు మాత ఉండదని వాదిస్తున్నాడు.
ఎచ్చటనేఁ
గుపుత్రకు లనేకులు బుట్టుచునుండ్రుగా, కెటన్
మచ్చునకుం జనింపదు కుమాత యొకర్తుకయే ,నటౌట న
న్నచ్చపుఁ బ్రేమఁ జూచి ,మత్కృతాఘము లెంచక
బ్రోవుమంచు నీ
విచ్చగఁ దెల్పుమీ రఘుకులేశ్వరుతో దయయుంచి
జానకీ !
అమ్మా!.సీతమ్మ
తల్లీ !ఎక్కడైనా కుపుత్రకులు అంటే చెడ్డ కొడుకులు కొల్లలు గా పుట్టవచ్చుగాని కు
మాత మాత్రం ఎక్కడా మచ్చుకైనా జనించదు. అందువలన స్వచ్ఛమైన ప్రేమతో చూసి , నేను
చేసిన పాపాలను లెక్కపెట్టక , నన్ను కాపాడమని నీవు మనస్ఫూర్తి గా రామయ్య తో చెప్పు
తల్లీ!
గాదిలి మాతయో శబరి ?కాకము నీ కనురూపమిత్రమో ?
మోద మొసంగు బంధుజన మున్నటె కోతులమూక
? లగ్రజుం
డో దశరాజు ?వీరలెటులో యటు లీతడు గాడె మీ కటం
చాదరణంబునన్ బలుకుమమ్మ రఘూద్వహుతోడ జానకీ
! (21)
అమ్మా
! జానకీ మాత ! ఆ శబరి ఏమైనా మీకు ముద్దుల కన్నతల్లా? ఆ కాకి మీకు ఏమైనా నేస్తమా ? ఆ కోతి మూక
మీకేమైనా ఆనందాన్ని కల్గించే బంధుమిత్రులా ?
ఆ దశరాజు మీకు అగ్రజుడా ? మరి వీరందరు ఎలాగో వీడు కూడ మనకు అటువంటి వాడే కదా! వీడిని కూడ
వారిలాగానే ఆదరించమని ఆయనతో చెప్పవలసినది
జనకుని ముద్దుల కూతురా! మా జానకమ్మా!.
పాపమనస్కుడౌ
నితని పల్కులు నమ్మగ రాదటంచు నా
క్షేప మొనర్పబోకుఁ డికం జేయక నీయనటంచు
నాకుఁ బూ
చీపడి పాదసేవకుఁ ద్యజించుట నీతికి దూరమంచిఁకే
న్నీ పతికి న్వచింపు మవనీతనయా
దయయుంచి జానకీ !
అమ్మా !” వీడు పాప మనస్కుడు. వీడి మాటలు
నమ్మవద్దని మీరు నన్ను ఆక్షేపించకండి.ఇక నుండి వీడు చెడ్డపనులు చేయకుండా నేను చూసు కుంటానని నాకోసం నీవు
హామీ ఇచ్చి, ఇటువంటి పాదసేవకుని
విడిచిపెట్టుట బాగుండదని , అది నీతి దూరమౌతుందని, ఏదోవిధం గా నీ
పెనిమిటికి చెప్పి నన్ను కాపాడవమ్మా భూజాత” .
సన్నుత సత్యశీల! విలసన్నిఖిలోత్తమసద్గుణంబులం
దన్నిటియందు నద్దశరథాత్మజుతో
ననురూపవయ్యు నా
పన్నులయం దహైతుక కృపామతి తల్లివి
గాన నాగతిం
దిన్నగ విన్నవింపు మన దేవునితో
దయయుంచి జానకీ !
అమ్మా.!
కొనియాడబడెడి సకలసద్గుణము లందు రామచంద్రునకు అనురూపవయ్యు ఆపన్నులయందు మాత్రము
నిర్హేతుక దయామతి వైన నీవు నన్ను గూర్చి మన దేవుడైన రామచంద్రుని తో చక్కగా వివరించవమ్మా! జనకుని ముద్దుల కూతురా.!
మా అమ్మా! సీతమ్మా.!
చీటికి మాటికియ్యధమ శేఖరుడియ్యఘమాచరించె నం
చేటికి తప్పులెంతు రిటు లెంచినచో మన
రక్షకత్వమే
లోటయి పోవుగాన నెటులో యటు లోర్చు
కొనుండటంచొ కే
మాటగఁ జెప్పు మర్కకులమండనుతో
దయయుంచి జానకీ !
తల్లీ ! సీతమ్మా.! “చీటికి మాటికీ వీడు అథములలో శ్రేష్టుడు. ఆ పాపం చేశాడు . ఈ పాపం చేశాడు అంటూ ఎందుకు తప్పులెంచుతూ ఉంటారు. ఇలా చేస్తే మన రక్షకత్వానికే లోపమేర్పడుతుంది కదా. కావున వీని తప్పులను ఏదో విధం గా సహించి వీనిని కాపాడమని” నీ మాటగా రామయ్య తో చెప్పవలసింది.
ఈతని కిట్టి బుద్ధి మనమిచ్చినదే కద
తద్గుణానుగుం
డై తెగ వీడె ధర్మ మఖిలాధిపతీ యికఁ
దీర్చిదిద్దుకొం
డే తరి నెట్టులైన మనవేయగు గీర్త్యపకీర్తులంచు నా
చేతలు విన్నవింపు రఘుశేఖరుతో
దయయుంచి జానకీ !
అమ్మా.! జానకీ
దేవీ. ! “వీడికి ఇటువంటి బుద్ధి నిచ్చింది మనమే కదా.! దానికి అనుగుణంగానే వీడు ప్రవర్తిస్తున్నాడు. అందువలన ఓ లోకైకనాథా. ఈతనిని
ఇకనైనా సక్రమమైన మార్గం లో పెట్టండి.మన భక్తులకు ఏమి జరిగినా ఆ కీర్తి అపకీర్తులన్నీ మనవే కదా స్వామీ”! అంటూ
నీ నాథునకు నా చేష్టలను విన్నవించవలసినది తల్లీ.!
ఏ శ్రమ మొందియైన హృదయేశ్వరుతోఁ గడు నచ్చఁ జెప్పి పా
పాశ్రయు నేని బ్రోచెడు కృపాంబుథి
వీవు సహాయ వౌట చే
స్వాశ్రిత రక్షణవ్రతి యటన్న యశంబు
గడించెఁ గావున
న్నాశ్రమమెల్లఁ జెప్పు రఘునాథుని తో
దయయుంచి జానకీ !
అమ్మా! “ఎంత శ్రమకైనా ఓర్చి నీ హృదయేశ్వరుడైన శ్రీరామచంద్రునకు నచ్చ చెప్పి పాపులందరిని కాపాడెడి కరుణాసముద్రవైన నీవు స్వామికి తోడుగా ఉన్నావు కాబట్టే ఆ స్వామి “ఆశ్రయించిన వారిని కాపాడటమే వ్రతంగా ఉన్నవాడు” అనే కీర్తిని సంపాదించ గల్గాడు. కాబట్టి తల్లీ! నేను పడుతున్న ఈ శ్రమ నంతటిని తండ్రియైన రామయ్య కు చెప్పి నన్ను కాపాడవలసిందమ్మా! “
ఎప్పుడు సత్కృపాగుణ మొకింతయు లేని మనుష్య చిత్తమే
చప్పున జాలి జెందు నిజసంతతులేడ్చిన,
లోకమాత వై
యొప్పెడు నీకు మద్విలపనోక్తులు జాలి
నొసంగ కున్నెమా
యప్పకు జెప్పుమమ్మ శరణాగతు
దుర్దశలెల్ల జానకీ !
అమ్మా! కరుణ అనేది కలికానికి కూడ కన్పడని
మా మానవుల మనస్సే తమ బిడ్డలు ఏడుస్తుంటే ఆర్ద్రమవుతుది కదా. అటువంటిది లోకమాత వైన నీకు
నా దీనాలాపాలు జాలిని కల్గించడం లేదా.
అమ్మా! ఈ శరణాగతుని దుర్దశలన్నీ నా తండ్రి కి చెప్పి, నన్ను బ్రోవమని చెప్పమ్మా సీతమ్మ తల్లీ.!
యోగిని
భోగిజేయు ,నదయున్ సదయున్ బొనరించు, నెంతయున్
మూగ కనల్ప వాగ్విషయ పూర్తి
యొసంగును, గ్రుడ్డివాని కిం
పౌగతి గన్నులీయ గలఁ డట్టి కృపాళుఁ
డటౌట దిన్నగా
నాగతి విన్నవింపు రఘునాథుని తో
దయయుంచి జానకీ ! (36)
అమ్మా! జానకీమాతా!
యోగిని భోగి గాను ,కఠినచిత్తుని దయ గల
వాని గాను , మూగవానిని అపూర్వ వాక్సంపత్తి
గలవాని గాను , గ్రుడ్డి వానిని తిన్ననైన
చూపు గల్గిన వాని గాను చేసెడు దయార్ద్రహృదయుడు మా శ్రీరామచంద్రుడు. అటువంటి ఆ
మహనీయుని తో నా గతిని విన్నవించు తల్లీ.!
రెండవభాగం త్వరలో -------
*
***************************************************************************
Subscribe to:
Posts (Atom)