Friday, 26 September 2014

శతక సౌరభాలు - 4 వేమన శతకము - 4

శతకసౌరభాలు - 4
                                     
                                             వేమన శతకము- 4





                                                        
                                                         మాట నిలుప లేని మనుజుడు చండాలు
                                                          డాజ్ఞ లేని రాజు యధము డండ్రు
                                                         మహిమ లేని వేల్పు మంట చూచిన పులి
                                                          విశ్వదాభిరామ వినురవేమ !

                          
          ఓ వేమా !. మాట నిలబెట్టుకోలేని చేసిన వాగ్దానాన్ని నిలపుకోలేని  మనిషి పరమనీచుడు. తన పాలనలో ఉన్న వారిని ఆజ్ఞ తో అదుపులో పెట్టుకోలేని  రాజు అధముడు. నీచుడు. మహత్వాన్ని చూపలేని దేవుడు మంటను చూసి పాఱిపోయే పెద్దపులి లాంటివాడు.  అటువంటి దేవుడు ఆకారానికే కాని భక్తులను  ఆదుకోవడం చేతకాని వాడు . 

                                                     అప్పుదీయ రోత  హరిహరాదుల కైన
                                                     మొప్పె తోడ మైత్రి మొదలె రోత
                                                    తప్పు బలుకరోత తాకట్టు బలు రోత
                                                     విశ్వదాభిరామ వినురవేమ !

            ఓ వేమా.! అప్పుచేయడం మంచిదికాదు. అది రోత కల్గించే పని.  మూర్ఖుని తోటి  స్నేహం కూడ అసహ్యమే. అబద్దమాడటం అన్నింటి కన్న రోత.  తాకట్టు పెట్టడం మరింత అసహ్యకరమైన పని యని వేమన భావించాడు.
          అప్పుచేయడం , అబద్ద మాడటం, వస్తువులను తాకట్టుపెట్టి డబ్బులు తెచ్చుకోవడం ఇవన్నీ కూడ  మానవజీవితాన్ని  భ్రష్టు పట్టిస్తాయని , అటువంటిదే మూర్ఖుని తోటి స్నేహం కూడ వేమన అంటాడు. అసలు మూర్ఖుని తో   స్నేహమే  అన్ని అనర్థాలకు కారణమౌతుంది .

తనువు ఎవరి సొమ్ము తనదని పోషింప
ధనము ఎవరి సొమ్ము దాచికొనగ
ప్రాణ మెవరి సొమ్ము పాయకుండగ నుండ
విశ్వదాభిరామ వినురవేమ !

                            ఓ వేమా ! ఈ శరీరం ఎవడి సొమ్మని దాన్ని నీ స్వంత మని భావించి దాన్ని పరి పరి విధాల పోషించి రక్షిస్తున్నావు. డబ్బు ఎవడబ్బసొమ్ము అని  దాన్ని దాచుకుంటున్నావు. ప్రాణం  ఎవడి సొమ్ము అని దాన్ని పోకుండా కాపాడాలని ఆరాటపడుతున్నావు.

                      లోకం లోని   జనులంతా  ఈ శరీరం  శాశ్వతమని , ఈ డబ్బు తన స్వంతమని  , ఈ ప్రాణం తనదేనని , భావించి శరీరాన్ని రక రకాలుగా మైపూతలతో కాపాడుకుంటూ  చూసుకొని మురిసిపోతూ ఉంటారు. కాని  శిథిలమై పోయేదే శరీరమనే విషయాన్ని వారు మర్చిపోతున్నారు. ధనం.ఇది చంచలమైంది. అది ఎప్పుడు ఎవరిచేతిలోకి మారుతుందో తెలియదు. ఎప్పుడు ఎవరి ఱొంటిలో దాక్కుంటుందో తెలియదు. ప్రాణం చెప్పకుండా ఎగిరి పోయేది . దాన్ని ఆపడం ఎవరితరం కాదు.  ఈ నిజాన్ని గుర్తుంచుకొని జీవుడు ప్రవర్తించాలి.

స్త్రీలు గల్గుచోట చెర్లాటము గల్గు
స్త్రీలు లేని చోట చిన్న బోవు
స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా
విశ్వదాభిరామ వినురవేమ !

          ఓ వేమా !  ఈ లోకం లోని మగవారందరూ ఆడవారికి బందీలై పోతున్నారు. స్త్రీలు ఉన్నచోటే ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తుంటాయి.  స్త్రీలు ఉన్నచోటే వివిధమైన క్రీడలు పరిఢవిల్లుతుంటాయి. స్త్రీలు  లేని  ఇల్లు  కాంతి హీన మౌతోంది. గృహస్థాశ్రమ నిర్వహణ లో గృహిణి యే ప్రధాన భూమిక పోషిస్తోంది.
              అందుకే   ఇంటికి దీపం ఇల్లాలు అని ,  గృహమే కదా స్వర్గ సీమ అని అన్నారు పెద్దలు.

ఏరు దాటి మెట్ట కేగిన పురుషుండు
పుట్టి సరుకు గొనక పోయినట్లు
యోగ పురుషు డేల యొడలు బాటించురా
విశ్వదాభిరామ వినురవేమ !

                   ఓ వేమా.! ఏరు దాటిన  తరువాత మనిషి  ఏ విధం గా పుట్టిని  లక్ష్యపెట్టడో, అదే విధం గా జ్ఞానియైన వాడు  శరీరాన్ని లెక్కపెట్టక  తపించి   ఇచ్ఛా ప్రాప్తిని పొందుతాడు.

 జనన మరణములకు స్వతంత్రుడును గాడు
 మొదలు కర్త గాడు తుదను గాడు
నడుమ కర్త ననుట నగు బాటు కాదొకో
విశ్వదాభిరామ వినురవేమ !

      ఓ వేమా.! ఈ జీవికి పుట్టుట ,చచ్చుట అనే విషయాల్లో స్వతంత్రత లేదు. చావు పుట్టుక లలో స్వతంత్రత లోని వాడికి  జీవితకాలములో తాను కర్త నని చెప్పు కోవడం నవ్వులపాలు కావడం కదా. అమ్మ నాన్న లను ఎన్నుకునే అధికారం , చావుపుట్టుకలను నిర్ణయించుకునే అధికారం లేని బ్రతుకు లో తాను కర్త నని చెప్పుకోవడం అజ్ఞానం కదా !.

  నీచుడు

ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావమిచ్చి మెచ్చు పరమ లుబ్దు
పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా
విశ్వదాభిరామ వినురవేమ !

              ఓ వేమా.!  ఒక  మూర్ఖుడు మరొక దుర్మార్గుణ్ణి మెచ్చుకుంటాడు. ఒక అజ్ఞాని మరొక పరమ లోభి మాటలను వెనకేసుకొస్తాడు . పంది ఎప్పుడూ బురదలో ఉండటానికి ఇష్టపడుతుంది కాని పన్నీటిని ఇష్టపడదు కదా.! ఇది లోకరీతి.

ఆదిమ కవుల వలె యల్పుండుఁ దా నెర్గి
జెప్పలేడుఁ గాని దప్పు పట్టు,
త్రోయనేర్చు కుక్క దొంతులు పేర్చునా
విశ్వదాభిరామ వినురవేమ !

           ఓ వేమా.! నీచుడైన వాడు   పూర్వ కవుల వలె  కవిత్వం చెప్పలేకపోయినా ఆ మహాకవుల కవిత్వం లో తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎలాగంటే కుక్క వరుసగా పేర్చిన కుండలను దొర్లించగలదు కాని   కుండలను  దొంతులుగా పేర్చలేదు కదా.!

పరుల దిట్టి నంత పాప కర్మంబబ్బు
విడువ దెన్నటికిని విశ్వమందు
పరుడు పరుడు గాడు పరమాత్మ యౌనయా
విశ్వదాభిరామ వినురవేమ !

        ఓ వేమా.! ఇతరులను ఊరికే నిందిస్తే పాపం తగులుతుంది. ఆ పాపం ఎన్నటికీ పోయేది కాదు .  ఎదుటి వ్యక్తి లో పరమాత్మ ను చూడాలి కాని పరాయి వాడు గా భావించరాదు. అందుకే పరుడు పరుడు కాదు పరమాత్మ  అంటున్నాడు వేమన యోగి.

ధనము లేమి యనగ దావానలంబది
తన్నుజెరచు మీది తావు జెఱచు
ధనము లేని మదిని తలవనే పాపంబు
విశ్వదాభిరామ వినురవేమ !

                ఓ వేమా.! డబ్బు లేదని అనుకోవడం  , లేక  డబ్బు  లేదని  విచారించడం మనిషిని దావాగ్ని వలే దహించి వేస్తుంది.  డబ్బు లేదనే చింత తనను , తాను ఉన్న ప్రదేశాన్ని కూడ నాశనం చేస్తుంది. అందుకే డబ్బు సంపాదించాలని కోరుకోవాలి . దాని కోసం ప్రయత్నించాలి. సాధిస్తాననే విశ్వాసం తో ముందడుగు వేయాలి కాని లేదనే దిగులు తో కుంగి పోకూడదు.
                 సంపాదించిన దాన్లో కొంత దాచుకోవడం , అలా దాచుకున్నదాన్ని చూసుకొని ధైర్యం  , ఉత్సాహం తెచ్చుకోవడం  , మరింత సంపాదించాలనే ప్రయత్నం చేయడం  మానవ విధి . అంతేకాని లేదని దిగాలు పడి కూర్చుంటే  అది ఆత్మహత్యా సదృశమే.  అలా ఆలోచించడమే మహా పాపం .

తనకు ప్రాప్తిలేక దాత లివ్వ రటంచు
ద్రోహ బుద్ధి చేత దూఱు టెల్ల
పెక్కు వంక జూచి ముకురంబు దూఱుట
విశ్వదాభిరామ వినురవేమ !

                     ఓ వేమా !. ఈ మానవులు తమకు డబ్బు  లభించే ప్రాప్తం లేకపోయినా అది తెలిసి కోలేక తప్పుడు అభిప్రాయం తో దాతలెవరూ తమకు ఇవ్వడం లేదని వారిని తిట్టుపోస్తూ ఉంటారు ఇది  ఎలా ఉంటుందంటే మన ముఖాన్ని అద్దం లో చూసుకుని   బాగుండని మన ముఖానికి ఆ అద్దమే కారణ మని  అద్దాన్ని తిట్టడమే అవుతుంది కదా . ఇది ఎంత మూర్ఖత్వమో  కదా.!

   వేషభాష లెరిగి కాషాయ వస్త్రాలు
కట్టగానె ముక్తి కలుగ బోదు
తలలు బోడులైన తలపులు బోడులా
విశ్వదాభిరామ వినురవేమ !

                    ఓ వేమా.! సన్యాసులు ఎలా ఉంటారో , వారి వేష భాషలు ఎలా ఉంటాయో తెలుసుకొని వారిలా   తలలు నున్నగా గొరిగించుకొని ,కాషాయ వస్త్రాలు కట్టుకొని ,  సన్యాసుల మని చెప్పుకున్నంత మాత్రాన  వారికి ముక్తి లభించదు. గుండు గీయించు కున్నంత మాత్రాన   మనిషి లోని ఆలోచనలు పవిత్రమై పోవు కదా.!
                   "తలలు బోడులైన తలపులు బోడులా!"  అనే పదం అందమైన జాతీయం గా తెలుగునాట నిలిచిపోయింది .

చెప్పు లోని రాయి చెవి లోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా
విశ్వదాభిరామ వినురవేమ !

             ఓ వేమా.!   నడుస్తున్నప్పుడు చెప్పులో ఇరుక్కున్న రాయి , చెవి దగ్గర చేరి నిరంతరం రొద చేసే జోరీగ ,  కంటిలో పడి బాధ పెట్టే నలుసు , కాలిలో విరిగి మాటి మాటికి కలుక్కుమనే ముల్లు , ఇంటి లోని భార్య మాటి మాటి కి అవి తేలేదు , ఇవి తేలేదు , అది లేదు , ఇది లేదు అనే సాధింపులు  ఇవన్నీ  చిన్న విషయాలు కావు.  మిక్కిలి బాధ కల్గించేవి. భరించలేనివి .

ఒడలు బడల జేసి యోగుల మనువారు
మనసు కల్మషంబు మాన్పలేరు
పుట్టమీద గొట్ట భుజగంబు చచ్చునా
విశ్వదాభిరామ వినురవేమ !

             ఓ వేమా.! పుట్ట మీద  కొట్టినంత మాత్రాన పుట్టలోని పాము ఎలా చావదో , అలాగే  శరీరాన్ని రకరకాల  ప్రక్రియలతో శుష్కింప చేసుకొని తాము యోగులమని  ప్రకటించే వారు మనసు లోని కల్మషాన్ని పోగొట్టుకోవడం లో విఫలమౌతున్నారు.  మనో కల్మషాన్ని పోగొట్టుకోలేని వారు యోగులు కారు.

కన్న పుత్రు నాస కనకంబు మీ దాస
స్త్రీల మీద నాస చిత్త మెడలి
భ్రమలు విడువ కున్న బ్రహ్మంబు కానరు
విశ్వదాభిరామ వినురవేమ !

          ఓ వేమా.!  భగవంతుని దర్శనాన్ని కోరుకునే వారు కన్నబిడ్డల యెడల నున్న మమకారాన్ని , ధనము పైన  ఉన్న ఆశ ను  , స్త్రీల పొందు పైన ఉన్న వ్యామోహాన్ని  మనసు నుండి తుడిచి పెట్టి , కోరికలను విడిచి పెట్టాలి. 

        మోక్షము

అన్ని జాడలుడిగి యానందకాముడై
నిన్ను నమ్మఁ జాలు నిష్ఠ తోడ
నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయాన
విశ్వదాభిరామ వినురవేమ !

                  ఓ వేమా.  !మానవుడు అన్ని రకాల ఆశలను , కోరికలను వదిలివేసి , మోక్షకాముడై , నిన్నే నమ్ముకొని , నియమ నిష్టలతో నిన్నే సేవించిన యెడల  తప్పని సరిగా మోక్షము లభంచును. నీమీద ఒట్టు వేసి ఈ మాట చెపుతున్నాను. అన్నాడు సిద్ధ యోగి వేమన.





                        
                       ******* ఇది వేమన శతకము. తేజస్వినీ వ్యాఖ్య సంపూర్ణం  ***



No comments: